పద్యకవయిత్రి డా.బల్లూరి ఉమాదేవి గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

పద్యకవయిత్రి డా.బల్లూరి ఉమాదేవి గారితో ముఖాముఖి

Share This
పద్యకవయిత్రి డా.బల్లూరి ఉమాదేవి గారితో ముఖాముఖి
మంచాల శ్రీలక్ష్మీ


మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన "విశిష్ట కవుల పరిపృచ్ఛ"లో భాగంగా సుస్వర ఝరీప్రవాహం అయిన స్వరకోకిల గౌరవనీయులు డా.బల్లూరి ఉమాదేవి గారి పరిచయం - సంధానం:-మంచాల శ్రీ లక్ష్మీ,

పరిపృచ్ఛ నిర్వహణ:-గీతా శైలజ.



1. శ్రీలక్ష్మీ  : నమస్తే అoడి అమ్మా ! "నా సాహితీ సవ్వడి "వాట్సాప్ గ్రూప్ లో ఫిబ్రవరి.4 న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మహోన్నతమైన ఈ అమ్మ గురించి, మీకు జన్మ నిచ్చిన అమ్మ గురించి  ప్రథమంగా  పద్యరూపంలో మన మల్లినాధ సూరి కళాపీఠం కోసం పద్యాలు చెప్పండి.
డా.బి. ఉమాదేవి: నమస్తే అండి. ముందుగా ఇంత చక్కని అవకాశం కల్పించిన మల్లినాథ సూరి కళా పీఠం వారికి నమస్సుమాంజలులు. మీ మొదటి ప్రశ్న మహత్తరమైన ప్రశ్న. నవమాసాలు మోసి కని పెంచే కనిపించే దైవాన్ని గురించి అడగడం చాలా ఆనందాన్ని కలిగించింది. అమ్మను గూర్చి నేను రాసిన పద్యం:
ఆ.వె:     విశ్వమందు తాను వేదన భరియించి

            జన్మ మొసగు నట్టి జనని యెపుడు
             దైవ మేగ నెంచ ధరణిలో సర్వదా
             దైవతములకెల్ల దైవమామె.

ఆ.వె: అమ్మ దీవెనుండ నందరానిదనెడు

        మాట యుండబోదు మానవులకు
        నాపదెపుడు కలుగ దమ్మను దలచిన
        నమ్మ దయయె చాలు నవని యందు

ఆ.వె:  కన్నతల్లి యెపుడు కడుపు జూచుచు నుండు

       కంట నీరు జూడ కలత పడును
       అమ్మ మనసె పెద్దయంబుధి ధరలోన
       మరువ బోకు నీవు మాతృ ప్రేమ.


2. శ్రీలక్ష్మీ :     మీ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి తెలియజేయండి.
ఉమాదేవి :శ్రీ బల్లూరి గోపాలరావు శ్రీమతి రాధమ్మ దంపతులకు 1954లో కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలో జన్మించాను. బాల్యము, విద్యాభ్యాసం అనంతపురం జిల్లా కణేకల్లు మరియు కల్యాణదుర్గం లలో జరిగిందండి. ఇంటర్మీడియట్ ముగిసినంతనే కామవరం గ్రామమునకు చెందిన శ్రీ కరణం భీమసేనరావుగారితో ( రైల్వే ఉద్యోగి) వివాహం జరిగింది. అనంతరం శ్రీవారి ప్రోత్సాహంతో ప్రైవేటుగా చదివి డిగ్రీ పూర్తి చేసుకొన్నాను.(1976) అప్పటికే ఇద్దరు పిల్లలు జన్మించడం తో ప్రైవేటుగా ఎం.ఏ కట్టినా పరీక్షలు వ్రాయలేక పోయాను. నాలోని ఆసక్తిని గమనించి మా శ్రీవారు అనంతపురం లో సత్యసాయి కళాశాలలో చేర్పించి ఎం.ఏ చదివించారు. శ్రీవారి మరణానంతరం నా 52 వ ఏటతెలుగు కన్నడ సంప్రదాయపు స్త్రీలపాటలు-తులనాత్మక పరిశీలన అనే అంశం పై పరిశోధన చేసి పి హెచ్ డి.(P.hd)పట్టా పుచ్చుకొన్నాను.

3. శ్రీలక్ష్మీ :     సాహిత్యం వైపు పడిన మీ తొలి అడుగులు ఎప్పుడు? మిమ్మల్ని ప్రోత్సహించిన వారెవరు.? 
బి.ఉమాదేవి: కళాశాల రోజుల్లోనే మొదలైంది. అప్పుడప్పుడు స్నేహితుల పుట్టిన రోజులకు కవితలు వ్రాసేదాన్ని. వారు ప్రోత్సహించేవారు. మానాన్నగారు మొదటి ప్రోత్సాహకులు. తరువాత శ్రీవారు శ్రీ కామవరం భీమసేనరావుగారు, ఇప్పుడు కుమారులు మరియు కుటుంబ సభ్యులు.

4. శ్రీలక్ష్మీ :  మీకు పద్యాలే  ఎక్కువగా  వ్రాయాలని ఎందుకు అనిపించింది.? 
బి.ఉమాదేవి: వచనంలో కంటే పద్యంలో అయితే చెప్పదలచుకున్న భావాన్ని స్పష్టంగా చెప్పవచ్చు అనిపించింది. వేమన, సుమతి మొదలైన శతక పద్యాలు నన్ను విశేషంగా ఆకట్టుకునేవి. అందులోనూ ఆటవెలదులు అంటే మక్కువ ఎక్కువ. నేను రాసిన 10,000 పై చిలుకు పద్యాలలో ఆటవెలదులే ఎక్కువగా ఉన్నాయి.
5. శ్రీలక్ష్మీ :   మీ వృత్తి, ప్రవృత్తి గురించి తెలియ జేయండి.
బి.ఉమాదేవి: కర్నూలు జిల్లా ఆదోనిలో, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా శాఖాధిపతిగా  26 సంవత్సరాలు పని చేశాను. మాది పండిత కుటుంబం కావడంవల్ల చిన్ననాటి నుంచే సాహిత్యం అంటే ఎక్కువ ఇష్టం. మా తాతగారు బల్లూరు కృష్టప్ప గారు తెలుగు పండితులు. వారు ఆకాలంలోనె సుప్రసిద్ధ మాస పత్రిక "భారతిలో" పద్యాలు రచించే వారట. మానాన్నగారు బల్లూరు గోపాలరావు గారు ,మా పెదనాన్న లు మేనత్త కూడా తెలుగు పండితులుగా ఉండడంవల్ల వారి ప్రభావం కూడా వుంది. కవితలు వ్యాసాలు రేడియో ప్రసంగాల కోసం వ్రాసుకోవడం అలవాటుగా మారింది.పదవీ విరమణ అనంతరం రచనా వ్యాసంగం వ్యసనంగా మారింది. ఆసమయంలోనే సాంకేతిక మాధ్యమం సాయంతో అంతర్జాలంలో వివిధ సమూహాల్లో సమస్యలు పూరించడం అలవాటయింది. ముఖ్యంగా శంకరాభరణం, తెలుగు కవిత్వం సమస్యా పూరణం, పద్యాల సవ్వడి, పద్యపరిమళం, రసధుని, ప్రజా పద్యం, మొదలైన సమూహాలు చక్కని వేదికలు కల్పించాయి. రోజుకు 6పద్యాల వరకూ వ్రాస్తున్నాను.

6.  శ్రీలక్ష్మీ :   ఒక స్ర్తీగా, ఒక ఉపన్యాకురాలిగా, అధ్యాపకురాలిగా, ఒక కవి గా మీ కుటుంబాన్ని సమర్థవంతంగా  విజయ పథం వైపు  ఎలా నడిపించ గలిగారు.?
బి.ఉమాదేవి:వంటింట్లో ఒకే సమయంలో అన్నీ పనులు చేయడం ఆడవాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అని నా అభిప్రాయం.భార్యగా,తల్లిగా ఇంటి పనులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేదాన్ని.తరువాత విద్యార్థులకవసరమైన సమాచారం సేకరించి బోధించేదాన్ని.ఒక కవిగా మానసిక ఆనందం పొందడం నిత్యకృత్య మైంది.

