దేశం‌ అభివృద్ధి చెందుతోంది - అచ్చంగా తెలుగు

దేశం‌ అభివృద్ధి చెందుతోంది

Share This
దేశం అభివృద్ధి  చెందుతోంది 
బి.ఎన్.వి.పార్థసారథి 


రాందేవ్ ఉత్తర ప్రదేశ్ కి చెందిన వాడు. పైన్టింగ్ పనులు చేస్తాడు. ఆగ్రా కి దగ్గరలోని పల్లెటూరు అతని స్వగ్రామం. పొట్ట కూటి కోసం ఢిల్లీ వచ్చాడు. అతను అద్దెకి వుంటున్న గది లో అతనితో పాటు మరో ముగ్గురు వుంటారు. తలా పదహేను వందలు నెలకి అద్దె చెల్లిస్తారు. ఆ పక్కనే మెస్ వుంది. ఆ మెస్ కూడా వీళ్ళు అద్దెకి ఉంటున్న యజమానిదే. మనిషికి నెలకి మూడు వేలు తీసుకుని రోజుకి రెండు పూటలా భోజనం పెడతారు. ఉదయం పనిలోకి వెళ్ళేటప్పుడు భోజనం డబ్బా లో తీసుకు వెళ్లి రాత్రి అందరూ మెస్ లో భోంచేస్తారు. రాందేవ్ నెలకి కనీసం ఇరవై వేలు సంపాదిస్తాడు. నెలకి ఎంతలేదన్నా పన్నెండు వేలు గ్రామం లోని తన ఇంటికి పంపిస్తాడు. ఆదాయం బాగా వున్నప్పుడు నెలకి ఇరవై వేలు వరకు ఇంటికి పంపిస్తాడు. 
మూడు బ్రష్షులు ఆరు రంగులుగా  సాఫీగా సాగుతున్న రాందేవ్ జీవితంలోకి కరోనా వ్యాధి పుణ్యమా అని శని దేవత ప్రవేశించింది. ప్రభుత్వం మెస్సు లు అన్నీ బంద్ చేయమన్నారని యజమాని ముందుచూపుతో జనాలు   ఎక్కడ అద్దె ఇవ్వరో అని భయపడి రూం కూడా ఖాళీ చేయమన్నాడు. చేసేది లేక రాందేవ్ తెల్లవారుజామున రూం ఖాళీ చేసి అతని సామాన్లు వున్న ట్రంక్ పెట్టెని భుజాన వేసుకుని కాలి నడకన తన స్వగ్రామానికి బయలుదేరాడు. అతని చేతిలో మూడు వందల రూపాయలు వున్నాయి. దుకాణాలు అన్నీ మూసేయడం తో తినడానికి కాదుకదా కనీసం త్రాగడానికి మంచి నీరు కూడా దొరకట్లేదు. దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచాక ఒక పెట్రొల్ బంకు దగ్గర ఉచితంగా భోజనం పెడుతూ వుంటే తన లాగా కాలి నడకన స్వగ్రామాలకి వెళ్ళే వాళ్ళ తో పాటు అతను కూడా కాస్త తిన్నాడు.  
మళ్ళీ నడక ప్రారంభించాడు రాందేవ్. దాదాపు పదహేను కిలోమీటర్లు వెళ్లేసరికి ఒక ఊరు వచ్చింది. రోడ్డుకి ఇరువైపులా కొన్ని పెంకుటిల్లు, మరికొన్ని చిన్న భవనాలు కనిపించాయి. అందులో ఒక భవనం లోంచి గట్టిగా అరుపులు వినిపించసాగాయి. భార్యా భర్తలు పోట్లాడుకుంటున్నారు. భార్య అదే ఊరిలో స్కూల్ టీచర్ గా పని చేస్తూంది. భర్త సుమారు అరవై కిలోమీటర్ల దూరం లో వున్న ఒక రైస్ మిల్లు లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. వారిద్దరూ సాధారణంగా కలిసి వుండటం చాలా అరుదు. కరోనా అంటు వ్యాధి పుణ్యమా అని రెండు వారాలుగా గృహ నిర్బంధం లో వుంటున్నారు. వారికి పిల్లలు లేరు. మామూలుగానే దంపతులు చీటికీమాటికీ మాటల యుద్ధం చేస్తూ వుంటారు. ఈ బలవంతపు గృహనిర్బంధం లో మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చి వాగ్బాణాలు కాస్తా అప్పుడప్పుడూ ముష్టి యుద్ధానికి దారి తీస్తున్నాయి. 
కాస్త ముందుకి వెళ్ళే సరికి రాందేవ్ కి ఒక ఇంట్లో చాలా సందడిగా కనిపించింది. ఆ ఇంట్లో ఒక వృద్ధ దంపతులు వుంటారు. వారికి ముగ్గురు మగ పిల్లలు. వాళ్లకి ఇంకా పెళ్లి కాలేదు. పెద్ద అబ్బాయికి ఇటీవలే వివాహం నిశ్చయం అయింది. పిల్లలు ముగ్గురులో ఇద్దరు ఢిల్లీ లో ఒకడు లక్నో లో చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. లాక్ డౌన్ విధిస్తున్నారని తెలిసి ముగ్గురు స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఇంటి చుట్టుతా బోలెడు ఖాళీ జాగా వుంది. కూరగాయలు, పూల మొక్కలు , మామిడి , జామ చెట్లు వున్నాయి. పెద్ద పిల్లలు ఇద్దరు ఇంటి చుట్టూ శుభ్రం చేస్తున్నారు. మూడో వాడు తల్లి కి వంటింట్లో సహాయం చేస్తున్నాడు. తండ్రి వసారాలో వాలు కుర్చీ లో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. 
మరో మూడు కిలోమీటర్లు నడిచేసరికి ఒక ద్రాక్ష తోటలో చాలామంది జనం గుమిగూడి కనిపించారు. లారీల రవాణా నిలిపి వేయడంతో ద్రాక్ష పళ్ళని పొలం నుంచి బజార్లకి తరలించడానికి వీలుపడక పండిన ద్రాక్ష పళ్ళన్నీ పాడయి పోయాయి. ఆ నష్టాన్ని తట్టుకోలేక ద్రాక్షపొలం రైతు ఆత్మ హత్య చేసుకున్నాడు. అంత విషాదం లోను ఆ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తులు వృధాగా పడివున్న ద్రాక్ష పళ్ళు దారిన పోయే ప్రజలకి ఉచితంగా పంచిపెడుతున్నారు. అందరితో పాటు రాందేవ్ కూడా కాసిన్ని ద్రాక్ష పళ్ళు తిని కొన్ని వెంట తీసుకుని మళ్ళీ పాదయాత్ర ప్రారంభించాడు. 
దాదాపు ఒక గంట నడవగా రాందేవ్ కి  హైవే కి ఎడమ వైపున ఒక గ్రామం కనిపించింది. అక్కడ హైవే దగ్గర చాలా మంది జనం వున్నారు. ఒక నడివయస్కుడి మృత దేహం కనిపించింది. అతను ఆ గ్రామానికి చెందిన వ్యక్తి. హైవే కి ఒకవైపు గ్రామం మరోవైపు ఆ ఊరి పొలాలు వున్నాయి. అతను పొలం నుంచి ఊరికి వచ్చే దారి లో హైవే దాటుతూండగా ఒక పాల వాన్ వేగంగా వస్తూ అతన్ని గుద్ది వెళ్ళిపోయింది. అతను అక్కడికక్కడే మరణించాడు. అతను ఆ గ్రామం లో చివరగా మిగిలిన ఒకే ఒక్క పురుషుడని, ఇంతకుపూర్వం ఇదే విధం గా మిగతా మగవాళ్ళందరూ ఇలాగే గ్రామం నుంచి పొలాలకి వెడుతూనో, తిరిగివస్తూనో దారిలో హైవే మీద వేగంగా వెడుతున్న వాహనాల బారికి గురై మరణించారని ఆ మృతుడి కళేబరం దగ్గర చేరిన జనం అనుకుంటున్నారు. ఒకప్పుడు ఈ హైవే రాను పోను రెండు గా వుండేదని సుమారు ఎనిమిది ఏళ్ల  క్రితం దానిని ఆరు గా పెంచడం తో ఈ గ్రామం దగ్గర మరణాల సంఖ్య బాగా పెరిగిందని జనం వాపోయారు.  
రాందేవ్ నడక సాగిస్తూనే వున్నాడు. సాయంత్రం అవుతోంది. హైవే కి ఇరువైపులా పొలాలన్నీ దాటుకుని ఒక ఊరి పొలిమేరల్లోకి అడుగుపెట్టాడు. ఇళ్లలో దీపాలు వెలిగిస్తున్నారు. ఒక ఇంట్లోంచి పన్నెండేళ్ళ కుర్రాడు బిగ్గరగా చదువుతూ , “ భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి “ అనగానే పక్కనే వున్న ఆ కుర్ర్రాడి తండ్రి అతని స్వరం లో నైరాశ్యం వుట్టి పడగా, “ నా చిన్నప్పుడు నేను ఇదే చదివాను. ఇప్పుడు నువ్వు ఇదే చదువుతున్నావు. బహుశా నీ తరవాతి తరం వాళ్ళు కూడా ఇదే చదువుతారు మన దేశం అభివృద్ధి దిశగా వెడుతూ వుంటుంది. కానీ ఎప్పటికి అభివృద్ధి మాత్రం చెందదు.” అన్నాడు. ఆ కుర్రాడికి వాడు చదివే పాఠం అర్ధం కాకపోయినా తన తండ్రి అన్న మాటలు మాత్రం పూర్తి గా అర్ధం అయ్యాయి. 

