భళారే వి"చిత్రం" - అచ్చంగా తెలుగు

భళారే వి"చిత్రం"

Share This
భళారే వి"చిత్రం"  
- నాగజ్యోతి సుసర్ల  
    

కామేశ్వరి మనస్సు మనసులో లేదు రెండు రోజుల నుండీ,లేకపోతే నాలుగు మాటలు గట్టిగా ,నలుగురిలో మాట్లాడే జ్ఞానం లేని తనకు ఏకం గా ఒక సినిమాకే మాటలు వ్రాసే అవకాశం అదీ వెతుక్కుంటూ వచ్చి తలుపు తడితే? ఊపిరి ఆగిపోకుండా ఇంకా  ఉన్నందుకు చెప్పలేని ఉత్సాహం ఉరకలు వేసేస్తోంది.
  ఇదేమిటే పిచ్చిమొహమా నువ్వు సినిమాకు మాటలు వ్రాయటమేమిటే? నీకు అవకాశం ఇస్తానన్న సన్నాసి ఎవరో అడుక్కుతింటాడు మొగుడి గొణుగుడు విన్న కామేశ్వరి చాల్లేండి మీరెప్పుడు నన్ను ప్రొత్సహించారు గనుక అని మూతి మూడు వంకర్లు తిప్పుకుంది.
అసలు ఇంతటి ఉత్సాహానికి కారణం వెతుక్కుంటూ కామేశ్వరి మనస్సు ఒక ఆరు నెలలు వెనక్కి వెళ్ళిపోయింది.సరిగ్గా ఒక ఆరు నెలల క్రితం తన ముఖ పుస్తక స్నేహితురాలు పార్వతి తనకు అచ్చంగా తెలుగు అనే ఒక సముదాయాన్ని పరిచయం చేసింది..ఇహ అక్కడినుండే మొదలు తనకు సమయం తెలియటమే  లేదు,ఒకటే టపాలు,కామెంట్లు..లైకు లు ...ఈ గోలతో ఎవరు ఇంటికి వచ్చినా సరే ఇప్పుడే వస్తాను అనటం,.ఒక సారి.అ.తె లోకి తొంగిచూడటం,ఎవరైనా ఒక టపా పెడితే తనవంతు ఇతోధిక మాట సాయం,ఇష్ట సాయం అందించటం...ఇదీ తన దినచర్య లో ముఖ్యభాగం అయిపోయింది...
ఇంక తనకు చుట్టాలు కూడా అ.తె నుండే.బాగా పెద్దవాళ్ళు అయితే బాబాయ్ లూ,పిన్నమ్మలూ,ఒక మోస్తరు పెద్ద అయితే అన్నలు,అక్కలూ,చిన్న అయితే తమ్ముళ్ళు,చెల్లాయ్ లూ...ఇప్పుడిప్పుడే పరిచయస్తులు అయితే "గారు" లతో మూడు టపాలు,ఆరు కామెంట్ల లా రోజు నిండిపోతోంది...
పిల్లలకూ  మొగుడికీ కాస్తంత వండి పడేసి ,వాళ్ళు స్కూళ్ళకీ,మొగుడు ఆఫీస్ కి వెళ్ళీ వెళ్ళగానే  ముందు కంప్యూటర్ తెరవటం  ,ఇహ తుమ్మ బంకలా అ.తె ముందు అతుక్కుపోవటం ,భోజనం కూడా అ.తె ముందే...ఇలా సాగుతూ కొన సాగుతూ ఉండంగా ....ఇంకో వైపు నుండి స్నేహ అభ్యర్ధనలు రావటం మొదలయ్యింది.
ఈ లోపల కామేశ్వరి  ఉడతా భక్తిగా తనలో దాక్కున్న అరి వీర భయంకర కవయిత్రి ని నిద్ర లేపి ఒక నాలుగు కవితలు రాసి పడేసి అ.తె సభ్యుల మీదకు వదిలేసింది.ప్రోత్సహిద్దాం పోయేదేముంది అనుకున్న కొంతమంది లైక్ లూ,కామెంట్లతో ఆవిడ టపా నింపేశారు......ఆహా నాగుపామేనా తల ఎత్తేది ,వానపాము తలెత్తినా ప్రోత్సహిస్తారు సన్మిత్రులు అనుకుని మురుస్తున్న శుభతరుణములో ఇదుగో ఇలా   ......
