కళాపరిపూర్ణుడు ‘బాపు’ - అచ్చంగా తెలుగు

కళాపరిపూర్ణుడు ‘బాపు’

Share This

కళాపరిపూర్ణుడు ‘బాపు’

- బి.వి.ఎస్.రామారావు

kala_prapoorna_1ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఈ యుగం ఇచ్చిన గొప్ప వరం బాపు. అతను సంపాదించుకున్న బిరుదులూ, డాక్టరేట్ లు, జీవిత సాఫల్య పురస్కారాలు, లెజెండరీ అన్న ప్రశంసలు, టిటిడి ఆస్థాన కళాకారుడిగా ఎంపిక ,లెక్కలేనన్ని సన్మానాలు ఇవన్నీ 70 ఏళ్ళ సాధన ఫలాలు. ఆ సాధన గురించి తెలుసుకోవాలంటే బాపు బాల్యం నుంచి ప్రస్తావించాలి. బాపు తండ్రిగారు సత్తిరాజు వేణుగోపాల్ గారు క్రమశిక్షణకు ప్రాధాన్యమిచ్చే మనిషి. 2 వ ప్రపంచ యుద్ధ సమయంలో, ఆయన మద్రాసు హై కోర్ట్ లో ఆయన అడ్వకేట్ గా పనిచేస్తూ ఉండగా, యుద్ధ విమానాలు మద్రాసు సమీపంలో బాంబులు వెయ్యగా, ఆయన భయపడి, 2-3 ఏళ్ళు కుటుంబాన్ని తన స్వగ్రామమైన నరసాపురానికి తరలించారు. యుద్ధం చల్లారాకా మళ్ళీ మద్రాసులో విద్యాభ్యాసం సాగించారు బాపు. ఆయన మిగతా జీవితమంతా మద్రాసులోనే గడిచింది. స్కూల్ అయిపోగానే బాపు స్నేహితులమైన నేను, వెంకట్రావ్(ముళ్ళపూడి వెంకట రమణ), మరికొందరు కలిసి, పుస్తకాలు ఇంట్లో పడేసి, మెరీనా బీచ్ కు వెళ్లి ఆడుకునేవాళ్ళం. మేము కెరటాలతో ఆడుతుంటే, బాపు ఒక ఇసుక తిప్ప మధ్య కూర్చుని, స్కెచ్ బుక్ లో ఏవేవో బొమ్మలు గీస్తుండేవాడు. గంటల తరబడి పెన్సిల్ కాగితం మీద నడుస్తూనే ఉండేది. ఇంటికి వెళ్ళేటప్పుడు బలవంతంగా లాక్కుని చూస్తే, బీచ్ కు వచ్చిన అందమైన అమ్మాయిల కళ్ళు, ముక్కులు, లంగా ఓణీలు, కేరింతలు నవ్వులు, పిల్లల ఏడ్పులూ, తల్లుల బుజ్జగింపులు, అబ్బాయిల kala_prapoorna_2పరుగులు, బఠాణీ ల వాడి బుట్ట, లుంగీలు, ప్యాంటు లు వేసుకున్న పెద్దవాళ్ళు, లావుపాటి వాళ్ళు, సన్నటి నడుములు, ఇవన్నీ వేస్తున్నప్పుడు అతని భంగిమ,- ఇవన్నీ గీతల్లో కిక్కిరిసి ఉండేవి. “ఇవన్నీ ఎందుకు గీస్తున్నాడు రా బాబు ?ఏం చేసుకుంటాడు ? “ అని నవ్వుకునే వాళ్ళం. స్కూల్ లో ఉన్నప్పుడు నోట్ బుక్కులు, టెక్స్ట్ బుక్స్ లో ఖాళీ ఉన్నచోట పాఠం చెబుతున్నమాష్టార్ల బొమ్మలు, వంటివి వేసేవాడు. ఇంట్లో అతని గది నిండా కాగితాల గుట్టలు, న్యూస్ పేపర్లలో ఖాళీ ఉన్న చోట కూడా గీసేసేవాడు. వాళ్ళ నాన్నగారు చదివి పారేసిన కోర్ట్ సర్కులర్ లలో కూడా చివరన ఖాళీ ఉంటే, బొమ్మలు గీసేసేవాడు. న్యూస్ పేపర్లలో ఫోటోలు చూసి, వాటిని గీసేవాడు. బాపు చదువులో వెనుకబడలేదు కనుక, అతను బొమ్మలు గీస్తున్నా తండ్రి అడ్డు చెప్పలేదు. ఆయన స్నేహితుడైన ఎస్.ఎన్.