సుమబాలల అంతరంగం - అచ్చంగా తెలుగు

సుమబాలల అంతరంగం

Share This

సుమబాలల అంతరంగం

- వడ్లమాని మణి మూర్తి

చీకటి రేఖలు చీల్చుకొంటూ తూర్పుదిక్కున భానోదయం అయ్యింది...

సమస్త జీవులను కర్మసాక్షి  ఆ సూర్యభగవానుడు తన సహస్రకిరణాలతో చైతన్యవంతం చేస్తున్నాడు.ఆ అడవి అంతా  వసంత శోభతో   నిండిపోయింది. ఎక్కడ చూసినా పొడుగాటి వృక్షాలు..వాటిమీద నుంచి . మంద్రంగా స్పృశించే చల్లని పవనాలు.,కోకిలమ్మలు,చిలకమ్మలు,పాలపిట్టలు , ఇంకా ఎన్నోరకాలపక్షులు   తమ గొంతెత్తి  బృందగానలనుఆలపిస్తున్నాయిప్రతి చెట్టు,ప్రతికొమ్మ , ప్రతి రెమ్మ ఆనందంగా తలలూపుతున్నాయి, మయురాలు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి.లేళ్ళు గంతులు వేస్తున్నాయి.ఏనుగుల ఘీంకరింపులు,కోతిపిల్లల కొంటె కోణంగి చేష్టలతో అటు ఇటు  గెంతుతూ ఆటలాడుతున్నాయి.మేము తక్కువా అంటూ ఉడతలు హడావుడిగా అటుఇటుగా పరుగులు తీస్తున్నాయి.రంగురంగుల సీతాకోకచిలుకలుఎగురుతూ వనమంతా సందడి చేస్తూ   కనువిందు చేస్తున్నాయి

ఆకుపచ్చని చీరతో  వనదేవత సంతోషముతో కళకళ లాడిపోతోంది.

మల్లి,మందారం,గన్నేరు మొదలైన సుమబాలలువిరగబూసి అడవిఅంతా కూడా తమ సుగంధ పరిమళ సౌరభాన్ని వెదజల్లుతున్నాయి.

వడిలో వున్న సుమబాలల వికసిత వదనాలను మురిపంగా చూసుకొంటూ మురిసిపోతోంది  వనదేవత.

“ఈ రోజున తప్పకుండాభగవంతుడిసేవకు మనలని తీసుకెళ్తారని” అని  ఒకళ్ళతోఒకళ్ళు చెప్పుకొంటు ,వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు ఆ సుమబాలలు.

కానీ వారి ఆశ అడియాసే అయ్యింది.,ఈ రోజు కూడా ఒక్క పూబాలైనా భగవంతుడి సేవకు నోచుకోలేదు.వికసించిన సుమబాలల వదనాలు వాడిపోయాయి.

సంద్యా సమయమైంది,చీకట్లు ముసురుకొంటున్నాయి. సుమబాలలన్నీ కూడా దుఃఖిస్తూ నేల రాలిపోయాయి.

“అయ్యో భగవంతుడా! ఎందుకీ పాడు బతుకు మాకు. ఒక్క రోజు కూడానీ పూజకు పనికిరామా?పుట్టి రాలిపోతున్నామే? మాకు నీ సన్నిది చేరే   భాగ్యమే లేదా? మేము ఏం పాపం చేసామని ఈ శిక్ష విధించావు ?”  అని ఆర్తిగా  ఆ భగవంతుడుని  ప్రార్ధించాయి.

కరుణామయుడు,దయార్ధహృదయుడైన ఆ భగవంతుడు ఆ సుమబాలల వేదనకు కరిగి పోయి   వారి భక్తికి మెచ్చి ,వారి కోరికను తీర్చడానికి తానే వచ్చి స్వయంభువు గ ఆ వనం పక్కనే వెలిసాడు,

రోజు  ఆ వనం  గుండా వెళ్ళే బాటసారులుఏదో వింతకాంతి  ఈ పగటివేళలలో   కనపడుతోందని   వృక్షాల చాటుకి  వెళ్లి చూస్తె ,అక్కడ  ఒక వృక్షం మొదలులో కాంతులీనుతూ భగవంతుని  యొక్క దివ్యమంగళ విగ్రహం కనిపించగా అది  చూసి వారంతా  “ అరె ఇది చాల వింతగా వుందే ఇన్ని రోజులుగా లేని ఈ భగవంతుని విగ్రహం ఇక్కడ ఈ మనుష్య సంచారం అంతగా లేని ఈ చోటు లో ఎలా వచ్చిందో అని” ముందు ఆశ్చర్యపోయి తరువాత అది అంతా ఆభగవంతుని లీల గా అర్ధంచేసికొని, భక్తితో  నమస్కరించి అపట్టికప్పుడు  అక్కడవున్న అడవితీగెలతో ఒక చక్కటి పొదరిల్లు ఏర్పాటు చేసి  భగవంతుని ని అందు లో  ప్రతిష్ట చేసారు.

చల్లని గాలితో పాటు మోసుకోస్తున్న సుగంధ పరిమళాన్ని  గమనించి ఇక్కడే ఏదో పూలవనం  కూడాఉన్నట్లుంది అనుకొంటూ వాళ్ళు“భగవంతుని పూజకు  పూలు కావలి కదా!, పదండి వెళ్లి తీసుకొని వద్దామని”,  కొంచెము దూరము లో వున్న ఆ వనం దగ్గరకి వెళ్లి చూస్తె,అక్కడ  విరబూసి వున్న రంగురంగుల పూలను చూసి   తన్మయత్వంతో “అబ్బా! ఎన్ని పూలో, ఇవన్ని కూడా ఆ భగవంతుని కోసమేపూసి నట్లున్నాయి. రోజు ఈ  పూలతో  పూజ చేయచ్చు అనుకొంటూ.” ఆ పూలని  కోసి .కొన్ని మాలగా చేసిభగవంతుని  మెడలో వేసారు,మరి కొన్నింటిని పాదాలచెంత  పెట్టి, నమస్కరించి ఆ బాటసారులు వెళ్లి పోయారు.

అంతవరకు ముడుచుకొని,నిరాశగా వున్న ఆ సుమబాలలో  ఒక్కసారి చైతన్యం పెల్లుబికింది. అన్ని కూడా వికసితవదనాలతో విచ్చుకొన్నాయి,భక్తిగా నమస్కరిస్తూ “ప్రభూ! ఓ కరుణామూర్తి! జన్మజన్మల కు  నీ కరుణకు,నీ  ప్రేమకు పాత్రులవ్వాలని మమ్మలిని ఆశీర్వదించు , ఇప్పడు మాకు తృప్తిగా వుంది మా జన్మలు ధన్యమయ్యాయి, ఇంక నీ  పాదాలచెంతే  మా స్థానం , మేము  నీ పూజకు  పనికివచ్చేసుమాలమే” అని పులకించిపోయాయి.

ఆ వనం లో వెలిసిన భగవంతుడి గుడి గురుంచి  చుట్టుపక్కల వుండే వారికి తెలిసి ,వారందరూ కూడా అక్కడికి వచ్చి ఆ  దేవదేవుని  దర్శనం చేసుకొని పక్కనే వున్న పూలవనాన్ని కూడా చూసి, ఎంతో ఆనందించి “చూసారా!, తన పూజకోసం ,మనం కష్టపడకుండా వుండేందుకు తన ఆరాధనకోసం ఇక్కడేఒక పూలవనాన్నే  కూడా సృష్టించి వుంచాడు కాబట్టి ఈ పూలవనాన్ని సంరక్షించే భాద్యత కూడా మనదే”  అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.

ఇంద్రధనస్సును పోలిన  రంగులతో,సుగంధ పరిమళాలు వెదజల్లుతూ,ఆనందంగా తలలూపుతున్న ఆ  సుమబాలల ను చూస్తూ భగవంతుడు చిరునవ్వులు చిందిస్తున్నాడు .

సుమబాలలు ఆనందపారవశ్యంతో   భగవంతుని  పాదాలచెంత   తమని  తాము అర్పణ చేసుకొన్నాయి.

**** 

No comments:

Post a Comment

Pages