‘ఏడు మల్లెలెత్తు రాకుమారి ‘ - రచన: భావరాజు పద్మిని - అచ్చంగా తెలుగు

‘ఏడు మల్లెలెత్తు రాకుమారి ‘ - రచన: భావరాజు పద్మిని

Share This
‘ఏడు మల్లెలెత్తు రాకుమారి ‘ 
-  భావరాజు పద్మిని 


‘పాషాణ’ దేశపు రాకుమారుడు సుకుమారుడు. వేల యోజనాల విస్తీర్ణం, అంగబలం, అర్ధబలం సమృద్ధిగా కల తండ్రి రాజ్యానికి త్వరలో కాబోయే మహారాజు. అతడికి చిన్నతనంలో బామ్మ చెప్పే రకరకాల కధలు విన్నప్పటి నుంచి, ఒకటే వింత కోరిక... ఏడేడు లోకాలు వెతికైనా సరే, సప్త సముద్రాలు ఈదైనా సరే, అష్ట కష్టాలు పడైనా సరే, ఎలాగైనా, తన కలల్లోని సుమ సుకుమారిని, ‘ఏడు మల్లెలెత్తు రాకుమారిని’ పెళ్లాడాలి. తోటి రాజ్యాల వారంతా, తన అదృష్టాన్ని చూసి గుక్కపెట్టి ఏడవాలి... అంతే! ఎండ కన్నెరగని ఆ సుకుమారి, ఏడుమల్లెలెత్తు రాకుమారి, తన స్వప్నసుందరి దొరికితేనే కాని రాజ్యానికి పట్టాభిషిక్తుడు కానని, మొండికేసాడు. ‘రాకుమారుడు’ తలచుకుంటే, ‘సుకుమారులకు’ కొదవా? వెంటనే మహారాజు, అంతటి సుకుమారి ఎక్కడుందో వెతుక్కు రమ్మని వేగులను నలు దిశలకు పంపాడు. అందులోంచి ఒక వేగు కొన్నాళ్ళకు తిరిగి వచ్చి, ఇలా చెప్పసాగాడు. 
“మహారాజా! శుభవార్త! రాకుమారుడి కోరిక నెరవేరనుంది. ‘మృదుల’ దేశపు రాకుమారి ‘కుసుమ కోమలి’ అతి సుకుమారి అని సమాచారం. ఆమె చిన్నప్పుడు ఎండలోకి వెళ్లి, బుగ్గలు ఎర్రబడి సొమ్మసిల్లి పడిపోయిందట. చెలికత్తె విసురుతున్న నెమలి ఈకల వీసెన తగిలి, ఆమె శరీరం కంది, కమిలిపోయిందట. ఆభరణాలు కూడా మొయ్యలేక పోతోందని, ఆమెకు బంగారు దారాల నగలు చేస్తారట. అడుగడుక్కీ ఆమె ఎక్కడ అలసిపోతుందో అని, పూల బాట పరిస్తే, పూల రేకలు తగిలి ఆమె పాదాలు కందిపోయాయట !” 
“అలాగా! మరి ఆమె దేనికి కందిపోతుందో, దేనికి అలసిపోతుందో... ఎలా తెలుసుకోవడం?”, అడిగాడు సుకుమారుడు. “ మంచి ప్రశ్న వేసారు యువరాజా! ఇది తెలుసుకునేందుకే, కోమలి తండ్రి పిపీలక మహారాజు నిపుణులతో ఒక పరికరం తయారు చేయించారట. దాని పేరే ‘మల్లోమీటరు...’, రాకుమారి శరీరానికి ఈ యంత్రం నగలలో అమర్చారు. ఇందులో ఏడు బంగారు మల్లెలు ఉంటాయి. రాకుమారికి హాని జరిగే సందర్భం రాగానే అందులోని మల్లెల్లో కలకలం మొదలౌతుంది. ఆమె తిరిగి మామూలు స్థితికి రాగానే మల్లెలు మామూలు అయిపోతాయి. “ “ఇదేదో భలేగా ఉందే! తండ్రీ కుసుమ కోమలే మీ కాబోయే కోడలు, అంతే!” అన్నాడు రాకుమారుడు. వైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. పెళ్ళిలో తాళి కట్టే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు సుకుమారుడు. తలంబ్రాలు వెయ్యబోతుండగా, మల్లోమీటర్ లో కలకలం మొదలైంది. వెంటనే, ఆ ప్రయత్నం మానుకుని, ఒక బియ్యం గింజ సుతారంగా వేసి, మురిసిపోయాడు. కోమలి మాత్రం పళ్ళెం ఎత్తి సుకుమారుడి నెత్తిన బోర్లించింది. సుకుమారుడు బోర్లా పడి, ఆశ్చర్యపోయాడు. కాలు తొక్కే సమయం వచ్చింది. సుకుమారుడు ‘పాపం సుకుమారి కోమలి...’ అనుకుంటూ కాలు చాపాడు. వెంటనే కెవ్వున కేక వేసాడు. ఏనుగు పాదం త్రోక్కినట్టు అతని బలంగా కాలు అదిమేసింది కోమలి. “జామాతా! ఇదంతా శక్తి ప్రవాహ అసమతుల్యత. శక్తిని సుకుమారంగా వాడడం వల్ల, ఒక్కోసారి ఇటువంటి అతి శక్తి ప్రవాహం జరుగుతుంది...” అన్నాడు పిపీలకుడు. ‘అతి సుకుమారి లోక విరోధి’ అంటే ఇదేనేమో అనుకుంటూ ,కాసేపటికి సర్దుకున్నాడు సుకుమారుడు. కాని రాను రానూ కోమలి వ్యవహారం ప్రశ్నార్ధకంగా మారింది రాకుమారుడికి. ఒక్కోసారి మొరటు పనులు అవలీలగా చేస్తుంది, ఒక్కోసారి చిన్నచిన్న స్వంత పనులకే కందిపోయి సోమ్మసిల్లిపోతుంది. 
‘మల్లోమీటర్’ సుకుమారి ‘కోమలి’ ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియక తికమక పడసాగాడు. తన కల నిజమైందని మురిసిపోవాలో, శక్తి ప్రవాహ అసమతుల్యత వల్ల కలిగే ఇబ్బందులకు ఏడవాలో తెలియని స్థితి. రానురానూ సుకుమారం అంటే విరక్తి పుట్టింది సుకుమారుడికి. ఇక భరించలేని స్థితిలో ,మంత్రి ‘ నక్కజిత్తుడి ‘ సాయం కోరాడు. అంతే! కుసుమ కోమలి మామూలుగా మారిపోయింది. అందరిలాగే అన్ని పనులూ చేస్తోంది. తనకు అన్ని విధాలా సహకరిస్తోంది. మురిసి ముక్కలైన రాకుమారుడు మంత్రిని కానుకల్లో ముంచి, ‘మంత్రీ, మీ నక్కజిత్తుల మంత్రాంగం, నా జీవితాన్నే మార్చేసింది. ఇంతకీ ఏ ఎత్తు వేసారో, అసలు గుట్టేమిటో చెప్పరూ...’ అని వేడుకున్నాడు. “ సుకుమారా ! సుకుమారపు శరీరాన్ని సున్నితపు చెప్పుతో కొట్టమన్న’, సామెత విన్నావా? నీకో నిజం చెప్పనా? కోమలి సుకుమారి కాదు. మామూలు రాకుమారే!” “అవునా, ఈ విషయం మీరు ఎలా కనిపెట్టారు మంత్రీ?” ఆశ్చర్యంగా అడిగాడు సుకుమారుడు. 
“యువరాజా! జరిగితే, ఎవరు సుకుమారి కాదు ? మన శక్తిని అవసరాన్ని బట్టీ వినియోగించుకుంటాము కదా! ఆమెను గమనిస్తే నాకు ,ఇదే సందేహం నాకు కలిగింది. ఆమె వైఖరిని కనిపెట్టమని చెలికత్తెలకు పురమాయించాను. ఎవరూ లేనప్పుడు ఆమె సుబ్బరంగా తిని తిరుగుతోందని తెలిసింది. మల్లోమీటర్ తెప్పించుకుని , నాకు పెట్టుకు చూసాను. ఏదో ఒక సమయంలో గగ్గోలు పెట్టేలా మల్లోమీటర్ ను తయారు చేసారు. నువ్వది చూసినప్పుడల్లా భయపడి, ఆమెకు కష్టం కలగకూడదని క్రిందా మీదా పడ్డావు. ఇదీ అసలు సంగతి ! ఆమెను కాస్త బెదిరిస్తే, ఇదంతా ఆమె తండ్రి పిపీలకుడి తంత్రం అని తెలిసింది. ఏది ఏమైనా ఆమె కాబోయే రాణి కనుక, బాధ్యతగా మసలుకోమని తెలియజేసి, మల్లోమీటర్ పచ్చడి చేసాను.... అంతే! ఆన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్...’ అని తేలిపోయింది ! ‘వాట్ ఆన్ ఐడియా సర్ జి...’ అంటూ ఆనందంగా గెంతాడు ‘సుకుమారపు’ ముచ్చట తీరిన సుకుమారుడు.

No comments:

Post a Comment

Pages