నేరము - శిక్ష - అచ్చంగా తెలుగు
  నేరము - శిక్ష
- ఉషారాణి నూతులపాటి

“మేడం ! సారు కోసం ఎవరో పిలగాడు వచ్చిండు..” వాచ్ మాన్ రాఘవులు తలుపుబయటే నిలబడి సందేహంగా చెప్పాడు. హాల్లో టీవీ చూస్తున్న మనోజ “ఎవరు..? ఏంకావాలట..? ఉదయం రమ్మను..ఇప్పుడు బిజీ గావున్నారు.” అంది. “ గట్లనే చెప్పిన గాని ఇంటులేడు..సాన దూరంకెల్లి అచ్చిన్డంట ..ఒక్కతీరిగ బతిమిలాడుతుండు ..ఇగో..ఈడనే వున్నడు. ఇగరా ఇటు. మేడం తోని మాట్లాడు.” అనిచెప్పి రాఘవులు పక్కకు జరిగాడు. ఒకకుర్రాడు ముందుకు వచ్చి మనోజకి నమస్కారం పెట్టి ,నిలుచున్నాడు. మనోజ అతన్ని “లోపలి  రా”అని పిలిచి “ఏం కావాలి ?” అని అడిగింది. “సారు తో మాట్లాడాలి మేడం . చాలా అర్జంట్ .” అన్నాడు కొంచం ఆందోళన గా. “ఆయన MD గారితోమాట్లాడుతున్నారు ,ఫోన్ లో..ఒక గంటపడుతుంది. అయినా ఇప్పటికే 7గం . అయింది. ఇక ఎవరితో మాట్లాడరు..రేపు ఉదయం ఆఫీసులో కలువండి .” “మేడం..నేను ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఉదయం బస్సు లేట్ అయి 11 గం.లకి ఆఫీసుకి వెళితే నా అప్లికేషన్ తీసుకోలేదు, టైం అయిపోయిందని. నాతప్పేమీ లేదండి.బస్ చెడిపోయి , 4 గంటలు లేట్ అయింది. లేకపోతే 8 గంటలకే వచ్చేవాడిని .సాయంత్రం వరకు అక్కడే వున్నాను. కానీ తీసుకోలేదు ..” అంటూ..జేబులోనుండి ఒక కవరు తీసాడు. “నిజమే..ఇంటర్వ్యూ అంటే ముందే రావాలి..అయినా అయిపోయాయి కదా..ఇప్పుడు చేసేది ఏమీ లేదు..మరోసారి..” ఆమె మాట పూర్తికాకముందే.. “లేదు మేడం..ఇంకా రేపుకూడా ఉన్నాయిట. అందుకే సార్ ని కలిసి..” అప్పుడు అతన్ని తేరిపార చూసింది మనోజ. 24,25 సం.ఉంటాయేమో.కొద్దిగా మాసిన జీన్స్ పాంటు, నలిగిన షర్టు తో వున్నాడు,ముఖంలో ఆందోళన, ఆశ..కొంచం జాలివేసింది మనోజకు. నాలుగు పోస్టులకు 60 అప్లికేషన్లు వచ్చాయని వినోద్ చెప్పారు. నిరుద్యోగం మనిషిని కృంగదీస్తుంది.కానీ వినోద్ చాలా స్ట్రిక్ట్..ఇలాంటివి ఒప్పుకోరు.. “నాకీ ఉద్యోగం చాలా అవసరం మేడం గారూ.మా నాన్నకు ఉద్యోగం లేదు, అమ్మ మొన్నటివరకు మిషను కుట్టేది. ఇప్పుడు ఆరోగ్యం బాగోవడంలేదు.ఇద్దరు చెల్లెళ్ళు ,ఒకతమ్ముడు చదువుకుంటున్నారు..ప్లీజ్ మేడం. సారు స్ట్రిక్ట్ అని చెప్పారు మేడం.కానీ మీ  డ్రైవర్ చెప్పాడు,  మిమ్మల్ని కలిస్తే ఉపయోగం ఉండవచ్చని..అందుకే వచ్చాను.” మనోజ మాట్లాడకపోయేసరికి , “ముందురోజే వద్దామనుకున్నా,కానీ  మా అమ్మకి అస్సలు బాలేక రాలేకపోయానండీ ..