శివం - 65 - అచ్చంగా తెలుగు
శివం - 65
హరసిద్ధుని కథ 
రాజ కార్తీక్


(హర సిద్దుడు చెక్కిన శిల్పాలు కుంభయ్య చూసి, తన గతం తెలుసుకుని, తానే ఒక అవకాశం ఇవ్వ తలచాడు)

హర సిద్దు "నాకు నువ్వు ఏమి అవకాశం ఇస్తావు అన్నా? ఒకవేళ ఇచ్చినా ఎక్కడోచోట ఆ పని ఆగిపోతుంది. నువ్వు కూడా నేనేమీ చేయలేను అని తర్వాత అంటావు. నువ్వు చెప్పిన దాని కోసం ఆశపడి ,కష్టపడి ,బాధపడి , మధన పడి..."

కుంభన్న "అదేంటయ్యా అలా అంటావ్,అంతా నిరాశా?నువ్వు ఏమన్నా పండు ముసలివాడివా? ఇలా బాధ పడుతున్నావు, అవకాశం ఇద్దామంటే వదులుకుంటావా? "

హర సిద్ధ "  చెప్పు అన్నా! ఎన్ని చూడ లేదు , ఆ దేవుడికి కూడా నేనంటే చులకన, కావాలని అంటే చూడన్నా ఎందుకు నీకు ఇవన్నీ, ,"

కుంభన్న "అలా అనకు హర సిద్దా"

హర సిద్దు " అన్న .."

కుంభన్న " ఏంటి చెప్పు "

హర సిద్ధ " ‌‌ నేను చెప్పింది వినపడుతుందా "

కుంభన్న "చూడు హర సిద్ధ ఇప్పటిదాకా నువ్వు వెతుక్కుంటూ వెళ్లిన అవకాశాలు నీ చేజారినాయి , కానీ ఇప్పుడు నీకు మొట్టమొదటిసారిగా అవకాశం దానంతట అదే నా రూపేణా వచ్చింది. నువ్వు తెలివి గలవాడివి నాకు తెలుసు, తెలివిగల వాడు ఎప్పుడూ చేతికి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టాడు. ఎందుకో నన్ను అన్నా అన్నావు కాబట్టి ఈ ఒక్కసారికి నా మాట విను ఈ అవకాశాన్ని వాడుకో"

హర సిద్ధ "అలాగే  నువ్వు ఇంత బాగా చెప్తున్నావ్ కాబట్టి, ఎందుకో నీకు నాకు స్నేహం కుదిరింది కాబట్టి, చెప్పు నేను వాడుకునే అవకాశం అయితే కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను"

కుంభన్న "అదీ, అలా ఉండాలి, ఇప్పుడు చెప్తా విను..."

ప్రతి దాని మీద నిరాశ చెందిన హర సిద్దు కుంభన్న చూపిస్తున్న మృదుస్వభావానికి లొంగి పోయాడు, హర సిద్దు కేవలం ప్రేమకు మాత్రమే లోబడి ఉంటాడు . ఎందుకంటే అది నిజమైన మనుషుల స్వభావం, భక్తులారా మీరు కూడా మీ అందు ప్రేమ చూపించిన వారిపట్ల ప్రసన్నులై ఉండండి,అది మీరు కూడా నా మీద చూపిస్తున్న ప్రేమ ఎందుకంటే వాళ్ళలో కూడా నేను ఉంటాను కదా, ఎందుకంటే అందరిలో నేనే అంతా నేనే. ప్రతి ఒక్కరికి అది అర్థం అయ్యే రోజు ఒకటి స్వయానా వస్తుంది..

హర సిద్ద "చెప్పన్నా అవకాశం ఏంటి? నేను ఏం చేయాలి?"

కుంభన్న "హర సిద్దా! నీవు ఒక మంచి శివలింగాన్ని చెక్కాలి, ఆ శివలింగం లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీవకళ కనపడే విధంగా ఉండాలి, ఆ శివ లింగం పానవట్టం తాకేభాగాన ముందుకు రావాలి"

హర సిద్ద"అదేలే అన్న బాగా అన్నం తింటే బొజ్జ ముందుకు వచ్చినట్లు చెక్కలి" అని పరిహసించాడు.

కుంభన్న "హర సిద్దు నువ్వు ఈ పని కానివ్వు ఎందుకు ఏమిటి అని అడగకు , సమయం వచ్చినప్పుడు అంతా చెప్తా. అంతా నీకే అర్థమవుతుంది, ఖచ్చితంగా నీ జీవితానికి ఇది ఒక మార్గదర్శకంగా కాగలదు."

హర సిద్దు ,కుంభయ్యా ఇద్దరూ శ్రేష్ఠ మైన రాయిని వెతికి కనిపెట్టి ..ఇక పని మొదలు పెట్టారు. 

ఇద్దరూ అప్పుడప్పుడు తన తాత దెగ్గరకు వెళ్లి, ఇదివరకు లాగా సరదాగా గడిపే వారు .

జీవితంలో ఎప్పుడు ఎదుట వారిని నవ్వించి, తను బాధ పడటమే తెలిసిన హర సిద్దు..కుంభన్న తో కలిసి నవ్వులో పడి ఎంతో సరదాగా గడిపారు. కుంభన్న సావాసంలో హర సిద్దు నిజమైన స్నేహం పొందాడు అని అనుకొని ఆనంద పడ్డాడు. తన శిల్పశాలలో శివ లింగాన్ని చెక్కుతూ, ఇద్దరూ సరదాగా సమయాన్ని గడిపారు.

మొత్తం మీద శిల్ప శాస్త్ర రీత్యా సరి అయిన ఒక శివ లింగాన్ని కుంభన్న కోరిక మేరకు సిద్దం చేశాడు హర సిద్దు. ఇప్పుడు హర సిద్దు పనితనం ఇంకా పెరిగింది. నైపుణ్యంలో అందనంత ఎత్తుకు చేరాడు. హర సిద్దు చెక్కిన శివ లింగానికి ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో అని నేనే అనుకున్నా.‌ అంత చూడ ముచ్చటగా చెక్కాడు ఏ తప్పు లేకుండా ..

తన ఎత్తు శివ లింగాన్ని చూసి చెక్కిన హర సిద్దు ..నాకు మొక్కి ..

"నాకు ఒక మంచి అవకాశం ఇవ్వు స్వామి,నన్ను నేను నిరూపించుకోవడానికి,నా తప్పులు క్షమించు స్వామి ,ఇతరుల పట్ల నేను చేసిన తప్పులు కూడా కాయి స్వామి .. " అన్నాడు. 

నేను " తథాస్తు " అన్నాను. 

ఇక ముందు హర సిద్దు జీవితం లో ఏమి జరగ బోతోందో చూద్దురుగాని..

హర సిద్దు " కుంభన్న అంతా సిద్దం "అని  హుషారు గా కేక వేశాడు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages