“స్వాతి సోమనాథ్ “ – శింజారవం - అచ్చంగా తెలుగు

“స్వాతి సోమనాథ్ “ – శింజారవం

Share This
స్వాతి సోమనాథ్ “ – శింజారవం
-బ్నిం

సిరిమువ్వలు మ్రోగెందుకే పుడతాయి. తమ సజీవమైన అందెల రవళితో ప్రేక్షకుల మనసుల్ని నాట్యమాడిస్తాయి. అలా నటరాజ పాదం నుంచి జారి భువిపై వ్రాలి,  నాట్యం కోసమే పుట్టి, నాట్యమే ఆత్మగా, నాట్యానికే అంకితమైన   సిరిసిరిమువ్వ “స్వాతి సోమనాథ్ “. స్వాతి పుట్టింది బీహార్‌ లో ...పెరిగింది పశ్చిమబెంగాల్‌లో...స్థిరపడింది మాత్రం హైదరాబాద్‌ మహానగరంలో.
 స్వాతి పూర్వికుల స్వస్థలం శ్రీకాకుళం దూసి అగ్రహారం. వారిది సనాతన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. స్వాతి తండ్రి సోమనాథ్‌, తల్లి లక్ష్మికి సంగీత సాహిత్యాలంటే ఎనలేని అభిమానం. తండ్రి సోమనాథ్ గారు రైల్వే లో పని చేసేవారు. చిన్నతనంలో పళ్ళెం మీద యామిని కృష్ణమూర్తి నృత్యప్రదర్శన చూసి, ప్రేరణ పొంది, ఇంట్లో నృత్య భంగిమలు ప్రాక్టిస్ చేసేవారు స్వాతి. ఆమె అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను నాట్యాభ్యాసానికై గురువు సుమతి కౌశల్ వద్ద చేర్పించారు. ఆమె వద్ద నాలుగేళ్ళు కూచిపూడి, భరతనాట్యం లో శిక్షణ పొంది, పదొవ తరగతి పరీక్షల తర్వాత తొలి అరంగేట్రం ఇచ్చారు స్వాతి. తండ్రి చనిపోవడంతో కుటుంబం ఆర్ధికంగా నిలదొక్కుకోవడం కోసం ఒక పక్క నాట్య ప్రదర్శనలు ఇస్తూనే విద్యాభ్యాసం కొనసాగించారు స్వాతి. అప్పటికి ఆమె
నేర్చుకున్నది కేవలం 10, 11 ఐటమ్స్ మాత్రమే ! కూచిపూడి లో ఎం.ఏ. , ఇంగ్లీష్ లిటరేచర్ లో ఎం.ఫిల్ పూర్తి చేసారు. కుచిపూడిలో 100 కు పైగా అద్భుతమైన నృత్యాలకు రూపకల్పన చేసి, దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. స్వాతి సోమనాథ్ గారు చాలా చదువుకున్నావిడ అని నాకు తెలుసు. నాకింకా బాగా తెలిసిన విషయం ఆవిడ డేరింగ్ అండ్ డాషింగ్ మనస్తత్వం. తనకేం కావాలో స్పష్టంగా తెలిసిన కళాకారిణి. రైటర్ గా నేను గాని, నాకు తెలిసి మేము కలిసి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ గానీ వాళ్ళ టాలెంట్ తో ఆవిడని పూర్తిగా ఇంప్రెస్ చెయ్యలేరు. తనకి ఆ పాట, తాళం, రాగం, నచ్చాలి. భాష, భావం, తను అనుకున్నట్లు పలకాలి. దాదాపుగా నేను ఆమెకు 4,5 బ్యాలేలు రాసుంటానేమో! అందులో సెన్సేషనల్ బ్యాలే వాత్సాయన కామసూత్ర. ఆమె దానికి పెట్టిన పేరు “కామ టు మోక్ష “. ఆ సబ్జెక్టు ని రాయడానికి చాలా మంది రైటర్ లు మొహమాట పడిపోయారు. నాకు చెప్పగానే – “అద్భుతం !
