అటక మీది మర్మం - 28 - అచ్చంగా తెలుగు
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) - 28
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
 


(తండ్రి కోరికపై కనిపించకుండా పోయిన ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్ కుమారుడి సాహిత్యాన్ని వెతికి పట్టుకోవటానికి నాన్సీ అంగీకరిస్తుంది. తన స్నేహితురాళ్ళతో ఆ పాత భవనాన్ని గాలిస్తుంది కానీ ఆమెకు ఎలాంటి ఆధారాలు దొరకవు. ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని అక్కడ పనిలో చేరిన ఎఫీ ద్వారా నాన్సీ తెలుసుకొంటుంది. ఒకసారి తన స్నేహితురాళ్ళతో కలిసి అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేసి విఫలమవుతుంది. అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకేదో సైగ చేస్తోందని బెస్ అంటుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి పాత ఉత్తరాలతో పాటు కొన్ని పాటలు దొరుకుతాయి. రేడియోలో వినబడే పాటలో కొన్ని పదాలు మార్చ్ కుమారుడు అతని భార్యకు వ్రాసిన ఉత్తరంలో ఉన్నాయని ఆమెకు గుర్తుకొస్తుంది. వాటిని వెతకటానికి యింటికి వెళ్దామనుకొంటూండగా, ఫాన్సీ డ్రస్సు వేసిన సుశాన్ ప్రమాదవశాత్తూ మెట్లమీద నుంచి కిందకు దొర్లిపోతుంది. అదే సమయంలో మెట్లకు పక్కనున్న గోడపై వ్రాసి ఉన్న సంగీత స్వరాలు బయటపడతాయి. ఆమె తన స్నేహితురాళ్ళతో కలిసి జెన్నర్ ఆఫీసుకి వెడుతుంది. జెన్నర్ తమకు ఇంటర్వ్యూ యివ్వకపోగా, తమ గురించి ఎవరితోనో మాట్లాడటం వాళ్ళు వింటారు. తరువాత ఆ వ్యక్తిని వెంబండించిన ముగ్గురు అమ్మాయిలు, హోటలు వాళ్ళు ఆ వ్యక్తిని బెన్ బాంక్స్ అని గాక డైట్ అని సంబోధించటం వింటారు. హోటలు వాళ్ళ నుంచి ఈ డైట్, బెన్ బాంక్స్ ఒకరే అని తెలుసుకున్న నాన్సీ, ఆ విషయం తండ్రితో చెబుతుంది. తండ్రి కోరికపై నాన్సీ ఫిప్ ఉత్తరాలతో మార్చ్ భవనానికి చేరుకొంటుంది. ఆ ఉత్తరాలను చదివిన ఆమెకు కిటుకంతా అస్తిపంజరంలో ఉన్నట్లు గ్రహించి, దాన్ని బీరువాలోంచి పక్కకు తీస్తుంది. దాన్ని తగిలించిన చోట బీరువాలో ఉన్న కన్నంలోకి సన్నని ఊచను నెట్టి, అటకకు, అటువైపు ఉన్న చీకటిగదికి మధ్యలో తలుపును గమనిస్తుందామె.  ఎంత బలంగా నెట్టినా అది తెరుచుకోకపోవటంతో ఆ తలుపుకి అటువైపు గడియ పెట్టి ఉంటుందని అనుమానిస్తుంది.  తరువాత. . .)
@@@@@@@@@@@

"అదే జరిగితే మనం ఎప్పటికీ ఆ గదిలోకి వెళ్ళలేము"  అంది నాన్సీ.
నాన్సీ బుర్రలో అనేక రకాల ఆలోచనలు మెరిశాయి.  తను విన్న విచిత్రమైన సంగీత స్వరాలు, వేలి కణుపులతో బల్లపై తట్టినట్లు వినిపించిన శబ్దాలు, మూసిన ఈ తలుపు వెనుకనుంచే వచ్చి ఉండాలి.  పాత కూలీ నివాసాల మధ్యనుంచి స్పష్టమైన దారి లేకుండా ఈ లోపలికి ఎవరైనా ఎలా రాగలరు?
