బాపు చిరస్మర(మ)ణీయులు - అచ్చంగా తెలుగు

బాపు చిరస్మర(మ)ణీయులు

Share This
బాపు చిరస్మర(మ)ణీయులు
 - పెయ్యేటి శ్రీదేవి

ఉదయం మెల్లగా స్వర్గదారాలు తెరుచుకుంటున్నాయి. పుణ్యకార్యాలు, మంచి పనులు చేసిన ధన్యజీవులందరూ ఒక చోట సమావేశమై, సరదాగా వాళ్ళు చేసిన మంచి సినిమాలు, వాటిలోని హాస్య సన్నివేశాలు రమణగారితో చెప్పుకుని నవ్వుకుంటున్నారు. వాళ్ళతో రమణగారు కూడా మాట్లాడుతూ నవ్వులు పంచుకుంటున్నారు. కాని పైకి ఎంత నవ్వుతున్నా రమణ గారి మనసులో ఏమూలో తీరని బెంగ. ఆ బెంగంతా తన నేస్తం బాపు గారి గురించే. తను లేకుండా బాపు ఎలా ఉన్నారోనని. శ్రీరామరాజ్యం సినిమాకి సంభాషణలు వ్రాయడం పూర్తవగానే తను కొంచెం ఒంట్లో బాగుండక, మిగిలిన భాగం బాపుగారిదే కదా, ఛాయాంకన పర్యవేక్షణ, దర్శకత్వం, మిగిలిన విషయాలు బాపుగారే చూసుకుంటారులే అనుకుని తను వచ్చేసాడు. వచ్చినప్పట్నించి ఆ సినిమా ఎలా వచ్చిందోననే ధ్యాసే. తను వచ్చి మూడు రోజులయింది. (పితృదేవతలకి ఏడాది ఒక రోజు కింద లెక్క). ఆయన ఈ మూడు రోజులూ మూడు యుగాలుగా గడుపుతున్నారు పాపం.నాగేశ్వరరావుని, అంజలీదేవిని అడిగారు, ' అయ్యా, నాగేశ్వర్రావుగారూ! మీరూ అంజలీదేవిగారూ వచ్చి ఒక పూట పైనే అయింది కదా! శ్రీరామరాజ్యం సినిమా ఎలా వుంది?' ' మీరేం బెంగపడకండి రమణగారూ. మనసులో మీరు లేరన్న దిగులున్నా బాపుగారు శ్రీరామరాజ్యం సినిమా చాలా అద్భుతంగా తీసారు. అందరూ బాగా ఆదరించారు. అందులో వాల్మీకి పాత్ర నేనే వేసాను. సీతని అద్భుతంగా తీర్చిదిద్దారు.' ఇంతలో అందరూ హడావిడిగా పరుగులెడుతున్నారు. లోపలికి వచ్చేవాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ చాలా అందమైన అమ్మాయిలు. వాళ్ళ నడుములు చాలా సన్నగా తీగల్లా వున్నాయి. పెద్ద కలువరేకుల్లాంటి కాటుక తీర్చిన కళ్ళు, నుదుట సిందూరం బొట్లు, నవ్వితే విరజాజుల్లా విచ్చుకునే చిన్ని నోళ్ళు, చివర జడకుప్పెలతో నల్లత్రాచుల వలె వున్న పొడవాటి జడలు, మరీ పొడవుగా వుండడం వల్లనేమో, కొంతమంది ఆ నల్లత్రాచుల్ని కొంతమంది మెడలకి, కొంతమంది చేతులకి చుట్టుకుని, చీరల సింగారాలతో, మువ్వల సవ్వడులు చేస్తూ, కలహంస నడకలతో వస్తూంటే, ఎవరా ఈ అందాల బొమ్మలు అనుకుంటూ చాటుగా నించుని రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు కూడా విస్తుపోతూ, కించిత్ అసూయతో చూస్తున్నారు. ఆ అందాలబొమ్మల గురింంచి సృష్టికర్త బ్రహ్మకి కూడా పాలుపోలేదు. తనకి తెలిసి ఇన్ని వేల అందాల బొమ్మలు తను గీసిన బొమ్మలు కావు. మరి ఈ సృష్టి చేసిన విధాత ఎవరు అని ఆలోచిస్తున్నాడు. ఈలోగా పూలపల్లకి వెడుతోంది. దారి పొడవునా పూలు జల్లుతున్నారు. ఎర్రతివాచి పరిచి స్వాగతం పలుకుతున్నారు. ఆ పల్లకి లోంచి ఒకాయన దిగుతుంటే, ఆయన్ని చేతులు పట్టుకుని దేవతలందరూ సాదరంగా లోనికి తీసికెడుతున్నారు. అందరితో ఇంత గొప్పగా రాచమర్యాదలు చేయించుకునే ఆ మహానుభావుడెవరై వుంటారా అని చూస్తున్నారు. ఇంకా ఆయనెవరో సినిమా కెమెరా, రంగు పెనిసిళ్ళు, పెన్నులు, పెయింటింగ్ బ్రష్షులు మోసుకుంటూ వచ్చాడు. ' రామలింగయ్యా! ఆయన ఎవరూ?' అడిగారంతా. బాపుగారయ్యా, బాపుగారు! మన బాపుగారు!' ' ఓహో! ఈ వచ్చిన అందాలబొమ్మలందరూ బాపు బొమ్మలన్నమాట!' అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా అరుస్తున్నారు, ' బాపుగారొచ్చారు, బాపుగారొచ్చారు!' అంటూ. బాపుగార్ని చూడగానే గమ్మున రమణగారు వచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఆయన దగ్గర వున్న ఆండ్రాయిడ్ టేబ్లెట్ జేబులోంచి తీసిచ్చారు బాపుగారు. ' శ్రీరామరాజ్యం ' విడియో ఇందులో వుంది. జాగ్రత్తగా వుంచు. తరవాత చూద్దుగాని.' ఇంతలో సింహద్వారం వద్ద ఎవరితోనో పెద్ద గొ్డవ జరుగుతోంది. ఇద్దరు చిన్న పిల్లలని లోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు అటు ఇటు వున్న ద్వారపాలకులు. ' వీల్లేదు. మీరు బాగా చిన్నపిల్లలు. అందుకని మీరు లోనికి రాకూడదు.' ' అసలు మేం ఎవరో తెలుసా? తెలిస్తే ఇలా మాటాడరు. హోలాంధ్రా అంతా తెలుసు మేం ఎవరో. మేం చిన్నపిల్లలం అంటావేంటి? మేం పుట్టి చాలా ఏళ్ళు అయింది. ఓ అరవై ఏళ్ళో, నలభయి ఏళ్ళో, డెభ్భయి ఏళ్ళో అయుంటుంది. మాకు లెక్క సరిగా తెలీదు. బాపు రమణల గీత రాతల్లో పుట్టిన మేం చిరంజీవులం.' ' మరింత చిన్నగా వున్నారేం? నీ పక్క ఈ పిల్లెవరు?' ' ఏయ్, పిల్లంటావేంటి? మాటలు మరియాదగా రానీ. ఇది నా ఫ్రెండ్ సీగాన పెసూనాంబ. మేం ఎన్నేళ్ళయినా చిన్నగానే వుంటాం.' ' అంటే ఏం తినరా? మీ అమ్మ మీకేం పెట్టదా పాపం?' ' ఏయ్, జాటర్ డమాల్! మా అమ్మనేం అనకు. మా అమ్మ చాలా మంచిది. కాని ఒక్కోసారి చాలా ఇబ్బందులు పెడుతుంది. అది నాకు నచ్చదు. నేను ఏడుస్తున్నా వినకుండా ఘట్టిగా పట్టేసుకుని స్నానం చేయిస్తుంది. నాకు నచ్చలేదని చెప్పినా వినకుండా తనకిష్టమైన బట్టల్లో కూరుతుంది. ఆఖలి లేదు తల్లో అన్నా వినకుండా, బలం, బలం అంటూ పేద్ద గ్లాసుడు బోర్నవిటా బలవంతంగా తాగిస్తుంది. నాకు కడుపునొప్పిగా వుంది, స్కూలుకెళ్ళనంటే, డాక్టర్ని పిలిచి ఇంజక్షను చేయిస్తానంటుంది. అప్పుడు గమ్మున కడుపు నొప్పి తగ్గిపోయిందంటా. అప్పుడు మా గోపాళంం బాబాయొచ్చి నన్ను రక్షించి షాపింగ్ కి తీసికెళ్ళి, చాక్లెట్లు కొనిస్తానని చెప్పి స్కూలులో వదిలేస్తాడు. అప్పుడు వాడి మీద చాలా ఖోపం వచ్చేస్తుంది. పోనీ, పలక పగిలి పోయింది, స్కూలుకెళ్ళను అంటే కిరాణాకొట్టు విసినాదాన్నడిగి ఇంకో పలక కొనిస్తాడు. బళ్ళో మాస్టారేమో అ ఆ లు సరిగ్గా రాయలేదని పెద్ద బెత్తంతో కొడతాడు. ఇలా ఎన్నని చెప్పను నా కష్టాలు? చిన్నపిల్లలంటే అస్సలు గౌరవం లేదు పెద్దాళ్ళకి. అందుకే వచ్చేసాం. మరి బాపుతాతగారిని మీ దగ్గిరకి లాక్కొచ్చారుగా? అందుకే నా కష్టాలన్నీ చెప్పుకోడానికి బాపుతాత గారికి తెలీకుండా వెనకాలే వచ్చేసాం.' ' మీ పేర్లేంటి?' ' హయ్యో! ఇంత చెప్పినా మా పేర్లు తెలీలేదా? రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుంది అన్నాట్ట వెనకటికెవరో. నా పేరు బుడుగు. రమణగారు రాసిన బుడుగు నవల్లో హీరోని నెనే. ఇది సీగానపెసూనాంబ, నా ఫ్రెండు. మేమంటే బాపుతాతగారికి చాలా ఇష్టం. మేం లేకపోతే బెంగెట్టుకుంటారు. మమ్మల్ని పోనీ.' ' కుదర్దంటే కుదర్దు.' ' ఎందుక్కూ?' ' రారా బుడుగూ, వీడో జాటర్ డమాల్. అదిగో, వీడి వెనకాల పెద్ద భూతం వస్తోందిగా, అప్పుడు వీడ్ని ఘాట్టిగా పట్టేసుకుంటుందిగా? అప్పుడు వెడదాం.' భూతం ఎవరా అని వెనక్కి చూసేంతలో సీగానపెసూనాంబ, బుడుగు బుడుంగున లోపలికి ఓ గెంతు గెంతారు. పరిగెట్టుకుంటూ గమ్మున బాపుగారి దగ్గరికి వెళ్ళారు. ' మీరెందుకొచ్చార్రా బుడుగూ?' ' అమ్మ నలుగు పెట్టి తలంటి పోస్తానని నన్ను ఎత్తుకు తీసికెడుతుంటే, నా కొద్దు బాబోయ్ తలంటు అని ఘాఠిగా విడిపించుకుని కిందకి దిగి పరెగెట్టాను. నా వెంట అమ్మా పరిగెట్టింది. నేనింకా ఘాట్టిగా పరిగెట్టాను. అలా పరిగెట్టుకుంటూ, పరిగెట్టుకుంటూ, పరిగెట్టుకుంటూ.....కుంటూ, మధ్యలో సీగానపెసూనాంబని లాక్కొచ్చి, ఇద్దరం మీ వెనకాతలే వచ్చేసాం. మేం మీతోనే వుంటాం.' ఇంతలో బాపు గీసిన అందమైన అమ్మాయిలందరూ, ' అవును బాపూ! మేమూ మీతోనే వుంటాం. ఇంకా భూలోకంలో వుంటే, మీరు వేసిన ఈ పొడవాటి జడలు ఫేషనంటూ కత్తిరించేస్తారు. నుదుట బొట్టు తీసేస్తారు. ఛీ, చీర బాలేదంటూ, ఫేషను పేరుతో పీలికల డ్రస్సులేస్తారు. పాపిడి లేకపోయినా, చిన్న హుక్కున్న పాపిడిబిళ్ళ తగిలిస్తారు. రెందుచేతులున్నా, ఒక చెయ్యే కుట్టించి, ఇంకో వైపు బుజం కిందగా వచ్చి, అటు ఇటు చిల్లులున్న డ్రస్సులేవో వేయిస్తారు. కాళ్లకి, నడవలేమన్నా వినకుండా హైహీల్సు వేస్తారు. ఆ కత్తిరించిన జుట్టుకి టింకర వంకర టింకర వంకర పాపిడి తీసి మా రూపాలు మార్చేస్తారు. లేకపోతే జుట్లు విరబో్యించి వుంచుతారు. తలుచుకుంటేనే్ భయమేస్తోంది. టి.వి. ఛానెళ్ళలో యాంకరమ్మల్లాగా, హీరోయిన్ల లాగా మా అందమైన రూపాలు వికృతంగా ఉండకూడదనే మేమూ వచ్చేసాం. ఇవిగో, మీ బ్రష్షులు, కుంచెలు, కాగితాలు ఇక్కడికి తెప్పించాం. ఇక్కడే మీరు బొమ్మలెయ్యండి. మీరు మమ్మల్ని ఎంతో అందంగా, సంప్రదాయ బధ్ధంగా తీర్చి దిద్దారు. మరి అమ్మాయిలందరూ అలా ఎందుకుండరు? మన సంప్రదాయాన్ని విడిచిపెట్టి ఎందుకంత వికృతంగా తయారవుతున్నారు?' ' అమ్మాయిలూ! మనం ఒకళ్ళని నిందించకూడదు. కాలానుగుణంగా, కాలప్రవాహంలో అనేకానేకం జరుగుతూ వుంటాయి. కాలచక్రం ఆగదు. ఆ కాలచక్ర భ్రమణంలో మళ్ళీ పాత సంప్రదాయాలు వస్తాయని ఆశిద్దాం.' ఇంతలో బాపుగీతల్లోని ' శ్రీరామ పట్టాభిషేకం ' లోని వారంతా వచ్చి, ' శ్రీరామరాజ్యం ' త్వరగా చూపించు నాయనా, చూడాలనుంది.' అన్నారు. ' జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియపరిపాలకా ||'
************************* 
సీతమ్మవారు సంతోషంగా అంది, ' నాయనా, బాపూ! నాయనా! వెంకటరమణా! చిత్రాన్ని చాలా బాగా తీసారు. మీరిద్దరూ ధన్యజీవులు. మీ పేర్లు చిరస్థాయిగా భూలోకంలో నిలిచిపోతాయి.'శ్రీరాముల వారు అరమోడ్పు కళ్ళతో సీతమ్మ మాటలు వింటూ మందహాసం చిందించారు. ***********************

No comments:

Post a Comment

Pages