నా దురదృష్టం కొద్దీ బస్సు చెడిపోయింది..” అన్నాడు. అతని మొహం చూస్తే నిజాయితీగానే చెప్తున్నాడనిపించి, ముందుకు వచ్చి చేయిచాపి..అతని బయోడేటా కవర్ అందుకుంటూ.. “నీ పేరేంటి..?” అంది. అతను “మురళి మేడం..” అన్నాడు. సోఫాలో కూర్చుని కవర్ ఓపెన్ చేసింది. అందులోని బయోడేటా తీసి చూసింది.ఆమె తన బయోడేటా చూస్తుంటే ఆమెనే చూస్తున్నాడు మురళి.పచ్చని ఛాయ ,ఎరుపురంగు చీర, పొడవుగా అందంగా హుందాగా వుంది. చూడగానే ఆకట్టుకునే అందం. తనతల్లి గుర్తొచ్చింది మురళికి. ఈమె వయసే ఉంటుందేమో..కానీ 20 ఏళ్ళు పెద్దదానిలా కనపడుతుంది అమ్మ అనుకున్నాడు.అప్లికేషన్ చదువుతూనే ఆమె ముఖకవళికలలో మార్పు వచ్చింది. “మీది శ్రీకాకుళమా..? మీ నాన్న...” అంటూ ఆగిపోయింది. “అవునండీ..మాది శ్రీకాకుళం..మానాన్న పేరు సింహాచలం .ఆర్టీసీ లో చేసేవాడు.” “ఇప్పుడు చెయ్యడంలేదా..?” ఆమె స్వరంలో మార్పు. “సస్పెండ్ అయ్యారు మేడం.” “ఎందుకు..?” “బాగా డ్రి౦క్ చేసేవాడు. ఓసారి తప్పుజరిగితే.. సస్పెండ్ అయ్యాడు.” “యాక్సిడెంట్ చేసాడా..?” అతను తలదించుకొని ,తల అడ్డంగా ఊపాడు. ఏదైనా చెప్తాడేమో అని చూసింది.చెప్పలేదు. “సరే.ఇకనువ్వు వెళ్ళవచ్చు..రేపు ఆఫీస్ కే వెళ్ళు..ఇక్కడికి రావద్దు..” అంది విసురుగా . “మరి సారు ..” అతని మాటను తుంచేస్తూ.. “సారు ఇప్పుడు కలవరు. చెప్పాగా..బిజీగా వున్నారు. నీ అప్లికేషన్ తీసుకునేదీ ,లేనిదీ రేపే తెలుస్తుంది.నేను అందజేస్తాను.నువ్వు వెళ్ళవచ్చు..” అనేసింది. కంఠం లో చిరాకు ,కోపం. ఇప్పటివరకూ బాగానే మాట్లాడి,ఇంతలో ఏమైందా అనుకుని ,నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోయాడు మురళి. అతను బయటికి వెళ్ళగానే, మరోసారి అతని రెజుమే తీసి చూసింది. ముఖం ఎర్ర బడింది.,చేతులూ,పెదవులూ వణుకుతూ..కళ్ళలో నీరు తిరిగింది. మనసంతా చేదేక్కినట్టుగా అయిపొయింది. సోఫాలో వెనక్కు జేరబడి ,తల వెనుకకు ఆనించి ,కళ్ళుమూసుకుంది. చేదు జ్ఞాపకపు తెర కళ్ళముందు నిలిచింది. 22 ఏళ్ళక్రితం జరిగినా..ఏదీ మర్చిపోలేదు తను..ఎలా మర్చిపోగలదు..? అన్నయ్య స్టేట్ బాంక్ లో ఆఫీసర్,వైజాగ్ లో పోస్టింగ్. పెళ్ళయి ఒక సం.అయింది.అరకు ,సింహాచలం,అన్నవరం చూడొచ్చు  రమ్మని పిలుస్తున్నాడు. ఇద్దరు పిల్లలతో,అందునా 5 నెలల పసివాడితో వెళ్ళాలంటే భయ౦. వినోద్ ఎప్పుడూ బిజీనే..ఎప్పుడు వెళ్దామన్నా ఎదో అడ్డంకి..మీటింగులనీ, ఇంటర్వ్యూ లనీ..ఏదో చెప్తాడు.మిర్యాలగూడెం దాటి ఒక మారుమూల పల్లెలో,పెద్ద సిమెంట్ ఇండస్ట్రీలో పర్సనల్ ఆఫీసర్ గా చేస్తున్నాడు అప్పుడు.అక్కడే క్వార్టర్స్ ,పిల్లలకి స్కూల్ అన్ని వసతులతో ఉండేవి. అన్నయ్య వైజాగ్ లో చేరినప్పటినుండీ పిలుస్తూనే వున్నాడు.ఇప్పుడు వదినకూడా వచ్చింది .  అమ్మ “మీవారికి తీరకపోతే మనం వెళ్దాం లే. విరజ కూడా వస్తుంది. పిల్లల్ని గురించి భయం ఎందుకు..? బయలుదేరు ..” అంటూ బయలుదేరదీసింది. ఏకళ నున్నాడో..వినోద్ కూడా ఒప్పుకున్నాడు .పిల్లల గురించి వంద జాగ్రత్తలు చెప్పి. అలా అమ్మా,తనూ,చెల్లి విరజా బయలుదేరారు.అమ్మ ఆరోజంతా అన్నయ్యకు ఇష్టమని పల్లీ మిఠాయి,కజ్జికాయలు, మురుకులూ,చెక్కలూ,చేగోడీలూ,గవ్వలూ చేస్తూనేవుంది. అమ్మకి సాయంగా తనూ చేసింది. ఆరాత్రి తమ్ముడు ,వాడి ఫ్రెండ్ వచ్చి బస్ ఎక్కించారు. వైజాగ్ లో అన్నయ్య స్టేషన్ కి వస్తాడు.ఎన్నాళ్ళ తరువాతో దూరప్రయాణం , పిల్లలు,లగేజీ ..అలసట,తెలియని ఆందోళన.  తమవూరినుండి వైజాగ్ 10 గంటల ప్రయాణం. ఎక్స్ ప్రెస్ బస్సులే ఉండేవి అప్పట్లో. అందుకే ముందు సీట్లో కూర్చుంది మనోజ.కాళ్ళుచాపుకునే వీలు వుంటుంది.వళ్ళో చంటివాడు.పక్కన నాలుగేళ్ల పాప . వెనక సీట్లో అమ్మ,చెల్లి కూర్చున్నారు. ప్రయాణం మొదలైంది. బాగా అలసిపోయి నిద్ర ముంచుకొస్తోంది. చంటివాడి లాక్టోజన్,పాలసీసాలు,వేడినీళ్ళ ఫ్లాస్క్ అన్నీ,బేబీ బాగ్ లో సర్ది , కాళ్ళదగ్గర పెట్టుకుంది.పాప కూడా వళ్ళో నే పడుకుంది. మధ్యలో ఎదో స్టేషన్లో అమ్మ టాయిలెట్ కి వెళ్దామంటే బాబుని చెల్లికి ఇచ్చి ,అమ్మతో బస్ దిగింది మనోజ. కాసేపు అలా నడిస్తే కాళ్ళు నొప్పిలేకుండా ఉంటాయని.బస్ ముందు తిరుగుతున్న మనోజను చూసాడు డ్రైవర్. లైట్లకాంతి లో ,మరింత అందంగా ,మెరిసిపోతోంది. బస్ బయలుదేరుతున్నట్టు హారన్ కొట్టాడు.తల్లితో ,గబగబా బస్ వద్దకు వచ్చింది మనోజ. మెట్టుమీద కాలుపెడుతుంటే , ఆమె భుజాన్ని రాసుకుంటూ,కిందికి దిగాడు డ్రైవర్. సారాయివాసన గుప్పుమంది. అతనలా దిగి మళ్ళీ వె౦టనే, ఆమెను రాసుకుంటూ నిలబడి బస్ ఎక్కాడు. కంపరం పుట్టినట్టు అయింది మనోజకు. బస్ మళ్ళీ బయలుదేరింది. చల్లగాలికి,అలసటగా వున్న శరీరం నిద్రను ఆశ్రయిస్తుంది. బస్ లో అందరూ,నిద్రలో వున్నారు.లైట్లు మొత్తం తీసేసారు. గాఢ నిద్రలో వున్న మనోజకు కాలుమీద ఏదో పాకినట్టు అయింది. చటుక్కున కళ్ళు తెరిచింది. కాళ్ళదగ్గర చూసింది.ఏమీలేదు. కాసేపు చూసినా చీకట్లో ఏమీ కనపడలేదు.మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. మళ్ళీ కాళ్ళమీద చీర పైకి జరుగుతూ..ఏదో గీరినట్టుగా , పాకినట్టుగా.. ఉలిక్కిపడి మళ్ళీ చూసింది.పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. పక్కసీట్లో ఇద్దరు భార్యాభర్తలు,,వాళ్ళూ నిద్రలో వున్నారు. ఏం జరుగుతోంది..? గుండె వేగంగా కొట్టుకుంటోంది. అరగంట గడవగానే కళ్ళు మూసుకుంటున్నాయి..మళ్ళీ చీర మొకాలివరకూ జరిగింది.  చీకటిలో కళ్ళు  చిట్లించి చూసింది. అది డ్రైవర్ చెయ్యి. వాడు ఒకచేత్తో డ్రైవ్ చేస్తూ, రెండో చెయ్యి సీటు వెనకనుండి తనకాలు అందుకుంటున్నాడు.ముందుసీటు బాగా దగ్గరగా అందుతోంది వాడికి అందులో తన కాళ్ళు పొడవు. వళ్ళు చల్లబడి ,భయంతో నాలుక పిడచకట్టుకుపోయింది మనోజకి. మంచినీళ్ళు తాగడానికి కూడా భయమే. అమ్మని పిలిద్దామన్నా భయమే. అసలు ఏమని చెప్పాలి,,? చెప్పినా వాడు ఒప్పుకోడు. నేను డ్రైవ్ చేస్తున్నా..నేను ఎలా పట్టుకుంటాను అంటాడు.. భయం తో నిద్ర ఎగిరిపోయింది మనోజకి. వాడు మనోజ అవస్తచూసి..మరికాస్త వెనక్కువంగి కాళ్ళమీద చెయ్యివేస్తున్నాడు.ఒకపక్క పాపనిద్రపోతోంది. జరగలేదు. అరిస్తే చేయ్యితీసేస్తాడు. అప్పుడు ఏమని చెప్తుంది..? వాడు ఇంకా చెయ్యి జాపి వడిలో చేయ్యివెయ్యబోయాడు. మనోజ చేయ్యితోసేసింది.ఆమె చెయ్యి గట్టిగా నొక్కాడు. అసహ్యంతో రగిలిపోయింది. లేదు ఏదైనా చెయ్యాలి.వీడిని ఇలా వదలకూడదు..అనుకుంది. మనోజ కదలకుండా వుండటంచూసి,మళ్ళీ చెయ్యి వెనక్కుపెట్టాడు.పిన్నీసు తో గుచ్చి౦ది. వాడు చేయి గట్టిగా విదిలించాడు..పిన్నీసు కిందపడింది. ఎలా..? చీకటి,కనపడదు..వళ్ళో పిల్లవాడు.భయంతో ఏడుపు వస్తోంది. వాడి చేయి మళ్ళీ పాములాగా తన మోకాళ్లమీద..చీర జరుపుతున్నాడు..ఎంత ధైర్యం వెధవకి..మనోజకి పిచ్చిధైర్యం వచ్చింది. వాడిచేయి గట్టిగాపట్టుకుని వెనక్కు విరిచి మెలిపెట్టింది. ఊహించని సంఘటనకి వాడు పెనుగులాడి ,చెయ్యివదిలించుకోలేక గట్టిగా అరిచాడు.బస్సు స్టీరింగ్ అటూ,ఇటూ తిరగడం,బస్సు కంట్రోల్ లేకపోవడంతో  ..రోడ్డు దిగింది. కానీ బ్రేక్ వేసి ఆపాడు. బస్సు కీచు శబ్దంతో ,పెద్దకుదుపుతో ఆగిపోయింది . డ్రైవర్  నొప్పితో గట్టిగా అరుస్తున్నాడు.వదులూ అని..బస్సులో లైట్లు వెలిగాయి. అందరూ భయంతో లేచారు..ఏమైంది అంటూ ము౦దుకు వచ్చారు. డ్రైవర్ చెయ్యి ఇంకా మనోజ చేతిలోనే వుంది. కండక్టర్..ఏమైందీ అంటున్నాడు..మనోజ తల్లి ముందుకు వచ్చింది. బాబును తీసుకోమని సైగచేసి. “వీడు..వీడు..వెనక చెయ్యిపెట్టి ,నాకాళ్ళ మీద ..” అంటూ..గట్టిగా ఏడ్చింది. అందరూ నిశ్చేష్టులయ్యారు. కండక్టరు,మరో ఇద్దరు ప్రయాణికులకు చూపించి అప్పుడు డ్రైవర్ చెయ్యి వదిలింది. తల్లినిపట్టుకుని ఏడుస్తూ, “అమ్మా  వీడు 2 గంటలనుండీ నరకం చూపిస్తున్నాడు.భయంతో చచ్చిపోయాను..వాడుచేసింది అందరికీ చూపించాలనే ఇలాచేసాను..” అంది మనోజ. “భలేవారండీ..మీరు చెయ్యిపట్టుకుంటే బస్సు దేనికైనా గుద్దేది..లేదా పల్టీ కొట్టేది..అలా చేస్తారా. తప్పుకదా .” అన్నాడు కండక్టర్. మిగిలిన ప్రయాణీకులందరూ డ్రైవర్ నీ,కండక్టర్ నీ బాగా తిట్టారు.కొంతమంది కొట్టబోయారు కూడా. కానీ మరికొంతమంది ఆపారు.ఈ అర్ధరాత్రి వీడు పారిపోతే మనం ఇక్కడే వుంటాం. వైజాగ్ వెళ్ళాక చూసుకుందాం అని సర్ది చెప్పి,మనోజ సీట్లోకి ఇద్దరు మగవాళ్ళు వచ్చి కూర్చుని ఆమెను వెనక్కు పంపారు.తల్లి ఆమె పక్కనే కూర్చుంది.మనోజ ఏడుస్తూనే కూర్చుంది. వైజాగ్ బస్టాండ్ కి రాగానే డ్రైవర్ కిందికి దూకి లోపలి పారిపోయాడు.అందరూ దిగాక మెల్లగా మనోజ ,తల్లి ,చెల్లి ,పిల్లలూ..సామాను దిమ్పుకు౦టూ౦డగానే,మనోజ అన్నయ్య ,సురేష్ వచ్చాడు. వస్తూనే మనోజ భుజమ్మీద చేయివేసి., “వచ్చావా మనూ ,ప్రయాణం బాగా జరిగిందా..” అన్నాడు. అంతే అన్నభుజం మీద తలపెట్టి బావురుమన్నది మనోజ. సురేష్ తెల్లబోయాడు. “ఏమైందీ..” అంటే చెప్పదు.చివరకు తల్లిద్వారా తెలుసుకుని, బైక్ మీద తన వెంటవచ్చిన స్నేహితుడిని ,ఆటో మాట్లాడి తనవాళ్ళని జాగ్రత్తగా దింపి మళ్ళీ రమ్మనిచెప్పి, “నేను త్వరగానే  వచ్చేస్తా..మీరు ఇంటికి వెళ్ళండి” అని చెప్పి ,బస్టాండ్ లోకి దూసుకెళ్లాడు. సురేష్ బాంక్ ఎంప్లాయీస్ యూనియన్ లో యాక్టివ్ మెంబర్ . డ్రైవర్ సింహాచలం మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లయింట్ రాసి ,కొందరు ప్రయాణీకు లతో సాక్షి సంతకాలు కూడా తీసుకుని , ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చాడు. అప్పటికప్పుడే విలేకరులను పిలిచి ,డ్రైవర్ చేసిన దురాగతాన్ని వివరించి, తన చెల్లి పేరు బయటికి రాకుండా,న్యాయం జరిగేలా చూడాలని చెప్పి, ఇంటికి వచ్చాడు.అవమానంతో బాధపడుతున్న మనోజని ఓదార్చేందుకు ,వున్న 10 రోజులూ అందరూ ప్రయత్ని౦చారు. మర్నాడు అక్కడి పేపర్లలో ఆవార్త ప్రముఖంగా వచ్చింది.,మనోజ పేరు,సురేష్ పేరు  పెట్టకుండా.. “గౌరవనీయ కుటుంబానికి చెందిన ఒక యువతీ ,చిన్నపిల్లలతో ,బాంక్ ఆఫీసర్ అయిన అన్నను చూడడానికి విశాఖపట్నం వస్తూ,పడిన అగచాట్లు,డ్రైవర్ వికృత చేష్టల గురించి” ప్రముఖంగా ప్రచురించి ,డ్రైవర్ ని కఠిన౦గా శిక్షించాలని కోరాయివార్తాపత్రికలన్నీ .