"ఆ గదిలో దెయ్యం ఉందని పందెం.  దాన్నలాగే వదిలేయండి.  బయటకు రానీయొద్దు.  వస్తే అది మనకేం హాని చేస్తుందో చెప్పలేం" ఎఫీ బొంగురుగొతుతో గొణగసాగింది.
ఆమె మాటలతో నాన్సీ వర్తమానంలోకి వచ్చింది.  పనిపిల్ల మాటలకు ఆమెకు చిరాకు పుట్టింది.   ఎఫీ వ్యాఖ్యలతో భయపడ్డ పాప ఆటలాపి భయంతో యువగూఢచారిని చుట్టుకుపోయింది.
"ఎఫీ! పాపను కిందకు తీసుకెళ్ళు" ఆమె గొంతులో కాఠిన్యం ధ్వనించింది.  "ఇక్కడ  దెయ్యాల్లాంటివి లేవని నీకూ తెలుసు.  మిస్టర్ మార్చ్, నేను యిక్కడ పని చూసుకొంటాం."
ఆ కేకలకు కలవరపడ్డ పనిపిల్ల పాప చేతిని పట్టుకొని రెండవ అంతస్తుకి వెళ్ళిపోయింది.  ఆ తలుపు వెనుక దెయ్యమేదీ లేదని ప్రకటించినా, తామేమి చూడవలసి వస్తుందోనన్న ఆందోళన ఆమెలో చోటు చేసుకొంది.
"తలుపుని పగలగొడదామా?" పెద్దాయన్ని అడిగిందామె.
అతను సరేనన్నాడు.
ఇద్దరూ కలిసి ఆ తలుపుని బలంగా తోసారు.  అలా వారు వదలకుండా చాలాసేపు పట్టుపట్టారు. 
ఉన్నట్లుండి ఏదో బద్దలైన శబ్దంతో వారికి అడ్డుగా ఉన్న తలుపు దారినిచ్చింది.  అకస్మాత్తుగా తలుపు తెరుచుకోవటంతో వారు ముందుకు తూలారు.  పాదాలకు నేల తగలక అటక మీదనుంచి  యిద్దరూ విసరివేసినట్లు గాలిలో తేలియాడారు.

తను వేగంగా నేలపై పడుతుందని ఒక్కక్షణం నాన్సీ తలపోసింది.  కానీ అకస్మాత్తుగా ఆమె ఏదో గట్టిగా ఉన్న వస్తువుపై దభేలుమని పడింది.  ఆమె పక్కన మార్చ్ పడ్డాడు.  అలా పడగానే వారిలోని ఊపిరి కేక రూపంలో బయటకు తన్నుకొచ్చింది.  వారిద్దరూ నిస్త్రాణగా కొన్ని క్షణాలు అచేతనులయ్యారు.
 ముందుగా నాన్సీ తేరుకొని లేచింది.
"బాగున్నారా?" అంటూ పెద్దాయనకు తన చేతిని అందించి లేవదీసింది.
"ఆ!" రొప్పుతూ మూలిగాడతను.  "మనం మెట్లను గమనించలేదు."
దూరంగా అటక మీద కొవ్వొత్తి కాంతి కనిపిస్తోంది.  కానీ ఆ కాంతిని భారీగా ఉన్న చెక్క బీరువా అడ్డేస్తోంది.  తన కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక, ఆ కొవ్వొత్తిని తేవటానికి నాన్సీ తడుముకొంటూ అటక తలుపు దగ్గరకి వెళ్ళింది.  ఆ చీకటిగది నుంచి అటక మీదకు వెళ్ళటానికి మూడు మెట్లు కనిపించాయి.  ఆ తలుపు దగ్గర ఎఫీ భయంతో వణికిపోతూ కనిపించింది.
"ఏదో కూలిపోయిన శబ్దం వినిపించి. . . " చెబుతున్న ఎఫీకి యువగూఢచారి అడ్డు తగిలింది.
"ఇక్కడంతా బాగానే ఉంది" నాన్సీ నమ్మబలికింది.  "తలుపు తీయగానే మా యిద్దరికి యీ మెట్లు కనిపించక పడిపోయాం.  కానీ మాకు పెద్దగా దెబ్బలేం తగల్లేదు.  కొద్దిగా చర్మం చీరుకొంది. అంతే!"
