మధురం - మధు చిత్రలేఖనం : శ్రీకాంత్ కానం - అచ్చంగా తెలుగు

మధురం - మధు చిత్రలేఖనం : శ్రీకాంత్ కానం

Share This
మధురం - మధు చిత్రలేఖనం 
 శ్రీకాంత్ కానం 


చిత్రం గీయడానికి అవసరమైన రంగులు, కుంచె, కాగితం, కాన్వాస్ తన చేతికి అందిస్తే చాలు, అతని చేతిలోని కుంచె మంత్రదండంగా మారి చిత్రాలు కళాఖండాలుగా రూపుదిద్దుకుంటాయి. తనలోని చిత్ర కళాత్మక శక్తికి మనోహర దృశ్యాలు, సుమనోహరమైన భావాలు సైతం కళా వస్తువులుగా మారిపోతాయి. చిత్రీకరణ నైపుణ్యం, వస్తువు యొక్క బహిర్గత అర్ధమేకాక,
అంతర్గతాన్ని తన అవగాహాన శక్తితో ఆకళించుకొని, చక్కటి ఊహతో అనుసంధానించి, విలక్షణమైన పద్దతిలో చిత్ర కళలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్న చిత్రకారుడు "మధు కురువ".  తను గీసిన మధురమైన చిత్తరువులు చూస్తే ఔరా అని అనకుండా ఉండలేము. రూప రేఖ లావణ్యవంతమైన తన  చిత్రాలు, సొబగులు విరజిమ్ముతూ, మార్ధవం ఉట్టిపడుతుంటాయి. నేత్ర పారవశ్యంగా ఉండి, విమలానందం కలిగిస్తాయి. సినిమా పాటకు చిత్రం రూపం ఇచ్చి  రికార్డులు తిరగరాసి అంతర్జాతీయంగా తెలుగు వాడి ప్రతిష్టను పెంపొందించిన  విలక్షణ చిత్రకారుడు మధు కురువ పరిచయం ఈ మాసం తెలుగు బొమ్మలో.. అతని మాటల్లోనే....
కుటుంబ నేపథ్యం :
మాది మహబూబ్ నగర్ జిల్లా, వడ్డేపల్లి మండలంలోని కొంకల అనే ఒక మారుమూల గ్రామం. అమ్మ శంకరమ్మ, నాన్న సోమన్న. అయిదుగురు సంతానంలో (ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు) నేనే చిన్న. పదవ తరగతి వరకు మా ఊరిలోనే చదువుకుని, ఇంటర్మీడియట్ చేసేందుకు  కుటుంబ ఆర్ధిక  పరిస్థితులు సహకరించక కర్నూల్ జిల్లాలోని ద్రోణాచలంలో ఐటిఐలో చేరాను.
చిత్రకళ వైపు తొలి  అడుగులు:
ఐటిఐ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే తరగతి గదిలో ఉన్న మిషనరీని, ఎదురుగా కూర్చుండే మిత్రులను చూస్తూ బొమ్మలు గీయడం మొదలుపెట్టాను.  అది కాకుండా ఐటిఐలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే ఒక సబ్జెక్టు ఉండేది. ఆ సబ్జెక్టు కి సంబంధించిన బొమ్మలు గీయడంలో ఎందుకో తెలియని ఒక ఇష్టం ఏర్పడింది. వాటిని చూసి అధ్యాపకుడితో పాటు మిత్రులందరూ చాలా బాగా గీసాను అని అంటుంటే అప్పట్లో అదో ఆనందం.
నాన్న రాసిన ఆ ఉత్తరమే ఒక పెద్ద మలుపు:

ఐటిఐ మొదటి సంవత్సరం చేస్తున్న  సమయంలోనే  శంకర్ అనే ఒక మిత్రుడు నా దగ్గరికి వచ్చి నువ్వు చాలా బాగా బొమ్మలు గీస్తున్నావ్ కదా..   నాకు తెలిసిన మౌలాలి అనే మంచి డ్రాయింగ్ మాష్టారు ఉన్నారు.  తనని కలిస్తే నీకు ఉపయోగపడే సూచనలు ఏమైనా ఇవ్వొచ్చు అని చెప్పి మరుసటి రోజే తన దగ్గరికి తీసుకెళ్ళాడు. తన దగ్గరికి వెళ్లి మాష్టారూ మీ దగ్గర శిష్యుడిగా చేరాలి అనుకుంటున్నాను అని  అంటే తను "నా దగ్గర శిక్షణ పొందాలంటే కనీసం మూడు నాలుగేళ్ళు సమయం కేటాయించగలగాలి.అందుకు సిద్ధపడితే ఐటిఐ పూర్తి చేసుకుని రా, అప్పుడు చూద్దాం! " అని చెప్పి అడ్రస్ ఇచ్చి పంపించారు. ఇదే విషయాన్ని
తెలుపుతూ ఐటిఐ తర్వాత మరో మూడు నాలుగు సంవత్సరాలు నాకు సమయం కావాలని నాన్నకొక ఉత్తరం వ్రాసాను.  కుటుంబ ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంచేత నాన్న నుండి వద్దు అనే సమాధానంతో ఒక ఉత్తరం అందింది. దానికి ప్రత్యుత్తరం రాసేలోపే నాన్న నుండి మరో ఉత్తరం - నీకు నచ్చినట్టే కానివ్వు అని.
అమ్మ, నాన్న జన్మను ఇస్తే.. గురువు జీవితాన్ని ఇచ్చారు: 
ఐటిఐ పూర్తి అయిన తర్వాత తన వద్ద శిష్యరికం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మౌలాలి గారికి ఉత్తరం రాసాను. కాని తననుండి ఎటువంటి సమాధానం అందకపోవడంతో ఇంట్లో నాన్నతో చెప్పి, కొన్ని బియ్యం, వంట చేసుకోవడానికి కాస్త కిరోసిన్ తీసుకుని మరీ నేరుగా వారి ఇంటికి వెళ్లాను. చిత్రలేఖనం నేర్చుకోవాలన్న నా కాంక్షను అర్థం చేసుకున్న మౌలాలి గారు చిత్రలేఖనంలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే నా చురుకుదనాన్ని చూసి కొత్తగా చేరిన విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అప్పుడే కొత్తగా  చేరిన ఒక అమ్మాయి ప్రేమిస్తున్నాను అంటూ నా వెంట పడింది. తెలిసి తెలియని వయసులో, తనకు ఏమి చెప్పాలో తెలియక అదే విషయాన్ని గురువుగారికి చెప్పేసా. అప్పుడు తను నాతో ఒక మాట అన్నారు. "చూడు మధు.. జీవితంలో నీకు నువ్వు ఏర్పర్చుకున్న  లక్ష్యాలను అందుకునే క్రమంలో నీ ఏకాగ్రతకు భంగం కలిగించడానికి మధ్య మధ్యలో ఆ పూటకి ఆనందాన్ని ఇచ్చే కొన్ని సందర్భాలు నీకు ఎదురవుతుంటాయి. ఆ తాత్కాలిక ఆనందాన్ని చూసుకుని లక్ష్యాన్ని గంగలో తొక్కడం  లేదా లక్ష్యాన్ని అందుకోగలగడం అన్నది ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది" అని తను అన్న మాటలు ఈరోజుకి నా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
ఫోటోగ్రాఫర్ నుండి డ్రాయింగ్ టీచర్గా సాగిన నా ప్రస్థానం :
గురువు గారి దగ్గర సుమారు నాలుగున్నరేళ్ళు  శిక్షణ తీసుకున్నాక, ఏదన్న ఒక ఉద్యోగం ఉంటే చూడమని వారిని అడిగితే తన మిత్రుడైన శ్రీనివాస రెడ్డి కి చెందిన ఫోటో స్టూడియో లో అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ గా చేర్పించారు. ఒకపక్క ప్రకృతి  అందాలను కెమెరాలో బంధిస్తూ మరో పక్క వాటినే బొమ్మలుగా గీస్తుండేవాడిని. అలా ఒక ఏడాది గడిచాక కర్నూల్ లోనే రవీంద్ర విద్యానికేతనం లో డ్రాయింగ్ టీచర్గా చేరాను. మొత్తానికి అనుకున్న రంగంలో స్థిరపడే ఒక అవకాశం అందింది అని ఆనందపడేలోపే అసలు కష్టాలు మొదలయ్యాయి. ఒక డ్రాయింగ్ టీచర్గా విద్యార్థులకు చిత్రలేఖనంలో శిక్షణ ఇవ్వడం తప్పించి, యాజమాన్యం బస్సులకు పెయింటింగ్ వేయడం, బ్యానర్లు వ్రాయడం, స్కూల్ లో గోడలకు రంగులు వేయడం వంటి  అన్ని పనులు చేయించేవారు. అయినా సరే అనుకుని సుమారు మూడు సంవత్సరాలు అదే స్కూల్లో పనిచేసి ఆ తర్వాత కేశవ రెడ్డి స్కూల్ కి మారిపొయాను. అదే సమయంలో నా జీవితంలో జరిగిన ఒక మధుర ఘట్టం "సంగీత"తో నా కళ్యాణం.
కలం చుక్కలతో కలాం బొమ్మ:
కేశవ రెడ్డి స్కూల్ లో కొనసాగుతున్న సమయంలోనే (2007, ఫిభ్రవరి 1) ఒక
మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ  వేడుకల కోసం కర్నూల్ కి అప్పటి రాష్ట్రపతి డా. ఎ పి జె అబ్దుల్ కలాం గారు వస్తున్నట్లు తెలిసింది. అదృష్టం బాగుండి,  అవకాశం  దొరికితే వారికోసం విభిన్నంగా ఒక బొమ్మ గీసి వారికి బహుకరిస్తే బాగుంటుంది అని అనుకుని సిరా చుక్కలతో వారి బొమ్మనే గీసాను. దానిని తీసుకుని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ దాన కిషోర్ గారిని కలిసి చూపిస్తే వారికి అది బాగా నచ్చి ఆ కార్యక్రమానికి నేను కుటుంబ సమేతంగా హాజరయ్యేందుకు విఐపి పాస్ లను ఇచ్చారు. ఆరోజంతా నిద్ర కూడా పట్టలేదు. మనసు గాల్లో తేలుతున్నట్లు ఏదో తెలియని ఆనందం, మదిలో మరెన్నో రకాల భావోద్వేగాలు.  ఎంతగానో ఎదురుచూసిన ఆ రోజు రానే వచ్చింది.. నేను కూర్చున్నది  వేదికకు పది అడుగులు దూరంలో.. ఎదురుగా నాకు ఎంతో ఇష్టమైన కలాం గారు. కలయా నిజమా ?? అన్న మీమాంస నాలో కొనసాగుతూనే ఉంది. ఇంతలో జిల్లా కలెక్టర్ నేను గీసిన బొమ్మను కలాం గారికి బహుకరించారు.  భద్రత కారణాల వల్ల నన్ను వేదిక మీదికి పిలవలేకపొయారు. నేను గీసిన బొమ్మ కలాం గారు చూస్తూ బాగుందని మెచ్చుకున్నందుకు ఆనందం ఒక వైపు.. నేను నా చేతితో బహుకరించలేకపోయాను అన్న బాధ మరో వైపు. కాని మరుసటి ఈ విషయం అన్ని వార్త పత్రికల ద్వారా ఒక దావనంలా వ్యాపించి జిల్లా వ్యాప్తంగా నాకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చింది.
అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం:
కేశవరెడ్డి స్కూల్ లో  అనుకోని కొన్ని సంఘటనల వలన ఆత్మాభిమానం చంపుకోలేక ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. తర్వాత  ఏమి చేయాలో
తెలియని అయోమయ పరిస్థితిలో యానిమేషన్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నట్లున్నాయి, హైదరాబాద్ వెళ్లి ఆ రంగంలో ఎందుకు ప్రయత్నించకూడదు అన్న నా భార్య సలహా మేరకు హైదరాబాద్ వచ్చేసా. తీరా ఇక్కడికి వచ్చాక కోర్స్ ఫీజు సుమారు లక్ష రూపాయలు అని  తెలిసింది. ఇప్పుడెలా అని దీర్ఘంగా ఆలోచిస్తుంటే నా భార్య తను బీఈడి చేయాలని అన్న కోరికను కూడా చంపుకుని ఆ డబ్బులను కూడా నా కోర్స్ కోసమే ఉపయోగించమని చెప్పి, నాకు మాటల్లో చెప్పలేనంత సహకారాన్ని అందించింది. ఆరోజు తన సహకారమే లేకుంటే నేను ఈరోజు ఎలా ఉండేవాడినో!!
చిత్ర రూపంలో సినిమా పాట:
ఎరినాలో యానిమేషన్ కోర్సులో చేరిన అతి కొద్దిరోజులలోనే అందులోనే
డ్రాయింగ్ ట్యూటర్ గా ఉద్యోగం వచ్చింది. ఒక రోజు ఇన్స్టిట్యూట్  నుండి ఇంటికి వెళ్లి వేదం సినిమా లోని రూపాయి పాట వింటూ కీరవాణి గారు ఎంత చక్కగా రాసి, కంపోజ్ చేసారు అని నా భార్యతో అంటే అప్పుడు తను ఆ పాటకు చిత్ర రూపం ఇవ్వొచ్చు కదా అని సూచించింది. అలా తను ఇచ్చిన సలహాతో రూపాయి పాటకు చిత్ర రూపం ఇచ్చి దానిని యూట్యుబ్ లో పెడితే అది ఒక సంచలనం అయ్యింది. ఆ చిత్రమే నాకు ఎన్నో దేశ, విదేశ అవార్డులను, ప్రశంసలను తెచ్చిపెట్టింది. బయటి ప్రపంచం దృష్టిలో ఈ విజయం నాదైతే , నా అంతరాత్మ దృష్టిలో మాత్రం ఈ విజయం నా భార్యదే.
చిత్తరువుల ప్రదర్శనలో వినూత్న పోకడ:
ఎరినా యానిమేషన్ ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులలోని ప్రతిభ చూస్తే  ఆశ్చర్యం అనిపించేది. వాటన్నింటినీ  ఒక ఎగ్జిబిషన్ లా ఎందుకు ప్రదర్శించకూడదు అన్న ఆలోచన వచ్చింది. దానికి సీఈఓ నుండి కూడా సానుకూల స్పందన రావడంతో వెంటనే అది కార్యరూపం దాల్చింది. ఇది కూడా అప్పట్లో ఒక వినూత్న ప్రయోగం అవ్వడం చేత ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకు క్రమ క్రమంగా  నా చిత్రాలు  ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శనకు ఉంచడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అమెరికా వంటి అగ్ర దేశాలతో పాటు మన దేశంలోని ముంబై నగరంలో ఉన్న "రోడ్ ఎగ్జిబిషన్" సంస్కృతి ని మన హైదరాబాద్లో కూడా ప్రవేశ పెడితే బాగుటుందనిపించి ఒక ప్రయత్నం చేస్తే అందుకు అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పటి వరకు దేశ, విదేశాలలో సుమారు 40 కి పైగా ప్రదర్శనలు చేసాను.
తోట వైకుంటం గారి దీవెనలా సాక్షిగా చిత్రకళలోనాదైన ముద్ర కోసమే నా తపన:

ఒక ఎగ్జిబిషన్ ప్రారంభానికి వచ్చిన తోట వైకుంటం గారు, "చిత్రకళలో రోజుకొక ప్రయోగం చేస్తూ ఉంటే అవి ప్రయోగాలుగానే మిగిలిపోతాయి తప్ప మనకంటూ ఒకఉనికిని తీసుకురాలేవు, ప్రజలు మనం వేసిన ఒక చిత్రాన్ని చూసి ఇది ఫలానా  చిత్రకారుడు వేసాడు అని గుర్తుపట్టేలా మనదైన ముద్ర అన్ని చిత్తరువులలో ఉండేలా చూసుకోవాలి" అని సూచించారు. అప్పటి నుండి ఒక విభిన్నమైన కోణంలో నా దంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకునేలా ప్రయతిస్తున్నాను. ఆరోజు నుండి వారు తన సూచనలతో నన్ను ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.
చిత్రకళ ఆధారంగా చిత్ర రంగం వైపు అడుగులు:
2009 లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు  హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సమయంలో వారికి నివాళిగా తీసిన "యుగ పురుషుడు" అనే ఒక త్రీడి లఘు చిత్రానికి కథను అందించాను. ప్రస్తుతం ఒక కొత్త తెలుగు సినిమాకు స్టొరీ బోర్డు ఆర్టిస్ట్ గా, మరో సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను.


