రుద్రాణి రహస్యం - అచ్చంగా తెలుగు

రుద్రాణి రహస్యం

Share This

రుద్రాణి రహస్యం

- వేద సూర్య


(జరిగిన కధ : రుద్రాణి కోనలో ఉన్న శక్తిని వశం చేసుకోవాలని చూస్తుంటాడు ఫ్రెడ్రిక్. ఈ ప్రయత్నంలో భాగంగా అతను పంపిన ఇద్దరు విదేశీయులు, కొనలో అకస్మాత్తుగా కనిపించిన వెలుగుతో మాడి మసైపోతారు. ఇది ప్రొజెక్టర్ పై చూసిన ఫ్రెడ్రిక్ విస్తుపోతూ ఉండగా, విలియమ్స్ అతన్ని క్షుద్రపూజలు చేసే అత్రిక వద్దకు తీసుకువెళ్తాడు. ఆ శక్తి అత్రికకు అందక, ఆమె వారిని భారత్ లో ఉన్న తన గురువు తంత్రిణి వద్దకు వెళ్ళమని పంపుతుంది. రుద్రాణి కోనకు ఆర్కియాలజి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రవల్లికకు బదిలీ అవుతుంది. సృష్టి స్కూటీ క్లచ్ వైర్ తెగి, కిందపడబోతుండగా రక్షిస్తాడు అద్భుత్ ... ఇక చదవండి...)
అద్భుత్ కుడి భుజం పై ఉన్న సూర్యుడి మచ్చ, సృష్టి ఎడమ భుజం పై చంద్రుడి మచ్చ, ఒకదానికొకటి  తగలటంతో  అక్కడి గాలి వేగంలో మార్పులు మొదలయ్యాయి. గాలికి కాలేజ్ కాంపౌండ్ లో ఉన్న చెట్లు నుండి పూలు రాలి ఇద్దరి పై పడ్డాయి. సృష్టి అద్భుత్ ని చూసి దూరం జరగటంతో, వాతావరణం మామూలుగా మారింది. రాలిన పూలలో, పువ్వులో ముద్దమందారంలా కలిసిపోయి ఉన్న సృష్టిని చూస్తున్న అద్భుత్ గుండెను పట్టుకుని పడబోతూ ఆపుకున్నాడు. అద్భుత్ ని చూస్తూ నవ్వుకుని , థాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది సృష్టి. ఇద్దరి చేతులు కలవటంతో ఆకాశంలో రెండు మేఘాలు ఒకదానికొకటి డీ కొని భారీ శబ్దంతో ఉద్భవించిన శక్తి,  కాలేజ్ కాంపౌండ్ లోని ట్రాన్స్ఫర్ పై పడి నిప్పులు విరజిమ్మాయి.
                                                                                                         **********
రుద్రాణి కోనకు వెళ్ళాలని నిర్ణయించుకున్న ప్రవల్లికను ఆమె తల్లి సుమిత్ర తాను ఆరాధించే ‘అవ్యక్ బాబా’ దగ్గరకి తీసుకు వెళ్ళింది. సుమిత్ర మనసులో కలవరాన్ని గమనించిన అవ్యక్ బాబా,  ప్రవల్లిక వైపు చూసి,
“ ఒకరి వల్ల అసంపూర్తిగా మిగిలిపోయినది ,సంపూర్ణం అయ్యే సమయం ఆసన్నమయ్యింది, చిక్కు ప్రశ్నలా మిగిలిపోయిన సుమిత్ర మాంగల్యం జాడను ప్రవల్లిక వెతికి పట్టుకుంటుంది”, అని  ధైర్యం చెప్పి,  అవసరానికి అక్కర కొస్తుందని ప్రవల్లికకు అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చారు.
                                                                                                        ************
తంత్రిణి యంత్రిణి హోమం చేస్తూ ఉంటుంది....
కాల దర్శినిలో మార్పులుమొదలవుతాయి. వారిద్దరూ హైదరాబాద్ లో ఉన్నట్లుగా సంకేతాలు కనిపించటంతో ఫ్రెడ్రిక్ హైదరాబాద్ లో అతని సెర్చ్ ని ముమ్మరం చేస్తాడు.
తంత్ర ముద్రలో ఉన్న తంత్రిణి , “కింకాసురా .. నా శక్తినే ఎదిరిస్తున్న శక్తి మూలం ఎక్కడా ?” అంటూ అరిచింది .
