వెంకటాద్రి గారింట్లో హడావిడి - అచ్చంగా తెలుగు

వెంకటాద్రి గారింట్లో హడావిడి

Share This
వెంకటాద్రి గారింట్లో హడావిడి 
మల్లి శ్రీపురం

కౌసల్యా ! సుప్రజా ! రామా !
పూర్వాసంధ్యా ! ప్రవర్తతే !!...
ఆహాఁ ఏమి శుభదినము, ఈ శనివారం, ఇలాంటి రోజున "వికారి" నామ సంవత్సరం రావటమూ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి సుప్రభాతంవిని, ఆనందపడటమూ, ఈపాటికి అందరూ నిద్దుర లేచే యుంటారు. 
అంటూ తను స్వగతంలోకి వెళ్ళిపోయాడు వెంకటాద్రి రిటైడ్ హెడ్ మాస్టర్. 
అయినా నాభ్రమ, భ్రాంతి,గాకపోతే ! ఇంటిపట్టున బాగా చదువుకున్న పిల్లలు ఉంటారంటారా ! 
వాళ్ళు వాళ్ళ,చదువుకి తగ్గట్టుగా, ఏదో ఒక కంపెనీలలో ఉద్యోగంలో చేరి, ఉద్యోగం చేస్తూ, నెలకు మొదట్లో పదివేల రూపాయిలు సంపాదించినా, చివరకు 20,000 నుండి, 80,000 వరకు నెలసరిగా, అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని కళ్ళజూస్తున్నారు. 
పరవాలేదు, ఇప్పటి జీవనవిధానం బాగానే ఉన్నది.
ఇంత వయస్సు వచ్చినా, కొడుకులకి పెళ్ళిళ్ళు చేయలేక పోతున్నాను.
దేశమంతా 20 యేడ్ల క్రిందట (బ్రూణహత్య) గర్భస్థ శిశువులని చంపిన, చంపించిన పాపం ఊరికే పోతుందా ! పిశాచపు పీడై మనం చేసుకున్న పాపంపండి, మనల్ని వెంటాడి వేధిస్తోంది. ఆడపిల్లల సంబంధాలు అప్పనంగా దొరకడం లేదని అనుకుంటూ ఉండగా, 
రేడియోలో ఏడుకొండలవాడా, వేంకటేశ్వర స్వామి గోవిందా ! గోవింద !! 
నామస్మరణాలు విని ఈలోకంలోకి వచ్చాడు వెంకటాద్రి, వచ్చీరాగానే, 
"సుప్రభాతం అయిపోయింది కదా ! ఇంకా అలాగే కూర్చొన్నరేం ? గుండ్రాయిలాగ..." అంటూ వంటింట్లోనుండి తన భార్య మంగతాయారు పిలుపులు అనుకుంటే ! అది నాపొరపాటే సుమా !
పిలుపులు కానేకాదు, ఖచ్ఛితంగా అవి  అరుపులే... 
ఈలోకం లోకొచ్చిన - మాలోకం లాగా ! ఒక్కసారిగా ఉలిక్కిపడి... తేరుకుంటూ, "ఏవిటే నీగోల ప్రొద్దున్నే నన్నిలా ఉండనీయవా !ఏమిటి ?" 
అంటూ రుసరుసగా తనభర్త అనేసరికి, 
వంటింట్లోనుంచి ఇంకాస్త స్వరంపెంచి, "ఎప్పుడూ,నీలోనీవే ఆలోచించుకుంటూ ఉంటావా ! ఏమిటి ? ఇంట్లోకి (సంభారములు) సరుకులేమైనా తెచ్చేదుందా ? లేదా ?" అని వినిపించింది.
అతి బలవంతంగా ! పడక కూర్చీలోంచి లేస్తూ... 
"ఇంక ఆపవే, నీకాకిగోల ఊరకనే అరుస్తావు...  ఎవరైనా చుట్టాలొచ్చేస్తారు పండగపూట. "
"ఆఁ ఏమన్నారు?  నాది కాకిగోలా, 60 ఏళ్ళ క్రిందట నేను పాటపాడుతుంటే, కిటికీ లోంచి తొంగిచూస్తూ, ఆహాఁ ! ఏమి కంఠం, కోకిలగానం...అంటూ...
వియ్యానికొచ్చి, మీరు మీఅమ్మా, నాయనతోసహా మీబంధువులంతా కలసి పెండ్లి చూపులకని ప్లేట్లో పెట్టిన ఐదుకేజీల లడ్డూలు కాజేశారు. హవ్వఁ !ఇప్పటికీ నాకు మాబాగా గుర్తుండిపోయింది."
"ఇంతకీ నీకేం తెమ్మంటావే బంగారం. బజారునుంచీ..."
"అదెవతె...  ఈ తాయారమ్మ ఉండగా !  బంగారమ్మ ఎక్కడినుంచి ఊడిపడిందీ ? ఏడిపించడం కాకపోతే పండగపూట.. నవ్వించొచ్చుగా !"
"నిన్ను నవ్విస్తే.. నిన్ను జూచి నేను, నన్నుజూచి నీవు మనిద్దరమే నవ్వుకోవాలి. ఇదే మనమాటలు విన్నారనుకో చుట్టుప్రక్కలవాళ్ళు నవ్వి,నవ్వీ...పండగ జేసుకుంటారు."
"చాల్లేద్దూ ! బడాయి..."
గోడమీది గడియారం ఏడు గంటలు చూపిస్తోంది.. 
గోడగడియారంవైపు చూస్తూ... "ఇంత ప్రొద్దున్నే బజార్లోని అంగళ్ళు దీస్తారంటావా ? "
"ఎందుకు తియ్యరు? వెళ్లి పూజకు ఏదో ఒక రకంపూలు, ఒక కిలో పట్రండీ."
*** 
"ఓరేయ్ ! వెంకటాద్రీ!" తన చిన్ననాటి స్నేహితుడు హేమాద్రి పిలచిన పిలుపుకి ఆనందపడుచూ, 
"ఉగాదిపర్వదిన శుభాకాంక్షలు మీకు మీ,మిస్సెస్ కూ..." అన్నాడు వెంకటాద్రి.
"అలాగేరా ! మీకుకూడా, ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు.  ఇంతకీ ఏవిటా సంచీనిండా ? వేపపూతేనా !"

"అవున్రా ! ఒక కేజీ 50/- రూపాయలేనట.  చాలా చౌకగా అమ్ముతున్నాడు."
"ఎవడండీ ? తలకుమాసిన వాడు, వాడుచెబితే మీరు కొనేయడమేనా ? అంత ఖరీదుపెట్టీ, కొంటే మీఆవిడ ఏమంటుందో ?"
"అదేరా ! నాకూ, దిగులుగా ఉంది. వెళ్ళొస్తాన్ రా మిత్రమా, వీలైతే సాయంత్రం రామ మందిరంలో కలుద్దాం."
 *** 
"ఇంట్లో... పూజకు పువ్వులు తెమ్మని బజారుకి పంపిస్తే, ఎంత అమాయకంగా మొఖంపెట్టి, వేపపూతను చూపిస్తారూ ! సారూ...హెడ్డు మాష్టరంట పైగా..."
"మతితప్పి మాట్లాడ బాకే...వేళాకోళంగా ! "

"అయితే మీకో గతి చూపిస్తాను.."అంటూ... తెల్లదారపుండ మెఖం ముంగిట పడేస్తూ...

"వేపపూతను మాలగా అల్లండి, వేంకటేశ్వర స్వామి వారి ఫోటోకి వేద్దాం."
"ఇదేం పనిష్మెంటే నాకు, ఉగాది పండగపూట, పూర్ణాలు,బొబ్బట్టు, పెట్టడంపోయి, పూలల్లమని చెబుతావ్. అందులోనూ, నేను వేపపూతను...అల్లాలట."
ఇంతలో ట్రింగ్ ట్రింగ్..మంటూ ల్యాండ్ ఫోన్ మ్రోగింది. 
"ఇటునుంచి నేను వెంకట్రావ్ ని...మాట్లాడు తున్నాను, అటునుంచెవరు మాట్లాడేది ? "
"నాన్నా నేను పెద్దవాణ్ణి రామ్ పండును మాట్లాడుతున్నాను...తమ్ముడు, చెల్లాయిని, తీసుకుని ఈరోజు ఉదయం 11 గంటలకల్లా,  మన ఊరికి వచ్చేస్తున్నాను. అమ్మకు చెప్పేసేయి మేమంతా వస్తునట్లుగా ! సరేనా ! ...."
"సరే..." అనేలోపలే ఫోన్ లైన్ కట్ అయిపోయింది... ఇక చేసేదేమిలేక...కాళ్ళీడ్చుకుంటూ... తన పడక మంచం దగ్గరికి వెళ్ళబోతుంటే, 
"ఏవండోయ్... మిమ్మల్నే...ఎవరా ఫోన్ చేసింది ? "
"ఇంకెవరు నీబెటాలియన్ కదలి వచ్చేస్తోందటనే, అంటే మనపెద్దోడు రామ్, చరణ్, తేజస్వి వచ్చేస్తున్నారా ! అయితే మీరుకాస్త, మామిడి చెట్టెక్కి నాలుగు మామిడిపిందెలు మామిడాకులు కోయండి. ఇంటికి మామిడాకులతో తోరణాలుగట్టీ, ఉగాది పచ్చడిచేయాలి. "

