మహనీయుల స్వేఛ్చా దృక్పధాలు - అచ్చంగా తెలుగు

మహనీయుల స్వేఛ్చా దృక్పధాలు

Share This

మహనీయుల స్వేఛ్చా దృక్పధాలు

- భావరాజు పద్మిని  


స్వేచ్ఛ అనేది మనసు ఆస్వాదించే ఒక అనుభూతి. ఒక వ్యక్తి తనకు నచ్చినట్లుగా ఆలోచించే, మాట్లాడే, జీవించే హక్కునే  స్వేచ్ఛ అంటారు. ఇది ఒకరిస్తే వచ్చేది కాదు, ప్రతీ ప్రాణికి జన్మతః సంప్రాప్తించేది, పరిమితులు లేనిది. చేసే పనిలో, ఆలోచనా విధానంలో ,భావవ్యక్తీకరణలో ,జీవించే తీరులో, స్వేచ్ఛ ఉన్నప్పుడే ఆ వ్యక్తీ జీవితంలో సంతృప్తి ఉంటుంది. అయితే మనిషి సంఘజీవి కనుక, తాను ఉంటున్న దేశం కోసం, సంఘం కోసం, మత పరమయిన కట్టుబాట్ల కోసం, గౌరవమర్యాదల కోసం తన  స్వేచ్ఛ విషయంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోక తప్పదు. సంఘ జీవనం - వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో మనం చేసుకునే సడలింపుల గురించి, కట్టుబాట్ల మధ్య స్వేచ్చగా  జీవించే విధానం గురించి,  మహనీయుల దృక్పధాలు తెలుసుకుందాం.
స్వేచ్ఛ మనిషి గాలి పీల్చినంత సులభంగా అనుభవించగలగాలి. "....అబ్రహాం లింకన్ .
మనం ఊపిరి పీల్చుకోవడానికి ఎవరి అనుమతి తీసుకుంటాం? అంతే అలవోకగా, సహజంగా, స్వేచ్ఛను  అనుభవించాలని, ఈ మహనీయుని ఉద్దేశం. ఎవరయినా బలవంత పెడితే, ఊపిరి తీసుకోవడం ఆపేస్తామా? అది సాధ్యం కాదు అని ఖచ్చితంగా చెప్తాము కదా!  అలాగే ఎటువంటి వత్తిడులకీ లొంగక, అందరిలోనూ ఒక్కరిగా ఉంటూనే, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి రాజీ పడని జీవితం గడపాలని, లింకన్ ఉద్దేశం.
" మన స్వభావమే  స్వేచ్ఛగా ఉండటం. మనకి మరో పేరే స్వేచ్చ. మనకి స్వేచ్ఛ కావాలి అని అడగడం చాలా నవ్వుగా ఉంది. ఎలా అంటే, ఒక మనిషి చెట్టు నీడ లోంచి, తనకు తానే వెళ్ళిపోయి, బయట ఎండకు తట్టుకోలేక, మళ్ళీ ఎంతో  కష్టపడి తిరిగి నీడలోకి వచ్చి, ' ఆహా! యెంత చల్లగా ఉందీ చెట్టు నీడ!' అని అనుకున్నాడట . మన అందరం చేస్తున్నది ఇదే...." --- భగవాన్ రమణ మహర్షి .
పసిపాపడిగా ఉన్నప్పటి మన స్థితి -- స్వచ్చమయిన స్వేఛ్చాయుతమయిన స్థితి. శిశువు ఆకలేస్తే తింటుంది, నిద్ర వస్తే పడుకుంటుంది, ఆనందంగా ఉన్నప్పుడు నవ్వుతుంది, బాధ కలిగితే ఏడుస్తుంది. తనకు ఏ సమయంలో, ఏది అనిపిస్తే అదే చేస్తుంది. అంటే,  స్వేచ్ఛగా బ్రతకడం ప్రతి ఒక్కరికీ తెలుసన్నమాట !రాను రాను ఎదుగుదలతో పాటు, పరిణితి అనే ముసుగు తొడుక్కుని, అందరికోసం ఎన్నో ఆంక్షలు విధించుకుంటూ, చివరకు తనకు సహజ సిద్ధంగా ప్రాప్తించిన స్వేచ్చను  కోల్పోతుంది. కొన్నాళ్ళకు తనకు నచ్చినట్లుగా జీవించలేకపోతున్నానన్న అసంతృప్తి, అనవసర బంధాలు తెంచుకోవాలన్న సంకల్పంతో, స్వేఛ్చ కోసం పరితపిస్తుంది. దీనినే, చెట్టు నీడలోంచి ఎండలోకి వెళ్లి, ఎండకు తట్టుకోలేక, తిరిగి నీడకై తపించడం ,అంటూ చమత్కరించారు భగవాన్ రమణులు.