  సమస్యలు వ్యక్తులకే కాదు దేశాలకీ వస్తాయి. ఒకే సమస్యకి వేరు వేరు  వ్యక్తులు భిన్నంగా స్పందించి నట్లే దేశాలు కూడా విభిన్నంగా స్పందిస్తాయి. ఒకే పరిస్ధితిలో ఒకడికి అంతా సమస్యల మయంగా అనిపిస్తే మరొకడికి అందులో ఎన్నో అవకాశాలు కనిపిస్తాయి. దేశ సమస్యలపై అవగాహన, వాటి పరిష్కారం ఏవిధంగా వుంటుందన్నది నాయకత్వ లక్షణాలపై ఆధారపడివుంటుంది.  పట్నాలలో కూలీలకి, చిరుద్యోగాలకి వెళ్ళే రాందేవ్ లాంటి వలస కార్మికులు, వరుణ దేముడి మీద ఆధారపడి పంటలు పండించి, ఆ పండించిన పంటల ధరలు గిట్టుబాటుకానప్పటికీ గతిలేక దళారులకి అమ్ముకునే కోట్ల మంది అన్నదాతలు వీళ్ళ పరిస్ధితులలో మార్పు రానంత కాలం మన భారత దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే వుంటుందన్నది వాస్తవం. మరి ఈ వాస్తవాన్ని మన నాయకులు, ప్రభుత్వాలు గ్రహించి ఆ దిశగా చర్యలు ఎప్పుడు తీసుకుంటారో ? దీనికి కేవలం కాలమే సమాధానం ఇవ్వగలదు. 
 ***

No comments:

Post a Comment

Pages