నూటొక్క జిల్లాల అందగాడు - అచ్చంగా తెలుగు

నూటొక్క జిల్లాల అందగాడు

Share This
// నూటొక్క జిల్లాల అందగాడు //
                            - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
 


నిత్య యవ్వనుడు నూతన్ ప్రసాదు
నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాదు
సినీ విలనీల రాజాధిరాజు నూతన్ ప్రసాదు
వెండి, బుల్లి తెరల సమారోహం నూతన్ ప్రసాదు

అన్నెంటియార్ చిత్రంలో అరవిందం నూతన్
అక్కినేని చిత్రానికి అందం నూతన్

సూపర్ స్టార్ చిత్రానికి సూదంటు నూతన్
శోభన్ బాబు చిత్రంలో శోభంతా నూతన్

చిరంజీవి చిత్రానికి చూపు నూతన్
బాలయ్య చిత్రానికి బలం నూతన్

చిన్నబాబు చిత్రానికి చిరుదివ్వే నూతన్
వెంకటేష్ చిత్రానికి వెన్నుపూస నూతన్

కర్తవ్యం శాంతికి నీతిబోధ నూతన్
రాజేంద్రుడి చిత్రానికి రాజసం నూతన్

సత్యన్నారాయణ జంటైతే దడదడలాడించే నూతన్
రావుగోపాలరావు జంటైతో గడగడలాడించే నూతన్

నిత్యనూతన్, సత్యనూతన్
హాస్యనూతన్, కీర్తి నూతన్

తిరుగులేని ఈ సినీ విలన్
ప్రేక్షకుల మనసు దోచెన్

కీ.శే నూతన్ ప్రసాద్ కి కళావందనం.
-  కరణం, 20.11.2014
  "   దేశం చాల క్లిష్టపరిస్థితుల్లో ఉంది "- అంటూ తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన హాస్య, గంభీర నటుడు నూతన్ ప్రసాద్.  నూతన్ ప్రసాద్ ని 1973లో అందాలరాముడు చిత్రంలో ప్రముఖ దర్శకులు బాపు  పరిచయం చేసారు. ఆ తర్వాత తన సొంత ముద్రతో కామెడీ విలన్‌గా అనేక చిత్రాల్లో ఆయన నటించారు. 
  ఆయన గురించి : నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ అసలు పేరు తడినాధ వరప్రసాద్. 1945, డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కలిదిండిలో జన్మించిన ఆయన ముత్యాలముగ్గు చిత్రంతో గుర్తింపు పొందారు. 1970వ మరియు 80వ దశకములో తెలుగు సినిమా రంగాన్ని ఏలిన అతికొద్దిమంది నటుల్లో నూతన్ ప్రసాద్ ఒకరు. హాస్యం, విలనిజం పండించడ.. రెండూ కలిపిన కామెడీ విలనిజంలోనూ ఆయన నిష్ణాతుడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ పేరమ్మ, పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్లు, కొత్త అల్లుళ్ళు తదితర చిత్రాల్లో హీరో పాత్రలూ చేశారు. రాజాధిరాజు, చలిచీమలు చిత్రాల్లో నూతన్‌ప్రసాద్ చేసిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తు. నూతన్ ప్రసాద్ 'సైతాన్' గా నటించిన రాజాధిరాజు చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది’, ‘నూటొక్క జిల్లాల అందగాడిని’ అనే ఆయన డైలాగులు ధియేటర్లలో మారుమ్రోగాయి. విశేష ప్రేక్షకాదరణ పొందాయి.. దాదాపు 365 సినిమాల్లో నటించిన ప్రసాద్ డైలాగ్ డెలివరీలో కొత్త పోకడ మారుమూల ప్రాంతాలలోని సినీ ప్రేక్షకులనూ విశేషంగా ఆకర్షించేది. 
