బస్సులో ఒక రోజు - రచన : చెరుకు రామ మోహన్ రావు - అచ్చంగా తెలుగు

బస్సులో ఒక రోజు - రచన : చెరుకు రామ మోహన్ రావు

Share This
బస్సు బయలుదేరుటకు ముందు నామాటలు నాలుగు వినండి. నాలుగు అన్నది మాటవరసకే సుమా! పళ్ళు లేని అవ్వ కూడా పువ్వు లాంటి నవ్వు  నవ్వా లనుకునే ఈ రోజుల్లో ఎవ్వడైనా రవ్వంతైనా నవ్వు నవ్వనివాడుంటాడా  అని నా మనసును అడిగినాను . మనసు వెంటనే ఎందుకు వుండరూ! మన చంద్రబాబు ఇప్పుడిప్పుడు నవ్వు నేర్చుకుంటున్నాడు గానీ గతమంతా నవ్వు రువ్వేవాడు కాడుగదా అని వెంటనే సమాధానమిచ్చింది. మరి నవ్వకపోతే ఏమౌతుంది అన్నది నా ప్రశ్న. నీవు నవ్వకుంటే పళ్ళులేనివానివి అనుకొంటారు అందరూ అన్నది నా మనసు యొక్క జవాబు. సరే నేను నవ్వడానికే నిశ్చయించుకొన్నాను మరి మీ మనసులు మీకేమి జవాబు చెబుతాయో!
ఇక బస్  ఎక్కుచున్నాను. పై ఉపన్యాసము చెప్పి ఎక్కేలోపల బస్సు నిండిపోయింది. చేరవలసినది కడప ప్రయాణము 35 కిలోమీటర్ల దూరము. నేను బయలుదేరిన స్థలము కమలాపురము. 'అడుగడుగు దండాలవాడా' 'ముద్ద కు బిస్మిల్లా' అన్నట్లు అది ప్రతి 4,5 కి.మీ. లకు వచ్చే పల్లె పల్లె దగ్గరా నిలిచే బస్సు . నేను ప్రతి రోజూ ప్రయాణము చేసే వాడిని. టికెట్టు ధర రూ.1.25. రానూపోనూ రూ.2.50 మరియు ముఖ్యమైన వినియోగదారులు ఆఫీసులో నన్ను చూచుటకు వస్తే, వారికి చాయ్ ఇప్పించుటకు, ఒకరోజుకు ఇద్దరు మాత్రమె,1/2 రూపాయి కలిపి రూ.3 గా ఇచ్చేది వితరనసీలియైన నా ఇల్లాలు. దేవుని దయతో చివరిలో ఏడుమంది కూర్చునే సీటులో నాకోసమా అన్నట్లు ఒక్కటి మిగిలియుంటే నేను అచ్చటసుఖాశీనుడనైనాను. సర్డుకొన్నతరువాత ప్రక్కన చూస్తే ఒక పల్లెటూరి ఆవిడ నా ప్రక్కన కూర్చొని వుంది. ఆ ఊరు మల్లె పూలకు ప్రసిద్ధి.ఎండలు మండిపోతూ వుంటాయి. నేనెక్కిన సమయము సాయంకాలము 5.30నిముసములు. నా వయసు 30 లోపే.
ఎట్టకేలకు, కట్టకడపటికి, తుట్టతుదకు, చిట్టచివరకు, బస్సులో కదలిక కనిపించింది. తడిసిన చొక్కాను మెల్లగా వచ్చిన పిల్లగాలి చల్లగా పలకరించింది. పైకి పోబోతున్న ప్రాణాన్నికిందికి లాగింది, గాలి , నాకష్టాన్ని అర్థం చేసుకొని.అంతలో ఒక మల్లెపూలమ్మే కుర్రవాడు 'మల్లె పూల్', మల్లెపూల్', అని అరుస్తూ బస్సు యొక్క ఒక ప్రక్కన ఎక్కి దిగుటకు రెండవ ప్రక్క రాసాగినాడు. ఎదో ఆలోచనలో ఏటో చూస్తున్న నన్ను ఎవరో తొడమీద బలంగా చరిచినట్టనిపించి,  నా ప్రక్కనున్న పల్లెటూరి ఆవిడ ఆ పూలసాయాబు వైపు చూపించి 'అయ్యా! పూలు కొనుక్కుంటా' నని అన్నది. నేను దిగ్భ్రమకు లోనైనాను.సప్త సముద్రములేకమైనట్లు,మిన్ను విరిగి మీద పడుతున్నట్లు, ఆశనిపాతము తో కూడిన వర్షము నాపైన మాత్రమె పడుతున్న అనుభూతులన్నీ ఒక్కసారి కలిగి, బాధ కలిగిన తోడ వైపు చూపు మరల్చినాను. నా ప్రక్కనున్న ఆ పల్లెటూరి ఆవిడ ఆ పూలసాయాబు వైపు చూపించి 'అయ్యా! పూలు కొనుక్కుంటా' నని అన్నది. నా అదృష్టమో దురదృష్టమో కానీ ఆ రోజు నా అతిధి పూజా ధన వినియోగము కాలేదు. కొనివ్వకపోతే గిచ్చుతుందేమోనని భయపడి  సరే అన్నాను. ఆమె పూలవానిని పిలిచి ఒక అర్ధ రూపాయికి పూలు ఇవ్వు అనింది.ఆశ్చర్య పడవద్దండి. ఆ రోజులలో ఆ ధరకు టీలు,కాఫీలు,పూలు ఇత్యాదులు అర్ధ రూపాయికి లోపలే దొరుకేవి. దేవునికి మనస్సులోనే నమస్కరించి ఉన్న అర్ధరూపాయిని పూలవాని హస్తగతం చేసివేసినాను. థాంక్స్ అన్న మాట ఆమెకు తెలియదు కావున చెప్పలేదు.ముఖములోని సంతోషము అంతకన్నా ఎక్కువే చెప్పింది.