"ఏమేవ్ తాయారూ...నన్ను చిన్నపిల్లవాణ్ణను కున్నావటే ? చెట్లూ, పుట్టలూ ఎక్కమంటావు."
"సంవత్సరాని కోపారి వస్తుందీ ఉగాది, ఊరకేపోదుగా, వచ్చీరాగానే మనం గౌరవిస్తూ వేపపూత పచ్చడిని మనం చేసి పెట్టినా, అది మనమొఖాన్నే గొట్టి, ఏడిపించి, ఎర్రదుమ్ముబోసీ, మరీమరీ, చిలిపి గొడవలుబెట్టీ  కొరకొరగా జూస్తూ వెళుతుంది. దీని తస్సాదియ్య. దొరికితే దీనిచెవులు కొరకాలి."
"ఎవరి చెవులు కొరుకుతావట ?" తను గట్టిగా అరవకపోయినా, ఆనాలుగు మాటలు పైకే అనేసినట్లునానను. అదీకస్తా చెవిన బడినట్లున్నాయి.
"ఈరోజు  64 లోకి అడుగు పెట్టబోతున్నానోయ్." 
"ఆహా ! కాస్త క్రిందచూచి అడుగుబెట్టు, అరటితొక్కమీద కాలేస్తే, నిండు నూరేండ్లు, నిండిన వాడివౌతావు."
"ఓసీ ! నీకండ్లమంటలు, నామీదేపడ్డాయ్, నీ తింగరి చూపులు?"  
"నీవు చుట్టుప్రక్కల ఐదూళ్ళకి అందగాడివని, నీ గోడెనుక భాగోతం తెలియక, నిన్నునాకిచ్చి గొంతుకోశారు. నీవు ఎవర్తినో పేమించావటగా ! తరువాత తెలుసుకున్నాను, నీవు రాముడివికాదు, శ్రీకృష్ణుడివని."
భార్యా,భర్తల రుసరుసలతో ఆరాత్రి గడచిపోయింది.
తెల్లారుతూనే ....
నలుగుపిండి బెట్టి ఇరువురికీ తలంటి ఇరుగు, పొరుగు వాళ్ళు ముచ్చటలతో  స్నానంపోశారు. కొత్తబట్టలేసుకొన్నాక, ఇక నాపని మిగిలిందిగా నిన్నటి పని, దానికై పరుగు, పరుగున వేపపూత తుంచి కష్టపడినట్లుగా, రొప్పుతూ...
"ఇదిగోనే కష్టపడి, వేప పువ్వులతో రెండు దండ తయారు చేసేశాన్."
"ఐతే ఒకటి రాములవారి పటానికేసి, రెండోది నీమెళ్ళో వేసుకొని ఊరేగవయ్యా ! చాలా బాగుంటుంది ఊళ్ళోజనం మెచ్చుకుంటారు. "
"ఇదిగో తాయారూ...ఈ దెప్పిపొడుపు మాటలే వద్దంటున్నాను." 
"ఎవర్ని నాన్నా ! గట్టిగా అరుస్తున్నట్లున్నావ్."
అప్పుడే ఇంట్లోకొస్తున్న కూతురు, కొడుకుల మాటలు విని.
"ఏమేవ్ తాయారూ, త్వరగారావే మనపిల్లలొచ్చేశారు."
"అబ్బబ్బ ఒకటేగోల ఎలాగూ వచ్చినవాళ్ళు ఇంట్లోకి రాకుండా పోతారా ఏమిటి ? మీ చాదస్తం గాకపోతేనూ, ఎదురుగ్గా ! గడెకొయ్యలాగ, నిల్చోకపోతే, యోగక్షేమాలడగొచ్చుగా ! అన్నిటికి నేనే తయ్యార్, తాయారమ్మని గదా ! నాకు తప్పదు గాక తప్పదన్నట్లగా వుంది. మీ నాయన వరస."
"చూచారట్రా ! ఇది దీనిగోల. చెవిగోసిన మేకలా ! అరుస్తుంది."
అమ్మా, నాన్నా, ఇక మేమొచ్చేశాం కదా ! 
ఈరోజు ఉగాది పచ్చడి మేమే తయారుచేస్తాము. 

 ***
1). * మామిడి కాయపై చెక్కు = వగరు ఱుచి
2). * చింతపండు రసము = పులుపు ఱుచి
3). * సైధవ లవణం = ఉప్పు ఱుచి
4). * బెల్లం  = తీపి ఱుచి
5). * వేపపూ దళములు = చేదు ఱుచి
6). * నల్ల మిరియాలు = కారము ఱుచి

వీటన్నిటినీ వేసి పచ్చడిచేశాము, రండి అమ్మా, నాన్నా, మనమందరము ఉగాదిపచ్చడి సేవించి అందరం ఆనందిద్దాము ఇంతే కాకుండా పంచాంగమును పెద్దలు పఠించు చుండగా మనమందరం (శ్రవణంచేద్దాం) విందాము. 
తిథి, వార, నక్షత్ర, యోగ,కరణముల ఫలితాలను విని తెలుసుకోవటం వలన మానవులకు ఆయుష్యము, ఆరోగ్యమము, ఐశ్వర్యము, ధనధాన్యప్రాప్తి మొదలగునవి కలిగి సంఘములో కీర్తి, ప్రతిష్టలతో తులతూగుతుంటారు. 
బ్రహ్మదేవుడు  సృష్టిని ప్రారంభించిన రోజు ఈరోజే కావటం విశేషం. 
 ***
                         

No comments:

Post a Comment

Pages