అప్పాజోస్యుల సత్యనారాయణ గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

అప్పాజోస్యుల సత్యనారాయణ గారితో ముఖాముఖి

Share This
అప్పాజోస్యుల సత్యనారాయణ గారితో ముఖాముఖి 
 - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
 
తెలుగు తల్లి పై గౌరవం.. తెలుగు గడ్డ పై వాత్సల్యం తెలుగు జనుల మీద మమకారం  ఉన్న విద్యావేత్త .. బహుముఖ ప్రజ్ఞాశాలి  అప్పాజోస్యుల సత్యనారాయణ గారు . డాక్టరేట్ చేసిన వీరు అమెరికా న్యుజేర్సి లో కంప్యుటర్ సైన్స్ లో  ఎమిరిటస్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ , నలభై ఏళ్ళు గా అమెరికా లో స్థిరపడ్డారు’.  తెలుగు భాషా సేవలో భాగంగా నాటకాన్ని నాటకమే బ్రతికిస్తుందన్న  ముందుచూపుతో, 22 ఏళ్ళ క్రితం అమెరికా లో అజో – విభొ- కందాళం అనే స్వచ్చంద స్థాపించి ఆ సంస్థ ద్వారా వందల నాటకాలు వ్రాయించి , ముద్రించి, నటింప జేస్తూ నాటకానికి తమ చేయూతనిస్తున్న కళాపిపాసి వీరు.  ఎందరో వెలుగు చూడని తెలుగు ప్రతిభావంతులను గుర్తించి, అభినందించి, సమ్మానించే తెలుగు భాషా ప్రేమికులు శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణ గారు. లక్షలాది రూపాయలు వెచ్చించి తమ ఫౌండేషన్ ద్వారా ఏటా ఒక ప్రాంతంలో అక్కడి కళాసంఘాలను కలుపుకుని, అక్కడి కళాకారులను సన్మానించడమేగాక ఆయా ప్రాంతాలలోని తెలుగు కళారంగాలలో విశిష్ట సేవలందించిన ప్రతిభావంతులను గుర్తించి వారికి లక్షరూపాయల అవార్డు.. తో సత్కరిస్తుంటారీయన. క్రమశిక్షణకు పెద్దపీటవేస్తూ వయసును లెఖ్ఖచేయకుండా వీరు నిర్వహించే కార్యక్రమాలు చూపరులను ఆశ్చర్యచకితులను  చేస్తాయి. ముఖ్య అతిధి ఎంతటి వారైనా, వారికోసం ఎదురు చూడకుండా సమయానికి కార్యక్రమాలు ప్రారంభించడం వీరికి అలవాటు. విదేశాల్లో స్థిరపడి తెలుగు భాష కు వీరు చేస్తున్న కృషి అనిర్వచనీయం. అంతటి హడావుడి కార్యక్రమ నిర్వహణలో ఉండి కూడా  అప్పాజోస్యుల సత్యనారాయణ గారు  అచ్చంగా తెలుగు  పాఠకులకోసం కొద్దిసేపు ముచ్చటించారు.. అచ్చంగాతెలుగు తో  వారి ఫౌండేషన్ గురించి పంచుకున్నారు.  సమాజం అనేది నిత్య చైతన్యవంతమైనది. సమాజానికి ఏది కావాలో అది ఉంటుంది. మన భాషా.. మన సాహిత్యం మంచి స్థాయిలో ఉన్నాయి కాబట్టి మన భాష కు నాశం లేదంటున్న ప్రకాశం జిల్లా , చీరాల వాసి అప్పాజోస్యుల సత్యనారాయణ గారితో కళ్యాణ్ చేసిన ఇంటర్వూ..

అచ్చంగా తెలుగు : నమస్కారమండి సత్యనారాయణ గారు, మీ స్వగ్రామం , కుటుంబం , బాల్యం గురించి చెబుతారా ? 
అప్పాజోస్యుల సత్యనారాయణ :   పెద్ద కుటుంబంలో చివరి సంతానం అండి నేను . మా నాన్నగారు అప్పా జోస్యుల దత్తాత్రేయ గారు . మా అమ్మ అన్నపూర్ణమ్మ . నేను బాపట్లలో పుట్టి అక్కడ 8 వ తరగతి దాకా చదువుకుని , చీరాల వచ్చి చీరాల లో B.sc చేశాను . తరువాత హైదరాబాద్ , బెంగుళూర్ , అమెరికా ఇలా నా ప్రస్థానం కొనసాగింది .

అ.తె  తెలుగు మీద అవ్యాజమైన ప్రేమ కలగడానికి ప్రత్యేక మైన కారణాలేమన్నా ఉన్నాయా ? 
 అ.స : చిన్నప్పటి నుండి కుడా సాహిత్యం మీద కొంత అవగాహన వున్నా కుటుంబం కాబట్టి , ఆ కుటుంబంలో పెరిగాను కాబట్టి , మా అమ్మగారు పెద్ద వయసు కావడంతో భాగవతం చదివే అదృష్టం నాకు కలిగింది . తప్పులు చదువుతుంటే ఆమె నా తప్పులు సరిదిద్దుతూ ఉండేది . ఇలా ఇలా జరిగింది .

అ.తె : అజో- విభో -కందాళం  అనే సంస్థను స్థాపించి దేశ విదేశాల్లో తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేస్తున్న మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు? 
  . : మా ఫౌండేషన్ ద్వారా , ముఖ్యంగా మేం చేస్తున్నటువంటిది ఏదో గొప్పగా చేస్తున్నామని కాదు . ఏదో కొద్దిగా ఉడుతా భక్తిగా చేస్తున్నదేవిటంటే  అజో- విభొ- కందాళం ఫౌండేషన్ యొక్క బుక్ లింక్.  ఈ AVKF బుక్ లింక్ అనేది పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభించామండీ.. 22 సంవత్సరాల సంస్థ లో పదకొండు సంవత్సరాల క్రితం ఈ బుక్ లింక్ ని ప్రారంభం చేశాం.   అది వెబ్ ద్వారా  పుస్తకాల పంపిణి.. ప్రపంచ వ్యాప్తంగా.!  దాని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే , ఇవ్వాళ గుంటూరులో కాని , విజయవాడలో కాని , హైదరాబాదులోకాని ఒక తెలుగు పుస్తకం పాఠకునికి ఏ ధరకైతే లభిస్తుందో , అదే ధరకి ప్రపంచంలో ఏమూలనున్న తెలుగు వారికైనా అందించాలనే ప్రయత్నంతో ఆ బుక్ లింక్ స్థాపించడం జరిగింది .

అ.తె: ఆ బుక్ లింక్ లో ఎలాంటి పుస్తకాలుంటాయి ? ఎన్ని పుస్తకాలున్నాయో చెబుతారా ? 
 అ.స :  మా బుక్ లింక్ లో దాదాపు పదహారు వేల టైటిల్స్ కి పైగా వున్నాయి . ప్రపంచ వ్యాప్తంగా మేము పుస్తకాలు పంపిణి చేస్తున్నాము . ఈరోజు ఒక పుస్తకం ధర 100 రూ వుంటే , 100 రూ లకే టర్కీ లోగాని , అమెరికా లోగాని , జర్మని లోగాని , ఆస్త్రేలియా లోగాని ఎక్కడైనా అందజేస్తాం . పోస్టేజి అదనం . దీని వల్ల మారుమూల దేశాల్లో ఎక్కడో తెలుగు స్పర్శ లేకుండా , తెలుగు పుస్తకం దొరకనటువంటి వారు చాలామంది ఈ సంస్థ వల్ల ఉపయోగం పొందుతున్నారు . ఇది మాకు చాలా ఆనందంగా వుంది .

అతె : అజో విజో కందాళం ద్వారా మీరు తెలుగు భాషకు అందిస్తున్న సేవల గురించి కాస్త చెబుతారా ? 
అ.స:   మేం ఇక్కడ చదువుకుని , అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడి , అక్కడ ఏదో మాకు చేతనైనంత కృషి అక్కడ చేసి, కొంత ఏదో ధన సంపాదన కాని,మేం చేయవలసిన పనులు అన్నీ చేశాం.
   కాని ఇక్కడి వారికి ఏదైనా చేయాలి అనేటటువంటి ఒక అభిప్రాయం . రెండవదేమిటంటే ఇక్కడ చాలామంది గొప్పగొప్ప వాళ్ళు విస్మృతిలో వున్నారు . గొప్ప పరిశ్రమ చేసి తెలుగు జాతికే గర్వకారణమైన మహనీయులు విస్మృతిలో వున్నారు . అందుకని వాళ్ళని గుర్తించి , గౌరవించి మనజాతి ఇటువంటిదయా , ఇటువంటి వ్యక్తులు వున్నారు అని చెప్పటానికి మిగతా సంస్టలకు కూడా కొంత స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంస్థను మేము 22సం క్రితం ప్రారంభం చేసి, ప్రతి సంవత్సరం ఒకే చోట కాకుండా ఆంధ్ర దేశంలో , ప్రస్తుతం మళ్ళి తెలంగాణలో అందరికి మనజాతిలోని తేజోవంతులు వీరు అని తెలియజేయడం కోసం అనిప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క వూళ్ళో ఒకే చోట కాకుండా ఈ సంవత్సరం అనకాపల్లి లో రావికొండల రావు గారికి పురస్కారం అందించాము . రావి కొండలరావంటే 84 సం ల వ్యఖ్తి. అయినను పెద్దగా పురస్కారాలవి వచ్చాయని నేను అనుకోను . ఆయన మాములుగా సిని నటుడిగానే జనాలకు గుర్తింపు ఉండి తప్ప , ఆయన ఒక మంచి నాటక కర్తగా , నాటకమే జీవితంగా , నాటకమే ధ్యాసగా , నాటకమే శ్వాసగా జీవించిన వ్యక్తిగా లోకానికి ఎక్కువగా తెలీదు. 1957 లో ఆయన  కుక్కపిల్ల దొరికింది అనేటటువంటి నాటిక భారతిలో ప్రచురించారూ అంటే ఆయన ఈ నాటక రంగంలో ఎంత సనాతనుడో ఊహించండి. అటువంటి వారిని మనం తప్పకుండా గౌరవించాలె. అసలు ఆయన ఇంతకాలం సేవచేశాడు, ఈ రంగంలో ఉన్నాడని చాలామందికి తెలీదు. సాధారణం గా ఆయనో సినిమానటుడు, ఏదో చేస్తున్నాడని తప్ప ఆయన పత్రికారంగంలో చేసిన కృషికానీ, ఆయన కథకుడని గానీ, పాత్రకేయుడని కానీ, నాటక కర్త అని గానీ, నటుడనిగానీ తెలీదు. అటువంటి వారిని గుర్తించి , గౌరవించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.

అ.తె : అజో- విభో- కందాళం ఫౌండేషన్ ను ఎప్పుడు స్థాపించారు? అసలు అజో- విభో -కందాళం అనే ఈ పేరును ఎవరు సూచించారు? 
 అ.స :  ఇది 1993 లో ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన వారిలో అప్పాజోస్యుల సత్యనారాయణ, విష్ణుభొట్ల రామన్న అనే ఇద్దరు వ్యక్తులం. నేనే ముందు ప్రారంభిద్దామంటే, రామన్న చేరతానంటే .. అప్పాజోస్యుల- విష్ణుభొట్ల ఫౌండేషన్  అనేది ప్రారంభం చేశాం. అప్పాజోస్యుల- విష్ణుభొట్ల ఫౌండేషన్ ని అజో- విభొ పౌండేషన్ గా మార్చినటువంటి మహనీయుడు, తిరుమల రామచంద్రుడు గారు. అప్పటి నుంచి అజో- విభొ ఫౌండేషన్ గా మారిపోయింది.
     దాని తర్వాత  నాకు మూడు దశాబ్దాలకు పైగా మిత్రులు అయిన కందాళం రామానుజాచారి గారు, అమెరికా లోనే న్యూజెర్సీ రాష్ట్రంలోనే ఉంటారాయన. కెమిస్త్రీ ప్రొఫెసర్. వారు కూడా 2004 లో ఈ సంస్థలో చేరడం జరిగింది . వారు కుడా ఈ సంస్థలో చేరిన అనంతరం ఈ సంస్థను అజో - విభొ- కందాళం ఫౌండేషన్ గా మార్చడం జరిగింది.

అ.తె : తెలుగుభాషకు చెందిన ప్రముఖుల్లోఆయా రంగంలో సేవచేసిన గొప్ప గొప్ప కళాకారులని   ఏవిధంగా గుర్తించడం జరుగుతుంది..? దాని వెనుకున్న కృషి గురించి చెబుతారా..??
 అ.స :  ఏం లేదండి..!  ఈ.. ఒక సంవత్సరం కార్యక్రమం అయిన వెంటనే తదుపరి సంవత్సరం ఎక్కడ చేయాలో అనే విషయాన్ని గుర్తిస్తాం.. 22 ఏళ్ళుగా చేస్తున్నం కాబట్టి కొంత మార్గం సుగమమైందనే చెప్పాలి.. ఉదాహరణకు వచ్చే సంవత్సరం ఎక్కడ చేయాలి అన్నదానికి  ఇప్పటికే మా ప్రాంతంలో చేయండని మూడు ప్రాంతాల వారి నుంచి మాకు ఆఫర్స్ ఉన్నాయి. ఈ మూడింటిలో.. మరో మూడు నాలుగు నెలల్లో ఒక ప్రదేశాన్ని అనగా కార్యక్రమం నిర్వహించడానికి ఎనిమిది నెలల ముందుగానే కార్యక్రమ నిర్వహణా ప్రాంతం నిర్ణయం జరుగుతుంది. ఒకొక్క సంవత్సరం ఒకొక్క ఊర్లో చేయాలి అనే దానికి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ఆయా ప్రాంతాలకు చెందిన ప్రముఖులను సత్కరించాలి, ఆయా ప్రాంతాలకు చెందిన వారిని గుర్తించాలనేది ముఖ్యోద్దేశ్యం. కాబట్టి ఎనిమిది నెలల ముందు ఒక ప్రాంతాన్ని మనం నిర్ణయించిన తర్వాత, ఆ జిల్లా కాని, లేదా ఆ ప్రక్క జిల్లా కాని , సాధారణం గా మేము నిర్ణయించడానికి  ఆ ప్రాంతాలోని మా మిత్రులు తమ ప్రాంతాల్లోని ఎవరెవరు.. ఏయే పురస్కారానికి అర్హులు, అనే విషయంపై ఒక లిస్ట్ తయారు చేయడం జరుగుతుంటుంది.
    అనేక మంది మిత్రులు జాబుల ద్వారానో, ఫోనుల ద్వారానో , ఈ మెయిళ్ళ ద్వారానో మాకు తెలియజేస్తారు. ప్రతిభా మూర్తి పురస్కారం అనేది పెద్ద పురస్కారం అది లక్షరూపాయల అవార్డు పురస్కారం.. దానికో లిస్ట్ తయారౌతుంది. అలాగే ఈ సాహిత్య పురస్కారాలకీ పెద్దలిస్ట్ తయారౌతుంది.. అక్కడ నుంచి నడిచిన తర్వాత, షార్ట్ లిస్ట్ తయారౌతుంది. తర్వాత కమిటీ ఏర్పాటు చేస్తాం.. ఆ కమిటీ ఆయా రంగంలోని కమిటీ ల్లో ని సభ్యులు చివరకు పైకి మూడు పేర్లో ఎన్నో తీస్తారు.. దానిమీద తర్జన భర్జనలు జరిగాక పురస్కార గ్రహీతను పేర్లు నిర్ణయం జరుగుతుంటుంది. ఇదీ ఈ ప్రాసెస్ . అనేక కోణాల నుంచి ప్రతిభామూర్తి  కాని, మిగతా సాహితీ పురస్కారాలు కానీ , ఏ ప్రాంతంలో చేస్తున్నాం ఎవరికి చేస్తున్నాం అనే నిర్ణయం జరిగే పద్దతి.

అ.తె: అజో విభో కందాళం ఫౌండేషన్ నుంచి ప్రతిభామూర్తి పురస్కారం అందుకున్న వారెవరో ఎటువంటి రంగం వారున్నారో చెబుతారా?? 
అ.స :  ఇప్పటి వరకూ మీరే చెప్పారు. 22 పురస్కారాలందించామండి.  నాటక రంగంలో చాలా కాలం క్రితం 1995 లో పీసపాటి నరసింహమూర్తిగారికిచ్చాము, కథారంగంలో మధురాంతకం రాజారాం గారికిచ్చాము, నవలా రంగంలో మహీధర రామమోహనరావుగారికిచ్చాము. పత్రికారంగంలో నండూరి రామమోహనరావు గారికిచ్చాము. లలిత సంగీతంలో రావుల బాలసరస్వతి దేవి గారికి ఇచ్చాము. అలాగే వచన కవితలో పట్టాభి గారికిచ్చాము, సంగీత సాహిత్యాలలో బాలాంత్రపు రజనీకాంతారావు గారికిచ్చాం.చరిత్ర- సాహిత్య విమర్శలో కొర్లపాటి శ్రీరామమూర్తి గారికిచ్చాము, సామాజిక సేవలో  పివి నరసింహరావు గారికి, సామాజిక వైద్యసేవలో కాకర్ల సుబ్బారావు గారికి, సామాజిక విద్యాసేవలో   చింతలపాటి మూర్తిరాజుగారికి,
 జానపద సాహిత్యంలో బిరుదరాజు రామరాజుగారికి, ఆధ్యాత్మిక రంగంలో ధూళిపాళ సీతారామశాస్త్రి గారికిసంస్కృతం సాహిత్యం లో పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి, సాహిత్య సేవలో కేతు విశ్వనాథరెడ్డి గారికి, నవలాసాహిత్యంలో ధాశరథి రంగాచార్య గారికి, మహిళాభ్యుదయంలో అబ్బూరి చాయాదేవి గారికి , తెలుగునాటకం కి సంబంధించి గొల్లపూడి మారుతీరావు గారికి, కథానిక లో  పెద్ధిబొట్ల సుబ్బరామయ్య గారికి, కథానిక లో కొలకలూరి ఇనాక్ గారికి, నాటక రంగంలో రావి కొండలరావు గారికి , నాట్యావధానం లో ఒంగోలు వాసి ధారారామనాధశాస్త్రి గారికి ఇవ్వడం జరిగింది.

అ.తె : తెలుగువారై యుండి, విదేశాలలో స్థిరపడితెలుగు భాషాసేవలో మీరెంచుకున్న మార్గం నాటకరంగం గా కనబడుతుంది. దీనినే ఎంచుకోవండంలో ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా,,? 
 అ.స :   అంటే మేము నాటకరంగాన్ని కూడా సాహిత్యంలో ఒక భాగం గానే చూస్తాం కానీ, సాహిత్యేతరమైనట్లుగా మేం చూడం. నాటకం అనేటటువంటిది సాహిత్యంలో ప్రధానమైన భాగం.  ఇవ్వాళ ఆంధ్రదేశంలో నాటక రంగంలోని వారందరికీ తెలుసు.. ఇక్కడ నాటక రంగ స్థితిగతులు అంత గొప్పగా లేవు. 
       ఇప్పుడు సాహిత్య ప్రక్రియల్లో .. ఇప్పుడొక కథానిక తీసుకుంటే ఉచ్చ స్థితిలో, చాలా గొప్పగా కథానిక  తెలుగు సాహిత్యం గర్వించే స్థాయిలో ఉంది. అదేరకంగా కొన్ని కొన్ని, నవల కానివ్వండి, పద్యరచన  కానివ్వండి, ఇటువంటి వన్నీ తెలుగు సాహిత్యంలో గొప్పస్థానాన్ని పొంది చాలా   మంచి స్థితిలో ఉన్నాయని నేను నమ్ముతాను. నాటకరంగం పరిస్థితి అలా ఉందని, నేను కాని నాటక రంగంలోని చాలా మంది మిత్రులు కూడా భావిస్తారు. కాబట్టి నాటకానికి ఏదైనా చేయాలి , కొత్త నాటికలు రావాలి,అనే ఉద్దేశ్యంతో కొన్ని ప్రయోగాలు  చేస్తూ పోతూ ఉన్నాము. కొత్తనాటికలు రావాలనే ప్రధాన కారణం తో.. మేమేం చేశామంటేమొట్టమొదట  ప్రతి సంవత్సరం కూడా కొత్తనాటికల పోటీ ప్రదర్శన పెట్టాలనే  ఉద్దేశ్యం మాకు 18 ఏళ్ళ క్రితం కలిగింది. 22 సంవత్సరాలుగా మేము పరిషత్తులు నిర్వహిస్తున్నప్పటికీ గత పద్దెనిమిదేళ్ళుగా కొత్తనాటిక పోటీలు, నాటికలు రాయాలి, ఆ నాటికల్లో సెలెక్ట్ అయిన నాటికలను పుస్తక రూపంలో తేవాలి, ఇటువంటి ప్రక్రియలతోటి మేము నాటక రంగానికి మాచేతనైనంత ప్రోత్సాహం ఇవ్వటం జరుగుతోంది.

అ.తె :  ఇతర భాషల వ్యామోహం వల్ల తెలుగుకు ప్రమాదం ఉందంటారా..? ఒక తెలుగు వారిగా తెలుగు ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు? 
అ.స :  ఇప్పుడు భాషలు ఎన్ని వస్తే అంత మంచిది. పరభాష.. ఇంగ్లీషు నేర్చుకోవద్దని ఎవ్వరూ చెప్పడం లేదు. ముందు మనిషికి వృత్తి చాలా ప్రధానమైనది, జీవనం చాలా ప్రధానమైనది. జీవనం కోసం అవసరమైన పనులు చేయడం అన్నడి చాలా ప్రధానమైనది. ఆ తర్వాతనే మిగతావన్నీ వస్తాయి. అయితే ఇంగ్లీషు నేర్చుకుంటూనే,... తెలుగు భాషను కాని, మాతృభాషను కానీ మర్చిపోవటం అనేది మంచి పరిస్థితి కాదు. కాబట్టి మన భాషను మరచిపోకుండా వాళ్లెన్ని భాషలు నేర్చుకుంటే అంత ఉపయోగకరం గా ఉండాలి అంతకు మించి ప్రస్తుతం నేను చెప్పడానికి ఏమీలేదు. కానీ భాషతెలుగుభాష పోతుందని చాలామంది అనుకోవటం,సరైన అభిప్రాయం కాదనేది నా ఉద్దేశ్యం. ఎందుకంటే సమాజం అనేది నిత్య చైతన్యవంతమైనది. సమాజానికి ఏది కావాలో అది ఉంటుంది. మన భాషా.. మన సాహిత్యం మంచి స్థాయిలో ఉన్నాయి కాబట్టి మన భాష అంత త్వరగా నశించేది కాదనేది నా అభిప్రాయం.

 అ.తె :  ఇంత ఓపికగా మీ అమూల్యమైన సమయాన్ని మా అచ్చంగా తెలుగు పాఠకులకోసం కేటాయించి మీ విలువైన అభిప్రాయలు పంచుకున్నందుకు అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రిక తరఫున మీకు కృతజ్ఞతలండీ.. ధన్యవాదాలు.
వీరితో మా ముఖాముఖిని క్రింది లింక్ లో వినండి...

No comments:

Post a Comment

Pages