బస్సు మెల్లగా కదిలింది. కండక్టరు 'కడప,కడప' అని అరుస్తూనే వున్నాడు అంతలోనే ఒక 'బిస్కోతులు'(biscuts)(అక్కడ ఆ మాటే అందరూ అంటారు, ఇవి ఏ విధమైన కోతులు అని అనుకోవద్దు.) అమ్మే వాడు వచ్చినాడు లోనికి.ఉన్నది సున్నా అన్నది నాకు తెలుసు కాబట్టి, ఈ సారి ఆమె నన్ను కొట్టక ముందే గట్టిగా ఓ అమ్మా! అని గట్టిగా పిలచినాను. బస్సులో  ఆశబ్దము విన్న అందరితోబాటు ఆమె కూడా నన్ను చూసింది. అందరూ చూడటము వల్ల కాస్త సిగ్గనిపించింది నాకు. అయినా మళ్ళీ గట్టి దెబ్బ పడకముందే చెప్పి తీరవలయునన్న ధృఢ
నిశ్చయముతో 'అమ్మా ఆ బిస్కోతులు కని ఇవ్వమని నన్నడుగ వద్దు' అన్నాను . ఆమె 'సరే' అనకుండా 'ఎందుకు' అన్నది. బిత్తర పోవడము తిరిగీ నావంతయింది. 'ఏమిటీ అధికారము,ఏమిటీ అహంకార' మని రామారావు గారు పౌరాణిక వేషధారణలో నామనసులో చెబుతున్న అనుభూతి కలిగింది. నేను ఆయన కృష్ణ పాత్రను తలచుకొని శాంత చిత్తుడనై అమ్మా నావద్ద ఇంకా దుడ్డు (డబ్బు) లేదన్నాను. ఆమె ముసిముసి నవ్వులతోబాటూ పక్కనున్నవారి వికతాత్తహాసాలూ వినిపించినాయి. కొద్ది దూరము పోయిన తరువాత ఆమె డి పోయింది .
బస్సు ఇంకా కాస్త దూరము పోతూనే ఎక్కువ మండి దిగి పోయినారు.బస్సు దాదాపు ఖాళీ అయ్యింది. నేను కూడా దగ్గరేవున్న three seater లోకి మారినాను. కిటికీకి దగ్గరగా నాప్రక్కన ఒక 60 సంవత్సరాల పళ్ళూడిన మీసాల పులి కోర్చోని వున్నాడు . rush లేనందువల్ల సముద్రములో కెరటాలు ఎగిరి పడినట్లు రోడ్డుమీద బస్సు ఎగిరి పడుతూవుంది.బస్సుతోబాటూ నేనూ ఎగరక తప్పటములేదు. కిటికీని ఆనుకొని కూర్చున్న ముసలతనికి కుదుపులు అదుపు లోనే వున్నాయి. నేను మాత్రము ఎగిరినపుడు ఆయనపై వద్దనుకోనా పడవలసి వచ్చేది. ఆయనకు కోపము కట్టలు తెగింది. నా వైపు రోషారుణ నేత్రాలతో చూస్తూ 'యాంటికి జాన్నూకులూ అట్ల మీద పడతావ్' అన్నాడు. (జాన్నూకులు=అంటే సారి సారికి అని). అసంకల్పితంగా నానోటినుండి ' నీవు అందంగావున్నా' వని  వచ్చేసింది. అంతే మీసాల క్రింద విడిగిన పువ్వులా పెదవులు తెరుచుకోవడము నాకన్నులు గమనించినాయి.కొంత దూరము పోతూనే అతను దిగిపోయినాడు 'పోయివస్తా'నని చెబుతూ.
అక్కడ ఒక వ్యక్తి ఎక్కి నా ప్రక్కన కూర్చున్నాడు.  మాటలు కలిసి అతను తెలుగు పండితుడని తెలుసుకొన్నాను. నాకూ తెలుగులో అభిరుచి వున్నదని గమనించిన అతడు ఎన్నో భాషవిశాయముల గూర్చి మాట్లాడుతూ వస్తునాడు, బస్సులో కూర్చునే సుమా! అంతలో driver వద్ద వుండే entrance లో ఒక తటస్త (అటు ఇటు కాకుండా) వ్యక్తి ఎక్కినాడు. నాప్రక్కనున్నతను అర్ధనారీశ్వరుడెక్కి డ్రైవర్ దగ్గరికి పోతున్నాడు ,కొంపదీసి బండి నడుపుతాదేమో అన్నాడు. నేను వెంటనే 'అంతటి అదృష్టమా అట్లయితే అందరమూ కైలాసము చేరుతాము కదా' అన్నాను. నవ్వడము ఆయన వంతయింది.
ఈ విధంగా ఆ రోజు ప్రయాణము జరిగింది.ఒకటిన్నర గంట ప్రయాణము చేసిన తరువాత బస్సు, కడకు, కడపకు చేర తప్పలేదు.

No comments:

Post a Comment

Pages