మూడు కోరికలు.
- డా.బల్లూరి.ఉమాదేవి.
శ్రీమద్రామాయణం భారతీయులకు పారాయణా గ్రంథము.ఇందులో సీతారాముల చరిత్ర మనోజ్ణముగా వర్ణింపబడినది.ఆలు మగలకు,అన్నదమ్ములకు, తండ్రికొడుకులకు ,యజమానికి బంటుకు మధ్య గల సంబంధాలు ఇందులో చక్కగా వివరింప బడినవి. ఇందులో నాయకుడు శ్రీరాముడు.
. " కావ్యం రామాయణం కృత్స్నంసీతాయాశ్చరితం మహాత్ "
అంటూ ఇది కేవలం రాముని కథ మాత్రమే కాదు ఇందులో సీతాచరితం కూడా వుందని. వాల్మీకిమహర్షి ప్రారంభంలోనే వివరించాడు. భగవంతుడెత్తిన దశావతారాలలోఆచరణీయమైనది శ్రీరామావతారము. పితృవాక్య పరిపాలనకు ఏకపత్నీవ్రతమునకు ,సత్యవాక్పరిపాలనకు శ్రీరాముడు పెట్టింది పేరు. మానవులుగా జన్మించారు కాబట్టి మానవస్వభావాలన్నీ ఇందులో సందర్భానుసారంగా చెప్పబడ్డాయి.
కోరికలు మానవ సహజం. మానవరూపంలో వున్న సీత కూడా ఈ కోరికల వలలో చిక్కుకు పోయింది. సంసారం అన్నాక ఆలుమగల మధ్య విలాసాలు విలాపాలు, కోపాలు,తాపాలు ఖచ్చితంగా వుంటాయి .వీటితో పాటు కోరికలు తీర్చమనే ప్రార్థనలు,వేడుకోవడాలు కూడా వుంటాయి .ఆదర్శ దంపతులుగావున్న సీతారాములు కూడా కోరికల వల్ల ఇబ్బందులపాలయ్యరని రామాయణం తెలుపుతుంది . భగవంతుడు ఇలకు రావడానికి కారణం దుష్టశిక్షణ శిష్టరక్షణే యైనా అంతరార్థం మరోటి వుంది. భార్య అలవి కాని కోరికలు కోరితే తాను వ్యక్తిగతంగా కష్టాల పాలవడమే కాక తనతో వున్నవారికి కూడా కష్టాలు తప్పవని లోకానికి తెలియచేయడమే ప్రధాన వుద్దేశ్యము.
రామాయణ కథా భాగాన్ని పరిశీలిస్తే ఇందులో నాయికయైన సీత,నాయకుడైన శ్రీరాముని కోరిన కోరికలు మూడు. సీతారాముల వివాహానంతరము మొదటి 12 సంవత్సరాలలోఒకటి, అరణ్యవాసంలో వున్నపుడు 14 సంవత్సరాలలో ఒకటి, తిరిగి రాజ్యపాలన చేసిన 11 వేలసంవత్సరాలలో ఒకటి. ఇలా మూడు సార్లు మూడు కోరికలు కోరింది. ఇవే రామాయణకథకు ప్రాణప్రతీకలని చెప్పవచ్చు.
1 .మొదటి కోరిక :-దశరథ మహారాజుముద్దుల భార్యయైన కైకేయి తన కుమారుని రాజ్యాభిషిక్తుడిని చేయడం కోసము రాజు తనకిచ్చిన రెండు వరాలను తీర్చమంటుంది. మరురోజు ఉదయము రామ పట్టాభిషేకం జరగాల్సి వుంది. కాని కైక కోరిక వల్ల అది అరణ్యవాసానికి దారితీసింది.