                                                                                                         ***********
వర్షం పడుతోంది ….
అద్భుత్ బైక్ పై వెళుతూ బస్ స్టాప్ లో కనిపించిన సృష్టి ని చూసి బైక్ ని ఆపి , “ఏంటిక్కడ?” అని అడిగాడు.
“స్కూటీ అక్కడుంది ,” అంటూ ఎదురుగా ఉన్న మెకానిక్ షెడ్ వైపు చూపించింది  సృష్టి.
అద్భుత్ షెడ్ వైపు చూసి “అక్కడే వెయిట్ చేయొచ్చుగా” అని అడిగాడు.
“అక్కడ ఉంటే దిష్టి ఎక్కువ తగులుతుంది ..” అంది సృష్టి.
అద్భుత్ నవ్వుకుని, కనిపించిన పాని పూరి బండి వైపు చూపిస్తూ, “పానీ పూరి తిందామా ?” అని అన్నాడు.
“ఊ ... “ అంటూ ఎక్స్ప్రెషన్ పెట్టి వర్షం వైపు చూస్తున్న సృష్టిని చూసి , అద్భుత్ తన జర్కిన్ ని తీసి సృష్టి కి ఇచ్చాడు. సృష్టి జర్కిన్ ను తలపైకి గొడుగులా పెట్టుకుని షెల్టర్ నుండి బయటకి వస్తూ, అడుగు జారి, పడబోయింది.
అప్పుడు ఇద్దరి భుజాలపై ఉన్న సూరీడు- జాబిల్లి మచ్చలు దగ్గరయ్యాయి. ఆకాశంలో పెద్ద శబ్దంతో ఉరుము ఉరుమింది. కోనలో మార్పులు మొదలయ్యి కొడిగట్టిన దివ్వె వెలిగింది. మోడు వారిన చెట్టుచిగురించింది.
                                                                                                   ****************
అయ్యోరు యోగ ముద్ర నుండి కళ్ళు తెరచి కింగరా అని పిలిచాడు. కోయ దొర పరుగున అయ్యోరు ముంగిలికి వెళ్ళి మొక్కాడు .
“సూరీడు, జాబిల్లి ఒక్కటైనారు రా.. దివ్వె చెప్పింది .. చిగురు మొలిచింది .. కోన పులకరించబోతుంది రా ..”,  అంటూ కూర్చున్న చోటునుండి లేచి మంత్రాలు చల్లుతూ దండంతో నేల మీద గీతలు గీసాడు.. గీసిన గీతలు వెలుగుగా మారి గాలిలో మాయమయ్యి ,తంత్రిణి దర్శినిలో వెలుగుగా వచ్చి దర్శిని పగిలిపోయింది.
                                                                                                    ***************
బస్ స్టాప్ కి పక్కగా బైక్ పై కూర్చున్న సృష్టి , అద్భుత్  చెప్పింది విని నవ్వుతుంటుంది . అటుగా కారు లో వెళుతున్న ప్రవల్లిక, సృష్టి ని చూసి కార్ ని ఆపి  పిలిచింది. సృష్టి ప్రవల్లికని చూసి,  సంతోషంగా దగ్గరకి వెళ్ళి మాట్లాడి , మెకానిక్ కు స్కూటీని ఇంటికి పంపించమని చెప్పి, అద్భుత్ కి బై చెప్పి కారులో వెళ్ళిపోతుంది. సృష్టి వెళ్ళిపోతూ బైక్ పై వదిలేసిన స్టోల్ ని చూసి నవ్వుకుంటూ మెడలో వేసుకుని బైక్ ని స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాడు అద్భుత్.
అద్భుత్ ఇల్లు ..
అద్భుత్ ఇంటికి వెళ్ళడం తోనే అతని తల్లి రాధిక అద్భుత్ చేతికి తాడు కట్టింది.
“ఇదేం దేవుడి దారం” అంటుండగా , ఇది దారం కాదు ఆధారం అంటూ చెప్పింది ఆమె.
“చాదస్తం !!!” అని అన్నాడు విసుక్కుంటూ అద్భుత్ .
 “ఇది చాదస్తం కాదురా, నమ్మకం” అంటూ అద్భుత్ తండ్రి కృష్ణ రాజ్ అటుగా వెళుతూ అన్నాడు.
తండ్రిని చూడగానే అద్భుత్ ఆప్యాయంగా కౌగలించుకుని , “ఎప్పుడొచ్చారు?” అని అడిగాడు.
