చైతన్య దీప్తి – అబ్దుల్ కలాం - అచ్చంగా తెలుగు

చైతన్య దీప్తి – అబ్దుల్ కలాం

Share This

చైతన్య దీప్తి – అబ్దుల్ కలాం

- భావరాజు పద్మిని

 ‘‘కల అంటే నిద్రలో కనిపించేది కాదు. కల అంటే... నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేది. కల ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఆలోచన మనల్ని కార్యోన్ముఖులను చేస్తుంది. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి!

- అబ్దుల్‌ కలాం
“హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనబడుతుంది “ – అనేవారు అబ్దుల్ కలాం. అసలు వ్యక్తిత్వానికి పునాదులు పడేది ఎక్కడ, పెంపకంలోనూ, తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనూ కదా... అందుకే ముందుగా కలాం గారి బాల్యాన్ని గురించి తెలుసుకుందాము.
"ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్ని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాడ్ని. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పని చేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు.'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికి తోడు చదువుకుంటూ.. పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం.. విషాదం రెండూ ఉండేవి” అంటూ తన బాల్యాన్ని గురించి చెప్పేవారు అబ్దుల్ కలాం.
అబ్దుల్ కలాం గారి చిన్నప్పటి ఒక సంఘటన చూద్దాము.
ఒకరోజు పగలంతా ఎక్కువగా పని ఉండటంతో అబ్దుల్ కలాం గారి అమ్మ బాగా అలసిపోయింది. ఆ రోజు రాత్రి వంట పూర్తయిందనీ, భోజనానికి రమ్మని, ఆమె పిలవడంతో అబ్దుల్ కలాం గారు, తన తండ్రితో కలిసి భోజనం చేయడానికి సిద్దపడ్డారు. తన తండ్రి ముందు ఒక ప్లేట్ లో పెట్టిన రొట్టెలు బాగా మాడిపోయి ఉండటాన్ని చూసిన అబ్దుల్ కలాం గారు, ఆయన వాటిని తినే ముందు తన తల్లిని ఏమైనా కోప్పడతారేమోనని, మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోయారు.
కానీ ఆయన ఆ రొట్టెలను తిని, ఆమెను ఏమీ అనకుండా లేచి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి ఆమె, తన భర్త దగ్గరకు వెళ్ళి “ రొట్టెలు మాడిపోయినందుకు క్షమించమని” కోరింది. వెంటనే ఆయన, “ నాకు మాడిపోయిన రొట్టెలంటే చాలా ఇష్టం“ అని ఎంతో ప్రేమగా ఆమెతో అన్నారు.
ఇదంతా గమనించిన అబ్దుల్ కలాం గారు, కొద్దిసేపటి తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్ళి “మీకు నిజంగా మాడిపోయిన రొట్టెలు అంటే అంత ఇష్టమా?” అని అడిగారు.
ఆయన అబ్దుల్ కలాం గారి తల నిమురుతూ “ మీ అమ్మ పగలంతా కష్టపడి ఎంతో అలసిపోయింది. అంత అలసటలో కూడా విసుగు లేకుండా వంట చేసింది. ఒక్కపూట మాడిపోయిన రొట్టెలు తింటే మనకేమీ కాదు. కానీ ఆ రొట్టెలు మాడిపోయాయని విమర్శిస్తే, ఆమె మనసు ఎంతగానో బాధపడుతుంది.అలా బాధ పెట్టడం నాకిష్టం లేదు.” అన్నారు.
జీవితంలో ఎవరైనా కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేయడం సహజం. ఆ పొరపాట్లను ఆధారంగా చేసుకొని విమర్శించడం మంచిది కాదని” ఆయన అన్నారు. ఈ సంఘటన ద్వారా అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం, ఎదుటివారు చేసిన పొరపాట్లను చూసి తొందరపడి విమర్శించి వారి మనసులను బాధ పెట్టకండి. బంధాలను బలపరుచుకుంటూ జీవితాలను కొనసాగించండి... అని. ఇటువంటి ఆదర్శాలే, ఆయనను హిమాలయమంత సమున్నతంగా ప్రజలు, విద్యార్ధుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా చేసాయి.