మీ వాక్పటిమ అమోఘం,మీ లోని సృజనాత్మక శక్తికి నెనర్లు...నేను తీయబోయే సినిమాకి మీరే మాటల రచయిత  అని కొత్త స్నేహితుడి నుండి విన్నపం.... నాకేం రాదే నాకేం వచ్చు? అని భుజాలు తడుముకుంది కామేశ్వరి..అదే మాట అమాయకం గా ఆ స్నేహితుడికి వివరిస్తే మీ మీద నాకు నమ్మకం ఉంది,కనీసం మీ సలహా అయినా చాలు,మీరు లేకపోతే నా సినిమా లేదు అని మళ్ళీ విన్నపం...ఇంకేముంది హనుమంతుడికి శక్తి ఎవరో చెపితేనే గానీ తెలియలేదు నేను అంతే అని గుండె నిండా ఆత్మ విశ్వాసం నింపుకుని..అ.తె యెడ్మిన్ లకు ఒక దణ్ణం పెట్టుకుని ...ఆ స్నేహితుడికి ఒక సారి దణ్ణం పెట్టుకుందామని అతని పరిచయం చూసింది,అందులో అతని ముఖమే లేదు....మూడు నాలుగు సార్లు బాబూ నీ ముఖం పెట్టవయ్యా నీ ముఖపుస్తక పరిచయం లో అని వెంట పడ్డాక ...కామేశ్వరి గారూ ముందు మీరు మీ చిత్రం తీసెయ్యండి  దయచేసి అని ఇంకో అభ్యర్ధన  అదే స్నేహితుడి నుండి...
కామేశ్వరి ఆలోచన  లో పడింది...అయినా ఎందుకు ఎందుకు నా చిత్రం తొలగించవలె? ముఖ పుస్తకములో ఎమైనా కుట్రలు జరుగు తున్నాయా? లేక మీరు చూడలేనంత అసహ్యముగా ఉన్నదా అని మళ్ళీ బోలెడంత బాధతో ప్రశ్నల పరంపర  తో అతని తరచి తరచి అడిగింది.అప్పుడు అతను నోరు విప్పి మీ చిత్రం నాలో నిద్రాణమై ఉన్న మనస్సుని  నిద్రలేపుతోంది ,నన్ను కెలికేస్తోంది అని సమాధానం చెప్పాడు....
బిత్తర పోయిన కామేశ్వరి తన చిత్రం  చూసుకుంది అదెప్పుడో తన  పెళ్ళీ కాక మునుపు ఫోటో  ..కాస్త బావుంది కదా అని పరిచయ చిత్రముగా పెట్టుకుంది..అప్పటికి అర్ధం అయినది ఈ సినిమా గోల ఎందుకు మొదలయ్యిందో ,వెంటనే తన పాత చిత్రము తీసేసి ,ఇప్పటి వయసుతో కొత్త చిత్రం పెట్టుకుంది...అంతే ఐశ్వర్యా రాయ్ లాగా ఉంటుందనుకున్న  అమ్మాయ్ ఇంటి ముందు బోర్లా పడున్న బండరాయి లాగా కనపడింది..అంతే ఆ స్నేహితుడు సినిమా కో దణ్ణం పెట్టుకుని కెమెరా సర్దెసుకుని అ.తె నుండి మటుమాయం....
మొత్తానికి తన నిజరూప దర్శనం ఇచ్చి అతని నిజ స్వరూపాన్ని తెల్సుకున్న కామేశ్వరి  దీర్ఘం గా నిశ్వసించి ..మళ్ళీ కవితలో, కధలో వ్రాసి పడేసి అ.తె సభ్యులను మభ్యపెట్టటానికి కలం లో ఇంకు నింపుకుంటొంది
వెనుక నించి కామేశ్వరి మొగుడు అనుకున్నదొక్కటీ అయినదింకొక్కటీ   బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అని ఆనందంగా పాడుకుంటున్నాడు....
గమనిక: ముఖ పుస్తకములో ఎప్పటి వో పరిచయ చిత్రాలు చూసి మూర్చపోయి ఏమార్చబోయె కొత్త స్నేహితులు ,తమకున్న పరిజ్ఞానం తెలిసినా పొగడ్తలకు మోసపోయె స్నేహితురాళ్ళూ. మీకందరికీ నా కధ అంకితం...కొత్త స్నేహాలతో జాగ్రత్తగా ఉండండి అని అందరికీ చెప్పటమే ఈ కధ ముఖ్యోద్దేశం.
***

No comments:

Post a Comment

Pages