కలల తోటమాలి - అచ్చంగా తెలుగు
కలల తోటమాలి
- కొల్లూరు విజయా శర్మ


"అమ్మా!. "అంటూ అల్లంత దూరాన వంశీ పిలుపు ..... "అరె ఇప్పుడే కదారా నిన్ను స్కూల్ కి పంపింది అప్పుడె వచ్చేసావే కన్నా..."అంది కీర్తన. పూజ పునస్కారాలలో పడి మూడు గంటలు ఇట్టే గడిచిపోయిన విషయం గమనించలేదు తను. కీర్తనది చిన్న కుటుంబం.. భర్త .. ఒక కూతురు, ఒక కొడుకు వంశీ.. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం.. ! ఉన్నదాంట్లో సంతృప్తిగా జీవిస్తున్నారు కీర్తన ఫ్యామిలీ. స్కూల్ కి పంపిన కొడుకు వంశీ ఆనందంగా అమ్మా అని అరచుకుంటూ లోపలికి వచ్చాడు. పర్యావరణ పరిరక్షణ దినం సందర్భంగా వంశీ వాళ్ళ స్కూల్ లో చక్కటి నాటిక వేయించారు. ఆ నాటికలో వంశీది తోటమాలి పాత్ర . పంచె కట్టి , పాత చొక్కా వేసి , తలపాగా చుట్టి పంపింది పొద్దున్నే . వంశీ వస్తూనే తలపాగా, విసిరి, చిక్కా తీసేస్తూ పరిగెత్తుకొని వచ్చి అమ్మా..! అంటూ కీర్తనను వాటేసుకున్నాడు. గుక్కతిప్పుకోకుండా స్కూల్ లో జరిగిన నాటిక విశేషాలు చెబుతూనే వున్నాడు.. "వంశీ బట్టలు మార్చుకో నాన్నా" "అంటున్న అమ్మ మాటలకి "సరే ముందు ఇటు విను" అంటూకీర్తన తలను తనవైపు తిప్పుతూ మళ్ళి చెప్పేస్తూ వున్నాడు.. నాటిక కబుర్లు చెబుతూ చెబుతూ.. అంతలో ఏదో గుర్తొచ్చినట్లు.. ఆగి.. ...ఒక్కసారిగా స్వరం కాస్త పెంచి "అమ్మా!ఈ రోజు బస్ ఇంకో రూట్ లో వచ్చింది తెలుసా ? " ఏంజరిగింది కన్నా" అడిగింది కీర్తన సావధానంగా వింటున్నదానిలా ." హేమంత్ కి బాగా జ్వరం వచ్చింది., వాడు బస్సులో కూర్చోలేకపోతున్నాడు అని హేమంత్ ని ముందు వాళ్ళింటి దగ్గర దించమన్నారు టీచర్.. మరేమో పాపం వాడ్ని దించాకా మిగిలిన వాళ్లని డ్రాప్ చేశారు డ్రయివర్ అంకుల్ ." అన్నాడు . "అయ్యో ! ఊళ్ళో జ్వరాలు ఎక్కువగా వున్నాయ్ కన్నా ! చిన్న వాళ్లు కదా ,మీకు ముందు వచ్చేస్తాయి ఇలాంటివి " అంటూ గ్యాస్ స్టౌవ్ మీద ఘుమఘుమలాడుతున్న ముక్కలపులుసుకి పోపు పెట్టడానికి వంటింటి లోకి వెళ్ళింది కీర్తన. యశోద వెంట నడిచే చిన్నికృష్ణుడిలా వెనకాతలే అమ్మ కొంగుపట్టుకుని ఫాలో అయ్యాడు వంశీ . అసలే పెద్దవి అయినకళ్ళను మరింత పెద్దవి చేసి ఎక్సయిట్ మెంట్ తో " అమ్మా!హేమంత్ వాళ్ళ ఇల్లు ఎంత పెద్దదో తెలుసా..! నేను మా ఫ్రెండ్స్ అంతా చూశాము ఎంత బావుందో ,డుప్లెక్స్ హౌజ్ అట ". అన్నాడు "ఔనా "... అంటూ వాడిని కొద్దిగా దూరం జరగమని పోపు వేసింది కీర్తన. . "పండూ ! డ్రెస్ మార్చుకోనాన్నా ! అన్నం పెట్టేస్తాను అని "వంటకాలన్నీ మెల్లగా టేబుల్ మీద సర్ది, "ఇదిగో నా వంట అయిపోయింది . ఇక మీదే ఆలస్యం "అంటూ కేక పెట్టింది.. అఫీస్ లాప్టాప్ లో మునిగిపోయిన మురళి కి వినపడేట్టు. "నా ఆలస్యం ఏమీ లేదు .