“నువ్ బస్ స్టాప్ లో ఒకమ్మాయితో కలిసి పానీ పూరి తింటున్నావే , అపుడు” అని తండ్రి అనటంతో, “అవునా, మరి పిలవాల్సిందిగా” అన్నాడు ఆశ్చర్యంగా అద్భుత్ .
“నువ్వేదో నీ గర్ల్ ఫ్రెండ్ తో బిజీగా ఉంటే , ఎందుకులే డిస్టర్బ్ చేయటం?” అని పిలవలేదు.
“డాడ్! తను సృష్టి, ఈ రోజే ఫ్రెండ్ అయింది”.
అది విన్నతండ్రి, “ మొదటి పరిచయమే పానీ పూరిలు షేర్ చేసుకునేంత వరకు వెళ్ళిందంటే, ఆ సృష్టి అధ్భుతమైనదన్నమాట”.
“వాడిని ఆటపట్టించింది చాలు గాని, మీరు తినటానికి రండి”,  అని రాధిక పిలవటంతో , “అటులనే ఇంటి మంత్రి గారు “ అంటూ తండ్రి ,తల్లి వెనకే వెలుతుండటం చూసి, “డాడ్, మీకు అమ్మ అంటే ఎందుకు అంత భయం?” అని కొంటెగా అడిగాడు అద్భుత్.
“ అదేమిటో అర్ధం కావాలంటే నీకో తోడు రావాలి లేరా !” అని కన్నుగీటాడు అతని తండ్రి.
అద్భుత్ ,సృష్టి తన దగ్గర వదిలేసిన స్టోల్ ని చూసుకుని, “మమ్మీ నేను తరువాత తింటాను,” అని చెప్పి తన గదికి వెళతాడు.
సృష్టి ఇల్లు ..
“నీకు మీ నాన్న పోలికలే కాదు... పంతం ,పట్టుదల కూడా వచ్చాయి . నువ్వు రుద్రాణి కోనకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో అడిగి నిన్ను ఇబ్బంది పెట్టను . జరిగింది తెలుసుకోవాలనేది నీ ఆశయం , నీకేమీ  కాకూడదనేది మా ఆశ “,  అని అంటూ సృష్టి తండ్రి శ్రీధర్ వర్మ ఒక పుస్తకాన్ని తెచ్చి ప్రవల్లికకు ఇచ్చాడు.
“రుద్రాణి రహస్యం” అని మొదటి పేజి పై రాసి ఉన్న ఆ పుస్తకాన్ని చూస్తున్న ప్రవల్లికతో...
“ ఇది మీ నాన్న రుద్రాణి కోన పై స్టూడెంట్ గా రిసెర్చ్ చేసినపుడు రాసిన పుస్తకం , జాబ్ లో చేరి అసైన్మెంట్ ను టేకప్ చేయటానికి ముందు ఇక్కడికివచ్చినపుడు దీనిని ఇక్కడే వదిలి వెళ్ళాడు. చదవటానికి ఎంత ప్రయత్నించినా నా వల్ల  కాలేదు. నీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడు”, అన్నాడు సృష్టి తండ్రి.
అక్కడికి వెళ్ళి పుస్తకాన్ని చూసిన సృష్టి ,” ఏంటిది నాకెపుడూ చూపించలేదు,” అంటూ పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకుంది. పాత బడిన పుస్తకం లో ఒక్కసారిగా ఒక జీవం ఏర్పడింది. ఆ మార్పుని అందరూ గమనించే లోపు బయట నుండి పెద్ద శబ్దం వినిపించటంతో అందరూ గది నుండి బయటకి వెళ్ళి పోర్టికోలో చూసారు. సృష్టి పుస్తకాన్ని పక్కన పెట్టేయటం తో శబ్దాలు ఆగిపోయాయి.
ఆకాశంలో మెరుపులు మెరుస్తుండటం చూస్తుండగా దూరంగా ఒక నక్షత్రం నేల రాలుతూ కనిపించింది వాళ్లకు.
“ ప్రకృతి కూడా మంచి శకునాలనే చూపిస్తుంది, ఆ సర్వేశ్వరుడి ఆశీర్వాదంతో అంతా మంచే జరుగుతుంది,” అని సృష్టి తల్లి కళావతి అనటం విని ,”అమ్మా! మన డ్యూటీని మనం శ్రద్ధ గా చేస్తే పంచ భూతాలు మన వెంటే ఉంటాయి,” అంటూ సృష్టి , ప్రవల్లిక మెడ చుట్టూ ఆత్మీయంగా చేతులు వేస్తూ అంది .
                                                                                                 **************
తంత్రిణి జరిపిన హోమం వల్ల ప్రత్యక్షమైన యంత్రిణిని ,”కారణ జన్ముల జాడ తెలుసుకొని రా !” అని ఆదేశిస్తుంది ఆమె.
యంత్రిణి వాయురూపంలో వారి జాడను వెతికి పట్టుకోవడానికి ఉన్న చోటు నుండి తూర్పు వైపుకి ప్రయాణం మొదలుపెట్టింది. యోగ ముద్రలో ఉన్న అయ్యోరు ధ్యానం నుండి బయటకి వచ్చి, “ నమో రుద్రాణియే నమః” అంటూ చేతులు జోడించి,  చేతిలోకి విభూది తీసుకుని, గాలి లోకి వదులాడు
అద్భుత్ ఇంటి ముందు ముగ్గు చల్లుతున్న మున్సిపాలిటీ బండిలో ఉన్న ముగ్గులో ఆ విభూతి కలుస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఇంటి చుట్టూ ముగ్గు చల్లి వెళ్ళారు. వాయు రూపంలో వెళ్ళిన యంత్రిణికి, ఆ ముగ్గు రక్ష కవచంలా అడ్డుపడటం వల్ల నిర్విర్యమయిపోతుంది.
“తంత్రిణి చేస్తున్న హోమం వల్ల ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు, అసలు తంత్రిణి కి అంతటి శక్తి ఉందా?” అనే సందేహాన్ని ఫ్రెడ్రిక్ లేవదీసాడు. ఆ సందేహాన్ని అవమానంగా తీసుకున్న తంత్రిణి, తన శక్తితో ఫ్రెడ్రిక్ బ్యాంక్ అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో డబ్బుని మరొక అకౌంట్ కిట్రాన్స్ఫర్ చేస్తుంది. విస్మయానికి గురౌతూ, “ఆమె కను సన్నలతోనే అది సాధ్యం చేయగలిగిన ఆమెకు రుద్రాణి కోన విషయంపై పరిష్కారం ఎందుకు చిక్కట్లేదని”, అడిగాడు ఫ్రెడ్రిక్.
“యంత్ర తంత్రాలకు అందని శక్తులు, ఆ కోనను,  కావలిసిన ఆ ఇద్దరినీ రక్షిస్తున్నాయి. ఆ శక్తులకు ఎదురు వెళ్ళడం సుసాధ్యమైనదికాదు, అలా అని అసాధ్యమైనది కూడా కాదు. ఈ సృష్టి లో ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది.ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది ఒక్క గండరుడు మాత్రమే!” అంది సాలోచనగా తంత్రిణి .
“అయితే గండరుడిని వెంటనే పిలిపించమని,” ఫ్రెడ్రిక్ ఆత్రంగా అన్నాడు.
“పిలవగానే రావడానికి కింకరుడు కాదురా, సృష్టి గమన గతులు మార్చగల గండర గండరుడు. కాలకేతు ముహూర్తం లో రాక్షస ఘడియలలో నెత్తురు నైవేద్యంతో తీతువుల స్వాగతంతో గండరుడ్ని ప్రసన్నం చేసుకోవాలి, “ అని చెప్పింది తంత్రిణి.
తంత్రిణి , “నువ్వేం చేస్తావో చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లో అయినా రుద్రాణి కోనలో నిగూఢమై ఉన్నశక్తిని నాకు సొంతం చెయ్యి, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా” అని ఆవేశం వాగ్దానం చేసాడు ఫ్రెడ్రిక్.
ఆ మాటలు విన్న తంత్రిణి,  “నీ వాగ్దానం వల్ల నాకు ప్రయోజనం లేదు, నా శక్తికి సవాలుగా నిలుస్తున్న రహస్యం ఏమిటో నేను తెలుసుకోలేక పోతే నా ఉపాసన నిరర్ధకం, తెలుసుకోలేని పక్షంలో నా జన్మని  త్యాగం చేస్తా,” అంటూ  శపథం చేసింది.