బాలలకు స్ఫూర్తి,  యువతకు చైతన్య దీప్తి,  శాస్త్రవేత్తలకు ‘మిస్సైల్‌ మ్యాన్‌’, నేతలకు ఆదర్శం,  యావత్‌ దేశానికి ‘ప్రజా రాష్ట్రపతి’....  అసమానమైన వ్యక్తి,  అవుల్‌ పకీర్‌ జైనులబ్దీన్‌ కలాం, 1931 అక్టోబరు 15న ఆయన జన్మించారు. తమిళనాడులోని రామనాధపురం జిల్లా రామేశ్వరంలో ఆయన జైలులబ్దీన్‌, ఆశిలమ్మ దంపతులకు కలాం జన్మించారు. వారిది నిరుపేద కుటుంబం.
చదువు మీద మాత్రం విపరీతమైన ప్రేమ, ఆసక్తి ఉన్న అబ్దుల్‌ కలాం.. తిరుచిరాపల్లిలో ఫిజిక్స్ లో డిగ్రీ చేశారు. తర్వాత మద్రాస్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీనుంచి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు.  పట్టభద్రుడైన తర్వాత ఆయన భారతదేశపు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ)లో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. 1962లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరారు. అక్కడ ఆయన ఇతర శాస్త్రవేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు తొలి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III)ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది.
1982లో, ఆయన డీఆర్డీవో డైరక్టరుగా తిరిగి బాధ్యతలు చేపట్టి గైడెడ్ మిస్సైల్స్‌పై దృష్టి కేంద్రీకరించారు. అగ్ని, పృథ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి చేసి ప్రయోగించడంలో కీలక పాత్ర పోషించారు. అంటే దేశానికి తొలి మిస్సైల్‌ను అందించిన ఘనత ఆయనదే. అందుకే ఆయనకు “మిస్సైల్ మాన్” అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత జూలై 1992లో దేశ రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. అలాగే, భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగారు. అబ్దుల్ కలాం కృషి ఫలితంగా 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడంజరిగింది. ఈ అణు పరీక్షతో భారతదేశాన్ని అణ్వస్త్రరాజ్యాల సరసన చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది.
భారత్‌ అమ్ముల పొదిలోని అనేక క్షిపణి అస్త్రాల రూపకర్తగా అందించిన సేవలు తిరుగులేనివి. దేశం ఆయనను గౌరవంగా మిస్సైల్‌మ్యాన్‌ అంటూ కీర్తించింది. బాలిస్టిక్‌ మిస్సయిల్స్‌ వంటి పరిశోధనల్లో ఆయన కీలకవ్యక్తి. పోఖ్రాన్‌ 2 పరీక్షల్లో కూడా ఆయనే కీలకంగా ఉన్నారు. ఆయన జీవన ప్రస్థానం అనూహ్యంగా రాజకీయ పదవుల వైపుమళ్లింది. అయితే ఆషామాషీగా కాకుండా.. జాతి గర్వించే విధంగా.. ఆయన ఏకంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.
ఈయనకు భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ భూషణ్ (1981), పద్మ విభూషణ్ (1990), భారతరత్న (1997)లు వరించాయి. అలాగే, దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కనీసం 30వరకు యూనివర్శిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి.