“  స్వేచ్ఛ అంటే బాధ్యత. అందుకే చాలా మంది భయపడతారు.” -- బెర్నార్డ్ షా.
బాధ్యత తీసుకుని, తమ జీవిత నిర్ణయాలను తామే తీసుకునే ప్రతీ ఒక్కరూ ‘అనవసరమయిన సామాజిక ఆంక్షల ‘ నుంచీ విముక్తి కోరుకుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని, ఒక్కోసారి ఒక్కొక్కరి కోసం మన జీవిత గమనాన్ని మార్చుకుంటూ పొతే, చివరికి మనకంటూ అస్తిత్వమే లేకుండా పోతుంది. అందుకే, ఎవరికోసమో కాక, నాకు ఆనందం ఇస్తుంది కాబట్టి పని చేస్తాను...అంటూ నచ్చినది చెయ్యడమే స్వేచ్ఛ.
స్త్రీ స్వాతంత్ర్యమర్హతి “....వైవస్వత మనువు.
అంటే, స్త్రీలకు  స్వేచ్ఛగా బ్రతికే అర్హత లేదు. వైవస్వత మనువు ప్రకారం స్త్రీలు అమాయకులు, చంచల స్వభావులు, బలహీనులు కనుక చిన్నతనంలో తండ్రి సంరక్షణలోను, పెళ్ళయ్యాకా భర్త సంరక్షణలోనూ, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలోనూ ఉండాలి . అయితే, ఇదే నియమాన్ని చెప్పిన ఈయన ‘ఎక్కడ స్త్రీలు ఆనందంగా ఉంటారో, అక్కడ దేవతలు తిరుగాడుతుంటారు ‘ అంటూ, స్త్రీలను గౌరవిస్తూ, ఆనందంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఇదే సూత్రాన్ని మునుపటి తరాల్లో పాటిస్తూ , స్త్రీలను పెళ్ళికి, పిల్లలను కనడానికి పరిమితం చేసి, వారికి విద్యార్హత లేకుండా చేసారు. ఏ కొద్ది మందో చదువుకున్నా, నిరంతర గృహ నిర్వహణలో అభ్యాసం వాళ్లకు గగన కుసుమమే అయ్యింది.
కాలప్రవాహంలో సంస్కృతీ నియమాలు మారుతూ ఉంటాయి. భిన్న భావాల సంఘర్షణ నుంచే, దిశానిర్దేశం జరిగి, సమాజంలో కొత్త జీవన విధానం పుట్టుకొస్తుంది. బాల్యవివాహం, సతీసహగమనం వంటి కరడుకట్టిన మూఢ ఆచారాల నుంచీ స్త్రీ విముక్తి కోసం ఉద్యమాలు చేసిన ప్రముఖుల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గిడుగు రామ్మూర్తి గారు, గురుజాడ, చలం వంటి వారు చేసిన కృషి ప్రశంసనీయం. స్త్రీ విద్యావంతురాలయితే తప్ప, ఈ కులమత, పురుషాధిక్య అరాచకాల కరాళ నృత్యాన్ని అరికట్టలేదని చెప్తూ, ‘ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది ‘ అంటూ ముందే చెప్పారు గురజాడ. విద్య, ఆర్ధిక, లైంగిక , భావ ,స్వేచ్చతో , తన వ్యక్తిత్వం నిలబెట్టుకునే ‘ఆదర్శ స్త్రీ' ని స్వప్నిస్తాడు చలం. ఎందరో సహృదయుల కృషితో, ఈ క్రమంలో , ఎన్నో అవరోధాలను అధిగమించి, నేటి స్త్రీ -- విద్య, లౌక్యం, ధైర్యం,ప్రేమ ,ఔన్నత్యం, గృహ నిర్వహణ, ఉద్యోగ బాధ్యతలు, అన్నింటా తనకు తానే సాటిగా నిరూపించుకుంటూ పురోగమనం దిశగా సాగిపోతోంది.
స్వేచ్ఛ అంటే నీ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం కాదు. ఇతరుల స్వేచ్ఛను గుర్తించి, దానిని ఇనుమడింపచేసేలా జీవించడం.” ---- నెల్సన్ మండేలా
స్వేచ్ఛకు , విచ్చలవిడితనానికి మధ్య చాలా అంతరం ఉంది. నేటి తరానికి ఇంటా ,బయటా కావలసినంత స్వేచ్ఛ లభిస్తున్నా, దుర్వినియోగం చేసుకునేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడమే స్వేచ్ఛ అనుకుంటున్నారు. అందుబాటులో ఉన్న మొబైల్, ఇంటర్నెట్ చాటింగ్, వంటి వ్యసనాలతో విలువయిన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. అడిగినప్పుడల్లా డబ్బు అందుతుండడంతో యువతలో అహంకారం, ద్వేషం, కోపం, అర్ధం లేని విలాసాల వంటి దుర్గుణాలు కనిపిస్తున్నాయి. వాళ్ళెవరో చెడు చేసారు....మనం చేస్తే తప్పేంటి? అన్న ఆలోచనా విధానం పెరుగుతోంది. చంచలమయిన ఆలోచనలు, ప్రేమకు- ఆకర్షణకు తేడా తెలియని వయసు, చదువుల వత్తిడులు, విలాసాలు, మనస్పర్ధలతో , వత్తిడిని తట్టుకోలేక ఒక్కోసారి ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు.
‘తిండి నీ కోసం తిను, బట్ట ఎదుటివారికోసం కట్టు' అన్నారు. ఈ సూత్రాన్ని విస్మరించిన కొందరు స్త్రీలు, ‘ఏ, మాకు పొట్టి బట్టలు వేసుకునే హక్కు లేదా? మాకు రాత్రి క్లబ్ కు వెళ్ళే , నచ్చిన వాళ్ళతో తిరిగే స్వేచ్ఛ లేదా? మాకు బీరు తాగే స్వాతంత్ర్యం లేదా? మాకెలా కావాలంటే అలా ఉంటాం...ఇందులో తప్పేంటి? అని అడుగుతున్నారు. చదువుల తరువాత వెంటనే ఉద్యోగాల పేరుతో ఆర్ధిక స్వేచ్ఛ, పాశ్చాత్య సంస్కృతీ, చెడు స్నేహితుల ప్రభావం వీరిని అనేక వ్యసనాలకు గురి చేస్తున్నాయి. ఇటువంటి వారి ప్రవర్తనను తల్లితండ్రులు ఎప్పటికప్పుడు గమనించి, వాళ్లకు యువదశలోని ఆకర్షణల గురించి, మన దేశ సంస్కృతిని గురించి, మంచి- చెడుల విచక్షణ గురించి తెలియచేబుతూ , వారి వ్యక్తిత్వాలను తీర్చిదిద్దాలి.
సమాజం బాగుండాలంటే స్త్రీలకూ, పురుషులకూ కూడా కొన్ని కట్టుబాట్లు ఉండాలి. వ్యక్తిగత స్వేచ్ఛ ఒక దేశ ప్రగతికి, అభ్యున్నతికి దోహదపడేలా ఉండాలి. ఒకరి స్వేచ్ఛ వేరొకరికి ఇబ్బందికరంగా మారకూడదు. స్వేచ్ఛకు అర్ధం ఇతరుల స్వేచ్ఛను హరించడం కాదు. మనతో పాటు స్వేచ్ఛను సమానంగా అనుభవించే హక్కు ఇతరులకూ ఉంటుందన్న విషయాన్ని గుర్తించి, వారి భావాలను గౌరవించండి. ఇతరుల వ్యవహారాల్లో అనవసరపు జోక్యం కల్పించుకోవద్దు. ఇతరుల ప్రవర్తన పై  అర్ధంలేని ఆంక్షలు విధించవద్దు .
వ్యక్తిగత స్వేచ్చకోసం పదే పదే పోరాటాలు, వివాదాలు వద్దు. దీని వల్ల ఆనందం అంటూ మిగలకుండా పోతుంది. అలాగని, మన అంతర్వాణి గొంతు అయినవాళ్ళ కోసం నిర్దాక్షిణ్యంగా నోక్కేయ్యవద్దు. మనకు ఇష్టమయిన , మనం నమ్మిన సూత్రాలను మౌనంగా ఆచరిస్తూ, సుఖంగా జీవించడం కోసం ప్రయత్నించాలి. ఎవరి జీవనసరళితో వారు ఊపిరిసలపకుండా ఉన్న ఈ రోజుల్లో , స్త్రీపురుషుల మధ్య సాగే అహాల యాత్రల్ని రూపుమాపి, దాని స్థానంలో ప్రేమను పాదుకోల్పాలి. భావోద్వేగాల బంధనాల నుంచీ బయటపడి ముందు మన మనసులను సంస్కరించుకోవాలి. యాంత్రిక జీవితంతో యంత్రాల్లా బ్రతుకుతున్న మనుషుల మధ్య పరస్పర మానవ సంబంధాలలో, గుండె తడి ఆవిరయ్యేలోపే మనిషితనాన్ని మన మధ్య మిగుల్చుకోవాలి.

No comments:

Post a Comment

Pages