తండ్రి మాట నిల్పడం కోసం రాముడు 14 సంవత్సరాలు అడవుల కెళ్ళడానికి సంసిద్ధుడౌతాడు.తరువాత భార్య వద్దకొచ్చి, తాను అడవులకెళ్ళే సంగతి చెపుతాడు. తను రాజ్యంలో లేనపుడు ఆమె ఎవరితో ఎలా ప్రవర్తించాలో చెపుతాడు. రాముడు చెప్పేదంతా వింటున్న సీత నిబ్బరాన్ని కోల్పోయీ దుఃఖంతో స్వామీ ! ఏమిటి మీరంటున్నది. ఎక్కడైనా కుటుంబంలో మిగిలిన సభ్యులు భోగభాగ్యాలననుభవిస్తారు. కాని భర్తతో పాటు కష్టసుఖాలు పంచుకొనేది భార్య మాత్రమే. ఇతర సభ్యులు కాదుగా అంటూ ఇహ పరాలకు రెండింటికి భార్యకు భర్త ఒక్కడే గతి అంటుంది. అడవికి తనూ వస్తానంటూ ఎందుకో కారణం కూడా చెపుతుంది. తాను ముందు నడచి రాళ్ళు ముళ్ళు ఏరి రాముని నడకకు దారి సుగమం చేస్తానంటుంది. మరి తనను వదిలి వెళ్ళడానికి కారణం చెప్పమంటుంది.ఇంట్లోనైనా బయటైనా భర్త అడుగుజాడల్లో నడవడమే భార్య ధర్మమంటుంది. అంతకు ముందు రాముడు చెప్పిన విషయాలను ముచ్చటిస్తూ ,ఎక్కడ ,ఎప్పుడు ,ఎవరితో ఎలా మెలగాలో మా అమ్మా నాన్నలు చెప్పారంటుంది. ప్రత్యేకంగా నీవు గుర్తు చేయాల్సిన అవసరం లేదని నిష్టూర మాడుతుంది.సామ దాన,దాన,భేదోపాయాలన్నీ వాడుతుంది. రాముడు పక్కనుంటే చాలు సింహాలు పులులు ఎన్నున్నా భయం లేదంటుంది..ఆయన తోడుంటే అడవిలో వున్నప్పటికిని సుఖాలను కాని, పుట్టినింటిని కాని కోరనంటుంది. దుర్మార్గులను శిక్షించే రాముడు ప్రక్కనుండగా తనకే భయమూ లేదంటుంది.అక్కడ అవి కావాలి ఇవి కావాలి అని మారాం చేయనని భక్ష్య భోజ్యాలు కావాలని అడగనని అంటుంది. అయోధ్యలో ఎన్ని సుఖాలున్నా రాముడు చెంత లేకపోతె నిరర్థకాలే అంటూ 14 సంవత్సరాలే కాదు జీవితాంతము అతనితో అడవిలో వుంటే అదే స్వర్గమని యంటుంది. రాముడు చెంత లేకపోతే అది స్వర్గమైనా తనపాలికి నరకమేనని ఖచ్చితంగా చెపుతుంది.
అంతటితో ఆపక నిన్ను అడవికి వెళ్ళమన్నారంటే నన్ను కూడా వెళ్ళమన్నట్లేగా అంటూ ఎందుకో కారణం చెబుతుంది. -- నేను నీ అర్ధాంగిని. నీలో సగభాగాన్ని అని జవాబిస్తుంది. ఇంకా రాముడామెకు నచ్చజెబుతూ అడవంటే నీకు తెలియదని, ఎండ కన్నెరుగక పుట్టింట్లో గారాబంగా పెరిగావు,అత్తగారింట్లో అంతఃపుర కాంతగా వున్నావు అంటూ నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తాడు రాముడు.. అంతే కాదు అడవిలో కాలు పెట్టగానే ముళ్ళపై రాళ్ళపై నడవాలి మెత్తని నీ పాదాలు కందిపోతాయని అంటాడు. క్రూరమృగాలుంటాయి స్నానానికి పన్నీరు కాదు, మొసళ్ళుండే చల్లనీళ్ళేగతి... కనుక భరించలేవని ఎన్నోరకాలుగా నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తాడు రాముడు. విన్నంతసేపు విని చివరకు ఆవేశం తట్టుకోలేక...
“ కిం త్వామన్యత వైదేహః పితామే మిథిలాధిపః
రామా జామాతరం ప్రాప్య స్త్రియం పురుష నిగ్రహం “
అని చురక వేస్తుంది. "ఓ రామా! మా నాన్న నీ రూపం చూసి పురుషుడని పొరబడ్డాడేమో! అంతా ఆడవాళ్ళ మనస్తత్త్వమని తెలుసుకోలేదేమో! అని ఆశ్చర్యం నటిస్తుంది. లేకపోతే భార్యను కాపాడడం చేతకాక వెంట తీసుకు వెళ్ళననే నీవంటి దద్దమ్మ కిచ్చి పెళ్ళి చేసేవాడా?" అని ప్రశ్నిస్తుంది. ఇంత మాటన్నాక -ఏ మగవాడైనా ఏం చేస్తాడు తప్పనిసరిగాతీసుకెళ్తాడు గదా! అదే చేశాడు రాముడు సీతను పిలుచుకు పోక తప్పలేదు రామునకు.
ఐనా ఏ సంసారంలో నైనా భార్య మాట కాక భర్త మాట నెగ్గుతుందా! కాదూ కూడదంటే కలహం తప్పదు కదా. ఐనా భార్యను వెంట తీసుకెళ్ళాలనే కోరిక ఎవరికి మాత్రం వుండదు. కాని రాముడేం ఆలోచించాడంటే తనకంటే తప్పదు వెళ్ళితీరాలి. ఆమె కెందుకు కష్టాలు అనుకొని వద్దన్నాడు.చివరికి తీసుకెళ్ళాడు. ఈ విధంగా సీత మొదటి కోరిక పట్టుబట్టి చెల్లించుకొంది.
రెండవ కోరిక : సీతా రామ లక్ష్మణులు పర్ణశాలలో నివసిస్తున్న సమయంలో ---
ఒకరోజు సీత పూలు కోస్తూ వుంటుంది. రామ లక్ష్మణులు అటు ఇటు తిరుగుతుండగా ఇంతకు మునుపెప్పుడూ చూడని బంగారు జింక కనిపిస్తుంది. బంగారు వెండి దారాలతో శరీరం వెలుగులీనుతుంటుంది. దాని శరీరంపై మచ్చలు నక్షత్రాల వలె మనోహరంగా వున్నాయి. దాన్ని చూసి సీత ఇది మన ఆశ్రమంలో వుంటే అయోధ్యకు వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్ళొచ్చు, అక్కడందరు చూసి సంతోషిస్తారు. కావున వెళ్ళి తీసుకు రమ్మంటుంది. ఒకవేళ ప్రాణాలతో దొరకక పోతే చంపి దాని చర్మమైనా తెమ్మంటుంది. పట్టుకుచ్చులాంటి దానిపై కూర్చోవచ్చని ఆశ పడుతుంది. కాని ముందు చూపు గల లక్ష్మణుడు దీనిని రాక్షసమాయ అని గుర్తించి హెచ్చరిస్తాడు. దానికి రాముడు స్పందిస్తూ , "సోదరా ఇది ఏదైనా సరే, ఎవరైనా సరే -అందంగా వుంది. మీ వదిన కోరిందియంటూ, " ఐనా రాజ్యాలడిగిందా ? స్వర్గ సుఖాలడిగిందా? కేవలం జింకను లేదా చర్మాన్నో కోరింది. తేక పోతే బాధ పడుతుంది. జింక ఐతే ప్రాణాలతో తెస్తా, రాక్షస మాయ ఐతే చర్మాన్ని తెస్తానంటూ," జాగ్రత్తలు చెప్పి రాముడు దానివెంట వెళతాడు. ఆజింక దొరికినట్టే దొరుకుతూఎగురుతూ పర్ణశాలకు చాలా దూరంగా పోతుంది. రాముడు చాలాదూరం వెంబడించి వెళ్ళి ఇక లాభం లేదనుకొని బాణాన్ని వదులుతాడు. ఇదంతా మారీచుని పథకమే. రావణుని మాటవిని అతని చేతిలో చావడం కన్నా, రాముడి చేతుల్లో చావడం మేలనుకొంటాడు. చివరకు "హా, సీతా! హా లక్ష్మణా!" అంటూ చావుకేక పెట్టాడు. ఈ కేకను పర్ణశాలలోవున్న సీతా లక్ష్మణులు విన్నారు. సీత ఆవేశంతో "నీవు విన్నావు కదా, ఇది రాముని కంఠస్వరము," వెళ్ళమని తొందర పెడుతుంది. లక్ష్మణుడు కాదని అన్నా, సీతకూరట కల్గలేదు. "రాముడాపదలో వుంటే నిమ్మళంగా వుంటావా ?" అని అనరాని మాటలంటుంది. నీవు మిత్రుడవు కాదు, హితుడవు కాదు, హిత శత్రువు అని నిందిస్తుంది. "మీ అన్న కోసం కాక నాపై కోరికతో వెంట వచ్చావు," అని నిష్టూరంగా పలుకుతూ రాముడికి అపాయం జరిగితే ప్రాణం తీసుకొంటా గాని నీకు దొరకనని నిందావాక్యాలాడుతుంది. లక్ష్మణుడు ఆ మాటలు వినలేక ,"అమ్మా నీవు దేవతవు. సాధారణ స్త్రీలు ఇలామాట్లాడడం సహజమే కాని నీకు తగదమ్మా," అని అనునయిస్తాడు. అయినా" రాముడికే ఆపద రాదు, అని తెల్సినా నీమాటలు వినలేక వెళుతున్నా," అంటూ వెళ్ళిపోతాడు. ఆ తరువాత సన్యాసి వేషంలో రావణుడు వచ్చి ఆమె నెత్తుకొని వెళ్ళిపోతాడు. ఇదీ సీత కోరిన రెండవ కోరిక వల్ల కలిగిన ఫలితము.
దీనిని వాల్మీకి మహర్షి పారమార్థిక దృష్టితో వివరించాడు.
సీతా రామ లక్ష్మణులు ఒక కుటుంబం. భార్య భర్త బంటు. మన భారతీయ సంస్కృతిలో సతికి పతియే ప్రత్యక్ష దైవము. వ్రతాలు నోములు పతిసేవ ముందు సమం కాదు. అలాభావించి ఆరాధించిన స్త్రీ సీత. రాముడు దేవుడు. సీత జీవుడు. లక్ష్మణుడు భక్తుడు..జీవులకు ప్రాకృత వస్తువులపై గాక భగవంతునిపై భక్తి వుండాలి. అది మోక్ష సాధనం. ఇక్కడసీత అనే జీవుడు రాముడు అనే దైవాన్ని, జింక అనే ప్రాకృత వస్తువు కోసం దూరం చేసు కొన్నాడు. కనీసం భగవద్భక్తుని(లక్ష్మణుని) మాటవిన్నా బాగుండేది. కాని స్త్రీసహజమైన బుద్ధితో భాగవతుణ్ణి అంటే భక్తుడిని(లక్ష్మణుడిని) నిందించి దూరం చేసుకొంది. దశేంద్రియాలు( 5 జ్నానేంద్రియాలు,5 కర్మేంద్రియాలు) గల దేహ రూపం ప్రకృతితో బంధం కల్గింది. హనుమంతుడనే ఆచార్యుని వల్ల రామ సమాగమం కల్గింది. కావున మానవులు ప్రకృతిపై మోహం వదిలి భగవంతుని చింతన చేయాలని రామాయణమహాకావ్యం సూచిస్తుంది
మూడవ కోరిక :
రావణసంహారానంతరం అగ్నిప్రవేశం చేసి పునీతయైన సీత తిరిగి రామునితో అయోధ్య చేరుతుంది. కొద్దికాలానికి గర్భవతి అవుతుంది. గర్భిణీ స్త్రీల కోరికలు తీర్చాలనేది మన భారతీయుల నమ్మకం. సరే ఇక్కడ సీతకు తపోవన భూములకు వెళ్ళి మునిపత్నులను చూసి రావాలనే కోరిక పుడుతుంది..అదే సమయంలో రాముడు ఏదైనా కోరికుంటే అడగమంటాడు సీతను. వెంటనే సీత "తపోవనాని పుణ్యాని ద్రష్టుమిచ్చామి రాఘవా" అంటుంది.
తనకు గంగా తీరంలోని ఋషుల ఆశ్రమాలు చూడాలని వుందని, ఇలా వెళ్ళి అలా రాకుండా "అప్యేకరాత్రం కాకుత్స్థ నివసేయం తపోవనే "అంటూ ఒక రాత్రి అక్కడ గడపాలనేతన కోరికను వ్యక్తపరుస్తుంది. అదే సమయానికి చారులు లోకరీతిని తెలుపుతూ రాముని పరాక్రమంతో పాటు సీతపై లోకులాడు కొనే నిందలు విన్పిస్తారు. ఈ మాటలు విన్నరాముడు, సోదరులతో చర్చించి "సీతాపరిత్యాగమే పరిష్కారమని" నిశ్చయిస్తాడు. సీతను వదిలి పెట్టిరమ్మని లక్ష్మణునికి చెపుతాడు. సీతేమో పాపం తన కోరిక మేరకే రాముడుతపోవన భూములకు పంపుతున్నాడనుకొంటుంది. చివరకు లక్షణుడు ఆమెను గంగా తీరం వద్ద వదిలి వెళుతూ "పౌరుల మాటల నాదరిస్తూ గంగా తీరంలో నిన్నువదలమన్నాడని" చెప్పి విడిచి వెళ్ళి పోతాడు.
ఆ మూడవ కోరికే రామునితో శాశ్వితంగా ఎడబాటును తెచ్చింది.దాదాపు 12 సంవత్సరాల నిప్పును మూటగట్టుకొన్నట్లు దుఃఖాన్ని కట్టుకొని అలమటించింది. కడుపులోవున్న పిల్లలను తలచుకొని ఆత్మహత్యాయత్నాన్ని విరమించు కొంటుంది. అపనింద భరించలేక చివరకు తండ్రీ కొడుకులను కలిపి తల్లిలో ఐక్యమై పోతుంది.
జీవులకు భగవంతుని సన్నిధే ఆనందప్రదం. ఇతర కోరికలు భగవంతుని దూరం చేసి దుఃఖాన్ని కల్గిస్తాయనే గొప్ప సత్యాన్ని బోధించే గ్రంథరాజమే శ్రీమద్రామాయణం.
( దాదాపు 40 సంవత్సరాల క్రితం మానాన్నగారి స్నేహితులు శ్రీ కుంటిమద్ది శేషశర్మగారు చెప్పగా విన్న వివరములతో ఈ వ్యాసము వ్రాశాను.)
No comments:
Post a Comment