సురేష్ ఆ గొడవలేవీ తనచెల్లికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ నాలుగైదు రోజులతరువాత , ఓ సాయంత్రం ఒక స్త్రీ ,ముగ్గురు పిల్లలు ,మరో నడివయసు మగమనిషిని తీసుకొని ,సురేష్ ఉంటున్న ఇంటికి వచ్చారు. అప్పుడే సురేష్ బాంక్ నుండి వచ్చాడు. ఆమె బస్సు డ్రైవర్ భార్య,పిల్లలు,బావమరిది. ఆమె అతిదీనంగా వేడుకు౦ది ..తన భర్తను మన్నించమని..అతనికి ఉద్యోగం పోతే ,తమ పిల్లలకు గంజి కూడా పోయ్యలేనని.కానీ సురేష్ అందుకు ఒప్పుకోలేదు..అతన్ని వదిలేస్తే..సమాజంలో అమాయకులైన ఆడపిల్లలకి రక్షణ వుండదు.అతడి దుర్మార్గ ప్రవృత్తి మారదు శిక్ష పడవలసిందే అంటూ...మనోజ “వదిలేద్దాం అన్నయ్యా..మనకి పసివాళ్ళ ఉసురు తగులుతుంది ..” అన్నా వినలేదు. అతని భార్య మనోజ కాళ్ళు పట్టుకోబోయింది..సురేష్ కోపంగా.. “ ఎంతోసంతోషంగా నా చెల్లి నాఇంటికి వచ్చింది.ఆమెకి మనశ్శాంతి లేకుండా చేసాడు నీ భర్త. భయంతో ఆరోజునుండీ ఏడుస్తూనే వుంది..వెళ్ళిపో౦డి మీరు..” అని అరిచాడు. తల్లిపక్కనేవున్న 4   గేళ్ళపిల్లాడు భయంగా ఏడుపు మొదలెట్టాడు.ఎంతోపద్ధతిగా ,మర్యాదగావున్న ఈమెకి ఆరాక్షసుడిలాంటి భర్తను ఎందుకిచ్చాడో దేవుడు ,అనుకుంది మనోజ.ఇద్దరు ఆడపిల్లలకి  3,1  సం. వుంటాయి. ఆమె మెల్లగా లేచి వెళ్ళిపోయింది. 10 రోజులతరువాత వెనక్కి వచ్చేసింది మనోజ.జరిగినదంతా భర్తకి చెప్పడానికి భయపడి౦ది. కానీ మీద చేయ్యివేసినా ఉలిక్కి పడుతున్నభార్యను చూసి అనుమానం వచ్చింది వినోద్ కు . అదే  అడిగాడు..ఏమైంది అని..అప్పుడు జరిగినదంతా చెప్పింది. కొంచం కోపం వచ్చినా,సర్దుకున్నాడు. 3 నెలలతరవాత వినోద్ కంపెనీ అడ్రెస్ కి ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. అందులో డ్రైవర్ కి క్షమాబిక్ష పెట్టి ,కేసు విత్ డ్రా చేసుకుంటే శిక్ష పడకుండా ఉంటుందని,లాయరు ద్వారా పత్రాలు పంపారు.ఉద్యోగం ఎలాగూ పోయింది.కనీసం శిక్ష లేకుండా చేయమని కోరారు .సింహాచలం భార్య ఆమె బంధువులు. వినోద్ ఆపేపర్లు తెచ్చి భార్యకు ఇచ్చాడు. నీకేదినచ్చితే అదే చేయి అని. మనోజ కి అతని పిల్లలు గుర్తొచ్చారు.సంతకం పెట్టి భర్తకు ఇచ్చేసింది. కానీ ఆ సంఘటన ,దాని తాలూకు అవమానం ,భయం ,బాధ చాలా సం. మర్చిపోలేకపోయింది . చాలా బాధపడింది. ఇన్ని సం.తరవాత ఇప్పుడు..ఇదిగో..ఈ మురళి....వాడి కొడుకు..తనముందుకు వచ్చాడు. ఇతనికి తను సహాయం చెయ్యాలా..? ఎందుకు చెయ్యాలి..?తను ఎంత డిప్రెషన్ కి గురైంది..?తన చేతిలోని రెజుమేని సోఫాలోకి విసిరేసి..వెళ్లి పడుకుంది. జనరల్ మానేజర్ ,HR అయిన వినోద్ కుమార్ ,2 గంటలు ఫోన్లో మానేజి౦గ్  డైరెక్టర్ తో చర్చలయ్యాక ,డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి భార్యకోసం చూసాడు. సోఫాలో వున్న రెజుమే చూసి ,వాచ్ మాన్ ని పిలిచి ,ఎవరొచ్చారో తెలుసుకున్నాడు. డైనింగ్ టేబుల్ మీద వున్న చపాతీలు ,కూరా తినేసి,ఉదయమే ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.అతను వెళ్ళే వరకూ ఆరోజు మనోజ నిద్రలేవలేకపోయింది. ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటాడు కాబట్టి ఫోన్ కూడా చెయ్యలేదు. ఒకసారి ఫోన్ చేసి, మురళికి జాబ్ ఇవ్వమని చెప్పనా అనుకుంది..మళ్ళీ,..ఛీ ఆదుర్మార్గుడి కొడుకు..ఎందుకివ్వాలి..? తనకి ఎంత అవమానం జరిగింది..అస్సలు చెప్పకూడదు అనుకుంది. అయినా వినోద్ ఇలాంటి విషయాల్లో తను జోక్యం చేసుకోవడం ఇష్టపడడు. ఏదైతే అదే జరగనీ అనుకుంది. సాయంత్రం 5 గం.లకి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా మురళి. ముఖం సంతోషంతో వెలుగుతోంది. చటుక్కున పాదాలకి నమస్కరించి, “అమ్మా..మీ మూల౦గానే  నాకు ఉద్యోగం దొరికింది. నన్ను ఆశీర్వదించండి ..” అన్నాడు. “నా మూలంగానా..? నేను ఏ౦ చేసాను..?” అని అడిగింది. “నాకు తెలుసు లెండి,మీరు వైజాగ్ సురేష్ గారి చెల్లెలూ,మా అమ్మకి స్నేహితురాలూ అట. సర్ చెప్పారు.మీ మూలంగానే నాకు జాబ్ వచ్చిందని కూడా చెప్పారు. వస్తానమ్మా..” నవ్వుతూ చెప్పేసి వెళ్ళిపోయాడు. అరగంట తరవాత వచ్చిన వినోద్ , కిటికీ వద్ద స్థాణువులా నిలుచున్న నిలుచున్న భార్య వద్దకు వచ్చిబుజం మీద  చేయివేసాడు. ఒక్కసారిగా విదిలించి కోపంగా చూసి , “ ఏమిటీ..? నేను జాబ్ ఇవ్వమని చెప్పానా ఆకుర్రాడికి..? వాళ్ళమ్మ నా స్నేహితురాలా..?”..అంది. “అవును..నీ మూలంగా, మనమూలంగా వాళ్ళు చాలా నష్టపోయారు. సింహాచలం  తప్పేచేసాడు.దానికి తగిన శిక్ష పడింది.ఉద్యోగమూ పోయింది .నువ్వు క్షమాబిక్ష పెట్టినప్పుడే అతను చచ్చినవాడికింద లెక్క . ఇక అతని మూలంగా ,అతని కుటుంబం చేయని తప్పుకు శిక్ష అనుభవించింది. ఇంకా ఎందుకు సాధించడం..చచ్చినపామును చంపడం తప్ప !! వాళ్ళమ్మకి నువ్వు స్నేహితురాలివని ఎందుకు చెప్పానంటే..మురళి వెళ్లి ‘వైజాగ్ సురేష్ గారి చెల్లి’ అనగానే ఆమెకి నువ్వే అని తెలుస్తుంది. నీ మీద ఇంకా ఏదైనా ద్వేషం మిగిలివుంటే కరిగిపోతుంది.” అన్నాడు. మనోజ భర్త ముఖంలోకి చూసి మనోజ్ఞం గా నవ్వింది.

No comments:

Post a Comment

Pages