యుగాది - పెయ్యేటి శ్రీదేవి - అచ్చంగా తెలుగు

యుగాది - పెయ్యేటి శ్రీదేవి

Share This
'శ్రీ.......శ్రీ.....శ్రీ.....శ్రీ....విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల వారికి జయహో.....జయహో....జయ జయ జయహో.......'
          శ్రీకృష్ణదేవరాయలవారు పట్టాభిషిక్తులైన శుభసందర్భంలో ఆయనకి అందరూ జయ జయధ్వానాలు పలుకుతున్నారు.  ఆయన వచ్చే దారిలో భటులు తివాచీలు పరుస్తున్నారు.  స్త్రీలు పూలు జల్లుతున్నారు.  పండితులు ఆయనకి ఆశీర్వచనాలు పలుకుతున్నారు.  కవులు అశువుగా కవితలల్లుతున్నారు.  మరికొంతమంది స్త్రీలు మంగళహారతులు పాడుతున్నారు.  మంగళవాయిద్యాలు మోగుతుండగా, జయజయ ధ్వానాల మధ్య ఠీవిగా, దర్పంగా సింహాసనాన్ని అధిష్టించారు రాయలవారు.  కొలువులో అందరూ ఎంతో ఆనందంగా వున్నారు.ఒకరోజు రాయలవారు కొలువు దీరి ఆసీనులైన సమయంలో, తన రాజ్యంలో ఎవరూ బాధలు పడరాదని, అలా బాధ పడినట్లు తెలిస్తే  వారిని తమ వద్దకు హాజరు పరచమని మంత్రిగారికి చెప్పారు.  వెంటనే అప్పాజీగారు ఎవరు ఎక్కడ బాధలు, కష్టాలు అనుభవిస్తున్నారో చూసి రమ్మని అన్ని మూలలకి వేగులను పంపారు.ఈలోగా రామకృష్ణ అనే కవి ' ఉధ్భటారాధ్య చరితం '  అనే గ్రంథాన్ని రచించి, అందులోని కొన్ని పద్యాలను ఒక జమీందారుకి వినిపించాడు.  ఆ జమీందారు ఆ పద్యాలలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేక, వీధిలో జరిగే జానపద నృత్యం చేస్తున్న వాళ్ల లొల్లాయి పదాలు ఆనందంగా వినసాగాడు.  రామకృష్ణ బాధ పడ్డాడు.ఒకచోట ఎవరో మేకని కాళికా అమ్మవారికి బలి ఇయ్యబోతుంటే చూసి ఆ దుశ్చర్యని ఆపాడు.  దేశంలో జరిగే అన్యాయాలని అరికట్టమని కాళికాదేవిని ప్రార్థించాడు.కాళికామాత ప్రత్యక్షమై పాలు, పెరుగు వున్న రెండు వెండిగిన్నెలు ఇచ్చి, ఒకటి విజ్ఞానం, ఇంకోటి ధనం అని చెప్పి, నీకేది కావాలో అది తాగమంది.  తెనాలి రామకృష్ణ రెండూ తాగేసాడు. అప్పుడు కాళికాదేవి కోపంగా చూసి, నువ్వు వికటకవిగా ఐపొమ్మని శపించింది. రామకృష్ణ బాధపడి, ' తల్లీ!  వరమిచ్చిన నోటితోనే శపిస్తున్నావా?' అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అప్పుడు రామకృష్ణని అనునయిస్తూ కాళికాదేవి, ' కన్నతల్లి నోటినుంచి వచ్చే తిట్లు కూడా బిడ్డలకి దీవెనలే అవుతాయి నాయనా.  అటువంటిది నా నోటినుంచి శాపం వస్తుందని ఎల్లా అనుకున్నావు?  నేను కావాలనే నీకు ఈ అపూర్వ వరాన్నిచ్చాను.  చరిత్రలో మొదటి, చివరి వికటకవివి నువ్వే అవుతావు.  నీ సమయస్ఫూర్తి తోను, హాస్యప్రియత్వం తోను అపూర్వమైన, విలక్షణమైన కవిత్వం చెబుతూ అందరి మన్ననలూ పొందుతావు.  తెలుగు సాహిత్యాకాశంలో నువ్వు ధృవతారవై నిలుస్తావు.' అంటూ అంతర్ధానమైంది. ఇదంతా ఒంటరిగా ఒకమూల కూచుని ఏడుస్తున్న ఒక పదేళ్ళ అమ్మాయి చూసింది.  ' అమ్మా, కాళికామాతా!  ఎందుకమ్మా నన్ను పుట్టించావు?' అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. కాళికాదేవి ప్రత్యక్షమై, ' చిట్టితల్లీ!  ఎందుకమ్మా ఏడుస్తున్నావు?  ఇంత చిన్నవయసులో నీకేం కష్టమొచ్చిందమ్మా?' అంటూ బుజ్జగించి అడిగింది. ' అమ్మా, కాళికామాతా!  నాకు అమ్మ లేదు.  సవతితల్లి సరిగా పని చేయడం లేదని తిడుతుంది, కొడుతుంది.  నేనేమడిగినా ఇవ్వదు.  నాన్న పట్టించుకోడు.  నన్ను అందరూ అందంగా వున్నానంటే, కనీసం నేనెలా వుంటానో అద్దంలో చూసుకోవాలని ఆశతో అద్దం ఇమ్మని ప్రాధేయపడి అడిగాను.  కసిరి కొట్టింది.  మాది పేదకుటుంబం.  నాన్న పౌరోహిత్యం చేస్తాడు.  ఇంటెడు చాకిరీ నా చేతే చేయించుకుంటున్నా, నేను వాళ్ళకి బరువైపోయాను.  నా అవసరం లేనప్పుడు నేనెందుకమ్మా బతకాలి?  నాకు చచ్చిపోవాలనుంది.' ' అలా అనకమ్మా.  నేను నీకు అమ్మనే.  నీకు బాధ కలిగినప్పుడల్లా నన్ను తలుచుకో.  నీకు అంతా మంచే జరుగుతుంది.  ఇదుగో, ఈ అద్దం నీ దగ్గర వుంచుకో.  నీ అందం ఇందులో ఎంతో మనోహరంగా కనిపిస్తుంది.  కాని ఈ అద్దంలో వేరేవాళ్ళు చూసుకుంటే వికృతంగా కనిపిస్తారు.  నువ్వు బతకడం వ్యర్థమని అనుకోకు.  ముందర నీ అవసరం చాలా వుంది.  నిన్నందరూ ఆరాధిస్తారు.  ఇదిగో, ఈ అమృతఫలం తీసుకో.  దీన్ని తింటే నువ్వు నిండు నూరేళ్ళు చాలా ఆనందంగా, సంతోషంగా బతుకుతావు.  ఐదు తరాలదాకా, ఐదు వందల ఏళ్ళు ఐదు జన్మలు ఎత్తుతావు.  ప్రతి జన్మలోను వంద సంవత్సరాలు బతుకుతావు.  ఎప్పుడైతే మనిషి మేధస్సు పెరిగి , ఆడంబరాలు ఎక్కువై, అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడతాడో, ఎప్పుడైతే దేశం అల్లకల్లోలమై పోతుందో, అప్పుడు, ఆ జన్మలో చాలా చిన్న వయసులో మరణిస్తావు.  ఇంకు నీకు జన్మ వుండదు.  కాని ప్రతిజన్మలోను ఈ కాలంనాటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ప్రతి అంశము నీకు గుర్తుంటుంది.  పూర్వజన్మ జ్ఞానం నీకు లభిస్తుంది.  మిగతా జన్మలలో విషయాలు మాత్రం అంతగా గుర్తుండవు.    ఇదుగో, ఈ అమృతఫలం తిను.' అంటూ దేవి అంతర్ధానమైంది. ఆ పాప దేవి ఇచ్చిన అమృతఫలం తింది.  ఆనందంగా తన రూపం అద్దంలో చూసుకునేలోగా మంత్రిగారు పంపిన వేగులు ఎవరు బాధ పడుతున్నారో అన్ని మూలలా వెతుకుతూ, పదేళ్ల పాప ఒంటరిగా ఏడుస్తుండడం చూసారు.  ఆమెకి కాళికామాత ప్రత్యక్షమవడం, వరం ఇవ్వడం వాళ్ళకి కనబడలేదు.  ఆ పాపని సముదాయించి రాజుగారి వద్దకు తీసెకెళ్ళారు.  ' నీ బాధేమిటో చెప్పు తల్లీ' అని రాజుగారు అడిగేసరికి ఆమె తన బాధ చెప్పుకుంది. ' నీకే లోటూ రాదు.  నువ్వు మా అంత:పురంలోనే వుండు.  నీ పేరేమిటి?' ' మాలతి.' ' ఎంతో అందంగా వున్నావు.  నిన్ను ప్రశాంతి అని పిలుస్తాను.  నీకు సమ్మతమేగా?  ఇక నుంచి మా కొలువులోనే ప్రశాంతంగా వుండు.  నీకిక్కడ ఏ లోటూ రాదు.  నువ్వు మళ్ళీ నీ సవతితల్లి దగ్గరకి వెళ్ళక్కర్లేదు.  మంత్రిగారూ!  రాణిగారి పరిచారికలని పిలిచి ఈ చిన్నారికి కొత్తబట్టలు వేసి, స్వర్ణాభరణాలు ధరింపజేసి ముస్తాబు చేయించండి.' ' అలాగే మహాప్రభూ!' ' ఆ.... ఈ సౌందర్యరాశికి ఆమె అందాన్ని పెద్ద అద్దంలో చూపెట్టి, మంచి భోజనం పెట్టించి, తరవాత మా కొలువుకి తీసుకురండి.' ఇంతలో రాజదర్బారు లోకి ఒక కవి ప్రవేశించి తను చెప్పబోయే పద్యానికి ఎవరూ అర్థం చెప్పలేరని ఇలా చదివాడు. ' రాజనందన రాజ, రాజత్పటుల పాటి తలప నన్నయకౌను ధరణిపతికి, భావ భవభోగ సత్కళాభావములను, భావ భవ భోగ భావ భవభోగ సత్కళాభావములను.....' అంటుండగా రామకృష్ణ కలగజేసుకుని, ' భావ భవభోగ సత్కళా భావములను... ఇంతేగా?  ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి.' అంటూ ఆయన గర్వం అణచడానికి ఈ పద్యం ఎత్తుకున్నాడు. ' మేక తోకకు మేక తోక మేకకు తోక మేకతోక మేక మెక మేక తోకా మేక తోక మేక తోక మేకకు తోక మేక తోక మేక మెకతోక తోకా మేక మేక మెక తోక మేకా తోక.' రామకృష్ణ చదివిన ఈ హాస్యపు పద్యానికి సభలోని వారందరూ పగలబడి నవ్వారు. అది విన్న ప్రశాంతికి కూడా నవ్వాగలేదు.
*****************
          ' అహ.....అహహహ....అహ........అహ.......అహహహహ..........అహహ.....'' ఏమిటి లావణ్యా!  అంతగా పగలబడి నవ్వుతున్నావు?  టి.వి.లో వచ్చే ఆ సీరియల్ లో అంత నవ్వొచ్చే దృశ్యమేం లేదే, హింస తప్ప?' అంటూ వంటగదిలోంచి గరిటెతో వచ్చింది లావణ్య తల్లి మహదేవి.లావణ్య సమాధానం చెప్పకుండా ఇంకా నవ్వుతూనేవుంది.' ఏమిటే, మేకతోక తోకామేక అంటూ ఏమిటేమిటో గందరగోళంగా మాట్లాడుతున్నావు?  ఏమైందే నీకు?  అడిగితే మౌనంగా కూచుంటావా?'' ఔనమ్మా.  ఇంకా బావ బవ బోగ బోగ బవ బవ బోగ బావ అనికూడా ఏంటేంటో అందే అమ్మా.' అన్నాడు పధ్నాలుగేళ్ళ కొడుకు రవి. ' బావబోగ కాదన్నయ్యా.  ఒత్తులు పెట్టాలి.  భావ భవ భోగ సత్కళాభావములను.  తెలుగు సరిగ్గా మాట్లాడాలన్నయ్యా.' ' సరి సరి!  మీ అన్నాచెల్లెళ్ళు తరవాత మాట్లాడుకుందురుగాని, ఎల్లుండి నీ పుట్టినరోజు.  ఫంక్షను చాలా గ్రాండ్ గా జరగాలి.  ఇవాళ షాపింగ్ కెళదాం.  డ్రస్సులు, నగలు కొనుక్కుందూగాని.' అంది తొమ్మిదేళ్ళ కూతురు లావణ్యతో. ' అమ్మా!  ఇంక నాకు పుట్టిన రోజులు చెయ్యద్దమ్మా.' అంది లావణ్య. లావణ్యకి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి విషయాలన్నీ గుర్తుకొచ్చాయి.  అష్టదిగ్గజాలు ఆలపించే కవితాగానాలు, రామకృష్ణ హాస్యంగా చెప్పిన ' మేక తోకకు మేక ' అన్న పద్యం గుర్తుకు వచ్చి నవ్వుకుంది.  తను ఐదో తరంలో, ఐదో జన్మలో ఉన్నట్లు అర్థమైంది.  తనకి నాలుగు జన్మల క్రితం కాళికామాత చెప్పిన మాటలన్నీ గుర్తుకు వస్తున్నాయి.  నాలుగువందల ఏళ్ళ క్రితం సంగతులన్నీ మర్చిపోలేక పోతోంది. లావణ్య ఇప్పుడు గొప్పింటి పిల్ల.  ఆ ఇంట్లో అందరూ లావణ్యని మహారాణిలా చూస్తారు.  ఆమె పేరుకు తగ్గట్లుగానే ఎంతో అందంగా వుంటుంది.  రేపు జరగబోయే పుట్టినరోజు ఫంక్షనుకి బంధువులందరూ వచ్చారు.  ప్రతి ఏటా ఆమె పుట్టినరోజు చాలా వైభవంగా చేస్తారు. ఆ పిల్ల తాతగారు లావణ్య చదివిన ' భావ భవ భోగ సత్కళాభావములను ' అని, ఇంకా ' మేక తోకకు మేక ' అన్న పద్యాన్ని విని చాలా ఆశ్చర్యపోయారు.  ఈ పిల్లకి ఈ పద్యం ఎలా తెలిసిందా అని అనుకున్నారు.  ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం.  బంధువుల పిల్లలకి అందరికి చదువు చెప్పటం, తెలుగు భాష నేర్పడం, లెక్కలు చెప్పడం - ఇలా సత్కాలక్షేపం చేస్తుంటారు డభ్భయి ఏళ్ళ వయసులో. ఆ రోజు పిల్లలందరికి పద్యాల పోటీలు, కథల, వక్తృత్వ పోటీలు పెట్టారు.  బాగా చెప్పిన వాళ్లకి ప్రైజులు కూడా పెట్టారు.  తాతగారంటే పిల్లలకి చాలా ఇష్టం. ' ఇదిగో పిల్లలూ!  మీకు ఇవాళ కొత్తగా ఒక ఆట చెబుతాను.  ఇవిగో, ఈ చీటీలు ఈ బల్ల మీద పోస్తున్నాను.  ఒక్కొక్కళ్ళే వరసగా వచ్చి, ఒక్కొక్క చీటీ తీసుకుని, ఎవరి చీటీలో ఏం రాసుందో చదివి, దాని ప్రకారం చెయ్యాలి.  సరేనా?' అందరూ ఆ ప్రకారమే తమకి తోచిన వ్యాసాలు, పద్యాలు చెప్పారు.  కొందరికి వచ్చిన చీటీల్లో కోతిలా గంతులు వెయ్యమని, పాటలు పాడమని వుంటే అల్లాగే గంతులు వేసారు, పాటలు పాడారు.  పిల్లలందరికీ ఈ ఆట నచ్చింది. ' చాలా బాగుంది తాతగారూ ఈ ఆట.' అన్నారు. కాని లావణ్య ఏమీ చెయ్యకుండా వుంటే, ' లావణ్యా!  నువ్వేమీ చెప్పలేదేమిటి?' అన్నారు. ' తాతయ్యా, నాకు చీటీ రాలేదు.  అందరూ తీసేసుకున్నారు.' అంది. ' అయ్యో, అలాగా?  ఐతే నువ్వొక పద్యం పాడి, ఏమన్నా టాపిక్ గురించి క్లుప్తంగా మాట్లాడు.' అన్నారు. ' ముందర పద్యం చెప్పనా, ఉపన్యాసం చెప్పనా తాతయ్యా?' అంది లావణ్య. ' నీ ఇష్టం తల్లీ.  ఎలా ఐనా పరవాలేదు.' ' శ్రీకృష్ణదేవరాయలకు కృష్ణాష్టమి నాడు క్రీ.శ.1509 లో పట్టాభిషేకం జరిగింది.  ఆయన తెలుగువారికి, కన్నడిగులకు, తుళులకు అభిమాన ప్రభువు.  ఆయనకు ' కన్నడ రాజ్య రమారమణ ' , ' మూరు రాయల గండ ', ' ఆంధ్రభోజుడు ' అన్న బిరుదులు వున్నాయి.  ఆయన తలిదండ్రుల పేర్లు నాగలాదేవి, తుళువ నరస నాయకుడు.  వీర నరసింహ రాయల తర్వాత ఆయన సింహాసనాన్ని అధిరోహించాడు.  ఆయనది మన తాతయ్యలాగే మీడియం హైట్.' ఆ మాటకి తాతయ్యతో సహా అందరూ ఆశ్చర్యపోయారు చూసినట్టు, తెలిసున్నట్టు చెప్పేస్తోందేమిటా అని! ' ఆయన నిర్దయగా చట్టాలని అమలు చేసేవారు.  కవితాగోష్టుల్లో నన్ను తన పక్కనే కూర్చోపెట్టుకునేవారు.  ఆయన్ని నేను తాతగారూ అని పిలిచేదాన్ని.  నన్ను ఆయన అందాలరాశి అని, బంగారుతల్లి అని, చిట్టివరహా అని ముద్దుగా పిలిచేవారు.  ఆయన చక్కని పరిపాలనాదక్షుడు.  చాకచక్యంతో యుధ్ధాల్లో విజయం సాధించేవాడు.  ధర్మాన్ని పాటించేవాడు.  సామ్రాజ్యమంతా తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునేవాడు.  ఆయనకి సాహిత్యమంటే మక్కువ.  ఎందరో సంస్కృత, కన్నడ, తమిళ ఆంధ్రకవులు ఆయన ఆస్థానంలో వుండి భోగాలనుభవించే వారు.  తెలుగు భాషంటే ఆయనకెంతో ఇష్టం.  దేశభాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పారు.  త్గెలుగుభాషకు అది స్వర్ణయుగం.  అష్టదిగ్గజాలను ఏర్పాటు చేసారు.  తిరుమల వేంకటేశ్వరునికి వజ్రకిరీటం నుంచి బంగారు ఖడ్గం దాకా ఎన్నో విలువైన కానుకలు సమర్పించాడు. ఒక ద్వారపాలకుడు ' కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ ' అని ఒక సమస్యను రామకృష్ణునికిచ్చి పూరించమంటే ఆయన చాలా కోపంగా తిడుతూ పూరించారు.  రాయలవారు అదే సమస్యను తను ఇచ్చి పూరించమంటే ఈ విధంగా పూరించారు.
రంజన చెడి పాందవులరి భంజనులై విర్ఫటుకొల్వు పాలైరకటా! సంజయా, విధినేమందును? కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.'
          ఆయన రెండు విధాలుగా చెప్పిన ఆ కవిత్వానికి ముగ్ధులై రాయలవారు, అంటే మా తాతగారు ' నీ నాలుకకి రెండువైపులా పదునేనయ్యా రామకృష్ణా' అంటూ ఆయనని పొగిడారు.  ఇలా చెప్పాలంటే ఇంకా ఎన్నో.  ఆయన అనారోగ్యంతో 1529 లో మరణించారు.  అప్పుడు నేను చాలా ఏడ్చాను.  ఆయన కొడుకు ఆయన కన్నా ముందరే పోయాడు.  అందుచేత ఆయన తన తమ్ముడైన అచ్యుతదేవరాయలను తనకు వారసుడిగా ప్రకటించాడు.ఆరోజులే వేరు.  చాలా బాగుండేవి.  అప్పుడు ఇప్పట్లా దొంగతనాలు, దోపిడీలు వుండేవి కావు.  ఉన్నా కఠినంగా శిక్షలుండేవి.  ఇప్పుడు నేరాలకి, ఘోరాలకి కఠినశిక్షలు లేకపోవడం వల్లనే నేరాలు, మోసాలు చేసేవాళ్ళు ఎక్కువయారు.  అప్పుడు టి.వి.లు కూడా వుండేవి కావు.  ఐనా అప్పటి మనుషులు ఎప్పుడూ బిజీగా వుండేవారు.  అప్పుడు ముత్యాలు, రత్నాలు వీధుల్లో రాశులుగా పోసి అమ్మేవారు.  తాతయ్యా!....' అని ఇంకా ఏదో చెప్పబోతుంటే అందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.తాతయ్య ఆశ్చర్యం నించి తేరుకుని, ' నీకివన్నీ ఎలా తెలుసమ్మా?  డెభ్భయి ఏళ్ళవాడిని, నాకే తెలీదు.  అటువంటిది, తొమ్మిదేళ్ళ పిల్లవి, నీకెల్లా తెలుసమ్మా?  పైగా చూసినట్టు చెబుతున్నావు?' అని అడిగాడు.' ఔను తాతయ్యా!  చూడటమేమిటి?  నేను ఆ రాజ్యంలో ఆయన పక్కనే వున్నదాన్ని.  తాతయ్యా!  నువ్వు పొడుగు నామం దిద్దుకుని, తలపాగా  పెట్టుకుంటే అచ్చం రాయలవారిలాగే వుంటావు.'తన ముద్దుల మనవరాలి మాటలకి ఆయనకి మతి పోయినంత పనైంది.  వెంటనే తేరుకుని ఆయన ఆ చిట్టి లావణ్యరాశి జాతకం తనకి తెలుసున్న మహా జాతకబ్రహ్మ, ఎనభై ఏళ్ళ విజ్జేశ్వరశర్మకి చూపించాడు. ఆయన ఆ పిల్ల జాతకం చూసి ఆనందపడిపోయి, ' ఇంతటి మహర్జాతకం ఇంతవరకు నేనే కాదు, ఏ పండితుడూ చూసివుండడు.  ఈ పిల్లకి పూర్వజన్మ జ్ఞానం వుంది.  అసలీమె పుట్టింది కృష్ణదేవరాయల వారి కాలంలో.  ఆమెకి కాళికామాత వరం వుంది.  నాలుగు తరాలనించి నిండు నూరేళ్ళు బతికింది.  ఈ ఐదో తరంలోనే పెద్ద గండం వుంది.  ఈ గండం గడవడానికి వెంటనే కాళికామాత పూజలు, చండీయాగం చేయించండి.  శాంతి కలుగుతుంది.  ఈమె దేవతలాంటి పిల్ల.  చాలా అందంగా వుంటుంది.  మహాజ్ఞాని.  కాని ఈ పిల్లని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి.  ఆ చిట్టిదేవతని దర్శించుకుందుకు నేను కూడా మి ఇంటికి  వస్తాను.  అప్పుడు పూజలు, హోమాలు మొదలు పెడదాం.' అన్నాడు. లావణ్య పుట్టిన రోజున ఆమె తల్లి ఆమెకు పట్టులంగా, పట్టు జాకెట్టు తొడిగి, రవ్వల నెక్లెసు, చంద్రహారం, రవ్వల గాజులు వేసింది.  