నేరము - శిక్ష
- ఉషారాణి నూతులపాటి
“మేడం ! సారు కోసం ఎవరో పిలగాడు వచ్చిండు..” వాచ్ మాన్ రాఘవులు తలుపుబయటే నిలబడి సందేహంగా చెప్పాడు. హాల్లో టీవీ చూస్తున్న మనోజ “ఎవరు..? ఏంకావాలట..? ఉదయం రమ్మను..ఇప్పుడు బిజీ గావున్నారు.” అంది. “ గట్లనే చెప్పిన గాని ఇంటులేడు..సాన దూరంకెల్లి అచ్చిన్డంట ..ఒక్కతీరిగ బతిమిలాడుతుండు ..ఇగో..ఈడనే వున్నడు. ఇగరా ఇటు. మేడం తోని మాట్లాడు.” అనిచెప్పి రాఘవులు పక్కకు జరిగాడు. ఒకకుర్రాడు ముందుకు వచ్చి మనోజకి నమస్కారం పెట్టి ,నిలుచున్నాడు. మనోజ అతన్ని “లోపలి  రా”అని పిలిచి “ఏం కావాలి ?” అని అడిగింది. “సారు తో మాట్లాడాలి మేడం . చాలా అర్జంట్ .” అన్నాడు కొంచం ఆందోళన గా.  “ఆయన MD గారితోమాట్లాడుతున్నారు ,ఫోన్ లో..ఒక గంటపడుతుంది. అయినా ఇప్పటికే 7గం . అయింది. ఇక ఎవరితో మాట్లాడరు..రేపు ఉదయం ఆఫీసులో కలువండి .”  “మేడం..నేను ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఉదయం బస్సు లేట్ అయి 11 గం.లకి ఆఫీసుకి వెళితే నా అప్లికేషన్ తీసుకోలేదు, టైం అయిపోయిందని. నాతప్పేమీ లేదండి.బస్ చెడిపోయి , 4 గంటలు లేట్ అయింది. లేకపోతే 8 గంటలకే వచ్చేవాడిని .సాయంత్రం వరకు అక్కడే వున్నాను. కానీ తీసుకోలేదు ..” అంటూ..జేబులోనుండి ఒక కవరు తీసాడు.  “నిజమే..ఇంటర్వ్యూ అంటే ముందే రావాలి..అయినా అయిపోయాయి కదా..ఇప్పుడు చేసేది ఏమీ లేదు..మరోసారి..”  ఆమె మాట పూర్తికాకముందే.. “లేదు మేడం..ఇంకా రేపుకూడా ఉన్నాయిట. అందుకే సార్ ని కలిసి..”  అప్పుడు అతన్ని తేరిపార చూసింది మనోజ. 24,25 సం.ఉంటాయేమో.కొద్దిగా మాసిన జీన్స్ పాంటు, నలిగిన షర్టు తో వున్నాడు,ముఖంలో ఆందోళన, ఆశ..కొంచం జాలివేసింది మనోజకు. నాలుగు పోస్టులకు 60 అప్లికేషన్లు వచ్చాయని వినోద్ చెప్పారు. నిరుద్యోగం మనిషిని కృంగదీస్తుంది.కానీ వినోద్ చాలా స్ట్రిక్ట్..ఇలాంటివి ఒప్పుకోరు..  “నాకీ ఉద్యోగం చాలా అవసరం మేడం గారూ.మా నాన్నకు ఉద్యోగం లేదు, అమ్మ మొన్నటివరకు మిషను కుట్టేది. ఇప్పుడు ఆరోగ్యం బాగోవడంలేదు.ఇద్దరు చెల్లెళ్ళు ,ఒకతమ్ముడు చదువుకుంటున్నారు..ప్లీజ్ మేడం. సారు స్ట్రిక్ట్ అని చెప్పారు మేడం.కానీ మీ  డ్రైవర్ చెప్పాడు,  మిమ్మల్ని కలిస్తే ఉపయోగం ఉండవచ్చని..అందుకే వచ్చాను.” మనోజ మాట్లాడకపోయేసరికి , “ముందురోజే వద్దామనుకున్నా,కానీ  మా అమ్మకి అస్సలు బాలేక రాలేకపోయానండీ ..నా దురదృష్టం కొద్దీ బస్సు చెడిపోయింది..” అన్నాడు.  అతని మొహం చూస్తే నిజాయితీగానే చెప్తున్నాడనిపించి, ముందుకు వచ్చి  చేయిచాపి..అతని బయోడేటా కవర్ అందుకుంటూ.. “నీ పేరేంటి..?” అంది. అతను “మురళి మేడం..” అన్నాడు.  సోఫాలో కూర్చుని కవర్ ఓపెన్ చేసింది. అందులోని బయోడేటా తీసి చూసింది.ఆమె తన బయోడేటా చూస్తుంటే ఆమెనే చూస్తున్నాడు మురళి.పచ్చని ఛాయ ,ఎరుపురంగు చీర, పొడవుగా అందంగా హుందాగా వుంది. చూడగానే ఆకట్టుకునే అందం. తనతల్లి గుర్తొచ్చింది మురళికి. ఈమె వయసే ఉంటుందేమో..కానీ 20 ఏళ్ళు పెద్దదానిలా కనపడుతుంది అమ్మ అనుకున్నాడు.అప్లికేషన్ చదువుతూనే ఆమె ముఖకవళికలలో మార్పు వచ్చింది. “మీది శ్రీకాకుళమా..? మీ నాన్న...” అంటూ ఆగిపోయింది.  “అవునండీ..మాది శ్రీకాకుళం..మానాన్న పేరు సింహాచలం .ఆర్టీసీ లో చేసేవాడు.”  “ఇప్పుడు చెయ్యడంలేదా..?” ఆమె స్వరంలో మార్పు.  “సస్పెండ్ అయ్యారు మేడం.”  “ఎందుకు..?” “బాగా డ్రి౦క్ చేసేవాడు. ఓసారి తప్పుజరిగితే.. సస్పెండ్ అయ్యాడు.”  “యాక్సిడెంట్ చేసాడా..?”  అతను తలదించుకొని ,తల అడ్డంగా ఊపాడు. ఏదైనా చెప్తాడేమో అని చూసింది.చెప్పలేదు.  “సరే.ఇకనువ్వు వెళ్ళవచ్చు..రేపు ఆఫీస్ కే వెళ్ళు..ఇక్కడికి రావద్దు..” అంది విసురుగా .  “మరి సారు ..” అతని మాటను తుంచేస్తూ.. “సారు ఇప్పుడు కలవరు. చెప్పాగా..బిజీగా వున్నారు. నీ అప్లికేషన్ తీసుకునేదీ ,లేనిదీ రేపే తెలుస్తుంది.నేను అందజేస్తాను.నువ్వు వెళ్ళవచ్చు..” అనేసింది. కంఠం లో చిరాకు ,కోపం.  ఇప్పటివరకూ బాగానే మాట్లాడి,ఇంతలో ఏమైందా అనుకుని ,నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోయాడు మురళి.  అతను బయటికి వెళ్ళగానే, మరోసారి అతని రెజుమే తీసి చూసింది. ముఖం ఎర్ర బడింది.,చేతులూ,పెదవులూ వణుకుతూ..కళ్ళలో నీరు తిరిగింది. మనసంతా చేదేక్కినట్టుగా అయిపొయింది. సోఫాలో వెనక్కు జేరబడి ,తల వెనుకకు ఆనించి ,కళ్ళుమూసుకుంది. చేదు జ్ఞాపకపు తెర కళ్ళముందు నిలిచింది. 22 ఏళ్ళక్రితం జరిగినా..ఏదీ మర్చిపోలేదు తను..ఎలా మర్చిపోగలదు..? అన్నయ్య స్టేట్ బాంక్ లో ఆఫీసర్,వైజాగ్ లో పోస్టింగ్. పెళ్ళయి ఒక సం.అయింది.అరకు ,సింహాచలం,అన్నవరం చూడొచ్చు  రమ్మని పిలుస్తున్నాడు. ఇద్దరు పిల్లలతో,అందునా 5 నెలల పసివాడితో వెళ్ళాలంటే భయ౦. వినోద్ ఎప్పుడూ బిజీనే..ఎప్పుడు వెళ్దామన్నా ఎదో అడ్డంకి..మీటింగులనీ, ఇంటర్వ్యూ లనీ..ఏదో చెప్తాడు.మిర్యాలగూడెం దాటి ఒక మారుమూల పల్లెలో,పెద్ద సిమెంట్ ఇండస్ట్రీలో పర్సనల్ ఆఫీసర్ గా చేస్తున్నాడు అప్పుడు.అక్కడే క్వార్టర్స్ ,పిల్లలకి స్కూల్ అన్ని వసతులతో ఉండేవి. అన్నయ్య వైజాగ్ లో చేరినప్పటినుండీ పిలుస్తూనే వున్నాడు.ఇప్పుడు వదినకూడా వచ్చింది .  అమ్మ “మీవారికి తీరకపోతే మనం వెళ్దాం లే. విరజ కూడా వస్తుంది. పిల్లల్ని గురించి భయం ఎందుకు..? బయలుదేరు ..” అంటూ బయలుదేరదీసింది.  ఏకళ నున్నాడో..వినోద్ కూడా ఒప్పుకున్నాడు .పిల్లల గురించి వంద జాగ్రత్తలు చెప్పి. అలా అమ్మా,తనూ,చెల్లి విరజా బయలుదేరారు.అమ్మ ఆరోజంతా అన్నయ్యకు ఇష్టమని పల్లీ మిఠాయి,కజ్జికాయలు, మురుకులూ,చెక్కలూ,చేగోడీలూ,గవ్
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment