పెరటి చెట్టు - అచ్చంగా తెలుగు

పెరటి చెట్టు

Share This

పెరటి చెట్టు 

- పూర్ణిమ సుధ 


ఇక్కడ లోపాముద్ర గారి ఇల్లెక్కడండీ ? అని అడిగిందే తడవుగా, ఒక పిల్లాడు పరిగెత్తుకొచ్చి, పక్క సందులో, గోధుమ రంగు వెల్లలు వేసి ఉన్న ఒక చిన్న ఇంటిని చూపించి తుర్రుమన్నాడు. గుండెలో రైళ్ళు పరిగెడుతున్నంత శబ్దం నాకే వినిపిస్తోంది. చిన్నప్పుడు, దానిక్కారణం, చుక్క గుర్తు పెట్టిన పద్యాలని సరిగ్గా చదవకపోతే ఈవిడ ఇచ్చే శిక్షలకి భయపడి. కానీ ఇప్పుడు మాత్రం... ఉద్వేగం, భావోద్వేగం. నెమ్మదిగా గేటు తీసి లోపలికి అడుగుపెట్టిన నాకు, చంద్రకాంతం పూలు, కనకాంబరం పూలు, మరువం ధవనం సువాసనలు స్వాగతం చెప్పాయి. మైథిలి అనుకుంటా... పెరట్లో మొక్కలకి నీళ్ళు పడుతోంది. మైత్రేయి ఎక్కడుందో ? ఒక్కసారిగా, నా మనసు గతం ఙాపకాల దొంతరలని ఒక్కొక్కటిగా వెలికి తీస్తోంది.
లోపాముద్ర - ఏం పేరు రా బాబూ ? అంటే ఆవిడలో అన్ని లోపాలుంటాయా ? అని వెక్కిరిస్తున్న నాకు, ఒక 35 ఏళ్ళ టీచర్, గంభీర వదనంతో, నీకు అగస్త్య మహర్షి తెలుసా ? అన్న కంఠం వినబడింది. వామ్మో వినేసారా ? అనుకుని, త్రివిక్రం డైలాగ్ ని తిరగేసి, పుస్తకాల్లో చదవడమేనండీ, బయట పెద్ద టచ్ లేదు, అని విజయ దరహాసం చేసాను. అగస్త్య ముని భార్య పేరు లోపాముద్ర అని చెప్పి నవ్వి వెళ్ళారు. ఆ రోజు నించీ, ప్రతీ రోజూ నేనేదో ఒక సెటైర్ వెయ్యడం, దాన్ని ఆవిడ తిప్పి కొట్టడం పరిపాటయింది. చిన్నప్పట్నుంచీ, తెలుగు అంటే ఒక పెద్ద గుదిబండలా చూసిన నాకు, తప్పించుకోడానికి స్పెషల్ ఇంగ్లీష్ ఒక ఒయాసిస్సులా దొరికింది. కానీ ఈవిడొచ్చాక, తెలుగుకి ప్రత్యామ్నాయం లేదు, ఖచ్చితంగా ప్రతీ వారు తెలుగుని చదవాల్సిందే అని పట్టుబట్టారు. అది నా కోపం. ఒకనాడు ఆవిడ, దుర్యోధనుని ప్రాయోపవేశం పాఠం నుండి ’అక్కట యమ్మహారణమునందు’ పద్యం చుక్క గుర్తు ఉంది, అది రేపు నువ్వే అందరికీ చూడకుండా రాగ యుక్తంగా చెప్పాలని ఆదేశించారు. నేను ఆవిడతో డిబేట్ కి దిగాను. అసలెందుకు చుక్క గుర్తు ఉన్న పద్యాలు కంఠతా చదవాలి ? స్పెషల్ ఇంగ్లీష్ లో షేక్ స్పియర్ రచనలు ఎంత బావుండేవో ? అంటూ ఆవిడని కన్ఫ్హ్యూజ్ చేద్దామని అనుకున్నా. ఆవిడ చాలా సమర్థవంతంగా, ఒక్క మాటన్నారు. రేపు నాతో పాటు మన పాఠశాల గ్రంథాలయానికి రా..! నువ్వు నీకు నచ్చిన ఆంగ్ల పుస్తకం తియ్యి. నేను నాకు నచ్చిన తెలుగు పుస్తకం తీస్తాను. నువ్వు నన్ను మెప్పించేది ఒకటి చెప్పు. నాకు నిజంగా నచ్చితే నీ అభిప్రాయాన్ని నేను గౌరవించి స్పెషల్ ఇంగ్లీష్ అనుమతిస్తా...! లేకపోతే నువ్వు తెలుగుని ఆస్వాదిస్తూ చదవాలి అన్నారు. ఇదేదో అద్దిరింది అనుకుని, సరే అన్నాను...
మరునాడు, నేను”మిల్టన్ - ప్యారడైజ్ లాస్ట్’ చదివి వినిపించా. ఆవిడ ’అభిఙాన శాకుంతలం’ లో ఒక హృద్యమైన పద్యం వినిపించింది. నేను ’రాబర్ట్ ఫ్రాస్ట్ పోయమ్ -  చెప్పాను, ఆవిడ ’వచ్చుచు బోవుచుండె’ అని పోతన పద్యం చెప్పారు. అరె, జీవితం గురించి ఇంత అలవోకగా నాలుగు లైన్ల పద్యం లో భలే చెప్పాడే అనిపించినా, ఉడుకు నెత్తురు ఓటమిని అంగీకరించలేదు. ఈసారి నా తురుఫు ముక్క షేక్ స్పియర్ అయ్యాడు. తన కామెడీస్, ట్రాజెడీస్ నించీ, హృద్యమైన సీన్లని ఏరి చదివి వినిపించా. ఆవిడ పానుగంటి వారి రచనలు, రమణ గారి రచనలు చదివి వినిపించి, సునిశిత హాస్యానికి అర్థం చెప్పారు. ఆ తరువాత, ’ఎవ్వరి భాష తక్కువ కాదు సుధా, కానీ మన భాష అస్సలు తక్కువ కాదు... మన దౌర్భాగ్యం ఏంటంటే, మన భాషని మనమే తక్కువ చేసుకుని, పరాయి భాషలు నేర్చుకోవడానికి ఉబలాటపడుతున్నాం... అంటూ ఒకే పద్యం లో - అటు నుండి ఇటు చదివితే రామాయణం, ఇటు నుండి అటు చదివితే భాగవతం వచ్చే ఒక పద్యం వినిపించి, దాని అర్థం చెప్పారు. అప్పటి నా వయసుకి, తట్టిన అసలు ఉపమానం చెప్పాలంటే, బుర్ర బ్లాంక్ అయింది.
’ఇంతే కాదు, మీరనుకుంటున్న రొమాంటిక్ పాటల్లో లొల్లాయి పదాలు అసలు తెలుగు సాహిత్యం కానే కాదు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు కలగలసిన ఒక హోరు. సిరివెన్నెల గారి సాహిత్యం విను, ఆరుద్ర ఆత్రేయ గారి పాటలు విను, ఎవరైనా సరే, ఒక అబ్బాయి, వాట్ ఏ హాటీ అంటే చెంప చెళ్ళుమనిపించాలనిపిస్తుంది, అదే ’నిన్ను ఒక్కసారి చూస్తేనే నేనింత ఉక్కిరి బిక్కిరి అయ్యాను, రోజూ నిన్ను నువ్వు అద్దంలో చూసుకుని ఎలా ఉండగలుగుతున్నావ్’ అని నిన్ను అంటే, ఎంత ఆనందంగా అనిపిస్తుంది ? అది... ఇది కేవలం నీకు అర్థమవ్వాలని చెప్పాను. నీ వయసుకి ఇలాంటి ఉపమానాలు బాగా తెలుస్తాయి. భాష - భావ వ్యక్తీకరణకి మొదటి సాధనం. ఎప్పటికైనా నీకు నేను చెప్పింది అర్థమవుతుందేమో చూద్దాం’, అనేసి లంచ్ అవర్ కి వెళ్ళిపోయారు. ఎప్పటికైనా ఏంటి ? మరు నిమిషం నించే తెలుగు మీద మమకారం పెరిగింది. రోజూ ఆవిడ చెప్పిన పాఠాలకన్నా ఎక్కువ, ఆవిడ సిఫార్సు చేసిన పుస్తకాలు చదివా. ఆవిడకి కవల కలువలు, మైథిలి, మైత్రేయి అని. భలే ముద్దుగా ఉండేవాళ్ళు. వాళ్ళతో ఆడుకోవడానికి వాళ్ళింటికి వెళ్తే, ఎంతో ప్రశాంతంగా ఉండేది. మా ఇంట్లోలాగా, మైఖేల్ జాక్సన్ హోరు, స్టార్ స్పోర్ట్స్ జోరు అస్సలుండేది కాదు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి సంగీతం, పుస్తకాలు, ఆటలు, ముఖ్యంగా కుటుంబమంతా భలే ముచ్చటగా మాట్లాడుకునేవారు.
ఆ స్కూలు వదిలినా, తెలుగు మీద మమకారం వదల్లేదు. అందుకే ఇంజనీరింగ్ చేసినా, తెలుగు భాష మీద మమకారంతో, రామాయణం మీద థీసిస్ రాసి డాక్టరేట్ పొందాను. ఆవిడని కలుద్దామని ఇదిగో ఇలా...
నన్ను చూసి మైథిలి గుర్తుపట్టదనుకున్నా... అమ్మా అంటూ లోపలికి పరిగెత్తింది. ఆవిడ బయటికొచ్చారు. ఏమీ మార్పు లేదు. అదే మూర్తీభవించిన తెలుగుదనం. ఒక్కసారిగా వెళ్ళి కాళ్ళకి దణ్ణం పెట్టాను. పేపర్ చూసాను సుధా...! గడుసుదానివే అంటూ అక్కున జేర్చుకున్నారు. ఇంతలో మైత్రేయి వచ్చి, తెలుగులో డాక్టరేటా ? ఊరికినే ఇస్తార్లే... క్వైట్ బోరింగ్ ! అంటూ మూతి విరిచింది. లోపాముద్ర గారు నా వైపు చూసి, మా ఇంట్లో కూడా ఒక సుధ ఉంది. కానీ పెరటి చెట్టు వైద్యానికి పనికి రాలేదు అన్నారు నవ్వుతూ ! తెలుగు ప్రాముఖ్యత గురించి రెండే ముక్కలు చెప్తాను. ఇది నువ్వు క్లాస్ అనుకున్నా సరే. అప్పట్లో నా అదృష్టం కొద్దీ మీ అమ్మ దొరికారు. నీకు పుట్టినప్పట్నించీ ఆ అదృష్టం ఉంది, కానీ తెలుగు భాషకి ఎప్పుడూ బాలారిష్ఠాలే అని నువ్వు మళ్ళీ నిరూపించావ్. ఒక్కసారి, మీ అమ్మ అని కాక, ఒక పరాయి వ్యక్తిగా ఆవిడ నోట తెలుగు విను... నువ్వే ఒప్పుకుంటావు అని డిబేట్ కి దిగాను, తనకి నచ్చిన సబ్జెక్ట్ తో సారూప్యానికి దారులు వెతుకుతూ... తెలుగు  మాధుర్యాన్ని రుచి చూసిన వ్యక్తిగా.

No comments:

Post a Comment

Pages