రుద్రదండం -9
- రాజ కార్తీక్
(జరిగిన కధ : పార్వతికి తంత్ర విద్య నేర్పుతుండగా ఆమె పరాకును గమనించిన శివుడు, కోపించి, తన చేతిలో ఉన్న రుద్ర దండాన్ని విసిరివేస్తాడు. అది ముక్కలై జంబూద్వీపంలో అనేకచోట్ల పడుతుంది. అవన్నీ దక్కించుకుని, జోడించిన వాడు శివుడే అవుతాడు. రుద్రదండం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కపాలుడు. కాశీ నగరంలోని శివాలయంలో రుద్రదండాన్ని సాధించబోయే కారణ జన్ముడు పుడతాడు… ఆ సమయంలో అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు ఒక ఒంటి కన్ను రాక్షసుడు… ఆ రాక్షసుడిని బారి నుంచి రాజకుటుంబాన్ని, ప్రజల్ని రక్షిస్తాడు విష్ణునంది అనే ముని. బాలుడికి రుద్రసేన కార్తికేయుడు అని పేరు పెడతారు... ఇక చదవండి...) మార్తాండుడి స్థావరం .... ” నా కల నిజము కాబోతుంది, రుద్రదండం కోసం ఉద్భవించాడు వీరుడు. అతగాడ్ని నా వలలో చిక్కుకునేటట్లు చేయాలి. అప్పుడు నా పథకం అమలు జరుపుకోవచ్చు” అని నవ్వసాగాడు. “అచ్చటకు వెళ్ళి రుద్రదండం కైవసం చేసుకోవచ్చు, రుద్రదండం శివుడు విరిచింది నాకోసం. ఈ రుద్రగణ సంభవుడు పుట్టింది నా సేవ చేయడం కోసం” అని మరొక్కమారు బిగ్గరగా నవ్వి, తన మాయాదర్పణం దగ్గరకి వెళ్ళి దాన్ని తెరిచి, ఏవో మంత్రాలు చదివాడు, దాంతో ఆ దర్పణంలో “కాశీనగరంలో రాజకుమారుని జననం, రాక్షసుడి పోరాటం, బాలుడు జన్మించటం, జటాజటాలతో విభూదిరేఖలతో ఉండటం. ఆ బాలున్ని విష్ణునంది కాపాడటం, రాజ్యానికి రావటం, ఆ బాలుడికి “ రుద్రసేన కార్తికేయుడు “ అని నామకరణం చేయటం ‘రుద్ర’ అని పిలవమనటం “ మొత్తం చూశాడు మార్తాండుడు. ఏదో పథకం వేసినట్లుగా ఒక చోట కూర్చొని శుద్రమాతకి మ్రొక్కాడు. డింభకుడు మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి “గురుదేవ, ఈ పానీయమే మీరు అడిగింది” అని ఇవ్వసాగారు. కానీ మార్తాండుడు మౌనంగా పథకం యోచిస్తున్నాడు. “గురుదేవా” అని మరోసారి బిగ్గరగా పిలిచాడు. మాంత్రికుడి మొహంలో ఒక నవ్వు కనబడింది. డింభకుడి చేతిలో ఉన్న పానీయం తీసుకొని దాన్ని ఒక్కసారిగా మొత్తం తాగాడు. “డింభకా! శివుడికి నంది, విష్ణువుకి గరుడపక్షి, బ్రహ్మకి హంస, ఎలానో నీవు నాకు అలారా, నేను భగవంతుడ్ని అయిన వెంటనే నీకు నా వాహన స్థానం కల్పిస్తా, నన్ను నమ్మి నా సేవలు చేసిన నాకు నా భక్తుల చేత పూజలు చేయిస్తా” అన్నాడు. డింభకుడు – “ప్రభూ! అంటే రుద్రదండం మీ చేతికి వచ్చేసిందా?”. వచ్చేసిందిరా .. వచ్చేసింది. దాదాపుగా, ఇక ఆ బాలుడు పెరిగి పెద్దవాడు అవ్వటం, వాడ్ని పంపించటమే మిగిలింది. ఈ లోపల ఆ రుద్రదండం ఎన్ని ముక్కలయ్యింది, ఎక్కడ పడింది అని తెలుసుకోవాలిరా. అంతలో అక్కడ ఉన్నట్లు ఉండి ఒక మెరుపు మెరిసింది. వెనక్కి తిరిగి చూశారు మార్తాండ డింభకులు- శుద్రవాణి వినిపిస్తుంది “మార్తాండా, నీకొక శుభవార్త. రుద్రదండ సాధనంలో ఒక వింత దాగి ఉంది. ఒక్కొక్క ముక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మరొక రుద్రదండం ముక్క ఎక్కడ ఉందో తెలుస్తుంది.. అంటే నీవు పగిలిపోయిన అస్థిపంజరాలలో ఒక్క ముక్క కనపడితే చాలు, మిగితావి ఎక్కడ ఉన్నాయో అవే చెపుతాయి వాటి దారి “ అని ఆగింది. “ధన్యోస్మి శుద్రమాతా” ఎంత మంచి మాట, “మాతా, ధన్యోస్మి, నీకు నా వేల నమస్కారాలు”.. శుద్రవాణి “మార్తాండ, యుక్తితో ప్రవర్తించు, బుద్ధి బలం, మాత్రమే నీకు ముఖ్యం.. అది గుర్తుంచుకో, పోరాటంలో ఆ రుద్రుడిని నీవు ఏమి చేయలేవు, అతనికి దైవభక్తి పుష్కలంగా ఉంది అతన్ని నీవు ఏమిచేయాలి అని చూసినా , ఏమి చేయలేవు. అది గుర్తుంచుకో, గురికి బాణం తగిలేలా ప్రయోగించి, నీ వేల సంవత్సరాల తపస్సు కోరిక నెరవేరుతుంది. నీవు దేవుడివి అవుతావు, “అవును మాతా నీవు చెప్పింది నిజమే నేను దేవుణ్ణి అయినా, నిన్ను పూజించడం మానను, బుద్ధిబలాన్ని ఆయుధంగా పెట్టుకొని పన్నాగం రచించాను” అని శుద్రమాత కి విన్నవించుకున్నాడు. డింభకా, చూశావురా నా గొప్పతనం, ఈ ప్రపంచంలో భగవంతుడ్ని అవ్వబోతున్న మనిషిని నేను పరమాత్మకు పోటి నేనే. ఇక నన్ను నమ్మిన భక్తులకు ఏమి ఇబ్బంది ఉండదు, అర్హత, కర్మ, ఋణం లేకుండా వారి కోరికలను నేను నెరవేరుస్తా. వారందరూ భోళామార్తాండుడు అని నామీద స్తోత్రాలు చేయవలె, ఇక నాకు ఎదురులేదు. రుద్రదండం ఒక్కటే నాకు కనబడుతుంది హాహాహా ,,, వస్తున్నా రుద్రసేనకార్తికేయ, తరతరాల కథానాయకుల దృక్పథం నాకోసం వాడుకుంటా” అని, డింభకుడితో , నేను భగవంతుడ్ని అయిన తరువాత, ఎటువంటి వేషధారణ ఉండాలో సలహా చెప్పు అని వెనువెంటనే, శివుడి రూపానికి మారాడు. “ ఆహా ఏమిరా ఈ వేషం ఈ విభూది ఏంటి, ఈ జటలు ఏంటి, మెడకు ఈ పాము ఏంటి, ఒంటికి విభూది, నాకు ఇది వద్దురా డింభకా, ఇలా ఉండటం శివుడికే చెల్లు, అందుకే ఆయన దేవాదిదేవుడు, తదుపరి విష్ణుమూర్తి వేషానికి మారాడు, ‘ఒరేయ్ డింభకా, విష్ణుమూర్తి వేషం బాగా ఉంది కానీ, విష్ణుమూర్తి వచ్చాడు అని అనుకుంటారు గానీ, భగవాన్ మార్తాండుడు వచ్చాడు అని అనుకోరుగా, ఇక బ్రహ్మదేవుడు అంటావా నాలుగు తలల శిరోభారం నేను భరించలేనురా.. హాహాహా “అని నవ్వసాగాడు. “డింభకా నీ సృజనాత్మకత అంతా ఉపయోగించి, నాకు ఒక మంచి వేషధారణ నిర్ధారించురా” అని ఆజ్ఞాపించాడు, దాంతో ఇద్దరూ నవ్వసాగారు. “రుద్రదండం” చేతికి రానివ్వరా, అప్పుడు చూద్దుగానీ ఈ భగవంతుడి కృపాకటాక్షాలు అని నవ్వసాగాడు. ************************** వైకుంఠం... ఏడుద్వారాలు తెరుచుకున్నాయి... కరుణమోముతో మహావిష్ణువు ఆపదమొక్కులవాడు, అర్త జననారాయణుడు, భక్తహృదయ పారాయణుడు, కమలాధరా చతుర్భుజుడు ప్రసన్నంగా, లోకమాత లక్మీదేవి పాదాలు ఒత్తుతుండగా, కనులు తెరిచి చూశాడు. లక్ష్మీ దేవి “ఓం నమో నారాయణాయ“ అని అంది. విష్ణుమూర్తి “ ఓం నమో నారాయణాయ, అని అన్న జనులు కోరుకునేది నీ అనుగ్రహమే లక్ష్మీ” అని చమత్కరించాడు. “నారాయణ, మిమ్ము తలచిన, మహాదేవుని తలచిన నేను వారి వద్దకు వెళ్తాను కదా” అని అంది, లక్మీదేవి “ప్రభూ! ఏమి ఈ మాంత్రికుడి ప్రవర్తన, మహాదేవున్ని మిమ్ము, బ్రహ్మదేవుని చమత్కరిస్తున్నాడు” అని అంది. “ఓ అదా! ఏమిటంటే పిల్లలు ఏమి చేసినా తండ్రికి కోపం రాదు కదా, కానీ వారి భవిష్యత్తు” అని అంది. విష్ణుమూర్తి “పరమేశ్వరుడు ఏమి చేసినా దానికి ఒక అర్ధం ఉంటుంది ఆయన ఏ చర్యలో అయినా కానీ, ఒక లోకకళ్యాణ రహస్యం ఇమిడి ఉంటుంది, ఎంతో జ్ఞానం ఉన్న మార్తాండుడు, మోక్షర్హత కోసం తపస్సు చేసి కూడా భగవంతుడ్నే ఎదురిద్దామనుకుంటున్నాడు. ఆ రుద్రదండం సాధనకు ప్రయత్నిస్తున్నాడు. కానీ అది సాధించిన తర్వాత.... కానీ, మార్తాండుడి జ్ఞానం ఆసన్నమవ్వదు, తన చావు తాను వెతుకుతూ వెళ్తున్నాడు,”అన్నారు. “అది ఎలా ప్రభూ” అని అడిగింది మాతలక్ష్మీదేవి. (సశేషం...)
No comments:
Post a Comment