శనివారం కదా వంశీ కూడా నాకు కంపెనీ "అంటూ వచ్చాడు మురళీ . "ఆహా! గుర్తొచ్చింది కదా !శనివారం అని ,పేరుకి అయిదురోజుల ఉద్యోగం ,... కానీ 365 రోజులూ ,24 గంటలు ఆఫీస్ వర్కే ... సన్నగా దెప్పుతూనే వడ్డనకి ఉపక్రమించింది ". వంశీ వేషం మార్చకుండానే మురళి పక్కన చేరిపోయాడు . ఇద్దరికీ ముందు దోసకాయ పప్పూ నెయ్యీ వేసింది కీర్తన . వంశీ చేత పప్పు తినిపించాలంటే చిన్న పాటి యుద్దమే . కీర్తన ఓపిక అందుకు సరిపోదు . అందుకే మురళి దొరికి నప్పుడల్లా.. వంశీకి పప్పు తినిపించడం మురళికి అప్పజెప్పి తప్పించుకుంటుంది కీర్తన.. ఇక వంశీ కి పప్పన్నం తినిపించేందుకు మురళి పాట్లు చూసి.. ముసి ముసిగా ఎంజాయ్ చేస్తుంటుంటుంది. అలాంటి ఘటనలు అరుదుగా ఉంటుంటాయ్.. అందుకే అవకాశం దొరకగానే, వంశీకిపప్పు తినిపించండి అంటూ అప్పగించేసింది.. మురళి, వంశీకి భీముడి కథ , చోటా భీముడి కథ ఇలాంటివన్నీ చెప్తూ మన రామాయణ , భారత కథానాయకుల నుండీ సచిన్ వరకూ పప్పు తినడం వల్లనే అంత బలవంతులూ చురుకైన వాళ్ళూ అయ్యారని ఉన్నవి కొన్ని,కల్పించి కొన్నీ కధలు చెప్తూ ఒక అరగంటలో పప్పూ అన్నం తినిపించడం అలవాటు చేసుకున్నాడు. అలాగే మొదలెట్టాడు ఈ రోజుకూడా. కానీ, వంశీ కథలు వినే మూడ్ లో లేడు.. తాను చెప్ఫేదే వినమన్నట్లు మురళి ముఖం ని గట్టిగా తనవైపు తిప్పుకుంటూ.. స్కూల్ సంగతులన్నీ చెబుతున్నాడు వాళ్ల నాన్నకి .. వంశీ కి కుడా ఈ రోజు భలే దొరికాడు మురళి. ఉత్సాహంలో ఉన్న వంశీ కంచంలో నాన్న పప్పు కలిపిన విషయాన్ని కానీ తాను పప్పు తింటున్నాడన్న విషయాన్ని కుడా గమనించలేదు. స్కూల్ విశేషాలు చెబుతూనే మధ్యలో '''"నాన్నా ! మనం కూడా ఒక మంచి డుప్లెక్స్ ఇల్లు కట్టుకోవచ్చు కదా " అన్నాడు . కీర్తన, మురళీ లు ఒకరి ముఖం ఒకరు చూసి నవ్వుకున్నారు . "అబ్బా ! నవ్వుతారేంటి ? నిజంగా కట్టుకుందాం " అన్నాడు వంశీ అసహనంగా . "కట్టుకోవచ్చు " అన్నాడు మురళీ . "మరి ఎప్పుడు కట్టుకుందాం " నోటినిండా నాన్న పెట్టిన ముద్ద నములుతూ ప్రశ్నించాడు వంశీ. తాము కూడా డుప్లెక్స్ ఇల్లు కట్టుకోబోతున్నామన్న ఊహే ఆ చిట్టి బుర్రని ఉత్సాహంతో ఊపేస్తోంది. . "ఇప్పుడు కష్టం నాన్నా ! మనం ఈ ఇంటి లోన్ తీర్చాలి , అక్కకు, నీకు చదువులకి ఫీజ్ లు కట్టాలి . ఇంకా మనకి చాలా ఖర్చులు ఉన్నాయి కదా " వంశీని బుజ్జగిస్తున్నట్లు