మహిళ -- నాడు_నేడు - అచ్చంగా తెలుగు
మహిళ -- నాడు_నేడు.
-      డా:బల్లూరి ఉమాదేవి
                                  విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు.

వేదకాలంనుండి స్త్రీ ఆరాధ్య దేవతగా పరిగణింప బడుతూ వుంది.అందుకే అందరి కంటే ముందుగా మనం నమస్కరించేది అమ్మకే.సర్వసంగ పరిత్యాగి యైన సన్యాసి కూడ తల్లికి మాత్రమే నమస్కరిస్తాడు.అందుకే "మాతృదేవోభవ "అంటూ తల్లికి__"స్రీ"కి మొదటి స్థానమివ్వబడింది.తండ్రి,ఆచార్యుల స్థానాలు తరువాతివే. మనసమాజంలో పూర్వకాలంనుండి "మహిళ"కు ప్రత్యేక స్థానం ఇవ్వబడుతూవుంది."ఇంటిని చూచి ఇల్లాలిని చూడు"అనేఆర్యోక్తిలోనే స్త్రీ నైపుణ్యం వ్యక్తమౌతుంది.కేవలం ఇంటినే కాదు దేశ సంస్కృతిని నాగరికతను తెలుసు కోవడంలో కూడా స్త్రీ జాతికి ప్రత్యేక ప్రతిపత్తి వుంది. మనుస్మృతిలో "యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః యత్ర తాస్తున పూజ్యన్తే సర్వస్తత్రా ఫలాక్రియాః" ఎక్కడైతే స్త్రీలు పూజింప బడతారో (గౌరవింప బడతారో) అక్కడ దేవతలు కూడా సంతోషిస్తారు.ఏపిల్లలకైనా తల్లే మొదటి గురువు.గురుకులంలో ప్రవేశింప చేయడానికి ముందు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి తగిన శిక్షణ తల్లే ఇచ్చేది.వేదకాలంలో స్త్రీ విద్యావంతురాలని,సంతానానికి విద్య నేర్పడంలో ప్రధానురాలని తెలుస్తున్నది. "బృహదారణ్యకోపనిషత్"లోగార్గీ యాఙ్ఞవల్క్యుల సంవాదం ప్రధానమైంది."గార్గి" స్త్రీ.అంటే వేదకాలంలో స్త్రీలు పురుషులతో సమానంగా బ్రహ్మచర్య మవలంబించి గురుకుల వాసంలో వేదవేదాంగాల నభ్యసించే వారని తెలుస్తున్నది.నాటి కాలంలోనే "సహ విద్యార్జన"(co education)వుండే దనే విషయం స్పష్టమౌతుంది స్త్రీలను గౌరవాదరాలతో చూడాలని వారి కంట నీరు రాకుండా చూసుకోవాలనీ,వారు బాధ పడితే ఆఇంట్లో సిరిసంపదలుండవని నీతిశతకాలుబోధిస్తున్నాయి. "కులకాంత తోడ నెప్పుడు కలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ కలకంఠి కంట కన్నీ రొలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతీ.!" అన్నాడు సుమతీశతకకారుడు. మామూలు మానవులే కాదు దేవతలు అందులో "త్రిమూర్తులు "కూడా తమ భార్యలకు సముచిత స్ధానాన్నిచ్చి గౌరవించారని మన ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారతంలో ఆది పద్యంలో తెలిపారు. "శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే లోకానాం స్థితి మావహంత్య విహితాం స్త్రీ పుంస యోగోద్భవాం తేవేదత్రయ మూర్తయ స్త్రీ పురుష స్సంపూజితా వస్సురై ర్భూయాసుః పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్రేయసే." అంటే విష్ణువు వక్షస్థలంలోనూ,బ్రహ్మ నోటిలోనూ,శివుడుఏకంగా శరీరంలలో సగభాగంగానూ భార్యలను ధరించారని వారి సహకారంతోనే సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహిస్తున్నారని భావం. ఇదే విషయాన్ని ప్రజాకవి వేమన కాస్త వ్యంగ్యంగా "పడతి మోసె నొకడు పడతి మేసెనొకడు పడతి నురము నందు చేర్చి బ్రదికె నొకడు పడతి కొరకె పెక్కు పాట్లను పడిరయా విశ్వదాభిరామ వినుర వేమా!" అంటూ వివరించాడు. మన పురాణేతిహాసాల్లో కూడా "స్త్రీ" ధీరురాలిగా తన మాటను నెగ్గించు కోగల్గిన వనితగా వివరింప బడినది. రామాయణంలో కైక దశరథునకు దేవాసుర సంగ్రామంలో సహకరించి వరాలు పొందినట్లు తెలుస్తుంది.