"అంతా దేవుడి దయ" ఎఫీ బాధతో అరిచింది.  "ఓ! మిమ్మల్నిమీరు చంపుకొనేవారు.  ఏమన్నా కనిపించిందా?"
"ఇంకా లేదు.  కనిపిస్తే నీకు చెబుతాగా!"
నాన్సీ సమాధానానికి ఎఫీ కిందకెళ్ళిపోయింది.  జరిగినది చెబితే ఆమె కిందకెళ్ళి పాపను భయపెడుతుందని నాన్సీ భయం.  అందుకే ఎంతో ప్రశాంతంగా బదులిచ్చి ఆమెను పంపించేసింది.   నాన్సీ మెట్లెక్కి అటకలో ఉన్న కొవ్వొత్తిని తీసుకొని చీకటిగదిలోకి వచ్చింది.  ఆమె మొదటి ఆలోచన యీ తలుపుకి యిటువైపు గడియ పెట్టిన వ్యక్తి. . . బయటినుంచి ఈ గదిలోకి ఎలా రాగలుగుతున్నాడో కనుక్కోవటమే!  ఆమె తల పైకెత్తి చూసేవరకూ ఆమెకేమీ అర్ధం కాలేదు.
"ఇంటి పైకప్పులో కిటికీ!" గట్టిగా అంటూ చేతిలోని కొవ్వొత్తిని పైకప్పుకి బాగా దిగువున ఉన్న వంపు తిరిగిన తిన్నెపై ఉంచింది. "పైకి చూడండి.  పైకప్పు కిటికీని ఎవరో పెద్ద నల్లగుడ్డతో వెలుతురు పడకుండా పూర్తిగా కప్పేశారు." 
" ఎవరో ఈ కిటికీలోంచే లోపలకు, బయటకు సులభంగా వచ్చి వెళ్తున్నారు" మార్చ్ వ్యాఖ్యానించాడు.
"వాడే ఎవరికీ ఈ గదిలో వెలుతురు కనబడకుండా ఉండటానికి పూర్తిగా ఆ నల్లగుడ్డ కప్పాడు.  ఆలోచిస్తే ఫిప్ త్వరగా నిద్రపోతానంటూ తన పడకగదిలోకి తరచుగా వెళ్ళిపోతూండేవాడు.  బహుశా వాడు నిద్రపోకుండా ఈ గదిలోకి ఈ మార్గం ద్వారానే వచ్చేవాడేమో!"
నాన్సీకి పెద్దాయన ఊహలో నిజం ఉందని అనిపించటంలేదు.  ముఖ్యంగా యింటి పైకప్పు కిటికీ ప్రవేశద్వారమంటే అసలు నమ్మలేకపోతోంది.  ఇంటి బయటనుంచి ఆ పైకప్పు మీదకు ఎక్కాలంటే బాగా పొడవైన నిచ్చెన కావాలి.  కానీ ఆ భవనం బయట అలాంటి నిచ్చెనేదీ సాక్ష్యంగా కనిపించలేదు. 
"అలాంటిది ఉంటే తప్పకుండా నిచ్చెన కనిపించేది కదా!" తనలో అనుకొందామె.  ''అది ప్రవేశద్వారం కాకపోతే ఆ గదిలోకి రావటానికి మరో ద్వారమేదైనా ఉండాలి.'

వాళ్ళిద్దరూ ఆ రహస్య గదికి మరో ద్వారమేమైనా ఉందేమోనని వెతికారు కానీ వారికేమీ కనిపించలేదు.  అందువల్ల పెద్దాయన చెప్పినట్లు పైకప్పు కిటికీనే ప్రవేశద్వారమని ఆమె తీర్మానించక తప్పటం లేదు.  కానీ అది ద్వారం కాదని ఆమెలో బలమైన శంక ప్రతిఘటిస్తోంది.
"ఇంక ఫిప్ సంగీతం గురించి వెతుకుదాం" మార్చ్ మాటలతో ఆమె యిహంలోకి వచ్చింది.
వారికి ఆ చీకటిగదిలో కేవలం రెండు చెక్క వస్తువులే కనిపించాయి.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages