మేటి సినీ దర్శకుడు శ్రీ కె. విశ్వనాధ్.
- తురగా శివరామవేంకటేశ్వర్లు
తెలుగు తేజంతో ప్రకాశించే వారిలో ప్రముఖ సినీ దర్శకుడు కళాతపస్వి శ్రీ కె. విశ్వనాధ్ ఒకరు. ఈయన దర్శకత్వంలో వచ్చిన చలన చిత్రాల గురుంచి, వాటి కళాత్మక విలువలు గురుంచి ఇదివరలో వ్యాఖ్యలు, రివ్యూలు చాలానే వచ్చాయి. కానీ కాలప్రవాహంలో మాసిపోనివి, మరచిపోలేనివి కొన్ని ఉత్తమ గ్రంధాలును, చలన చిత్రాలను మళ్ళీమళ్ళీ చదువుకోవడం, పరిశీలించడం, గుర్తుచేసుకోవడం చేస్తుంటాము. ఆనాటి వ్యాఖ్యలను, రెవ్యూలను చదవని ఈనాటి పాఠకులు చాలామంది ఉండవచ్చు. అయన చిత్రాలు గురుంచి ఒక సినీ ప్రేక్షకుడుగా నా భావాలను, అవగాహన, పాఠక మిత్రులతో పంచుకోవడమే ఈవ్యాస ఉద్దేశ్యం. కేవలం దర్శకుని పేరు మాత్రం చూసి ప్రేక్షకులకు సినీమాలను చూడడం అలవాటు చేసి విజయవంతం చేసిన కొద్ది దర్శకులలో కళాతపస్వి శ్రీ కె. విశ్వనాధ్ ప్రధానులని చెప్పవచ్చు. ఆయన చలనచిత్రాల్లో అగ్రశ్రేణి నటీనటులు నటించినా, సంగీత సారధులు పనిచేసినా, గాయనీ గాయకులు పాడినా, రచయతలు మాటలు పాటలు వ్రాసినా వారి ప్రతిభ ప్రతిబింబించి ప్రేక్షకునికి అందేది దుమ్ము, ధూళి లేని శుభ్రమైన, శుద్ధమైన విశ్వనాధ్ దర్శకత్వ అద్దంలోనే! అందుకే ఆయన చిత్రం చూస్తున్న రెండున్నర గంటల సేపు అందులోని కథ, మాట పాటలకు, నటనకు ప్రశంసలు పొందుతూ ప్రేక్షకుడికి కనపడేది ఆయనే! తన చిత్రంలో పనిచేసే సీనియర్, జూనియర్ ఆర్టిస్టుల ప్రతిభను వంద శాతం పిండి ప్రేక్షకుడికి అందించగల సమర్ధుడు విశ్వనాధ్.
విశ్వనాధ్ చిత్రాలు చాలా వరకు సంగీత, నాట్యకళ ప్రధానంగా ఉంటాయి. కళాత్మక విలువలు కలిగి బలమైన కథతో ప్రతీసన్నివేశం ప్రేక్షక హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. అనవసరమైన పాత్రగాని, సన్నివేశం గానీ ఉండవు. నటులకోసం పాత్రల ఎన్నిక జరుగుతున్న ఈ రోజుల్లో, ఆయన పాత్రల కోసం నటులను ఎన్నిక చేస్తారు. సాధారణంగా ఆయన చిత్రాల కథల్లో ఇతివృత్తం ఒక సంగీత, నాట్య కళాకారుడు, ఒక సామాన్యుడు, ఒక అమాయకుడు, ఒక అంగవైకల్యం ఉన్నవాడు లేదా ఒక అట్టడుగు మనిషి చుట్టూ తిరుగుతూంటుంది. మట్టిలో మాణిక్యాల్ని, వజ్రాల్ని గుర్తించ గల గొప్ప జియాలిజిస్ట్ విశ్వనాధ్. మధ్య తరగతి జీవితాలు వాటిలోని అమాయకత్వం, నిజాయతి, సంతృప్తి, సమస్యలు, మనస్తత్వం ఆయన కథల్లో చక్కగా ప్రతిబింబిస్తాయి. మన సంస్కృతీ, సంప్రదాయాలకు ఆయన ఇచ్చే విలువ అందరకు తెలిసున్నదే! ఆయన చిత్రాల్లో ఆడంబరం, హడావుడి, ఖరీదైన పెద్ద సెట్టింగులు కనపడవు. ప్రకృతి సహజ దృశ్యాలు సాధారణంగా చూస్తాం. ప్రతీ దృశ్యమూ ఆహ్లాదకరంగా ఉంటుంది. పాత్రల సంభాషణలు, మాటలు అర్ధవంతంగా చక్కటి భాషతో స్పష్టముగా ఉంటాయి. చలన చిత్రాల్లో పాటల ప్రాధాన్యత వేరే చెప్ప నవసరము లేదు. కథలో పాత్రల స్వభావం, శృంగారం, విరహం, సంతోషం, విచారం, భక్తి తెలపడానికి విశ్వనాధ్ పాటలకు వాటి చిత్రీకరణకు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. పాటలకు లొకేషనుల ఎన్నిక సందర్భోచితంగా, అందంగా ప్రకృతి సహజమైనవి, పురాతన చారిత్రిక ప్రదేశాలు ఎన్నుకోబడతాయి. ఆహా! అనిపిస్తాయి. పాటలోని ప్రతీ మాటకు అర్థముంటుంది. సంగీతం శ్రావ్యంగా ఉంటుంది. బొబ్బలు, కేకలు, అరుపులుండవు. సమపాళ్ళల్లో మేళవించిన సంగీత సాహిత్యాలు ప్రేక్షకుని హృదయాన్ని కదలించి అతని జ్ఞాపకాల్లో కదలాడుతుంటాయి. ప్రతీ పాట హిట్టయి ప్రజాదరణ పొందినదే! విశ్వనాధ్ చిత్రాల్లో చిన్న చిన్న సన్నివేశాలు, సాధారణ సంఘటనలు, అంశాలు కూడా ప్రేక్షుకుని మనస్సు కరిగిస్తాయి, అమోఘమనిపిస్తాయ, కన్నీరు పెట్టిస్తాయి, నవ్విస్తాయి. లోతైన అర్ధాలుతో మరవలేనివిగా మిగిలిపోతాయి . హీరో, హీరోయిన్లను ఎంత అందంగా చూపాలో ఆయనకు బాగా తెలుసు . తెలుగు అమ్మాయిలోని అందం, సహజత్వం , సాంప్రదాయం అద్బుతంగా చూపిస్తారు. విశ్వనాద్ హిరోయిన్కి ప్రత్యేక ముద్ర ఉంది .
ఒకప్పుడు తన సంగీత విద్వత్తుతో వైభవంగా వెలిగి కాలప్రవాహంలో ఆ వైభవాన్ని కోల్పోయి కాలం గడుపుతున్న ఒక బ్రాహ్మణ సంగీత విద్వాంసుడు శంకరశాస్త్రి [జె.వి.సోమయాజులు] ఉదయాన్నే లేచి చేత్తో చెంబు పట్టుకుని ఒక రోజు నదికి వెళ్ళి స్నానం చేసి తన తడి పంచెను నది ఒడ్డున ఆరేసుకుంటాడు. కొద్ది దూరంలో ఆనది ఒడ్డునే ఉంటున్న ఒక దేవదాసీ కుటుంబస్త్రీ తులసి [మంజు భార్గవి] తన సంగీత గురువు శంకరశాస్త్రిని, అయన ఆరేసుకున్న చిరిగిన పంచెని చూసి బాధగా నిట్టూరుస్తుంది. ఆ నిట్టూర్పు వెనుక , తరువాత ఉన్న కథను ప్రపంచ ప్రసిద్ది గావించి ఒక చరిత్ర సృష్టించిన గొప్ప సినీ దర్శకుడు' శంకరాభరణం ' విశ్వనాధ్'. ఒక దేవదాసీ కుటుంబ స్త్రీకి తన సంగీత గురువు యందున్న ఆరాధనను అత్యున్నత స్థాయిలో చూపించిన విధానం అద్భుతపరచి అన్నితరగతుల ప్రేక్షకుల మన్ననలు పొందిఆయనకు మంచి పేరు ప్రతిష్టలుతెచ్చిపెట్టింది శంకరాభరణంచిత్రం . ఈ చిత్రం కొన్నిచోట్ల దాదాపు సంవత్సరం పాటు ప్రదర్శింప బడిన విషయం చాలామందికి తెలుసున్నదే! శంకరాభరణం చిత్రం విశ్వనాధుకి ఘనంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టినా నిజానికి ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతీ చిత్రం ఒక శంకరాభరణమే! అనిపిస్తుంది. ఈ చిత్రానికి ముందు విశ్వనాధ్ కొన్ని చిత్రాలకి దర్శకత్వం చేసినా ఆయన గురించి పది మాటలు చెప్పాలన్నా, వ్రాయాలన్నా శంకరాభరణం చిత్రంతో మొదలు పెట్టడం పరిపాటైంది.
'సప్తపది' చిత్రం కులాంతర వివాహముల గురించిన ఒక సామాజిక అభ్యుదయభావ కథతో చిత్రీకరించబడింది. ఆరోజుల్లో ఈ అభ్యుదయ భావాన్ని సమర్ధించ లేక పోవచ్చు, జీర్ణించుకో లేక పోవచ్చు. కానీ తను చెప్పాలనుకున్నది, చూపాలనుకున్నది నిర్భయంగా, స్పష్టంగా చెప్పడం, చూపడం ఈదర్శకుని లక్షణం. సప్తపది పెళ్ళి తంతులో ఒక అంశం. పెళ్ళిలో వధూవరులు కలిసి అగ్ని చుట్టూ ఏడుసార్లు తిరిగి భార్యాభర్తలవు తారు. ఒక స్త్రీ , పురుషుడు మధ్య సహజంగా పుట్టిన ప్రేమ, ,కలసిన మనస్సులతో జంటగా నడవడమే సప్తపదని; ఆజంటను కుల గోత్రాలు పేరుతో విడతీయలేమని కులం కంటే గుణం గొ ప్పదని ఈ చిత్ర సారాంశం . ఈ సందర్భంగా పెళ్ళి మంత్రాల అర్ధాలు, మనువు చెప్పిన విషయాలు, గీతలో కృష్ణ భగవానుడు ఏర్పరచిన నాలుగు వర్ణాలు, వాటి అర్థాలు, శ్రీ శంకరాచార్యులుకి కాశీలో చండాలుని రూపంలోని ఈశ్వరుడు వల్ల కలిగిన జ్ఞానం, వగైరా విషయాలు చర్చించి, తాను చెప్పాలనుకున్న విషయానికి ఎంతో నేర్పుగా ఆధారం చేస్తాడు విశ్వనాధ్. పైన చెప్పినట్లుగా ఒక నిట్టూర్పు వెనుక అద్భుత కథ ఉన్నట్లే, విశ్వనాధ్ పలికించే ఒక పదం లేక వాక్యం వెనుక ఎంతో అర్ధముంటుంది. ఉదాహరణకి ఈ చిత్రంలో తనకిష్టంలేని పెళ్లి చేసుకున్నందుకు సంవత్స రాలుగా కూతరు, అల్లుడులతో సంబంధాలు లేని గుడి అర్చకుడు జె .[ వి.సోమయాజుల] గుడిలో తన మనవరాలు నాట్య ప్రదర్సన చూసి, "అమ్మాయికి దిష్టి తీయండి" అంటాడు. ఈ ఒక్క మాట వెనుక కూతురు, అల్లుడులతొ తిరిగి సంబంధాలకు తన ఆమోదం, మనవరాలి నృత్య కళా ప్రతిభకు తన మెప్పు, సంతోషం, మనవ రాలియందు ఆప్యాయత, సందర్భానికి తగిన మన సంప్రదాయం ఇన్ని గోచరిస్తాయి.
సాగరసంగమం వంటి గొప్ప చిత్రం మరొకటి వస్తుందని ఆశించలేము. ఎవరి సుఖ దుఃఖాలు మనలో కుడా సుఖ దుఃఖాల్నినింపుతాయో వారిని మనం ఇష్ట పడుతున్నట్లుగా,ప్రేమిస్తున్నట్లుగా భావించాలి . ఇదేస్వచ్చమైన ప్రేమగా చెప్పాలి . ఇట్టి ప్రేమ స్త్రీ పురుష ప్రేమికులమధ్య కుడా సాధ్యమే . ఈవిషయాన్ని ఈ చిత్రమ్ లో గమనిస్తాము . బాలు(కమలహాసన్) మాధవిల(జయప్రద) మధ్య బంధాన్ని పవిత్రంగా, ఆత్మీయంగా, చూపిన రీతిలో విశ్వనాధ్ దర్శకత్వ వైభవాన్ని దర్శించ గలుగుతాం. మనుష్యుల మధ్య ఆత్మీయ బంధాలని చూపడానికి మన సంప్రదాయాలను, సెంటిమెంట్సుని విశ్వనాధ్ ఆధారం చేసుకుంటాడు. తనకున్న నృత్య కళలో ఎదగడానికి సాయంచేసిన, తను మనసుపడి, ఇష్ట పడిన మాధవి వివాహిత అని తెలిసినా ఆమె క్షేమాన్ని, సౌభాగ్యాన్ని కోరుకుంటాడు బాలు. కనీసం వర్షంలో కూడా ఆమె నుదుటి కుంకుమ బొట్టు చెరగకూడదని కోరుకుంటాడు బాలు. కొంత కాలం తర్వాత ఆమెను కలసి చూసిన ఉత్సాహంలో ఆమె కోరినట్లు బాలు తన త్రాగుడు వ్యసనాన్ని మానేస్తాడు. తన జబ్బు తీవ్రత తగ్గి సంతోషంగా ఉంటాడు. కానీ మాధవి విధవ అని తెలిసాక బాలుకి కలిగిన బాధతో బాలు జబ్బు తిరగ పడుతుంది. మాధవి కూతురు శైలజకి నృత్యంలో శిక్షణ ఇస్తాడు. చివరిగా ఆమె నృత్య ప్రదర్సన చూస్తూ ప్రాణం విడుస్తాడు . ఈ చిత్రంలో నాయకా నాయికల మధ్యే గాక తల్లీకొడుకుల మధ్య, ఇద్దరి స్నేహితుల [కమల్, శరత్ బాబు పాత్రలు] మధ్య ఉండే ఉన్నతమైన బంధాల్ని కూడా చూడగలుగుతాం.