  రంగ ప్రవేశం : హైదరాబాదులో ప్రభుత్వోద్యోగం చేస్తున్న ఆయన 1973 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంలో బాపు దర్శకత్వం వహిస్తూ ఈయనని వెండి తెరకు పరిచయం చేశారు. ఆ తరువాత 'నీడలేని ఆడది' మొదలైన చిత్రాలలో నటించినా, ఈయనకు  'ముత్యాలముగ్గు' చిత్రంలో రావుగోపాలరావు తో పాటు ప్రతినాయకునిగా నటించడముతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రము విజయము సాదించడంతో నూతన్ ప్రసాద్ కు  అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్నె లద్దారు. ఎంత పెద్ద డైలాగ్‌ చెప్పినా ఒకే టేక్‌ లో పూర్తి చేయడం నూతన్ ప్రసాద్ స్టైల్ .  1200 అడుగులు షాట్‌ ఒకే టేక్ లో పూర్తిచేసి ఆ రోజుల్లో సంచలనం సృష్టించారు నూతన్ ప్రసాద్.  అప్పటికీ ప్రసాద్‌ కొత్త తరం నటుడే అయినా పాతతరం పోకడల్ని తూ.చ. తప్పకుండా అనుసరించేవాడు. దర్శకుల మనోభావాలను అర్ధం చేసుకొని ఎంతటి క్లిష్టమైనా సన్నివేశానికైనా జవసత్వాలు నింపి ఆ సన్నివేశాన్ని పండించేవాడు. అందరిలో కలుపుగోలు తనంగా వుంటూ ముఖ్యంగా సంభాషణల్లో తనలో ఉన్న నటుడ్ని ఆవిష్కరించేవాడు. ప్రసాద్ ధారణ శక్తి ఎంతో గొప్పదని ఆయన సమకాలికిలు చెబుతుండేవారు. ఆ తర్వాత అనేక చిత్రాలలో అగ్ర నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. అత్యంత కీలక దశలో అత్యున్నత స్థానంలో ఏకైక విలన్ గా మెరుపులు మెరిపిస్తూ బిజీబిజి గా ఉన్న నూతన్ ప్రసాద్ జీవితం యాక్సిడెంట్ తో ఒడిదుడుకులకు లోనైంది. 1989లో నవరస నాయకీమణి భానుమతికి భర్తగా నటించిన చిత్రం 'బామ్మమాట బంగారుబాట'. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో నూతన్ ప్రసాద్ తీవ్రంగా గాయపడి కొంతకాలం నటజీవితామనికి దూరంగా ఉన్నారు. అంత  పెద్ద ప్రమాదంలో కళ్ళు సహకరించక పోయినా, అప్పటినుంచి వీల్‌చైర్‌కు పరిమితమైనా,  కృంగిపోకుండా నటన మీద ఉన్న్ ఆసక్తితో తిరిగి నటించడం మొదలెట్టారు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలిగాడు.  ఎన్ని వైవిధ్యమైన పాత్రలు, ఏ ప్రాత పోషించినా ప్రాణం పోసేవాడు. కొంతకాలం రవీంద్ర భారతి కి ఇన్‌ఛార్జ్ గా ఉన్నారు.  ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  
పురస్కారాలు : నూతన్ ప్రసాద్ దాదాపు 365 సినిమాల్లో నటించారు. 1984 లో సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2005 లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. 
  కడచూపు : కళపై మక్కువతో ప్రభుత్వోద్యోగాన్ని కూడా కాదని సినీ రంగంలో సుస్స్థిర స్థానం ఏర్పరచుకుని, అంతలో ఎదురైన ఒడిదుడుకులు తట్ట్కుని నిలబడి  ఈటివి వంటి బుల్లి తెర మాధ్యమాలలో తన గళం అరువిచ్చి.. తనలోని నటుణ్ణి బ్రతికించుకున్న నూతన్ ప్రసాద్.. అనారోగ్యాన్ని మాత్రం ఎదుర్కోలేక  మార్చి 30, 2011 బుధవారం హైదరాబాదులో మృత్యువు ఒడికి చేరిపోయారు. అవును, అంతటి నవరసాల సరస నటుడు నూటొక్క జిల్లాల అందగాడు అయిన  నూతన్ ప్రసాద్  భౌతికంగా దూరమవ్వడంతో దేశ సినీపరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లో కి వెళ్ళిపోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ దశకాలలో  గొప్ప నటీనటులందరూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాపితం చేశారు.. వారందరితో పనిచేసిన నూతన్ ప్రసాద్ దూరమవ్వడంతో సినీమాత మూగగా రోదించింది..
***

No comments:

Post a Comment

Pages