చామకూరు అనే పోర్ట్రైట్ పెయింటర్ వద్దకు శని,ఆది వారాల్లో పంపి, బొమ్మలు నేర్చుకోమనేవారు. ఆయన వద్ద శిక్షణ వల్ల బాపు కు లైఫ్ స్కెచింగ్ లో మంచి పట్టు దొరికింది. kala_prapoorna_3పెళ్లిళ్లకు, పేరంటాలకు తండ్రితో నర్సాపురం వెళ్ళినప్పుడు, అక్కడి వీధులూ, పెరళ్ళు, పెంకుటిళ్ళూ, పూరిపాకలు, నీటిలోని పడవలు, గుర్రబ్బండి లోంచి తొంగి చూసేవాళ్ళు ఇలా ఎందరినో తన గీతల్లో పొందుపరిచేవాడు. కొన్నింటిని తన మనసులో బంధించేవాడు. ముఖ్యంగా దృశ్యంలో లైట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తోందో,దాని ప్రకారం షేడ్లు వేస్తూ, అతను లైఫ్ స్కెచ్ లో మాస్టర్ అయిపోయాడు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నాలాంటి వాడెవడైనా ఇంటికి వస్తే, ‘ఒరేయ్, ఆ చాప మీద బోర్లా పడుకో,కాళ్ళు సగం మడిచి పైకెత్తు, అరిచేతుల మీద తల ఆనించి, నన్ను చూడు,’అనేవాడు. తర్వాత నా బొమ్మ ఎలా ఉందో చూస్తే, పొడుగు జడ, జళ్ళో పూలు, చేతులకు గాజులు, కాళ్ళకు పట్టీలు, ఉండేవి. తన మనసులో ముద్రించుకున్నవి, నా భంగిమ చూస్తూ వేసేవాడు. అరవ పత్రికల్లో అచ్చైన ప్రముఖ చిత్రకారులైన ధాణు గారు , వాసు గారు , గోపి గారు వంటి వారి బొమ్మలు కత్తిరించుకుని, ఒక ఆల్బం చేసి, అవి చూసి బొమ్మలు వేసి తీసుకువెళ్ళి వాళ్లకు చూపేవాడు. వాళ్ళ సలహాలు తీసుకుని,వాళ్ళు , ‘నీకో ప్రత్యేక స్టైల్ ఉంది, అలాగే మైంటైన్ చెయ్యి, గొప్ప చిత్రకారుడివి అవుతావు’ అని దీవిస్తే, నమస్కరించి వచ్చేసేవాడు.వడ్డాది పాపయ్య బొమ్మలు, నాయకుల బొమ్మలు సేకరించి ఆల్బం చేసేవాడు. చదువుకుంటున్న రోజుల్లోనే రమణ 4,5 ఏళ్ళ వయసున్న బాపు మేనల్లుడు రంగ (ఇప్పుడు అల్లుడు)తో ఆడుతూ సరదాగా కాలక్షేపం చేసేవాడు. ఆ ప్రేరణ తోనేkala_prapoorna_4 బుడుగు క్యారెక్టర్ సృష్టించాడు. ఆ పాత్ర మాటలు, బాపు దానికి రూపకల్పన చేసిన బొమ్మలు, చిరస్థాయిగా తెలుగు లోగిళ్ళలో నిలిచిపోయాయి. బాపు ఉద్యోగపర్వం 1951-53 మధ్యలో రమణ బి.కాం చదువుతూ ఉండగా అతనికి ఆంధ్రపత్రిక లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు బాపు చేత ఇల్లుస్త్రేషన్ లు, కార్టూన్లు, ప్రత్యేక సంచికలకు కవర్ పేజీ లు వేయించేవాడు. అవి చూసి, మిగతా పత్రికల వారు కూడా బాపు చేత బొమ్మలు వేయించుకునేవారు. 1955 లో బాపు అడ్వకేట్ గా ఎన్రోల్ అయ్యేసరికి అతని తండ్రి స్వర్గస్తులయ్యారు. మంచి చిత్రకారుడిగా గుర్తింపు వచ్చింది కనుక, ఆ రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకుని, బాపు లాయరు గిరీకి నీళ్ళు వదిలేసాడు. జె. వాల్టన్ థామ్సన్ కంపెనీ లో ఏడాదిన్నర పాటు ఆర్టిస్ట్ గా ఉద్యోగం చేసాడు బాపు. వాళ్ళు ఏదైనా లేఅవుట్ వెయ్యమంటే, గంటలో వాళ్ళ ఊహకు మించిన kala_prapoorna_5బొమ్మలు వేసి ఇచ్చేవాడు. మిగిలిన సమయమంతా ఖాళీగా ఉండడంతో బయటకు వచ్చి, ఎఫ్ఫీసియంట్ పబ్లిసిటీస్ అనే సంస్థలో “నెలకు 30 గంటలు మించి పని చెయ్యను’ అన్న నియమంతో చేరాడు. ఏడాదిన్నర తర్వాత ఆ ఉద్యోగం వదిలి, ఎఫ్.డి.స్టివర్డ్స్ అనే పెద్ద సంస్థలో చేరాడు.చాలా పెద్ద జీతం కావడంతో ఇల్లు, కార్ వంటి సౌకర్యాలు సమకూరాయి. క్రింది వాటాలో తను, పైన రమణ కాపురం పెట్టేసారు. అందులోనే గోపుల్ గారనే గొప్ప ఆర్టిస్ట్ ఉండడంతో కొన్నాళ్ళు పని చేసి బయటకు వచ్చేసారు. లైఫ్ స్కెచింగ్ లో నిష్ణాతుడు బాపుకు చిన్నతనం నుంచి లైఫ్ స్కెచింగ్ పై మక్కువ. అందుకే అతను గీసిన బొమ్మలు ఒక మూసలో ఉండవు. ఎఫ్ఫీసియంట్ పబ్లిసిటీస్ లో పనిచేస్తుండగా ఆయన వద్ద 16 ఎం.ఎం. మూవీ కెమెరా ఉండేది. ఉదయం 6 గం. బయల్దేరి దానితో అనేక వీడియోలు చాటుగా తీసుకునేవారు. వాటిని తన రేఖాచిత్రాలకు ఉపయోగించుకున్నాడు. ఫోర్డ్ ఫౌండేషన్ అధినేత ఇస్రాయెల్ కు చెందిన ‘ఈసెన్బెర్గ్’ గారు బాపు గారి అభిమాని. ఆయన ఆల్ ఇండియా టూర్ కు వెళ్ళినప్పుడు బాపు గారిని కెమెరామెన్ హోదాలా కూడా రమ్మన్నారు. ఆయనతో దేశమంతా తిరిగి, ఫోటోలు తీసిన బాపు ఆయన్ను గాడ్ ఫాదర్ గా గౌరవిస్తారు. కొందరు బాపు చేతి రాత వంకరటింకరగా ఉందంటే, మరికొందరు ముత్యాల్లా ఉంది అనేవారు. కొందరు విసిటింగ్ కార్డ్స్, శుభలేఖలు రాయించుకునేవారు. kala_prapoorna_6తర్వాత అది ఎంత పాపులర్ అయ్యిందంటే, 1994 లో బాపు ఫాంట్ ప్రింట్ మీడియా లోకి వచ్చింది. సంగీతం బాపు ఊపిరి బాపు చిన్నతనంలో హార్మోనియం వాయించేవాడు. హిందుస్థానీ సంగతులు అన్నీ దానిపై పలికించేవాడు. రేడియో అన్నయ్యగారు అప్పుడప్పుడు బాపుకు అవకాశాలు ఇస్తుండేవారు. బడే గులాం అలీ ఖాన్ కచేరీలు, బిస్మిల్లా ఖాన్ గారి షహనాయి, హరిప్రసాద్ ఫ్లూట్, మెహ్దీహాసన్ గారి గజల్స్ అంటే బాపుకు ప్రాణం. బొమ్మలు గీస్తున్నా, పుస్తకాలు చదువుతున్నా, ఒక ప్రక్క సంగీతం మ్రోగుతుండేది. అలాగే సాజ్జిద్ హుస్సేన్ గారి మాండలిన్ విని ముగ్ధుడైన బాపు, ముత్యాల ముగ్గు సినిమాలో ఒక లవ్ సీన్ కి ఆయన చేత సోలో పెట్టించాడు. విశ్వవ్యాప్తంగా ఉన్న అనేక ఇన్స్త్రుమెంటల్ సింఫనీ లు అన్నీ బాపు వద్ద ఉండేవి. కొన్నింటిని రాజాధిరాజు సినిమాలో వాడాడు. జాజ్ మ్యూజిక్ లోని కొన్ని పాపులర్ పాటల్ని బాపు హార్మోనియం తో వాయించి వినిపించేవారు. బాపు పుస్తక ప్రియుడు kala_prapoorna_7బహుశా బాపు చదివినన్ని పుస్తకాలు వేరెవరూ చదివి