ఆ వరాల కారణంగా శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది.కానీ అది "రావణసంహారంకోసమే "అలా జరిగింది.మరి "సీతో".ఆమెను కైక అడవుల కెళ్ళమనలేదు.కాని సీత"రాముడున్నచోటే నాకు అయోధ్య" అంటూ స్వచ్ఛందంగా అడవుల కెళ్ళింది.ఇక"ఊర్మిళ " 14 సంవత్సరాలు భర్తకు దూరమై అయోధ్యలో నిద్రాదేవి ఒడిలో సేద దీరింది. భారతంలో ద్రౌపది అయోనిజ .భర్తలతో పాటు కష్టసుఖాలను అనుభవించిన ఆదర్శ మహిళ. ఇక  దమయంతి,చంద్రమతి,సావిత్రి,సుమతి ఇలా ఎందరో స్త్రీలు ఎవరి బలవంతం కానీ సాయంకానీ లేకుండా తమ భర్తలను కాపాడు కొన్నారు.అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసుకొని విజయం సాధించారు."అబలలు కాదు సబలలం"అని నిరూపించుకొన్నారు. తరువాతి కాలంలో ఎన్నో కారణాలవల్ల స్త్రీ స్థానం సమాజంలో తగ్గుతూ వచ్చింది.రాజకీయ కారణాలవల్ల,దండయాత్రల వల్ల "స్త్రీ"మాన ప్రాణాలకు రక్షణ కరువైంది.వేదాలలో చెప్పిన "న స్త్రీ స్వాతంత్ర్య మర్హసి" అనే వాక్యాన్ని మాత్రమే పట్టుకొన్నారు. "పితా రక్షతి కౌమారే -భర్తా రక్షతి యవ్వనే సుతా రక్షతి వార్ధక్యే -న స్త్రీ స్వాతంత్ర మర్హసి". ఇందులో మొదటి మూడింటిని వదిలేశారు.శారీరకంగా "స్త్రీ"అబల బలహీనురాలు కాబట్టి చిన్నప్పుడు తండ్రి, వివాహానంతరం భర్త,వృద్ధాప్యంలో కుమారుల రక్షణ అవసర మనే భావాన్ని వదిలేసి "న స్త్రీ స్వాతంత్రమర్హసి"అనే చివరి పంక్తిని పట్టుకొన్నారు. ఇక స్త్రీ వాదం,స్త్రీ స్వాతంత్ర్యం అనేవి ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చినవి కావు.చరిత్రలో రుద్రమదేవి ,నాయకురాలు నాగమ్మ , ఝాన్సీలక్ష్మీబాయి,అహల్యాబాయి,ఇందిరాగాంధీ మొదలైనవారు ఆత్మ స్థైర్యంతో ధైర్యంతో యుద్ధాలు చేసి రాజ్యాలేలి విజయాలు సాధించి చరిత్రను సృష్టించిన మహిళా మణులెందరో వున్నారు. యుద్ధరంగంలోనే కాదు కవనరంగంలో కూడా తాళ్ళపాక తిమ్మక్క ,కవయిత్రి మొల్ల,రంగాజమ్మ,గంగాదేవి మొదలైన ప్రాచీన కవయిత్రులతో పాటు తెన్నేటి హేమలత,వోల్గా,యద్ధనపూడి  సులోచనారాణి,మాదిరెడ్డి సులోచన,కోడూరి కౌసల్యాదేవి,ఇంకా ఎందరో ఆధునిక రచయిత్రులు ఖ్యాతినందిన/నందుచున్న వారెందరో ఉన్నారు.కేవలం కదన,కవన రంగాల్లోనే కాదు సేవారంగంలో కూడా సాటిలేని సేవలందించిన సరోజినీనాయుడుగారు,దుర్గాబాయిదేశముఖ్ గారు.కనపర్తి వరలక్ష్మమ్మగారు,మదర్ థెరిస్సాగారు,వంటి మహిళలెందరో మనకు ఆదర్శప్రాయులుగావున్నారు. "ముదితల్ నేర్వగ రాని విద్యగలదే ముద్దార నేర్పింపగాన్ "అన్నట్లు దేశాధ్యక్షులుగా శ్రీమతి ప్రతిభాపాటిల్ గారు"మేటిమహిళ ప్రథమ మహిళగా" ఖ్యాతినందారు.అదేవిధంగా స్పీకర్ గా మీరాకుమార్ గారు బాధ్యతలను నిర్వర్తించారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో శరవేగంతో దూసుకు పోతున్నారు.