భైరవ కోన – 8 (జానపద నవల ) - అచ్చంగా తెలుగు
భైరవ కోన – 8 (జానపద నవల )
-      భావరాజు పద్మిని

(జరిగిన కధ :సదానందమహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటాడు భైరవపురం రాకుమారుడు విజయుడు. గురువు ఆదేశానుసారం భైరవారాధన చేసి, ఒక దివ్య ఖడ్గాన్ని, వశీకరణ శక్తిని,  పొంది తిరిగి వెళ్ళే దారిలో కుంతల దేశపు రాకుమారి ప్రియంవదను కలిసి, ఆమెతో ప్రేమలో పడతాడు. వంశపారంపర్యంగా విజయుడికి సంక్రమించిన చంద్రకాంత మణిని స్వాధీనం చేసుకుని, విశ్వవిజేత కావాలని ప్రయత్నిస్తుంటాడు కరాళ మాంత్రికుడు. మహా చండీయాగం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన చిత్రలేఖ, తన అన్న విజయుడిని కలిసి , కాబోయే భర్త , మంత్రికుమారుడైన చంద్రసేనుడితో ఏకాంతంలో సంభాషిస్తూ ఉంటుంది చిత్రలేఖ...) 
చిత్రలేఖ తన సంభాషణ కొనసాగించేందుకు అవకాశం ఇస్తూ మౌనం వహించాడు చంద్రసేనుడు. “నేను పుట్టగానే చెప్పారు... అత్యంత శుభలక్షణాలు కల మహాజ్జాతకురాలిని అని. కాని, 18 వ ఏట నాకు పెద్ద గండం ఉంది... ఆ గండం గట్టెక్కితే, నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో విలసిల్లి, పుట్టినింటికీ మెట్టినింటికీ ఖ్యాతి తెస్తానని చెప్పారు. ఇదిగో,  ఈ పున్నమికి నాకు 18 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు ఎదురయ్యే ఆపద తప్పించేందుకే, రాజగురువు నాతో మహాచండీయాగం చేయించారు. దేవీకృపతో నేను ఈ మహాగండం దాటుతానో లేదో తెలీదు. కాని నేను జీవించినా, మరణించినా, మనసా, వాచా, కర్మణా నిన్నే భర్తగా భావించి ఉన్నాను. ఈ జన్మకే కాదు, జన్మజన్మలకు నువ్వే భర్తగా రావాలని ఆశిస్తున్నాను. అయితే... ఈ గండం గడవకపోతే, నీవు నా గురించి విచారించక మరొక వివాహం చేసుకుంటానని, నాకు మాట ఇవ్వాలి... “ మాట్లాడుతున్న చిత్రలేఖ నోటికి తన చేతిని అడ్డు పెడుతూ, “చిత్రా ! అంత మాట అనకు. రాకుమారివైన నీకు ఈ బేలతనం తగదు. నీకేమీ కాదు. నీ అన్న విజయుడు భైరవ కృపతో దివ్య శక్తులను సాధించాడు. నేను, గురుకులంలో శస్త్రాస్త్రాలలో అత్యంత ప్రావీణ్యం సంపాదించాను. నేను, విజయుడు ముల్లోకాలు ఏకమైనా సరే, కలిసి పోరాడి నిన్ను రక్షించుకుంటాము. అయినా, నా ప్రాణంలో ప్రాణమైన నీవు లేని క్షణం నేను జీవించి ఉంటానా ? ప్రేమంటే కలిసి బ్రతకడమే కాదు, విడిపోయి బ్రతకలేకపోవడం కూడా కదా ! అందుకే నీవు ఎటువంటి బెంగలూ పెట్టుకోకుండా, దేవిని ప్రార్ధిస్తూ ఆనందంగా ఉండు. ఈ కోన క్షేత్రపాలకుడు, మన రక్షకుడు భైరవుడు... సర్వసమర్ధుడు, ఘోరమైన ఆపదల నుంచైనా మనల్ని కాపాడతాడన్న నమ్మకం నాకుంది... ఇక నేను బయలుదేరతాను, నీవు ధైర్యంగా ఉండు ” అంటూ ఆమె వెన్ను తట్టి, గాఢంగా హత్తుకుని, సుతారంగా నుదుట ముద్దాడాడు చంద్రసేనుడు.
అశ్రునయనాలతో చంద్రసేనుడి వంక తృప్తిగా చూస్తూ, చాలా సేపు అలాగే ఉండిపోయింది చిత్రలేఖ !
తన భూగృహంలో మాయాదర్పణం ముందు నిల్చుని ఉన్నాడు కరాళ మాంత్రికుడు. అక్కడి వాతావరణం ధీరులకు సైతం భీతి గొలిపేలా ఉంది. కదలాడే అస్థిపంజరాలు, జడల భూతాలు, వేళ్ళాడే గబ్బిలాలు, గుడ్లగూబలు, క్రూర సర్పాలు అక్కడ స్వేచ్చావిహారం చేస్తున్నాయి. పిశాచాల అరుపులతో అంతటా కంపిస్తోంది. “చెప్పవే మాయాదర్పణమా ! స్వాతీ నక్షత్ర సంజాత , ఆరు శుభలక్షణాలు గల కోమలి, నా పాలిటి వరదాయిని, ఆ రాకుమారి ఎక్కడో చూపవే !” అంటూ బిగ్గరగా అరిచాడు కరాళుడు. వెంటనే మాయాదర్పణంలో నల్లటి మబ్బులు వీడినట్టు కనిపించి, ఒక అందమైన ఏకాంత మందిరం గోచరించింది. అందులో ఉన్న హంసతూలికా తల్పంపై తన చెలికత్తెలు వీవెనలతో వీస్తుండగా నిద్రిస్తోంది నిరుపమాన సౌందర్య రాశి, రాకుమారి చిత్రలేఖ ! ఆమెను చూడగానే కరాళుడి కళ్ళు, ఆనందంతో మెరిసాయి. “కరాళా ! ఈమె భైరవపురం రాకుమారి చిత్రలేఖ ! ఈమె సకల శుభ లక్షణాలు కలిగినది, స్వాతీ నక్షత్ర సంజాత. రెండు రోజుల్లో వచ్చే పున్నమికి ఆమెకు 18 సం. నిండుతున్నాయి. అప్పుడు నీవు ఆమెను మాయోపాయంతో ఇక్కడకు అపహరించుకుని రా ! అంతేకాదు, నీవు అన్వేషిస్తున్న చంద్రకాంత మణి కూడా వీరి వద్దనే ఉంది...” అంది మాయాదర్పణం. మళ్ళీ నల్లటి మబ్బులు కమ్మినట్టుగా అయ్యి, ఆ దర్పణం మామూలు అద్దంగా మారిపోయింది.
అప్పుడే విజయం సొంతమైనట్టు వికటాట్టహాసం చేసాడు కరాళుడు. ఎదురుగా ఉన్న ౩౦ అడుగుల బేతాళుడి విగ్రహానికి నమస్కరించి, “ సాహో దేవరా ! నీవు కోరే బలి నీది. ప్రపంచాన్ని గుప్పిట్లో బంధించే శక్తి నాది. ఇక కార్యార్ధినై బయల్దేరుతాను. దీవించు...” అని, రెండడుగులు వెనక్కు వేసి మాయమయ్యాడు.
  వైభవంగా జరిగాయి చిత్రలేఖకు కాబోయే అత్తగారు సువర్ణాదేవి పుట్టినరోజు వేడుకలు. బీదలకు అన్న, వస్త్రదానం, బ్రాహ్మణుల చేత ప్రత్యేక పూజలు, రాజ్యమంతా అలంకరించి, వేడుకలు జరిపారు. అత్తగారికి తాను వేసిన చంద్రసేనుడి చిత్రపటం కానుకగా ఇచ్చి, ఆవిడ పాదాలకు నమస్కరించింది  చిత్రలేఖ ! “చిత్రా ! నీ వంటి సుగుణాల రాశి కోడలిగా లభించబోవడం మా అదృష్టం తల్లీ! రేపు నీ పుట్టినరోజు కదా ! అందుకే ముందుగా దీవిస్తున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు ! ఇష్టకామ్యార్ధ సిద్ధిరస్తు !” అంటూ దీవించింది సువర్ణాదేవి. మర్నాడు రాకుమారి పుట్టినరోజు వేడుకలు, ఆమెకు ఆపద ఉన్నందున రాజభవంతి లోనే నిరాడంబరంగా జరపాలని నిర్ణయించారు పెద్దలు. అందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, విజయుడు తన తల్లిదండ్రులు, సోదరితో అడవిలో తాను కుంతల దేశపు రాకుమారి ప్రియంవదను కలిసిన వైనం చెప్పాడు. కుంతల రాజు ధర్మవేదుడు తమ మిత్రుడే కావడంతో, ఆ విషయాన్ని హర్షంతో ఆమోదించారు రాజు, రాణి. “చాలా సంతోషం అన్నయ్యా ! మరి వదినమ్మను నాకు ఎప్పుడు చూపిస్తావు ? నువ్వు వర్ణిస్తూంటే, నాకూ చూడాలని చాలా ఆత్రంగా ఉంది...” అంది చిత్రలేఖ ! “తొందర ఏముంది చెల్లీ ! ముందు చంద్రుడితో నీ వివాహం కానీ ! అయినా, నువ్వు వేగిరపడుతున్నావు కనుక  త్వరలోనే మన వార్తాహరుడితో ఒక సందేశం పంపి, వారినీ నీ వివాహానికి ఆహ్వానిద్దాం, సరేనా ?” అన్నాడు విజయుడు.  ప్రియంవదను చూడాలని, అతని మనసు కూడా ఉవ్విళ్ళూరుతోంది. మర్నాడు ప్రియంవద చేత ఆయుష్షు హోమం చేయించసాగారు ఋత్విక్కులు. ఇంతలో పెద్ద పెద్ద అంగలు వేస్తూ కోపంగా అక్కడకు వచ్చాడు రాజగురువు. “ఆపండి, ఏం చిత్రలేఖ ! నేను చెప్పింది ఏమిటి, నీవు చేస్తున్నది ఏమిటి ? నీ వలన మహాచండీ యాగంలో ఒక పెద్ద అపరాధం జరిగింది. వెంటనే ప్రాయశ్చితం చెయ్యకపోతే ఈ రాజ్యానికే ముప్పు, ఉన్నపళంగా బయల్దేరు ! మందీ మార్బలం సమకూర్చుకు తీరిగ్గా వచ్చే సమయం లేదు !” అన్నాడు. తన వల్ల జరిగిన తప్పిదం ఏవిటో తెలియకపోయినా, రాజ్యానికి హాని అనగానే , మారు ఆలోచన లేకుండా, బయల్దేరింది చిత్రలేఖ ! ఆమెకు తెలియకుండా ,ఆమెను ఆకాశమార్గంలో అనుసరిస్తూ వెళ్ళసాగింది ఆమె మాట్లాడే చిలుక, సురస. దానికి చిత్రలేఖ అంటే పంచప్రాణాలు. ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత ఆమెను వెంటనే వదిలేందుకు దానికి మనస్కరించలేదు ! రాజగురువు రధం దట్టమైన అడవి గుండా ప్రయాణించసాగింది. అడవంతా పట్టపగలే చీకటిగా ఉంది. వందల అడుగుల ఎత్తున పెరిగిన చెట్లు సూర్యకాంతిని రానివ్వకుండా అడ్డుపడుతున్నాయి. ఎక్కడినుంచో క్రూర మృగాల అరుపులు వినవస్తున్నాయి. తాము దారి తప్పి, వేరే మార్గంలో వెళ్తున్నామని గమనించిన చిత్రలేఖ... నెమ్మదిగా ధైర్యం చేసి... “ స్వామీ ! ఇది మన ఆశ్రమానికి వేరొక దారా ! మనం దారి తప్పి, ఉత్తర దిశగా పయనిస్తున్నామని నాకు అనిపిస్తున్నది...” అంది. “దారి తప్పలేదే భామినీ ! నిన్ను నా దారిలోకి తీసుకెళ్ళాలనే ఇంత నాటకం ఆడాను...” అంటూ వికటాట్టహాం చేస్తూ, అసలు రూపంతో ప్రత్యక్షమయ్యాడు కరాళుడు. అతడి వికృతాకారం చూసిన చిత్రలేఖ వెంటనే స్పృహ తప్పి, ఆ రధంలోనే పడిపోయింది... ఇదంతా గగన మార్గంలో చూసిన సురస... విజయుడితో విషయం చెప్పాలని, వెనుదిరిగి పయనమయ్యింది.... (సశేషం...)      

No comments:

Post a Comment

Pages