అబ్దుల్ కలాం పూర్తిగా శాకాహారి. మద్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి. ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. “ప్రజలు.. తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతిపరులౌతారు” అంటూ ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. కానీ, కలాం ఖురాన్‌తో పాటు, భగవద్గీత‌ను కూడా చదువుతారు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత లోని శ్లోకాలను యువతకు గుర్తుచేస్తూ, భారతదేశ చరిత్ర, సంస్కృతి పట్ల తనకున్న గౌరవమర్యాదల్ని చాటుకునేవారు. ఆయన రూపొందించిన క్షిపణులకు అగ్ని, పృథ్వి, అంటూ మన సంస్కృతిని గుర్తు చేసే పేర్లు పెట్టేవారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడిగా పేరుగడించారు. ఈయన వింగ్స్ ఆఫ్ ఫైర్, సైంటిస్ట్ టు ప్రెసిడెంట్‌ వంటి అనేక పుస్తకాలను రచించారు.
భారత రాష్ట్రపతిగా గద్దె దిగిపోయిన తర్వాత.. ఎవ్వరైనా సరే విరామ జీవితాన్ని ఆ పదవికి, హోదాకు తగిన మర్యాదలతో ప్రశాతంగా, నిర్వ్యాపారంగా గడపాలని అనుకుంటారు. కానీ అక్కడే కలాంలోని విభిన్నమైన వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. ఆయన ఆ భోగాలేవీ కోరుకోలేదు. తనకు తాను ఎంతో ఇష్టపడే అధ్యాపక వృత్తిలోకి తిరిగి ప్రవేశించారు. ఫిజిక్స్‌ గౌరవ ప్రొఫెసర్‌గా జాయిన్‌ అయ్యారు.
కలాం జీవిత భాగం నుంచి ఒక గొప్ప విషయాన్ని మనం మననం చేసుకోవాలి. వ్యక్తిగా అవివాహితుడు అయిన అబ్దుల్‌ కలాం.. పసిపిల్లలతో చాలా ఇష్టంగా తన సమయం గడిపేవారు. భారత భవిష్యత్‌ దీపాలుగా వారి మీద ఆయనకు ఎంతో ఇష్టం ఉండేది. చిన్నారులకు సైన్స్‌ సంగతులు చెప్పడం ఆయనకు ఎంతో ఇష్టమైన అంశం. అలాగే యూనివర్సిటీల్లో ఫిజిక్స్‌ పాఠాలు చెప్పడం కూడా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశం. ఆయనకు ఏకంగా ఆరు డాక్టరేట్‌ లు ఉన్నాయి. తనను తాను ఫిజిక్సు ప్రొఫెసర్‌గా చూసుకోవడం ఆయనకు ఇష్టం. చివరి శ్వాస వరకు విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎటువంటి రుసుము తీసుకోకుండా దేశ వ్యాప్తంగా తిరుగుతూ తన ప్రసంగాలతో చైతన్యవంతం చేస్తూ వచ్చారు కలాం. భరతమాత పాదసేవకు తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసారు.
షిల్లాంగ్ లోని ఐఐఎంలో విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగిస్తుండగా అబ్దుల్ కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. పరమ పవిత్రమైన తొలి ఏకాదశి అయిన జూలై 27, 2015 న,  84 ఏండ్ల మన మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం దివంగతులైన వార్త అందరికీ దిగ్భ్రాంతిని కలుగజేసింది.
 ఒక నిరుపేద కుటుంబం నుంచి తన జీవనప్రస్థానం ప్రారంభించి, శాస్త్రవేత్తగా ప్రపంచం నివ్వెరపోయేటువంటి అనేక పరిశోధనలు సాగించి- సాధించి, మిస్సైల్‌ మ్యాన్‌గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని, భారతదేశపు అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి స్థానాన్ని అధిష్ఠించి, యావత్తు ప్రపంచ దేశాల దృష్టిలో ఆ పదవికే వన్నె తెచ్చిన మనీషి అయిన కలాం గారి జీవనం అందరికీ ఆదర్శవంతం.  ఆయన మనమధ్య లేకపోయినా,  ఆయన వెలిగించిన చైతన్య దీప్తి ఎన్నో హృదయాల్లో వెలుగులు పంచుతూనే ఉంటుంది.
జై భారత్ ! జై కలాం !

No comments:

Post a Comment

Pages