                                                                                                *************
కాలేజ్ లో అద్భుత్ కి అప్పోనెంట్ అయిన సందీప్ అద్భుత్ ని దెబ్బతీయాలని పధకం వేసాడు . ఆడిటోరియంలో డ్యాన్స్ ప్రాక్టిస్ చేసే ఫ్లోర్ పై జెల్ లిక్విడ్ ని స్ప్రే  చేయించాడు. విషయం తెలియని అద్భుత్, డ్యాన్స్ ఫ్లోర్ కి వెళ్లి మ్యూజిక్ ఆన్ చేసుకుని స్కేట్స్ తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆడిటోరియం ముందుగా కారిడార్ నుండి వెళుతున్న సృష్టి , వినిపిస్తున్న మ్యూజిక్ ని విని ఆడిటోరియంకి వస్తుంది. డ్యాన్స్ చేస్తున్న అద్భుత్ ని చూస్తూ డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరకి వస్తుంది. అద్భుత్ డ్యాన్స్ చేస్తూ, తననే చూస్తున్న సృష్టిని చూసి, దగ్గరకి రమ్మనిసైగ చేసాడు.
సృష్టి రానని తల ఊపటంతో, అద్భుత్ నవ్వుకుని,  స్కేట్ చేస్తూ సృష్టి దగ్గరకి వెళ్లి,  చేయి చాపి రమ్మని సైగ చేసాడు. సృష్టి స్కేట్స్ వేసుకుని అద్భుత్ చేతిలో చేయి కలిపి ఫ్లోర్ పైకి వచ్చింది. ఇద్దరి చేతులు కలవటంతో ప్రకృతిలో మార్పులు.... మేఘాల సంఘర్షణలు.... చిరు జల్లులుగా మొదలైన చినుకులు జోరు పెరిగి, అప్పటి వరకు వేడితో వేగిన నేలకి జలాభిషేకం జరిగింది. ఆ మార్పులతో వారికేం సంబంధం లేదన్నట్లుగా ఇద్దరూ కళ్ళతో మాట్లాడుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. ఫ్లోర్ పై కనిపించకుండా ఉన్న లిక్విడ్ వల్ల స్కేట్ స్కిప్ అవటంతో అద్భుత్ పడబోతుంటే , సృష్టి తన కుడి చేతి వైపుకి తిరిగి అద్భుత్ ని తన ఎడమ భుజం పై బ్యాలెన్స్ చేసింది. ఇద్దరి భుజాలపై ఉన్న సూరీడు , జాబిల్లి మచ్చలు కలవటంతో,  ఉద్భవించిన శక్తి వల్ల ఫ్లోర్ లో మార్పు కలిగి ఇద్దరూ మరింత ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తారు. మ్యూజిక్ ఆగిపోయి నిశ్శబ్దంగా ఉన్న ఆడిటోరియంలో అలసిన ఇద్దరూ దగ్గరై ఒకరికొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఒక్కసారిగా ఉరుము ఉరిమిన శబ్దం ప్రతిధ్వనించటంతో ఉలిక్కిపడ్డారు ఇద్దరూ.
అద్భుత్ చేతుల్లో ఉన్న సృష్టి , అద్భుత్ కి  దూరంగా జరిగి, పరుగున వెళుతుంటే , “నేనంటే నాకు చాలాఇష్టం. నన్ను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఏమంటావ్?” అని  అరిచాడు అద్భుత్.
సృష్టి ఆగి,” నిన్ను నేనేం చేసుకోను?” అని అడిగింది.
“అంటే ఏం చేద్దామనుకుంటున్నావ్?” అన్నాడు కొంటెగా నవ్వుతూ అద్భుత్ .
 సృష్టి నవ్వి,  ఏం మాట్లాడకుండా వెళుతుంటే, “చెప్పు ఏదో ఒకటి అనుకుంటావ్ గా,” అని వెనకే వెళుతూ గట్టిగా అన్నాడు అద్భుత్.
“ఇంకా ఏమి అనుకోలేదు” అంది సృష్టి సిగ్గుపడుతూ....
“పోనీ ఇప్పుడు అనుకోవచ్చు కదా ?”
“ఏమో .. “అని అరిచి వెళుతున్న సృష్టిని చూస్తూ,” నేను ఆల్రెడీ అనేసుకున్నా” అని అరిచాడు. అద్భుత్ కి ఏమి కాకుండా ఉండటం చూసిన సందీప్ తట్టుకోలేక డ్యాన్స్ ఫ్లోర్ కి వెళ్లి లిక్విడ్ ఎందుకు పనిచేయలేదని అనుకుంటూ ఫ్లోర్ పై అడుగువేస్తాడు...
(సశేషం...)

No comments:

Post a Comment

Pages