ఉండరేమో ! తెలుగు, ఆంగ్ల సాహిత్యం, పురాణాలు, కావ్యాలు, అన్నీ చదివి చర్చించేవాడు. పుస్తకాలు కొని చదివి, కొన్నింటిని నాకు చదవమని ఇచ్చేవాడు. అందుకే బొమ్మలకై వచ్చే రచనలు క్షుణ్ణంగా చదివి, రచయత మూలాంశం గుర్తించి, రచయత ఊహకు మించిన బొమ్మలు వెయ్యగలిగేవాడు. దేవుడి బొమ్మలు వేసేటప్పుడు పురాణాలలోని వర్ణనలను గుర్తుకు తెచ్చుకునేవాడు. గ్రంథ పఠనం, చదువుతూ సంగీతం వినడం అతని దినచర్యలో భాగం. బాపుకు నచ్చిన సినిమాలు 10 వ క్లాసు నుంచి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడు బాపు. హాస్య ప్రధానమైన చిత్రాలంటే ఇష్టపడేవాడు.బొమ్మలు వేసి పాకెట్ మనీ వచ్చిన రోజుల్లో రమణతో కలిసి, హాలీవుడ్ క్లాసిక్స్ అన్నీ చూసేవాడు. ఫ్రెడస్టియర్, జీన్ కెల్లీ వంటి డాన్సర్ లు, చార్లెస్ లాటన్, జోసెఫ్ కాటన్, గ్యారీ కూపర్ వంటి హీరో లంటే బాపు కు చాలా ఇష్టం. వీడియో టేప్ లు వచ్చాకా బాపు ఇంట్లో కూర్చునే సినిమాలు చూసేవాడు. తనకు నచ్చిన సినిమాల డి.వి.డి లు కొని తెచ్చుకుని, అలా కొన్ని వేల సినిమాలు చూసాడు. సినీరంగ ప్రవేశం బాపుకు సత్యజిత్ రే అంటే ఇష్టం.ఆయనలా సినిమా తియ్యాలన్న కోరిక ఉండేది. కొన్నాళ్ళు బాపురమణ లు విజయవాడలో జ్యోతి పత్రిక నడిపారు. అది ఆనతిkala_prapoorna_8 కాలంలోనే చాలా పేరుగాంచింది. తర్వాత ఎందుకో పత్రిక మొత్తం సంపాదకులు రాఘవయ్య గారి చేతిలో పెట్టి, వాళ్ళ వాటాకు వచ్చిన లక్ష రూపాయిలు, ఒక ప్రెస్ తీసుకుని తిరిగి మద్రాస్ వచ్చేసారు. అప్పటికే రమణకు సినీ రైటర్ గా పేరుంది, బాపుకు మంచి కంపోసర్ గా, చిన్న గీతల్లో మంచి ఎక్ష్ప్రెషన్ ఇవ్వడంలో అనుభవం ఉంది. ఇద్దరూ స్క్రీన్ప్లే రాసి నవయుగ వారికి చూపిస్తే, వారు పాటలు జోడించమన్నారు. 4 పాటలు మహదేవన్ గారితో రికార్డు చేయించి, నవయుగ వారు ఓకే చేసాకా, బాపు ‘సాక్షి’ సినిమాకు 25 రోజుల షెడ్యూల్ వేసి, పులిదిండిలో 19 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసారు. ‘సాక్షి’ కి మంచి పేరు, అవార్డులు వచ్చాయి,ఇంగ్లిష్ లో టైటిల్స్ వేయించి, కేంద్ర ప్రభుత్వం రష్యా కు కూడా పంపింది. కాని, ఆ సినిమాలో జరిగిన పొరపాట్లు తెలిసిన బాపు, మళ్ళీ అవి పునరావృతం కాకుండా ఒక వెటరన్ డైరెక్టర్ లాగా ‘బుద్ధిమంతుడు’ సినిమా తీసారు. అది వంద రోజులు ఆడింది. సంపూర్ణ రామాయణం ట్రిక్ షాట్స్ అన్నీ రవికాంత్ నగాయజ్ గారికి రంగుల బొమ్మలు వేసిచ్చారు బాపు. దానితో ఆయన పని సులువై, ఆ స్క్రిప్ట్ ను మద్రాస్ సినీ ఫీల్డ్ వారందరికీ చూపారు. బాపు స్క్రిప్ట్ లో ఎడమ ప్రక్క నటీనటుల హావభావాల ఫ్రేములు, కుడి ప్రక్క డైలాగులుంటాయి. ఇలా ఒక సినిమాకు 3000- 3500 ఫ్రేములు బాపు గీసేవాడు. kala_prapoorna_9ఈ స్టొరీ బోర్డు వల్ల అనేక లాభాలు ఉన్నాయి. యూనిట్ మొత్తానికీ జరగబోయే సన్నివేశం తెలుస్తుంది.ఆర్టిస్ట్ లకు ప్రధానమైన మూమెంట్ లు, ఎక్స్ప్రెషన్ లు తెలుస్తాయి. ముఖ్యంగా నెగటివ్ ఫిలిం గొప్పగా ఆదా అవుతుంది. 150 నిముషాలకు , 2 లక్షల అడుగులు పైగా ఫిలిం పట్టే కాలంలో బాపు కు 35 వేల అడుగులకు మించేది కాదు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 50 సినిమాలకు పైగా తీసిన బాపు అనిల్ కపూర్, రాజేంద్రప్రసాద్ ,నూతన్ ప్రసాద్ వంటి మంచి నటుల్ని పరిచయం చేసాడు. వీడియో పాఠాలు, సీరియల్స్ ఎన్.టి. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాపురమణల్ని పిలిచి, 5వ తరగతి వరకూ పిల్లలకు వీడియో పాఠాలు తియ్యమన్నారు. ఆ సమయంలో బాపురమణ లు సినిమాలకు కొన్నాళ్ళు దూరంగా ఉంటూ, 3 వ తరగతి వరకూ అద్భుతంగా పాఠాలు తీసారు. వాటికి ఎ.ఆర్.రహమాన్ గారితో రీ-రికార్డింగ్ కూడా చేయించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారి, ఆ విషయం పట్టించుకోక పోవడంతో తిరిగి సినీరంగ ప్రవేశం చేసి, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం లాంటి సినిమాలు తీసారు. రాంబంటు సినిమా తీస్తుండగా భాగవతం సీరియల్ కోసం ఈ –టివి వారి పిలుపు వచ్చింది.ఆరేళ్ళు కష్టించి భాగవతాన్ని ఒక కళాఖండం గా రూపొందించారు. అందులో బాపురమణ ల ప్రతీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. రమణ లేని బాపు బాపు అడ్వకేట్ గా నమోదు అయ్యాకా, ఫిలిం సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన భాగ్యవతి ని పెళ్లి చేసుకున్నాడు. రమణ సినీ రచయతగా స్థిర పడ్డాకా, సాహితీkala_prapoorna_10 కుటుంబం నుంచి వచ్చిన నండూరి వారమ్మాయి శ్రీదేవిని పెళ్ళాడాడు. వీళ్ళ కుటుంబాలు పిల్లాపాపలతో సహా పాలు నీళ్ళలా కలిసిపోయాయి. శ్రీరమరాజ్యం స్క్రిప్ట్ పూర్తిగా తయారు చేసి ఇచ్చాకా, రమణ అర్ధరాత్రి హఠాత్తుగా కన్నుమూసాడు. వాళ్ళిద్దరిదీ వీడని బంధం. బాపుకు రమణ లేకపోవడం పెద్ద లోటు అయినా, ఆ రాములవారి దయతో సినిమా పూర్తి చేసాడు. ముక్తాయింపు బాపు తనకు ఊహ తెలిసిన 70 ఏళ్ళలో ఏ ఒక్క క్షణం వృధా పరచకుండా ఏదో ఒక కళకు అంకితం అయ్యాడు. అతడు నిజమైన కళాప్రపూర్ణుడు . అటువంటి వాడు యుగానికి ఒక్కడు పుడతాడు. బాపు కు సమకాలీకులు అవ్వడం మన అదృష్టమైతే, అతను బాల్యం నుంచి నా ప్రాణ స్నేహితుడు అవడం నాకు దేవుడిచ్చిన వరం !

No comments:

Post a Comment

Pages