ఫేస్ బుడ్గు (బుడుగు) - అచ్చంగా తెలుగు

ఫేస్ బుడ్గు (బుడుగు)

Share This

ఫేస్ బుడ్గు (బుడుగు)

- యనమండ్ర శ్రీనివాస్ 


“ఛస్, ఏడిశావులేవోయి బోడి వెధవా” అన్నాడు బాబాయి. నేను మటుకు నవ్వుతానే అన్నా “బాబాయ్, నాకు కూడా ఓ ఫేస్ బుక్ అకౌంట్ చేసి పెట్టవా” అని. కానీ బాబాయికి చూడు కృతగ్నత లేదు. ఇవాళ బోడి వెధవా అన్నాడు. మొన్నటికి మొన్న బోడి బడుధ్ధాయి అన్నాడు. తన రెండు జళ్ళ సీత రోడ్డు మీద నడిచొస్తుంటే మటుకు “బుడుగూ, బుడుగూ నాకు కుంచెం సాయం చెయ్యవా?” అని కాళ్ళావేళ్ళా పడ్డాడు. కాళ్ళావేళ్ళా అంటే అప్పుడెప్పుడొ సీత బాబాయికి “చాటింగ్ కి రా, రాత్రికి” అని చెప్పింది గదా. అపుడు అది నేను వినేశానుగా. అపుడు బాబాయి చూడు “బుడుగూ బుడుగూ, ఎవలికీ చెప్పకే, నీకు ప్రూటులు కొనిపెడతాను” అని నా కాళ్ళు పట్టుకున్నాడు చూడు. అదీ. “సీత రోడ్డు మీద ఎప్పుడొస్తుందో చూసి నాకు చెప్పు” అంటాడు. మళ్ళా సీత నవ్వితే ఫొటో తీసి కవిత రాసి ఫేస్ బుక్ లో పెడతాడు. అది మటుకు నాకు చెప్పడు. ఈ మధ్య ఈ ఫేస్ బుక్ లొ పెట్టడం బాగా నేర్చుకున్నాడు బాబాయి. నాన్న చాలా గాఠిగా ప్రైవేట్ చెప్పేశాడు బాబాయికి. ఇట్లా చదువు సంజె లేకుండా ఆ కంప్యుటర్ కి అతుక్కు పోతె, అడుక్కుతింటావురా అని. చదువు అంటే పుస్తకాలు, సంజె అంటె? బాబాయి అంటాడు తన ఫ్రెండ్ అని. మళ్ళా ఏమో, నాన్నకి తెలీదులె, బాబాయి మొత్తం కంప్యుటర్ కి అతుక్కుపోడు. కుంచెం అవుతాడూ. అది కూడ సీత మెసేజు ఫోనులో వస్తుందే, ఆ తర్వాత. ఓసారి సీత మీద కవిత రాసి పోస్టుచేశాడుట బాబాయి. పోస్టు అంటే కీబోర్డు మీద టిక్కు టిక్కు అని కొట్టేసి, కంప్యుటర్లోకి పొ అని మౌస్ పెట్టుకు నెట్టటం. మౌస్ అంటే, గణేషు పక్కన ఎలుకలాగా కంప్యుటర్ పక్కన చిన్న బొమ్మ వుంటుందే, అది. అది ఎలా పని చేస్తుంది - ఏమో నాకు తెలీదు. సీ గానపెసూనాంబకి తెలుసనుకుంటా. దానికి వాళ్ళ నాన్న కంప్యుటర్ ప్రైవేటు మాస్టారిని పెట్టాడు. అదేంటది - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్ ట. ఆ మాస్టారికి “ఇన్వర్మేషన్ ఎక్కువ. టెక్నాలజీ తక్కువ” అంటాడు బాబాయి. అంటే నాకు తెలీదు. ఫేసుబుక్కులో పెట్టడం కూడా మామూలుగా కాదు, కవితలు రాసి మరీ పెడతాడు. బుడుగూ, చూడు బోల్డు మంది జనాలు లైక్ కొడతారు అంటాడు. ఇదివరకు సైట్ కొట్టడం చెప్పాడు. ఇప్పుడు లైక్ కొట్టడం చెప్పమంటే మటుకు ఖోపం తెచ్చేసుకుంటున్నాడు. ఎందుకో అనుకున్నా, ఆ కవితకి పక్కింటి పిన్నిగారు తప్ప ఎవరూ లైక్ కొట్టలేదట. ఆవిడని ఫ్రెండ్ చేసుకున్నాడట బాబాయి. కంప్యుటర్లొ. అమ్మ కంట్లో నీరు పెట్టుకుంది అది విని. ఇంక ఈయనకి పెళ్ళి అవుతుందా అని. సీ గానపెసూనాంబ వచ్చి “ఆంటీ, కంప్యుటర్లో అందరూ అందరికీ ఫ్రెండ్సే” అని చెప్పేదాకా. అపుడే మా గోపాళం నాన్న బాబాయికి ప్రైవేటు గాఠిగా చేప్పేసాడు. నాకు నవ్వాగలా బాబాయికీ, పక్కింటి పిన్నిగారికి ఫ్రెండ్ షిప్ అంటే. అలా నవ్వానని రాత్రి నన్ను పక్కకి పిలిచి జెల్లకాయ ఇచ్చాడు బాబాయి. ఇంకోసారేమో సీత ఏదో ఫొటో పెట్టిందిట ఫేసుబుక్కులో. అది చూసి బాబాయి కామెంట్ పెట్టాడట. కామెంట్ అంటే, మన నోటికేదొస్తే అది వాగెయ్యటంట. సీ గాన పెసూనాంబ చెప్పింది. దానికి వాళ్ళ మాస్టారు రోజూ ఎన్నో చెప్పేస్తున్నాడట. రా పెసూనాంబా ఆడుకుందాం అంటే, “నన్ను పోక్ చెయ్యకు అంటుంది”. అంటే ఏంటంటే, పరిగేఠుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. బాబాయి కామెంటు చూసి సీత వాళ్ళ నాన్న వచ్చి బాబాయికి గాఠిగా ప్రైవేటు చెప్పేశాడు. పనిలో పనిగా నాన్నకి చెప్పేశాడు. నాన్నకి ఖోపం ఆగక అమ్మకి ప్రైవేటు చెప్పేశాడు. అమ్మ ఎవరికి ప్రైవేటు చెప్పాలో తెలీక చపాతీ పిండి పిసికేసింది కసిగా. అసలు ఈ ప్రవేట్లు ఎందుకు చెప్పుకుంటున్నారు అని సీ గానపెసూనాంబని అడిగా. అదేమో, మరి నీకు కంప్యుటర్ రాదుగా అని అదోలా నవ్వింది. ఈ అవమానం భరించలేక బాబాయిని కంప్యుటర్ లొ ఫేస్ బుక్ అకౌంట్ నాకూ ఇవ్వవా అన్నాడు. అప్పుడే బోడి వెధవా అన్నాడు బాబాయి. నాకు బోల్డు ఖోపం వచ్చింది. అందుకే, బాబాయికి తెలీకుండా తను కంప్యుటర్ లో ఏం కొట్టాడో చుసేశా. ఆ రోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు, సీ గాన పెసూనాంబని పిలుచుకొచ్చా. నాకు కూడ కంప్యుటర్ వచ్చు అని చెప్పటానికి. అది బోల్డు హాచ్చర్యపడిపోయింది. నెమ్మదిగా కంప్యుటర్ స్టార్ట్ చేసి ఫేస్ బుక్ అని టైప్ చేశాను. పెసూనాంబ, “బుడుగూ, బుడుగూ, నీకు అకౌంటు వుందా?” అని అడిగింది. లేదు, ఇది బాబాయిది అని చెప్పా. ఐడి తెలుసా అంది. బోడి ఐడి ఏమిటి, పాస్ వర్డ్ కూడా తెలుసు అన్నా. మళ్ళీ హాచ్చర్యపడిపోయింది. ఐడి కొట్టి పాస్ వర్డ్ దగ్గరకి వొచ్చేసరికి పెసూనాంబ కళ్ళార్పకుండా చూసేసింది. దాన్ని ఊరిస్తూ పాస్ వర్డ్ ఒక్కొక్క అక్షరమే టైప్ చేశాను. * * * * * అని. అంతే, అప్పటిదాకా సీరియస్సుగా వున్న పెసూనాంబా ఫెళ్ళుమని, గాఠిగా నవ్వేసింది. అదేంటి ఇదేగా పాస్ వర్డ్ బాబాయి ఎపుడూ కొడతాడు అన్నా. హారి బుడుగూ బుడుగూ అని నవ్వేసి పారిపోయింది. నాకేం జరిగిందో అర్ధం కాలా. అది అటు వెళ్ళిందో లేదో బాబాయి ఇంటికొచ్చి కంప్యుటర్ ముందు నన్ను చూసి స్క్రీన్ వైపు చూశాడు. హంతే. గోపాళం నాన్న రాత్రికి కధ చెప్తాడె, అందులో హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడుని చూస్తాడే, అలా ఓసారి నాకేసి చూసి, కిష్టుడు కంసుడుని గుద్దినట్టు నా డిప్ప మీద జెల్లకాయ ఇచ్చాడు. అదింకా నెప్పి పుడుతోంది. ఇపుడు అందుకే పడుకుని, ఇంకా కుంచెం మిగిలిన కధ మళ్ళా రేపు చెపుతా. ఒకె. బై.

No comments:

Post a Comment

Pages