చక్కిలాలు - అచ్చంగా తెలుగు
చక్కిలాలు
- ఉషారాణి నూతులపాటి

సంక్రాంతి పండుగ రాబోతోంది. కొత్త ధాన్యం ఇంటికివస్తుంది. ఈపండుగ పిండివంటలు  ముఖ్యంగా కొత్తదాన్యం  ఉపయోగించి చేసుకునేవే ..కొత్త బియ్యంతో అరిసెలూ , జ౦తికలూ, చక్కిలాలూ చేసుకుంటాం. కొత్తబెల్లం, నువ్వులూ కూడా విరివిగా వాడుతూ చేసుకునే పిండివంటలూ రుచికీ , ఆరోగ్యానికీ చాలా మంచివి. ఇప్పుడు స్వీట్ షాపులూ ,స్వగృహాలూ వచ్చి ,ఇంట్లో వండుకోవడం మానేసాం కానీ ..కొన్ని పిండివంటలు చేసుకోవడం చాలా తేలిక.. నిజానికి ఈరోజుల్లో గాస్ స్టవ్ లూ ,మిక్సీలూ ,పిండిమరలూ ..అందుబాటులో వున్నాయి మనకి. పూర్వంలా పిండి రోకళ్ళతోదంచడమో, విసుర్రాయితో విసరడమో చేసే శ్రమ లేదు. ఒక్కరోజు 2,3 గంటలు కష్టపడితే కనీసం 3 రకాల పిండివంటలు చేసేసుకోవచ్చు. నాణ్యమైన వంటనూనెలు వాడుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు .                                                                                                                        బియ్యప్పిండితో నువ్వుల చక్కిలాలు సంక్రాంతి పండుగ స్పెషల్. ఆరోగ్యం కూడా..పిల్లలకి జబ్బు చేయవు.   కావలసిన పదార్ధాలు : 1.కొత్తబియ్యం 1 కిలో, 2. కొత్తనువ్వులు 100 గ్రా., 3.ఉప్పు సరిపడినంత, 4. నూనె వేయించడానికి సరిపడినంత .   చేయువిధానము : కొత్త బియ్యాన్ని రాత్రి నానబెట్టి ,ఉదయం మెత్తటి వస్త్రం లో మూటకట్టి ,పూర్తిగా వడకట్టాలి. పూర్తిగా నీరు పోయిన తడిబియ్యాన్ని ,మిక్సీలో మెత్తగా పొడిచేసుకోవాలి. లేదా ఇప్పుడు మనకు తడిబియ్యాన్ని పిండిచేసే ,పిండిమరలు అందుబాటులోనే వున్నాయి.. మరాడించి తెచ్చుకోవచ్చు. మరాడించిన తడిపిండిని మూతబిగించిన పాత్రలో ఉంచకూడదు. ఒక వెడల్పు పాత్రలో పోసి ,గాలి తగిలేలా ఉంచాలి. పూర్తిగా పొడిబారనివ్వకుండా పిండివంట చేసుకోవాలి. ఒక వెడల్పైన బేసిన్ లో బియ్యప్పిండి , ఇసుకలేకుండా బాగుచేసిన తెల్లనువ్వులు (నువ్వు పప్పు కాదు, పొట్టు తీయని నువ్వులు ఆరోగ్యానికి మంచిది..),వాము, ఉప్పు వేసి చపాతి పిండిలా ,కొద్దిగా ఎక్కువ నీటితో మృదువుగా తడుపుకుని తడిబట్ట తో కప్పి ఉంచాలి. ఒక మెత్తని కాటన్ చీర ను నాలుగు మడతలుగా వేసి పరచి ,దానిమీద చక్కిలాలు  చుట్టుకోవాలి. చేతికి కొద్దిగా నూనెరాసుకుని ,నిమ్మకాయంత పిండి ఉండని చేత్తోపట్టుకుని ,చూపుడువేలు , మధ్యవేలూ,బొటనవేలూ మధ్య పిండిని బలపంలా, తీగలా సాగదీసి ,చక్రంలాగా బట్టమీద తిప్పుకోవాలి. చక్రం మధ్యలో కాస్త ఎడం వుండాలి కానీ, పిండి వరుసలు ఒకదానితో ఒకటి అతుక్కునేలా (చేత్తో జరపవచ్చు) చుట్టుకోవాలి. మొదట్లో కాస్త విరిగినట్లు వచ్చినా కంగారు పడకుండా ప్రయత్నిస్తే ఫలితం లభిస్తుంది. చుట్టుకున్న చాకిలాలు తడి ఆరేవరకు వుంచి ..పల్చటి ప్లేట్ మీదకు వాటిని నేర్పుగా తీసుకుని, కాగిననూనెలో మెల్లగా వేసుకోవాలి. నూనె ఎక్కువ వేడెక్కకుండా ,మంట తగ్గించి ,మెల్లగా వేగనివ్వాలి. కొద్ది శ్రమతో రుచికరమైన చక్కిలాలు తయారు చేసుకోవచ్చు. చక్కిలాలు గుండ్రగా చుట్టుకోవడమే కాస్త కష్టం. ప్రయత్నిస్తే తప్పక సాధించగలం..మరి చేసి చూస్తారు కదూ..
   

No comments:

Post a Comment

Pages