ఒక చిన్న మాట - అచ్చంగా తెలుగు

ఒక చిన్న మాట

Share This
ఒక చిన్న మాట మనం ఒకేసారి రెండు మూడు పనులు చెయ్యగలుగుతాం. అంటే మన మెదడుకు సమాంతరంగా రెండు మూడు దిశల్లో పని చెయ్యగల సామర్ధ్యం ఉందన్నమాట ! ఉదాహరణకు మనం ఫోన్ మాట్లాడుతూ కంప్యూటర్ లో పని చేసుకుంటూ టీ త్రాగుతాం. లేదా టీవీ చూస్తూ, ఇంటి పనులు పర్యవేక్షిస్తూ, వంట చేస్తుంటాం. కాని, కొన్ని సందర్భాల్లో, మన ప్రమేయం లేకుండానే, మనం చేసే రెండు మూడు పన్లూ వదిలి, ఒక్క దిశలో మనసు లయం అవుతుంది. అలా లయమైన మనసు పరవశించి, అప్రయత్నంగా ‘ఓహ్, అద్భుతం,’ అనిపించి, కొన్ని సార్లు కళ్ళ వెంట ఆనందబాష్పాలు వర్షిస్తాయి. అలా ఇంద్రియాలని, మెదడును, కట్టి పడేసి, ఏకం చేసే శక్తి ఒక్క “కళ” కు మాత్రమే ఉంది. మంచి పాట విన్నా, మంచి నాట్యం, శిల్పం, చిత్రం, పల్లెపదం విన్నా, మంచి సాహిత్యం చదివినా .... తమనుతాము మరచి , మమేకమవడం ఇందువల్లే ! ఒక్కసారి ఆలోచించండి. లలిత కళలు లేని లోకం ఎలా ఉంటుందో ! పూలు లేని వనసీమలా, స్తబ్దమైన సెలయేరులా, నల్లటి శూన్యాకాశంలా... ఒక జడత్వం మన జీవితాల్ని కమ్మేస్తుంది. అందుకేనేమో, విధాత మన జీవితాల్ని రంజింపచేసి, ఆహ్లాద పరిచేందుకు ఈ కళలు అన్నింటినీ సృష్టించాడు. ఇంతటి మనోల్లాసాన్ని కలిగించే కళలకు ప్రోత్సాహం లేకపోతే ఎలా ? కళనే నమ్ముకున్న కళాకారుడి పరిస్థితి ఏమిటి ? ఆదరణ కోసం, ఉపాధి కోసం పూర్వం కళాకారులు రాజాశ్రయం కోరి వలస వెళ్ళేవారు. మరి ఇప్పుడో... రాజులూ లేరు, రాజ్యాలూ లేవు. మరి ఈ కళలకు ఆదరణ కరువై ఒక్కో కళ మరుగున పడుతోంది. నిజానికి ఏ ఒక్క కళాకారుడు ప్రోత్సాహం, ఉపాధి కరువై ఒక్క రోజు పస్తున్నా అది మన సమాజానికే అవమానం. కాని, ప్రస్తుతం అలా ఎంతో మంది కళాకారులు ఉపాధి లేక అలమటిస్తున్నారనేది కఠోర సత్యం !అందుకే మన కళ్ళ ముందు కనికట్టు చేసే ఏ కళనైనా, మనకు వీలైనంత ప్రోత్సహిద్దాం. మన అక్షరాన్ని, పాటను, బొమ్మను, నాట్యాన్ని పదిలపరచి ముందు తరాలకు అందిద్దాం. ఈ సదుద్దేశంతో మొదలైనవే మన ‘అచ్చంగా తెలుగు’ పత్రికలోని సంగీతం, తెలుగు బొమ్మ, సాహిత్యం వంటి శీర్షికలు. మరి ‘నాట్యాన్ని’ మాత్రం ఎందుకు వదలాలి ? తెలుగు నృత్యకారుల గురించి, నాట్యరీతుల గురించి, నాకు సరైన అవగాహన లేకపోవడంతో కాస్త తటపటాయిస్తూ వచ్చాను. కాని, మన ‘బ్నిం’ గారు అడగిందే తడవుగా, సహృదయంతో, తనకున్న అపారమైన అనుభవంతో మనకు నాట్యం గురించిన విశేషాలను నెలనెలా అందించేందుకు ముందుకు వచ్చారు. అలా అచ్చంగా తెలుగు లోగిలిలో “శింజారవం “ మొదలయ్యింది. ఈ మువ్వల సవ్వడి, మన మనసుల్లో అక్షరాలతో కలిసి మ్రోగుతుంది ! ఎప్పటిలాగే హరివిల్లు రంగుల్లా ఏడు వినూత్నమైన కధలు, నాలుగు ధారావాహికలు ఈ సంచికలో ఉన్నాయి. ఆత్రేయ వర్ధంతి , భానుమతి జయంతి సందర్భంగా రాసిన ప్రత్యేక కధనాలు, మన ‘అచ్చంగా తెలుగు’ పత్రిక ఆర్టిస్ట్ నాగేంద్రబాబు గారి గురించిన ప్రత్యేక పరిచయం, ఆమని కోయిల గానంలా మైమరపింప చేసే ఈమని శంకరశాస్త్రి గారి వైణిక వైశిష్ట్యం, మరికొన్ని ప్రత్యేక శీర్షికలతో అందంగా ముస్తాబై కొత్త సంచిక మీ ముందుకు వచ్చేసింది. చదవండి, మీ స్పందనను కళాకారులు అందరికీ కామెంట్స్ రూపంలో అందించండి. కళల్ని ప్రోత్సహించండి ! మీ అభిమానానికి, నిరంతర ప్రోత్సాహానికి కృతజ్ఞతాభివందనాలతో... భావరాజు పద్మిని.      

No comments:

Post a Comment

Pages