సౌమ్యంగా అంది కీర్తన . వంశీ ముఖం చిన్నబోయింది . "ఒక పని చేద్దాం వంశీ ! ఈ మధ్యే మనం కనకపురా రోడ్ లో స్థలం కొనుక్కున్నాం కదా ! పెద్దయ్యాక నువ్వే అక్కడ నీకు నచ్చిన డూప్లెక్స్ హౌజ్ కట్టుకుందువు గాని సరేనా "అన్నాడు మురళీ . మళ్ళి వంశీ కళ్ళల్లో మెరుపు . ముఖం అంతా సంతోషంతో వెలిగిపోయింది . అప్పుడే తను పెద్దవడం దగ్గిర నుండీ ఇల్లు కట్టే వరకూ ఊహించేసుకుంటున్నాడు . వాడి పరధ్యానాన్ని పసిగట్టిన కీర్తన ఇక లాభం లేదని ... మురళీని చెయ్యి కడుక్కోమని చెప్పి తనే తినిపించడం మొదలు పెట్టింది . పప్పూ అన్నానికే సతాయించే వాడు,ఆ తర్వాత ఇంకేమీ తినను అనే వాడు కాస్తా ... పప్పూ ,కూరా, పెరుగూ కూడా తినేశాడు .. ఆలోచనలో నిమగ్నమై. .! వాడికి తినిపించి అప్పుడు తను భోజనం చేసింది కీర్తన . మురళి భోజనం అయిపోయినా కీర్తన కి కంపెనీ కోసమని కబుర్లు చెప్తూ అక్కడే కూర్చున్నాడు . కొద్దిసేపటి తర్వాత భోజనం కాగానే సోఫాలో వాలిన తల్లిని పరిగెత్తుకొచ్చి వాటేసుకున్నాడు వంశీ . "అమ్మా!నేను నిజంగా పెద్దయ్యాకా డూప్లెక్స్ కట్టుకోవచ్చా ?నాన్న చెప్పేరు కదా !" అన్నాడు . వాడి ఆత్రానికి , ఆలోచనలకు నవ్వుకుంది కీర్తన . "నాన్నగారు చెప్పేరు కదా నాన్నా !". ఆ సమాధానంతో సంతృప్తి పడ్డట్లే అనిపించాడు కాసేపు ... కానీ మళ్ళి సంకోచంగా "అమ్మా!" అన్నాడు . "ఏంటి నాన్నా !ముందు వెళ్లి నీ డ్రెస్ తీసుకురా ,నేనైనా మారుస్తాను" అంది కీర్తన . "నేనే మార్చుకుంటాను కానీ ... మరి మరి ,,,మరి"నసుగుతున్నాడెందుకో . "చెప్పరా ?నీ నస ఏంటి?"ఈ సారి కాస్త విసుక్కుంది మురిపెంగానే . "మరి అమ్మా!"పెద్దయ్యాకా ఇల్లు కట్టుకోవాలంటే నాతో ఎవరు ఉంటారు ?" వాడి ప్రశ్న అర్ధం కాలేదు కీర్తనకి . "అంటే "అంది ."అంటే ... "అంటే నాన్న యే పనులు చెయ్యాలన్నా పెద్దదానివి నువ్వు ఉన్నావు కదా "అన్నాడు . వాడి మాటలకి ఫకాల్న నవ్వు వచ్చింది . పక్క రూమ్ లో మురళి కూడా పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు . "నాన్న కి నేను పెద్దదాన్ని ఏంటిరా "అంది నవ్వు ఆపుకుంటూ . "కరెక్ట్ గా చెప్పేడు వాడు . నేను 78 లో పుట్టెను,నువ్వు 81లో పుట్టేవు . ఇప్పుడు పుట్టిన వాడ్ని అడిగినా చెప్తాడు 78 కంటే 81 పెద్దదని,అంటే నువ్వే నాకంటే పెద్దదానివి అని"అన్నాడు మురళీ . "ఓహో !కళ్ళముందేమో కంప్యుటర్ , చెవిలో ఏమో మా కబుర్లు.. ఆయ్". ఏంటీ ,సెలవు రోజు సినిమా ,షికారూ అనకుండా ఐ వర్కు "అంది కాస్త ఉడుక్కుంటూ . " అది కాదమ్మా ! నాన్న పనులప్పుడు ... అంటే సైట్ కొనడానికి ,ఇంకా రిజిస్త్రేషన్ వాటికీ పెద్దదానివి నువ్వూ వెళ్తావు కదా !మరి నేను డూప్లెక్స్ కట్టేటప్పుడు ఎవరు వస్తారు?అన్నాడు వంశీ . అప్పటికి కాస్త కాస్త వాడి మాటలు అర్ధం కావడం మొదలుపెట్టాయి కీర్తనకి . మురళీ పేరుకి విప్రో లో పెద్ద మేనేజర్ . మరి ఆఫీసులో విషయాలు ఎలా చక్కపెడతాడొ తెలీదు కానీ స్వతహాగా చాలా నెమ్మదస్తుడూ మొహమాటస్తుడు కూడా ... లావాదేవీల విషయంలో అతను మెతక వైఖరి చూపకుండా కీర్తన కూడా అలాంటప్పుడు మురళి పక్కనే ఉంటుంది . అంటే వంశీ ప్రశ్న దాదాపుగా వాడు ఇల్లు కట్టేవేళకి వాడికి తోడుగా ఒకరు ఉండాలని ... వాడి ఆలోచనకి లోలోన నవ్వుకుంటూనే "అక్క ఉంటుంది కదరా !పెద్దది "అంది . వాడు ఒకసారి ఆలోచించి "అక్క ఎందుకు ఉంటుంది ?పెద్దయితే లలితా అత్తా లాగే వాళ్ళింటికి వెళ్ళిపోతుంది కదా ! "అన్నాడు . లలితా అంటే మురళి చెల్లెలు , వంశీకి మేనత్త ఈ మధ్యే పెళ్ళై అత్తరింటికి వెళ్ళింది.. వీడి అబ్జర్వేషన్ గొప్పగానే ఉంది అనుకుంటూ "నేనూ నాన్నా ఉంటాం కదరా !పెద్దవాళ్ళం "అంది . అప్పుడు పేలింది కీర్తన ఊహించని బాంబ్ . "మీరు నా దగ్గిర ఎందుకు ఉంటారు?..." "అన్నాడు చిత్రంగా చూస్తూ . "నీ దగ్గిరే ఉంటాం . అమ్మా నాన్నా పెద్దయినా పిల్లలతోనే ఉంటారు " అంది కీర్తన వాడికి ఎందుకు చిత్రంగా తోచిందో అర్ధం కాక . "కాదు,నువ్వు అబద్ధంచెబుతున్నావు, పిల్లలు పెద్ద అయిపోయాకా అమ్మా నాన్నా వాళ్ల దగ్గర ఉండరు . అమ్మమ్మా వాళ్ళూ మన దగ్గిర ఎందుకు లేరు ?"అన్నాడు సీరియస్ గా చూస్తూ .. ఒక్క నిమిషం ఏం చెప్పాలో తోచలేదు కీర్తనకు. .. తల్లిదండ్రులు ఆడపిల్ల దగ్గిర ఉండరు ,ఎంత చదువుకున్నా ,ఆడపిల్లని కొడుకుతో సమానంగా పెంచినా ,అల్లుడే కొడుకులా మెసలినా కూతురి దగ్గిర ఉండడానికి ఇష్టపడనివ్వని మన సంప్రదాయాన్ని వాడికి ఎలా చెప్పాలి? ఒకవేళ చెప్పినా //ఏం అర్ధం అవుతుంది అని తనలో తాను అనుకుంటూ . "ఓహో !అదా ! మావయ్యకి ఇంకా పెళ్లి అవ్వలేదు కదా !అందుకని మావయ్య దగ్గిరే ఉన్నారు "అంది ఈ సమాధానం వాడ్ని కన్విన్స్ చేస్తుందనే నమ్మకంతో . వాడు ఒక క్షణం ఆలోచించి ..."అవును .కరెక్ట్ . " అన్నాడు .