తప్పక రాస్తాను”, అన్నాను. సబ్జెక్టు డిస్కషన్ లో నేను కాస్త మొహమాట పడ్డా, ఆవిడే ధైర్యం చెప్పి రాయించుకుంది. ఆవిడ రూపొందించిన దాదాపు 10 నృత్యరూపకాలకి “గరిమెళ్ళ గోపాలకృష్ణ “ అనే నా స్నేహితుడే సంగీత దర్శకత్వం చేసాడు. ఆయన కూడా ఆవిడ అభిరుచిని అనేక సందర్భాల్లో మెచ్చుకుంటూ, కావలసిన రాగాలను అందిస్తూ, ప్రశంసలు పొందుతుంటాడు. ముఖ్యంగా ఆవిడ ప్రశాంతమైన వదనం, నవ్వుతూ పనిచేయించుకునే విధానం, అసహనాన్ని దాచుకునే అభినయం నాకు చాలా బాగా నచ్చుతుంది. అంతకన్నా నాకు ఆవిడ నుదుటి బొట్టు ఎంతో ఇష్టం. బొట్టు – దటీజ్ స్వాతి సోమనాథ్ మార్క్ ! స్వాతి సోమనాథ్ లోని మరో గొప్ప విషయం – మొన్నీ మధ్య “శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు” గారు “భరతముని ప్రణీత -నాట్యశాస్త్రం “ అనే గ్రంధాన్ని ఆవిష్కరించిన శుభవేళ , ఆయన సన్మాన బాధ్యతను ఆమె స్వచ్చందంగా
స్వీకరించి, తన శిష్యులతో నాట్యవందనం చేయించి, తన నాట్యాభిమానాన్ని ప్రకటించి, పలువురి మన్ననలు పొందారు. అదీ ఆమె సంస్కారం. చక్కటి వాచకం, భారతీయతపైన అపారమైన గౌరవం, నేను హిందువుననే గర్వం, పైగా నాకిష్టమైన తెలుగుదనం, ఆమెను నేను గౌరవించే స్నేహితురాలిగా మార్చింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి విద్యార్ధులకు నాట్యంలో శిక్షణ ఇస్తున్న స్వాతి, “నృత్యభారతి” అనే సంస్థను స్థాపించి, శాస్త్రీయ సంగీత నాట్యాలలో విద్యార్ధులకు గత 17 ఏళ్ళుగా శిక్షణ ఇస్తున్నారు. నృత్యకళను అభ్యసించిన విద్యార్థులు చదువుల్లోనూ రాణించగలరని ,పాశ్చాత్య నృత్యాలు కేవలం శారీరక భంగిమలపై కేంద్రీకృతమై ఉంటాయని.. భారతీయయ శాస్ర్తీయ నృత్యాలు శారీరక భంగిమలతో పాటు, ప్రేక్షకులతో మానసికంగా బంధాన్ని పెనవేసుకుంటా యని, అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను శాస్త్రీయ నృత్యం అభ్యసించేలా ప్రోత్సహించాలని చెబుతుంటారు ఆవిడ. ఇప్పుడు నేను ఆమెకు రచిస్తున్న రూపకం (నిజానికి చాలా ఆలస్యం అయ్యింది. కారణాలు అప్రస్తుతం ) మళ్ళి మాకు ఇంకో ప్రత్యేకతను తెస్తుందని
భావిస్తున్నాం. ఆ రూపకం కూడా ఆమె కమిట్మెంట్ ని, సమాజం పట్ల అవగాహనని, సంస్కరణాభిలాషని తెలియజేసే విధంగా రూపొందుతోంది. నేను స్వాతి సోమనాథ్ ని ఇష్టంగా పిలుచుకునే పేర్లు- “బంగారుతల్లీ... “, “రౌడి “... విశ్వపటంపై సాంప్రదాయపు   “తెలుగు విజయ కేతనం”  ఎగురవేస్తూ...నృత్య మయూరి, నాట్య పారిజాత, నృత్య విశారద, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, కళారత్న వంటి అనేక అవార్డులు గెల్చుకుని,  తెలుగు తేజాన్ని దిగంతాలకు చాటుతున్న ఈ బంగారుతల్లి, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దీవిస్తూ... బ్నిం. “అన్నమయ్య శ్రీకృష్ణ తత్త్వం “ నుంచి ఆమె నాట్యం రూపొందించిన ఈ చక్కటి వీడియో క్రింది లింక్ లో చూడండి...      

నేను రాయగా ఆమె నర్తించిన “కామ టు మోక్ష “ బ్యాలే వీడియో ను క్రింది 
లింక్ లో చూడండి.

No comments:

Post a Comment

Pages