సిరివె న్నెల' చిత్రం విశ్వనాధ్ మరో గొప్ప సృష్టి. ఇటువంటి చిత్ర సృష్టి ఆయనకే సాధ్యం. ఈ చిత్ర కథ ప్రధానంగా ఫ్లూట్ వాయించే ఒక అంధుడు హరిప్రసాద్ [సర్వదమనుబెనర్జీ], పైంటింగు, బొమ్మలు గీసే ఒక మూగమ్మాయి [సుహాసిని], జ్యోతిర్మయి [మూన్మూన్ సేన్] ముగ్గురి మధ్య తిరుగుతుంది. టూరిస్టులు దగ్గర ఫ్లూట్ వాయించుకుంటూ బ్రతికే హరిప్రసాదును జ్యోతర్మయి అనే టూరిస్టు ఎంతగానో ప్రోత్సహిస్తుంది. హరిప్రసాద్ క్లాసికల్ మ్యూజిక్ లో ఉన్నత ప్రమాణాలు సాధించడానికి సాయంచేస్తుంది. గ్రుడ్దివాడైన హరిప్రసాద్ కు తను చూడలేని ప్రకృతి, స్త్రీ, వెన్నెల గురుంచి అర్థమయేడట్లుగా, మనస్సులో అతను వాటిని భావించకలిగేడట్లుగా జ్యోతిర్మయి తన కదలికలు, స్పర్శ ద్వారా చెప్పకలుగుతుంది. హరిప్రసాద్ జ్యోతిర్మయి ఆరాధనలో పడతాడు. జ్యోతిర్మయి విదేశాలకి వెళ్ళిపోతుంది. ఆతర్వాత హరిప్రసాద్ దేశంలొ గొప్ప ఫ్లూట్ విద్వాంసుడుగా ఎదుగుతాడు. తన ఆల్బమ్సు అన్నింటిని జ్యోతిర్మయికి అంకితం చేస్తాడు. కొంత కాలానికి జ్యొతిర్మయి విదేశాల నుంచి తిరిగి వస్తుంది. హరిప్రసాద్ ఎదుగుదలని చూసి సంతోషిస్తుంది. ఆల్బమ్సులోని రాగాలని, శృతుల్ని తనకు అంకితంచేయడం, తన మీద అతనికున్న ఆరాధన భావనకి ఆశ్చర్య పోతుంది.సుహాసిని ద్వారా అతను తనను ప్రేమిస్తున్నట్లు, పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుసుకుంటుంది జ్యోతిర్మయి. కాని అపవిత్రంగా జీవిస్తున్న తను హరిప్రసాద్ కి తగనని భావిస్తుంది. ఇక్కడ జ్యోతిర్మయి జీవించే పద్దతి [లైఫు స్టైల్] చూపిస్తూ; విశ్వనాధ్ ఆపాత్రని స్విమ్మింగు డ్రస్సులో చూపిస్తాడు. అమె చేత మందు తాగిస్తాడు. సిగరట్టు కాల్పిస్తాడు. రాత్రి వేళ ఆమె, విటుడు పడక గదిలో ఉండగా బ్రా విప్పిస్తాడు. లైటార్పిస్తాడు. ఈ శృంగార దృశ్యాలేవీ ప్రేక్షకుడుకి అసభ్యంగా అనిపించవు. ఎబ్బెట్టుగా ఉండవు. ఆకర్షించవు. పైగా పాత్ర మీద ఎంతో జాలి, సానుభూతి కలుగుతాయి. కళ్ళుచెమ్మగిల్లుతాయి.అదీ ! విశ్వనాద్ సినిమాల్లో శృంగారం చూపించే పద్ధతి . పురాణ కథలో అనసూయ శక్తిని తెలుసుకోడానికి త్రిమూర్తులు ఆమె ఇంటికెళ్ళి తమకు నగ్నంగా ఆతిధ్యము యిమ్మని అడుగుతారు . అనసూయ వారిని మంత్రించి పసిపిల్లలను చేసి తన స్తన్యం తో పాలిస్తుంది. విశ్వనాద్ కూడా శృంగార దృశ్యాలలో ప్రేక్షకులిని పసిపిల్లలు చేస్తాడు. ఇటువంటి సందర్భల్లో విశ్వనాధ్ దర్శకత్వ విలువలు స్పష్టమవుతాయి. చివరికి జ్యోతిర్మయి ఒక డాక్టరుతో తన పెళ్ళికి ఏర్పాట్లు చేయించి పెళ్ళిరోజున ఆత్మ హత్య చేసుకుంటుంది. తన కళ్ళను డొనేట్ చేసి హరిప్రసాద్ కి ఆ డాక్టరు చేత కళ్ళచూపు తెప్పించాలని తన కోరికగా ఉత్తరం వ్రాసి పెడుతుంది. ఎవరూ చెప్పక పోయినా జ్యోతిర్మయి మరణించినట్లు హరిప్రసాద్ కి తెలియడం అతను అంత్యక్రియలకు వెళ్ళడం ఒక హైలైట్. ఈచిత్రంలో గ్రుడ్డివాడైన హరిప్రసాద్, మూగదైన సుహాసినిల మధ్య భావ ప్రకటన జరగడం, సంగీతం దానికి సాధనకావడం మరొక హైలైట్. చక్కటి సాహిత్యంతో ఈ చిత్రానికి పాటలు వ్రాసిన సీతారామ శాస్త్రిగారు సిరివెన్నెలగా మారినారు.
విశ్వనాధ్ ప్రతీ చిత్రంలోనూ పేరుకి తగ్గట్టుగా కథా గమనం, సన్నివేశ చిత్రీకరణ మనలను ముగ్ధులను చేస్తాయి. పూర్తి న్యాయం చేస్తాయి. మనస్సులో బలమైన ముద్రలు వేస్తాయి. స్వాతి ముత్యం చిత్రంలో హీరో శివయ్య (కమల హాసన్) పాత్ర ఒక అమాయక పాత్ర. స్వాతి ముత్యానికి దుమ్ము, ధూళి, మలినం అంటనట్టే శివయ్య మనస్సుకు, బుద్ధికి మర్మం, కల్మషం, ద్వేషం ఏమీ ఉండవు. తనకున్న ఒకే పెద్ద దిక్కు బామ్మ మంచిదని చెప్పింది చేయడమే అతనికి తెలుసు. ఒకవిధంగా అతనిది కర్మ యోగి పాత్ర . తాను ఏదీకోరుకోడు . ఈ పాత్రలో మంచితనం , ప్రేమ, బాధ్యతా , ధైర్యం ఉంటాయి. శివయ్య పాత్రస్వభావాన్ని మంచి సన్నివేశాలతో విశ్వనాధ్ అద్భుతంగా చూపిస్తాడు. శివయ్య చేత మహ్మదీయుని శవం మోయించడం, గుళ్ళో సీతా రామ కళ్యాణం రోజున అమ్మవారికి కట్టవలసిన మంగళ సూత్రాన్ని పూజారి పళ్ళెంలోంచి లాక్కుని విధవైన లలిత(రాధిక ) మెడలో కట్టించడం, లలితకి మంచి జరగడంకోసం పీర్ల పండగ రోజున నిప్పుల్లోనడవడం, గొల్లపూడి మారుతీరావు పాత్రకి బుద్ధి చెప్పడం , ఉద్యోగం కోసం శివయ్య పట్టుదల లాంటి సన్నివేశ చిత్రీకరణ, సంధర్భ ఎన్నిక ఒక విశ్వనాధ్ కే సాధ్యం. తనంటే ఎంతో ఇష్టమైన బామ్మ చనిపోయిన సమయంలో "ఆకలేస్తోంది అన్నంపెట్టు" అని శివయ్య చేత అమాయకంగా అడిగిస్తాడు. లలిత కూడా శివయ్య అమాయకత్వాన్ని, అతనికి తనమీదున్న ప్రేమను గుర్తించి అతన్ని ఒక ప్రయోజకుడుగా చేసి తన జీవితాన్ని పంచుతుంది. ఈ చిత్రం ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయింది. కమలహాసన్ ఎన్ని చిత్రాల్లో నటించినా అతడు మాత్రం ప్రేక్షకుడుకి కనపడడు. అతని పాత్రలు మాత్రమే కనపడుతాయి.పాత్ర అతని వశమయినట్లుగా ఎవరి వశము కాదు .
విశ్వనాధ్ మరొక చిత్రం' స్వయంకృషి' ఒక గొప్ప సామాజిక సందేశ చిత్రం. కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి వుంటే పురుషులు మహారుషులవుతారు' వంటి సూక్తులాధరంగా, స్వధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని చిత్త శుద్దితో ఆచరించిన వాడు పండితుడైనా పామరుడైనా పరిపూర్ణుడే! అను శాస్త్ర వచనాన్ని అనుసరించి తీసిన చిత్ర మిదని భావించవచ్చు ఇది. అందుకే కాబోలు ఈ చిత్రకథలో విశ్వనాధ్ చెప్పులు కుట్టుకునే వృత్తిగల సాంబయ్యను (చిరంజీవి) హీరోగా చేసాడు. సాంబయ్య తన వృత్తియందు గౌరవం, నేర్పు కలిగి ఆత్మ న్యూనతా భావం లేకుండా కష్టపడి, స్వయంకృషితో చెప్పులుకుట్టి పోలిష్ చేసుకుని బ్రతికే స్థితి నుంచి ఒక ఫ్యాక్టరీ యజమానిగా తనే కొందరికి ఉద్యోగాలిచ్చి పోషించే స్థితికెదుగుతాడు. సంపన్నుడవుతాడు. ఎంతెదిగినా ఒదిగే ఉంటాడు. కృషి, చిత్త శుద్ధి వుంటే మనిషి ఆర్ధికంగా ఎదగడానికి పరిణితి చెందడానికి కులం, వృత్తులు అడ్డురావని ఈచిత్రం ద్వారా సందేశం అందుతుంది ప్రేక్షకుడుకి. చనిపోయిన తన చెల్లెలు కొడుకు చిన్నను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చెస్తాడుసాంబయ్య . చిన్నతో తనుకున్న బంధం, బాధ్యతవల్ల తనకు పిల్లలు పుట్టకుండగా ఆపరేషన్ చేయించుకుని తనకోసం త్యాగం చేసిన గంగను(విజయ శాంతి) పెళ్ళాడుతాడు. అనాధైన శారదకి [సుమలత] చదువు చెప్పించి భాస్కరుతో [సర్వదమనుబెనర్జి] పెళ్ళి జరిపిస్తాడు. స్వధర్మాన్ని పాటిస్తాడు. సాంబయ్యకి గంగ ఎంతో సహకరింస్తుంది. వ్యసనాలికి గురైన చిన్న తండ్రి [చరణ్ రాజ్] సాంబయ్య నుంచి డబ్బు దోచడానికి ఆపిల్లవాడిని దురలవాట్లుకి గురిచేయడానికి కూడా వెనుకాడడు. తండ్రి బారి నుంచి చిన్నను తప్పించి కష్టపడడం తన వృత్తిని, మూలాలను గుర్తించేలా బుద్ధి చెప్తారు సాంబయ్య, గంగలు. శారద భర్తను కూడా తన తప్పుడు ప్రవర్తన, ఆలోచనలునించి తప్పించి సరి చేస్తారు.
చిరంజీవి హీరోగా విశ్వనాధ్ దర్శకుడుగా వచ్చిన మరో చిత్రం 'ఆపద్భాంధవుడు'. ఆపదలో ఉన్న వాడిని ఆదుకునేవాడు ఆపద్బాంధవుడు. ఇది దేవుడు పేరు కూడాను. అందుకే కాబోలు ఆపేరుకి తగ్గ సన్నివేశాలుంటాయి ఇందులో. పాల వ్యాపారి హీరో మాధవ [చిరంజీవి] పోషకాహారమైన పాలను రోజూ స్కూలు పిల్లలకు ఉచితంగా పోయడం దేవుడి లక్షణమైన పోషణకు ప్రతీకనిపిస్తుంది. చిన్నతనంలో అనాథైన తనను చేరతీసి, పనిచెప్పి ఆదుకున్న మేస్టారుకి [జంధ్యాల] తన ఆవులను అమ్మి ఆయన పిల్ల పెళ్ళికి డబ్బు సాయం చేసి, ఆయన వ్రాసిన కావ్యాన్ని అచ్చు వేయించి కృతజ్ఞత చూపిస్తాడు మాధవ. బదులుగా తన కావ్యాన్ని మేస్టారు మాధవకు అంకితమిచ్చి కన్ను మూస్తాడు. ఈసన్నివేశం మరొక విశేషం. ఆపదలో ఉన్నవారిని దేవుడు అవతారాలెత్తి రక్షించిన కథలు మనకు తెలుసు. మేస్టారి కూతురు హేమ [మీనాక్షిశేషాద్రి] తన అక్క ఇంటికెళ్ళినప్పుడు ఆమె బావ తన మీద చేసిన అకృత్యానికి, అక్క మరణానికి మెంటల్ షాకుకి గురయి మెంటల్ హాస్పిటల్లో జేరుతుంది. ఆవిషయం తెలిసిన మాధవ తనొక పిచ్చివాని అవతారమెత్తి తను కూడా అదే హాస్పిటల్లొ జేరి హేమను రక్షిస్తాడు. మామూలు స్థితికి తెస్తాడు ఆమెను. అందుకే మాధవ ఆపద్భాంధవుడయ్యాడు. ముగింపులో శరత్ బాబు పాత్ర ద్వారా హేమ, మాధవ పెళ్ళి చేసుకుని ఒకటవుతారు. సూక్తులను, పురాణ పేర్లను మానవ ప్రవృత్తితో, జీవిత సంఘటనలతో సమన్వయ పరచి కథలో చేర్చి అద్భుతంగా దర్శింప చేయగల సత్తా ఉన్న దర్శకుడు విశ్వనాధ్.
'స్వాతికిరణం' చిత్రం లో కూడా మనకి ముఖ్యమైన సందేశ దొరుకుతుంది. ఒక కళాకారుడు, పండితుడు లేదా మరెవ్వరైనా తన సాధనతో, నైపుణ్యంతో, పాండిత్యంతో ప్రసిద్దుడై సాటివాళ్ళని గెలిచి పేరు ప్రఖ్యాతులు పొందవచ్చు. కానీ అరిషడ్వర్గాలను గెలవకపోతే తను పతనమై ఇతరులను కూడా పతనం చేస్తాడని ఈ చిత్రకథ సారాంశం. అనంతశర్మ [మమ్మూట్టి పాత్ర] తన కర్ణాటక సంగీత పాండిత్యంతో సంగీత సామ్రాట్ అయ్యాడు . ఆయనలో అహం పెరింగింది. బిరుదును తనతో పాటు మరికొంత మందికిచ్చి నందువల్ల నిరాకరిస్తాడు. ఆబిరుదుకి ఆయనొక్కడే అర్హుడని భావిస్తాడు. అదే ఊరులో గంగాధరం [మాస్టర్ మంజునాథ్] పదిహేనేళ్ళ వయస్సు పిల్లవాడు అనంత శర్మ సన్మాన సభలో అద్భుతంగా గానం చేసి అందరి మన్ననలను పొందుతాడు. ఇతర చోట్ల కూడా పాడి పేరు పొందుతాడు. శర్మ లో అహంతో పాటు అసూయ మొదలైంది. గంగాధరం తనను మించి పోకుండగా తన దగ్గరుంచుకుని దురుద్దేశ్యంతో అతను పాడిన ప్రతీ రాగాన్ని, కీర్తలను తిరస్కరిస్తూ నిరుత్సాహ పరుస్తాడు. ఒకసారి తను బాగుండలేదని నిరాకరించిన గంగాధరం పాడిన రాగాన్ని అనంతశర్మ ఒక సభలో పాడి గంగాధరానికి దొంగలా దొరికి పోతాడు. ఈ అపరాధభావాన్ని, అవమానాన్ని భరించలేక పోతాడు అనంతశర్మ. ఇంటికొచ్చి తీవ్రమైన ఆవేశానికిలోనై గుండె నొప్పితో గంగాధరాన్ని కొడతాడు. గంగాధరం సామాన్యుడు కాదని తనను అణగత్రొక్కడానికి పుట్టిన అపర త్యాగయ్యని, అన్నమయ్యని అతని ఉనికిని భరించ లేనని, అతను ఉంటే తను బ్రతికలేనని భార్యతో (రాధిక ) అంటూ తన అహంకార, అసూయలను బయట పెడతాడు అనంత శర్మ. శర్మ అంతరంగాన్ని అర్థంచేసుకున్న గంగాధరం తనకు తల్లితో సమానమైన ఆయన భార్య పసుపు కుంకుమల్ని రక్షించడానికి ఆత్మహత్య చేసుకుంటాడు. అనంత శర్మ అహంకార, అసూయాగ్నిలో బాలుడైన గంగాధరం కాలి బూడిదైన సన్నివేశాలన్నీ ప్రేక్షకుడుని కలచి వేస్తాయి. ఈసన్నివేశాల చిత్రీకరణలో శ్రీవిశ్వనాధ్ తన విశ్వరూపాన్ని చూపించారనుటలో అతిశయోక్తి లేదు. తను చేసిన తప్పునుంచి ప్రజల కోపానికి భయపడి ఏకాంతంలోకి వెళ్లిపోతాడు అనంతశర్మ. కొంత కాలానికి బయటపడి, ముగింపులో గంగాధరం పేరున శర్మ భార్య పెట్టిన సంగీత పాఠశాలలో చిన్నపిల్లలతో కూర్చుని పాటలో వరస కలుపుతాడు ఒకనాటి గొప్ప సంగీత విద్వాంసుడైన అనంత శర్మ.
శుభోదయం లో సోమరితనం లేని మనిషికి ప్రతీ ఉదయం ఒక శుభోదయమే! అని, శుభలేఖలో వరకట్నపు దురాశలు గురించి, సూత్రధారులులో గ్రామాల్లో కక్షలు, వైరాలు, తగువులకు మూలాలు గురుంచి సామాజికపరమైన సందేశాలు ప్రేక్షకులకు అందుతాయి. ఎవరైనా తనలో ఉన్న కళ, విద్యలను కమలంలా వికసింప చేసుకుని వాటిని సార్ధకం చేసుకోవాలని లేకపోతే అందమైన స్వర్ణ కమలంలా జడంగా ఉండిపోతారని స్వర్ణ కమలంచిత్రంలో అర్ధమవుతుంది. వెంకటేష్, భానుప్రియ పాత్రలతో ఈచిత్రాన్ని ఎంతో బాగా చూపిస్తారు విశ్వనాధ్. అల్లాగే సిరిసిరిమువ్వ, శుభసంకల్పం, శృతిలయలు, స్వరాభిషేకం వంటి విశ్వనాధ్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతో అలరిస్తాయి. పరిమితమైన ఈవ్యాస నిడివితో అన్ని చిత్రాల విష్లేషణ అసాధ్యం.
నిజమైన కళాకారుడుకి నవరసాలు తెలియాలంటారు. అట్టి నవరసాల్లో హాస్యరసం ఒకటి . హాస్యం పేరిట ఈనాటి చాలా చిత్రాల్లో వెర్రితలలు వెకిలితనం చూస్తున్నాం. కానీ విశ్వనాధ్ చిత్రాల్లో హాస్యం సున్నితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఉదాహరణకి శంకరాభరణంలో శంకర శాస్త్రి స్నేహితుడుగా, వకీలుగా అల్లు రామలింగయ్య పాత్ర, సంగీత పాఠాలు చెప్పే కొంపెల్ల పాత్ర, సాగర సంగమంలో కుర్ర ఫొటోగ్రాఫరు ఫొటోలు తీసే సన్నివేశం, పొట్టిప్రసాద్ పాత్ర, స్వాతిముత్యంలో కమలహాసన్ ఉద్యోగ ప్రయత్నం, శుభలేఖలో రాళ్ళపల్లి, సత్యనారాయణ, సుధాకర్ పాత్రలు, శృతిలయలులో నరెష్, మిశ్రో, పొట్టిప్రసాదుల పాత్రలు వంటివి గుర్తుకి రాక మానవు.
విశ్వనాధ్ సినీమా చూసి హాలునుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడికి ఒక క్షేత్రాన్ని దర్శించినట్లు, ఒక దేవాలయం చూసినట్లు, లేదా ఒక ప్రవచనం విన్నట్లు పవిత్ర భావం కలుగక మానదు. వినోదం, విజ్ఞానం అందించవలసిన సినీమాలు నేడు కేవలం వ్యాపార దృష్టితో నిర్మించబడి మతులను పోగొట్టుతున్న అనేక వాటిని చూస్తున్న ప్రేక్షకులకు విశ్వనాధ్ చిత్రాలు మండు వేసవిలో అపుడపుడు కురిసే చల్లని చిరుజల్లులా, లేత కొబ్బరి నీరులా ప్రేక్షకుడికి సేదతీరుస్తాయి, హాయినిస్తాయి అనడం అతిశయోక్తి కాదు.
No comments:
Post a Comment