కీర్తన హమ్మయ్య అనుకునేలోగానే "మావయ్య పెళ్లి అవగానే అమ్మమ్మా తాతగారూ కాశీ వెళ్ళిపోతారు కదా" అన్నాడు . వాడి మాటకి ఆశ్చర్యపడుతూ "కాశీ నే కాదు ఎక్కడికైనా వెళ్తారు "అంది ... "కాదు ఇంకెక్కడికీ వెళ్ళరు . కాశీకే వెళ్లిపోతారు . మేం పెద్దయ్యాకా అక్కకి ,నాకూ పెళ్లి చేసి నువ్వూ నాన్నా కూడా కాశీ వెళ్ళిపోతారు నాకు తెలుసు "అన్నాడు గంభీరంగా ... ఏదో గొప్ప విషయం కనిపెట్టిన వాడిలా . ఆ మాటలకి నివ్వెరపోయింది కీర్తన . మురళి గదిలో కీ బోర్డు కదలికలు ఆగిపోయాయి . "ఎందుకు " అంది అయోమయంగానే వాడి మనసు తెలుసుకుందాం అని . "తాతయ్యా నాన్నమ్మా కాశీ వెళ్లిపోయారు కదా లలితా అత్త ,బాబాయి వాళ్ల పెళ్ళిళ్ళ తర్వాత . " " మీరూ మేం పెద్దయిపోయాకా వెళ్ళిపోతారు కదా . అందుకే అన్నాను. నిజమే కదా..! ... నాకు అప్పుడు పెద్దవాళ్లు ఎవరొస్తారు అని"అన్నాడు వంశీ నిశ్చలంగా . తలతిరిగిపోయింది కీర్తన కి . నిశ్సబ్దంగా ,నిర్భావంగా వచ్చి ద్వారం దగ్గిర నిల్చున్నాడు మురళి . మురళి తల్లితండ్రులు బాధ్యతలు తీరగానే కాశీ వెళ్లి అక్కడె స్థిరపడిపోయారు .'కొడుకులూ ,కోడళ్ళూ ,కూతురూ బ్రతిమాలినా ఏడాదికి ఒక్కసారి రావడం తప్ప కాశీ వాసాన్ని వదిలేందుకు ససేమిరా అంటున్నారు . "నిండు జీవితం భగవంతుడి దయవల్ల అనుభవించేశామ్ . ఇక భగవంతుడి సన్నిధిలో గడుపుతాం "అంటారు మామగారు . అత్తగారికి పిల్లలు ,మనమల మధ్య ఉండాలని ఉన్నా ఆయనతోనే కదమ్మా నా జీవితం అంటారు . ఇదంతా తెలియని వంశీ అడుగుతుంటే ఏదో నిలదీస్తున్నట్టు తోచింది కీర్తనకి.., తలుపు దగ్గరే ఆగిపోయిన మురళి పరిస్థితీ అంతే .. తాను చూస్తున్న చిన్ని ప్రపంచమే మొత్తం ప్రపంచం అనుకుంటున్న చిన్నారి వంశీ ప్రశ్నల శరాలు నేరుగా మురళి అంతరంగాన్ని తాకాయ్. " లాభం లేదు ,ఎలా అయినా అత్తయ్యగారినీ మావయ్యగారినీ బ్రతిమాలి అక్కడి నుండీ పిలిపించాల్సిందే..! పసివాడిలోకుడా పరమాత్మ ఆ కాశీ విశ్వేశ్వరుడు కొలువుంటాడు చూడమని అయినా వారిద్దరినీ నొప్పించక ఒప్పించే తీరాలి.!" ధృడంగా నిశ్చయించుకుని మురళి వైపు దీనంగా చూసింది.. అర్ధమైందన్నట్లు తలాడించాడు మురళి.. ఒకే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరూ ఆ క్షణం ఒకరి మనసు తో మరొకరు మౌనంగా మాట్లాడుకున్నారు. . !. ఇంతలో గుమ్మంలోంచి "వంశీ"అంటూ ఫ్రండ్ పిలుపు . "అమ్మా! రాకేష్ వచ్చాడు డ్రెస్ మార్చుకుని ఆడుకోవడానికి వెళ్తా ?"అంటూ తల్లి అనుమతి కోసం చూసి, ఆమె అంగీకార సూచకంగా తలఊపగానే తుర్రుమంటున్న తన కలల తోటను నిర్మించి కాపాడుకునే తోటమాలిగానే కాక తనకు మార్గోపదేశమ్, కర్తవ్య నిర్దేశమ్ చేసిన గీతాచార్యుడిగా కూడా కనిపించాడు వంశీ, కీర్తన కి . ...! ఒంటరిగా వృద్ధులైన తన తల్లిదండ్రుల కష్టలను చూడలేక, కాశీ విశ్వేశ్వరుడే తన చిన్నారి వంశీ రూపంలో తన కళ్ళు తెరిపించాడనిపించింది మురళికీ.!

No comments:

Post a Comment

Pages