శివ ఖోడి ( గుహ ) - అచ్చంగా తెలుగు

శివ ఖోడి ( గుహ )

Share This

శివ ఖోడి ( గుహ )

- కర్రా నాగలక్ష్మి 

                         
భక్తుని కి భయపడి గుహలో దాక్కున్న శివుడి గురించి విన్నారా ? . ఎవరైనా శతృవుకి భయ పడతారు కాని భక్తుడికి భయపడడమా? అదీ ముల్లోకాలను కాపాడే పరమ శివుడు భక్తునికి భయపడి గుహలో దాక్కోడమా ? , అదెలా జరగింది , ఎక్కడ జరగింది తెలుసుకోవాలను కుంటున్నారా ? అయితే ఆలస్యం యెందుకు పూర్తిగా యివ్యాసం చదవండి . మీకే  తెలుస్తుంది .
          ఉత్తర భారత రాష్ట్రమైన జమ్మూ కశ్మీరు లో జమ్మూ నగరానికి 110 కిమీ ..దూరంలో ,' రియాసి ' జిల్లాలలో వున్న ' రంసూ '  గ్రామానికి సుమారు 3 లేక 4 కిమీ కొండదారిలో నడిచి వెళ్తే యీ గుహాలయం చేరుకోవచ్చు . కశ్మీరిలో ' ఖోడి ' అంటే  గుహ అని అర్ధం . శివుడు వున్న గుహ అని అర్ధం .
        జమ్మూ నుంచి యీ గుహాలయం చేరుకోడానికి రెండు దారులు వున్నాయి . మొదటిది అష్ఠాదశ పిఠాలలొ ముఖ్యమైన వైష్ణవదేవికి ట్రెక్ మొదలయ్యే కట్రా టౌన్ మీదుగా , రెండవది జమ్మూ ' అఖ్ నూర్ ' మీదుగా ' రాజోరి ' వెళ్ళే దారిలో ' ఖండా మోర్హా ' జంక్షన్ నుంచి 6 కిమీ ప్రయాణం చేస్తే ' రంసూ ' గ్రామం చేరుకోవచ్చు .
          వైష్ణవదేవి కోవెల ట్రష్టు వారు యీ కోవెల మేనేజ్ మెంటు కుడా తీసుకోని రోడ్డులు , భోజన సదుపాయాలు , వసతులు యాత్రీకులకు అందుబాటులోకి తెస్తున్నారు . వైష్ణవ దేవి యాత్రీకులు యీ గుహాలయాన్ని కుడా దర్శించుకోవచ్చు . ' కట్ర 'బస్ స్టాండు నుంచి  బస్సు , టాక్సీ సదుపాయాలు వున్నాయి .
           ' కట్ర ' నుంచి ' రంసూ ' కి 70 కిమీ ఘాట్ రోడ్డు ప్రయాణం . నాకు ఘాట్ రోడ్డు ప్రయాణం అంటే చాలా యిష్థమ్ . కొండల మీంచి దూకుతూ , దుముకుతూ ప్రవహించే సెలయేళ్లు , వో పక్క కిందుగా లోయలో ప్రవహించే నదులు , మరో పక్క యెత్తుగా గర్వంగా మేమేవ్వరికి అందం అంటున్నట్టు వున్న పర్వతాలు చూడ్డం ఎంతో బావుంటుంది .
          జమ్మూ లో ఎండలు ఎక్కువగా వున్నా ' కట్ర ' దగ్గర నుంచి వాతావరణం చల్లగా మారిపోతుంది .
        ' కట్ర ' నుంచి మేం అంటే నేను మావారు , మా చిన్నాన్నగారి అమ్మాయి , అల్లుడు వాళ్ళిద్దరూ కాకినాడలో వుంటారు . కాకినాడనుంచి హైదరాబాద్ , హైదరాబాద్ లో ఫ్లైట్ యెక్కి ఢిల్లీ , ఢిల్లీ మేం పూనా నుంచి ముందురోజే చేరుకున్నాం . ఢిల్లీ నుంచి జమ్మూ-తావి వరకు ట్రైన్ , జమ్మూ లో టాక్సీ తీసుకోని కట్ర వెళ్లి దేవిని దర్శించుకొని మర్నాడు పొద్దున్నే రాను పోను టాక్సీ చేయించుకొని శివఖోడి బయలుదేరేం .
