ప్రేమతో నీ ఋషి
యనమండ్ర శ్రీనివాస్
కొన్ని శతాబ్దాల క్రితం... దేవతలకు రాజైన దేవేంద్రుని సభలో...
“విశ్వామిత్రుడా ?” మేనక మరోసారి అడిగింది.
“అవును, విశ్వామిత్రుడే...” బదులిచ్చాడు దేవేంద్రుడు క్లుప్తంగా. దాని భావం, మేనకను ఇక ప్రశ్నించడం మాని, వెంటనే బయలుదేరమని.అతని మాటల్లో అధికార దర్పం ప్రతిబింబిస్తూ, అతని పొడవైన, మహోన్నతమైన ఆకృతితో పోటీపడుతోంది.
మేనక కంగారుపడింది. ఆమె ఆ రోజు తన గ్రహస్థితిని నిందించుకుంది. స్వర్గలోకపు అప్సరసగా ఆమె తన సొగసైన నాట్యంతో, అర్ధవంతమైన నవ్వుతో, మిరుమిట్లు గొలిపే అందంతో, స్వర్గానికే శోభ (వన్నె ) తెచ్చింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాని, నేడు అదే అందం ఆమె పాలిటి శాపంగా మారి, ఆమెను ఎంతో ఆందోళనకు గురిచేసే పనిని బలవంతంగా ఆమె చేసేలా చేస్తోంది.
ఆమె దేవేంద్రుడు తనను చెయ్యమని ఆజ్ఞాపిస్తున్న కొత్త పనిని గురించి కలతచెందుతోంది. అది – విశ్వామిత్రుడి తపస్సును భంగం చెయ్యడం.
తొలుత కౌశికుడు గా పిలువబడే విశ్వామిత్రుడు, కుశుడు అనే రాజు యొక్క మునిమనవడు, గొప్ప యోధుడు. ఒకరోజు అతను దేశాటనం చేస్తుండగా అనుకోకుండా, ఆయనకు వశిష్టుడికి చెందినపవిత్రమైన గోవు – కామధేనువు కనబడి, అతని దృష్టిని ఆకర్షించింది.
కామధేనువుకు ఏ కోర్కెనైనా తీర్చే సామర్ధ్యం ఉంది, కనుక మహారాజైన తనకు మహర్షి వద్దనుంచి దాన్ని సొంతం చేసుకునే హక్కు ఉందని అతడు భావించాడు. కాని వశిష్టుడు కామధేనువును రాజుకు ఇవ్వక, గట్టిగా ప్రతిఘటించడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు.
ఆ తర్వాత జరిగిన సంఘటనలో, వశిష్టుడు కామధేనువును బలవంతంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన కౌశికుడి మొత్తం సైన్యాన్ని తన తపఃశక్తి మహిమతో నాశనం చేసాడు. ఈ సంఘటన కౌశికుడిపై చాలా బలమైన ముద్ర వేసింది. అతడు కేవలం దేహబలం కంటే, తపోబలం యొక్క శక్తి ఎంతో గొప్పదని తెలుసుకున్నాడు. అందుకే, అతడు రాజ్యాన్ని త్యజించి, వశిష్టుడి కంటే గొప్ప ఋషి అయ్యేందుకు అన్వేషించసాగాడు. విశ్వామిత్రుడనే బిరుదు స్వీకరించాడు.
అతని ఒకేఒక్క లక్ష్యం వశిష్టుడితో సమానమైన ఆధ్యాత్మిక శక్తిని పొందడం; తద్వారా ‘బ్రహ్మర్షి’ గా అతనితో సమానం కావడం . అతను వెయ్యేళ్ళు కఠోర తపస్సు చేసాకా, బ్రహ్మ అతనికి ‘రాజర్షి – ఋషి అయిన రాజు’ అనే బిరుదును ఇచ్చాడు. మరో పదివేల సంవత్సరాల దీర్ఘ తపస్సు తర్వాత, బ్రహ్మ అతని రాజ పరంపరను శాశ్వతంగా విడుస్తూ, ‘ఋషి’ అన్న నామకరణం చేసాడు.
అతడు ‘బ్రహ్మర్షి’ అనే తదుపరి స్థాయిని పొందే , మార్గంలో ఉన్నాడని తెలుసుకున్న దేవేంద్రుడు, అతడి తపస్సును పరీక్షించదలిచాడు. విశ్వామిత్రుడిని మోహింపచేసి, అతని తపస్సును భంగపరచమని, మేనకను ఆజ్ఞాపించాడు.
“కాని – అతడు ఋషి కనుక, ఏదైనా పొరపాటు జరిగితే, నన్ను చంపేందుకు తన దివ్యశక్తుల్ని వాడవచ్చు కదా,” అంది, రాజాజ్ఞను పాటించేందుకు ధైర్యం కూడగట్టుకోలేక విముఖంగా ఉన్న మేనక. విశ్వామిత్రుడు స్వీయనియంత్రణ లేనివాడని, తరచుగా కోపంలో ఇతరుల్ని శపించి, తన తపఃశక్తిని కోల్పోతూ ఉంటాడని, ఆమెకు బాగా తెలుసు. అంతా అతడి కోపానికి భయపడి, తమ చర్యలు ఆ ముని మండిపాటుకు కారణం కారాదని, ప్రార్ధించేవారు.
“చివరిసారిగా చెప్తున్నా. ఇది నా ఆజ్ఞ. ఇది నువ్వు పాటించి తీరాలి“, అంటూ దేవేంద్రుడు విసవిసా అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఇక మేనకకు వేరే మార్గం లేదు.
ఆమె రాజాజ్ఞను పాటించేందుకు తనను తాను మానసికంగా సిద్ధం చేసుకుంది. తన అద్భుతమైన వస్త్రాలలో విస్మయపరిచేలా, విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి దిగి వచ్చింది.
“ఓం “ అంటూ విశ్వామిత్రుడు జపించే మంత్రం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించసాగింది. వెంటనే ఆమె, విశ్వామిత్రుడికి తపోభంగం కలిగించాలని అనుకోవడం, తాను చేసిన అతిపెద్ద సాహసమనుకుని, భయపడింది. కాని ఈ దశలో, ఆమె తనకు అప్పగించిన పనిని పూర్తిచెయ్యకుండా స్వర్గానికి తిరిగి వెళ్లనూలేదు, విశ్వామిత్రుడి తపోభంగం ద్వారా ఆపదలు కొనితెచ్చుకోలేదు.
అది రాజాజ్ఞ కనుక, పాటించే తీరాలి, అని ఆమె లోలోనే ఆలోచించుకోసాగింది....
దేవలోకపు అప్సర యొక్క అద్భుతమైన మోహశక్తితో మానవ మేధస్సును సవాలు చెయ్యమని, రాజాజ్ఞ.
ప్రబలమైన మోహాన్ని నిగ్రహించుకోగల శక్తిని పరీక్షించమని రాజాజ్ఞ .
మేధ శిఖరాగ్రాన జ్ఞానంపై మోహం యొక్క ఆధిపత్యాన్ని పరీక్షించమని రాజాజ్ఞ.
ఇక, ఆమె ఆజ్ఞను పాటించేందుకు పూర్తిగా సిద్ధమయ్యింది. ఆమె స్నానం చేసేందుకు , విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి ప్రక్కనే ఉన్న సరస్సులోనికి దిగింది.
మరికొన్ని క్షణాల్లో, ఆ సరస్సు కొత్త కాంతిని సంతరించుకుంది, ప్రతి నీటి చుక్క దివ్యమైన ఆమె దేహాన్ని తాకేందుకై పోటీపడుతోందా, అనిపించసాగింది.
ఆమె దేహం నీటికి కొత్త ప్రాణం పోసింది, ఆశ్రమం అంతటా ఏదో కొత్త శక్తి వ్యాపించింది. ఆమె సరస్సు నుంచి బయటకు రాగానే, ప్రకృతి ఒక్కసారిగా స్తంభించినట్లు అనిపించసాగింది. మబ్బుచాటునుంచి చంద్రుడు బయటకు వచ్చి, ఆత్రంగా చూడసాగాడు.
చక్కని వంపులు తిరిగిన ఆమె శరీర భాగాల నుంచి, నీటిబొట్లు రాలి పడసాగాయి. ప్రతి చుక్క ఆమెను నిలువెల్లా తాకుతూ, అయిష్టంగా ఆమె కాంతివంతమైన దేహాన్ని వదిలి వెళ్తోంది. అప్పటివరకూ విశ్వామిత్రుడు ఎంతో శ్రమపడి నిర్మించుకున్నదంతా కూల్చివేయడానికి వచ్చిన ప్రమాదంలా, అతని వైపు నడిచింది.
ఆమె లయబద్ధమైన అడుగులు, సన్నటి నడుము, చురుకైన చూపులు ఆమె ఆహ్వానాన్ని మరింత ప్రబలంగా మార్చాయి. మరికొన్ని క్షణాల తర్వాత, ఆమె శరీర పరిమళం చుట్టుప్రక్కల అంతా వ్యాపించి, విశ్వామిత్రుడి ఏకాగ్రతను భంగపరిచింది. ఆయన కన్నులు తెరిచారు.
ఆయన నోటివెంట అప్పటివరకు జపించిన ‘ఓం’ అన్నది మరచి, తెలియకుండానే ‘ఓహ్... !’ అన్న పదం వెలువడింది.
అప్రయత్నంగా ఆయన కాళ్ళు ఒక అచేతన స్థితిలో, మేనక వైపు దారి తీసాయి. ఆయన కన్నులు అనాచ్చాదితమైన పాలవర్ణపు వీపుపై , సన్నటి నడుముపై నిలిచిపోయాయి.
విశ్వామిత్రుడు తనను అనుసరిస్తున్నాడని తెలుసుకున్న మేనక, ఆగి, శృంగారభరితంగా తన చేతులను ఎత్తి, అతన్ని ఆహ్వానించింది.
అటువంటి ప్రబలమైన ఆహ్వానాన్ని, ఎవరూ నియంత్రించుకోలేరు, విశ్వామిత్రుడు కూడా. ఆమె నడుమును అందుకునేందుకు, అతను చెయ్యి చాచాడు. ఇక్కడే, ఈ కధ వందలాది ఏళ్ళ క్రితం మొదలయ్యింది....
***************
రెండు శతాబ్దాల క్రితం... మైసూరు మహారాజా భవంతిలో...
1892 లో ఒక వేసవి మధ్యాహ్నాన, మహారాజు తన మందిరంలో, తనకు సమకాలీకుడైన ప్రఖ్యాత చిత్రకారుడు – ప్రద్యుమ్న తో చర్చించుతున్నారు.
లలితకళల పోషణకు పేరొందిన మైసూరు మహారాజు ప్రద్యుమ్న వద్దనుంచి ఒక పెద్ద ఉత్కృష్టమైన చిత్రాన్ని ఆశిస్తున్నారు. చికాగో లో జరగనున్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కు తమ రాజ్యం తరఫున దాన్ని పంపాలని ఆయన కోరిక.
ఆ రోజుల్లో వాణిజ్య మార్గాలు కేవలం సరుకుల రవాణాకు మాత్రమే కాక, విలువలు, ఆలోచనల బదిలీని కూడా ఆహ్వానించేవి. బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతిని ప్రభావితం చేస్తూనే, అప్పటి వరకూ ఈ ఉపఖండపు హద్దులలోనే ఉన్న చిత్రకళా నిధిని ప్రపంచానికి పరిచయం చేసారు. ఇది పాశ్చాత్య దేశాల్లో భారతీయ చిత్రకళ పట్ల ఆసక్తిని పెంపొందించింది. తనకున్న అతి అరుదైన ప్రతిభ వల్ల, ప్రద్యుమ్న వారికొక ఆసక్తికరమైన వ్యక్తిగా రూపొందాడు.
ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ప్రద్యుమ్న,న భూతో న భవిష్యతి అన్నట్టుగా, తన చిత్రకళతో భారతీయ సంస్కృతిని విస్తృతంగా ప్రభావితం చేస్తూ, మైసూరు మహారాజు సంరక్షణలో కీర్తి శిఖరాలను అధిరోహించాడు.
కొలంబియా ప్రదర్శనకు పంపేందుకుగానూ, ప్రద్యుమ్న వెయ్యదగిన చిత్రపు నమూనాలను పరిశీలిస్తున్నాడు మహారాజు.
“మహారాజా ! కొన్నాళ్ళ క్రితం మీరు నాకు ఈ విషయం చెప్పినప్పుడు నేను దీనిగురించి ఆలోచించాను. నేను విశ్వామిత్రుడి చిత్రాన్ని ప్రయత్నిస్తాను!!! ఆ ఋషి జీవితచరిత్ర, రాజబలం, దివ్యమైన ఏకాగ్రత, మోహం లాంటి ఆసక్తికరమైన విషయాల గొప్ప సమ్మేళనం. దేవేంద్రుడి ఆజ్ఞపై, మేనక, విశ్వామిత్రుడిని సమ్మోహితుడిని చేసే సంఘటన నేపధ్యంగా ఒక చిత్రాన్ని రూపొందించాలని నా యోచన”
మహారాజు మౌనంగా ఉండిపోయారు. పౌరాణిక పాత్రలను,దృశ్యాలను తీసుకుని, వాటిని రాజసమైన అతిగొప్ప చిత్తరువులుగా మలచడంలో, ప్రద్యుమ్నకు ఉన్న విశిష్టమైన తైలవర్ణ చిత్రకళా శైలిని గురించి ఆయనకు బాగా తెలుసు. పాత్రలకు జీవం పొయ్యడం మాత్రమే కాకుండా, ఆ పాత్ర యొక్క నిశితమైన వర్ణనతో, చిత్రం వెనుక ఆవరణతో చిత్రాన్ని తనదైన శైలిలో రూపొందించడంలో ప్రద్యుమ్న చూపే శ్రద్ధ, అతన్ని ఆ ప్రాంతానికే ప్రఖ్యాత చిత్రకారుడిగా మలచింది. అయితే, చిత్రానికై ప్రద్యుమ్నకు కావలసిన వ్యక్తులను నమూనాలుగా అందించడం గురించే మహారాజు ఆందోళనకు గురౌతున్నారు. ప్రద్యుమ్నకు అటువంటి వ్యక్తులు ఎక్కడ దొరుకుతారా అని ఆయన యోచించారు.కొంత సేపటి తర్వాత,మహారాజు ఇలా అన్నారు....
“అద్భుతం ప్రద్యుమ్న, అద్భుతం! నీకు ఏమి కావలసినా అమర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. కాని, ఈ చిత్రం భారతీయతను ప్రతిబింబించేలా, భారతీయ అన్వయాలకు సంబంధించి ప్రపంచం ఇంతవరకూ చూడనంత అందమైన తైలవర్ణ చిత్రం కావాలి. దీనికి నేను ఎలా సాయపడగలనో, నానుంచి నీకు ఏమి కావాలో చెప్పు? డబ్బా? నిశ్చింతగా పనిచేసుకునేందుకు ఏకాంత మందిరమా? సేవకులా? చెప్పు ప్రద్యుమ్నా, నీకు ఏమి కావాలి?”
ప్రద్యుమ్న ఒక్కక్షణం మౌనం వహించి, “మహారాజా, మీపట్ల ఉన్న అపారమైన గౌరవము, కృతజ్ఞతతో, నేను మీ ఆశ్రయం పొందినందుకు అదృష్టవంతుడినని చెప్పి తీరాలి. నాకు ఇతర మౌలిక సదుపాయాలు ఏవీ అక్కర్లేదు, కాని...”
మహారాజు తన ఆందోళన నిజమౌతుందని భయపడ్డారు. ఆయన వ్యాకులత చెంది, ఇలా అడిగారు, “ప్రద్యుమ్న, దయుంచి విషయాన్ని సూటిగా చెప్పు. నీవు ఏమి ఆశిస్తున్నావు ?”
“మహారాజా! దయుంచి ఆగ్రహించకండి. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన తైలవర్ణ చిత్రం తయారుచేసేందుకు నేను నా పయనం ఆరంభించేందుకు సిద్ధంగా ఉన్నాను. కాని, నేను నా చిత్రానికి నమూనాగా నిలవగలవ్యక్తుల అన్వేషణ అనే ఆరంభ దశలోనే ఆగిపోతానేమో అని కలతచెందుతున్నాను.”
ప్రద్యుమ్న సమస్య అర్ధవంతమైనది. ఏదైనా ఒక చిత్రం తెరపై ప్రాణం పొసుకోవాలంటే, చిత్రకారుడికి ఆ చిత్రం పట్ల ఉండే మక్కువ, అతడు చిత్రించబోయే సన్నివేశాల్లో, అందమైన ఆకృతులకు జీవాన్ని ఇవ్వగల వ్యక్తులు నమూనాలుగా నిలబడడంతో పెంపొందుతుంది. కాని, అప్పటి సంస్కృతీ సంప్రదాయల వల్ల, చిత్రాలకు నమూనాలుగా నటించే స్త్రీలు అప్పటిలో దొరకడం కష్టమయ్యేది. ఒకవేళ ఆ చిత్రం శృంగార పరమైనది అయితే ఇలాంటి నమూనాలకు వ్యక్తులు దొరకడం దుర్లభమనే చెప్పాలి.
ఇదివరలో ఈ పరిమితిని, ప్రద్యుమ్న అనేక విదేశీ ఛాయాచిత్ర పుస్తకాల్లో ఉన్న చిత్రాలను నమూనాలుగా స్వీకరించడం ద్వారా అధిగమించాడు. అతని గ్రంధాలయంలోని పుస్తకాలలో, అనేక రూపాలలో ఉన్న పురుషుల, స్త్రీల, పిల్లల నమూనా చిత్రాలు, ఇంకా అనేక శృంగార భంగిమలలు మరియు నగ్న చిత్రాలు ఉన్నాయి. ఈ ప్రామాణికమైన నమూనాలు అతనికి నమూనావ్యక్తుల అవసరం లేకుండా చేసాయి.
పుస్తకాలోని మనుషులచిత్రాలను ప్రేరణగా తీసుకుని చిత్రరాజాలలోని బొమ్మలని అందంగాతీర్చిదిద్దటం అతని పనికి అనువుగా ఉండేది. కాని, అలా పుస్తకాలు వాడడం వల్ల ఒక లోపం ఉండేది. అలాంటి బొమ్మలు, ఎటువంటి ఉద్వేగం లేకుండా, చప్పగా , కొన్ని సార్లు అసహజంగా, వంకరగా, అనిపించేవి. పనిచేసే చిత్రరాజానికి కావలసిన భావనలు, చిత్రాలలోని బొమ్మలతో సరిపోలవు. నిజానికి, ఆ కాలంలోని భారత చిత్రకారుల ప్రయత్నాలన్నీ ఇటువంటి ఇబ్బందుల వల్ల లోపభూయిష్టంగా ఉండేవి.
ప్రద్యుమ్న చిత్రాలు వీటికి అతీతం కావు. పైగా, అతడు ప్రపంచంలోనే అందమైన చిత్రాన్ని, ఒక శృంగార భరితమైన వాతావరణంలో సృష్టించబోతున్నాడు, అందుకే, అతనికి తన మనసులో ఉన్న మేనక చిత్రానికి తగ్గట్టుగా ఉండే నమూనా స్త్రీ చాలా అవసరం. మేనకకు సరితూగగలిగే నమూనా స్త్రీ ఎవరోఒకరు కాలేరు కదా; ఆ ప్రతిరూపం ఇతరుల కంటే ఆకర్షణీయంగా, సమ్మోహనంగా, హుందాగా, రాజసం ఉట్టిపడేలా ఉండాలి . ఎందుకంటే, ఆమె మేనకలా చూపరులను కట్టేయ్యాలి కాబట్టి!
“నా ఈ చిత్రానికి నమూనా స్త్రీ కై వీధులలో వెతుకుతూ వెళ్లాను, నిజానికి గ్రామీణ ప్రాంతాలలోకి కూడా వెళ్లాను. నా ప్రణాళికకు అనుగుణంగా పనిచేసే కొందరు జారిణీ స్త్రీలు నాకు దొరికేవారు. కాని, వారిలో మేనకకు నమూనాగా నిలబడగల ఆ రాచఠీవి ఉండదు.”
“అయితే, నీవు చివరకు ఏమి చెప్పాలనుకుంటున్నావు?” అడిగారు విభ్రాంతికి గురైన మహారాజు. అతడు ఏమి చెప్పాలని అనుకుంటున్నాడో ఆయన ఇంకా ఊహించలేకపోతున్నారు.
ప్రద్యుమ్న తెగించి, బలహీనస్వరంతో, “మీరు శిక్షించే ప్రమాదం ఉందని తెలిసినా, నేను తెగించి, ఈ విషయాన్ని వెల్లడి చేస్తున్నాను మహారాజా. ఈ బృహత్కార్యానికి నేను యువరాణి సుచిత్రాదేవి భంగిమలను తీసుకునేందుకు రాజావారు అనుమతించాలని నేను అభ్యర్ధించవచ్చా? నా ఈ అభ్యర్ధన తప్పుగా అనిపిస్తే, రాజావారు మన్నించగలరు. కాని, నా అభ్యర్ధనను మన్నిస్తే, నేను ప్రపంచంలోనే సుందరమైన చిత్రాన్ని అందిస్తానని, ప్రమాణం చేస్తున్నాను.”
మహారాజుకు ఆ అభ్యర్ధన నచ్చకపోయినా, ఆయన మౌనంగా ఉన్నారు. ఇదొక కఠిన నిర్ణయం! ప్రదర్శన కోసం చిత్రం అత్యుత్తమమైనదిగా ఉండాలి. మరోవైపు, ఒక చిత్రకారుడి కోసం స్వయానా తన కుమార్తె నమూనాగా నిలవడం మహారాజుకు ఇష్టం లేదు, కాని కొన్ని క్షణాలు దీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఆయన ఇలా స్పందించారు...
“ముక్కుసూటిగా చెప్పే నీ స్వభావాన్ని అభినందిస్తున్నాను ప్రద్యుమ్న; నేను ఈ పనికి యువరాణిని సమ్మతింపచేసి, కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తాను. కాని ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలి, ఏర్పాట్లు అన్నీ రాజభవనంలోనే జరుగుతాయి. ఈ చిత్రం పూర్తయ్యేవరకు నీవు రాజభవనం వదిలి వెళ్ళే వీలు లేదు... “మరి ఒక మాట...” అంటూ ”యువరాణి నా కూతురన్న విషయం నీవు ఎల్లప్పుడూ గుర్తుంచుకో...”అని పరాకుగా చెప్పారు మహారాజు.
తర్వాత కొన్ని వారాల్లో, ప్రతి సాయంత్రం, ప్రద్యుమ్న యువరాణితో కలిసి చిత్రానికై పనిచేస్తూ, సమయం గడపసాగాడు. చిత్రంలో మేనకకు కావలసిన హావభావాలను గురించి ఆమెకు వివరించేవాడు. కొన్నిసార్లు ఈ సహవాసం గంటలుగంటలు కొనసాగేది. కొద్ది కాలంలోనే, ప్రద్యుమ్న సృజనాత్మకత,చాలా సూక్ష్మమైన విషయాలను చిత్రించడంలో అతని ఏకాగ్రత, రాకుమారిని ప్రభావితం చేసింది. ముఖానికి కళ వచ్చేలా నవ్వమనడం, ముఖాన్ని ఒక కోణంలో నిలపమని చెప్పే విధానం, ఆమె ముఖంపై చేతిని ఉంచమని అతను సూచించే విధానం, ఇవన్నీ ఆమెకు బాగా నచ్చేవి.
రోజులు గడుస్తుండగా, రాకుమారి, ప్రద్యుమ్న ఒకరికొకరు దగ్గర కాసాగారు. ఒక చిత్రకారుడికి, అతని నమూనాకు ఉండే ఉద్వేగపరమైన సాన్నిహిత్యం, మున్ముందు రానున్న వాటికి ఆరంభ దశ.
ఒక ఉదయం, ఒక వార్తాహరుడు,మహారాజు దర్భారులోకి వెళ్లి, చిత్రానికి ఉన్న తెరతీసి చూపాడు.మేనక విశ్వామిత్రుల చిత్రణ వైభవంగా అమరిన తీరును,తుది పరిణామాన్ని చూసి మహారాజు ఉప్పొంగిపోయాడు. చూపరులకు మోహకరంగా, అది అత్యంత నైపుణ్యంతో రూపుదిద్దుకుంది.
మేనక సౌకుమార్యాన్ని చిత్రించడంలో ప్రద్యుమ్న చూపిన శ్రద్ధ, విశ్వామిత్రుడిని సమ్మోహితుడిని చేసే ప్రయత్నం సఫలమవుతుందో లేదో అన్న ఆమె సందిగ్ధం, అత్యంత అద్భుతంగా మలచబడి, భారత పౌరాణిక చరిత్రలోనే మనోజ్ఞమైన చిత్రాన్ని తీర్చింది. మహారాజు చిత్రాన్ని చూసి, సంతృప్తి చెంది, ప్రద్యుమ్నకు కబురు పంపారు.
ఆయన చిత్రాన్ని మరింతగా పరిశీలిస్తూ ఉండగా, వార్తాహరుడు చెప్పిన మాటలు ఆయన్ను కలతకు గురిచేసాయి.
“మహారాజా, మీకుఅతి ముఖ్యమైనఒక విషయాన్ని చెప్పాలి. గత రెండు రోజులుగా ప్రద్యుమ్న భవంతిలో కనిపించట్లేదు, ఈ చిత్రం కూడా సేవకులు శుభ్రం చేసేందుకు వెళ్ళినప్పుడు వెలుగు చూసింది.“
మహారాజు ఇది విని అవాక్కయ్యారు. మొదట విన్నప్పుడు ఆయనకు అర్ధం కాలేదు. కాని, దాని తర్వాత మంత్రి అందించిన వార్త, గత కొన్ని వారాలుగా చిత్రాన్ని గియ్యడం అనే ముసుగులో ఏమి జరిగిందో ఆయన గుర్తించేలా చేసింది.
“మహారాజా!గత కొన్ని రోజులుగా యువరాణి సుచిత్రా దేవి కూడా భవంతిలో కనిపించట్లేదని తెలిసింది నాకు...” నిర్ధారించాడు వార్తాహరుడు.
మహారాజు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. తనకు సన్నిహితుడని తాను ఎంతగానో నమ్మిన వ్యక్తి తనని ఇలా మాయ చేయడాన్నిఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన వదనం ఎరుపెక్కింది. వెనక్కి తిరక్కుండానే, తీవ్రమైన కోపంతో ఆయన, ‘వెంటనే ఆ చిత్రాన్ని భవంతి వెలుపలకి తీసుకువెళ్ళి, ముక్కలు చేసి పారెయ్యమని ‘ మంత్రిని ఆదేశించారు. ఈ మాటచెప్తూనే, కోపంగా ఆ మందిరం వదిలి వెళ్ళారు మహారాజు.
మంత్రి, ప్రద్యుమ్న వేసిన అందమైన చిత్రాన్ని చూసాడు. కాని, కళ పట్ల ఉన్న అభిరుచి, గౌరవం వల్ల, చిత్రాన్ని నాశనం చేసేందుకు ఆయనకు మనసు రాలేదు. ఆ చిత్రాన్ని రాజ్యం వెలుపల వదిలెయ్యమని, సేవకులకు చెప్పాడు.
ఆయనకు తెలియకుండా సేవకులు ఆ చిత్రాన్ని ఉత్తరాదికి చెందిన ఒక వస్త్ర వ్యాపారికి, 100 బంగారు నాణాలకు అమ్మారు.
అప్పటినుంచి, ఆ చిత్రం అనేక ప్రాంతాల్లో ప్రదర్శింపబడి, ప్రజల మన్ననలు అందుకుంది. తర్వాతి తరాల్లో, ముద్రణా యంత్రాలు కనుగొనడం వల్ల, కళా పోషకులు అందరికీ ఈ చిత్రపు నమూనాలు విస్తృతంగా అందించబడ్డాయి.
చివరకు ఆ చిత్రం, 20 వ శతాబ్దం మొదట్లో ముంబై కి వచ్చిన బ్రిటిష్ వర్తకుడి చేతుల్లోకి వెళ్ళింది. అతను ఆ చిత్రాన్ని లండన్ కు తీసుకువెళ్లాలని అనుకున్నాడు. అదే ఆ చిత్రం గురించి చివరిసారి వినడం.
ప్రద్యుమ్న మరియు రాకుమారి తమ తదుపరి జీవితాన్ని ఆస్వాదించి ఉండవచ్చు. రాజుకు హృద్రోగం వచ్చి ఉండవచ్చు. మంత్రి చిత్రాన్ని ధ్వంసం చేసానన్న అపరాధ భావన లేకుండా హాయిగా బ్రతికి ఉండవచ్చు. బంగారు నాణాలతో సైనికులు కొన్నాళ్ళు సుఖపడి ఉండచ్చు. కాని, దాని తర్వాత చిత్రం గురించి ఎటువంటి సమాచారం అందలేదు. అది ప్రజల దృష్టి నుంచి కనుమరుగయ్యింది.
21 వ శతాబ్దం ఆగమనంలో ఈ చిత్రం భారతీయ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన క్షణానికి తెరతీసేందుకు నిరీక్షిస్తోంది. అది ఎలా జరగబోతోందో ఈ కధ కొనసాగింపులో తెలుసుకుందాం.
****************
జనవరి 27,2011. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి 12వ అంతస్థు, ముంబై , సమయం ఉదయం 9.00 గంటలు.
త్రివేది గారు ఆఫీస్ కు మామూలు సమయం కంటే, 15 నిముషాలు ముందుగానే చేరుకున్నారు. దారిలో రద్దీ తక్కువగా ఉండడం వల్ల, బస్సు గమ్యానికి త్వరగా చేరుకుంది. ఆయన PC ఆన్ చెయ్యడం, ఒక కప్ కాఫీ తెచ్చుకోవడం వంటి పనులతో తన దినచర్య ప్రారంభించారు. కాఫీ త్రాగుతుండగా, ఆయన వార్తాపత్రిక చదువుతుండగా, ౩ వ పేజీలోని ఒక వ్యాసం ఆయన దృష్టిని ఆకర్షించింది.
ఆ వ్యాసం ప్రద్యుమ్న వేసిన మేనకా విశ్వామిత్రుల చిత్రం గురించి. ఆయన చరిత్రకు సంబంధించిన పుస్తకాల్లో ఈ చిత్రాన్ని గురించి చదివి ఉండడంవల్ల, అదేమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఆ వ్యాసం చదివేందుకు సిద్ధమయ్యారు. కాని, ఫాక్స్ మెషిన్ నుంచి వచ్చిన అప్రమత్త సూచక శబ్దం ఆయనను ఆటంకపరిచింది.
ఇంత ఉదయాన్నే ఎవరుఫాక్స్ చేసి ఉంటారా అని ఆయన తేల్చుకోలేకపోయారు. వాస్తవిక స్థితిగతులను తెలియజేసే కార్పొరేట్ ప్రెస్ విభాగంలో ఉండడంవల్ల, ఆయన ఫాక్స్ మెషీన్, కార్పొరేట్ ప్రపంచంనుంచి తాజా సమాచారాన్నంతా,తమ వెబ్సైటు లో ప్రచురించేందుకు అందుకునేది.
ఆ రోజు ఆయన అందుకున్న వార్త, కొన్నాళ్ళపాటు కార్పరేట్ భారత్ ను, రాబోయే రెండేళ్లలో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ పరిశ్రమను కుదిపివెయ్యగల సత్తా కలిగినది.
ఆయన వార్తాపత్రికను వదిలివేసి, ఏం వార్తో చూసేందుకు ఫాక్స్ మెషిన్ వైపు హడావిడిగా కదిలారు! ఫాక్స్ చదివాకా, ఆయన నిలువెల్లా ఒణికిపోయారు. ఆ ఉత్తరంలోని అంశాలను ఆయన నమ్మలేకపోయారు.
ఆ వార్తయొక్క విశిష్టత అర్ధం కావాలంటే, ఆ వార్తా వివరాల్లోకి వెళ్ళాలి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే, కొన్ని నెలల ముందు గతానికి, భారత్ నుంచి కొన్ని వేల మైళ్ళు దూరంలో ఉన్న UK కు పయనించాలి...
వెళ్దాం రండి...