పాపిడిపింజరి, జడకుప్పెలు పెట్టి పూలజడ వేసింది.  అందానికి ప్రతిరూపం లావణ్య.  ఆమె తన అందాన్ని పెద్ద నిలువుటద్దం ముందు నిలబడి చూసుకుంది.  మళ్ళీ ఆమెకు అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది.  శ్రీకృష్ణదేవరాయలవారి కొలువుకు వెళ్ళిన మొదటిరోజు పరిచారికలు తనను విలువైన నగలతో అలంకరిస్తే, అప్పుడు సరిగ్గా ఇలాగే తన రూపాన్ని నిలువుటద్దంలో చూసుకుంది.  అప్పుడు తను సరిగ్గా ఇలాగే ఇంత అందంగానూ వుంది.  అనుకోకుండా తన సవతితల్లి గుర్తుకు వచ్చింది.  ఆమె అద్దంలో తన అందం చూసుకోనివ్వకుండా, అద్దం అందనివ్వకుండా చేసి, ఇంకా ఎన్నో బాధలకి గురి చేసింది.  కొన్ని కష్టాలనుభవించాక, ఇంకో రకంగా అదృష్టం కూడా తలుపు తడుతుందేమో!  అందుకే సవతితల్లి వల్ల పడ్డ కష్టాలకి కాళికామాతని తలుచుకుని బాధపడి ఏడుస్తుంటే ఆ దేవత అనుగ్రహం లభించింది.  ఒకరకంగా పరోక్షంగా దీనికి కారణమైన తన సవతితల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంది.  రాజదర్బారులో వున్నంతకాలం ఆమెకి తన సవతితల్లి గుర్తుకు రాలేదు.  మళ్ళీ ఇప్పటికి గుర్తుకు వచ్చింది.  కాళికామాత చెప్పినట్లు తను ప్రతి జన్మలోను ఎన్నో సుఖభోగాలనుభవించింది. లావణ్య పెద్ద మహరాజా కుర్చీలో కూర్చుంది.  ఆమె స్నేహితులు, బంధువులు అందరూ వచ్చారు.  కేక్ కట్ చేయించి తినిపించారు.   మంగళహారతులు పాడారు.  వీడియో తీసారు.  పేదలకి అన్నదానం, వస్త్రదానం చేయమని తన తండ్రికి చెప్పింది.  భోజనాలయాక అలాగే చేసారు.  పేదలందరికీ లావణ్య బట్టలు పంచిపెట్టింది.  అందరినీ ప్రేమగా పలకరించింది.  కాని ఆమెని ఎన్నో కళ్ళు ఈర్ష్యగా చూసాయి.  అవన్నీ గమనించింది లావణ్య. తాతయ్య ఆమెకి మంత్రించిన విభూతి పెట్టాడు. మర్నాడు ఆమె స్కూలుకి వెడుతూంటే, ' ఇవాళ స్కూలుకి వెళ్ళకమ్మా.  పూజలు చేయించాలి.' అన్నాడు. ' ఎలా తాతయ్యా వెళ్ళకపోతే?  నిన్న పుట్టినరోజు కనక వెళ్ళద్దన్నారు.  మొన్న షాపింగుకి తీసికెళ్ళారు.  ఈ వారమంతా ఏదో విధంగా స్కూలు మానేసాను.  ఈరోజు కూడా వెళ్లకపోతే ఎలా?  అన్నట్టివాళ స్కూల్లో వకృత్వపోటీలున్నాయి.  నన్ను తప్పనిసరిగా పంపించమని నిన్ననే టీచర్ డాడీకి చెప్పింది.  రేపు సండే కదా తాతయ్యా1  పూజలు రేపు మొదలు పెట్టచ్చులే.' అని లావణ్య స్కూల్ యూనిఫాం వేసుకుని కారులో కూచుంది. తాతయ్య కూడా ' సరేలే అమ్మా.  అలాగే చేద్దాం.' అన్నాడు. ' బై అమ్మా1  బై డాడీ!  బైబై తాతయ్యా!' అంటూ అందరికీ చేతులూపింది లావణ్య. ' సాయంత్రం అమ్మవారి గుడికెడదాం.  త్వరగా వచ్చేసెయ్యమ్మా.' అన్నాడు తాతయ్య. ఆ సాయంత్రం లావణ్య రాలేదు.  మర్నాడూ రాలేదు.  ఆమె ఎప్పటికీ ఇంక రాదు.  కిడ్నాపర్ల వలలో చిక్కుకుని దారుణంగా హత్య చెయ్యబడింది! ' ఇంక పుట్టినరోజులు చెయ్యద్దమ్మా.' అన్న లావణ్య మాటలు తల్చుకుని భోరున ఏడ్చింది కన్నతల్లి. తాతయ్య కుప్పకూలిపోయాడు. తండ్రి స్పృహలో లేడు. లావణ్యని దర్శించుకుందామని వచ్చిన సిధ్ధాంతిగారు ఆరోజు స్కూలుకి వెళ్ళకుండా పూజలు చేయిస్తే బాగుండేది అనుకున్నారు. ' పుట్టినరోజు చెయ్యకుండా వుంటే బాగుండేదేమో!' కన్నతల్లి బాధ. ' టి.వి.ఛానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్!  లావణ్య హత్య చెయ్యబడింది.! టి.వి.లో దేవత లాంటి అందాల చిన్నారి పాప లావణ్యని, ఆమె స్వఛ్ఛమైన చిరునవ్వుని చూసి కంట తడిపెట్టనివారు లేరు.  ఆ బంగారుపాపని చంపడానికి ఆ కిరాతకులకి చేతులెలా వచ్చాయో అని బాధ పడ్డారు.  ఆమెని చంపిన మానవత్వం లేని కిరాతకులు ఎవరై వుంటారు?  ' వక్తృత్వపోటీలున్నాయి, మీ పాపని తప్పనిసరిగా రేపు స్కూలుకి పంపించండి ' అని టీచరులా ఫోనులో మాట్లాడిన వాళ్ళని ఇంటిలో వాళ్ళు, పోలీసులు అనుమానించలేదా? ఎవరైతేనేం?  నిందితులు దొరికినా చనిపోయిన పాప తిరిగి వస్తుందా? మళ్ళీ మళ్ళీ ఇవి మామూలే.  కానీ ఇలా ఎన్నాళ్ళు?  ఈ మృగాలు మనుషులుగా మారరా?  తరచు ఎన్నో ఘోరాలు జరుగుతూంటే ఏ ప్రభుత్వాలూ అరికట్టలేవా?  ఈ సమాజంలో ఎవరికీ బాధ్యత లేదా?  ఈ దారుణాలని అరికట్టడానికి పరిష్కారమే లేదా?  ఇంకా....ఇంకా.....ఎన్ని బ్రేకింగ్ న్యూస్ లు?  ఈ బ్రేకింగ్ న్యూసులకి బ్రేకులు పడవా?  వీటికి అంతం లేదా? ఆ బంగారుపాప మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. పంచభూతాలన్నీ ఏకమై ఉగ్రరూపం దాల్చాయి.  ఎన్నో నేరాలని, ఎన్నో ఘోరాలని సహనంతో భరించే భూమాతకి కోపం వచ్చి ఫెళఫెళారావాలతో బద్దలయింది.  ఎత్తైన భవనాలన్నీ కుప్పకూలాయి. సముద్రాలు పొంగి అంతా జలమయం ఐంది.  పంచభూతాలన్నీ ఏకమై ఉగ్రరూపం దాల్చి పాపాత్ములని, పుణ్యాత్ములని, సమస్త భూమండలాన్ని తమలో ఐక్యం చేసుకున్నాయి. కలియుగం అంతమైంది! యుగాంతం అయిపోయింది.  పంచభూతాలు శాంతించాయి. బ్రహ్మ కొత్త సృష్టికి శ్రీకారం చుట్టాడు. కాలచక్రం మాత్రం ఆగదు. కొత్తయుగం ప్రారంభమయింది.  ఒకటవ శతాబ్దం! కొక్కొరోకో అంటూ ఉదయాన్నే కోడి కూస్తూ కొత్త యుగాది శుభాకాంక్షలు తెలుపుతూ లోకాన్ని మేలుకొలిపింది. సముద్రంలో కెరటాలు బధ్ధకించకుండా ఉవ్వెత్తున లేచి కింద పడుతున్నాయి. మొక్కలు, చెట్లు, పువ్వులు మేఘాలనించి కురిసిన వర్షానికి నీటిబిందువులు మీదపడి పులకించిపోయాయి. వాటి పులకింతలు చూసి మయూరాలు ఆనందంతో పురులు విప్పి నాట్యం చేయసాగాయి. ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా, రమణీయంగా వుంది. ఆది లేదు, అంతం లేదు,  ఈ అనంతమైన కాలానికి బధ్ధకం లేదు.  ఈ కాలచక్రభ్రమణంలో సృష్టి రీసైక్లింగ్ జరుగుతోంది.
***********************
          అప్పుడే పుట్టిన ఒక పాప శ్రావ్యంగా ఏడుస్తోంది.  అందమైన ఆ పాపకి లావణ్య అని పేరు పెట్టారు.'కొత్త యుగం మొదలైంది.  ఈ రోజు ఉగాది.  మనం ఒకటో శతాబ్దంలో వున్నాం కాబట్టి మొదటినించీ జాగ్రత్తగా జీవిద్దాం.  ఏ తప్పులూ చేయద్దు.  అక్రమాలు, అన్యాయాలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, కిడ్నాపులు, తగాదాలు - అసలు వాటికి అర్థమే తెలీకుండా, వాటికి ఏమాత్రం తావివ్వకుండా మంచిగా బ్రతుకుదాం.  మనం మనుషులం.  కౄరమృగాలం కాదు.  మనుషులుగానే జీవిద్దాం.  కష్టాలొస్తే కలిసి పంచుకుందాం.  భయపడి పారిపోవద్దు.  నిరాశపడకుండా ధైర్యంగా ముందుకు సాగుదాం.  డబ్బుకి ఆశ పడి అక్రమాలకి పాలుపడకుండా వుందాం.  జాలి, దయ, దానగుణం, ప్రేమ, ఐక్యత, ఆప్యాతానురాగాలు - ఇవే మన ధనరాశులు.  ఈ రాష్ట్రాన్ని అభివృధ్ధిపథాన నడిపించడానికి మనకీ ధనరాశులు చాలా అవసరం.....' అని కొత్త ముఖ్యమంత్రిగారు తన ఉపన్యాసంలో అందర్నీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు.  ఆ ముఖ్యమంత్రి గారి పేరు రాముడు.  రాముడు దేముడు.ఈ శ్రీరామరాజ్యం చాలా బాగుంటుందని, సకల జీవరాశులు సుఖంగా వుంటాయని, పాడి పంటలతో రాష్ట్రం సస్యశ్యామలంగా వుంటుందని, రాష్ట్రం చాలా అభివృధ్ధి చెందుతుందని, ఉగాదికి పండితులు పంచాంగ పఠనం చేస్తున్నారు.కొమ్మలో కోయిల కుహు కుహూరాగాలు ఆలపిస్తోంది.  ప్రకృతి ఎంతో శోభాయమానంగావుంది.
' సమీరంలో.......మలయ సమీరంలో..... వాసంతపు మలయసమీరంలో నే మయూరినై నాట్యమాడగా సుప్రభాత కోయిలా! పాడవే....ఒక్కసారి పాడవే....నీవు పాడగా, నేను ఆడగా ముల్లోకాలకు వచ్చెను వసంతశోభ....నీ గానరవళిలో, నా నాట్యకేళిలో జగమెల్ల పులకించె హా్యిగా
          అంటూ ప్రకృతి రమణీయతని ఆస్వాదిస్తూ ఓ ప్రకృతికాంత నెమలి నాట్యం చేస్తూ కోకిలమ్మని అడుగుతోంది.కోకిలమ్మ పొంగిపోయి ఆనందంగా ' సన్నగ వీచే చల్లగాలికి ' అంటూ సుశీలమ్మలా పాడాలని ప్రయత్నించి, చేతకాక, ' కుహూ కుహూ' అంటూ కుహూరాగాలు చేసింది.కోకిలమ్మ పడుతున్న అవస్థకి చిన్నారి లావణ్య కేరింతలు కొడుతూ ఫక్కున నవ్వింది.ఈ అందాలని అందిపుచ్చుకుందాం.  ఈ రమణీయతని ఆస్వాదిద్దాం.  అదే అసలైన యు(ఉ)గాది!!!
***********************

No comments:

Post a Comment

Pages