         ప్రకృతిని ఆస్వాదిస్తూ , విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ప్రయాణం సాగించేము . యెందు కంటే శివ పంచాక్షరి తప్ప శివ స్తోత్రాలు రావు . శివాయ విష్ణు రూపాయ అని అనుకుంటూ చెంపలు వాయించుకొన్నాం . దారిలో చిన్న చిన్న గ్రామాలు 2, 3 దాటేక బాబా ధన్సర్ అనే చిన్న గుహాలయం చూసేం . ఆగుహలో ధన్సర్ అనే సన్యాసి తపస్సు చేసుకొన్న ప్రదేశం గా స్తానికులు చెప్పేరు . యిక్కడ పై నించి సన్నని ధారలుగా నీరు పడుతూ రాళ్ల పైన ఏర్పడుతున్న ఆకారాలు వున్నాయి . అది చూసుకొని తిరిగి మా ప్రయాణం కొనసాగించేం .
          రంసూ కుడా చిన్న గ్రామం . అక్కడ నుంచి గుహ వరకు నడక దారి . గత కొద్ది సంవత్సరాలుగా యాత్రికులు రావడం తో ఇప్పుడిప్పుడే మందిర్ ట్రస్ట్ వారు యాత్రికుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు . అందులో భాగంగా యాత్రీకులను కోవెల వరకు తీసుకు వెళ్లేందుకు గుర్రాలు , డోలీలు దొరుకుతున్నాయి . యింకా రోడ్డు వెయ్యవలసి వుంది . యాత్రికుల వసతి భోజన సదుపాయాలూ కుడా ఏమి లేవు .
           సుమారు 3 , 4 కిమీ .. గుర్రం మీద ప్రయాణం తరువాత మెట్ల దారి , మాలాగే వైష్ణవి దేవిని దర్శించుకున్న యాత్రీకులు శివఖోడి ని దర్శించు కోవడం తో యిక్కడ కుడా భక్తుల తాకిడి ఎక్కువగా వుంటోంది .
************
              మెట్లు ఎక్కి గుహ లోపలకి చేరుకున్నాం , గుహ లోపల సుమారు 300 మంది పట్టేంత పెద్దదిగా వుంటుంది . అక్కడ నుంచి లోపలి ముణుకుల పైన పాక్కుంటూ వెళ్ళవలసి వుంటుంది . కొన్ని చోట్లు పాములా అంటే పొట్ట నెలకు ఆనించి పాక వలసి వుంటుంది . అలా పాక్కుంటూ వెళ్ళేక నిలబడ గలిగేంత వెడల్పు అవుతుంది గుహ . యింక అక్కడంతా అద్భుతమే , పార్వతి , వినాయకుడు , నారదుడు , శివుని ఝటాఝూటం , పద్మం యిలా దేవిదేవతా మూర్తులు ప్రాకృతికంగా యేర్పడ్డాయి . వాటిని చూస్తువుంటే మనలో  భక్తి పారవశ్యం కలుగక మానదు . తలెత్తి పైన వున్న కొండని  అంటే చెయ్యెత్తితే అందేంత యెత్తులో వుంటుంది , అక్కడ మరింత అధ్బుతంగా యేర్పడ్డ ఆది శేషుని చూడోచ్చు .  లోపల కొంత దూరం వెళ్ళేక దారి రెండుగా చీలుతుంది . అక్కడ వున్న సెక్యూరిటీ వారు ఆ దారిలోకి వెళ్లనివ్వక యాత్రీకులను రెండో దారిలోంచి పంపుతున్నారు . 200 మీటర్ల పొడవు , 3 మీటర్ల యెత్తు , ఒక మీటరు వెడల్పు వున్న యీగుహలలోకి శ్వాశ సంబంధ రుగ్మతలు వున్నవాళ్ళు ఆక్సిజెన్ సిలిండర్ తీసుకు వెళ్లాలనేది డాక్టర్ల సలాహ . లోపల నాలుగు అడుగుల యెత్తున్న స్వయంభూ శివలింగం నిరంతరం శివలింగాన్ని అభిషేకిస్తున్న ప్రాకృతికమైన పాల రంగులో వుండే జల వూట మనస్సుని భక్తీ పారవశ్యంలో ముంచేస్తుంది . దర్శనానతరం అక్కడ పూజాదులు నిర్వహిస్తున్న సాధువులనుస్థల పురాణం  అడుగగా వారు చెప్పిన కధ యిది ---
             భస్మాసురుడు అనే రాక్షసుడు , పరమ శివ భక్తుడు , దేవతలపై విజయం సాధించాలనే కోరికతో తనకి మరణం లేకుండా వుండేటట్లు వరం పొందాలని శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు . ఆ తపశ్శక్తి కి ముల్లోకాలు అల్లకల్లోలమై కంపించసాగేయి . ఆ ప్రకంపనలు శివ నివాసమైన కైలాసాన్ని కుడా భయభ్రాంతులకు గురి చేస్తుంది . శివుడు భస్మాసురుని తపస్సుకు మెచ్చి , భస్మాసురుని వద్దకు వెళ్లి వత్సా నీకొరిక ఏమిటని అడుగగా , తనకు మృత్యువు లేకుండునట్లు వరమిమ్మని భస్మాసురుడు కోరుతాడు , మరణం లేకుండా ఉండేటట్లు వరమివ్వుటకొరకు తాను ఆశక్తుడనని శివుడు మరేదైనా వరం కోరుకోమని అంటాడు . దానికి భస్మాసురుడు తాను యెవరి తలపై చెయ్యి పెడితే వారు భస్మం అయేటట్లు వరం అనుగ్రహించమంటాడు  . శివుడు భస్మాసురుని కోరిక తీరుస్తాడు . భస్మాసురుడు శివుడు యిచ్చిన వరప్రభావాన్ని శివుని పైనే ప్రయోగించి చూడాలనే తలంపు తో శివుని తలపై చెయ్యపెట్టడానికి శివుని వెంట పడతాడు . శివుడు భస్మాసురిని తప్పించుకొని పారిపోతూ విష్ణుమూర్తిని రక్షించమని వేడుకుంటాడు . భస్మాసురుడు శివుని తరుముతూ వుంటాడు . మూర్ఖులకు వినాశ కారకమైన వరాలు అనుగ్రహించ కోడదు అని తెలుసుకొన్న శివుడు యీ గుహలో దాక్కుంటాడు . శివుడిని తరుముతూ గుహ వైపు వస్తున్న భస్మాసురుని మోహినీ రూపం లో వున్న విష్ణుమూర్తి అడ్డుకుంటాడు . మెహినీ రూపానికి ఆకర్షితుడైన  భస్మాసురుడు తనను పెండ్లాడమని మోహినిని కోరుతాడు . దానికి మోహిని తనతో సమానముగా నర్తించిన వారినే తాను పరిణయమాడుతానని అంటుంది . అందుకు సమ్మతించిన భస్మాసురుడు మోహిని నర్తించి నట్లే నర్తించి తన వర ప్రభావమును మరచి మోహిని చూపిన భంగిమను నటిస్తూ  తన తలపైన చేయ్యిపెట్టుకొని భస్మమౌతాడు .
           యిలా శివుడు భక్తునికి భయపడి యీ గుహలో దాక్కున్నాడట . యిదీ యిక్కడి స్థల పురాణం .
          కాలాంతరాన వో గొర్రెల కాపరి తప్పి పోయిన గొర్రెను వెదుకుతూ యీ గుహలోకి వచ్చి యిక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువులను చూచి అతను కూడా శివ భక్తుడి గా మారి , అతను కూడా అక్కడే వుండి  తపస్సు చేసుకుంటూ ఆ గుహలోనే వుండిపోతాడు . కొన్నేళ్ళ తరువాత యింటి పైకి మనసు పోగా తపస్సు చాలించి యింటికి వెళ్లదలుచుకుంటాడు . అప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువులు శివుడు స్వయంభూ గా వున్న యీ ప్రదేశం గురించి యెవరికి తెలియనివ్వవద్దని అతని వద్ద మాట తీసుకుంటారు , మాట మీరితే అతనికి మరణం సంభవిస్తుందని చెప్తారు .
          కాపరి పుట్టుకతో ముస్లిం . అతను శివభక్తుడుగా మారడం నచ్చని అతని యింటి వారు కారణం అడుగగా అతను శివ దర్శనం అయినట్లు మాత్రమే చెప్తాడు . పశువుల కాపరి బంధువులు కూడా శివదర్శనం చెయ్యదలచి ఆ ప్రదేశమునకు తమని కూడా తీసుకు పొమ్మని వత్తిడి తెస్తారు . వారి వత్తిడికి తలవొగ్గి కాపరి వారిని గుహవద్దకు తీసుకొని వెళ్తాడు , మాట తప్పినందుకు గుహ చేరగానే కాపరి మరణిస్తాడు . యిప్పుడు కూడా యిక్కడ తపస్సు చేసుకుంటూ సాధువులు కనిపిస్తూ వుంటారు .
            ఎక్కడైతే సెక్యూరిటీ వారు వెళ్లనివ్వని దారి గురించి సాధువుగారిని అడుగగా
ఆ గుహదారి అమర్ నాథ్ గుహకి కలిసి ఉంటుందని , అషాఢ పౌర్ణమి నుంచి శ్రవణ పౌర్ణిమ వరకు జరిగే అమర్ నాథ్ యాత్ర సమయం లో అమర్ నాథ్ గుహలో పుజలందుకొనే శివుడు మిగతా సమయంలో యీ గుహలో యోగ సమాధి లో వుంటాడని స్థానికుల నమ్మకం . అందుకే యీ క్షేత్రాన్ని " బూఢా అమర్నాథ్ " అని కూడా పిలుస్తారు . అమర్ నాధ్ లో లాగే యిక్కడ కూడా పావురాన్ని దర్శించుకుంటే  పుణ్యం వస్తుంది అని భక్తుల నమ్మకం . కొన్ని సంవత్సరాల క్రిందట యీ గుహ మార్గం మధ్య లో కూలిపోయిందని యిప్పుడు అక్కడనుంచి ప్రవేశం రద్దు చేసేరు .
            గుహ లోంచి బయటికి వచ్చేక మా మనస్సులు భక్తి పారవశ్యం తో నిండి పోయేయి . జాగ్రత్తగా లోయలోకి దిగి అక్కడ పాల వలే తెల్లగా స్వచ్చం గా ప్రవహిస్తున్న ' దూధ్ గంగ ' నీళ్లు తలపై జల్లుకొని తిరుగు ప్రయాణం అయ్యేం .
             మా గుర్రాల యజమాని బలవంతం మేరకు ప్రభుత్వం వారి డాక్ బంగ్లాకి చేరుకున్నాం . విశ్రాంతి తీసుకోడానికి కాదు . గుర్రాల వాళ్లు అద్భుతం చూపిస్తామంటే డబ్బులు ఎక్కువ వసూలు చేసేందుకు అలా మమ్మల్ని మభ్య పెడుతున్నారనే అనుమానం . వారున్న స్థితికి మరో 50/ యిచ్చినా మనకేమీ నష్ఠమ్ లేదు . యింతకీ వాళ్లు డబ్బులగురించి మాట్లాడనేలేదు . అక్కడకి చేరుకున్న తరువాత మా అనుమానాలు పటాపంచలయేయి . మా కళ్లు మహాద్భుతాన్ని చూసేయి . అదే " దూధ్ గంగ " పుట్టిన చోటు . భూమి లోపల నుంచి వురుకుతూ తెల్లని నురుగు తో పెద్ద హోరుతో వస్తున్న " దూధ్ గంగ " . నోట మాట లేకుండా వుండి పోయేము . ఇలాంటి అద్భుతాన్ని మరెక్కడా చూడలేదు . గుర్రాల వాళ్లకి మా సంతోషం 100/ చొప్పున యిచ్చి తెలియజేసేం .
             అద్భుతాలు , ఆహ్లాదాలు , ఆనందాలు మూట కట్టుకొని తిరుగు ప్రయాణం యేం .
           వీలు చేసుకొని మీరూ యివన్నీ దర్శించుకొని ఆనందించండి .

No comments:

Post a Comment

Pages