తెలుగింట పున్నమి పంట – బ్నిం - అచ్చంగా తెలుగు

తెలుగింట పున్నమి పంట – బ్నిం

Share This

తెలుగింట పున్నమి పంట – బ్నిం

భావరాజు పద్మిని

 “నీవు విజయం మాత్రమే సాధిస్తే ఉపయోగం లేదు... నీ జీవితం ద్వారా, జీవన విధానం ద్వారా ఏ ఒక్కరికైనా స్పూర్తి  కలిగించావా, ఇక నీ జన్మ ధన్యమైనట్లే... నీవు తరతరాలకు తరగని అఖండ విజయాన్ని సాధించినట్లే... ”

 

 Bnim-Munimanikyamఅక్షరాలా పై సూక్తిని నిజం చేస్తూ ... ఒకరికి కాదు, ఎందరికో మార్గదర్శకులు ఆయన. ఎందరికో  “ఇన్స్పిరేషన్ “ ఆయన . సామాన్యుల వద్ద నుంచి సెలబ్రిటీ ల వరకూ అంతా ఏ మాత్రం సంకోచించకుండా శిరస్సు వంచి పాదాభివందనం చెయ్యడానికి, సిద్ధపడే అపూర్వమైన  వ్యక్తే 'బ్నిం' గారు లేక భమిడిపల్లి నరసింహమూర్తి గారు.

 

'నేను ఒకటో తరగతి కూడా చదువుకోలేదమ్మా, అసలు బడికే వెళ్ళలేదు,' వినయంగా అంటారాయన. కాని చందోబద్దంగా పద్యాలు వ్రాస్తారు. 'ఇది ఎలా సాధ్యం ?' అని మీరూ నాలాగే ఆశ్చర్యపోతుంటే, నాకు ఆయన చెప్పిన సమాధానమే చదవండి. ఆయన ప్రపంచంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ బడి పేరు - అమ్మ ఒడి. ఆయన మాతృమూర్తి శ్రీమతి భమిడిపల్లి విజయలక్ష్మి గారు తెలుగు, సంస్కృత పండితురాలు. ఆయన చిన్నతనంలో మేఘసందేశం, కుమారసంభవం వంటి కావ్యాలు చదువుతూ, ఇష్టమైనవే చేస్తూ చదువుతూ ఉండేవారట.  తన బిడ్డను తెలుగుజాతికే ఆణిముత్యంగా తీర్చిదిద్దిన ఆ స్త్రీమూర్తికి పాదాభివందనం చెయ్యవచ్చు.

 

తన స్వగ్రామం ఆత్రేయపురంలోనే చిన్నతనంలో చిత్రకళను కూడా అభ్యసించారు. అనేక కార్టూన్లు, పుస్తకాలకు ముఖచిత్రాలు, jyotishamలోగోలు తీర్చిదిద్దారు. బాపు గారి గీతను, దర్శకత్వ శైలిని, ఆరాధించే బ్నిం గారు 'నా హృదయం బాపూ ఆలయం' అంటారు. బ్నిం గారంటే కూడా బాపు గారికి వల్లమాలిన అభిమానం. బ్నిం గారు నేటి తరం మరచిపోతున్న 132 మందితెలుగు ప్రముఖులు గురించి వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చిత్రాలు గీసి, క్రింద నాలుగు లైన్ల కవితలతో వారికి నీరాజనం అర్పించి, తీర్చిదిద్దిన అద్భుతమైన పుస్తకం 'మరపురాని మాణిక్యాలు'. ఇందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో మొదలుపెట్టి, పింగళి వెంకయ్య గారి దాకా అనేక మంది తెలుగు ప్రముఖుల విశేషాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో వారిలోని రచయత, కార్టూనిస్ట్, చిత్రకారుడూ కలిసి ఒకేసారి కనిపిస్తారు.

  16 ఏళ్ళకే ఆంధ్రపత్రిక వారు ఆయన కధను 'అచ్చేసి' వదిలేసారు. తరువాత ఆంధ్రజ్యోతి కూడా అవునని రెండోసారి అచ్చేసేసారు. అలా తన రచనా వ్యాసంగం మొదలుపెట్టిన ఆయన అనేక కధలు, కార్టూన్లు,నాట్య కళాకారుల కోసం ౩౦౦ కు పైగా నృత్యరూపకాలు (యక్షగానాలు), టీవీ సీరియల్స్, పత్రికలకు సీరియల్స్, వ్యాసాలు వ్రాసారు. ముళ్ళపూడి వారి చమత్కార శైలి ఆయన అరువుచ్చుకున్నారు. 2010 లో 'కళారత్న' పురస్కారం, నాలుగు సార్లు నంది అవార్డులు గెల్చుకున్నారు. ఎందరో ప్రముఖుల నుండీ సత్కారాలు అందుకున్నారు, అందుకుంటున్నారు.  

cartoon borderssయెంత ఎదిగినా ‘ఇప్పటికీ పెద్దవాళ్ళు చూస్తారు చదువుతారు అనుకుంటూ భయంతో, చదివిన అందరినీ ఆనందపరచాలనే బాధ్యతతో రాస్తారు బ్నిం గారు. చేసే పనిని కమర్షియల్(డబ్బు ఇచ్చేవారు), భ్రమర్షియల్(డబ్బు ఇస్తారనుకుంటే ఎగ్గోట్టేవాళ్ళు) , ధర్మర్షియల్, శ్రమర్శియల్ అనే నాలుగు భాగాలుగా విభజించుకుంటారు బ్నిం గారు. అందరికీ ఇష్టంగా ఉండాలంటే... వారి మనసుకు కష్టం కలిగించకుండా ఉండాలని కోరుకోవడమే, బ్నిం గారు అందరి వద్దా మంచి మార్కులు కొట్టేసేలా చేస్తుంది. ఎవరికి ఏ సమస్య ఉన్నా చిటికెలో తీర్చేయ్యడం ఆయన ప్రత్యేకత.

నిగర్వి,స్నేహశీలి, హాస్యచతురులు, బహుముఖప్రజ్ఞాశాలి బ్నిం గారు. చక్కటి ఆత్మీయతతో, నిరాడంబరంగా మాట్లాడతారు. మెచ్చదగిన ప్రతీ అంశాన్ని గుర్తించి, మనసారా అభినందిస్తారు.  అందరితో స్నేహంగా ఉంటూ ఎవరికి ఎటువంటి సహాయం కావాల్సి వస్తే, ఆ విధంగా సహాయపడతారు. సలహాలు ఇస్తూ, అందరి మనసుల్లో ‘వెల్ విషర్ ‘ గా ముద్ర వేసుకున్నారు.

జీవితాన్ని ఎలా మలచుకోవాలో, బాధల్లో కూడా తమ మీద తామే జోకులు వేసుకుని ఎలా సంతోషంగా ఉండాలో, ఆ సంతోషాన్ని తామే దాచేసుకోకుండా ఎలా అందరికీ పంచాలో, ఆచరణలో చూపారు బ్నిం గారు.

 .

శ్రీ బ్నిం గారు ఎందరికో మార్గదర్శకులు. దాదాపు 40 మంది ప్రముఖులకు దారి చూపారు, సహకారం అందించారు. ఆంకర్ సుమకు తెలుగు డిక్షన్ నేర్పారు. ఎన్నో నృత్య రూపకాలను ఎందరికో వ్రాసి ఇచ్చారు... అలా శ్రీ స్వాతి సోమ్నాథ్ ఆయన్ను గురుతుల్యులుగా పూజిస్తారు . ఆమె దేశవిదేశాల్లో ప్రదర్శించిన వాత్సాయన కామసూత్రాలకు సంబంధించిన నృత్యరూపకం రూపొందించింది బ్నిం గారే.

జ్యోతి వలబోజు గారికి చీర పై పలువురు వ్రాసిన పద్యాలకు విశ్లేషణ వ్రాసి ఇచ్చారట! అలా మొదలయ్యిందే, ఈ చీర ధారా పద్యాలADUKKOVADAM ప్రవాహం! ఆగని పద్యాల ప్రవాహానికి అడ్డుకట్ట వెయ్యలేక, శతకం అవుతుందేమో అన్న అనుమానం వచ్చి, బాపు గారికి పంపిస్తే, ఈ శతకానికి ఆనకట్ట వెయ్యక, పూర్తి చేసి, ఇంద, ఈ అట్ట బొమ్మ వేసి మరీ వదిలెయ్ , అన్నారట బాపు గారు. అలా అట్టపై వారి బొమ్మతో వచ్చాయి 'చీర పజ్యాలు.'

కాస్త కొంటెగా, కుర్రకారుకి కాస్త మంటగా, తెలుగు మనసులకు చలిమంటలా కాస్త వెచ్చగా, చురుక్కూ- చమక్కులతో జిమ్మిక్కులు చేసి, ఎన్నో పురాణాల సారాన్ని, సామాజిక స్థితిగతులను కంద పద్యాలలో మేళవించి బ్నిం గారు అద్భుతంగా వ్రాసిందే ఈ 'సరదా శతకం...'

ఇందులోంచి  ఒక పద్యం...

 

బాలిక అయినాను వయసుకి చేలల్లో కలుపుతీయ నేగున్ చీరన్ కూలీ డబ్బులు పెరగన్ మాలీలను మాయజేయు మర్మము తోడన్!

 

పల్లెల్లో పెరిగిన వారికి ఈ పద్యం అంతరార్ధం తెలుస్తుంది.. పల్లెల్లో పొలం కూలీలు మగవాళ్ళకు రోజుకు ౩౦౦ ఇస్తే, ఆడవాళ్ళకు 200 లే ఇస్తారు. అదే పిల్లలకు అయితే, కేవలం వంద రూపాయిలే ఇస్తారు. అందుకే, అమ్మలు 12-13 ఏళ్ళ పిల్లలకు చీరలు కట్టి, కూలీకి తీసుకు వెళ్తారు. మాలీలను పొట్టకూటి కోసం మాయ చేసి కూలీ పొందుతారు.

“మజ్జిగలో వెన్న తియ్యడం దగ్గర్నుంచీ ఎడిటింగ్ వరకూ అన్నీ చెయ్యగలను...” అంటూ గర్వంగా చెప్పే బ్నిం గారు ఓల్డ్ ఇస్ గోల్డ్... వంటి బెస్టు రోజుల్లో పుట్టడమే తాను ఫస్టుగా నిలవడానికి కారణమంటారు. సీరియస్ గా హాస్యాన్ని ఇష్టపడే బ్నిం గారి వద్ద యుగాలు నిముషాల్లా సరదాగా దొర్లిపోతాయి. ఒక వృక్షంలా ధృడంగా నిలబడి వచ్చే పోయే పక్షులకు ఆసరా అందించి, అవి వినీలాకాశంలో విజయ కేతనం ఎగురవేస్తుంటే, హాయిగా చూస్తూ అదే నిరాడంబరతతో తిరిగి తన పని తాను చేసుకుంటూ ఉంటారు బ్నిం గారు.

 

abaddhamబుర్రలో థాట్స్ చేతిలో ఆర్ట్స్ పొంగి పొరలే రెండు ఐదుల వయసున్న బ్నిం గారి అంతరంగం ఐదేళ్ళ పిల్లాడి మనసంత స్వచ్చం  !ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పని ఈ ‘పెద్ద మనసున్న ‘ మనీషి యెంత తప్పించుకున్నా ఈయన్ని అంతా కట్టిపడేసుకున్నారు. కొందరు గుండెలో ఈయనకి గుడి కట్టేసుకున్నారు. వామనుడి లాంటి ఈయన్ని తమ మనసుల నిండా నిండు పున్నమి చలువను నింపుకున్నట్టు నింపేసుకున్నారు. ‘మా బ్నిం గారు... మా ఆత్మీయుడు... మా మార్గదర్శి... మా నేస్తం... మా గురువు...’ అంటూ తెలుగింట ప్రతీ ఒక్కరూ తమ పున్నమి పంటగా గర్వంగా చెప్పుకునే బ్నిం గారి జీవన విధానం... అందరికీ ఆచరణీయం ! అనుసరణీయం !

No comments:

Post a Comment

Pages