ప్రేమతో నీ ఋషి - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి

Share This

ప్రేమతో నీ ఋషి

యనమండ్ర శ్రీనివాస్


పూర్వభాగం /నాంది

కొన్ని శతాబ్దాల క్రితం... దేవతలకు రాజైన దేవేంద్రుని సభలో...
“విశ్వామిత్రుడా ?” మేనక మరోసారి అడిగింది.
“అవును, విశ్వామిత్రుడే...” బదులిచ్చాడు దేవేంద్రుడు క్లుప్తంగా. దాని భావం, మేనకను ఇక ప్రశ్నించడం మాని, వెంటనే బయలుదేరమని.అతని మాటల్లో అధికార దర్పం ప్రతిబింబిస్తూ, అతని పొడవైన, మహోన్నతమైన ఆకృతితో పోటీపడుతోంది.
మేనక కంగారుపడింది. ఆమె ఆ రోజు తన గ్రహస్థితిని నిందించుకుంది. స్వర్గలోకపు అప్సరసగా ఆమె తన సొగసైన నాట్యంతో, అర్ధవంతమైన నవ్వుతో, మిరుమిట్లు గొలిపే అందంతో, స్వర్గానికే శోభ (వన్నె ) తెచ్చింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాని, నేడు అదే అందం ఆమె పాలిటి శాపంగా మారి, ఆమెను ఎంతో ఆందోళనకు గురిచేసే పనిని బలవంతంగా ఆమె చేసేలా చేస్తోంది.
ఆమె దేవేంద్రుడు తనను చెయ్యమని ఆజ్ఞాపిస్తున్న కొత్త పనిని గురించి కలతచెందుతోంది. అది – విశ్వామిత్రుడి తపస్సును భంగం చెయ్యడం.
తొలుత కౌశికుడు గా పిలువబడే విశ్వామిత్రుడు, కుశుడు అనే రాజు యొక్క మునిమనవడు, గొప్ప యోధుడు. ఒకరోజు అతను దేశాటనం చేస్తుండగా అనుకోకుండా, ఆయనకు వశిష్టుడికి చెందినపవిత్రమైన గోవు – కామధేనువు  కనబడి, అతని దృష్టిని ఆకర్షించింది.
కామధేనువుకు ఏ కోర్కెనైనా తీర్చే సామర్ధ్యం ఉంది, కనుక మహారాజైన తనకు మహర్షి వద్దనుంచి దాన్ని సొంతం చేసుకునే హక్కు ఉందని అతడు భావించాడు. కాని వశిష్టుడు కామధేనువును రాజుకు ఇవ్వక, గట్టిగా ప్రతిఘటించడంతో  ఆ ప్రయత్నం ఫలించలేదు.
ఆ తర్వాత జరిగిన సంఘటనలో, వశిష్టుడు కామధేనువును బలవంతంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన కౌశికుడి మొత్తం సైన్యాన్ని తన తపఃశక్తి మహిమతో నాశనం చేసాడు. ఈ సంఘటన కౌశికుడిపై చాలా బలమైన ముద్ర వేసింది. అతడు కేవలం దేహబలం కంటే, తపోబలం యొక్క శక్తి ఎంతో గొప్పదని తెలుసుకున్నాడు. అందుకే, అతడు రాజ్యాన్ని త్యజించి, వశిష్టుడి కంటే గొప్ప ఋషి అయ్యేందుకు అన్వేషించసాగాడు. విశ్వామిత్రుడనే బిరుదు స్వీకరించాడు.
అతని ఒకేఒక్క లక్ష్యం వశిష్టుడితో సమానమైన ఆధ్యాత్మిక శక్తిని పొందడం; తద్వారా ‘బ్రహ్మర్షి’ గా అతనితో  సమానం కావడం . అతను వెయ్యేళ్ళు కఠోర తపస్సు చేసాకా, బ్రహ్మ అతనికి ‘రాజర్షి – ఋషి అయిన రాజు’ అనే బిరుదును ఇచ్చాడు. మరో పదివేల సంవత్సరాల దీర్ఘ తపస్సు తర్వాత, బ్రహ్మ అతని రాజ పరంపరను  శాశ్వతంగా విడుస్తూ, ‘ఋషి’ అన్న నామకరణం చేసాడు.
అతడు ‘బ్రహ్మర్షి’ అనే తదుపరి స్థాయిని  పొందే , మార్గంలో  ఉన్నాడని తెలుసుకున్న దేవేంద్రుడు, అతడి  తపస్సును పరీక్షించదలిచాడు. విశ్వామిత్రుడిని మోహింపచేసి, అతని తపస్సును భంగపరచమని, మేనకను ఆజ్ఞాపించాడు.
“కాని – అతడు ఋషి కనుక, ఏదైనా పొరపాటు జరిగితే, నన్ను చంపేందుకు తన దివ్యశక్తుల్ని వాడవచ్చు కదా,” అంది, రాజాజ్ఞను పాటించేందుకు ధైర్యం కూడగట్టుకోలేక విముఖంగా ఉన్న మేనక. విశ్వామిత్రుడు స్వీయనియంత్రణ లేనివాడని, తరచుగా కోపంలో ఇతరుల్ని శపించి, తన తపఃశక్తిని కోల్పోతూ ఉంటాడని, ఆమెకు బాగా తెలుసు. అంతా అతడి కోపానికి భయపడి, తమ చర్యలు ఆ ముని మండిపాటుకు కారణం కారాదని, ప్రార్ధించేవారు.
“చివరిసారిగా చెప్తున్నా. ఇది నా ఆజ్ఞ. ఇది నువ్వు పాటించి తీరాలి“, అంటూ దేవేంద్రుడు విసవిసా అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఇక మేనకకు వేరే మార్గం లేదు.
ఆమె రాజాజ్ఞను పాటించేందుకు తనను తాను మానసికంగా సిద్ధం చేసుకుంది. తన అద్భుతమైన వస్త్రాలలో విస్మయపరిచేలా, విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి దిగి వచ్చింది.
“ఓం “ అంటూ విశ్వామిత్రుడు జపించే మంత్రం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించసాగింది. వెంటనే ఆమె, విశ్వామిత్రుడికి తపోభంగం కలిగించాలని అనుకోవడం, తాను చేసిన అతిపెద్ద సాహసమనుకుని, భయపడింది. కాని ఈ దశలో, ఆమె తనకు అప్పగించిన పనిని పూర్తిచెయ్యకుండా స్వర్గానికి తిరిగి వెళ్లనూలేదు, విశ్వామిత్రుడి తపోభంగం ద్వారా ఆపదలు కొనితెచ్చుకోలేదు.
అది రాజాజ్ఞ కనుక, పాటించే తీరాలి, అని ఆమె లోలోనే ఆలోచించుకోసాగింది....
 దేవలోకపు అప్సర యొక్క అద్భుతమైన మోహశక్తితో మానవ మేధస్సును సవాలు చెయ్యమని, రాజాజ్ఞ.
ప్రబలమైన మోహాన్ని నిగ్రహించుకోగల శక్తిని పరీక్షించమని రాజాజ్ఞ .
మేధ శిఖరాగ్రాన జ్ఞానంపై  మోహం యొక్క ఆధిపత్యాన్ని పరీక్షించమని రాజాజ్ఞ.
ఇక, ఆమె ఆజ్ఞను పాటించేందుకు పూర్తిగా సిద్ధమయ్యింది. ఆమె స్నానం చేసేందుకు , విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి ప్రక్కనే ఉన్న సరస్సులోనికి దిగింది.
మరికొన్ని క్షణాల్లో, ఆ సరస్సు కొత్త కాంతిని సంతరించుకుంది, ప్రతి నీటి చుక్క దివ్యమైన ఆమె దేహాన్ని తాకేందుకై పోటీపడుతోందా, అనిపించసాగింది.
ఆమె దేహం నీటికి కొత్త ప్రాణం పోసింది, ఆశ్రమం అంతటా ఏదో కొత్త శక్తి వ్యాపించింది. ఆమె సరస్సు నుంచి బయటకు రాగానే, ప్రకృతి ఒక్కసారిగా స్తంభించినట్లు అనిపించసాగింది. మబ్బుచాటునుంచి చంద్రుడు బయటకు వచ్చి, ఆత్రంగా చూడసాగాడు.
చక్కని వంపులు తిరిగిన ఆమె శరీర భాగాల నుంచి, నీటిబొట్లు రాలి పడసాగాయి. ప్రతి చుక్క ఆమెను నిలువెల్లా తాకుతూ, అయిష్టంగా ఆమె కాంతివంతమైన దేహాన్ని వదిలి వెళ్తోంది.  అప్పటివరకూ విశ్వామిత్రుడు ఎంతో శ్రమపడి నిర్మించుకున్నదంతా కూల్చివేయడానికి వచ్చిన ప్రమాదంలా, అతని వైపు నడిచింది.
ఆమె లయబద్ధమైన అడుగులు, సన్నటి నడుము, చురుకైన చూపులు ఆమె ఆహ్వానాన్ని మరింత ప్రబలంగా మార్చాయి. మరికొన్ని క్షణాల తర్వాత, ఆమె శరీర పరిమళం చుట్టుప్రక్కల అంతా వ్యాపించి, విశ్వామిత్రుడి ఏకాగ్రతను భంగపరిచింది. ఆయన కన్నులు తెరిచారు.
ఆయన నోటివెంట అప్పటివరకు జపించిన ‘ఓం’ అన్నది మరచి, తెలియకుండానే ‘ఓహ్... !’ అన్న పదం వెలువడింది.
అప్రయత్నంగా ఆయన కాళ్ళు ఒక అచేతన స్థితిలో, మేనక వైపు దారి తీసాయి. ఆయన కన్నులు అనాచ్చాదితమైన పాలవర్ణపు వీపుపై , సన్నటి నడుముపై నిలిచిపోయాయి.
విశ్వామిత్రుడు తనను అనుసరిస్తున్నాడని తెలుసుకున్న మేనక, ఆగి, శృంగారభరితంగా తన చేతులను ఎత్తి, అతన్ని ఆహ్వానించింది.
అటువంటి ప్రబలమైన ఆహ్వానాన్ని, ఎవరూ నియంత్రించుకోలేరు, విశ్వామిత్రుడు కూడా. ఆమె నడుమును అందుకునేందుకు, అతను చెయ్యి చాచాడు. ఇక్కడే, ఈ కధ వందలాది ఏళ్ళ క్రితం మొదలయ్యింది....
***************
రెండు శతాబ్దాల క్రితం... మైసూరు మహారాజా భవంతిలో...
1892 లో ఒక వేసవి మధ్యాహ్నాన, మహారాజు తన మందిరంలో, తనకు సమకాలీకుడైన ప్రఖ్యాత చిత్రకారుడు – ప్రద్యుమ్న తో చర్చించుతున్నారు.
లలితకళల పోషణకు పేరొందిన మైసూరు మహారాజు ప్రద్యుమ్న వద్దనుంచి ఒక పెద్ద ఉత్కృష్టమైన చిత్రాన్ని ఆశిస్తున్నారు. చికాగో లో జరగనున్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కు తమ రాజ్యం తరఫున దాన్ని పంపాలని ఆయన కోరిక.
ఆ రోజుల్లో వాణిజ్య మార్గాలు కేవలం సరుకుల రవాణాకు మాత్రమే కాక, విలువలు, ఆలోచనల బదిలీని కూడా ఆహ్వానించేవి. బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతిని ప్రభావితం చేస్తూనే, అప్పటి వరకూ ఈ ఉపఖండపు హద్దులలోనే ఉన్న చిత్రకళా నిధిని ప్రపంచానికి పరిచయం చేసారు. ఇది పాశ్చాత్య దేశాల్లో భారతీయ చిత్రకళ పట్ల ఆసక్తిని పెంపొందించింది. తనకున్న అతి అరుదైన ప్రతిభ వల్ల, ప్రద్యుమ్న వారికొక ఆసక్తికరమైన వ్యక్తిగా రూపొందాడు.
ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ప్రద్యుమ్న,న భూతో న భవిష్యతి అన్నట్టుగా, తన చిత్రకళతో భారతీయ సంస్కృతిని విస్తృతంగా ప్రభావితం చేస్తూ, మైసూరు మహారాజు సంరక్షణలో కీర్తి శిఖరాలను అధిరోహించాడు.
కొలంబియా ప్రదర్శనకు పంపేందుకుగానూ, ప్రద్యుమ్న వెయ్యదగిన చిత్రపు నమూనాలను పరిశీలిస్తున్నాడు మహారాజు.
“మహారాజా ! కొన్నాళ్ళ క్రితం మీరు నాకు ఈ విషయం చెప్పినప్పుడు నేను దీనిగురించి ఆలోచించాను. నేను విశ్వామిత్రుడి చిత్రాన్ని ప్రయత్నిస్తాను!!! ఆ ఋషి జీవితచరిత్ర, రాజబలం, దివ్యమైన ఏకాగ్రత, మోహం లాంటి ఆసక్తికరమైన విషయాల గొప్ప సమ్మేళనం. దేవేంద్రుడి ఆజ్ఞపై, మేనక, విశ్వామిత్రుడిని సమ్మోహితుడిని చేసే సంఘటన నేపధ్యంగా ఒక చిత్రాన్ని రూపొందించాలని నా యోచన
మహారాజు మౌనంగా ఉండిపోయారు.  పౌరాణిక పాత్రలను,దృశ్యాలను తీసుకుని, వాటిని రాజసమైన అతిగొప్ప చిత్తరువులుగా మలచడంలో, ప్రద్యుమ్నకు ఉన్న విశిష్టమైన తైలవర్ణ చిత్రకళా శైలిని గురించి ఆయనకు బాగా తెలుసు. పాత్రలకు జీవం పొయ్యడం మాత్రమే కాకుండా, ఆ పాత్ర యొక్క నిశితమైన వర్ణనతో,  చిత్రం వెనుక ఆవరణతో చిత్రాన్ని తనదైన శైలిలో రూపొందించడంలో ప్రద్యుమ్న చూపే శ్రద్ధ, అతన్ని ఆ ప్రాంతానికే ప్రఖ్యాత చిత్రకారుడిగా మలచింది. అయితే, చిత్రానికై  ప్రద్యుమ్నకు కావలసిన వ్యక్తులను నమూనాలుగా అందించడం గురించే మహారాజు ఆందోళనకు గురౌతున్నారు. ప్రద్యుమ్నకు అటువంటి వ్యక్తులు ఎక్కడ దొరుకుతారా అని ఆయన యోచించారు.కొంత సేపటి తర్వాత,మహారాజు ఇలా అన్నారు....
“అద్భుతం ప్రద్యుమ్న, అద్భుతం! నీకు ఏమి కావలసినా అమర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. కాని, ఈ చిత్రం భారతీయతను ప్రతిబింబించేలా, భారతీయ అన్వయాలకు సంబంధించి ప్రపంచం ఇంతవరకూ చూడనంత అందమైన తైలవర్ణ చిత్రం కావాలి. దీనికి నేను ఎలా సాయపడగలనో, నానుంచి నీకు ఏమి కావాలో చెప్పు? డబ్బా? నిశ్చింతగా పనిచేసుకునేందుకు ఏకాంత మందిరమా? సేవకులా? చెప్పు ప్రద్యుమ్నా, నీకు ఏమి కావాలి?”
ప్రద్యుమ్న ఒక్కక్షణం మౌనం వహించి, “మహారాజా, మీపట్ల ఉన్న అపారమైన గౌరవము, కృతజ్ఞతతో, నేను మీ ఆశ్రయం పొందినందుకు అదృష్టవంతుడినని చెప్పి తీరాలి. నాకు ఇతర మౌలిక సదుపాయాలు ఏవీ అక్కర్లేదు, కాని...”
మహారాజు తన ఆందోళన నిజమౌతుందని భయపడ్డారు. ఆయన వ్యాకులత చెంది, ఇలా అడిగారు, “ప్రద్యుమ్న, దయుంచి విషయాన్ని సూటిగా చెప్పు. నీవు ఏమి ఆశిస్తున్నావు ?”
“మహారాజా! దయుంచి ఆగ్రహించకండి. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన తైలవర్ణ చిత్రం తయారుచేసేందుకు నేను నా పయనం ఆరంభించేందుకు సిద్ధంగా ఉన్నాను. కాని, నేను నా చిత్రానికి నమూనాగా నిలవగలవ్యక్తుల అన్వేషణ అనే ఆరంభ దశలోనే ఆగిపోతానేమో అని కలతచెందుతున్నాను.”
ప్రద్యుమ్న సమస్య అర్ధవంతమైనది. ఏదైనా ఒక చిత్రం తెరపై ప్రాణం పొసుకోవాలంటే, చిత్రకారుడికి ఆ చిత్రం పట్ల ఉండే మక్కువ, అతడు చిత్రించబోయే సన్నివేశాల్లో, అందమైన ఆకృతులకు జీవాన్ని ఇవ్వగల వ్యక్తులు నమూనాలుగా నిలబడడంతో పెంపొందుతుంది. కాని, అప్పటి సంస్కృతీ సంప్రదాయల వల్ల, చిత్రాలకు నమూనాలుగా నటించే స్త్రీలు అప్పటిలో దొరకడం కష్టమయ్యేది. ఒకవేళ ఆ చిత్రం శృంగార పరమైనది అయితే ఇలాంటి నమూనాలకు వ్యక్తులు దొరకడం దుర్లభమనే చెప్పాలి.
ఇదివరలో ఈ పరిమితిని, ప్రద్యుమ్న అనేక విదేశీ ఛాయాచిత్ర పుస్తకాల్లో ఉన్న చిత్రాలను నమూనాలుగా స్వీకరించడం ద్వారా అధిగమించాడు. అతని గ్రంధాలయంలోని పుస్తకాలలో, అనేక  రూపాలలో ఉన్న పురుషుల, స్త్రీల, పిల్లల నమూనా చిత్రాలు, ఇంకా అనేక శృంగార భంగిమలలు మరియు నగ్న చిత్రాలు ఉన్నాయి. ఈ ప్రామాణికమైన నమూనాలు అతనికి నమూనావ్యక్తుల అవసరం లేకుండా చేసాయి.
పుస్తకాలోని మనుషులచిత్రాలను ప్రేరణగా తీసుకుని చిత్రరాజాలలోని బొమ్మలని అందంగాతీర్చిదిద్దటం అతని పనికి అనువుగా ఉండేది. కాని, అలా పుస్తకాలు వాడడం వల్ల ఒక లోపం ఉండేది. అలాంటి బొమ్మలు, ఎటువంటి ఉద్వేగం లేకుండా, చప్పగా , కొన్ని సార్లు అసహజంగా, వంకరగా, అనిపించేవి. పనిచేసే చిత్రరాజానికి కావలసిన భావనలు, చిత్రాలలోని బొమ్మలతో సరిపోలవు. నిజానికి, ఆ కాలంలోని భారత చిత్రకారుల ప్రయత్నాలన్నీ ఇటువంటి ఇబ్బందుల వల్ల లోపభూయిష్టంగా ఉండేవి.
ప్రద్యుమ్న చిత్రాలు వీటికి అతీతం కావు. పైగా, అతడు ప్రపంచంలోనే అందమైన చిత్రాన్ని, ఒక శృంగార భరితమైన వాతావరణంలో సృష్టించబోతున్నాడు, అందుకే, అతనికి తన మనసులో ఉన్న మేనక చిత్రానికి తగ్గట్టుగా ఉండే నమూనా స్త్రీ చాలా అవసరం. మేనకకు సరితూగగలిగే నమూనా స్త్రీ ఎవరోఒకరు కాలేరు కదా; ఆ ప్రతిరూపం ఇతరుల కంటే ఆకర్షణీయంగా, సమ్మోహనంగా, హుందాగా, రాజసం ఉట్టిపడేలా ఉండాలి .  ఎందుకంటే, ఆమె మేనకలా చూపరులను కట్టేయ్యాలి కాబట్టి!
“నా ఈ చిత్రానికి నమూనా స్త్రీ కై  వీధులలో వెతుకుతూ వెళ్లాను, నిజానికి గ్రామీణ ప్రాంతాలలోకి కూడా వెళ్లాను. నా ప్రణాళికకు అనుగుణంగా పనిచేసే కొందరు జారిణీ స్త్రీలు నాకు దొరికేవారు. కాని, వారిలో మేనకకు నమూనాగా నిలబడగల ఆ రాచఠీవి ఉండదు.”
“అయితే, నీవు చివరకు ఏమి చెప్పాలనుకుంటున్నావు?” అడిగారు విభ్రాంతికి గురైన మహారాజు. అతడు ఏమి చెప్పాలని అనుకుంటున్నాడో ఆయన ఇంకా ఊహించలేకపోతున్నారు.
ప్రద్యుమ్న తెగించి, బలహీనస్వరంతో, “మీరు శిక్షించే ప్రమాదం ఉందని తెలిసినా, నేను తెగించి, ఈ విషయాన్ని వెల్లడి చేస్తున్నాను మహారాజా. ఈ బృహత్కార్యానికి నేను యువరాణి సుచిత్రాదేవి భంగిమలను తీసుకునేందుకు రాజావారు అనుమతించాలని నేను అభ్యర్ధించవచ్చా? నా ఈ అభ్యర్ధన తప్పుగా అనిపిస్తే, రాజావారు మన్నించగలరు. కాని, నా అభ్యర్ధనను మన్నిస్తే, నేను ప్రపంచంలోనే సుందరమైన చిత్రాన్ని అందిస్తానని, ప్రమాణం చేస్తున్నాను.”
మహారాజుకు ఆ అభ్యర్ధన నచ్చకపోయినా, ఆయన మౌనంగా ఉన్నారు. ఇదొక కఠిన నిర్ణయం! ప్రదర్శన కోసం చిత్రం అత్యుత్తమమైనదిగా ఉండాలి. మరోవైపు, ఒక చిత్రకారుడి కోసం స్వయానా తన కుమార్తె నమూనాగా  నిలవడం మహారాజుకు ఇష్టం లేదు, కాని కొన్ని క్షణాలు దీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఆయన ఇలా స్పందించారు...
“ముక్కుసూటిగా చెప్పే నీ స్వభావాన్ని అభినందిస్తున్నాను ప్రద్యుమ్న; నేను ఈ పనికి యువరాణిని సమ్మతింపచేసి, కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తాను. కాని ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలి, ఏర్పాట్లు అన్నీ రాజభవనంలోనే జరుగుతాయి. ఈ చిత్రం పూర్తయ్యేవరకు నీవు రాజభవనం వదిలి వెళ్ళే వీలు లేదు... “మరి ఒక  మాట...” అంటూ ”యువరాణి నా కూతురన్న విషయం నీవు ఎల్లప్పుడూ గుర్తుంచుకో...”అని పరాకుగా చెప్పారు మహారాజు.
తర్వాత కొన్ని వారాల్లో, ప్రతి సాయంత్రం, ప్రద్యుమ్న యువరాణితో కలిసి చిత్రానికై పనిచేస్తూ, సమయం గడపసాగాడు. చిత్రంలో మేనకకు కావలసిన హావభావాలను గురించి ఆమెకు వివరించేవాడు. కొన్నిసార్లు ఈ సహవాసం గంటలుగంటలు కొనసాగేది. కొద్ది కాలంలోనే, ప్రద్యుమ్న సృజనాత్మకత,చాలా సూక్ష్మమైన విషయాలను చిత్రించడంలో అతని ఏకాగ్రత, రాకుమారిని ప్రభావితం చేసింది. ముఖానికి కళ వచ్చేలా నవ్వమనడం, ముఖాన్ని ఒక కోణంలో నిలపమని చెప్పే విధానం, ఆమె ముఖంపై చేతిని ఉంచమని అతను సూచించే విధానం, ఇవన్నీ ఆమెకు బాగా నచ్చేవి.
రోజులు గడుస్తుండగా, రాకుమారి, ప్రద్యుమ్న ఒకరికొకరు దగ్గర కాసాగారు. ఒక చిత్రకారుడికి, అతని నమూనాకు ఉండే ఉద్వేగపరమైన సాన్నిహిత్యం, మున్ముందు రానున్న వాటికి ఆరంభ దశ.
ఒక ఉదయం, ఒక వార్తాహరుడు,మహారాజు దర్భారులోకి వెళ్లి, చిత్రానికి ఉన్న తెరతీసి చూపాడు.మేనక విశ్వామిత్రుల చిత్రణ  వైభవంగా అమరిన తీరును,తుది పరిణామాన్ని చూసి మహారాజు ఉప్పొంగిపోయాడు. చూపరులకు మోహకరంగా, అది అత్యంత నైపుణ్యంతో రూపుదిద్దుకుంది.
మేనక సౌకుమార్యాన్ని చిత్రించడంలో ప్రద్యుమ్న చూపిన శ్రద్ధ, విశ్వామిత్రుడిని సమ్మోహితుడిని చేసే ప్రయత్నం సఫలమవుతుందో లేదో అన్న ఆమె సందిగ్ధం, అత్యంత అద్భుతంగా మలచబడి, భారత పౌరాణిక చరిత్రలోనే మనోజ్ఞమైన చిత్రాన్ని తీర్చింది. మహారాజు చిత్రాన్ని చూసి, సంతృప్తి చెంది, ప్రద్యుమ్నకు కబురు పంపారు.
ఆయన చిత్రాన్ని మరింతగా పరిశీలిస్తూ ఉండగా, వార్తాహరుడు చెప్పిన మాటలు ఆయన్ను కలతకు గురిచేసాయి.
“మహారాజా, మీకుఅతి ముఖ్యమైనఒక విషయాన్ని చెప్పాలి. గత రెండు రోజులుగా ప్రద్యుమ్న భవంతిలో కనిపించట్లేదు, ఈ చిత్రం కూడా సేవకులు శుభ్రం చేసేందుకు వెళ్ళినప్పుడు వెలుగు చూసింది.“
మహారాజు ఇది విని అవాక్కయ్యారు. మొదట విన్నప్పుడు ఆయనకు అర్ధం కాలేదు. కాని, దాని తర్వాత మంత్రి అందించిన వార్త, గత కొన్ని వారాలుగా చిత్రాన్ని గియ్యడం అనే ముసుగులో ఏమి జరిగిందో ఆయన గుర్తించేలా చేసింది.
“మహారాజా!గత కొన్ని రోజులుగా యువరాణి సుచిత్రా దేవి కూడా భవంతిలో కనిపించట్లేదని తెలిసింది నాకు...” నిర్ధారించాడు వార్తాహరుడు.
మహారాజు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. తనకు సన్నిహితుడని తాను ఎంతగానో నమ్మిన వ్యక్తి తనని ఇలా మాయ చేయడాన్నిఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన వదనం ఎరుపెక్కింది. వెనక్కి తిరక్కుండానే, తీవ్రమైన కోపంతో ఆయన, ‘వెంటనే ఆ చిత్రాన్ని భవంతి వెలుపలకి తీసుకువెళ్ళి, ముక్కలు చేసి పారెయ్యమని ‘ మంత్రిని ఆదేశించారు. ఈ మాటచెప్తూనే, కోపంగా ఆ మందిరం వదిలి వెళ్ళారు మహారాజు.
మంత్రి, ప్రద్యుమ్న వేసిన అందమైన చిత్రాన్ని చూసాడు. కాని, కళ పట్ల ఉన్న అభిరుచి, గౌరవం వల్ల, చిత్రాన్ని నాశనం చేసేందుకు ఆయనకు మనసు రాలేదు. ఆ చిత్రాన్ని రాజ్యం వెలుపల వదిలెయ్యమని, సేవకులకు చెప్పాడు.
ఆయనకు తెలియకుండా సేవకులు ఆ చిత్రాన్ని ఉత్తరాదికి చెందిన ఒక వస్త్ర వ్యాపారికి, 100 బంగారు నాణాలకు అమ్మారు.
అప్పటినుంచి, ఆ చిత్రం అనేక ప్రాంతాల్లో ప్రదర్శింపబడి, ప్రజల మన్ననలు అందుకుంది. తర్వాతి తరాల్లో, ముద్రణా యంత్రాలు కనుగొనడం వల్ల, కళా పోషకులు అందరికీ ఈ చిత్రపు నమూనాలు విస్తృతంగా అందించబడ్డాయి.
చివరకు ఆ చిత్రం, 20 వ శతాబ్దం మొదట్లో ముంబై కి వచ్చిన బ్రిటిష్ వర్తకుడి చేతుల్లోకి వెళ్ళింది. అతను ఆ చిత్రాన్ని లండన్ కు తీసుకువెళ్లాలని అనుకున్నాడు. అదే ఆ చిత్రం గురించి చివరిసారి వినడం.
ప్రద్యుమ్న మరియు రాకుమారి తమ తదుపరి జీవితాన్ని ఆస్వాదించి ఉండవచ్చు. రాజుకు హృద్రోగం వచ్చి ఉండవచ్చు. మంత్రి చిత్రాన్ని ధ్వంసం చేసానన్న అపరాధ భావన లేకుండా హాయిగా బ్రతికి ఉండవచ్చు. బంగారు నాణాలతో సైనికులు కొన్నాళ్ళు సుఖపడి ఉండచ్చు. కాని, దాని తర్వాత చిత్రం గురించి ఎటువంటి సమాచారం అందలేదు. అది ప్రజల దృష్టి నుంచి కనుమరుగయ్యింది.
21 వ శతాబ్దం ఆగమనంలో ఈ చిత్రం భారతీయ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన క్షణానికి తెరతీసేందుకు నిరీక్షిస్తోంది. అది ఎలా జరగబోతోందో ఈ కధ కొనసాగింపులో తెలుసుకుందాం.
****************
జనవరి 27,2011. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి  12వ అంతస్థు, ముంబై , సమయం ఉదయం 9.00 గంటలు.
త్రివేది గారు ఆఫీస్ కు మామూలు సమయం కంటే, 15 నిముషాలు ముందుగానే చేరుకున్నారు. దారిలో  రద్దీ  తక్కువగా ఉండడం వల్ల, బస్సు గమ్యానికి త్వరగా చేరుకుంది. ఆయన PC ఆన్ చెయ్యడం, ఒక కప్ కాఫీ తెచ్చుకోవడం వంటి పనులతో తన దినచర్య ప్రారంభించారు. కాఫీ త్రాగుతుండగా, ఆయన వార్తాపత్రిక చదువుతుండగా, ౩ వ పేజీలోని ఒక వ్యాసం ఆయన దృష్టిని ఆకర్షించింది.
ఆ వ్యాసం ప్రద్యుమ్న వేసిన మేనకా విశ్వామిత్రుల చిత్రం గురించి. ఆయన చరిత్రకు సంబంధించిన పుస్తకాల్లో ఈ చిత్రాన్ని గురించి చదివి ఉండడంవల్ల, అదేమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఆ వ్యాసం చదివేందుకు సిద్ధమయ్యారు. కాని, ఫాక్స్ మెషిన్ నుంచి వచ్చిన అప్రమత్త సూచక శబ్దం ఆయనను ఆటంకపరిచింది.
ఇంత ఉదయాన్నే ఎవరుఫాక్స్ చేసి ఉంటారా అని ఆయన తేల్చుకోలేకపోయారు. వాస్తవిక స్థితిగతులను తెలియజేసే కార్పొరేట్ ప్రెస్ విభాగంలో ఉండడంవల్ల, ఆయన ఫాక్స్ మెషీన్, కార్పొరేట్ ప్రపంచంనుంచి తాజా సమాచారాన్నంతా,తమ వెబ్సైటు లో ప్రచురించేందుకు అందుకునేది.
ఆ రోజు ఆయన అందుకున్న వార్త, కొన్నాళ్ళపాటు కార్పరేట్ భారత్ ను, రాబోయే రెండేళ్లలో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ పరిశ్రమను కుదిపివెయ్యగల సత్తా కలిగినది.
ఆయన వార్తాపత్రికను వదిలివేసి, ఏం వార్తో చూసేందుకు ఫాక్స్ మెషిన్ వైపు హడావిడిగా కదిలారు! ఫాక్స్ చదివాకా, ఆయన నిలువెల్లా ఒణికిపోయారు. ఆ ఉత్తరంలోని అంశాలను ఆయన నమ్మలేకపోయారు.
ఆ వార్తయొక్క విశిష్టత అర్ధం కావాలంటే, ఆ వార్తా వివరాల్లోకి వెళ్ళాలి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే, కొన్ని నెలల ముందు గతానికి, భారత్ నుంచి కొన్ని వేల మైళ్ళు దూరంలో ఉన్న UK కు పయనించాలి...
వెళ్దాం రండి...


No comments:

Post a Comment

Pages