అదొక్కటే బాధ:
చిత్రలేఖనంలో నేను ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న తలంపుతో తన సర్వం దారపోసి నన్ను ముందుకు నడిపించింది మా నాన్న. ఇప్పుడిప్పుడే చిత్రకారుడిగా కాస్త పేరు సంపాదించుకుంటున్న నాకు ఆ ఆనందాన్ని పంచుకోవటానికి ఇప్పుడు నాతో మా నాన్న లేడు. తను ఉండి ఉంటే ఇప్పుడు ఎంత సంతోషపడేవారో..!!
అవార్డులు, రివార్డులు:
రూపాయి పాట మీద వేసిన చిత్రానికి లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్, మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లలో చోటు లభించింది. అలాగే కోనసీమ చిత్ర కళా పరిషత్ వారి పీటి రెడ్డి అవార్డు తో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు లభించింది. ఈ ఏడాది గురుపౌర్ణమి సందర్భంగా కళానిలయం సంస్థ వారు ఉత్తమ గురువు పురస్కారంతో సత్కరించారు. నేను కథను అందించిన యుగపురుషుడు త్రీడి చిత్రానికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి.
చిత్ర కళను ప్రోత్సహించేందుకు మధు కురువ డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్:
ఈరోజు నేనొక చిత్రకారుడిగా గుర్తింపు పొందుతున్నానంటే దానికి నాకు అడుగడుగునా సహకరించిన వారెందరో ఉన్నారు. అందరి ప్రోత్సాహం వల్లనే నేను నా కళను పెంపొందించుకోగాలిగాను. నాలాగే ఇంకా ఎందరో కళాకారులు ఉన్నా, సరైన ప్రోత్సాహం లేక వెలుగులోకి రాలేకపోతున్నారు. అలాంటివారికి చేయూతనివ్వడానికే మధు కురువ డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించాను. చిత్రకళ మీద ఆసక్తి ఉండి, నేర్చుకోవడానికి తగిన ఆర్ధిక పరిస్థితి లేని వారు ఎవరైనా మా వద్ద ఉచితంగా శిక్షణ పొందవచ్చు. ఆసక్తి గలవారు  8374002201, 9666955182 లకు ఫోన్ చేస్తే సరిపోతుంది.
---------------------------------------------------------------------------------------------------------------------------------------
చిత్రలేఖనంలో వినూత్న ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ, మధురమైన చిత్తరువులతో అంతర్జాతీయంగా తెలుగు వారికి పేరు ప్రతిష్టలు తీసుకువస్తున్న విలక్షణ చిత్రకారుడు మధు కురువ మున్ముందు మరెన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని అచ్చంగా తెలుగు కుటుంబ సభ్యులందరి తరపునా ఆశిస్తూ.. మీ  శ్రీకాంత్ కానం

No comments:

Post a Comment

Pages