లలిత ప్రియ కమలం - అచ్చంగా తెలుగు

లలిత ప్రియ కమలం

Share This

లలిత ప్రియ కమలం 

   -  కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్,

22.06.2015


గోదావరీ తీరంలోని రాజమండ్రిలోని ఓ ఇల్లు... 
ఇంట్లో ఉన్న నటరాజు ప్రతిమ చూస్తూ అలాగే నిలబడిపోయిన చిన్నారి, ప్రతిమలోని నటరాజులా భంగిమ పెట్టేందుకు తనకు  తానుగా విశ్వప్రయత్నం చేసి, విజయం సాధించింది..  ఆమె నేటి మన కళాకారిణి లలిత సింధూరి. చిన్ననాటి నుండే తాత గారి  బాటలో  కూచిపూడి కళాకారిణిగా ఎదిగిన లలితా సింధూరి కొద్ది కాలం లోనే  ఎన్నో మైలురాళ్ళు చేరుకుంది.. కళామతల్లి సింధూరం లోని లాలిత్యం  మూర్తీభవించే నృత్యకళాకారిణి లలితా సింధూరి. తనకంటూ ప్రత్యేకత, నిత్య నృత్య సాధన చేస్తూ ఎదిగిన అచ్చమైన తెలుగు  కళాకారిణి  లలిత సింధూరి. అచిర కాలం లోనే ఆమె  అందుకున్న అవార్డులు, రివార్డులు కోకొల్లలు.
లలిత సింధూరి  కూచిపూడి నృత్యంలో  అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన   కళాకారిణి.. రాజమండ్రికి చెందిన ఈమె , నృత్య  కళలోనే గాక, విద్యలోను  ప్రతిభ గాంచింది... రాజమండ్రిలో బిటెక్ అభ్యసించారీమే.  దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు షుమారు 700  పైగా నృత్య ప్రదర్శనలు చేసిన  సింధూరి అనేక అవార్డులను కైవశం చేసుకుంది. 2002 లో  అరంగేట్రం చేసిన సింధూరి కేవలం పదమూడేళ్ళ కాలంలోనే ఇన్ని నృత్య  ప్రదర్సనలివ్వడం నిజంగా ప్రతి ఒక్కరు  అభినందించాల్సిన విషయం.
ప్రతి పోటీ ప్రదర్శనలో హుషారుగా పాల్గొనే సింధూరి అనేక పోటీల్లో ప్రధమంలో  నిలిచింది. చిన్న వయసులోనే కొత్తగూడెం బాలోత్సవ్ లో జరిగిన నృత్యపోటీలో పాల్గొన్న సింధూరి,  రాష్ట్ర వ్యాప్తంగా  ఆ వయసులోనే 135  బెస్ట్ క్లాసికల్ డాన్సర్ అవార్డులు కైవసం చేసుకుని సంచలనం కలిగించింది. 
నృత్యంలో డిస్టింక్షన్ సాధించింది.. దేశవ్యాప్తంగా వందల  ప్రదర్శనలు చేసిన లలిత సింధూరి శ్రీ వేదాంతం సత్యనారాయణ  శాస్త్రి గారి వద్ద,  శ్రీ వేదాంతం వెంకటా చలపతి గారి వద్ద నృత్యం అభ్యసించారు. కూచిపూడి నృత్యానికి చేసిన సేవలకు గాను లలితా సింధూరి  ని  "ప్రతిభా పురస్కారం" తో గౌరవించింది రాష్ట్ర ప్రభుత్వం . 
లలితా సింధూరి తండ్రిగారు వై.వి.జి.కె. ప్రసాద్ గారు ఆంధ్ర బ్యాంక్ లో కాషియర్ గా పని చేస్తున్నారు.  వీరి తల్లి గారు శ్రీమతి ఛాయా వరలక్ష్మి గారు. తండ్రి ప్రసాద్ గారు  కర్నాటక సంగీతం లో డిప్లొమా పొందిన విద్వాంసులు.  ఇక సింధూరి తాతగారు శ్రీ వెంపటి వెంకట నారాయణ గారు ప్రసిద్ధ కూచిపూడి కళాకారులు.
లలితా సింధూరి తాతగారైన శ్రీ వెంపటి వెంకట నారాయణ  గారు ప్రఖ్యాతినొందిన కూచిపూడి  నృత్య కళాకారులు, వారే తనకు స్ఫూర్తి అని చెప్పే  సింధూరికి , పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారంటే ఎనలేని అభిమానం. 
2011  లో  తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నాదనీరాజనంలో, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో   లలితా సింధూరి నృత్య ప్రదర్శన,  కాకినాడ సంగీత విద్వత్ సభలో కాకినాడ 64 ,65 వ వార్షికోత్సవాలలో ఇచ్చిన ప్రదర్శన, రాజమండ్రి సేవాసమితి 60 వ వార్షికోత్సవాలలో ,ఒడిస్సా రాష్ట్ర ఉత్సవాలైన గజపతి ఉత్సవ్ -2011 లో  ఆమె ఇచ్చిన ప్రదర్శనలు  లలితా సింధూరికి మంచి పేరు తెచ్చి పెట్టాయ్.  దూరదర్శన్ ప్రసారం చేసిన " మువ్వల సవ్వడి" లో ప్రదమ బహుమతిని  2004,2007,2008 సంవత్సరాలలో  గెలుపొందారు లలిత  సింధూరి.   2006లో ఢిల్లీలో జరిగిన మంగోలియా ఉత్సవ్ లో ఆమె ప్రదర్శన హైలైట్ గా నిలిచింది.
 అవార్డులు - రివార్డులు 
       2004 లో బాలరత్న  రాష్ట్రస్థాయి అవార్డు, 2005  బాలశ్రీ జాతీయ అవార్డు , 2009 లో జాతీయ పోటీల్లో ప్రధమ
బహుమతి  గెలుపొంది నాట్యమయూరి అవార్డు , 2010 లో కళావాణి వ్యవస్థాపకుడు శ్రీ ఎం. ప్రసాదమూర్తి స్మారక నృత్యభారతి- తొలి  అవార్డు,  2010 లో  ఏలూరు అభినయ భారతి వారి నృత్య కౌముది అవార్డు అందుకున్నారు లలిత సింధూరి. నవ్య నాటక సమితి అధ్వర్యంలో జరిగిన  జాతీయ నృత్య పోటీల్లో వరుసగా 2004, 2005, 2006, 2007  మొదటి బహుమతి గెలుపొంది సంగీత విద్వాన్ డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ , మరియు సినీ దర్శకలు శ్రీ కె. విశ్వనాధ్ వంటి మహామహుల చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. లలితా సింధూరి అందుకున్న అవార్డులకి లెక్క లేదు.. వందల అవార్డులు ఆమె గజ్జేకు దాసోహమన్నాయ్.  ఇటీవల, మార్చ్ 2015 లో మహిళా దినోత్సవం సందర్భం గా  భారతీయ జనతా పార్టి మహిళా విభాగం, మహిళా మోర్చా  ఆధ్వర్యంలో  “యంగ్ వుమెన్ అచీవర్ అవార్డ్ “ ను లలితా సింధూరి కి  అందించి సత్కరించారు.  
పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, డా శోభా నాయుడు, స్వాతీ సోమనాధ్ , మద్దాల ఉషా గాయత్రి. భాగవతుల  సేతూరాం వంటి మహామహ నృత్య కళాకారుల మన్ననలు పొందారు లలితా సింధూరి.
ప్రస్తుతం లలితా సింధూరి హైదరాబాద్  సెంట్రల్ యూనివర్సిటిలో  డా. అరుణ భిక్షు గారి పర్యవేక్షణలో, జూనియర్ రిసేర్చ్ ఫెలోగా నృత్యం లో పిహె.చ్.డి చేస్తున్నారు.
గోదావరీ హొయలు వంటబట్టిన నాట్యమయూరి లలిత సింధూరి తన మువ్వల సవ్వడితో  మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ' అచ్చంగా  తెలుగు' జాతి కోరుకుంటోంది.
లలిత సింధూరి నాట్యాన్ని క్రింది వీడియో లలో చూడండి.  

No comments:

Post a Comment

Pages