*********
మాంచెస్టర్ – బూత్ స్ట్రీట్ వెస్ట్ – నవంబర్ 13, 2009 – ఉదయం 3 గం.
ట్రింగ్ గ్ గ్ గ్ గ్ ....
అంత పొద్దున్నే అలారం బెల్ మ్రోగింది. స్నిగ్ధ నిద్ర నుంచి లేచింది. ఆమె గడియారం వంక చూసి, తాను కేవలం మూడు గంటలే పడుకున్నాననీ, అదీ నిద్రలో అలజడి రేపే కలల తాకిడి వల్ల, చాలా మగతగా నిద్రించాననీ తెలుసుకుంది.
అది ఆమెకొక భయానకమైన ఉదయం. ఆమె అసలు నిద్ర లేచే స్థితిలో లేదు, అవకాశముంటే, ఆమె రాబోయే 24 గంటలు ఏమీ చెయ్యకుండా, అలాగే పక్కపై పడుకుని ఉండేందుకు ఇష్టపడేది. ఆమె మానసికంగా బడలి ఉంది, శారీరకంగా పూర్తిగా అలసి ఉంది.
కాని, ఆమె ముంబై కి వెళ్ళే అంతర్జాతీయ విమానం అందుకోవాలి. విమానం ఉదయం 6 గంటలకి, ఆమె విమానాశ్రయానికి 2 గం.ముందుగానే వెళ్ళాలి.
ఆమె బెడ్ లాంప్ వద్దకు వెళ్లి, దాన్ని ఆర్పింది. గదినంతా హఠాత్తుగా చీకటి ఆవరించింది. అది ఆమె మానసిక స్థితిని ప్రతిబింబించింది, చీకటిగా, శూన్యంగా, వ్యాకులంగా... దిగులుతో కూడిన బాధ ఆమెను ఆక్రమించింది.
ఆమె అయిష్టంగా పక్క పై నుంచి లేచి, తయారయ్యేందుకు స్నానాలగదికి వెళ్ళింది. ఆమె తలుపు మూసి, లైట్ వేసి, అద్దంలో తన ముఖం చూసుకుంది. ఆమె వదనం కళావిహీనమై ఉందని, ఆమె గుర్తించింది. చీకటికి కూడా తనదైన అందముందని, ఆమె భావించింది – అది నిన్ను నువ్వు చూసుకోకుండా చేస్తుంది. ఆమె తిరిగి ఋషి గురించి ఆలోచించేందుకు తిరిగి లైట్లు ఆర్పింది.
ఋషి తన స్నేహితుడు, అతనితో ఉండడాన్ని బాగా ఇష్టపడేది. పనిచేసేటప్పుడు - ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం లో చెప్పినట్లుగా, అతని సమక్షంలో గంటలు నిముషాల్లా, నిముషాలు సెకండ్ల లా గడిచిపోయినట్లు అనిపించేది.
నిన్నటిదాకా, వాళ్ళజీవితాల్లో ఆ నిర్ణీత సంఘటన జరిగేదాకా ఇదంతా నిజమే ! ఆమె నిన్నటి దెబ్బ నుండి ఇంకా కోలుకోలేదు. ఆమె మనసు ఆమెను ఫ్లైట్ కాన్సిల్ చేసి, ప్రయాణం మానుకోమంది, కాని ముంబైకు ఆఫీస్ పనిమీద వెళ్లాలని ఆమెకు తెలుసు, వెళ్ళకపోతే ఆమె బాస్ మహేంద్ర కలతచెందుతారు. ఆమెకు వ్యక్తిగత విషయాల్ని ఆఫీస్ పనితో కలపడం ఇష్టం లేదు.
బీప్... బీప్...
ఋషి ఫోటో ఫ్లాష్ అవుతూ ఆమె మొబైల్ ఫోన్ మ్రోగసాగింది... అతను ఉదయమే ఆమెను ఫ్లాట్ వద్దనుంచి తీసుకువెళ్ళాలి, అతను కూడా ఆమెతో ముంబై వెళ్తున్నాడు. ఆమెకు అతనితో మాట్లాడడం ఇష్టం లేదు. అందుకే తిరిగి రాబోయే ఫోన్ కాల్ ను తప్పించుకునేందుకు, ఆమె ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసింది.
ఆమె మహేంద్ర దసపల్లా వద్ద పనిచేస్తోంది. ఆయన దక్షిణ భారత దేశంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త. ఆయన హైదరాబాద్ లో ‘నిర్వాణ ప్లస్’ అనే పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పరిచారు. అది 250 మంది ఉద్యోగుల నుంచి, 45,000 మంది దాకా ఎదిగి, ఒక దశాబ్దం లోపలే విశ్వమంతా విస్తరించి, ఆఫీస్ లను ఏర్పరచుకుంది.
మహేంద్రకు వృత్తిపరంగా, సాంఘికంగా, రాజకీయపరంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రాజకీయ సంబంధాలే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆయన సాంకేతికపరంగా, స్థిరాస్థి నిర్మాణపరంగా ఆయన అనేక ప్రాజెక్ట్లు పొందేలా చేసాయి. స్థిరాస్థి నిర్మాణ ప్రాజెక్ట్ లను అతను తన తమ్ముడి కంపెనీ ద్వారా నిర్వహించేవాడు.
మహేంద్ర స్వీకరించిన ఒకానొక ప్రాజెక్ట్, ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టుల ద్వారా వయోజన విద్యా ప్రాజెక్టు. ఇది రాష్ట్రంలో అక్షరాస్యత సంఖ్యను పెంచినందుకు అనేక ప్రశంసల్ని అందుకుంది. రాష్ట్రమంతా తన కొత్త ‘సాఫ్ట్వేర్ మినీ టౌన్షిప్’ ల ఏర్పాటు ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మార్చివేసినందుకు ఆయనకు విశిష్టమైన ప్రశంసలు లభించాయి.
వయోజనవిద్యా ప్రాజెక్ట్ లో పనిచేస్తుండగా, అతని రాజకీయ సంబంధాలు బాగా పెరిగి, రాష్ట్ర పర్యాటక మంత్రితో సంప్రదింపులు జరిపి, ఆయన సూచనతో, రాష్ట పర్యాటక ప్రతిష్టను పునరుద్ధరించే కొత్త ప్రాజెక్టును ప్రారంభించేలా చేసాయి. భారత ప్రభుత్వ ‘ఇన్క్రెడిబుల్ ఇండియా ‘, కేరళ ప్రభుత్వ ‘గాడ్స్ ఓన్ కంట్రీ కాంపైన్ ‘ అనే వాటి పంధాలో ఆంద్ర ప్రభుత్వం రెండేళ్ళ క్రితం ఒక ప్రతిపాదన చేసింది – పట్టణాన్ని దక్షిణాది సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
ఈ మిషన్ లో కీలకమైనది, రూ. 500 కోట్లతో, ‘ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం ‘ ను ఏర్పరిచి , చరిత్రలో మరుగునపడ్డ 500 ల అత్యుత్తమ భారతీయచిత్రాలను సేకరించి, అందులో ప్రదర్శించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకుల దృష్టిని ఆకర్షించే మెగాప్రోజెక్టు.
స్నిగ్ధ ఈ ప్రాజెక్టులో గత రెండేళ్లుగా పనిచేస్తోంది. మాంచెస్టర్ లో నివసిస్తూ, యూరోప్ లోని అన్ని ప్రాంతాల్లో పనిచేస్తూ, ఆమె ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియంకై కొనదగ్గ భారతీయ చిత్రాలను అన్వేషిస్తోంది.
తనకు అభిరుచి ఉన్న సరైన ఉద్యోగంలో ఉన్నందుకు– విశేషించి, అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూనే, భారతీయ సంస్థలో, అదీ తన మనసుకు నచ్చిన క్షేత్రంలో పనిచేస్తున్నందుకు, ఆమె ఆనందిస్తూ ఉంటుంది.
ఆమె ఆఫీస్ లో సమర్ధురాలైన ఉద్యోగినిగా ఉంటూ, తన సమర్ధతకు గానూ, అనేకమార్లు మహేంద్ర నుంచి ప్రశంసలను అందుకుంది. ఆమెకు పనంటే మక్కువ, ప్రేమ, ప్రాణం – ఆమె ఋషి ని కలిసేదాకా. అనతికాలంలోనే ఋషి ఆమెకు తొలి ప్రాధాన్యతగా మారాడు. కాని, దానివల్ల పనిలో తేడా రాకుండా, ఆమె ఋషితో గడిపేందుకు తన వ్యక్తిగత సమయాన్ని తగ్గించుకుని, కేటాయించేది.
చిత్రకళ, చిత్రాలు చిన్నతనం నుంచి ఆమె జీవితంలో అంతర్భాగమై పోగా, లండన్ లోని ‘సోత్ బై ఇన్స్టిట్యూట్’ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకోవడం ఆమెకు ఇష్టమైన అభిరుచికి, వృత్తిపరంగా ఉపయుక్తమయ్యింది. ఆమె చిత్రాల మధ్య, తననుతాను సులభంగా మిళితం చేసుకోగలదు, ఇక అవి భారతీయ చిత్రాలైతే, ఆమె కొన్ని రోజులు ఆహారం లేకపోయినా పట్టించుకోదు.
మహేంద్ర కోసం ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తుండగా ఆమె ఋషిని కలిసింది. అతను మాంచెస్టర్ లో ఉన్న స్విస్ బ్యాంకు శాఖైన ‘బ్యాంక్ ప్రైమ్ సూఇస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్.
కొద్దికాలంలోనే వారు మంచి స్నేహితులు అయ్యారు, ఇంకా చెప్పాలంటే చాలా దగ్గరయ్యారు. నిజానికి, అన్నీ సవ్యంగా జరిగి ఉంటే వారు త్వరలోనే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నారు.
అప్సర పండిట్ తమ మధ్యకు వచ్చేదాకా, మొదట్లో అన్నీ సవ్యంగానే జరిగాయి. ఆమె నగరంలో పేరున్న ఆర్ట్ వ్యాపారి, చిత్రాలపై ఆమెకున్న వైవిధ్యమైన జ్ఞానానికి, అనతికాలంలోనే ఆమె ఋషి ధ్యాసను పూర్తిగా ఆకట్టుకోగలిగింది.
వాస్తవానికి, అప్సర స్నిగ్ధకు వృత్తిపరంగా సహోద్యోగిని అయినా, నెమ్మదిగా ఆమె ఋషికి వ్యక్తిగతంగా స్నేహితురాలు అయ్యింది. ఆమెకు ఋషిపై నమ్మకం ఉన్నా, ఆమె ఋషి, అప్సరలతో ఉన్నప్పుడు, ఎవరు ఎవరిని వశం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారో అర్ధం చేసుకోలేకపోయేది. అప్సర ఋషి కంటే 8 ఏళ్ళు పెద్దదైనా, ఎవరూ ఆమె వయసును ఊహించలేరు. ఆమె రూపం చూపరులను ఇట్టే మోసం చెయ్యగలదు.
అప్సర సాంగత్యంలో, ఋషి తనను తాను మరిచేవాడు, ప్రత్యేకించి, ప్రద్యుమ్న చిత్రాల ప్రస్థావన వచ్చినప్పుడు, అతను చూపే ఆసక్తికి ఎల్లలు ఉండేవి కాదు. స్నిగ్ధ కూడా ప్రద్యుమ్న చిత్రాలకు వీరాభిమాని. ఆమె పౌరాణిక పాత్రల్లోని స్త్రీల చిత్రాలను ఇష్టపడేది, వారిలో శృంగారం, అమాయకత్వం, సంప్రదాయాల ఆసక్తికరమైన మేళవింపు కనిపించేది.
ప్రద్యుమ్న యొక్క తైలవర్ణ చిత్రాల గురించి ఋషికి వివరించేందుకు అప్సర వద్ద చాలా సమాచారం ఉండేది. చిత్రాలయొక్క అతి సూక్ష్మమైన అంశాల గురించి ఋషికి అనేక సందేహాలు ఉండేవి. స్నిగ్ధ ఒక్కోసారి ఇది చూసి సందిగ్ధానికి గురయ్యేది – వృత్తిరీత్యా అతను బ్యాంకర్ అయినా, ప్రద్యుమ్న చిత్రాల పట్ల చాలా ఆసక్తి ఉన్నట్లుగా కనిపించేవాడు.
డుర్ర్ర్... మంటూ హఠాత్తుగా వినవచ్చిన టాక్సీ శబ్దం ఆమెను ప్రస్తుతంలోకి తీసుకువచ్చింది.
ఆమె కిటికీలోంచి ఒక టాక్సీ వీధిలోకి ప్రవేశించడం చూసి, ఋషి తనను తీసుకుని వెళ్లేందుకు వచ్చాడని, తేలిగ్గా ఊహించింది. అతనితో వెళ్ళడం ఆమెకు ఇష్టం లేదు. ఆమె వెంటనే మొబైల్ స్విచ్ ఆన్ చేసి – “ఋషి, దయచేసి నాకు మరింత ఇబ్బందిని కలుగజెయ్యకు. దయుంచి వెళ్ళిపో, నేను నిన్ను నేరుగా ఎయిర్పోర్టువద్ద కలుస్తాను. ఇప్పుడు నా ఇంటి ముందు నువ్వు ఏ తమాషా సృష్టించకు,” అని సందేశం పంపింది. ఋషి తన సందేశాన్ని అందుకున్నాడో లేదోనని, ఆమె కిటికీనుంచి తొంగి చూసింది.
టాక్సీ కొద్దిసేపు ఆగగానే, ఋషి దానినుంచి బయటికొచ్చి, కిటికీ వద్ద ఉన్న స్నిగ్ధ వైపు చెయ్యి ఊపి, మళ్ళీ టాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు.
కొన్ని క్షణాల తర్వాత, ఆమె మొబైల్ లో అతనినుంచి వచ్చిన ఒక సందేశం మెరిసింది – “స్నిగ్ధ, ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలుసు, దయుంచి నన్ను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించు. నా గురించి నీవు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.”
అది చదవగానే ఆమె “ఆహ్ !!!” అంటూ నిట్టూర్చగలిగింది, అంతే.
నిజమే, తను ఋషి గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఋషి నమ్మకస్తుడిగా, విశ్వాసపాత్రుడిగా ఉంటాడని అనుకోవడమే చాలా తొందరపాటు నిర్ణయమని ఆమెకు అనిపించింది. నిన్న అప్సరతో సన్నిహితంగా ఉన్న ఒక స్థితిలో ఋషిని చూసినప్పుడు ఆమెకు మోసపు దెబ్బ తగిలింది. అప్సరతో ఋషి ఎలా సంబంధం పెట్టుకోగలడో ఆమెకు అర్ధం కాలేదు.
అది ఆమెకు హఠాత్తుగా విశ్వామిత్రుడి కధను గుర్తుకు తెచ్చింది. ఒక స్త్రీ మాంసాన్ని చూసి, మతులు పోగొట్టుకునే పురుషుల మానస్తత్త్వం దేనితో చెయ్యబడిందో అర్ధం చేసుకోవడంలో ఆమె ఎప్పుడూ విఫలమయ్యేది.
వేల ఏళ్ళు తపస్సు చేసిన ఒక ఋషి, మనోహరంగా ఉన్న మేనకను చూసి, రెప్పపాటులో తన ఆత్మనిగ్రహాన్ని కోల్పోయినప్పుడు, ఋషి ఇందుకు అతీతుడేమీ కాదు. ఇరవైఒకటవ శతాబ్దపు పురుషుడు, ఇంద్రియాలపై తన సంయమనాన్ని కోల్పోయేందుకు మరిన్ని అవకాశాలున్నాయి.
పరిహసించే విధంగా, విశ్వామిత్ర - మేనకల చిత్రాన్ని వేసిన చిత్రకారుడైన ప్రద్యుమ్న కూడా, తన చిత్రానికి నమూనాగా పనిచేసిన యువరాణితో పారిపోయి, చిత్రకారుడిగా తనకున్న కీర్తినీ, ప్రతిష్ట ను కోల్పోయి, చరిత్రలో కనుమరుగు కాలేదూ ? యెంత తెలివితక్కువపని – అతని భవితకు బదులుగా ఒక స్త్రీ ? స్నిగ్ధకు తాను అనుకున్నది నిజమేనేమో అనిపించింది. మగవారు విశ్వాసనీయంగా ఉండలేరు. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నా, ఆమె తనకే స్వంతమైన ఒక ఉదాహరణను పొందింది. ఆ ఆలోచనే ఆమె మనసు కలుక్కుమనేలా చేసింది.
ఆమె ఆలోచనలు కొనసాగుతూ ఉండగా, ఆమె తయారయ్యి, ప్రయాణానికి అన్నీ సర్దుకుంది. గతరాత్రి వెనక్కి వస్తూ, ఆమె ఒక కాబ్ ను పిలిచింది. ఆమె మొబైల్ లో టాక్సీ అప్పటికే వచ్చిందన్న సందేశాన్ని ఆమె గమనించింది.
ఆమె తన గదికి తాళంవేసి, తన చేతిలోని సామానుతో క్రిందికి దిగింది. టాక్సీ డ్రైవర్ ఆమె చేతిలోని సామానును తీసుకున్నాడు. అతను పాకిస్తాన్ కు చెందినవాడు, స్నిగ్ధకు బాగా తెలిసినవాడు. స్వస్థలమైన లాహోర్ నుంచి, పాకిస్తాన్ నుంచి, అతను మాంచెస్టర్ కు వచ్చి, కాబ్ డ్రైవర్ గా స్థిరపడ్డాడు.
“గుడ్ మార్నింగ్ కరీమ్భాయ్ “ అంటూ నల్లటి కాబ్ లోకి ప్రవేశిస్తూ, ఆమె అతన్ని పలకరించింది. “ మనం త్వరగా వెళ్ళాలి, మనకు కేవలం అరగంట సమయం మాత్రమే ఉంది”, అంది. ఆమె అద్దంలోకి చూస్తూ తన కురులను సవరించుకుంది. “మీరేమీ చింతించకండి, మీరు ఫ్లైట్ మిస్ కారని నేను హామీ ఇస్తున్నాను. ఒకవేళ మిస్ అయినా, నేను ఇదే టాక్సీ లో మిమ్మల్ని ముంబైకి తీసుకువెళ్తాను. కాస్తంత విశ్రమించండి,” అన్నాడు టాక్సీ డ్రైవర్.
కరీం అరబిక్ పాటలు పెట్టుకుని, టాక్సీ నడపడం మొదలుపెట్టి, దారిలో కూనిరాగాలు తీసాడు. ఋషికి కూడా అరబిక్ పాటలంటే ఇష్టం, అనుకుంది ఆమె సాలోచనగా.
మళ్ళీ ఋషి ఆమె మనసును ఆక్రమించాడు. ఋషికి ఒక్కరాత్రి మాత్రమే సాగిన బంధం కోసం, ఆమె కాస్త ఎక్కువగానే ఆలోచిస్తోందా ? ఆమె 21 వ శతాబ్దపు పురుషుడి నుంచి మరీ ఎక్కువ నిజాయితీని ఆశిస్తోందా ? లేక ఉద్వేగభరితమైన ఒక సాన్నిహిత్యం ఋషి, అప్సర పంచుకున్నదానితో పోల్చలేమా ? ఆమె మనసు లోతుల్లో ఆమె అతను తనను మోసం చెయ్యలేదని భావించింది. ఆమె బుద్ధి, ‘నిజమే, నువ్వు మోసగింపబడలేదు,’ అంటోంది, కాని ఆమె హృదయం ‘లేదు, నువ్వు వంచించబడ్డావు,’ అంటోంది.
ఆమెను ఇంకా చీకాకు విషయం ఏమిటంటే, మ్యూజియం కోసం కొన్న ఒక పెయింటింగ్ గురించి, ఋషి ఈ ఆటలో చిక్కుకున్నాడు. ఒక ప్రైవేట్ సేకరణకారుడి నుంచి, ఈ చిత్రాన్ని కొన్నప్పటినుంచి, ఋషి ఈ చిత్రాన్ని అధ్యయనం చేసేందుకు పరితపిస్తూ, అది అప్సర వద్ద ఉండడంతో ఆమెను కలిసేందుకు ఆసక్తి చూపసాగాడు.
ఆ చిత్రం అనేది కేవలం ఒక వంకేనా, లేక ఋషికి నిజంగానే చిత్రాలపట్ల అంతటి మక్కువ ఉందా ? ఒకవేళ అది చిత్రం కోసమే అయితే, అందులో ఋషిని అప్సరకు దగ్గర చేసేంతటి విశేషం ఏముంది ? స్నిగ్ధ కు ఈ విషయం ఏ మాత్రం అర్ధం కాలేదు.
చిత్రాలను అమితంగా ప్రేమించే వారిపై, ఆ చిత్రాలు ఉద్వేగమైన ప్రభావాన్ని చూపుతాయని ఆమెకు తెలుసు. కాని, ఆ చిత్రాలు వారి మనస్సులో భ్రాంతిని ఎలా కలిగించేలా పనిచేసేవో, ఆమెకు సందిగ్ధంగా ఉండేది.
ఆమెకు సంబంధించినంత వరకూ, ఒక చిత్రంలో అత్యంత ప్రభావాన్ని చూపేది వర్ణాల కలయిక. వర్ణాల గురించిన అవగాహన వ్యక్తిగత అనుభవాన్ని బట్టీ మారినా, కొన్ని రంగుల ప్రభావానికి విశ్వవ్యాప్తమైన అర్ధం ఉంది.
ఉదాహరణకు, నల్లరంగు కేవలం విచారాన్ని, నిరసనను వ్యక్తం చేసేది మాత్రమే కాదు, అది మేధస్సుతో కూడా ముడిపడి ఉంటుంది – అందుకే డాక్టరేట్ ను నల్లని దుస్తుల్లో ఇస్తారు. నిజానికి, నల్లని దుస్తులు వారిని సన్నగా కనిపించేలా చేస్తాయి. దీనికి విరుద్ధంగా, మనలో చాలామందికి తెలిసినట్లుగా, తెల్లరంగు స్వచ్చత – పెళ్లి బట్టలు, శుభ్రత – డాక్టర్ల బట్టల వంటి వాటితో అనుబంధం కలిగి ఉంటుంది.
నీలి రంగు స్థిరత్వానికి, విశ్వసనీయతకు, జ్ఞానానికి, నమ్మకానికి ప్రతీకగా ఉంటుంది – అందుకే దీన్ని చాలావరకు స్కూల్ యూనిఫార్మ్స్ లో వాడతారు. ఇక పసుపు రంగుతో ఆవరించబడ్డ వారు ఆశావహ దృక్పధంతో ఉంటారు, ఎందుకంటే మెదడు ఎక్కువ సెరటోనిన్ ను వెలువరిస్తుంది – ఇది మెదడులో సానుకూల దృక్పధాన్ని కలిగించే రసాయనం. కాని విపరీతంగా పసుపురంగు వాడడం హానికరం ఎందుకంటే, ఇది మంటల రంగు. పిల్లలు ముదురు పచ్చ రంగు గదిలో ఎక్కువగా ఏడుస్తారు, ఆ రంగు చుట్టూ ఉంటేవ్యక్తి స్వభావం కూడా తీవ్రమవుతుంది.
కాని ఆమెకు గులాబి రంగంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే అది ప్రేమకు, ప్రణయానికి, సున్నితమైన భావనలకు ప్రతీక. ఆమె దృష్టిలో గులాబి రంగు అన్నింటినీ నెమ్మదించే రంగు – ప్రమాదకరమైన నేరస్తులను తరచుగా ‘పింక్ సెల్ల్స్’ లో ఉంచుతారు. ఈ రంగు శక్తిని పిండేసి, తీవ్రతను తగ్గిస్తుంది.
ఆమె టాక్సీ ముందు ఉన్నట్టుండి కనిపించిన ఎర్ర రంగు ట్రాఫిక్ లైట్ తో ఆమె ఆలోచనలు ముగిసి, ఆమె ఎయిర్పోర్ట్ ను చేరుకుందని గుర్తించింది. ఆమె త్వరగా కార్ నుంచి తన సామాను తీసుకుని, టాక్సీ డ్రైవర్ కు డబ్బులు ఇచ్చింది. అతను, “చూసారా ! మనం సమయానికే చేరుకున్నాము,” అన్నాడు. ఆమె అతనికి కృతఙ్ఞతలు చెప్పి, చెక్- ఇన్ కౌంటర్ వద్దకు వెళ్ళింది.
ఎయిర్పోర్ట్ వద్దగల ఎర్రరంగు వాహనాలు గమనించగానే, ఆమె ఆలోచనలు మళ్ళీ కొనసాగాయి. ఋషికి నచ్చిన రంగు ఎరుపు. ఎరుపు శక్తికి సంబంధించిన రంగు, ఎవరి దృష్టినైనా ఆకర్షించాలని అనుకుంటే, ఎరుపు వాడడం మంచిది. తరచుగా కన్ను మొదట చూసేది ఈ రంగునే. ఇది కదలికతో, ఉత్సాహంతో కలిసి ఉంటుంది.
ఋషి క్లైంట్ మీటింగ్ కు వెళ్ళినప్పుడల్లా, అతను సాధారణంగా ధరించే దుస్తులు ఎర్ర టై, ముదురు నీలి కోటు, తెల్ల చొక్కా అని స్నిగ్ధ గుర్తు చేసుకుంది. అవి కంటిని ఆకర్షించేందుకు తగిన శక్తిని ఇస్తాయి అనేవాడు అతను.
ఆమె త్వరగా చెక్- ఇన్ కౌంటర్ లైన్ లోకి వెళ్లి,ఫార్మాలిటీలుపూర్తిచేసి, బోర్డింగ్ పాస్ ను చేతిలోకి తీసుకుంది. ఫ్లైట్ సరైన సమయానికే బయలుదేరనుంది. ఆమె మిగిలిన రివాజులుఅన్నీ పదినిముషాల్లో పూర్తిచేసుకుని, ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధమయ్యింది. ఆమె కళ్ళు ఋషికై అన్వేషిస్తున్నా - ఆమె మనసు ఈ నిజాన్ని నమ్మేందుకు సిద్ధంగా లేదు.
పరిసరాల్ని పట్టించుకోనట్లు నటిస్తూ, తనకు తాను ఏదో వ్యాపకం కల్పించుకుంటూ, ఆమె ఒక కప్ వేడి కప్పోచినో ను అందుకుని, లాంజి లో ఒక మారుమూల సీట్ వైపు వెళ్ళింది.
కొన్ని క్షణాల తర్వాత తన ప్రక్కన మౌనంగా కూర్చున్న వ్యక్తి ,ఆమె ధ్యాసను భగ్నం చేసాడు. ఆమె పుస్తకంలోంచి తలెత్తి, అది ఋషి అని తెలుసుకుంది.
“గుడ్ మార్నింగ్ స్నిగ్ధ...” అంటూ మొదట ఋషి మౌనాన్ని వీడి పలకరించాడు. ఆమె తిరిగి అతన్ని పలకరించలేదు, నవ్వుతూ ఉన్న అతని చూపులకి స్పందించలేదు. దాని బదులు, ఆమె వెంటనే లేచి, బోర్డింగ్ గేటు వైపుకు వెళ్ళింది.
“గత సాయంత్రం జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను స్నిగ్ధ . కాని, ఇందులో అసాధారణమైన విషయం ఉంది, మనం ఇండియా నుంచి తిరిగి వచ్చాకా, నేను నీకు పూర్తి కధను చెబుతాను. నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలను నీవు తప్పక తెలుసుకోవాలి.నేను నీవద్ద ఏదీ దాచను “, ఆమె బోర్డింగ్ గేటు వైపుకు నడుస్తూ ఉండగానే ఋషి ఆమెను బ్రతిమాలడం మొదలుపెట్టాడు.
నెమ్మదిగా క్యూ బోర్డింగ్ కై ప్రవేశించే దిశగా నెమ్మదిగా ముందుకు సాగుతోంది , కాని స్నిగ్ధ ఋషికి బదులివ్వలేదు. అందరిలో మరింత ఇబ్బంది పడడం ఇష్టంలేక, ఋషి ఆమెతో ఇక మాట్లాడలేదు.
వారిద్దరూ వారి సీట్లకు చేరి, వారి హ్యాండ్ లగేజ్ ను కాబిన్ లో ఉంచి, సీట్ బెల్ట్ లు పెట్టుకున్నారు. చిరునవ్వు మొహంతో ఎయిర్ హోస్టెస్ వారికి నిమ్మరసం అందించి, వారి ప్రయాణం ఆనందంగా సాగాలంటూ శుభాకాంక్షలు తెలిపింది.
విమానం బయలుదేరగానే, ఎయిర్ హోస్టెస్ భద్రత గురించిన సూచనలు ఇచ్చింది. కాని, నిజానికి, అందరూ భయపడుతూ ఉన్న సమయంలో వారు ఇవన్నీ గుర్తుపెట్టుకోగాలరా అని స్నిగ్ధకు ఆశ్చర్యంగా ఉండేది.
నిజమే, జీవితంలో మనం ఎన్నో మంచి విషయాల్ని నేర్చుకుంటాం, అర్ధం చేసుకుంటాం. కాని, ఇక్కడ అసలు చిక్కేమిటంటే, ఇవి ఆచరించాల్సిన సమయంలో మనం వాటిని పాటించము.
ఉదాహరణకి, ఒక బంధంలో, ఆమె నిష్కపటంగా ఉండడం కీలకమని, భాగస్వాముల మధ్య ఏదైనా నిర్మొహమాటంగా వెల్లడించడం బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ఆమె నేర్చుకుంది. వారిద్దరి మధ్య ఎటువంటి పరిస్థితులు వచ్చినా, వారు కేవలం చూసిన దాని ఆధారంగా, మరొకరిపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే ముందు, మనసువిప్పి మాట్లాడుకోవాలని, ఋషికి ఆమే చెప్పింది.
కాని, ఇప్పుడు ఋషి తనవైపు నుంచి సంజాయిషీని చెప్పుకునే అవకాశాన్ని తనెందుకు ఇవ్వట్లేదు ? దీనికి తగిన సమాధానం ఆమెవద్ద ఉన్నట్లు అనిపించలేదు.
విమానం టేక్ ఆఫ్ కు సిద్ధమయ్యింది. స్నిగ్ధ కిటికీలోకి చూసింది, అందమైన మాంచెస్టర్ యొక్క పచ్చని ప్రకృతి దృశ్యం ఆమెను మనసును ఆహ్లాదపరిచింది. లేక ఇదంతా తుఫాను వచ్చేముందు కలిగే నిశ్శబ్దమా, ఆమెకు ఏమీ తెలియలేదు.
ఋషి, కళ్ళు మూసుకునే ఉన్నా, నిజానికి నిద్రపోవట్లేదు. అతను కూడా గత కొన్ని రోజులుగా స్నిగ్ధతో జరిగిన విషయాలు ఎలా మలుపు తిరిగాయో, అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్నిగ్ధ భావనలను అతను అర్ధం చేసుకోగలడు, చిత్రాల పట్ల అతనికున్న మోహం పట్ల ఆమెకున్న సందిగ్ధం అర్ధవంతమైనదే అని అతనికి తెలుసు. అతను ఈ అస్పష్టతకు వీలైనంత త్వరగా తెర తియ్యాలని నిశ్చయించుకున్నాడు. అతను తన సీట్ సవరించుకుని, సౌకర్యంగా పడుకునేందుకు ప్రయత్నిస్తూ, నెమ్మదిగా ఆలోచనల్లో మునిగిపోయాడు. గత రెండేళ్లుగా జరిగిన సంఘటనలు అతని ఆలోచనల్లో వేగంగా కదిలాయి.
విమానం ప్రతి క్షణానికి పైపైకి ఎగురుతూ ఉండగా, అతని ఆలోచనలు విమానం వెలుపలి మేఘాల్లా ఉన్నాయి. క్రింది నుంచి అందమైన ఆకాశంలా కనిపిస్తున్నా, విమానంలో వాటిమధ్య నుంచి వెళ్తున్నప్పుడు దట్టమైన మబ్బుల్లా రూపాంతరం చెందినట్లు, ఆలోచనలు అతని మనసును ముసురుకుంటున్నాయి.
అతను కనులు మూసుకుని, తన ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించాడు.
*************
జనవరి 2, 2009 లండన్ ఐ పరిసరాలు...
“లండన్ అంటే విసిగిన వాడు జీవితం అంటే కూడా విసిగి ఉంటాడు అంటుంటారు, ఇది తమాషాకి అన్నది కాదు,” అన్నాడు ఋషి, మిష్టర్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రతినిధులతో లండన్ ఐ చూసేందుకు వెళ్తూ...
మిష్టర్ శర్మ బాంక్ ప్రైమ్ సూయిస్ కస్టమర్, ఋషి రిలేషన్ షిప్ మేనేజర్. మిష్టర్ శర్మ ప్రాక్టీసులో ఉన్న ఛార్టర్డ్ అకౌంటెంట్, హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రముఖ ఆడిట్ సంస్థలో భాగస్వామి. ఆయన ఇప్పుడు యు.కె. ప్రొఫెషనల్ టూర్ కు, దక్షిణ భారతం నుంచి వచ్చిన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రతినిధులకు అధ్యక్షత వహిస్తున్నారు. CA ఇన్స్టిట్యూట్ ఎప్పటికప్పుడు నిర్వహించే నెట్వర్కింగ్ కార్యకలాపాల్లో ఈ టూర్ ఒక భాగం.
ఈ టూర్ లో మిష్టర్ శర్మ తో పాటు 30 మంది CA లు వచ్చారు. వీరంతా మొదట తక్కువ సంబంధబాంధవ్యాలు కలిగినవారిగా కనిపించినప్పటికీ, వారి ప్రొఫెషనల్ నెట్వర్క్ యెంత విస్త్రుతమైనది అంటే, వారు దక్షిణ భారతంలో ఉన్న వాపారవేత్తలు, సినీరంగంలోని వ్యక్తులు, రాజకీయవేత్తలు వంటివారు ఎందరితోనో పనిచేసారు.
మిష్టర్ శర్మ బ్యాంకు ప్రైమ్ సూయిస్ కు పాత కస్టమర్, రెండేళ్ళ క్రితమే ఋషికి పరిచయం అయ్యారు. ఋషి, మిష్టర్ శర్మ ను కేవలం ఒక కస్టమర్ గా మాత్రమే పరిగణించక, ఆయన పరపతిని కొత్త క్లైంట్స్ కోసం వాడుకున్నాడు. మిష్టర్. శర్మ కు ఆయన క్లైంట్స్ కోసం ఒక “ఇన్వెస్ట్మెంట్స్ కన్సల్టింగ్ బిజినెస్ (పెట్టుబడుల సంప్రదింపుల వ్యాపారం) “ ఉంది, వారి వివరాలను ఋషికి అందిస్తూ ఉండేవారు.
తన బ్యాంకు కొత్తగా ఆరంభించిన ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ను వృద్ధిపరిచేందుకు ఋషి CA ల కోసం ఒక టూర్ ను ఏర్పాటు చేసాడు. ఆ రోజు ఋషి టీం లోని అందరికోసం ప్లాన్ చేసిన అతిపెద్ద ఆకర్షణ, లండన్ ఐ.
లండన్ ఐ థేమ్స్ నది ఒడ్డున ఉన్న 443 అడుగుల ఎత్తున్న ఫెర్రిస్ వీల్ ఉంది. ఇది 32 కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఎయిర్ కండిషన్డ్ సీల్డ్ పాసెంజర్ కేప్సూల్స్ ను కలిగి ఉంటుంది. పది టన్నులుండే ఒక్కొక్క కేప్సూల్ 25 మంది పడతారు, వీరు ఇందులోనే హాయిగా నడుస్తూ తిరగగలుగుతారు.
ప్రతినిధులంతా లండన్ ఐ యొక్క గ్లాస్ విండో నుంచి లండన్ నగరపు అందాలను తిలంకించడంలో బిజీ గా ఉన్నారు.
ఋషి వారికి వీల్ గురించి మరిన్ని అంశాలను వివరించసాగాడు, “ పారిస్ లోని ఐఫిల్ టవర్ లాగా, లండన్ లో ఉన్న ఈ వీల్ ఐ , నగరపు వైభవానికి ప్రతీకగా నిలుస్తూనే, ప్రజలు నగరం పైకి వెళ్లి, అందాలను తిలకించే అవకాశం ఇస్తోంది. కేవలం ప్రముఖులు లేక ధనవంతులకే కాక, ఈ అవకాశం అందరికీ దక్కుతుంది. ఇదే దీని ప్రత్యేకత; ఇది అందరికీ అందుబాటులో ఉంది, అదీ లండన్ నగరం నడిమధ్యలో ఉంది.”
“మిష్టర్ శర్మ, హైదరాబాద్ జీవితం ఎలా ఉంది ? అంతా బాగుందని భావిస్తున్నాను. ఈ వీల్ నుంచి కనిపించే అద్భుతమైన దృశ్యం మీకు నచ్చిందా ?” ఋషి నెమ్మదిగా సంభాషణ మొదలుపెట్టాడు.
“ఎస్ మిష్టర్ ఋషి, ఇటువంటి ఒక వీల్ ను హైదరాబాద్ లో ఎందుకు నిర్మించకూడదూ, అని నేను ఆలోచిస్తున్నాను. ఈ విషయం గురించి పర్యాటక మంత్రాంగం తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది నగరానికి, దేశానికి కూడా గొప్ప ఆదాయాన్ని తెచ్చే అవకాశం అవుతుంది.”
“మీరన్నది నూటికి నూరుపాళ్ళు నిజం మిష్టర్ శర్మ,” బదులిచ్చాడు ఋషి, “2000వ సం. నుంచి లండన్ ఐ పట్ల పర్యాటకుల ఆకర్షణ చూసిన చైనా వారు, 2006 లో ‘స్టార్ ఆఫ్ నాన్ చాంగ్ ‘ అనే వీల్ ను నిర్మించగా, అదేవిధమైన వీల్ ను సింగపూర్ లో 2008 లో ఏర్పరిచారు. ఒకసారి నేను ముంబై లో ఇటువంటిదే నిర్మించాలని అనుకోవడం విన్నాను, తర్వాత దాని గురించిన తాజా సమాచారం నాకు తెలీదు.”
“CA ఇన్స్టిట్యూట్ యొక్క హైదరాబాద్ బ్రాంచ్ లో నేను ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పై ఒక రెండు రోజుల ఆడిట్ ను నిర్వహించాబోతున్నాను. నేను దీనికి రాష్ట్ర పర్యాటక మంత్రిని, కొత్తతరం పెట్టుబడిదారులతో చర్చించేందుకు ఆహ్వానించాను. అప్పుడు వారు ఈ అంశంపై చొరవ తీసుకునేలా ఈ ఐడియా ను వారికి తెలియచేసేందుకు ప్రయత్నిస్తాను.”
“ఇది చాలా మంచి ఆలోచన, విశేషించి, పర్యాటక మంత్రాంగం బ్రాండ్ హైదరాబాద్ ను నిర్మించి, దాన్ని దక్షిణ భారతపు సాంస్కృతిక కేంద్రంగా మలచాలని కృషి చేస్తున్నప్పుడు, ఇది బాగా ఉపయోగిస్తుంది. స్థానిక వ్యాపారవేత్తలతో భాగస్వామ్యం ద్వారా, ఈ ప్రపంచస్థాయి ఆకర్షణలు మన స్వంత నగరాల్లో ఏర్పరచుకోవడం అనేది, ఎంతో దూరంలో లేదు, అని నేను భావిస్తున్నాను,” అన్నాడు ఋషి, మిష్టర్.శర్మ ప్రతిపాదనతో ఏకీభవిస్తూ.
మిష్టర్ శర్మ ఈ చర్చలో చాలా ఆసక్తికరంగా పాల్గొంటున్నట్లు కనిపించారు. “నిజమే, ఈ విధమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లు ,కార్పొరేట్ వారి సహకారంతోనే సాధ్యం. ఉదాహరణకు, ఈమధ్యనే ప్రభుత్వం “ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ” ప్రపంచస్థాయి మ్యూజియం ను నిర్మించి, భారతీయ చిత్రకళను ప్రదర్శించేందుకు గానూ ఒక మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నిర్వాణా ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీ CEO , మహేంద్ర దసపల్లా ఈ ప్రాజెక్ట్ ను పర్యవేక్షిస్తున్నారు. “
ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం గురించి వినగానే ఋషి కళ్ళు నిశ్శబ్దంగా వెలిగాయి. టూరిస్ట్ గైడ్ గా తాను ఎత్తిన ఈ కొత్త అవతారం తనకు గొప్ప లాభాలను ఆర్జించి పెడుతుందని అతను అనుకున్నాడు. ఇప్పుడు అతనికి మిష్టర్ శర్మ ద్వారా మహేంద్ర ను కలిసి, మరొక క్లైంట్ ను ఆర్జించుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికై అతడు కొంతకాలంగా వేచిఉన్నాడు. కాని, అతడు తన మనోభావాలు వెంటనే మిష్టర్ శర్మ కు వెల్లడించదల్చుకోలేదు.
“ మిష్టర్ శర్మ, మనం ఇప్పుడు హోటల్ కు వెనక్కి వెళ్దాము. మీ టీం అంతా ఇవాళ ఆనందించారని, నేను భావిస్తున్నాను. రేపు మీకు మరిన్ని కార్యక్రామాలు ఉన్నాయని నాకు తెలుసు. అందుకే, మీ అందరికీ విశ్రాంతి అవసరం. నేను రేపు సాయంత్రం సమావేశంలో మిమ్మల్ని కలుస్తాను,” అంటూ ఋషి ప్రతినిధులను హోటల్ కు వెనక్కి తీసుకువచ్చాడు.
*****
మర్నాడు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఋషి ప్రతినిధులను హోటల్ కాన్ఫరెన్స్ రూమ్ లో కలిసాడు. వారంతా సమావేశం అయ్యాకా, అతను వారిని మరొక గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో రెండున్నర గంటల ‘వైన్ టేస్టింగ్ సెషన్’ కు అనువైన ఏర్పాట్లు చెయ్యబడ్డాయి. ఆరోజు ఋషి లక్ష్యం వారికి కేవలం వినోదం కల్పించడం మాత్రమే కాదు. అతని మనసులో ఒక వ్యాపార ప్రతిపాదన ఉంది. కప్ కాఫీ తో మాత్రమే కాదు, మద్యం వల్ల కూడా ఎన్నో పనులు జరుగుతాయని అతనికి బాగా తెలుసు.
“హలో ఫ్రెండ్స్, రాబోయే రెండున్నర గంటలు మిమ్మల్ని వైన్ ప్రపంచంలోకి తీసుకువెళ్తాను. మీరంతా ఈ సెషన్ ను ఆస్వాదిస్తారని నా నమ్మకం. జీసస్ మొదట, ఒక వివాహ వేడుకలో వైన్ కొరత తీర్చేందుకు నీటిని వైన్ గా మార్చి, అద్భుతం చేసారు అంటారు. హిందూ దేవతలు కూడా సోమరసాన్ని(అమృతాన్ని) త్రాగుతారు. అందుకే, వైన్ తాగడం అన్న అంశానికి, వేల శతాబ్దాల చరిత్ర ఉంది.
మనమంతా వైన్ త్రాగుతాము. కాని దానిలోని వెరైటీ ల గురించి, నాణ్యతను గుర్తించడం గురించి, గ్లాస్ చేతిలోకి తీసుకున్న దగ్గరనుంచి అనేకవిధాలుగా పరిశీలిస్తూ, త్రాగే పద్ధతిని గురించి మీరు తెలుసుకుంటే, వైన్ రుచిని నిజంగా ఆస్వాదించగలుగుతారు. ఈ సెషన్ లో మీకు మీ టేబుల్ పై ఉన్న 8 వైన్ రకాలలో ఐదింటిని ఎంచుకునే అవకాశం ఉంది. వాటిని మీరు రుచి చూస్తూ ఉండగా, నేను మీకు వైన్ నాణ్యతను తెలిపే అంశాలను వివరిస్తాను...” అన్నాడు ఋషి.
ఆ సెషన్ అందరికీ బాగా నచ్చింది. అతను చెప్పే ఒక్కొక్క అంశం వారికి ఎంత ఆసక్తికరంగా ఉందంటే, వారు పూర్తిగా దానిలో నిమగ్నమై ఆనందించసాగారు. అన్ని రకాల వైన్లు రుచి చూడడం పూర్తయ్యాకా, ఋషి తన సంభాషణను ఇలా కొనసాగించాడు.
“పాత చిత్రాల సేకరణ లాగానే, ఎంతోమంది తమ ప్రైవేట్ బార్స్ లో అరుదైన వైన్ బాటిల్స్ ను సేకరించి పెట్టుకోవడం ఒక హాబీగా భావిస్తారు. పెయింటింగ్స్ లాగానే, పాతబడే కొద్దీ వైన్ బాటిల్ విలువ కూడా పెరుగుతుంది. కనుక, వైన్ మీకు మ్యూట్యువల్ ఫండ్ లేక షేర్ తో సమానమైన లాభాలను ఆర్జించి పెట్టగలదు. కాని ఏ బాటిల్ కొనాలో, ఎంతకు కొనాలో, ఎలా దాచాలో, ఎప్పుడు అమ్మాలో మీకు తెలియాలి. అందుకే పెట్టుబడుల కోసం ప్రముఖుల ‘అసెట్ మేనేజర్’ మీద ఆధారపడుతూ ఉంటారు. అలాగే వైన్ పెట్టుబడులకై ‘వైన్ అసెట్ మేనేజర్ ‘ పై ఆధారపడవచ్చు. ఫ్రెండ్స్, ఈ సందర్భంలో నేను మీ ముందుకు ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ను తీసుకువస్తున్నాను, దీన్ని మీరు మీ ఇండియన్ కస్టమర్స్ కు వివరించవచ్చు. ఇది స్కాట్లాండ్ లోని నెం. 2 వైన్ యార్డ్ ద్వారా నిర్వహించబడుతున్న వైన్ ఫండ్. వైన్ ఫండ్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వివిధ పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను, అనేక ప్రాంతాల్లోని టాప్ వైన్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వారి పెట్టుబడుల పురోగతిని గురించి వారికి ఎప్పటికప్పుడు తెలియచేస్తారు. ఫండ్ కాలపరిమితి పూర్తి కాగానే, వైన్ ను మార్కెట్ లో అమ్మి, కంపెనీ అధికారులు, లాభాలను అసలుతో సహా పెట్టుబడిదారులకు పంచేస్తారు. “ అంటూ ఋషి వారికి వైన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురించిన ప్రేసేంటేషన్ ను చూపాడు. ఇది బ్యాంకు తన హై ఎండ్ క్లైంట్స్ కోసం అందించే ప్రోడక్ట్. ఋషి ఈ ప్రోడక్ట్ కు సేల్స్ మేనేజర్. CA ల ద్వారా భారత్ లోని పెట్టుబడిదారులను చేరి, తన బిజినెస్ టార్గెట్ ను పూర్తిచెయ్యాలని, అతని లక్ష్యం. ప్రముఖులంతా పెట్టుబడులకు తమ CA లపై ఆధారపడతారని అతనికి బాగా తెలుసు. సెషన్ రాత్రి 9 గం. దాకా కొనసాగింది, పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారి క్లైంట్స్ ను ఒప్పించేందుకు తగిన మెటీరియల్ ఇవ్వబడింది. వారు తీసుకువచ్చే ప్రతి క్లైంట్ కు గానూ, వారికి అందే కమిషన్ గురించి కూడా ఋషి వారికి చెప్పాడు. చివరగా ఋషి వారిని ఫీడ్ బ్యాక్ అడిగి, ఈ విషయంగా వారిని తిరిగి సంప్రదించేందుకు CA ల వివరాలను తీసుకున్నాడు. CA లు అంతా ఋషికి, బ్యాంకు వారికి, తెలిపారు.
“సెషన్ చాలా ఆసక్తికరంగా నడిచింది, అందరూ ఈ ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ కొరకు వారి క్లైంట్స్ ను ఒప్పించాగలరన్న నమ్మకం నాకుంది, కృతఙ్ఞతలు ఋషి,” అన్నారు మిష్టర్ శర్మ.
“ ప్లెషర్ ఇస్ అల్ మైన్... మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మిష్టర్ శర్మ. మహేంద్ర దసపల్లా ను నాకు పరిచయం చెయ్యమని, మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను. ఆయన మా బ్యాంకు క్లైంట్ అవగలరేమో ప్రయత్నించాలి. ఆయనతో మీకు మంచి సంబంధం ఉందని, నాకు తెలుసు “ అన్నాడు ఋషి.
ఋషి పరిచయాన్ని నెట్వర్క్ గా మార్చుకునే అవకాశాన్ని అతను ఎప్పుడూ వదులుకోడు. , అతను కలిసిన ప్రతి ప్రొఫెషనల్ ను కేవలం ఒక వ్యక్తిగా కాక, అతనికున్న నెట్వర్క్ కు ప్రతినిధిగా భావిస్తాడు. ఒక వ్యక్తితో పరిచయం చేసుకుంటే, వారి నెట్వర్క్ అంతా నీదే – అనే సిద్ధాంతాన్ని అతను బలంగా నమ్ముతాడు.
మిష్టర్ శర్మ మహేంద్రను పరిచయం చేస్తానని చెప్తూ, మనసులో తాన క్లైంట్స్ ను వైన్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడి పెట్టేలా చేసినందుకు, తనకు రాబోయే కమిషన్ ను అంచనా వేసుకోసాగాడు. ఋషి ఆయనకు కృతఙ్ఞతలు చెప్పి, అందరికీ వీడ్కోలు పలికి, హోటల్ నుంచి వెళ్ళిపోయాడు.
*********
ఋషి CA లను UK స్టడీ టూర్ లో కలిసి, రెండు నెలలు కావస్తోంది.
అతను ఇప్పుడు సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా లండన్ ఆఫీస్ నుంచి మాంచెస్టర్ శాఖకు మారాడు.
“ఋషి, నీవు పది నిముషాల్లో నా కాబిన్ కు రాగలవా ?” అంటూ కాల్ చేసాడు విలియం స్కాట్, ఋషి బాస్.
“ఋషి, ఈ నెల టార్గెట్ కు గాను నీవు చేసిన అద్భుతమైన కృషిని మెచ్చుకునేందుకు నేను నిన్ను పిలిచాను. నీ వైన్ ఫండ్ టార్గెట్ ను అధిగమించావు, కంగ్రాట్స్, “ అన్నాడు విలియం స్కాట్, తన కళ్ళు సీనియర్ క్లైంట్ బ్యాంకర్స్ నెలవారీ సేల్స్ ను పరిశీలిస్తుండగా. మాంచెస్టర్ శాఖ సాధించిన విజయాల్లో ఋషి పాత్ర ఒక మైలురాయి వంటిది అయినందుకు ఆయన ఆనందంగా ఉన్నారు.
మిష్టర్ స్కాట్ ను హెడ్ ఆఫీస్ వారు గత రెండు నెలలుగా వైన్ ఫండ్ ప్రోడక్ట్ ను వృద్ధిపరచమని పదేపదే వెంటాడుతున్నారు. రెసిషన్ సమయం కావడంవల్ల, అతనికి హై ఎండ్ క్లైంట్స్ ను వ్యాపార నిమిత్తం కలిసేందుకు చాలా కష్టమయ్యింది.
కాని, ఋషి, CA ల తో గత కొన్ని వారాలుగా వృత్తిపరమైన సంబంధాలు పెంచుకుని, వారి రిఫెరల్స్ ద్వారా ఇండియన్ క్లైంట్స్ ను సంపాదించగలిగాడు. ప్రతి CA తన క్లైంట్ ను వైన్ ఫండ్ లో పెట్టుబడులకు ఒప్పించడంతో ఋషి తన బిజినెస్ టార్గెట్ ను సాధించగలిగాడు.
“ఇందుకై మనం ఘనంగా వేడుకలు చేసుకోవాలి కదూ, ఋషి ?” అన్నాడు స్కాట్.
ఋషి వైన్ ఫండ్ కమిట్మెంట్ గురించి తెలుసుకుని, తన బాస్ ఆశించినదాన్ని పూర్తిచెయ్యగలిగినందుకు చాలా సంతోషించాడు. సేల్స్ టార్గెట్ ను చేరేలా క్రింది ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చే విషయంలో స్కాట్ చాలా కఠినంగా ఉంటాడు.
“వైన్ ఫండ్ లక్ష్యాన్ని సాధించినందుకు వేడుకలు చేసుకునేందుకు నాకేమీ అభ్యంతరం లేదు స్కాట్. కాని, మన శాఖ కోసం వైన్ ఫండ్ ను సాధిస్తే, మీరు నాకు చేసిన ప్రమాణం మీకు గుర్తుందని అనుకుంటున్నాను.”
“ గుర్తుంది ! ఈ విషయంలో నువ్వేమీ చింతించకు. నేను ప్రోడక్ట్ టీం లో ఉన్న చార్లెస్ తో మాట్లాడి, నీకు ఆర్ట్ ఫండ్స్ ను కూడా అమ్మే టార్గెట్ నీకు దక్కేలా చూస్తాను.” బదులిచ్చాడు స్కాట్.
వైన్ ఫండ్స్ లాగానే ఆర్ట్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్. ఇందులోని పెట్టుబడులు ఆర్ట్ లోని మాస్టర్ పీసెస్ పై ఉండి, ప్రొఫెషనల్ ఆర్ట్ గేలరీ లు, ఆర్ట్ డీలర్ల ద్వారా నిర్వహించబడుతూ, బ్యాంకుల వంటి ఆర్ధిక సంస్థల ద్వారా పంపిణీ చెయ్యబడతాయి. విశ్వవ్యాప్తంగా వైన్ ఫండ్ మార్కెట్ లాగానే, ఆర్ట్ ఫండ్ మార్కెట్ కూడా నెమ్మదిగా పెంపొందుతోంది.
ఋషి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహేంద్ర దసపల్లా ద్వారా ఏర్పాటు చెయ్యబోతున్న ఆర్ట్ మ్యూజియం గురించి తెలిసినప్పటి నుంచి, ఆర్ట్ ఫండ్ మార్కెట్ లో స్థానం పొందేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాడు. అతను స్కాట్ ను ఆర్ట్ ఫండ్ పంపిణీ తనకు ఇప్పించమని కోరుతున్నాడు.
అతనికి మహేంద్ర ను కలవాలని, అతని తన బ్యాంకు క్లైంట్ గా మార్చాలని ఉంది. అది తన అమ్ములపొదిలో ఒక అస్త్రం అవుతుందని అతనికి తెలుసు. అందుకే అతను ఓపిగ్గా పావులు కదుపుతున్నాడు. మొదట అతను వైన్ ఫండ్ పంపిణీ ద్వారా స్కాట్ నమ్మకాన్ని గెల్చుకున్నాడు, మిష్టర్ శర్మ తో సంబంధాలు పెంపొందించుకున్నాడు, చివరికి మహేంద్ర సామ్రాజ్యాన్ని చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.
“ఆర్ట్ ఫండ్ అనేది, పూర్తిగా వేరే ఆట ఋషి. మనం ప్రోడక్ట్ ను మరింత నిశితమైన పద్ధతిలో చేరాలి, ఇందుకోసం నువ్వు మొదట ఆర్ట్ మార్కెట్ స్పేస్ కు సంబంధించిన శిక్షణ పొందాలి. కాబట్టి, ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించిన కనీస జ్ఞానం పొందడం కోసం మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ వంటి ఆర్ట్ గేలరీ లను సందర్శించడంపై దృష్టి పెట్టు,” అంటూ ఋషికి సలహా ఇచ్చాడు స్కాట్.
ఋషి ఇది విని ఆనందించాడు. స్కాట్ కు కృతఙ్ఞతలు చెప్పి, వెళ్ళిపోయాడు.
******
రాత్రి పదకొండయ్యింది. ఋషి భోజనం ముగించుకుని, హెడ్ ఆఫీస్ లో సమర్పించాల్సిన ‘మంత్లీ పెర్ఫార్మన్స్ నోట్’ ను తయారుచేయసాగాడు. అది దాదాపుగా పూర్తిచేసి, ఆర్ట్ మార్కెట్ ను గురించిన మరింత సమాచారం కోసం ఋషి ఇంటర్నెట్ బ్రౌస్ చెయ్యసాగాడు.
మొదట అతను మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ వెబ్సైటు ను చూసాడు. అందులోని సమాచారం ద్వారా అతను ఆర్ట్ మార్కెట్ లో ఉన్న సూక్ష్మమైన వ్యత్యాసాల్ని అర్ధం చేసుకోగలిగాడు. అతను వెబ్ నుంచి ఆర్ట్ ను ప్రత్యామ్నాయ పెట్టుబడి విధానంగా వాడేందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని సంగ్రహించాడు.
మరింత బ్రౌస్ చేసాకా,అతను తన ఫేస్బుక్ ఎకౌంటు లోకి లాగ్ ఇన్ అయ్యాడు. తన పాత స్కూల్ మిత్రులను కలిసేందుకు సహకరించింది కనుక, అతనికి ఫేస్బుక్ అంటే ఎక్కువ ఇష్టం. ఏ వ్యాపార ప్రతిపాదనైనా ఆరంభించే ముందు, ఏవైనా సంబంధబాంధవ్యాలకు అవకాశం ఉందేమో అని చూడడం అతనికి అలవాటు.
నిజానికి, అతను మొదట మిష్టర్. శర్మ ను ఫేస్బుక్ ద్వారానే కలుసుకోగలిగాడు. అతను ఫేస్బుక్ లో CA ఇన్స్టిట్యూట్ లింక్స్ కోసం బ్రౌస్ చేస్తూ, హైదరాబాద్ నుంచి వారు స్టడీ టూర్ కై లండన్ వస్తున్న విషయం తెలుసుకున్నాడు.
అతని చేతులు ఇప్పుడు మౌనంగా ‘ఫ్రెండ్ ఫైండర్’ ఆప్షన్ ను వాడడం మొదలుపెట్టాయి. అతను మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ కు సంబంధించిన గ్రూప్ లకై వెతకసాగాడు.
కొన్ని క్షణాల అన్వేషణ తరువాత, అతను గేలరీ కు సంబంధించిన కొంతమంది ఉద్యోగుల జాబితాను తయారుచేసాడు. గేలరీ లో తాను సంప్రదించతగిన భారతీయుల పేర్ల కోసం శోధిస్తూ, అతను మరికొంత సమయం గడిపాడు.
కొన్ని క్షణాల్లో, అతను బ్రౌస్ చేస్తున్న ఫేస్బుక్ పేజి పై ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటోను చూసి, అతను కొద్ది క్షణాలు రెప్ప వెయ్యటం మరిచిపోయాడు.
ఋషి దృష్టిని ఆకర్షించిన ఫోటోలో ఉన్న స్త్రీ , ఏదో పుస్తకం చదివేందుకు, ఒకవైపుకు తిరిగినట్లుగా ఉంది. ఒక ప్రక్కనుంచి మాత్రమే కనిపిస్తున్న ఆమె చక్కటి వదనాన్ని, ఆమె బుగ్గల ఎర్రదనం అధిగమిస్తోంది. అది ఆమె వేసుకున్న గులాబి రంగు డ్రెస్ వల్ల మరింత ఇనుమడిస్తోంది. ఫోటోను ముదురు రంగు బాక్గ్రౌండ్ లో తియ్యటం వల్ల, ముఖం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆమె ముక్కుపుడక, ఆమె అందాన్ని మరంత పెంచింది. ముక్కుపుడకపై పడిన కెమెరా ఫ్లాష్ ఫోటోలో చాలా అందంగా కనిపిస్తోంది. కాని, ఆమె చిరునవ్వు ముందు ఇవన్నీ వెలవెలబోతున్నాయి. మతిపోగోట్టేలా ఉన్న ఆమె చిరునవ్వు చూసి, ఋషి విస్మయం చెందాడు. తెలియని పారవశ్యంలో ‘ఆడ్ ఫ్రెండ్’ బటన్ నొక్కాడు.
పిల్లలు ఫోటోలలో అందంగా కనిపిస్తారని అంటుంటారు. కారణం చాలా తేలిగ్గా చెప్పచ్చు – వాళ్ళు ఫొటోజెనిక్ గా ఉండేందుకు తగిన సూచనలన్నీ పరాకుగా పాటించేస్తారు. వాళ్ళు ప్రశాంతంగా, ఎటువంటి దిగులూ లేకుండా, ఆడుతూ వారు చూపే హావభావాలలో స్వచ్చంగా కనిపిస్తారు. అందుకే ఫోటోలకు సంబంధించిన ఉత్తమ పోస్ లు ఏవంటే, మనలోని పసిపాపను బయటికి తెచ్చేవే !
ఫొటోజెనిక్ ఫేస్ ఉన్నవారు సరదాగా, సంకోచాలు లేకుండా, సంతోషంగా తనలోని ఆనందమయ కోణాన్ని ఆవిష్కరించేవారు అయ్యిఉంటారు. ఋషి చూస్తున్న ప్రొఫైల్ పిక్చర్ లోని స్త్రీ, ఫొటోజెనిక్ ఫేస్ కు ఉండాల్సిన అర్హతలనన్నింటినీ కలిగిఉంది. అది ఋషి ఆమె పూర్తి ప్రొఫైల్ ను చూసేలా చేసింది.
ఆమె పేరు స్నిగ్ధ, ప్రస్తుతం మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ లో ఇంటర్న్ గా పనిచేస్తోంది.
******
“ స్నిగ్ధ గుప్త, వయసు 24 ఏళ్ళు, పుట్టుకరీత్యా భారతీయురాలు, ఆర్ట్ బిజినెస్ లో మాస్టర్స్, ప్రస్తుతం మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ లో ఇంటర్న్ గా పనిచేస్తోంది, “ అంటూ చేతిలో ఉన్న రెస్యూమ్ చూస్తూ చదివాడు మహేంద్ర.
ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం ప్రాజెక్ట్ లో తనకు సహకరించేందుకు గానూ, మహేంద్ర దసపల్లా ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అతనికి తోడుగా నగరంలోని ప్రఖ్యాత ఆర్ట్ డీలర్ అయిన ‘అప్సర పండిట్’ ఉంది.
“ఎస్ సర్, గుడ్ మార్నింగ్, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది,” , అంది స్నిగ్ద చక్కగా నవ్వుతూ, అలా నవ్వటం ఆమెకు సహజంగా అలవడింది. “గుడ్ మార్నింగ్ మామ్ ,’ అంటూ ఆమె అప్సరను కూడా పలకరించింది.
తన మనసుకు చాలా నచ్చిన ప్రాజెక్ట్ కనుక, ఇటీవల వరకూ అన్ని వ్యవహారాలు మహెంద్రే చూసుకోసాగాడు. అది భారతీయత సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే 500 భారతీయ కళాఖండాల సేకరణకు సంబంధించిన .500 కోట్ల మెగా ప్రాజెక్టు. ఈ చిత్రాలను గతంలో విశ్వవిఖ్యాతులైన భారతీయ చిత్రకారులు చిత్రీకరించారు.
అనేక సందర్భాల్లో వీటిని ‘జాతీయ చిత్రకళా నిధులు’ గా వెల్లడించారు. కాని బ్రిటిష్ పాలనా సమయంలో వీటిలో చాలావరకూ దేశం దాటి వెళ్ళిపోయాయి. వీటిని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అందుకోసమే, ఈ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ వారు స్వీకరించి, ప్రస్తుతం మహేంద్రను చైర్మన్ గా నియమించారు. ఇది ఒక కొత్త ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని ప్రోత్సహించి, అన్ని రాష్ట్రప్రభుత్వ పెద్ద ప్రాజెక్ట్ లకు ఇదే మార్గాన్ని అవలంబిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి, మహేంద్ర వ్యక్తిగతంగా అనేక గంటలపాటు శ్రమించి, మ్యూజియం కై ఎంచుకున్న ప్రతి కళాఖండం అసలైనదేనని, ఆర్ట్ మ్యూజియం ప్రతిష్టను ఇనుమడింపచేసేదని, నిర్దారించుకునేవాడు. వృత్తిపరంగా, అతనికొక ‘నేషనల్ ఐకాన్’ గా ప్రభుత్వ, వ్యాపార సంబంధికులలో గుర్తింపును తెచ్చే ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది.
దీనికోసం అతను అన్ని ప్రధాన ఆర్ట్ ఫెయిర్ లకు ప్రయాణించాలి. చివరికి, అతను తన ఆఫీస్ మాంచెస్టర్ లో ఉంటే బాగుంటుందని ఆలోచించాడు. త్వరలోనే అది ప్రతిపాదించిన ఆర్ట్ మ్యూజియం కు ఓవర్సీస్ హబ్ గా మారింది.
తన విస్తృతమైన ఆర్ట్ కు సంబంధించిన వ్యాపార వ్యవస్తానాలతో లండన్ ఆర్ట్ కొరకు ఒక అంతర్జాతీయ కేంద్రంగా నెలకొంది. కాని, మహేంద్రకు లండన్ లో ఉండడం ఇష్టంలేదు.
మాంచెస్టర్ యూనివర్సిటీ యొక్క ఆలమ్ని అసోసియేషన్ ఇండియన్ వింగ్ కు అతను చైర్మన్. అందుకే అతను మాంచెస్టర్ లో ఆఫీస్ ఉంటే మంచిదని భావించాడు. ఈ ఆఫీస్ ద్వారా, అతను మాంచెస్టర్ లోని తన ఆలమ్ని అసోసియేషన్ పనుల్ని, లండన్ లో ఆర్ట్ డీల్స్ ను పూర్తిచేసే పనుల్ని ఒకేసారి చూసుకోవచ్చని, భావించాడు.
ఈ ఆఫీస్ నిర్వహణ వ్యవహారాల్లో మృణాల్ దేశ్ పాండే అతనికి పూర్తిగా సహకరిస్తున్నాడు. ఆర్ట్ మ్యూజియం కు తగిన అరుదైన భారతీయ చిత్రాల గుర్తింపులో ఆర్ట్ డీలర్ అయిన అప్సర పండిట్ అతనికి సాయం చేస్తోంది.
ఒక చిత్రానికి యెంత వెల చెల్లించవచ్చు అనేది, సేకరించిన వారిని బట్టి మారుతూ ఉంటుంది. ఎందుకంటే చిత్రాల సేకరణ అనేది, ఆ వ్యక్తియొక్క కళాత్మక దృక్పధాన్ని బట్టి, ఉన్నతమైన భావనలను బట్టి ఉంటాయి.
సరిగ్గా, ఇక్కడే ఆర్ట్ డీలర్ ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తారు – ఈ అభిరుచికి సంబంధించిన అంశాలను అవగతం చేసుకుని, వృత్తిపరంగా ఎంతో విలువైన ఆర్ట్ మార్కెటింగ్ చైన్ మొత్తాన్ని వీరు నిర్వహిస్తారు. ఆర్ట్ డీలర్స్, ఆర్ట్ కు సంబంధించిన అన్ని లావాదేవీలు జరిగే వ్యాపార కేంద్రాలైన- స్థానిక ఆక్షన్ హౌస్ లతో సంబంధాలు కలిగిఉంటారు.
అంతర్జాతీయంగా గుర్తింపును పొందిన ఆర్ట్ హౌస్ లు రెండు ఉన్నాయి – క్రిస్టీస్ ఇంకా సౌత్ బే – ఇవి కలిసికట్టుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా జరిగే ఆర్ట్ కు సంబంధించిన వేలాల్ని స్వాధీనం చేసుకుంటాయి. ఈ 300 బిలియన్ల USD ని నిర్వహించేందుకు తగిన మానవ వనరులు సమకూర్చడం కోసం సౌత్ బే ఆక్షన్ హౌస్ లండన్, సింగపూర్, US లలో ఆఫీస్ లు ఉన్న ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పరిచింది.
స్నిగ్ధ ఈ సంస్థ యొక్క లండన్ కేంద్రంలో మాస్టర్స్ ను పూర్తి చేసి, ఈ కోర్స్ యొక్క చివరి సర్టిఫికేషన్ ప్రక్రియలో భాగంగా మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ లో ఇంటర్న్ గా పనిచేస్తోంది.
ఈ శిక్షణ మలిదశకు చేరుకోవడంతో, ఒక స్థానిక వార్తాపత్రికలోని ప్రకటన ఆధారంగా, ఆమె మహేంద్ర యొక్క మాంచెస్టర్ శాఖలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసింది.
మహేంద్ర ఇన్నాళ్ళూ, మృణాల్ మరియు అప్సర సాయంతో ఆఫీస్ పనిని చూసుకునేవాడు. కాని, హైదరాబాద్ లో ఉన్న అతని సాఫ్ట్వేర్ సంస్థ తాజాగా వృద్ధిచెందింది. అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలకు చెందిన ఎన్నో మెగా ప్రాజెక్ట్ లను స్వీకరించసాగాడు. అది ఈ మధ్య అతన్ని చాలా బిజీ గా ఉంచుతోంది. అందుకే మాంచెస్టర్ ప్రాజెక్ట్ ఆఫీస్ పై అతను సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నాడు.
అనుకున్న 500 ఆర్ట్ వర్క్స్ లలో ఇప్పటివరకు వారో కేవలం 150 కళాఖండాలను మాత్రమే అనేక ఆర్ట్ ఫెయిర్ ల నుండి, ఆక్షన్ హౌస్ ల నుండి కొనుగోలు చెయ్యగలిగారు. మిగిలిన కళాఖండాల ఎంపికకు తగిన సమయం లేకపోవడంతో మహేంద్ర ఇందులో వ్యక్తిగతంగా పాలుపంచుకోలేకపోతున్నాడు.
మహేంద్ర నుంచి ఈ వ్యాపార కార్యకలాపాలను స్వీకరించడం కోసమే స్నిగ్ద ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆర్ట్ మ్యూజియం ప్రారంభోత్సవం త్వరలోనే జరుగుతుందని ప్రకటించడం వల్ల, అతను ఇది ఎంతో కీలకమైనదని భావించాడు.
“ ఆర్ట్ మార్కెట్ ను నీ వృత్తిగా స్వీకరించేలా నీకు ప్రేరణ కలిగించిన అంశం ఏమిటి ?” బ్లాక్ కాఫీ తాగుతూ అడిగాడు మహేంద్ర. అతను ఆమెకు కూడా బ్లాక్ కాఫీ అందించాడు. స్నిగ్ద కాఫీ ఇచ్చినందుకు వినయంగా కృతఙ్ఞతలు తెలిపి, “సర్, నా దృష్టిలో ఆర్ట్ అనేది ఒక సమాచార మాధ్యమం – ఒక దృశ్య సమాచారం. ఒక అందమైన ప్రకృతి దృశ్యం ఒక కవి కలాన్ని కదిలించినట్టు, ప్రశాంతమైన జలపాత ధ్వని, ఒక సంగీతకారుడికి ప్రేరణ కలిగించినట్లు, ఒక ఆర్టిస్ట్ తెల్ల కాగితంపై తన ఆలోచనలను, భావాలను కుంచెతో ఆవిష్కరిస్తాడు. అనంతమైన భావాలను వ్యక్తపరిచేందుకు చిత్రకళ ఒక మాధ్యమం. “
ఆమె బదులిస్తూ, వారి ముఖాల్లోని భావాల్ని చదివేందుకు అప్సర, మహేంద్ర వంక చూసింది. ఆమె అప్సర చాలా ఆకర్షణీయంగా ఉందని, ఆమె దుస్తులు ఆమె ఆకృతికి వన్నె తెచ్చాయని, గమనించింది.
“ఒకరు తమను తాము స్వేచ్చగా ఆవిష్కరించుకునే గొప్ప చికిత్సకారిగా చిత్రకళ పనిచేస్తుంది, దీన్ని అద్భుతమైన వ్యాపకంగా కూడా మార్చుకోవచ్చు. ఒక చిత్రం మమతను సృష్టించగలదు, లోలోపల అలజడిని సృష్టించగలదు లేక ఒకరి జీవితంలో ఆనందాన్ని నింపగలదు. నావరకు చిత్రాలను, చిత్రకళను చదవడం అనేది, మనిషి జీవితాన్ని కళాత్మకమైన దృష్టితో చదవడం. “ తేల్చి చెప్పింది స్నిగ్ధ.
ఆమె స్పందన మహేంద్రను మెప్పించింది. అభిరుచి, వృత్తితో కలిసిన చోట ఒక వ్యక్తి చూపే అంకితభావం నాణ్యమైన ఫలితాల్ని ఇస్తుందని, అతని నమ్మకం. స్నిగ్ధ కు పనిపట్ల ఆ మక్కువ ఉందని అతను తెలుసుకున్నాడు.
“నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రాజెక్ట్ కోసం నీకు కావలసిన కీలకమైన అర్హతలేమిటో నీకు తెలుసా ?” అడిగింది అప్సర జోక్యం కల్పించుకుంటూ.
“మేడం, భారత చరిత్రలోనే ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ మొట్టమొదటి అరుదైన ప్రాజెక్ట్ అని నాకు తెలుసు. అంతర్జాతీయ ఆర్ట్ మ్యూజియం లతో పోటీపడేలా ఒక ఆర్ట్ మ్యూజియం ఏర్పరచి, హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకు ఇదొక ప్రయత్నం. ఇది సఫలం కావాలంటే, కేవలం సేకరణకారుల వద్దనున్న భారతీయ కళాఖండాలను కలిగిఉండడం మాత్రమే కాదు, అవి భారతీయ సంస్కృతిని, చరిత్రను ప్రతిబింబించేలా కూడా చూసుకోవాలి. ముఖ్యంగా మనం మ్యూజియం లో చిత్రాలను ఉంచేముందే, అవి అసలైన చిత్రాలని నిర్ధారించాలి.”
మహేంద్ర స్నిగ్ధ చెప్పింది విని, ఉత్సుకతతో కాస్త ముందుకు జరిగాడు. ఒక గమ్మత్తైన చిరునవ్వుతో స్నిగ్ధను ఇలా ప్రశ్నించాడు.
“చిత్రాలు అసలైనవో కాదో నువ్వు ఎలా నిర్దారిస్తావు ?”
ఆర్ట్ ప్రపంచంలో ఆర్ట్ ఫోర్జరీ లు అనేవి అతి సాధారణమైన మోసాలు. కళాఖండాల విషయంలో మోసాలకు గురయ్యే అవకాశాలు మూడు.
మొదటిది, అసలు చిత్రకారుడు వేసిన బొమ్మనే మోసపుచ్చేందుకు మరొక చిత్రకారుడి చేత వేయిస్తారు. రెండవది, కళాఖండాల మార్కెట్ వేల్యూ పెంచేందుకు వాటికి అబద్ధపు అదనపు హంగుల్ని(రాచరికపు వారసత్వం వంటివి ) ఆపాదిస్తారు. మూడవది, అసలు ఆ చిత్రకారుడు వెయ్యని బొమ్మని, అసలైనదంటూ అమ్ముతారు.
“మనం కళాఖండాలను కొనే నిర్ణయం ఖాయం చేసుకునే ముందు, ‘సర్టిఫికేట్ ఆఫ్ ప్రోవినెన్స్ ‘ ను పొందాలి. దీనివల్ల ఆ కళాఖండం మారుప్రతి కాదని తెలుస్తుంది. ఒక పేరొందిన చిత్రకారుడి కళను అంచనా వేసేందుకు ఇది ఉపయోగిస్తుంది. సర్టిఫికేట్ లో ఇచ్చినవిధంగా ఒక సమగ్ర చరిత్ర, చిత్రం అసలైనదే అని నిరూపించేందుకు ఉపయోగిస్తుంది. ఆర్ట్ డీలర్ లేక ఆక్షన్ హౌస్ ల ప్రధాన బాధ్యత ఈ ప్రోవినెన్స్ ఒక విశిష్టమైన ప్రొఫెషనల్ ప్రమాణాలను కలిగిఉన్నది అని నిర్దారించడం. “ బదులిచ్చింది స్నిగ్ధ.
స్నిగ్ధ సరైన విధానంలో జవాబిచ్చింది. మహేంద్రకు ఆమె జవాబు నచ్చినట్లు కనిపించింది.
“బాగా చెప్పారు. నిజానికి, సరిగ్గా ఇక్కడే నాకు మీ సహాయం కావాలి. అప్సర టెక్నికల్ పనులను చూసుకుంటూ ఉండగా, కళాఖండాలను భారత్ కు పంపేముందే ,నాకు నిర్వహణ బాధ్యతలను ఖచ్చితంగా చూసుకునేందుకు, ఎవరైనా కావాలి.”
అప్సర మహేంద్రకు అడ్డుపడుతూ స్నిగ్ధను ఇలా అడిగింది,” నాకు మరొక విషయం చెప్పండి. మీకు భారతీయ చిత్రాలను గురించి ఏమి తెలుసు ?”
ఇది ఇంటర్వ్యూ కోసం స్నిగ్ధ ముందే సిద్ధం చేసుకున్న కీలకమైన ప్రశ్న. ఆమె వెంటనే స్పందించింది.
“భారతీయ చిత్రకళ అనేది, భారత ఉపఖండంలో 3 వ శతాబ్దం నుంచి ఆధునిక యుగం వరకూ సృష్టించబడ్డ చిత్రాలకు వాడే సాంకేతిక పదం. భోగాలాలసమైన భావనలు, ఆకృతి పట్ల బలమైన దృష్టి భారతీయ చిత్రాల లక్షణాలు. విదేశీయులకు భారతీయ చిత్రాలు అతిగా స్పందించేవిగా కనిపించినా, క్రమంగా వచ్చిన మెరుగులను వారు మెచ్చుకుంటారు.”
ఇలా అంటూ ఆమె అప్సర శరీరాకృతిని చూసి, మనసులోనే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ప్రద్యుమ్న చిత్రాలలో చిత్రీకరించిన అందమైన స్త్రీల వరుసలో ఆమెను కూడా ఉంచి, ఊహించుకుంది.
“భారతీయ చిత్రకళలో సంస్కృతిక చరిత్ర, మతాలు, వేదాంతం మేళవించి ఉన్నాయి. మతాలకు, సాంఘిక, రాజకీయ, సంస్కృతిక అంశాలకు అతీతంగా చిత్రకళ భారత్ లో సంరక్షించబడింది. అందుకే భారతీయ చిత్రకళ గుహలలో, రాళ్ళలో గీసిన పురాతనమైన బొమ్మలనుండి, మధ్యయుగంలో మొఘల్ ఆర్ట్, ఇస్లామిక్ ఆర్ట్, బుద్ధిస్ట్ ఆర్ట్ లనుండి, సమకాలీన భారత చిత్రాల వరకు అనేక విధాలగా రూపాంతరం చెందింది.” కొనసాగించింది స్నిగ్ధ.
మహేంద్ర అడిగిన అన్ని ప్రశ్నలకు స్నిగ్ధ స్థిరంగా బదులిచ్చింది. ఆమె భారతీయురాలు కనుక, వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్ట్ కు ఉన్న ప్రాధాన్యతను ఆమె అర్ధం చేసుకుంది.
ఈ స్పందన తర్వాత మహేంద్ర మనసులోనే ఆమెకు ఉద్యోగం ఖాయం చేసాడు. అతను ఒక కాగితాన్ని తీసుకుని, అందులో ఉన్న సమాచారం ఇంటర్వ్యూ అసెస్మెంట్ తో సరిపోయిందో లేదో సరిచుసుకున్నాడు.
“అయితే మీరు ఫేస్ బుక్ ను తరచుగా వాడుతుంటారా ?ఇండియన్ రైల్వేస్ పై మీ వాల్ పోస్ట్ కామెంట్స్, భారతీయ చిత్రాలపై మీ పోస్ట్ లు నాకు బాగా నచ్చాయి.” మెచ్చుకున్నాడు మహేంద్ర.
స్నిగ్ధ సందిగ్ధంలో పడింది. తనను కలిసే ముందే మహేంద్ర తన పేస్ బుక్ వివరాలను ఎలా చూసాడో ఆమెకు అర్ధం కాలేదు. ఈ మధ్య సెలవలకు భారత్ కు వెళ్ళినప్పుడు తాను ఇండియన్ రైల్వేస్ పై పోస్ట్ పెట్టింది.
“వాట్స్ యువర్ మైండ్ ?” అనే ప్రశ్నను వేలల్లో అడుగుతారు, తరచుగా ఫేస్బుక్ వాడేవారు రోజుకు కనీసం పది సార్లు దీనికి బదులిస్తారు.
ఒక ఉద్యోగానికి తగినవారి సత్తాను నిర్ణయించేందుకు ఇప్పుడు ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ లను అనేకమంది వాడుతున్నారు. ఇది క్రమంగా వ్యాపార ప్రపంచంలో ప్రధానంశంగా మారుతోంది.
ఇది విరుద్ధమైన పద్దతిగా చెప్పినా, ఫేస్బుక్ ద్వారా స్క్రీన్ చెయ్యటం వల్ల, ఒకరి వ్యక్తిత్వానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఇండియా, చైనా జనాభాతో పోటీ పడేంత మంది యూసర్ లను కలిగిఉందని చెప్పుకునే ఒక ప్లాట్ఫారం ఇది.
మహేంద్ర చూస్తున్న నివేదికలో. స్నిగ్ధ వాల్ పై రాస్తున్న పోస్ట్ లను బట్టి, ఆమె వాడే భాష నాణ్యతను బట్టి, ఆమె పోస్ట్ చేసే టైం ను బట్టి, ఉద్వేగపు విలువలను బట్టి, స్నిగ్ధ గురించి అంచనా వేసిన సంపూర్ణ సమాచారం ఉంది.
ఈ అంశాలన్నీ, ఇంటర్వ్యూ చేస్తున్న HR వారికి ఆ వ్యక్తిని గురించి అంచనా వేసేందుకు కొంత సమాచారాన్ని ఇస్తాయి. అదృష్టవశాత్తూ, స్నిగ్ధ పై ఇచ్చిన రిపోర్ట్ సానుకూలంగా ఉంది, అది మహేంద్ర ఆమె విషయంలో ముందుకు వెళ్లి, ఉద్యోగం ఖాయం చేసేలా చేసింది.
మరికొన్ని క్షణాలు శిక్షణలో స్నిగ్ధ అనుభవాలను గురించి, ఆమె అదనపు ఆసక్తులు, వ్యాపకాలు, కుటుంబ నేపధ్యం గురించి తెలుసుకుంటూ గడిచిపోయాయి. మహేంద్ర, అప్సర చివరికి ఆమె ఉద్యోగం ఖాయం చేసారు. వారు మృణాల్ ను ఆమెకు పరిచయం చేసి, మిగిలిన విధివిధానాలను పూర్తి చెయ్యమని, అతన్ని అభ్యర్ధించారు.
స్నిగ్ధ మహేంద్ర, అప్సర లకు కృతఙ్ఞతలు తెలిపి, మృణాల్ దారి చూపుతుండగా, ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె తన శిక్షణ చివరి రోజైన నేడు, వెంటనే కొత్త ఉద్యోగంలో చేరగాలిగినందుకు అమితానందం చెందింది.
అప్పాయింట్మెంట్ కు సంబంధించిన మిగిలిన విధులను పూర్తిచేసేందుకు మృణాల్ ఆమెను తన క్యూబికల్ లోకి తీసుకెళ్ళాడు.
“మీ చిరునవ్వు మొనాలిసా తో పోల్చదగ్గ విధంగా ఉంది,” అన్నాడు మృణాల్ స్నిగ్ధకు కుర్చీ చూపుతూ, తగిన పత్రాలు సిద్ధం చేస్తూ.
“నిజంగా ? మీ పొగడ్తకు . కాని, ఒక స్త్రీ చిరునవ్వును మొనాలిసా నవ్వుతో పోల్చే ముందు మీరు మొనాలిసా గురించి తెలుసుకోవాల్సి ఉంది.”
స్నిగ్ధ మృణాల్ కు ఏదో చెప్పాలనుకుంటోంది. ఆమె వదనంలో కనిపిస్తున్న స్థిరత్వాన్ని చూసి, ఆమెను పొగడడం సరైనదేనా అని మృణాల్ సందిగ్ధంలో పడ్డాడు.
“నవ్వే కాకుండా మొనాలిసా గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది,” మృణాల్ ఇచ్చిన కాగితాలను భర్తీ చేస్తూ కొనసాగించింది స్నిగ్ధ. “మొనాలిసా ముఖ కవళికలు మీరు మీ దృష్టిని ఎటువైపు కేంద్రీకరిస్తారో, దాన్ని బట్టి మారతాయి. మీరు ఆమె కళ్ళ వంక చూస్తే, ఆమె నవ్వుతున్నట్లు ఉంటుంది. ఆమె పెదాలను చూస్తే, ఆమె నవ్వు మటుమాయమవుతుంది.”
మృణాల్ కలవరపడ్డాడు. అతనికి మొనాలిసా చిత్రం వెనుక అటువంటి వింత విశేషాలు ఉంటాయని తెలీదు. స్నిగ్ధ సంభాషణను కొనసాగించింది...
“మనిషి కన్నులో రెండు వేర్వేరు ప్రదేశాలు ఉంటాయి. మధ్య ప్రాంతంతో వస్తువులు స్పష్టంగా చూడడం, రంగులూ, వస్తువులూ గుర్తించబడడం, చిన్న అక్షరాలు చదవటం వంటివి చేస్తాము. దాని చుట్టూ ఉన్న ప్రాంతం వెలుగునీడల్ని , కదలికను, తెలుపు, నలుపు రంగుల్ని చూస్తుంది. మామూలుగా కేంద్రం నుంచి చూసే చూపు, దాని చుట్టుప్రక్కల చూపు లాగా నీడను చూడలేదు. అందుకే, మనం మొనాలిసా పెదాల వంక చూసి, ఆమె చిరునవ్వును గుర్తించలేము.”
మృణాల్ వెంటనే తన డెస్క్ నుంచి ఒక పత్రికను వెలికి తీసాడు. దానిపై మొనాలిసా చిత్రం ఉంది. దానివంక పరిశీలనగా చూసాకా, అతను స్నిగ్ధ చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నాడు.
అతను మొనాలిసా ముఖంలోకి చూసినప్పుడు కనిపించిన మెరిసే చిరునవ్వు, ఆమె పెదవులను చూసినప్పుడు అతనికి కనిపించలేదు.
“ లియోనార్డో డా వించి స్ఫుమాటో టెక్నిక్ ను వాడి, ఒక పొర పెయింట్ పై మరొకదాన్ని వేసి, షేడ్స్ లో చిన్న మార్పులు చెయ్యడం ద్వారా దీన్ని సాధించాడు,” అని ముగిస్తూ, కాగితాలను మృణాల్ కు అందించింది స్నిగ్ధ.
ఆమె అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, సెలవు తీసుకుంది. అతను మొనాలిసా చిత్రపు వివరాలను గురించి, ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. స్నిగ్ధ చివరి రోజున తన పనులను పూర్తి చేసుకునేందుకు మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ కు బయలుదేరింది.
“కంగ్రాట్స్ ...” మహేంద్ర విభాగంలో తన కొత్త ఉద్యోగం గురించి చెప్పిన స్నిగ్ధను అభినందించింది ఏంజెలా. ఆమె మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ లో క్యురేటర్ గా పనిచేస్తోంది. క్యురేటర్ లు మ్యూజియం, ఆర్ట్ గేలరీ వంటి వారసత్వపు స్థానాల్లో పనిచేసే కంటెంట్ నిపుణులు. వారిది ఆర్ట్ ప్రపంచంలో మౌలికమైన ఉద్యోగం. ఆర్ట్ మార్కెట్ ను తమ వృత్తిగా స్వీకరించాలని స్థిరంగా అనుకునే వారిని, అత్యంత నిపుణత కలిగిన ఈ వృత్తి ద్వారాలు తెరిచి స్వాగతిస్తుంది.
“థాంక్ యు వెరీ మచ్ ఏంజెలా”, మ్యూజియం లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కాంటీన్ లోని కుర్చీలో కూర్చుంటూ అంది స్నిగ్ధ. ఆమెకు ఉద్యోగం లభించినందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆమెకు గేలరీ వదిలి వెళ్తున్నందుకు కాస్త బాధగా ఉన్నా, ఒక ప్రతిష్టాత్మకమైన భారతీయ ప్రాజెక్ట్ లో పనిచెయ్యబోతున్నాను అన్న ఉత్సాహం దాన్ని కాస్త తగ్గిస్తోంది. “ప్రకృతి నియమం ప్రకారం ఏదైనా కొత్తగా ఆరంభించాలంటే, పాతది వదిలెయ్యాలి కదా,” సాలోచనగా అనుకుంది ఆమె.
“ అయితే, నువ్వు రోజంతా నీ రిలీవింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడంలో బిజీ గా ఉంటావు కదా ? కాని, అవి చేసేముందు నీకో సంగతి చెప్పాలి. ఉదయం నుంచి ఇండియన్ లాగా కనిపిస్తున్న ఒక యువకుడు నీకోసం వేచిఉన్నాడు. నేనతనికి మ్యూజియం చూపిస్తానన్నా, నీతో వెళ్లేందుకే అతను ఆసక్తి చూపుతున్నట్లు అనిపించింది,” అంది ఏంజెలా కొంటెగా నవ్వి, కన్ను గీటుతూ.
“హ్యాండ్సం గా ఉన్నాడు, నీ అదృష్టాన్ని పరీక్షించుకో ! ఒకేరోజు నీకు కొత్త ఉద్యోగం, కొత్త జోడీ దొరుకుతుందేమో..” అంటూ ఆంజిలా నవ్వుతూ అక్కడినుంచి లేచి, స్నిగ్ధకు ఆ యువకుడు వేచిఉన్న ప్రదేశాన్ని చూపించింది.
స్నిగ్ధ లంచ్ ముగించుకుని, తనను కలిసేందుకు వచ్చిందెవరో చూద్దామని, వెయిటింగ్ హాల్ వైపు వెళ్ళింది. హాల్ లో అతను ఒక్కడే ఉండడంతో ఆమె అతన్ని తేలిగ్గానే పోల్చుకుంది. అతను అందంగా, పొడవుగా, చక్కటి చిరునవ్వుతో ఉన్నాడు. అతను ముదురునీలం రంగు సూట్, తెల్ల చొక్కా, ఎర్ర టై తో ఉన్నాడు. అతను చాలా ప్రొఫెషనల్ గా కనిపించాడు. స్నిగ్ధను చూడగానే అతను లేచి నిలబడి, ఆమెతో కరచాలనం చేసేందుకు చెయ్యి చాచాడు.
“హాయ్, నేను ఋషి, బాంక్ ప్రైమ్ సూయిస్ ‘ నుంచి అన్నాడు ఋషి ప్రసన్న వదనంతో. గతరాత్రి ఫేస్బుక్ లో చూచినదానికంటే, స్నిగ్ధ మరింత అందంగా ఉందని, అతను గుర్తించాడు.
“యా మిష్టర్ ఋషి, మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ కి స్వాగతం. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ?” స్నిగ్ధ ఋషితో మర్యాదపూర్వకంగా సంభాషణ మొదలుపెట్టింది.
“నేనిక్కడకు చిన్న అధ్యయనం కోసం వచ్చాను. నేను మా బ్యాంకు వారి ‘ ఆర్ట్ ఫండ్’ లో పనిచేస్తున్నాను. అందుకే నేను ఆర్ట్ ప్రపంచాన్ని అనుభూతి చెందేందుకు ఈ గేలరీ ను చూడాలని అనుకుంటున్నాను. “ అన్నాడు ఋషి.
మ్యూజియం గోడలపై వేళ్ళాడదీసిన అత్యంత సుందరమైన పోర్ట్రైట్ లను స్నిగ్ధ అతనికి చూపింది.
స్నిగ్ధ తనకు చేరువలో ఉంటే, అతనికి ఒకేసారి రెండు పోర్ట్రైట్ లను చూసిన భావన కలుగసాగింది – ఒకటి ప్రాణం లేకుండా గోడకి వెళ్లాడగట్టి ఉన్నది, మరొకటి తన ప్రక్కనే ఉన్న సజీవ శిల్పం.
ఆమె సంస్కారవంతంగా, మర్యాదగా, కాస్తంత భారతీయత మేళవించి ఉండడంతో, పశ్చిమ దేశాల్లోని స్త్రీలకంటే కాస్తంత విభిన్నంగా ఉందని ఋషి గుర్తించాడు. ఆమె యాస ఆమె UK నివాసాన్ని ప్రతిబింబిస్తూ ఉంటే, ఆమె మాటల్లోని భారతీయ ప్రస్తావనలు ఆమె సంస్కృతిక అంశాలను కూడా బాగా అధ్యయనం చేసిందని చెబుతున్నాయి.
“అయితే, మిష్టర్ ఋషి, మీ స్వస్థలం ఏది ?” ఋషి పెయింటింగ్ కు సంబంధించిన నోట్స్ తీసుకుంటూ ఉండగా, కాలక్షేపం కోసం అడిగింది స్నిగ్ధ.
“వైజాగ్, మీకు ఈ ఊరు తెలుసా ? ఆంధ్రప్రదేశ్ లో దీన్ని విశాఖపట్నం అని కూడా అంటారు. నేను అక్కడికి చెందినవాడిని, కాని, ఇక్కడే స్థిరపడ్డాను. నేను UK లో గత 4 ఏళ్ళుగా ఉంటున్నాను, “ బదులిచ్చాడు ఋషి.
“యా, నీకు వైజాగ్ తెలుసు ; కాలేజీ లో ఉన్న నా కొలీగ్ ఒకామె అక్కడినుంచే వచ్చింది. ఈ ఊరిని గురించి ఆమె నాకు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చెప్పింది,” అంటూ నవ్వింది ఆమె.
ఋషి ఆమెకు అడ్డు వస్తూ, “ఆసక్తికరమైన అంశాలా ? అంటే ఎలాంటివి? వైజాగ్ ప్రశాంతంగా, పవిత్రంగా, అందమైన బీచ్ లతో కాలుష్య రహితంగా ఉంటుందనే నాకు తెలుసు. ఇవి కాకుండా మీకు తెలిసిన ఆసక్తికరమైన అంశాలు ఏమిటి ?” అంటూ అడిగాడు.
“హా, వైజాగ్ లో యూనివర్సిటీ పక్కనే మెంటల్ హాస్పిటల్, బస్సుస్టాండ్ సెంట్రల్ జైలు పక్కన ఉండేవని, ఆమె గతంలో నాకు చెప్పింది. అవసరమైనప్పుడు ఎవరైనా ఒక బిల్డింగ్ నుంచి మరొకదానికి గోడ దూకి వెళ్లేందుకు ఇది చాలా అనువుగా ఉంటుంది కదా ?” గట్టిగా నవ్వుతూ అంది స్నిగ్ధ.
ఋషి కూడా నవ్వాపుకోలేక, ఆమెతో శృతి కలిపాడు. ఇది వాస్తవమే అయినా, ఈ రెండిటి కలయికను గురించి, ఆమె చెప్పిన విధంగా అతను ఎప్పుడూ ఆలోచించలేదు.
“ బాగా చెప్పారు, నేనూ అంగీకరిస్తున్నాను. మీ ఫ్రెండ్ కూడా నాలాగే సరదాగా ఉండటాన్ని ఇష్టపడుతుందనుకుంటాను,” సంభాషణ పొడిగించేందుకు ప్రోత్సహిస్తూ అన్నాడు ఋషి. అతను ఆమె సాహచర్యాన్ని ఇష్టపడసాగాడు.
వారు ముందుకు సాగుతూ పెయింటింగ్స్ ను చూడసాగారు. ఆమె ప్రతి పెయింటింగ్ వెనుక ఉన్న నేపధ్యం, చారిత్రిక అంశాల్ని గురించి అతనికి వివరించింది. తన ప్రైవేట్ కలెక్షన్ కోసం ఆర్ట్ కలెక్టర్ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అర్ధం చేసుకునేందుకు ఋషి ఆమెను ఎన్నో ప్రశ్నలు అడిగాడు.
నిజానికి, చాలామంది సేకరణకారులు పూర్వకాలంలోని చక్కటి చిత్రకారుల బొమ్మలను గురించి మరింత అవగాహన కోసం మ్యూజియం లను దర్శిస్తారు. ఒక ఆర్ట్ వర్క్ కు ఉన్న విశ్వసనీయత ను రూడి చేసుకోడానికి వారు క్యురేటర్ ల సాయం తీసుకుంటారు. మరికొందరు సేకరణకారులు , తమ ముందు తరాల జ్ఞాపకచిహ్నంగానో లేక కళాపోషణ కొరకో, తమ సేకరణలను మ్యూజియం కు దానం చేసేందుకు వస్తారు.
“వ్యాపార దృక్పధం కాకుండా, మిమ్మల్ని పెయింటింగ్స్ వైపు ఆకర్షించే అంశాలు ఏంటి ?”స్నిగ్ధ ఋషిని యధాలాపంగా అడిగింది.
“ఒక చిత్రంలోని సూక్ష్మమైన అంశాలను స్పష్టంగా చిత్రీకరించటంలో ఆర్టిస్ట్ చూపే అమితమైన ఓర్పు నాకు చాలా ఇష్టం. ఒకరకంగా అది తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పడే ప్రసవవేదన కంటే కష్టం. బిడ్డ పుట్టుకకు బీజం పడేది క్షణికానందం వల్లనే. కాని, అమ్మ కడుపులో బిడ్డను మోసేటప్పుడు, ప్రసవ సమయంలో మాత్రమే వేదన అనుభవిస్తుంది. కాని, ఒక ఆర్టిస్ట్ ఆరంభదశ నుంచి భావోద్వేగాల బరువును మొయ్యాలి. అటువంటి సమయంలో అతనికి సాయంగా ఎవరూ ఉండరు, అతనొక్కడే ఒంటరిగా పనిచెయ్యాలి. ఆలోచనలు ఆకృతిదాల్చిన తర్వాత కూడా, అది కాన్వాస్ పై చక్కగా ఆవిష్కరింపబడే దాకా, ఈ భారం కొనసాగుతుంది. “
పెయింటింగ్ లు వెయ్యటం బిడ్డపుట్టుక కంటే సమున్నతంగా పోల్చి అతను చెప్పిన విధానం స్నిగ్ధకు బాగా నచ్చింది. అతను సంభాషణ కొనసాగిస్తూ ఉండగా, ఆమె నవ్వుతూ ఋషి వంక చూడసాగింది.
“అంతేకాక, కొన్ని ఇండియన్ పెయింటింగ్స్ చూస్తున్నప్పుడు వాటి వెనుక ఉన్న భావనను నేను ఆరాధిస్తాను. ఆర్టిస్ట్ లు మేదావులైతే తప్ప, అంతలా ఊహించడం కష్టం. మనసులో వారు కూడగట్టుకోవలసిన అంశాలు చాలా క్లిష్టమైనవి – దుస్తులు, డిజైన్స్, పరిసరాలు, లోపలి అంశాలు – ఇటువంటివన్నీ అతను కాన్వాస్ పై పెయింటింగ్ వేసేముందే నిర్ణయించుకోవాలి. నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ, ఇండియన్, వెస్త్రెన్ ఆర్టిస్ట్ ల రంగుల మేళవింపు లో కాస్త తేడా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది.”
అతని పరిశీలన స్నిగ్ధకు చాలా సబబుగా అనిపించింది. ఆమె ఇలా వివరించింది – “మీరన్నది నిజమే, మిష్టర్ ఋషి. నేను దీనిగురించి ఇంకా చెప్తాను, మీకు బోర్ కొడితే తెలియచెయ్యండి. మామూలుగా రంగుల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, నేను లెక్చర్ ఇవ్వకుండా ఉండలేను.” అంటూ ముఖం ప్రక్కగా జారిన కురులని చెవి వెనక్కు సర్దుకుంది ఆమె. స్నిగ్ధ ప్రశ్నిస్తున్నప్పుడు, ఋషి ధ్యాస వదులుగా జారిన ఆమె కురులపైనే ఉంది. వెంటనే అతను తన ధ్యాసను ఆమె అడిగిన ప్రశ్న వైపు మరల్చాడు.
“పర్వాలేదు, చెప్పండి,” అంటూ ప్రోత్సహించాడు ఋషి. ఆమె అందంగా , సంస్కారవంతంగా ఉండడంవల్ల స్నిగ్ధ తో మాట్లాడటం అతనికి మరింత ఆసక్తికరంగా ఉంది.
“ సాధారణంగా రంగులు రెండు రకాలు – ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ కలర్స్ అంటే, వేరే రంగుల్ని కలపడం ద్వారా తయారు చెయ్యలేనివి. అవి ఎరుపు, పసుపు, నీలం. కాని ఇంకో మూడు రంగులున్నాయి – నారింజ, ఆకుపచ్చ, వంకాయ రంగులు – ఇవి సెకండరీ కలర్స్, వీటిల్ని ప్రైమరీ కలర్స్ కలిపి, తయారుచెయ్యవచ్చు. ఆకుపచ్చాను పసుపు, నీలం కలిపి, వంకాయ రంగును ఎరుపు , నీలం కలిపి తయారుచెయ్యవచ్చు. “
ఋషికి ఈ సమాచారం ఆసక్తికరంగా అనిపించింది. జీవితంలో కలిసే రంగులను అతను గమనించాడు కాని, కాన్వాస్ పై వాడే రంగులని గురించి అతనికి తెలీదు. అతనికి స్నిగ్ధ పట్ల ఒక ఆరాధనాభావం కలిగింది, స్నిగ్ధ సంభాషణ కొనసాగించింది...
“ఎరుపు, పసుపు, నీలం వంటి ప్రైమరీ కలర్స్ కలయిక పెయింటింగ్స్ కు, డై ల తయారీకి మామూలుగా వాడతారు. కాన్వాస్ పై ఏ రంగులూ లేనప్పుడు అది తెల్లగా ఉంటుంది. అదే అన్ని రంగుల్ని కాన్వాస్ పై కలిపితే, తెలుపు రంగు వస్తుంది.”
ఋషికి ఆమెతో ఎంతసేపైనా అలా మాట్లాడుతూ ఉండిపోవచ్చు అనిపించింది. పెయింటింగ్స్ పట్ల ఆమెకు ఎంతో మక్కువ ఉన్నట్లు అనిపించింది, అతనికి కూడా ప్రస్తుతం తన చెయ్యి పట్టుకుని, విస్తృతమైన ఆర్ట్ ప్రపంచాన్ని చూపే మార్గదర్శి చాలా అవసరం.
“ఇంకా, ఒక బొమ్మ వేసేందుకు ఒకరికి ప్రైమరీ, సెకండరీ కలర్స్ గురించి మాత్రమే తెలిస్తే సరిపోదు, వాటి విలువ కూడా తెలియాలి. ఈ విలువలు రెండు రకాలు . మొదటిదాన్ని టింట్స్ అంటారు – తెలుపురంగుని ఇతర రంగుల్లో కలిపితే వచ్చే ప్రభావం, ఉదాహరణకి గులాబి రంగు ఎరుపు యొక్క టింట్. రెండోదాన్ని షేడ్స్ అంటారు – నలుపుని ఏదైనా రంగులో కలిపితే వచ్చే ఎఫెక్ట్, ఉదాహరణకి మెరూన్ అనేది రెడ్ యొక్క షేడ్.
ఋషి నడక ఆపి, ఆమెనే చూడసాగాడు. మామూలుగా అతను ఎవరినీ 5 నిముషాలకంటే ఎక్కువ మాట్లాడనివ్వడు, కాని స్నిగ్ధ దీనికి అతీతమని నిరూపించుకుంది. ఆమె అందమే కాదు, మాట్లాడే విషయాలు కూడా అతనికి ఊపిరి సలపనివ్వట్లేదు. ఆమెతో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా భవిష్యత్తులో అనుబంధం కొనసాగించాలని అతను బలంగా అనుకున్నాడు.
అప్పటిదాకా అతను అక్కడికి ఒక ప్రయోజనం కోసం వచ్చాడని, స్నిగ్ధ అందుకు ఒక సాధనంగా ఉపయోగిస్తోందని మాత్రమే ఆలోచించాడు. కాని ఇప్పుడు, ఏదో వెచ్చని ఆత్మీయత అతన్ని అల్లుకున్నట్లు అనిపిస్తుండగా స్నిగ్ధ తిరిగి “
“చివరగా, పెయింటింగ్స్ పరంగా మనం వార్మ్ కలర్స్, కూల్ కలర్స్ మధ్య ఉన్న తేడాల గురించి తెలుసుకోవాలి. వెచ్చనైన సూర్యకాంతి రంగుల్ని సూచిస్తున్నందున ఎరుపు, పసుపు, నారింజ రంగుల్ని వార్మ్ కలర్స్ అంటారు. ప్రశాంతమైన చల్లదనంతో ఆవరించబడి, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నందున నీలం, ఆకుపచ్చ, వంకాయ రంగుల్ని కూల్ కలర్స్ అంటారు. వెస్త్రెన్ కళాకారులు ఎక్కువగా కూల్ కలర్స్ ను వాడతారు. ప్రద్యుమ్న వంటి భారతీయ చిత్రకారుల పెయింటింగ్స్ ఎక్కువగా వార్మ్ కలర్స్ తో నిండి ఉంటాయి.” ముగించింది స్నిగ్ధ.
ఇండియన్ , వెస్త్రెన్ పెయింటింగ్స్ మధ్య ఉన్న వ్యత్యాసం వివరిస్తూ, స్నిగ్ధ రంగుల గురించి చెప్పిన విధానాన్ని ఋషి అభినందించాడు. ప్రద్యుమ్న – అన్న పేరు వినగానే అతను అప్రమత్తం అయ్యాడు.
“ప్రద్యుమ్న ? మైసూరు మహారాజా సంస్థానంలో ఉండే గొప్ప భారతీయ చిత్రకారుడా ? మేనకా విశ్వామిత్రా పెయింటింగ్ వేసింది అతనేగా ?” వెంటనే అడిగాడు ఋషి. ఉన్నట్టుండి అతని స్వరంలో ధ్వనించిన ఉత్సాహాన్ని స్నిగ్ధ గమనించింది. ఆమె కూడా ప్రద్యుమ్న పెయింటింగ్స్ కు వీరాభిమాని కనుక, అతని భావనలు అర్ధం చేసుకోగలిగింది.
“అవును, నేను అదే ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నాను, ప్రద్యుమ్న – తైలవర్ణచిత్రాల కళాఖండాలు సృష్టించేందుకు పౌరాణిక పాత్రలను నేపధ్యంగా వాడిన చిత్రకారుడు. నేనతని పెయింటింగ్స్ కి వీరాభిమానిని. “ బదులిచ్చింది స్నిగ్ధ.
ఋషి మౌనంగా ఏవో ఆలోచనల్లో మునిగిపోయినట్టు కనిపించాడు. ఏదో విషయం గురించి తీవరంగా ఆలోచిస్తున్నాడని స్నిగ్ధకు తెలిసింది. అతను కాస్త అసహనంగా కదిలి, ప్రద్యుమ్న పేరును ఉచ్చరిస్తూ ఏదో లోకంలో ఉన్నట్లు కనిపించాడు.
తిరిగి అతన్ని ప్రస్తుతానికి తెచ్చేందుకు స్నిగ్ధ ఇలా అంది, “ మీకు మరొక ముఖ్యమైన విషయం తెలుసా ? తైలవర్ణచిత్రాలలాగే ఇటీవల పెయింటింగ్స్ వేసేందుకు వివిధ మాధ్యమాలను వాడుతున్నారు. ఉదాహరణకి, క్రిస్ అఫిలి అనే ఆర్టిస్ట్ ఏనుగు పేడను పెయింటింగ్ కోసం వాడి, 1998 లో టర్నర్ ప్రైజ్ ను గెల్చుకున్నాడు. బురద పెయింటింగ్స్ లో , అంటే బురదతో పెయింటింగ్ లు సృష్టించే నిపుణులైన ఆర్టిస్ట్ లు అనేకమంది ఉన్నారు.”
స్నిగ్ధ చెప్పింది విన్న వెంటనే ఋషి ఆలోచనల్లోంచి వెనక్కు వచ్చి, నవ్వేసాడు. గతరాత్రే అతను తాజా పెయింటింగ్ మాధ్యమాల గురించి చదివాడు. అతని అధ్యయనంలో అతన్ని ఆకర్షించిన మరొక మాధ్యమం ఉంది – సెమెన్ పెయింటింగ్. లేక మగవారి దేహద్రవాలను పెయింటింగ్ కోసం వాడటం. మార్టిన్ వాన్ ఆస్ట్రోవిస్క్స్ అనే జర్మన్ ఆర్టిస్ట్ ఇటీవల తన స్వంత వీర్యంతో సృష్టించిన దాదాపు 30 పెయింటింగ్స్ ఎక్సిబిషన్ ఒకటి ఏర్పరిచాడని చదివి, ఋషి ఆశ్చర్యపోయాడు.
ఆర్టిస్ట్ వాడిన మాధ్యమం కాక, పెయింటింగ్స్ కోసం వీర్యం సేకరణకు, దాన్ని నిల్వ ఉంచేందుకు అతను ఎన్నిసార్లు కష్టపడి ఉంటాడో మనసులోనే వేసుకున్న లెక్కలు ఋషిలో ఆసక్తిని రేపాయి. అతని వదనంలో సన్నటి చిరునవ్వును గమనించిన స్నిగ్ధ కారణం అడిగింది. ఋషి మర్యాదగా మాటమార్చి, ఆమె వెంట వెళ్ళాడు.
వారు మొత్తం పర్యటన ముగించగానే, అతను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కు వెళ్లి, కొంత సొమ్మును మ్యూజియం కు విరాళంగా రాసిచ్చాడు. ఇచ్చేముందే అతను కళాపోషకుల స్థితిని , అది స్నిగ్ధ దృష్టిలో పొందే విలువను ,తద్వారా మున్ముందు స్నిగ్ధతో తరచుగా తాను కొనసాగించబోయే సంబంధాన్ని గురించి అతను ఆలోచించాడు.
“కృతఙ్ఞతలు స్నిగ్ధ, మీనుంచి ఇవాళ ఎన్నో విషయాలను నేర్చుకున్నందుకు ఆనందంగా ఉంది,’ షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు ఋషి.
“ లౌవ్రే మ్యూజియం కు ప్రతిరోజూ వచ్చే 20,000 మంది సందర్శకులలో దాదాపు 80 % మంది మొనాలిసా చిత్రం చూసేందుకు వస్తారని, నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజమోకాని, కేవలం ఆ చిత్రాన్నే చూసేందుకు మ్యూజియంకు వచ్చే అటువంటి సందర్శకుల కోసం ఒక ప్రత్యేక ద్వారాన్ని ఏర్పరచిందట. మీవంటి వ్యక్తి ఇక్కడ క్యురేటర్ గా మరికొంతకాలం కొనసాగితే, మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ కి కూడా అటువంటి సదుపాయాలే ఏర్పరచాలేమో, “ స్నిగ్ధను పొగిడే అవకాశాన్ని తీసుకుంటూ అన్నాడు అతను.
అతను అన్నది వెంటనే ఋషికి అర్ధం కాలేదు. అర్ధం కాగానే, ఆమె ముఖంలో చిరునవ్వు మెరిసింది. “ ఇకపై ఇక్కడ ఉండడం కుదరదు, నేను గేలరీ ని విడిచి వెళ్తున్నాను,” బదులిచ్చిందామె. ఆమె ఎక్కడికి వెళ్ళనున్నదో చెప్పకపోవడం వల్ల, ఋషి నిరాశకు గురయ్యాడు. మొదటి పరిచయంలోనే అది అడిగితే బాగోదని అతను భావించాడు.
స్నిగ్ధ మోనాలిసా గురించి ఉదయం మృణాల్ కు చెప్పిన కధ, మళ్ళీ చెప్పదల్చుకోలేదు. మృణాల్ తీరు మొరటుగా అనిపిస్తే, ఆమె ఉద్దేశపూర్వకంగా అలా ఆలోచించకపోయినా, ఋషి సాహచర్యం ఆమెకు బాగా నచ్చింది. వారు కలిసింది అదే మొదటిసారి. అయినా, ఆమెకూ అతన్ని తిరిగి కలవాలనే ఉంది.
ఋషి బైటికి వెళ్ళిపోగానే, స్నిగ్ధ తన గదికి వెనక్కు వెళ్లి, పనిని కొనసాగించింది. పగటిసమయంలో ఆమె ఆన్లైన్ లో ఉండగా, ఆమె ఫేస్బుక్ ఎకౌంటు లో ఋషి పంపిన ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ ను చూసింది. ఆమె నవ్వుకుని, వెంటనే దాన్ని ఆక్సెప్ట్ చేసింది. దానితో ఆమె ఫ్రెండ్స్ సంఖ్య 150 కు చేరుకుంది. ఆమె మళ్ళీ ఒకసారి సరిచూసుకుంది. ఆమెకు తెలిసినంతవరకూ, దీన్ని డంబార్స్ నెంబర్ అంటారు, ఇది సాంఘిక సంబంధాలలో ఒక వ్యక్తి అనుబంధం కలుపుకోగల గరిష్ట సంఖ్య. మామూలు స్థితిలో మానవ మేధస్సు పరిమితుల్ని దృష్టిలో ఉంచుకుంటే, ఇది బాహాటంగా ఒకవ్యక్తి నడపగలిగిన బాంధవ్యాల సంఖ్య. దీనికంటే ఎక్కువైతే, బంధాల్లో కొన్ని బలవంతపు నిబంధనలు, నియమాలు విధించుకోవాలి.
“ దీనికి అర్ధం బాహాటంగా, ఎటువంటి నిబంధనలు లేకుండా తనకు ఉన్న అనుబంధాల్లో ఋషి, చివరి స్నేహితుడా ?” ఒక ప్రశ్న మౌనంగా ఆమె తుంటరి మనసుగుండా వెళ్ళింది. మిగతా 149 మంది, ఇప్పటివరకు తనకు వ్యక్తిగతంగా తెలిసినవారు. ఫేస్బుక్ లో అనామకుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లను ఆమె అంగీకరించదు.
ఇప్పటివరకూ తనకు ఉన్న ఫ్రెండ్స్ అందరితోనూ మంచి సంబంధాలను కలిగిఉండాలనే ఆమె అనుకుంది. సరైన జోడీ దొరికాకా, తనకున్న సమయాన్నంతా ఆమె అతనికే కేటాయించాలని అనుకుంది.
“లేక, దీనికి అర్ధం ఋషి తనకు సరిజోడు అనా ? ఇది రాంగ్ ఛాయస్ కాదు, ” స్నిగ్ధ తన ఆలోచనలకు తానే నవ్వుకుంటూ తన కంప్యూటర్ షట్ డౌన్ చేసి, గేలరీ నుంచి బైటికి వెళ్ళేటప్పుడు పాటించే నియమాలను పూర్తిచేసింది.
************
రోజులు గడుస్తుండగా, ఆర్ట్ మార్కెట్ మీద మరింత పట్టు కోసం, అవగాహన కోసం ఋషి తన ప్రయత్నాలను కొనసాగించాడు. ఈ ఉద్దేశంగా అతను అనేక ఆర్ట్ గాలరీ లను సందర్శించి, మ్యూజియంలలో సమయం గడిపాడు. అతను అనేక ఆర్ట్ ఆక్షన్స్ (వేలం) లను దర్శించి, అనేకమంది బ్రాండెడ్ ఆర్ట్ డీలర్ లను కలిసాడు. ఎంతగా సంప్రదింపులు జరిపితే, ఆర్ట్ ప్రపంచం అంత నిష్కపటంగా కనిపించింది అతనికి.
ఒక ప్రైవేట్ బ్యాంకర్ గా ఋషికి ఎల్లప్పుడూ పైస్థాయి వ్యక్తులతో సంప్రదింపులు జరిపి, అవగాహన చేసుకునే అవకాశం దొరికేది. ఏ ప్రత్యేక ఉత్పత్తిలోనైనా, అతనికి ద్రవ్యత లక్షణాలు, రాబడులు, నష్టాలు, వంటి కీలకమైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం తెలుసు.
కాని, ఆర్ట్ రంగంలో పెట్టుబడులు అతనికి పూర్తి విభిన్నంగా అనిపించాయి. ఇందులో అభిరుచి, ఆసక్తి అనేవి మిగతా వాటికంటే ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఒక వ్యక్తికి ఉన్న అభిరుచి అతన్ని చిత్రాల దిశగా నడిపి, మక్కువ పెంచుకునేలా చేస్తే, మరికొంత ఆసక్తి దానికి తోడైనప్పుడు, అది అతన్ని ఆర్ట్ ప్రపంచం గురించి మరిన్ని అంశాలు కనుగొని, ఎన్నో విషయాలు నేర్చుకునేలా చేస్తుంది.
ఒకవిధంగా అతనికి ఆర్ట్ లో పెట్టుబడి పెట్టడం, ఒకరి కళాదృష్టిపై పెట్టుబడి పెట్టడంలా అనిపించింది. చిత్రాల సేకరణ అనేది, ఆనందమయమైన పెట్టుబడుల్లో ఒకటి, అని అతను గుర్తుంచాడు. జీవితాంతం అవి మనకు కనువిందు చెయ్యడం మాత్రమే కాదు, వాణిజ్యం కోసం విలువైన వస్తువులుగా కూడా ఉపయోగిస్తాయి.
తర్వాతి దశలో, ఋషి కళాఖండాలు, ఫోటోలు, శిల్పాలు వంటి వాటిని అధ్యయనం చేస్తూ, చిత్రాలు వెయ్యటం లోని స్ట్రోక్స్ వేసే పద్ధతి, వాడే రంగులు, ఉపరితల పరిశీలన వంటివి అవగాహన చేసుకునే ప్రయత్నం చేసాడు. తన భావనకు అందినవన్నీ ఆసక్తిగా గమనించి, తర్వాత వాటిలో అంతర్లీనంగా ఉన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. ఈ ప్రక్రియలో, అతను రంగుల తారతమ్యాలు, కుంచెతో మెరుగులు దిద్దే విధానాలు అన్నీ అవగాహన చేసుకుని, ప్రసంశించే స్థాయికి చేరుకున్నాడు,
ఆర్ట్ మార్కెట్ పట్ల తన అభిరుచిని మరింత పెంపొందించుకునేందుకు, అతను ఎన్నో ఆర్ట్ పత్రికలను, పుస్తకాలను చదవసాగాడు. పత్రికలలో వచ్చే ఆర్ట్ కాలమ్స్, విమర్శకుల వ్యాఖ్యలు అన్నీ చదివేవాడు. అతని మొబైల్ లో ఉన్న క్యాలెండరులో లండన్ చుట్టుప్రక్కల జరగబోయే అనేక ఆర్ట్ ఎక్సిబిషన్ ల రిమైండర్స్ ఉండేవి.
వ్యాపార ప్రయాణాల సమయంలో, ఒక విశిష్టమైన చిత్రకారుడి శైలి, ప్రభావం సమకాలీన సమాజంపై ఎలా ఉందో తెలుసుకునేందుకు, అతను తనకు నచ్చిన ఆర్టిస్ట్ లకు సంబంధించిన జీవితచరిత్రలు, చిన్న పుస్తకాలు, పత్రాలు వంటివి తప్పనిసరిగా వెంట తీసుకువెళ్ళేవాడు.
ఈ పద్ధతులన్నీ ఒక ఆర్టిస్ట్ కు అతని పనికి ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకునేందుకు అతనికి సహాయపడ్డాయి. క్రమంగా, ఆర్టిస్ట్ చిత్రాలలో వాడే మాధ్యమాలు, అతని ఊహాశక్తిని బట్టీ వారు ఎన్నుకునే నేపధ్యాలను అంచనావేసే విషయంలో, అతను నిపుణుడు అయ్యాడు. అతని ఫేస్బుక్ పోస్ట్ లలో పెయింటింగ్ నేపధ్యాలకు సంబంధించినవి ఉండసాగాయి.
ఒకరోజు అతను తన వాల్ పై ‘పోలో ఆర్ట్’ కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసాడు. అందులో పోలో ఆడుతున్న వ్యక్తుల బొమ్మలు చిత్రించిన ఫోటోలు ఉన్నాయి.
క్రీడలకు సంబంధించిన వర్గంగా, లేక క్రీడలు ఆడుతున్నవారి పోర్ట్రైట్ లకు సంబంధించిన కళగా పోలో ఆర్ట్ ప్రాచీన కాలంనుంచి గుర్తింపును పొందింది. రాజ్పుత్ లు క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి, మునుపటి కాలంలో ఈ కళలో నిపుణులైన భారతీయ చిత్రకారులు కూడా ఉన్నారు.
ఫేస్బుక్ లో ఫోటోలు అప్లోడ్ చెయ్యడం పూర్తవగానే, చాట్ విండో స్నిగ్ధ మెసేజ్ తో బజ్ మనడం చూసాడు.
“మీరు బ్యాంకింగ్ కంటే, పెయింటింగ్ లో అధిక ఆసక్తిని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నారు?” స్నిగ్ధ అతన్ని అడిగింది.
ఋషి అప్పుడే అప్లోడ్ చేసిన పోలో ఆర్ట్ కలెక్షన్ ను ఆమె చూడసాగింది. అతని వాల్ పోస్ట్ లు అన్నీ, ఆర్ట్ ప్రపంచానికి సంబంధించిన బోలెడంత సమాచారంతో నిండి ఉండడం ఆమె గమనించింది.
“ఒకవిధంగా మీరన్నది నిజమే ! నేను మొదట బ్యాంకర్ ని. కాని, క్రమంగా ఆర్ట్ నాకొక వ్యాపకంగా మారుతున్నట్లు తోస్తోంది “ బదులిచ్చాడు ఋషి.
అతని తాజా అభిరుచిని కొనసాగిస్తూనే, ఋషి ఆసక్తి మరొక కళాఖండం గురించి కూడా మరింత తెలుసుకోవాలన్న దిశగా సాగింది – స్నిగ్ధ వైపుకు.
ఆమె అందంతోబాటు, వృత్తిలో ఆమె చూపించే చురుకుదనం కూడా అతనికి బాగా నచ్చింది. వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ ను, సమతుల్యంగా, గౌరవంగా, నైపుణ్యంతో నడిపే కొత్తతరం స్త్రీలంటే అతనికి ప్రత్యేకమైన ఆసక్తి. ప్రస్తుతం, అతని లిస్టు లో ఉన్న అటువంటి స్త్రీ స్నిగ్ధ మాత్రమే.
“అయితే, మీరు ఇప్పటివరకు చూసినవాటిలో ఉత్తమమైన కళాఖండం ఏది ?” స్నిగ్ధ ప్రశ్నలు కొనసాగించింది.
తన జీవితంలో, తనవంటి అభిరుచినే కలిగిన ఈ కొత్త వ్యక్తి గురించి ఆమె మరింత తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉంది. సంబంధాలను నిలబెట్టడంలో అభిరుచులు కలిసిన సాంఘిక సంబంధాలు ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. ఈ అభిరుచితో కూడిన ఆసక్తిలో నిజాయితీ ఉంటే, ఈ సంబంధాలు చాలా చక్కగా కొనసాగుతాయి.
“నన్నొక ఆర్ట్ నిపుణుడిగా భావించకండి. ఆర్ట్ ప్రపంచంలో ఇంకా నాకు పరిణితి లేదు. మీరు పూర్తి చేసిన ఫార్మల్ కోర్స్ లాగా కాకుండా, నా ఆసక్తి నా వృత్తిరీత్యా జనించినది. నేను నాకిష్టమైన కళాఖండం గురించి చెబితే మీరు నవ్వచ్చు,” అంటూ, ఫేస్బుక్ లో ఈ మెసేజ్ టైపు చేస్తూ నవ్వాడు ఋషి.
“పర్లేదు, మీ అధ్యయనంలో మీకు నచ్చిన ఆ పెయింటింగ్ గురించి చెప్పండి ?”
ఋషికి ఆర్ట్ లో ఉన్న ఆసక్తిని బట్టీ, అతని మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవాలని స్నిగ్ధ అనుకుంది. ఈ మధ్యకాలంలో ఆమె ఇదే విషయంలో పనిచేస్తోంది – ఒక వ్యక్తికి రంగుల్లో ఉన్న ఆసక్తిని బట్టి, నచ్చిన చిత్రాలను బట్టి, అతని స్వభావాన్ని అంచనా వెయ్యటం.
“నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి. కాని ఇప్పటివరకు, టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ న్యూడ్ పోస్ స్కెచ్ కంటే అందమైన స్కెచ్ ను నేను చూడలేదు. ఆ సీన్ చాలా ప్రభావవంతమైనది, ఆ స్కెచ్ మనోహరమైనది.” అంటూ ఋషి తనకు ఇష్టమైన ఆర్ట్ పోస్ గురించి చెప్పాడు.
“అది చాలా చక్కటి ఛాయస్, నాక్కూడా ఆ స్కెచ్ చాలా ఇష్టం. టైటానిక్ చిత్రం తియ్యడం మొదలుపెట్టగానే కేట్, లియోనార్డో డికప్రియో పై తీసిన మొదటి షాట్ అది. ఇంకోసంగతి తెలుసా ? ఆ స్కెచ్ వేసింది, ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్. ఆ సినిమాలో స్కెచ్ వేస్తున్నట్లుగా చూపిన చేతులు దర్శకుడివి, లియోనార్డో వి . అంతేకాదు, ఈ సినిమాలో డికాప్రియో కేట్ కు చూపిన స్కెచ్ బుక్ లో ఉన్న స్కెచెస్ అన్నీ కామెరాన్ వేసినవే,’ వెంటనే బదులిస్తూ ఋషికి చెప్పింది స్నిగ్ధ.
“నిజంగా? నాకు ఇవన్నీ తెలీదు. కాని మామూలు ప్రేక్షకుడిగా, కేట్, డికేప్రియో నటన చూసి, నేను విస్మయం చెందాను. కేట్ రోజ్ అనే పాత్రకు బలం చేకూర్చినట్టే, లియోనార్డో కూడా జాక్ డాసన్ పాత్రకు జీవం పోసాడు. నిజానికి, ఈ సినిమా ఒక పురుషుడు నిజాయితీగా ఒక స్త్రీకి తన సాన్నిధ్యంలో ప్రేమను అనుభవింపచేసేందుకు ఒక కొలమానంలా నేను భావిస్తాను.”
స్నిగ్ధ ఇప్పుడు చర్చలో పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ ఆమెకు ఆసక్తి కలిగిన ఆర్ట్, ప్రేమ రెండూ కలిసి కేంద్రీకరించబడి ఉన్నాయి.
“ అయ్యుండచ్చు. డికేప్రియో ఒక లవర్ బాయ్ గా అద్భుతంగా నటించాడు. అతని చక్కటి, తీరైన ముఖం అప్పట్లో ఎంతోమంది అమ్మాయిల హృదయాన్ని గెల్చుకుంది. ఇది బహుశా, అంతా అనేటట్లు, డికేప్రియో తన కడుపులో ఉండగా ఆమె తల్లి, ఇటలీ లోని మ్యూజియం లో ఉన్న లియోనార్డో డా విన్సీ పెయింటింగ్ నే చూస్తూ ఉండడం వల్ల కావచ్చు,” చెప్పింది స్నిగ్ధ.
ఆమె మళ్ళీ ఇలా కొనసాగించింది, “ కాని మీ యువకులకి, ఒక స్త్రీ కేవలం ప్రేమను మాత్రమే అనుభూతి చెందాలని అనుకోదనీ, మీరు గుర్తించని ఎన్నో విషయాలను వినాలనుకుంటుందని, మీకు ఎప్పటికీ అర్ధం కాదు. ఉదాహరణకు, చిత్రం మొత్తంలో డికేప్రియో కేట్ కు ‘ఐ లవ్ యు’ చెప్పేది కేవలం ఒక్కసారే ! ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, అతను ఆమెను గాడంగా ప్రేమించి ఉండవచ్చు, కాని తరచుగా ఈ విషయాన్ని ఆమెకు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది.” అంది స్నిగ్ధ.
ఋషి నవ్వి, ఇలా అన్నాడు,” అలాగే, నేను ఈ సంగతి గుర్తుంచుకుంటాను. కాని, ఒక యువకుడికి ఆర్ట్ లో, పోర్ట్రైట్ లలో ఆసక్తి ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఉంటే, ఈ సమస్య రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఆమె ఏదైనా పోర్ట్రైట్ ను చూడగానే, అతను మెల్లిగా ‘కలర్ఫుల్ ‘ అంటే సరిపోతుంది. అలా అనేటప్పుడు పెదాల కదలిక ‘ఐ లవ్ యు’ తో సరిపోతుంది. ఆ రకంగా ఆమె, అతని విషయంలో ఆనందంగా ఉండచ్చు.”
“హ హ హ” స్నిగ్ధ బిగ్గరగా నవ్వసాగింది. ఆమె నెమ్మదిగా “కలర్ఫుల్” అనేందుకు ప్రయత్నిస్తూ, అలా అనేటప్పుడు లిప్ మూమెంట్ ‘ఐ లవ్ యు’ తో సరిపోవడాన్ని గమనించింది.
“అయితే, మీకొక గర్ల్ ఫ్రెండ్ ఉందా ?” ఆమె ఋషిని అడిగింది.
చివరికి, ఆమె తన ఆసక్తి వైపే మళ్ళుతున్నట్లుగా ఋషికి అనిపించింది. “లేదు, ఇంతవరకూ లేదు. ఈ రోజుల్లో అంతా చాలా బిజీ గా కనిపిస్తున్నారు.” బదులిచ్చాడు ఋషి.
ఋషి అస్పష్టంగా తన భావనలను స్నిగ్ధకు తెలిపి, ఆమె చొరవ తీసుకోవాలని ఆశించసాగాడు. అతను ఆశించిన దానికంటే, స్నిగ్ధ మరింత సూటిగా ఉంది. ఆమె వెంటనే ఉడికిస్తున్నట్లుగా ఇలా అంది, “ సరే, ఇప్పటినుంచి ఒక నెల వరకూ నేను బిజీ గా లేను. నాకొక కొత్త ఉద్యోగం దొరికింది, ప్రస్తుతం ఒక నెల నోటీసు గడువులో ఉన్నాను. కాబట్టి – ఒక నెల నేను ఖాళీయే.”
ఋషి వెంటనే ఇలా అడిగాడు,” మీకు కొత్త ఉద్యోగం ఎక్కడ వచ్చింది ?”
స్నిగ్ధ సందిగ్ధంలో పడింది, ఆమె ఋషి నుంచి ఆశించిన స్పందన ఇది కాదు. అతని ఉద్దేశాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నానేమో అని ఆమె కాస్త బాధపడింది.
ఆమె బలహీనంగా, “ నేను పోర్ట్లాండ్ స్ట్రీట్ లో ఉన్న మహేంద్ర దసపల్లాకు చెందిన నిర్వాణ ప్లస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాజెక్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాను. మహేంద్ర కొత్త అసైన్మెంట్ – ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీలో నేను ప్రధాన పాత్ర పోషిస్తాను. ఆర్ట్ మ్యూజియం కోసం కొనదగ్గ పెయింటింగ్స్ ఎంపికలో నేను అతనికి సహాయపడబోతున్నాను. ఇది చాలా ఆసక్తికరమైన పని. విశేషించి ఎందుకంటే, ఇది నన్ను ఇండియా కు కలుపుతుంది, మన రాష్ట్రానికే ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్ట్ లో నేనూ పాలుపంచుకునేలా చేస్తుంది.”
చాలాకాలం నుంచి, వ్యాపార నిమిత్తం మహేంద్ర దసపల్లా ను కలవాలని అతను ప్రయత్నిస్తూ ఉండడంతో ఆ పేరు వినగానే ఋషి అత్యుత్సాహం చూపించాడు. అతనితో స్నిగ్ధకు ఉన్న అనుబంధం తనకు మరింత ఉపయోగిస్తుంది, అనుకున్నాడు ఒక క్షణం. వ్యక్తిగతమైన, వృత్తిపరమైన జీవితాలు కలిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అతనికి ఇప్పుడు అలా కలిపే అవకాశం వచ్చింది.
“ఓహ్! ఈ విషయం వినడం చాలా ఆనందంగా ఉంది. హార్దిక అభినందనలు. అటువంటి చారిత్రాత్మకమైన వ్యక్తులతో పనిచెయ్యడం చాలా మంచిది. అటువంటి అనుబంధం ఒక లీడర్ ఎలా పనిచేస్తాడో గమనించే అవకాశం ఇస్తుంది. మహేంద్ర తన సాఫ్ట్వేర్ కంపెనీ ని ఏర్పరచిన విధానం, వ్యాపార దిగ్గజంగా ఎదిగిన వైనం, ఎప్పుడూ ఒక స్పూర్తిదాయకమైన అంశంగా నాకు అనిపిస్తుంది. అతని సంస్థకు ఎంపిక అవ్వటం నిజంగా గర్వించదగ్గ అంశం.” ఋషి మహేంద్ర గురించి తనకు తెలిసిన విషయాలను ఆమెతో పంచుకున్నాడు.
మహేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తి, ఆ రోజుల్లో CA విద్యార్ధులు చాలామంది నిర్వాణా ప్లస్ లో ఉద్యోగం గురించి కలలు కంటూ ఉండేవారు. నిజానికి, మహేంద్ర ఉద్యోగుల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్ కు చెందినవారే. ఆంధ్రా లో ఉన్న ప్రతి కుటుంబం నుంచి, ఒక NRI కొడుకు విదేశాల్లో , నిర్వాణా ప్లస్ లో పనిచేస్తున్నందుకు అతనికి కృతఙ్ఞతలు చెప్పాలి.
ఒక సమయంలో, ఏ ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి జీవితంలోనైనా మూడు దశలు ఉండేవి – CA చదవటం, హైదరాబాద్ లో మొదటి రెండేళ్ళు గడిపేందుకు నిర్వాణ ప్లస్ లో ఉద్యోగం సంపాదించడం, చివరికి ఆ కంపెనీ ప్రాజెక్ట్ ల ద్వారా సంపాదించుకున్న నెట్వర్క్ లను ఉపయోగించి, US గ్రీన్ కార్డు హోల్డర్ గా మారి, మిగతా జీవితమంతా హాయిగా గడపడం.
ఋషి స్నిగ్ధతో మరికొంతసేపు చాటింగ్ చేసి, సైన్ అవుట్ చేసేముందు ఇలా అన్నాడు, “మంచి సంభాషణ. విష్ యు అల్ ది బెస్ట్. మీరు ఒక నెల ఖాళీగా ఉన్నారని, నేను గమనించలేదని ఆలోచించకండి. మీకు బోర్ కొట్టినప్పుడల్లా, నాకు మెసేజ్ ఇవ్వండి. నా నెంబర్ ఫేస్బుక్ లో అప్డేట్ చేసి ఉంది. బై,”అంటూ స్నిగ్ధ ఎలా స్పందిస్తుందో చూడకుండానే వెంటనే లాగ్ అవుట్ చేసాడు, అతనికి స్నిగ్ధ చొరవ తీసుకోవాలని కోరిక. ఇప్పటివరకూ ఆమె అవకాశాలని అందుకుంటూ పోతోంది. ఈ చివరి దాన్ని కూడా తీసుకుంటుందేమో అతనికి వేచి చూడాలని అనిపించింది.
ఋషికి తనలో ఏమి నచ్చిందో ఆమెకు తెలీలేదు. ఎక్కడో ఆమె ఇటువంటి భావన గురించి చదివింది – ఏ కారణం లేకుండా ఒకరిని ఇష్టపడం, వారి సాన్నిహిత్యంలో ఆనందంగా ఉండడాన్ని – ప్రేమ అంటారని.
ఆమె చదివింది నమ్మాలంటే, ఆమె ఇంకా దీని గురించి మరింత అనుభూతి చెందాల్సి ఉంది, అనుకుంటూ ఆమె నిద్రలోకి జారుకుంది.
*******
ఆ రోజు నుంచి వారి స్నేహం కాఫీ లు, డిన్నర్ లు, సుదూరపు నడకలు, ఆర్ట్ గేలరీలు దర్శించడం వంటి వాటి ద్వారా రోజురోజుకీ పెరిగింది. వారి అన్యోన్యత పెరిగిన కొద్దీ, తాము మరింత దగ్గరైనట్లు వారు భావించసాగారు. వారు అనుభూతి చెందుతున్న సామీప్యం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే అది వారిద్దరికి అత్యంత గౌరవం ఉన్న ‘చిత్రకళ’ అన్న అభిరుచి ఆధారంగా రూపొందింది.
కాలేజీ రోజుల్లో, అంతా వ్యామోహాన్నే ప్రేమ అనుకుంటారు. కాని, వారు ఎదుగుతున్న కొద్దీ, ప్రేమ భావనలు ఒక వ్యక్తి వృత్తిపరమైన, వ్యక్తిగతమైన లక్షణాల ద్వారా జనిస్తాయి, ఋషి, స్నిగ్దల విషయంలో అదే జరిగింది.
ఋషి చిత్రకళ పట్ల ఆమెకున్న ఆసక్తిని, అభిరుచిని ఆరాధిస్తే, వృత్తిపరంగా ఋషి చేపట్టిన అస్సైన్మెంట్ కోసం, వివరంగా అన్నీ తెలుసుకునేందుకు అతను చూపించే శ్రద్ధ, ఆమెను ఆకర్షించింది.
దీనివల్ల, కొన్ని వారాల్లోనే వారు స్నేహితుల కంటే దగ్గరై, తరచుగా కలుస్తూ ఎక్కువ సమయాన్ని గడపసాగారు. ఈ సామీప్యం, వారు అభిప్రాయాల్ని పంచుకుని, ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోడానికి అవకాశాన్ని ఇచ్చేది.
వారి బంధం దండలో దారంలాగా ఇమిడిపోయింది అని వారిద్దరూ అంగీకరించారు. ఈ స్నేహాన్ని పెళ్లి రూపంలో కొనసాగించి, మున్ముందు కూడా కలిసి నడవాలని వారు అనుకోసాగారు. దీని గురించి వారు బాహాటంగా చర్చించుకోకపోయినా, ప్రేమ భావన, దాన్ని పెళ్ళిగా మార్చాలనే కోరిక ఎల్లప్పుడూ వారి మనస్సులో ఉంది.
రోజులు గడుస్తుండగా, రిషి తన పనిని కొనసాగిస్తూనే, స్నిగ్ధ సాంగత్యాన్ని కూడా పొందసాగాడు. ఆమె కూడా తన కొత్త ఆఫీస్ లో చేరి, మహేంద్ర మాంచెస్టర్ శాఖలో పనిచెయ్యడం మొదలుపెట్టింది.
****
అతి తక్కువ కాలంలోనే మహేంద్ర చేత విశ్వాసపాత్రమైన ఉద్యోగినిగా గుర్తించబడడంతో కొత్త ఉద్యోగం ఆమెకు ఉత్తేజకరంగా అనిపించింది. ఆమె నేత్రుత్వ లక్షణాలను బట్టి, మహేంద్ర తన సంస్థ పలు చోట్ల నిర్వహించే అంతర్గత శిక్షణా కార్యక్రమాల్లో ఆమెను పాలుపంచుకునేలా చేసాడు.
స్నిగ్ధ రానున్న ఆర్ట్ ఫెయిర్ ల గురించి తెలుసుకునేందుకు అనేక ఆర్ట్ పత్రికలు చూస్తూ, ఆర్ట్ వెబ్సైటులు పరిశీలిస్తూ, మామూలుగా తన రోజును మొదలుపెట్టింది. ప్రతి ఆర్ట్ ఫెయిర్ కి వారి వెబ్సైటులలో ఒక కేటలాగ్ లేక బ్రోచర్ ఇవ్వబడుతుంది. చాలావరకు ఆర్ట్ ఆక్షన్ హౌస్ లు కొంత డబ్బు చెల్లిస్తే, అక్కడకు వచ్చేవారికి ముందుగానే కేటలాగ్ లు పంపుతాయి.
భారతీయ కళాఖండాలుగా పరిగణించదగ్గ కొన్ని పెయింటింగ్స్ ను స్నిగ్ధ కేటలాగ్ నుంచి ఎంపిక చేసింది. అవి ప్రాజెక్ట్ హైదరాబాద్ కు సరిపోతాయో, లేదో తెలుసుకునేందుకు వాటిని మరింత అధ్యయనం చేసింది. ఒక్కొక్క పెయింటింగ్ వెల – కోటి నుంచి 5 కోట్ల దాకా ఉండడంతో, ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసే ముందే వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ఎంతో అవసరం.
అందులోనే రివ్యూలు, సలహాలకు అనుగుణంగా ఒక్కొక్క పెయింటింగ్ కు పర్చేస్ ఆర్డర్ తయారుచెయ్యటం ఆమె బాధ్యత.
ఆ రివ్యూ ఆధారంగా, ఆమె ఇప్పటివరకు 150 కళాఖండాలను గుర్తించి, మహేంద్ర ఆమోదం కోసం పంపింది. ప్రతి 15 రోజులకి, మహేంద్ర ఆమె పంపినవాటిని పరిశీలించి, ప్రాజెక్ట్ కు సరిపోతాయని అతను కూడా అనుకున్నవాటిని ఆమోదించేవాడు. ఈ జాబితాతో కలిపి, ఇప్పటివరకూ ఎంపికైన మొత్తం పెయింటింగ్స్ సంఖ్య 300 లకు చేరుకుంది.
స్నిగ్ధ చేరేముందు ఈ పనిని మృణాల్ చూసుకునేవాడు. మృణాల్ పంపినవాటిలో చాలావరకూ మహేంద్ర తిరక్కొడుతూ ఉండగా, స్నిగ్ధ విషయంలో అది చాలా అరుదుగా జరిగేది.
స్నిగ్ధ ఒక పెయింటింగ్ గురించి సిఫార్సు చేసేముందు, ఆమె నిశిత పరిశీలనకు, చూపించే శ్రద్ధకు ఈ ఘనత దక్కుతుంది.
ఆమె చిత్రాల విలువను నిర్ధారించేటప్పుడు, ఆమె వాటిలో సాంకేతిక మేధస్సునే కాక, వాటిలోని కళాత్మకమైన విలువను కూడా పరిగణనలోకి తీసుకునేది. ఆమె దృష్టి కళాఖండాలను గుర్తించడంపై మాత్రమే కాక, ఒక నిర్దిష్టమైన చిత్రంలోని అపూర్వమైన లక్షణాల వర్ణనపై కూడా ఉండేది.
ఉదాహరణకు, తైలవర్ణ చిత్రాల విలువను నిర్ధారించేటప్పుడు అందులో వాడిన తైలం ఏ రకానిదో, చిత్రం యొక్క నేపధ్యానికి ఆ తైలం వాడడం వెనుక ఉన్న ఆవశ్యకతను ఆమె గమనించేది. ఆమె ఎంపిక చేసిన చిత్రాలలో ప్రామాణ్యతను, వాటి చిత్రీకరణలోని సొగసును, నేర్పును ఆమె రూఢి చేసుకునేది.
మహేంద్ర ఒకసారి ఆమె ఎంపిక చేసిన 19 వ శతాబ్దపు చిత్రకారుడికి చెందిన ‘అ వ్యూ ఆఫ్ ద ష్రైన్ ఇన్ హిమాలయాస్’ అనే చిత్రాన్ని చూసి, ఆమెను ఎంతో మెచ్చుకున్నాడు. ఆ చిత్రం చిత్రకారుడి హిమాలయ యాత్ర తర్వాత వెయ్యబడింది, 1929 లో భారత్ లో ఆవిష్కరించబడింది.
ఆ చిత్రంలో చిత్రకారుడు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని సమగ్రంగా కలిపి రూపొందించినట్టు, అది చూస్తే తెలుస్తుంది. ఆ పెయింటింగ్ ఒక పవిత్రమైన భావనను కలిగిస్తోందని, ప్రపంచపు దృష్టిని మరింత విస్తృతం చేసే ఆధ్యాత్మిక భావనను ఆవిష్కరిస్తోందని, మహేంద్రకు అనిపించింది.
చూపరులను ఆలోచింపచేసేలా ఉండే పెయింటింగ్స్ నే స్నిగ్ధ ఎంచుకునేది. కాన్వాస్ పై ఉండే ‘చెప్పకనే చెప్పేలక్షణం’ లేక చమత్కారంతో కూడిన నైపుణ్యం, చూపరులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది, ఇదే భావనను ఆర్ట్ మ్యూజియం కు వచ్చే చాలా మంది సందర్శకులు ఆస్వాదిస్తారు.
చివరికి, ఆమె కళాఖండాల సాధికారత గురించి కూడా ఆమె శ్రద్ధ వహించేది. వాటికి విలువకట్టే ముందే ఆమె, ‘సర్టిఫికేట్ ఆఫ్ ప్రోవెనన్స్ ‘ కోసం పట్టుబట్టేది. ఆర్ట్ ప్రపంచంలో ఉన్న మోసాలను దృష్టిలో పెట్టుకుంటే, అసలైన చిత్రాల కోసం ఆమె పడే శ్రమ అర్ధం చేసుకోదగ్గదే.
అందుకే ఆర్ట్ రంగంలోని ఆర్టిస్ట్ ల సరికొత్త నేపధ్యాలను, తాజా పరిణామాల్ని అనుసరించినప్పుడే, అసలైన చిత్రాల్ని, వాటి విలువకు తగ్గట్టుగా ఎంపిక చెయ్యడం సాధ్యమవుతుంది.
ఒకసారి ఆ పెయింటింగ్ కొనుగోలుకు అనుమతి లభించగానే, ఆమె ఆ ప్రాజెక్ట్ ను అప్సర, మృణాల్ లకు అప్పగించేది.
అప్పుడు మృణాల్ అందులో ఉన్న వివరాలకు అనుగుణంగా, ఆ అమ్మే వ్యక్తిని సంప్రదించి, బేరసారాలు మొదలుపెట్టేవాడు.ఒకవేళ ఆ కళాఖండాన్ని పేరున్న అంతర్జాతీయ డీలర్ ల నుంచి కొనాలన్నా, ఆక్షన్ హౌస్ ల నుంచి కొనాలన్నా, అప్సర అతనికి సహకరించేది.
బేరసారాలు ముగిసాకా, కొనుగోలుకు తుది మెమో సిద్ధం కాగానే, వాటికి సంబంధించిన పత్రాలతో సహా, మృణాల్, స్నిగ్ధ అన్నీ సిద్ధంచేసి, మహేంద్రకు పంపేవారు. మహేంద్ర దాన్ని ఆమోదించగానే, ఇండియా నుంచి మొత్తం బ్యాంకు వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా అమ్మేవారి ఖాతాలో జమచెయ్యబడేది.
అమ్మేవారికి డబ్బు అందగానే, ఆ పెయింటింగ్ మాంచెస్టర్ ఆఫీస్ కు పంపేవారు. అక్కడ స్నిగ్ధ, మృణాల్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అందులోని పర్చేస్ ఆర్డర్ కు తగిన విధివిధానాలు పూర్తి చేసి, దాన్ని భారత్ కు ఎగుమతి చేసేందుకు అనుమతించేవారు. ఈ ప్రక్రియ అంతా వారం పదిరోజులు తీసుకునేది.
వృత్తిపరమైన జీవితంలో మృణాల్, అప్సర లతో, వ్యక్తిగతమైన జీవనంలో ఋషి తోనూ, ఆమెకు రోజులు హాయిగా గడిచిపోతాయని, ఆమె మొదట్లో భావించింది.
ఋషి విషయంలో అనుకున్నది అనుకున్నట్లే జరిగినా, మిగిలిన ఇద్దరితో ఆమెకు కొన్ని సమస్యలు ఉన్నాయని, ఆమె గుర్తించింది.
మృణాల్ నెమ్మదస్తుడు, ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. స్నిగ్ధకు కొన్నిసార్లు అతని చూపులు ఇబ్బందికరంగా ఉండడం ఆమె గమనించింది. అందుకే ఆమె ఎప్పుడూ అతనితో ఎక్కువ మాట్లాడేది కాదు.
ఇక అప్సర గుణం ఎటువంటిదో స్నిగ్ధకు అంతుబట్టలేదు. ఆమె చాలా ఆస్తిపరురాలని, తెలివైనదని, తన సిబ్బంది నుంచి ఒకటి రెండు సార్లు వింది. ముఖ్యంగా, అప్సర మహేంద్రకు చాలా దగ్గర మనిషిలా ఆమెకు అనిపించేది.
మహేంద్ర వారంలో 3 సార్లు ఆన్లైన్ ద్వారా, లేక ఫోన్ ద్వారా స్నిగ్ధను సంప్రదించేవాడు. కాని, అతను మాంచెస్టర్ కు మూడు నెలలకు ఒకసారి వచ్చి 3,4 రోజులు ఉండేవాడు. అలా వచ్చినప్పుడు, అతను ఆఫీస్ కు కేవలం ఒక్కసారే వచ్చేవాడు. మామూలుగా, అతను స్టార్ హోటల్ లో ఉండేవాడు. హోటల్ లోని కాన్ఫరెన్స్ రూమ్స్ ద్వారా తన సంప్రదింపులు జరిపేవాడు.
అటువంటి మీటింగ్స్ అన్నీ అప్సర షెడ్యూల్ చేసేది. ఈ మీటింగ్స్ అన్నీ వివిధ ఆర్ట్ డీలర్ లతో , అనేక దేశాల నుంచి వచ్చే, ఆర్ట్ పట్ల విభిన్నమైన ఆసక్తి ఉన్న సందర్శకులతో జరిగేవి.
స్నిగ్ధకుఆఫీస్ పనిని గురించి పూర్తి అవగాహన కలుగగానే, ఆమెను తన హై ప్రొఫైల్ మీటింగ్స్ లో పాలుపంచుకునేలా చేస్తానని, మహేంద్ర ఎప్పుడూ అంటూ ఉండేవాడు.
ఈ దశలో, ఇటువంటి మీటింగ్స్ అన్నీ అప్సర ఏర్పాటు చేసేది. కాని, మృణాల్ కూడా ఆ సమయంలో అప్సరకు పర్సనల్ సెక్రటరీ గా శాయశక్తులా ఆమెకు సహకరించేవాడు.
ఆ వ్యాపార లావాదేవీల గురించి తెలుసుకోవాలని, స్నిగ్ధకు ఆసక్తి ఉన్నా, ఆమె మహేంద్ర తనకు గీసిన గీతని ఎన్నడూ దాటలేదు. ఆమెకు వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని కలపడం, తద్వారా దృష్టి మళ్లడం కూడా ఇష్టంలేదు.
ఇది ఒకరోజు ఆమె అవసరంగా ఋషికి ఫోన్ చెయ్యాల్సి వచ్చేవరకూ కొనసాగింది.
“హాయ్ మృణాళ్. గుడ్ మార్నింగ్. 5 నిముషాల్లో నా డెస్క్ వద్ద నన్ను కలవగలవా ? “ ఇంటర్కాం లో మృణాళ్ కు ఫోన్ చేసింది స్నిగ్ధ.
ఆ రోజు సోమవారం, స్నిగ్ధ ఆఫీస్ కు త్వరగా వచ్చింది. ఆమె పెండింగ్ వర్క్ అంతా క్లియర్ చేసి, ఆ వారం చెయ్యాల్సిన పనులను సిద్ధం చేస్తోంది.
“నలదమయంతి పెయింటింగ్ అందలేదని నాకు హైదరాబాద్ ఆఫీస్ నుంచి ఫోనొచ్చింది. మనం రెండు వారాల క్రితమే పంపామని నేను వారికి మెయిల్ పంపాను. నేను ఈ పెయింటింగ్ ను దాదాపు నెల క్రితమే క్లియర్ చేసాను. ఆలస్యానికి వేరేదైనా కారణం ఉందా ?” తన డెస్క్ వద్దకు వచ్చిన మృణాళ్ ను అడిగింది స్నిగ్ధ.
“నేను వేరే పనుల్లో చిక్కుకుని ఉండడంవల్ల ఇది కాస్త ఆలస్యమయ్యింది. ఒకటి రెండు రోజుల్లో దాన్ని క్లియర్ చేస్తాను.” హామీ ఇచ్చాడు మృణాళ్. సూటిగా అతనిచ్చిన జవాబు స్నిగ్ధ అతన్ని ప్రశ్నించడం అతనికి ఏ మాత్రం ఇష్టం లేదని సూచిస్తోంది.
“ నీ పని ఒత్తిడిని నేను అర్ధం చేసుకోగలను. కానీ, ఈ ప్రాజెక్ట్ నవంబర్ కు ప్రారంభం కానుంది. మనం మార్చ్ లో ఉన్నాము. ఇంకా 8 నెలలే ఉంది, ఇంకా మనం 200 పెయింటింగ్స్ ను ఎంపిక చేస్తేనే మన 500 టార్గెట్ ను చేరుకోగలుగుతాము. రానున్న రోజుల్లో మనకు మరింత ఒత్తిడి పెరగనుంది. నీకు నా సాయం కావాలంటే చెప్పు.” మర్యాదగానే మృణాళ్ కు చెప్పినా ధృడంగా పలికింది ఆమె స్వరం.
“నేను క్లియర్ చేసినా, హైదరాబాద్ పంపకుండా ఆఫీస్ లో పడున్న పెయింటింగ్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో నేను తెలుసుకోవచ్చా ?” మరిన్ని వివరాలు తెలుసుకోవాలని, అడిగింది స్నిగ్ధ.
“దాదాపు 10 ఉంటాయి. నేను ఈ వారాంతం లోపు అవన్నీ క్లియర్ చేస్తాను,” హామీ ఇచ్చాడు మృణాళ్.
“ఓకే. నేను మధ్యాహ్నం స్టోర్ హౌస్ కు వచ్చి, స్టాక్ పరిస్థితి ఏమిటో సమీక్షిస్తాను. దీనికి ఏర్పాట్లు చెయ్యగలవా ?” తనకున్న పరిమితుల్ని అధిగమించి బాధ్యత తీసుకోవడం అనే స్నిగ్ధ లక్షణమే ఆమె మహేంద్ర మెప్పును పొందేలా చేసింది.
మృణాళ్ అసౌకర్యాన్ని దాచేందుకు ప్రయత్నిస్తూ, “ఓ, తప్పకుండా, నేను రేపటికల్లా ఏర్పాట్లు చేస్తాను. ఓకే నా ?” అంటూ వెంటనే స్పందించాడు.
“ఓకే. పర్వాలేదు. కాని, మీకు ఇబ్బంది కలిగినప్పుడు సాయపడేందుకే నేనిక్కడ ఉన్నానని, మీరు గుర్తుంచుకోండి. అందుకే, మనిద్దరం కలిసి, పని ఎంతుందో చూసి, పెండింగ్ ఉన్నవన్నీ రేపటికి క్లియర్ చేద్దాం.” అంది స్నిగ్ధ వాతావరణాన్ని తేలిక పరుస్తూ, మృణాళ్ కు దిగ్భ్రమ నుంచి తేరుకునే అవకాశమిస్తూ.
ఆమె క్యాలెండరు చూసి, అప్సర ఆ రోజు మధ్యాహ్నం తనను కలిసేందుకు రానుందని గుర్తించింది. అప్పటినుంచి, రోజువారీ పనుల్లో పడిపోయి, లంచ్ టైం వరకు ఇట్టే గడిచిపోయింది. ఆమె లంచ్ ముగించుకుని రాగానే, తనకోసం లాంజ్ లో ఎదురుచూస్తూన్న అప్సర ఆమెకు కనిపించింది.
“హలో అప్సరా, ఎలా ఉన్నావు ? లంచ్ అయ్యిందా ? “ అడిగింది స్నిగ్ధ. అప్సర ఎప్పట్లాగే చక్కగా అలంకరించుకుని కనిపించింది ఆమెకు.
అప్సర స్నిగ్ధ కంటే 8 ఏళ్ళు పెద్దది, కాని చెబితే తప్ప, ఎవరూ ఆ వయసు తేడాని గమనించలేరు. అప్సర అలా మైంటైన్ చేస్తుంది. ఆమె వయసు ముడుతలు లేకుండా చాలా నాజూగ్గా కనిపిస్తుంది, దాన్నే ఆమె దర్పంగా ప్రదర్శిస్తుంది.
మామూలుగా తన ఒంపుసొంపుల్ని, శరీరాకృతిని ప్రదర్శించగల వెస్త్రెన్ దుస్తుల్ని ఆమె ధరిస్తుంది. ఏ పురుషుడికైనా, వారి దృష్టిని ఇట్టే ఆకర్షించగల అయిస్కాంతం లాగా ఆమె కనిపిస్తుంది. ఆకర్షణను తట్టుకునే వారి నిగ్రహ శక్తికి ఆమె ఒక పరీక్షలా కనిపిస్తుంది. ఆమె నడుస్తున్నప్పుడు, ఆమె వెనుక భాగాన్ని ఒంపులు తిప్పుతూ స్పష్టపరిచే హై –హీల్స్ షూస్ ధరిస్తుంది. ఆమె అలా కదిలి వెళ్ళినప్పుడల్లా, చూపరులకు మతిపోగోట్టేలా ఆమె తననుతాను ప్రదర్శించుకునే విధానం, వారిని మూర్చపోయేలా చేస్తుంది.
“లంచ్ అయింది స్నిగ్ధా. నీది ?” సమ్మోహనంగా నవ్వినా నవ్వు ఆమె వదనానికి మరింత అందం తెచ్చింది.
స్నిగ్ధ తన శరీరం గురించి, కావలసినంత శ్రద్ధ మాత్రమే వహిస్తుంది, ఆమె అందం ఆమె సింప్లిసిటీ లోనే ఉంది. స్నిగ్ధలా కాకుండా అప్సర, చూపరుల కళ్ళకు ఏదోఒకటి అందిస్తూనే ఉంటుంది.
అప్సర కనిపించే విధానం గురించి స్నిగ్ధకు అభ్యంతరాలున్నా, ఎప్పుడూ వెల్లడించే ధైర్యం చెయ్యలేదు. స్నిగ్ధ, అప్సర భిన్న ధృవాల వంటివారు, అయినా స్నిగ్ధకు ఇటువంటి విషయాల గురించి పట్టించుకునేందుకు తగిన కారణం లేదు.
అప్సరతో ఆమె సంప్రదింపులు అన్నీ చాలావరకు పనికి సంబంధించినవే. వ్యాపారరీత్యా ఆమె సూక్ష్మబుద్ధిని స్నిగ్ధ ప్రశంసించినా, ఆమె ప్రాజెక్ట్ కు ఎంపిక చేసే కళాఖండాల పట్ల స్నిగ్ధకు అభ్యంతరాలు ఉండేవి.
చాలావరకు, అప్సర వివాదాస్పదమైన కళాఖండాలను ఎంపిక చేసేది. అటువంటివి చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయని ఆమె అభిప్రాయం.
అటువంటి వాటి అన్వేషణలో, మ్యుజియం యొక్క కళాత్మకమైన అంశాల నుంచి, సహజంగానే ఆమె దృష్టి మళ్లేది. ఈ విషయంలో స్నిగ్ధ తరచుగా అప్సరతో ఈ విషయంపై వాదించేది – సంచలనాత్మకమైన వాటిని ఎన్నుకోవడం కంటే, మ్యుజియం కు ఆ కళాఖండం ఎంతటి ప్రతిష్టను కలిగిస్తుంది అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అనేది.
ఈ రోజు కూడా, తను ఎంపిక చేసిన ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్స్ ను స్నిగ్ధ ముందుకు కదిపేందుకు నిరాకరించడంతో, ఆ విషయం గురించి చర్చించేందుకే అప్సర స్నిగ్ధను కలిసింది. అవి వివిధ భంగిమల్లో చిత్రించిన హిందూ దేవతల నగ్న చిత్రాలు. ప్రతి పెయింటింగ్ లోనూ, ఆ దైవం చేతిలోని ఆయుధం తప్ప, వారిని పూర్తిగా నగ్నంగా చిత్రీకరించారు.
కేట్ విన్స్లెట్ ఆ పోస్ లో వంటిపై కేవలం ఒక డైమండ్ లాకెట్ తో సుందరంగా కనిపించినా, దేవతల చిత్రాల విషయంలో అది కాస్త భావగర్భితమైన విలువల్ని కలిగి ఉంటుందని స్నిగ్ధ భావించింది. అందుకే ఆమె సిఫార్సు చెయ్యబోయే పెయింటింగ్స్ జాబితాలో వాటిని చేర్చేందుకు నిరాకరించింది. కాని అప్సర దీని గురించి చర్చించేందుకు పట్టుబట్టి, ఇదే విషయాన్ని మాట్లాడేందుకు స్నిగ్ధ ఆఫీస్ కు వచ్చింది.
స్నిగ్ధ ఆమెను కాన్ఫరెన్స్ రూమ్ కు తీసుకువెళ్ళి, అప్సర చర్చను మొదలపెట్టాలని ఎదురు చూడసాగింది.
“అయితే స్నిగ్ధ,చివరికి మనం ఈ పెయింటింగ్స్ ను మ్యుజియం కలెక్షన్ లలో పెడుతున్నట్టేనా ?” అప్సర నేరుగా విషయానికి వచ్చింది.
“అప్సరా అది ప్రైవేట్ మ్యుజియం అయితే నేను వాటిని తీసుకునేదాన్ని. కాని ప్రజలముందు ప్రదర్శనకు ఉంచినప్పుడు, అదీ దక్షిణ భారతంలో అంటే, ఈ పెయింటింగ్స్ కేవలం జుగుప్సాకరమైన విలువని, చెడ్డ ప్రచారాన్ని మాత్రమే కల్పిస్తాయని, నేను భావిస్తున్నాను. అటువంటి ప్రచారాన్ని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న మన మ్యుజియం తట్టుకోలేదు.” స్నిగ్ధ మరొక్కసారి తన భావాల్ని స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో వెల్లడించింది.
ఇప్పుడామె అప్సరకు ఏ మాత్రం బెదరకుండా ఇటువంటి సంభాషణలను కొట్టిపారేస్తోంది. ఆమె తనను తాను ఈ సంస్థలో ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగినిగా భావించడంవల్ల, తన పనిలో జోక్యం కల్పించుకున్న ఎవరితోనైనా మాట్లాడే ధైర్యాన్ని కలిగిఉంది.
అప్సర వెనక్కు తగ్గింది. ఆమె అహం దెబ్బతిన్నట్టు కనిపించింది. ఆమె సూటిగా స్నిగ్ధ కళ్ళలోకి చూస్తూ, “స్నిగ్ధ ఒక్కొక్క పెయింటింగ్ వెల ఎంతో నీకు తెలుసా ? ఒక్కొక్కదానికి సుమారు 5 కోట్లు. ఎందుకో నీకు తెలుసా – అన్ని వేలం వస్తువుల్లో వీటికి అత్యధికమైన డిమాండ్ ఉంది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి, త్వరగా వీటిని అమ్మాలని చూస్తున్న ఒక ప్రైవేట్ ఆర్ట్ కలెక్టర్ ను నేను అతికష్టం మీద ఒప్పించాను.” అంది.
స్నిగ్ధ ఇంకా దీనితో ఏకీభవించినట్లు కనిపించలేదు. ఆమె మహేంద్రకు ఫోన్ చేసి, దీనిపై ఒక నిర్ణయానికి వద్దామని అంది. వాళ్ళు వెంటనే ఇండియాకు కాల్ చేసి, మహేంద్ర సెక్రటరీని అతనితో మాట్లాడించమని అభ్యర్ధించారు. మహేంద్ర లైన్ లోకి రాగానే, అప్సర ముందుగా చొరవ తీసుకుని, ఆ నగ్న దేవతా చిత్రాలు మ్యుజియం కు తేగల సంచలనాత్మకమైన విలువను గురించి చెప్పింది. మొదట్లో అటువంటి ప్రచారం మ్యుజియం కు మరింతమంది సందర్శకులను ఆకర్షించేందుకు ఉపయోగిస్తుందని, ఆమె అంది.
స్నిగ్ధ తన అభిప్రాయాన్నే తెలుపుతూ, మ్యుజియం అటువంటి చవకబారు పనులను ప్రోత్సహించకూడదు అంది. ఆమె మ్యుజియం ప్రారంభోత్సవాన్ని రాజకీయంగా సునిశితమైన అంశాన్ని చేస్తూ, పూర్తిగా ఆపివెయ్యగల ఉద్యమకారుల గురించి కూడా మహేంద్రకు సూచన చేసింది. అంతేకాక, మ్యుజియంకు వారు అనుకున్న విధానాల దృష్ట్యా ఇవి జాతీయ కళాఖండాలు కూడా కావని, ఆమె చెప్పింది.
అన్నీ విన్నాకా, మహేంద్ర ఇలా బదులిచ్చాడు, “ అప్సర, స్నిగ్ధ చెప్పేది చాలా సమంజసంగా ఉందని నాకు అనిపిస్తోంది. ప్రారంభ దశలో ఊహించని చెడు ప్రచారం ఎదుర్కునే కంటే, నేను అంతగా పేరుప్రఖ్యాతులు రాకపోయినా నిలకడగా ఉండడాన్నే ఇష్టపడతాను. నీ కష్టాన్ని నేను అభినందిస్తున్నా, నేను మరికొంతకాలం వేచి ఉండి, దీన్ని గురించి ఒక నిర్ణయానికి వద్దాము.”
అప్సర మళ్ళీ వాదించబోయింది, కాని మహేంద్ర స్వరంలో పలికిన అయిష్టతను దృష్టిలో పెట్టుకుని, మరొక్కసారి ఆలోచిస్తూ, విరమించుకుంది.
“అప్సరా, ఈ దశలో మన ప్రాధాన్యతల గురించి మనం స్పష్టంగా ఉందాము. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం, మీడియా పబ్లిసిటీ ను పెంచడం కాదు, టూరిస్ట్ లను, సందర్శకులను పెంచడం. మరిన్ని పెయింటింగ్స్ కోసం నీ అన్వేషణ కొనసాగించు, కాని అలా వెతికేటప్పుడు, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని సరిగ్గా ప్రతిబింబించే వాటినే ఎంచుకో.” అంటూ తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాడు మహేంద్ర .
“ఉదాహరణకి, నువ్వు ప్రద్యుమ్న పెయింటింగ్స్ ను ఎన్నింటిని వెతికి పట్టినా నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే దేవతల్ని అతను చూపే విధానం కళ్ళకు ఇంపుగా ఉండి, గొప్ప చారిత్రాత్మకమైన విలవల్ని కలిగి ఉంటుంది. ఇదే విషయం నేను నీకు అనేకమార్లు చెప్పాను, నాకు ప్రద్యుమ్న చివరగా వేసిన ‘మేనకా విశ్వామిత్రా పెయింటింగ్ ‘ ను ఎలాగైనా తీసుకురావాలని ఉంది. అది నువ్వు తేగలిగితే, అంతకంటే గొప్ప ప్రచారం ఉండదు. ఆ దిశలో నీ ప్రయత్నాలను కొనసాగించు.” అని చెప్తూ, మహేంద్ర ఫోన్ పెట్టేసాడు. గదిలో అప్సర, స్నిగ్ధ కాసేపు మౌనంగా ఉండిపోయారు. అప్సర కాస్త నిరాశకు గురైనా, దాన్ని మొహంలో కనిపించనివ్వలేదు.
*********
మర్నాడు ఉదయం స్నిగ్ధ రాగానే మృణాల్ ఆమెను పలకరించి, పెయింటింగ్స్ ఉన్న క్రింది అంతస్తులోని హాల్ కు వెళదామా అని అడిగాడు. ఆమె సైన్- ఇన్ రివాజులను పూర్తిచేసి, అతనితో వెళ్ళింది.
రెండవ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ద్వారా వెళ్ళేబదులు, ఆమె మెట్లు దిగసాగింది. మృణాళ్ ఆమెను అనుసరించసాగాడు. ఆమె మెట్లు దిగుతుండగా, మృణాళ్ ఆమెను తేరిపారా చూస్తున్నట్లు ఆమెకు అనిపించింది.
మగవారు చాలాసార్లు వారి మనసులోని ఆలోచనలను, భావనలను చెప్పరు. ప్రదర్శిస్తారు. ఒక ఆర్ట్ స్టూడెంట్ గా, చూపుల్ని, అంగవిన్యాసాల్ని చదవగలగడం ఆమెకు సహజంగానే అబ్బింది.
మగవారు తమలోని భావాల్ని దాచగాలిగామని భావించినా, తన వద్ద ఉన్న ఒక వ్యక్తి తనను కామంతో చూస్తున్నాడో, లేక గౌరవభావంతో చూస్తున్నాడో ఆమె తేలిగ్గా చెప్పగలదు.
ఆమె క్రింది ఫ్లోర్ ను చేరుకోగానే, పరిస్థితిని సమీక్షించేదుకు చూస్తే, అక్కడ నేలమీద 12 పెయింటింగ్ లు, వాటికి హాని కలిగే విధంగా దాదాపు ఒక నెలపైనుంచే పడున్నాయని, గుర్తించింది.
“మృణాళ్ , ఈ పెయింటింగ్స్ ను హేండిల్ చెయ్యడంలో మనం మరింత జాగ్రత్త వహించాలని నాకు అనిపిస్తోంది. మరొక్క విషయం నాకు చెప్పు – మొత్తం ప్రక్రియ పూర్తయినా, ఈ పెయింటింగ్స్ ను ఎక్స్పోర్ట్ చేసేందుకు కంటే ఎక్కువ సమయం ఎందుకు పడుతోందో చెప్పు ?” స్నిగ్ధ ఇప్పుడు కారణాలు తెలుసుకోవాలని అనుకుంటోంది.
కాని, మృణాళ్ తనకు చాలా నిర్లక్ష్యంగా జవాబు చెప్పినట్లు ఆమెకు అనిపించింది. పైగా అతని కళ్ళు ఆమెను ఆకలిగా తడుముతున్నాయి. మృణాల్ కళ్ళలో కనిపించిన కామం, ఒక్కక్షణం పాటు ఆఫీస్ లో మొట్టమొదటిసారిగా ఆమె చూపుల్ని వెనక్కి తీసుకునేలా చేసింది. కాని, వెంటనే ఆమె తేరుకుని, ఆ భావాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
“బాధపడకు స్నిగ్ధ, నేను ఈ గందరగోళాన్ని త్వరలోనే క్లియర్ చేస్తాను. ఒక వారం సమయం ఇవ్వు, నేను అన్నీ పంపేస్తాను,” అన్నాడు. విషయం మహేంద్ర దాకా వెళ్తే, మరింత క్లిష్టం అవుతుందని అతనికి తెలుసు. మహేంద్రకు తనపట్ల కంటే, స్నిగ్ధ పట్ల ఎక్కువ గౌరవం ఉందని కూడా అతనికి తెలుసు. అందుకే, అప్పుడే, అక్కడే త్వరగా ఆ సమస్య పరిష్కారం అవ్వాలని అతను భావించాడు.
“సరే అయితే. త్వరగా పూర్తిచెయ్యి. రాబోయే కొన్ని వారాల్లో మన పని ఒత్తిడి పెరగనుంది. మన ఆఫీస్ లో ఉన్న కాస్తంత స్థలంలో మనం పెయింటింగ్స్ ను పేరుస్తూ పోలేము. ఇవాళ మరో పెయింటింగ్ ఉ అప్పగించనున్నారు. దీనివల్ల, మనకు పెయింటింగ్స్ ను సరిగ్గా ఉంచేందుకు తగినంత స్థలం లేదని తెలుస్తోంది. ఈ హాల్ ప్రక్కన ఉన్న గదిలో కాస్త చోటు ఉందేమో చూడకూడదూ ?” స్నిగ్ధ మృణాళ్ ను అడిగింది.
మృణాళ్ చాలా అసహనంగా కనిపిస్తూ, “స్నిగ్ధా, నువ్వు చింతించకు, దీని గురించి నేను చూసుకుంటాను. పెయింటింగ్స్ ను గురించి తగినంత శ్రద్ధ వహించడం నా బాధ్యత. అందుకే, ఈ పనిని నాకు వదిలెయ్యి. ప్రక్కన ఉన్న గది, మహేంద్ర ప్రైవేట్ రూమ్. అది ఆయనకు ఎందుకు కావాలో నేను ఎప్పుడూ అడగలేదు, నువ్వు కూడా అడిగేంత సాహసం చేస్తావని నేను భావించట్లేదు, కదూ ? లేక అడుగుతావా ?” అతను ఉద్దేశపూర్వకంగా సంభాషణను ముగించాలని అనుకున్నాడు.
స్నిగ్ధ అతని అంగవిన్యాసాన్ని అర్ధం చేసుకుని, సంభాషణను ఇక పొడిగించలేదు. “ సరే, నువ్వెలా చెప్తే అలా, కాని ఈ శుక్రవారానికి స్టాక్ తీసుకుని, రాబోయే కొన్ని వారాలకు ప్లాన్ చేద్దాము,” అంటూ తన డెస్క్ కు తిరిగి వెళ్ళిపోయింది.
మృణాళ్ ఆమెను త్వరగా అనుసరించాడు, ఆమెకూ అతనితో చర్చను తేలికపరచాలని ఉంది. క్రింది ఉద్యోగులు కాకుండా, తనకు ఉన్న ఒకేఒక్క సీనియర్ ఉద్యోగి అతను. అతనితో వ్యవహారం చెడితే, ఆమె ఉద్యగం వదలాల్సి రావచ్చు. అటువంటి మూర్ఖపు కారణాల కోసం ఆమె తన ఉద్యోగం వదులుకునేందుకు సిద్ధంగా లేదు.
“మృణాళ్, ఒక సంగతి చెప్పు, నీకు ఇష్టమైన రంగు ఏది ?” వాతావరణాన్ని తేలిక పరుస్తూ అడిగింది స్నిగ్ధ.
ఈ ప్రశ్నల ద్వారా ఆమె మృణాళ్ ను గురించి మరింతగా తెలుసుకోవాలని అనుకుంటోంది.
మృణాళ్ ఆమె స్వరంలోని మార్పును గమనించి నవ్వి, “నాకు నీలిరంగులో ఉండేవి అన్నీ ఇష్టమే...” అంటూ ఒక్క క్షణం ఆగి...” ఫిలిమ్స్ కూడా” అన్నాడు.
స్నిగ్ధకు ఆ జవాబు ఎంతమాత్రం నచ్చలేదు, అతనితో ఇవాళ ఇక మాట్లాడకూడదని ఆమె అనుకుంది. కాని, “బాగుంది, ఇది మగవారు అందరికీ ఇష్టమైన రంగు. ఎందుకంటే, ఇది అధికారాన్ని, మేధస్సును, స్థిరత్వాన్ని సూచిస్తుంది. గుడ్ లక్ ” అని బదులిచ్చింది.
ఆమె తన చోటుకు వెనక్కు వెళ్లి, పనిని కొనసాగించింది. కాని, ఇంకా అతను పిచ్చివాడిలా తనవంక చూస్తున్నాడని, ఆమె సబ్ కాన్షస్ మైండ్ కు అనిపించసాగింది. ఆమె ఆ భావనను త్వరగా అధిగమించింది, ఎక్కడ పనిచేసినా మొదట తను ఎదుర్కోవాల్సిన సాధారణమైన సమస్య అదే.
అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా కూడా, తనకంటే 17 ఏళ్ళు చిన్నదైన, పింక్ కలర్ శాటిన్ డ్రెస్ వేసుకున్న G -8 డెలిగేట్ దొంగచూపులు చూస్తూ, దొరికిపోయాడని ఒకరోజు దినపత్రికలో ఆమె చదివింది. ఇటలీ లో ఆ సదస్సు గ్రూప్ ఫోటో తీసేముందే, సరిగ్గా ఇది జరిగింది.
“ఋషి కూడా ఇందుకు అతీతం కాకపోవచ్చు. “ అనుకుంది ఆమె ఒక్కక్షణం. ఋషిని గురించిన ఆలోచన ఆమె భావోద్వేగాల స్థాయిని వెంటనే చల్లార్చింది. సాయంత్రం అతనితో మాట్లాడితే, తనకు కాస్త హాయిగా ఉంటుంది, అని ఆమెకు తెలుసు. ఆమె ఆఫీస్ లో చేరాకా, మొదటిసారి, మృణాళ్ ప్రవర్తన ఆమెను సందిగ్ధంలో పడేసింది.
ఆమె మొబైల్ తీసి, ఋషికి కాల్ చేసింది. అతను వెంటనే తీసాడు, “ఋషి, మనం ఇవాళ డిన్నర్ కు కలుద్దామా ?” అని అడగ్గానే ఋషి హుషారుగా ఎగిరి గంతేసి, ఆమె అడిగినదానికి ఒప్పేసుకున్నాడు.
ట్రాఫోడ్ సెంటర్ లో డిన్నర్ కు కలిసాకా, “నీ ఆఫీస్ పనులు ఎలా కొనసాగుతున్నాయి ? ఇంకేం చేస్తున్నావ్ ?” అని ఋషిని అడిగింది స్నిగ్ధ.
మాంచెస్టర్ సిటీ వెలుపల ఉన్న పెద్ద ఇండోర్ షాపింగ్ సెంటర్ ట్రాఫోడ్ సెంటర్. యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలోనే, ఈ ట్రాఫోడ్ సెంటర్ కట్టేందుకు వేసిన ప్లాన్, అత్యంత విస్త్రుతమైనది, ఖరీదైనదిగా నిలిచిపోయింది. 1.4 మిలియన్ల చదరపు అడుగుల వైశాల్యంలో కట్టిన ఈ సెంటర్ కి ఏడాదికి 30 మిలియన్ల సందర్శకులు వస్తారని అంచనా. అందులో ఉన్న ఓరియంట్ అనే 1600 మంది పట్టే, ఫుడ్ కోర్ట్, 20 స్క్రీన్లు ఉన్న మల్టీప్లెక్స్ సినిమా హాల్లో వారు కలిసారు.
“ఋషి, ఇవాళ నన్ను ఆందోళనకు గురిచేసిన ఒక విషయం గురించి నీకు చెప్పాలి. ఎందుకో ఇవాళ మృణాళ్ నన్ను చూసిన విధానం నాకు నచ్చలేదు. దీని గురించి నువ్వు ఏమంటావ్ ?” వెంటనే తన భావాలను ఋషితో పంచుకుంది స్నిగ్ధ. ఆమె వ్యాకులంగా కనిపించింది.
“అలాగా ? ఈ గ్లాస్ నీళ్ళు తాగి ఒక్క క్షణం రిలాక్స్ అవ్వు. “ ఋషి ఆమె చాలా కలతచెంది ఉందని అర్ధం చేసుకుని, ఆమెకు కాస్త ఊరట కలిగించాలని అనుకున్నాడు. మృణాళ్, అప్సరలు తనకు వ్యక్తిగతంగా తెలియకపోయినా, వారి గురించి అంతకు ముందు స్నిగ్ధ మాటల్లో విన్నాడు.
“ఓకే, నన్ను కాస్త రిలాక్స్ అవ్వనివ్వు. నీ మూడ్ పాడుచేస్తే క్షమించు. ఉన్న పరిస్థితి కంటే నేను దాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకున్నానేమో అనిపిస్తుంది.”అంటూ క్షణం బాధపడింది స్నిగ్ధ.
ఋషి ఆమెను మళ్ళీ ఉత్సాహపరచాలని అనుకున్నాడు. అందుకే అల్లరిగా,”ఇది నిజమే కావచ్చు. మృణాళ్ అతని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని చూస్తున్నాడేమో, నువ్వే అతన్ని అపార్ధం చేసుకున్నావ్.”
“ఏంటి ?ఆరోగ్యం కోసమా ? నేను ఇప్పుడన్నది నీకు అర్ధం కాలేదు అనుకుంటా. అతని చూపులు – ఎవరైనా అలా స్కాన్ చేస్తున్నట్టు చూస్తే, ఎలా అనిపిస్తుందో నీకు తెలుసా?” అంది స్నిగ్ధ గొంతు పెంచుతూ.
ఋషి ఆమెను చల్లబరిచి, “స్నిగ్ధ, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాము. అతని చూపుల్ని తప్పుగా భావించకు. నిజానికి, కొన్నిసార్లు నేను కూడా స్త్రీలను అలా చూస్తాను. ఆ మాటకొస్తే, ప్రతి మగవాడు అందమైన స్త్రీని చూసినప్పుడు అలాగే చూస్తాడు. “
స్నిగ్ధకు అతను చెప్పింది నచ్చకపోయినా, అది వాస్తవమే అనిపించింది. కాని, అతను చెబుతున్న విధానం చూస్తే, దాని వెనుక ఏదో లాజిక్ ఉందని అర్ధం అయ్యింది. ఆమె అతనితో వాదించే మూడ్ లో లేదు, అందుకే అతని మాటల్ని వినసాగింది. అతని సాన్నిహిత్యంలో మనసు కుదురుకోవాలని ఆమె కోరిక.
“నీకు తెలుసా స్నిగ్ధా ! జర్మన్ సైంటిస్ట్ లు స్త్రీల వక్షాన్ని చూడడం ఆరోగ్యకరమైన అలవాటని, పురుషులకు చాలా గొప్ప వ్యాయామమని, అలా చూసే పురుషుల జీవితకాలం మరో 5 ఏళ్ళు పెరుగుతుందని కనుగొన్నారు. ఇది వారి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి, తద్వారా రక్తప్రసరణను పెంచుతుందట. ఇది ఆరోగ్యానికి చాలా కీలకమట.” కొంటెగా నవ్వుతూ అన్నాడు ఋషి.
“నాన్సెన్స్ “అనుకోకుండా అనేసింది స్నిగ్ధ. ఇటువంటి తెలివితక్కువ అంశాలు నాకు చెప్పకు. నీకు ఆడవాళ్ళ వంక చూడడం అంటే ఇష్టమని నాకు తెలుసు. ఇది పురుషులకు సహజమేనని నాకు తెలిసినా, ఇవాళ మృణాళ్ మనసులో ఉన్నది వేరే అభిప్రాయమనిపించింది. నేను అతన్ని అతనికి ఇష్టమైన రంగు గురించి అడిగితే, స్పష్టంగా నీలిచిత్రాలు అంటే ఇష్టమని చెప్పాడు. ఇడియట్!!”
“నిజమే, అతను నిజంగానే ఇడియట్.” ఋషి వెంటనే అంగీకించాడు. ఋషి తనను సమర్ధిస్తున్నందుకు స్నిగ్ధ, ఆ తర్వాత ఈ విషయంలో అతను మాట్లాడేది వినేవరకూ ఆనందించింది.
“వాడు నిజంగానే ఇడియట్, ఎందుకంటే నీలిచిత్రాలకు ఆ పేరు వాటిలో వాడే ఫిలిం రంగు వల్ల రాలేదు. USA చరిత్రలో కొన్ని నైతిక నియమాలు ఉండేవి. వాటిని ‘బ్లూ లాస్ ‘ అనేవారు. ఆల్కహాల్ అమ్మకం వంటి కొన్ని విషయాలపై ఈ నియమాలు నిబంధనలు విధించాయి. బ్లూ లాస్ ను ఉల్లంఘించిన వారికి దాదాపు మరణశిక్ష విధించినంత పని చెయ్యడంతో, వాటిని అంతా బ్లడీ లాస్ అనేవారు. ఆ రోజుల్లో ఆ లా ను ఉల్లంఘించి, సమాజంలోకి విడుదల అయినవన్నీ ఆ రోజుల్లో ఒక బ్లూ ట్యాగ్ ను కలిగి ఉండేవి. బ్లూ ఫిలిమ్స్ అనేవి కూడా, ఆ విధంగా నైతికపరంగా బాన్ చెయ్యబడి, ఎలాగో సమాజంలోకి వచ్చినవే. ఇప్పుడు USA లో ఆ నియమాలు లేనప్పటికీ, బ్లూ అనే పదం ఆ ఫిలిమ్స్ తో అలాగే ఉండిపోయింది. “ ఋషి స్నిగ్ధ స్పందన కోసం చూడసాగాడు. ఆమె నవ్వుతోంది.
“నువ్వు అసాధ్యుడివి ఋషి. నీకు నన్ను ఎలా నవ్వించాలో తెలుసు. నా ముఖంపై నువ్వు తీసుకురాగలిగిన చిరునవ్వే, నువ్వంటే ఇష్టపడేలా చేసింది. నీ సమక్షంలో నాకు ఏ బెంగలు ఉండవు, నా ఆరోగ్యం గులాబీలా విరబూస్తుంది, చీర్స్,” అంటూ చెబుతూ, స్నిగ్ధ అభినందించింది.
వాళ్ళు డిన్నర్ కు ఆర్డర్ చేసి, సంభాషణ కొనసాగించారు.
“ఇప్పుడు గులాబీరంగు అనే మాట మాట్లాడకు. పింక్ మూవీస్ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. జపాన్ లో సెన్సార్షిప్ చట్టాల ప్రకారం, స్త్రీలను కొన్ని కోణాల్లో చూపకూడదు. దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న అక్కడి డైరెక్టర్లు, కొన్ని ఆర్ట్ పీస్ లతో సినిమాలు తీసారు. సెన్సార్షిప్ నియమాలను ఉల్లంఘించకుండానే అవి చూసేవారికి మోహాన్ని కలిగిస్తాయి. దీనికి ఎంతో సృజన, కళాదృష్టి కావాలి. వీటికీ USA లోని నీలిచిత్రాలకి ఎంతో తేడా ఉంది. “
“ఋషి, ఇక చాలు, ఆపేయ్. నీ మగ మనసులోని భావాలు అన్నీ బయటపెట్టడం మొదలుపెడితే, ఇక వాటికి అంతుండదు. మగవారితో ఇటువంటి విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. కాని, నీతో ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అది నాకు ఏ మాత్రం ఇబ్బందికరంగా అనిపించట్లేదు. స్త్రీలతో ఈ విషయాలు మాట్లాడడంలో నీకో ప్రత్యేకమైన శైలి ఉంది.” అభినందించింది స్నిగ్ధ. వారిద్దరూ డిన్నర్ కోసం నిరీక్షించసాగారు.
“ఋషి నీ వర్క్ ఎలా సాగుతోంది ? ఆర్ట్ ఫండ్ ఎలా కొనసాగుతోంది ? దీని కోసం నా సాయం ఏమైనా కావాలా ?”ఋషి ఆమెకు దీన్నుంచి ఒక బ్రేక్ కావాలని తెలుసుకున్నాడు, అందుకే టాపిక్ మార్చాలనుకుని, తనే చొరవ తీసుకుని, “ చక్కగా సాగుతోంది. అవసరమైనప్పుడు తప్పకుండా నిన్ను ఇబ్బంది పెడతాను. సరేగాని, నువ్వు ఇప్పుడు తాగుతున్న సూప్ గురించి ఒక ప్రశ్న అడగనివ్వు. టమాటో అనేది పండు క్రిందకు వస్తుందా, లేక కూరగాయల క్రిందికా ?”
అతని ఉద్దేశాన్ని కనిపెట్టిన స్నిగ్ధ “ఈ విషయంలో కోర్ట్ ఏమంది ?” అని అడిగింది.
“టమాటో కూరగాయల క్రిందికి వస్తుంది అంది. “జవాబిచ్చాడు ఋషి.
“కాని నువ్వు అదే నిజమని ఎలా నమ్ముతున్నావ్ ?” ఆసక్తిగా వినసాగింది స్నిగ్ధ.
“కోర్ట్ కూడా అది ఫలమేనని నమ్ముతోంది. కాని పళ్ళ లాగా కాక, దాన్ని కూరల్లో ఎందుకు చేర్చారంటే, అది భోజనం ముందు ఇచ్చే సలాడ్ లో సర్వ్ చేస్తారు కనుక. డెసర్ట్ ఐటమ్స్ లో ఇతర పళ్ళతో కలిపి దీన్ని పెట్టరు.” వివరిస్తూ, చెదరని చిరునవ్వుతో సంభాషణ కొనసాగించాడు ఋషి. స్నిగ్ధ మూడ్ ఇప్పుడు పూర్తిగా మామూలుగా మారిందని గుర్తించాడు.
ఇద్దరూ డిన్నర్ పూర్తి చెయ్యబోతూ ఉండగా, ఋషి ఇలా అన్నాడు, “స్నిగ్ధ జోక్స్ ప్రక్కన నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. మృణాళ్ తో జాగ్రత్తగా ఉండు. నీకు నా సాయం కావాలంటే, వెంటనే చెప్పు. నువ్వు అతనికి దగ్గరగా ఉంటూ పనిచెయ్యాలి కనుక, ఏదైనా అసహ్యంగా ప్రవర్తిస్తే గమనిస్తూ ఉండు. కొన్నిసార్లు కొందరు పురుషులు యెంత విచిత్రంగా ప్రవర్తిస్తారో నాకు తెలుసు. జాగ్రత్త !” అన్నాడు ఋషి.
ఋషి ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని, తనకు జాగ్రత్తలు చెప్పి, ఊరడించినందుకు స్నిగ్ధ ఆనందపడుతూ, అభినందించింది.
అతనికి దగ్గరగా వచ్చి, “ఋషి, నీ ఆసరా తీసుకోవచ్చని, నాకు తెలుసు. ఇప్పుడు కాస్త హాయిగా ఉంది. ఏదైనా ఇబ్బంది ఉంటే నీకు చెప్తాను.” అంది. వాళ్ళిద్దరూ, డిన్నర్ ముగించి తిరిగి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
“అయితే ఋషి, నువ్వొక పది నిముషాల్లో నన్ను నా కాబిన్ లో కలవగాలవా ? అంటూ ఋషికి విలియం స్కాట్ ఫోన్ చేసాడు. “వచ్చేటప్పుడు, నేను చైనా ప్రభుత్వానికి నా క్లైంట్ “B2K4444” ను గురించి చైనా ప్రభుత్వానికి పంపాల్సిన లేఖను తీసుకురావడం మర్చిపోకు.” అన్నాడు. ఋషి క్లుప్తంగా మాట్లాడి ఫోన్ పెట్టేసాడు.
ఋషి మహేంద్రను కలవబోయే ముందు రోజది. దానిగురించి అతను తన బాస్ అయిన విలియం స్కాట్ కు చెప్పాల్సి ఉంది.
ఇతరులకు ఇది ఆశ్చర్యకరంగా అనిపించినా, స్విస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్లకి క్లైంట్ ల గురించి కోడ్ నంబర్లలో మాట్లాడుకోవడం పరిపాటే. క్లైంట్ ల నిజమైన అస్తిత్వం గురించి బ్యాంకు లో ఉన్న అతి కొద్దిమందికి తప్ప, ఇతర ఉద్యోగులకు తెలియదు. ఇది అన్నిస్విస్ బ్యాంకులకు సాధారణమే !
క్లైంట్ సొంత పేరుతో ఎకౌంటు వ్యవహారాలు నడిపితే, సమాచారం లీక్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే మొత్తం అంతర్గత ప్రక్రియలు పూర్తి అయ్యేసరికి ఆ డాక్యుమెంట్లు ఎన్నో చేతులు మారతాయి.
ఆ రిస్క్ ను తప్పించుకునేందుకు, స్విస్ బ్యాంకులు తమ క్లైంట్ ల అసలు వివరాలు ఇతరులకు తెలియకుండా చూసుకుంటాయి. ఋషి లాగా కేవలం ఆ క్లైంట్ కు సంబంధించిన బ్యాంకర్ మాత్రమే అతని పూర్తిపేరు, చిరునామా వంటి వివరాలను తెలుసుకుని ఉంటాడు.
ఒకసారి ఎకౌంటు తెరిచాకా, ఋషి సాధారణంగా క్లైంట్ కు సంబంధించిన అసలు పేరు, చిరునామా ఉన్న పత్రాలు అన్నింటినీ సేఫ్ లో పెట్టేస్తాడు. కేవలం అతికొద్ది మందికే ఈ పత్రాలు చూసే వీలు ఉంటుంది. అది కూడా వారు ఏ ఫైల్ నెంబర్ ను, ఏ కోసం తెరుస్తున్నారో రిజిస్టర్ లో రికార్డు చేసిన తరువాతే !
ఇదంతా స్విస్ బ్యాంకులు తమకు తాము ఏర్పరచుకున్న ‘గోప్యతా నియమాల చట్టాలు’ తప్పనిసరిగా అమలు జరిగేలా చూసుకునే ప్రయత్నం. ఈ నియమాలను 300 ఏళ్ళ క్రితం ప్రతిపాదించారు. తనకు ఎప్పుడు అధికంగా నిధులు కావలసివచ్చి అప్పుగా తీసుకున్నా, దాన్ని తిరిగికట్టే సామర్ధ్యం తనకుంది కనుక, ఈ వ్యవహారాలన్నీ గోప్యంగా జరగాలని, అప్పటి ఫ్రాన్స్ రాజు, స్విస్ బ్యాంకు వారిపై ఒత్తిడి తీసుకురావడంతో ఇదంతా మొదలయ్యింది.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, హిట్లర్ పాలనలో, స్విస్ బ్యాంకింగ్ వారి ‘గోప్యతా నియమాల’ను మరొకసారి సవరించారు. అప్పట్లో జర్మన్ చట్టం జర్మనీలో కాక, విదేశాల్లో నిధులున్న వారికి మరణశిక్ష విధించాలని తీర్మానించినప్పుడు ఇది జరిగింది. తమ దేశపు నిధులు దేశం దాటిపోకుండా చేసేందుకు, జర్మనీకి కఠినమైన విదేశీ మారక నియమాలు ఉండేవి.
స్విస్ బ్యాంకు ఎకౌంటులను కలిగిఉన్న జర్మన్లకు మరణశిక్ష విధిస్తూ ఉండడంతో, స్విస్ ప్రభుత్వం తమ బ్యాంకుకు గోప్యత మరింత అవసరమని భావించింది.
చివరికి 1984 లో స్విట్జర్లాండ్ ప్రజలు బ్యాంకు గోప్యతను అలాగే ఉంచమని, మరొక్కసారి వోట్ చేసారు. 73 % ఓట్లు దీనికి అనుకూలంగా లభించాయి.
ఋషి తన డెస్క్ మీద కావలసిన పత్రాలను సిద్ధం చేసి, స్కాట్ చెప్పిన క్లైంట్ డాక్యుమెంట్లు తీసుకుని బయలుదేరాడు. ఒక క్లైంట్ బ్యాంకు ట్రాన్సాక్షన్ల గురించిన వివరాలు ఇవ్వమన్న చైనా ప్రభుత్వపు అభ్యర్ధనను గురించిన కాగితాలవి.
ఆ అభ్యర్ధనలో క్లైంట్ ఎకౌంటు నెంబర్ లేదు, అతని పేరు తప్ప. ఆ క్లైంట్ చైనాలో ఒక లంచగొండి ప్రభుత్వాధికారి అని చైనా మీడియా రిపోర్ట్ లు ఇచ్చింది. దీనికి సంబంధించి, ఆ ప్రభుత్వానికి ఋషి బ్యాంకు నుంచి కొన్ని వివరాలు కావలసి వచ్చాయి.
కాని, స్విస్ బ్యాంకు చట్టాల ప్రకారం, కేవలం టాక్స్ ఫ్రాడ్ జరిగినప్పుడు మాత్రమే వారి అభ్యర్ధనపై తమ క్లైంట్ ల వివరాలను విదేశీయులకు వెల్లడిస్తారు. అంతర్జాతీయంగా,పన్నులకు సంబంధించి, పన్ను ఎగవేత, పన్ను ప్రణాళిక అన్న పదాలను వాడతారు. పన్ను ప్రణాళిక అంటే, చట్టపరంగా పన్నులను నిర్వహణ, ఆమోదయోగ్యమైన విధానాల్లో పెట్టుబడులు పెట్టడం. పన్ను ఎగవేత అంటే, చట్ట విరుద్ధంగా పన్నును చెల్లించకపోవడం.
ఏమైనా, స్విస్ బ్యాంకింగ్ చట్టాల ప్రకారం పన్ను ప్రణాళికలకు, పన్ను ఎగవేతకు కూడా తారతమ్యం ఉంది. రెండూ టాక్స్ కట్టకుండా తప్పించుకునేందుకే అయినా, రెంటినీ వేరుగా చూస్తారు. పన్ను కట్టేప్రభుత్వ అధికారులకు తమ రాబడుల వివరాలను వెల్లడించకుండా ఎగ్గొడితే, అది పన్ను ఎగవేత. పన్నుకట్టేవారు కొంత ఆదాయాన్ని, ఖర్చునీ చూపి, తక్కువ రాబడిని/ ఎక్కువ ఖర్చును నిరూపించుకునేందుకు తప్పుడు పత్రాలను చూపితే అది ‘టాక్స్ ఫ్రాడ్’ అవుతుంది.
ఎన్నో ఏళ్ళుగా స్విస్ బ్యాంకులు, కేవలం విదేశీ ప్రభుత్వాలు తమ బ్యాంకు క్లైంట్ లపై ‘టాక్స్ ఫ్రాడ్’ అనే నేరాన్ని మోపితే తప్ప, తమ క్లైంట్ ల వివరాలను వెల్లడించము అనే సంప్రదాయాన్ని సమర్ధవంతంగా అమలు జరుపుతున్నాయి. లేకపోతే, టాక్స్ కట్టనప్పుడు, టాక్స్ ఫ్రాడ్ లేనప్పుడు, క్లైంట్ ల వివరాల కోసం వచ్చే మామూలు అభ్యర్ధనలను స్విస్ బ్యాంకు పట్టించుకోదు.
“చైనా ప్రభుత్వం టాక్స్ ఫ్రాడ్ ను నిరూపించితే తప్ప, తాము క్లైంట్ వివరాలను వెల్లడించలేము,” అని ఋషి వారికి బదులివ్వాల్సి ఉంది. అంతేకాక, ఆ ప్రభుత్వం సంబంధిత ఎకౌంటు నెంబర్ ను కూడా బ్యాంకు కు ఇవ్వాల్సి ఉంది.
“అయితే, నువ్వీ లేఖను మన లీగల్ డిపార్టుమెంటు కు అందించావా ?” అని అడిగాడు స్కాట్, ఋషి చైనా ప్రభుత్వానికి అందించబోతున్న పత్రాలను చూపాకా.
“ ఇచ్చాను స్కాట్, మన లీగల్ విభాగానికి పత్రాలు చూపాను. కాని, ఇలా ఎన్ని అభ్యర్ధనలను తిప్పి కొట్టగలమో తెలియట్లేదు, ఇవాళ కూడా US, స్విస్ బ్యాంకు వారి గోప్యతకు విరుద్ధంగా చట్టాలు చెయ్యనుందన్న సమాచారం వచ్చింది. భవిష్యత్తులో ఏమి జరగనుందో చూడాలి. కాని ప్రస్తుతానికి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి క్లైంట్ లను తీసుకురావడం కష్టంగా ఉంది.”
ఎంతోమంది స్విస్ బాంకర్లు ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యను ఋషి ప్రస్తావించాడు. విదేశీ ప్రభుత్వాలు అడిగిన సమాచారం ఇవ్వకపోతే, త్వరలోనే విశ్వ ఆర్ధిక ప్రపంచంలో స్విస్ బ్యాంకులను ‘నాన్- కో-ఆపరేటివ్ బ్యాంకు’ లుగా పరిగణించే అవకాశం ఉందని, అతనికి బాగా తెలుసు.
“హేయ్ ఋషి, నిరాశగా మాట్లాడకు. నేనూ విన్నాను, అయితే, ఇవాళ మరొక 15 మంది క్లైంట్ లను తెస్తున్నావా ?
“అవును స్కాట్, వారంతా ఇండియా నుంచే.” బదులిచ్చాడు ఋషి.
“కాని, జాగ్రత్తగా ఉండు ఋషి, ఈ 15 మంది కూడా నీవు గతంలో ప్రస్తావించిన సాఫ్ట్వేర్ కంపెనీ కి చెందినవారే కదూ,” గంభీరమైన స్వరంతో అన్నాడు స్కాట్.
“స్కాట్, మీ భావాలను నేను అర్ధం చేసుకోగలను. ఇండియా లోని నా నెట్వర్క్ ల నుంచి ఈ క్లైంట్ రిఫరెన్స్ లు నాకు దొరికాయి. ఇవన్నీ ఒకే సాఫ్ట్వేర్ కంపెనీ కి చెందినవని నాకు తెలుసు – నిర్వాణ ప్లస్. కాని వారంతా ఎక్కువ జీతాలున్న సీనియర్ ఉద్యోగులు అన్న సంగతి మనం గమనించాలి. వారి ఎకౌంటుల విషయంలో మనకు ఇబ్బందులు ఏమీ ఉండవని నేను భావిస్తున్నాను.”బదులిచ్చాడు ఋషి.
స్కాట్ కాస్త సమాధానపడ్డట్లు కనిపిస్తూ,’ ఉద్యోగుల విషయంలో నాకు అనుమానాలు లేవు, కాని నిర్వాణ ప్లస్ అనే కంపెనీ అంతర్జాతీయంగా కొన్ని వివాదాలను ఎదుర్కుంటోంది. ఆ కంపెనీ MD మహేంద్ర వాటినుంచి ఎలా బయటపడతాడో మనం చూడాలి. ఒకసారి కంపెనీ ఇబ్బందుల్లో పడితే, ఉద్యోగులు కూడా ఇరుకున పడతారు కదా.” అన్నాడు.
“స్కాట్, మీ భావాలతో నేను ఏకీభవిస్తాను. ఇంకో సంగతి చెప్పనా ? రేపు నేను మహేంద్రను కలవబోతున్నాను. అతన్ని మన క్లైంట్ గా మార్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను, నాకు శుభాకాంక్షలు చెప్పండి. ఇది మన ఆఫీస్ కు పెద్ద బిజినెస్ అవుతుంది,” అన్నాడు ఋషి ఉత్సాహంగా.
స్కాట్ అతని ఉత్సాహాన్ని అర్ధం చేసుకోగలడు. అతను ఋషిని అభినందించి, “కాని, వారి వ్యవహారాలపై ఒక కన్నేసి ఉంచు, పేపర్ వర్క్ అంతా సవ్యంగా జరిగేలా చూడు,” అని చెప్పాడు. ఋషి అతని కాబిన్ వదిలి వెళ్ళాడు.
***
“గుడ్ మార్నింగ్ మిష్టర్ మహేంద్ర, నేను బ్యాంకు ప్రైమ్ సూయిస్ నుంచి వచ్చిన ఋషిని,”నవ్వుతూ మహేంద్రను పలకరించాడు ఋషి. అతను నేవీ బ్లూ సూట్ లో తెల్ల షర్టు, ఎరుపు టై వేసుకుని ఉన్నాడు.
“మార్నింగ్ ఋషి, మిష్టర్ శర్మ మీ వైన్ టేస్టింగ్ సెషన్ల గురించి, వైన్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడుల గురించి చెప్పారు, ఆయన వైన్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడుల కోసం నా అనుమతిని కూడా తీసుకున్నారనుకుంటా !” మహేంద్ర ఋషిని కూర్చోమని చెబుతూ అన్నాడు. ఋషికి ఒక కప్ కాఫీ ఇచ్చాడు.
“నిజమే, మహేంద్ర గారు, మిష్టర్ శర్మ మా బ్యాంకుకు పనిచేస్తున్నప్పటి నుంచి నాకు మంచి మిత్రులు, ఆయన కస్టమర్ ల రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. మీతో పరిచయం కల్పించమని నేనే వారిని అభ్యర్ధించాను. మీకు ఇంతకుముందు స్విస్ బ్యాంకు ఎకౌంటు లేనట్లయితే, మీ డిపాజిట్లు, పెట్టుబడులను స్విస్ బ్యాంకు లో పెట్టడం చాలా తెలివైన నిర్ణయం అని, మీకు తెలిసే ఉంటుంది. స్విస్ ఎకౌంట్లు పూర్తిగా నమ్మదగ్గవి, ఆర్ధిక లావాదేవీలలో మీకు గోప్యత, అత్యంత భద్రత కల్పిస్తాయి.” ఋషి నేరుగా సంభాషణలోకి దిగాడు.
ఒకవేళ మహేంద్రకు ముందే స్విస్ బ్యాంకు ఎకౌంటు ఉన్నా, క్లైంట్స్ తమ ఇతర బ్యాంకుల లోని ఖాతాల వివరాలు వెల్లడించరని, ఋషికి బాగా తెలుసు. కాని, ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ లో నేరుగా పెట్టుబడి పెట్టమని కోరే బదులు, సంభాషణను చాలా మామూలుగా ప్రారంభించాలని ఋషి అనుకున్నాడు.
“మిష్టర్ ఋషి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. నేను చాలా పొదుపరిని. నావద్ద అధికంగా నిధులు ఏమీ లేవు. నావద్ద ఉన్నదంతా నిర్వాణ ప్లస్ లో పెట్టానని మీకు తెలుసు. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక ఇబ్బందుల్లో, అన్నీ కంపెనీలోనే చిక్కుకు పోయాయి. మిష్టర్ శర్మ ఒత్తిడి చెయ్యడం వల్ల నేను మిమ్మల్ని కలవాలని అనుకున్నాను.” మహేంద్ర తన ఉద్దేశాన్ని స్పష్టపరిచాడు.
ఋషి మొదట్లో కాస్త నిరాశ చెందినా, మహేంద్రను ఒప్పించడం ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు. మరికొన్ని చర్చల తర్వాత, మహేంద్ర సమ్మతితో ఆర్ట్ ఫండ్ పెట్టుబడుల గురించి అతనికి వివరించాడు. దానిపై తాను రూపొందించిన ప్రేసెంటేషన్ ను మహేంద్రకు .
ఈ పరిస్థితుల్లో ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడులు ఎందుకు పెట్టాలో, ప్రస్తుతం మార్కెట్ యెంత కృంగిపోయి, చవకగా ఉందో, త్వరలో ఇది విరివిగా పెరిగే అవకాశాలు ఎలా ఉన్నాయో, వివరించాడు.
వైన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లాగే, ఆర్ట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కనీస క్లైంట్ పెట్టుబడులను USD25000 – 1,000,000 దాకా కలిగి ఉంటుంది. అలా తీసుకున్న మొత్తాన్ని, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ కు అందిస్తారు. అతను కళాఖండాల పోర్ట్ ఫోలియో ను పరిశీలించి, ఫండ్ తొలిదశల్లో కొంటాడు.
ప్రతిపాదించిన కాలం పూర్తి అయ్యాకా, పోగుచేసిన కళాఖండాలను ఉమ్మడిగా వేలం వేస్తారు. కొన్న ధరకీ, అమ్మిన ధరకీ మధ్య వచ్చిన లాభాన్ని, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, డిస్ట్రిబ్యూటర్ల కమిషన్ పోగా, మిగతాది పెట్టుబడిదారులకు పంచుతారు.
“కాని ప్రస్తుతం ఆర్ట్ మార్కెట్ చాలా డల్ గా ఉందని విన్నాను. ఆర్ట్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా ? ఈ మార్కెట్ నిజంగానే విస్త్రుతమైనదా ?”
“ఆర్ట్ మార్కెట్ అనేది అతిపెద్ద ఆస్తి క్రిందకు వస్తుంది. ద్రవ్యోల్బణం వల్ల అన్నిటి ధర పడిపోయింది అన్నది వాస్తవమే. వాటితో పాటే ‘మీ మోసెస్ ఫ్యామిలీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ సూచిక కూడా పడిపోయింది. కాని వీటిని తిరిగి S&P తో అనుసంధానించడంతో తిరిగి పుంజుకుంటాయి. కాబట్టి, ఇందులో పెట్టుబడులు చాలా మంచివి, ఎందుకంటే, ఇప్పుడు మార్కెట్ చాలా తక్కువలో ఉంది. “ ఋషి మహేంద్రను ఒప్పించేందుకు గురి చూసి మాట్లాడాడు.
మహేంద్ర మరొక్కసారి ఋషి ఇచ్చిన సమాచారాన్ని, ప్రేసెంటేషన్ ను పరిశీలించాడు. కాస్త వెనక్కు వెళ్లి, అతని బ్యాంకు గతంలో పెట్టిన ఆర్ట్ ఫండ్ ల గురించి, ఋషి మునుపు చూపిన స్లయిడ్ లను మరలా చూపమని కోరాడు.
ఒకచోట అతన్ని ఆపి, వెంటనే “ మీ బ్యాంకు ఇండియన్ ఆర్ట్ ఫండ్ ను 4-5 ఏళ్ళ క్రితం ఆరంభించిందని మీరు చెప్పారు కదూ ? ఈ ఏడాదితో దాని కాలపరిమితి పూర్తవుతుంది. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి ? మీరు దీనిలో లాభాలు గడించగలిగారా ?”
ఋషి అవాక్కయ్యాడు. ఋషి ఆ ఆర్ట్ ఫండ్ గురించి అడుగుతాడని అతను ఊహించలేదు. మహేంద్ర వివరాలు అడుగుతున్న ఆర్ట్ ఫండ్ గురించి ఋషికి తెలిసినా, ఆ వివరాలను వెల్లడించవచ్చో లేదో, అతనికి తెలీదు. అతను వాస్తవాలను మహేంద్రకు వెల్లడిచేసాడు.
అది ఇతర ఫండ్స్ లాగానే 5 ఏళ్ళ క్రితం ప్రారంభించబడింది. బాగానే నడవసాగింది. కాని, కాలం గడిచే కొద్దీ, ఫండ్ ఆరంభమైన కొత్తల్లో ఉన్న ధరకి కళాఖండాలను కొనే ఆసక్తి ఉన్నవారు అంతకంతకీ తగ్గసాగారు. ఇది 500 కళాఖండాలు ఉన్న అతి పెద్ద ఫండ్. అందుకే, వాటిని అమ్మడాన్ని బ్యాంకు మరొక ఆరు నెలలు వాయిదా వేసింది.
మహేంద్ర బాహాటంగా తన అభిప్రాయాన్ని ఇలా చెప్పడు.” మిష్టర్ ఋషి, నేను మునుపు చెప్పినట్లుగా పెట్టుబడుల కోసం నాకు వ్యక్తిగత నిధులు ఏమీ లేవు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం, రానున్న ప్రద్యుమ్న మ్యూజియం కోసం నేను త్వరగా కళాఖండాలను సేకరించాలి. మీకు ఇదంతా తెలుసు కదూ ?” ఋషి అవునన్నట్లు తలూపాడు. సంభాషణ ఎటువైపు సాగుతోందో అతనికి అర్ధం కాలేదు.
“ మీకోసం నావద్ద ఒక ఆఫర్ ఉంది. మీరు గతంలో ఇండియన్ ఆర్ట్ ఫండ్ కోసం సేకరించిన వాటిలో కొన్నిటిని కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జాతీయ కళాఖండాలు గా ముద్రించబడిన వాటిని అన్నింటినీ నేను కొంటాను. మీరు ముందే వాటిని నిశితంగా పరిశీలించి ఉంటారు కనుక, నాకూ కాస్త సమయం ఆదా అవుతుంది. మీరు వేలం వేసినప్పుడు, నేను అందరికంటే ఎక్కువ ధరకి వాటిని కొంటాను. మ్యూజియం కు అవసరమైన మిగతా 200 కళాఖండాలను ఒకేసారి కొనేందుకు ఇది నాకు ఉపయోగపడుతుంది, నేను ప్రభుత్వానికి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోగలుగుతాను.” కొనసాగించాడు మహేంద్ర.
మహేంద్ర తన ఉద్దేశాన్ని స్పష్టపరిచాడు. వారు గతంలో ఫండ్ కోసం కొన్న కళాఖండాలను తనకు ఎలా అమ్మగలరో ఋషిని అడిగి తెలుసుకుంటూ కాలం గడిపాడు. ఋషి దాని గురించి వివరిస్తున్నప్పుడు, అది చట్టబద్ధంగా ఇరువర్గాలకి లాభదాయకంగా ఉందని తెలిసింది.
ఋషికి, అతని బ్యాంకుకు కూడా ఇదొక పెద్ద వరం లాంటిది. మహేంద్ర భాగస్వామ్యంతో వారు గతంలో పెట్టిన ఆర్ట్ ఫండ్స్ కు మంచి లాభాలను గడించగలరు. మహేంద్ర పరంగా చూస్తే, కళాఖండాల కొనుగోళ్లలో జాప్యం జరుగకుండా, ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం అనుకున్న సమయానికే ప్రారంభించ బడేలా అది ఉపయోగపడుతుంది.
ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకువెళ్లేందుకు ఋషి తన ఆసక్తిని వెల్లడించి, సంభాషణ ముగించాడు. మహేంద్ర కూడా దీని గురించి ఆనందించాడు. దీన్ని అమలు పరిచేందుకు అప్సర, స్నిగ్ధ లను కలవమని అతను ఋషిని కోరాడు.
ఋషి మహేంద్ర సమక్షంలో మొదటిసారిగా ఆఫీస్ లో స్నిగ్ధను కలిసాడు. స్నిగ్ధ తనకు ఇంతకు ముందే తెలుసని, మహేంద్రకు చెప్పాడు, స్నిగ్ధ ఆఫీస్ లో ఇంకా జూనియర్ కనుక, సంభాషణ అంతకు మించి కొనసాగలేదు. అదొక మామూలు కలయిక. తరువాత అప్సరను కలవాల్సి ఉంది.
అప్సర తమ గదిలోకి వస్తుండగా చూసిన ఋషి, ఆమె అందాన్ని చూసి, అవాక్కయ్యాడు. అందంగా ఉండడం మాత్రమే కాక, ఆమె కనిపించే విధానం అతని కళ్ళకు ఆకర్షణీయంగా అనిపించింది.
ఆమె ఋషి వంక చూసి,” నిర్వాణ ప్లస్ అనే మా కుటుంబానికి స్వాగతం మిష్టర్ ఋషి,” అంటూ, తన బాగ్ లోంచి ఒక విసిటింగ్ కార్డు ను తీసిచ్చి, “మీకు వీలున్నప్పుడు, మా ఆఫీస్ కు వస్తే, మనం మాట్లాడుకుందాం.” అంటూ, చెయ్యి చాపింది.
ఋషి ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తుండగా, అతనికి కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యింది. అతనికి మేనకా, విశ్వామిత్రల పెయింటింగ్ హఠాత్తుగా తనముందు మెరిసినట్లు అయ్యింది.
మరికొన్ని సెకండ్లలో అప్సర అక్కడినుంచి వెళ్ళిపోయింది. అతను ఆమెను వెంటనే అనుసరించాడు. స్నిగ్ధకు ఇదంతా నచ్చకపోయినా, మహేంద్ర ముందు ఏమీ మాట్లాడలేకపోయింది.
“ మన ఆఫీస్ కు చేరుకోవడానికి 20 నిముషాలు పడుతుంది”,ఋషి కార్ ఎక్కుతుండగా అంది అప్సర. వెంటనే ఆమె తన బాగ్ నుంచి కాలినెస్స్ మాయిస్చరైజింగ్ బాడీ లోషన్ తీసి, తన ముఖానికి, చేతులకు రాసుకుంది.
“ఓహ్! అయితే మీ ముఖం యొక్క ఫ్రెష్నెస్స్ సీక్రెట్ ఇదన్నమాట ! క్లియోపాత్రా గాడిద పాలు రాసుకున్నట్లు !”ఋషి ఆ లోషన్ ను చూడగానే అన్నాడు.
“గాడిద పాలా ?” అప్సర ఒక్క క్షణం సందిగ్ధానికి గురయ్యింది.
“అవును, మీరు ఇప్పుడే రాసుకున్న లోషన్ గాడిద పాలను కలిగి ఉంది. ఇది శరీరంపై అతిగొప్ప ప్రభావాన్ని చూపిస్తూ, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకో సంగతి తెలుసా మీకు ? క్లియోపాత్రా తన అందాన్ని కాపాడుకోవడం కోసం క్రమం తప్పకుండా గాడిద పాలతో స్నానం చేసేదట. నిజానికి, రోజూ ఆమె స్నానం కోసం సరిపడా పాలను అందించడానికి 700 గాడిదలను పెంచేవారట!” ఋషి ఆమెకు తెలిపాడు.
అప్సరకు ఇది తెలీదు. ఆమెకు ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది. లోషన్ ను తిరిగి బాగ్ లో పెడుతూ, ఆమె “ మంచి సమాచారం” అని, “అయితే, మీరు మహేంద్రను ఎలా కలిసారు?” అంటూ మామూలుగా సంభాషణ ఆరంభించింది.
“నేను గత కొంతకాలంగా మహేంద్రను కలవాలని అనుకుంటున్నాను, చివరికి ఇవాళ కలవగలిగాను. మేము ఒక ఆర్ట్ ఫండ్ ను ప్రారంభించనున్నాము, అందులో పెట్టుబడి పెట్టడంలో మహేంద్రకు ఆసక్తి ఉంటుందని అనుకున్నాను. ఈ విషయంగానే ఆయన్ను కలిసేందుకు వచ్చాను.”ఋషి వివరించాడు.
“అయితే మహేంద్ర ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పుకున్నారా ?” అప్సర మామూలుగా అడిగింది. కాని, ఆమె అందం అతనిపై ప్రభావం చూపించసాగింది. ప్రతిక్షణం తనను అప్సర వైపు ఎందుకు లాగుతోందో అతనికి అర్ధంకాలేదు.
“లేదు, ఇందుకు బదులుగా, ఆయన మరొక ప్రతిపాదన ఇచ్చారు. మేము త్వరలోనే వేలం వెయ్యబోయే పెయింటింగ్స్ అన్నింటినీ ఆయన కొంటాను అన్నారు. కొన్నేళ్ళ క్రితం మేము తీసుకున్న మరొక ఫండ్ ద్వారా ఇవన్నింటినీ సేకరించాము. ‘జాతీయ కళాఖండాలు’ గా ముద్రించిన అన్ని పెయింటింగ్స్ ను కొనేందుకు మహేంద్ర ఆసక్తి చూపారు.” ఋషి ఆమెకు ఒక్కొక్కటే వివరించాడు.
అప్సరకు అతను చెప్పిన ఫండ్ పేరు సమాహార –గతంలో భారతీయ చిత్రకారులు వేసిన 500 కళాఖండాల సేకరణ. అందులో దాదాపు 200 కళాఖండాలు భారత ప్రభుత్వంచే ‘జాతీయ కళాఖండాలు’ గా గుర్తించబడ్డాయి. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అతి జాగ్రత్తగా పరిశీలించి, ఎంపిక చేసిన కలెక్షన్ లు కాబట్టి, వేలంలో వీటికి అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. కాని, ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం వల్ల, ఆశించినట్లుగా జరగలేదు. మార్కెట్ డల్ గా ఉన్నందువల్లనే ఈ ఫండ్ ను తిరిగి చెల్లించడం వాయిదా వెయ్యబడింది.
“ఆసక్తికరంగా ఉంది. అయితే, మనం మేధావుల వ్యాపారాల్ని చూస్తూ, ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అన్నమాట ! మీకు తెలుసా, ఏ మూర్ఖుడైనా బొమ్మ వెయ్యగలడు, కాని దాన్ని అమ్మేందుకు తెలివైనవాడికే సాధ్యం.” నవ్వుతూ అంది అప్సర.
“ఆర్ట్ సేల్స్ అంటేనే ఇలా ఉంటుందని నా భావన. ఏమీలేని దాన్నుంచి, ఏదోఒకటి సృష్టించి, దాన్ని అత్యధిక ధరకు అమ్మడం,”అన్నాడు ఋషి ఆమె నవ్వులతో శృతి కలుపుతూ.
అప్సరకు ఋషి హాస్యస్పూర్తి నచ్చింది. ఆ సంభాషణ మరికాసేపు కొనసాగింది, ఋషి ఆమె మనసులో తనపట్ల సదభిప్రాయాన్ని కలిగించగలిగాడు. మరికొద్ది క్షణాల్లో వారు ఆఫీస్ కు చేరుకున్నారు.
ఋషి ఆఫీస్ కు వెళ్లి, చుట్టూ చూసాడు. బయట, అత్యంత సుందరమైన లేటెస్ట్ పెయింటింగ్స్ కలిగిన బాటిక్, అతడిని అబ్బురపరిచింది. “ పెయింటింగ్స్ తో అలంకరించిన గది, ఆలోచనలతో అలంకరించబడినట్లు “- అన్న ఒక కోట్ ఉన్నట్టుండి అతని మనసులో మెరిసింది. ఆ ఆలోచనలు ఎటువంటివో కాలమే చెప్పగలదు.
“ఏ ఆక్షన్ హౌస్ లో వేలం వేస్తున్నారు ? ఏ తేదీన ?” ఆఫీస్ రూమ్ లోకి వస్తూనే ఋషిని కూర్చోమంటూ కుర్చీ చూపి, అడిగింది అప్సర.
ఋషి ఇంకా పరిసరాలను పరికిస్తూనే ఉన్నాడు. అక్కడున్న చాలా చిత్రాల ఖరీదు కొన్ని లక్షల రూపాయిలు ఉంటుందని అతను మనసులోనే అంచనా వేసుకోసాగాడు.అప్సరకు వేలానికి సంబంధించిన వివరాలు ఇచ్చి, ఒక కాటలాగ్ కూడా ఇచ్చాడు.
“హా...కలెక్షన్ చాలా బాగుంది. ఇందులో చాలా భారతీయ చిత్రాలు ఉన్నాయి కూడా.” అంటూ కేటలాగ్ తిరగేస్తూ, “కాని, ధరే చాలా ఎక్కువగా ఉంది”, అంది అప్సర.
ఈ మధ్యకాలంలో చాలామంది భారతీయ చిత్రకారుల పెయింటింగ్స్ అంతర్జాతీయ ఆక్షన్ హౌస్ లలో కోటి రూపాయల పైనే అమ్ముడు అయ్యాయి. ఆర్ట్ ధరలకు సంబంధించి, ఈ చిత్రాల వేలాలు అనేవి ముఖ్యమైన సూచికలు.
“నాకు తెలుసు. కాని, చిత్రకళ అనేది శృంగారం వంటిది. ఇందులో చాలావరకు బాగోదు,బాగుండే వన్నీ సామాన్యుడికి అందుబాటులో ఉండవు.” ఋషి గతంలో చదివిన సామెతను గుర్తు తెచ్చుకుంటూ వెంటనే స్పందించాడు. కాని, దీన్ని అప్సర ఎలా తీసుకుంటుందో తెలీకుండా తొందరపద్దందుకు కాస్త బాధపడ్డాడు.
కాని అప్సర బిగ్గరగా నవ్వసాగింది. “ బాగా చెప్పావు ఋషి. నాకు నచ్చింది. కాని, ఇది ప్రతి ఆర్టిస్ట్ విషయంలోనూ నిజం కాదు.”
“నేను ఏకీభవిస్తున్నాను.పికాసో ఒకసారి ఇలా అన్నారు – కొంతమంది చిత్రకారులు సూర్యుడిని ఒక పసుప్పచ్చ చుక్కగా మారుస్తారు, మరికొందరు పసుప్పచ్చ చుక్కనే సూర్యుడిగా మారుస్తారు. మార్కెట్ లో విలువను పొందగాలవారు మాత్రం రెండవ కోవకు చెందినవారే. ఈ విషయంలో మీరు నిష్ణాతులు.” బదులిచ్చాడు ఋషి.
అప్సర అంగీకరిస్తూ తలూపింది.మరి రెండు నిముషాలు వేలానికి సంబంధించిన విషయాలు మాట్లాడింది. చివరికి, వారు ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ కోసం కొనదగ్గ పెయింటింగ్స్ జాబితాను నిర్ణయించారు. అవన్నీ షార్ట్ లిస్టు చెయ్యగానే, ఆమె ఆ లిస్టు ను స్నిగ్ధకు ఈమెయిలు చేసింది.
సంభాషణ మొత్తంలో ఋషి చాలా చురుకుగా పాల్గొన్నాడు. ఋషి చెప్పిన ప్రతి అంశంలోనూ ఏదోఒక ఆసక్తికరమైన సమాచారం ఉంది. అప్సరకు అతనితో మాట్లాడడం ఎంతో నచ్చింది.
పెళ్ళికాని, స్త్రీలు, పురుషులు తమ భాగస్వాములను ఎంపిక చేసుకునే ఎంతో తేడా ఉంది. బ్రహ్మచారులు ఒకే విధమైన లక్షణాలు కలవారిని ఎంపిక చేసుకుంటూ, చివరికి వారిలో ఒకరిని భార్యగా స్వీకరిస్తారు. కాని ఒకమ్మాయికి డజను మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, ఏ ఒక్కరూ మరొకరిని పోలి ఉండరు, చివరికి ఆమె పెళ్లి చేసుకునే వాడు కూడా మిగతావారిని పోలి ఉండడు.
ఋషి విషయంలో, అతనికున్న హాస్య స్పూర్తి, అతనిపై అప్సర కన్ను పడేలా చేసింది. మేధస్సు, హాస్యం కలిసిన పురుషుడితో ఆమె ఎప్పుడూ అనుబంధం కలిగి ఉండలేదు. ఆమె వృత్తి రీత్యా, ఆమె జీవితం అంటే తీవ్రమైన వ్యాపారంగా మాత్రమే పరిగణించే వారినే అప్పటిదాకా కలిసింది.
No comments:
Post a Comment