క్రీడల్లో,రాజకీయాల్లో,విద్యా వ్యాపార,వైద్య రంగాలలో పరిశోధనా,సామాజిక రంగాల్లో రాణిస్తున్నారు.ఐతే నాణానికి బొమ్మా బొరుసు  వున్నట్లే ఓవైపు ప్రగతి పథంలో పయనిస్తున్నా మరోవైపు మాత్రం సమస్య "ఎక్కడవేసిన గొంగడిఅక్కడే  వుంది."అన్నట్లుంది.మహిళల్లో ఆభద్రతాభావంపెరుగుతూ వుంది.విద్యావంతుల శాతం పెరుగు                     తూనే వున్నా స్వతంత్రంగా వుండేవారి సంఖ్య తక్కువగానే వుంది. గాంధీజిగారు "ఆడది అర్ధరాత్రి స్వేఛ్ఛగా తిరిగి నపుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు"అన్నారు.కానీ అర్ధరాత్రి కాదుగా పట్టపగలే ఆడది తిరిగే స్థితిలోలేదు.గతంలో "నిర్భయను"గూర్చి విన్నాం.సానుభూతిని చూపాం .కంటతడి పెట్టుకొన్నాం.ఆమె పేరు మీదుగా చట్టం కూడా వచ్చింది.కానీ అత్యాచారాల సంఖ్య తగ్గడం లేదు.మరీ పసి పిల్లలపై కూడా అఘాయిత్యాలు తగ్గడంలేదు.వరకట్నాల చావులు తగ్గడం లేదు.గృహహింస తగ్గడం లేదు.సమాజంలో సగభాగమైన మహిళలు ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా వుంది. "ఎవరో వస్తారని ఏదో చేస్తారని "ఎదురు చూడకుండా  మన సమస్యలను మనమే పరిష్కరించే దిశలో అడుగులు వేయాలి.పిరికి తనం వదిలేయాలి.ఆ---మనకెందుకులే అనే నిర్లిప్తభావాన్ని వదిలి అవసరమైనపుడు "ఆడపులు"ల్లా గర్జించాలి.వీటన్నింటికంటే ముందు ఒకరితో వేలెత్తి చూపించుకొనేలా మన ప్రవర్తన వుండకూడదు.మన జాగ్రత్తలో మనముండాలి.ముఖ్యంగా వస్త్రధారణలో,వేషభాషల్లొ ఆధునిక పోకడలకు ఆకర్షితులై మనకు మనమే హాని చేసుకొంటున్నాం.పాశ్చాత్య మోజును వదిలి మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిద్దాం.మన సంస్కారాన్ని చాటుదాం. ఇక చివరగా "మనువు"చెప్పిన "షట్కర్మయుక్తా కులధర్మపత్నీ"గురించి చిరు కవితతో(నాలుగింటిని మాత్రమే ప్రస్తావించాను) మహిళలకు మేలుకొలుపు. ఇక్కడ కేవలం భార్య అనే అర్థంలో మాత్రమే కాకుండా ఉద్యోగినియైన మహిళను దృష్టిలో నుంచుకోవాలని మనవి. "ఓ మహిళా తెలుసుకో తెలివిగా మసలుకో సమాజంలో సగభాగం నీవు సంసారంలో సగభాగం నీవు నీవు లేని జగతి లేదు నీవు లేక ప్రగతి లేదు అమృతం పంచే ఆమృతవర్షిణివి నీవే అసభ్య వర్తనుల పాలిటి అపర కాళికవు నీవే "కార్యేషు దాసి"లా సేవలందించు దాసివని జులుం చేస్తే నిలదీసి ప్రశ్నించు "కరణేషు మంత్రి"లా సలహాల నందించు కార్యభారం మోపితే సున్నితంగా తిరస్కరించు "భోజ్యేషు మాత"గా అతిథుల నాదరించు కడుపార తినిపించు 'అన్నపూర్ణ'వనిపించు "క్షమయా ధరిత్రి"వంటూ మునగ చెట్టెక్కిస్తే చరగని చిరునగవుతో ఇబ్బందుల నధిగమించు సహనానికి హద్దుంటుందని ప్రవచించు మరి_____ఆసహనం హద్దు మీరితే ప్రళయం సృష్టిస్తుందని హెచ్చరించు నవమాసాలుమోసి బిడ్డను కనే శక్తి నీదే ఆబిడ్డ అడ్డ దారిన పడితే శిక్షించే అధికారమూ నీదే వేద కాలం నుండీ నేటి కాలం దాకా మన్నన లందిన మగువల తెగువ గుర్తుంచుకో కదన రంగంలోనేకాదు కవన రంగంలోనూ కదం తొక్కి కవిత లల్లిన మగువలే స్ఫూర్తి నీకు ఓ మహిళా తెలుసుకో తెలివిగా మసలుకో.

No comments:

Post a Comment

Pages