7..శ్రీలక్ష్మీ : ఈ కవి సమ్మేళనానికి "నా బాధ్యతల వలన వెళ్లలేక పోయానే "అని ఎప్పుడైనా అనిపించిందా? 
బి ఉమాదేవి:అన్ని సమావేశాలకు వెళ్ళలేము గదండి. అప్పుడు. వెళ్ళలేకపోయినందుకు బాధగా అనిపించేది.(అనారోగ్యకారణాల వల్ల,దూరప్రాంతాల్లో వున్నపుడు)

8..  శ్రీలక్ష్మీ :    మీకు మల్లినాధ సూరి కళాపీఠం అమరకుల దృశ్యకవి  వారితో  పరిచయం ఎలా ఏర్పడింది ? 
బి. ఉమాదేవి:మేక రవీంద్రగారి సహస్ర కవితా యజ్నం ద్వారా పరిచయం కలిగింది.ముఖాముఖి పరిచయం హైదరాబాద్ లో  బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో  వారిజాతీయ  పురస్కారం అందుకొనే సభలో కలిగింది.

9.శ్రీలక్ష్మీ : మల్లినాధ సూరి కళాపీఠం నిర్వహణ ఎలా ఉంది.? ఏమైనా మార్పులు చేస్తే ఇంకా మెరుగు పరచవచ్చా.?
బి ఉమాదేవి:నిర్వహణ బాగుందండి.ఏమార్పులు అవసరం లేదు.కాకపోతే స్పందనలు తెలిపే సమయం పెంచితే బాగుండేదనుకుంటా

10. శ్రీలక్ష్మీ : తెలుగు కవివరా ద్వారా ఎందరో కొత్త కవులు కలాన్ని చేత బట్టారు కదా. వారికి మీరు ఏమైనా సందేశం ఇస్తారా.
బి ఉమాదేవి:సందేశమిచ్చేంత గొప్పదాన్ని కాకపోయినా చిన్న సలహా.మనం వ్రాసి పోస్ట్ చేయడమే కాకుండా ఇతర కవుల రచనలు కూడా చదవాలి.అప్ఫుడే మేధస్సు వికసిస్తుంది నా అభిప్రాయం.

11.  శ్రీలక్ష్మీ :   ఒక్క కవిత వ్రాసి సన్మానం చేయించుకునే కవులకు మీరిచ్చే సందేశం ఏమిటి.
బి ఉమాదేవి:సన్మానాలు బాధ్యతను పెంచే దిశలో వుంటే మంచి కవితలు వెలుగు చూస్తాయి.మనకు గుర్తింపు నిస్తాయి.కాని అవి అహాన్ని పెంచితే కూపస్థమండూకాలవుతాం.

12..శ్రీలక్ష్మీ : ఎటువంటి పుస్తకాలు చదివితే కొత్త కవులు ఇంకా మెరుగు పరుచుకోవచ్చు .తెలియజేయండి.
బి ఉమాదేవి:పూర్వకవులు రచనలు చదవాలి.అందులోని భావాన్ని అవగతం చేసుకోవాలి.పుస్తకాలు మంచి స్నేహితులు అనేది బలంగా నమ్ముతాను.

13.శ్రీలక్ష్మీ:    మీరు ఇంతవరకు ఎన్ని పద్యాలు వ్రాసారు. ఎన్ని కవితలు వ్రాసారు.
బి ఉమాదేవి: 10000కు పైగా పద్యాలు వివిధ ఛందస్సులలో రచించాను.శ్రీరామదూత శతకం,అక్షరం వనం అనే పుస్తకాలు ముద్రించ బడ్డాయి.మనోగీతికలు,హిమపవనాలు,ఖండకావ్య సమాహారం అనే పుస్తకాలు ముద్రణకు సిద్ధంగావున్నాయి.
ఇవి కాక ఐదు ఆశ్వాసాలతో "ఆసరా"అనే పద్య ప్రబంధం రచించాను. .అనంతఛందం సమూహంలో వాల్మీకి రామాయణంలో అన్ని కాండములు లోని ఒక్కొక్క సర్గకు తేటగీతి ఛందస్సు లో పద్యాలు రచించాను.
అలాగే చివుకుల శ్రీలక్ష్మి నేతృత్వంలో 16 మంది కవులు రచించిన రామచంద్ర ప్రశస్తి లో "పిబరే రామరసం"అని నావ్యాసం కూడా చోటు చేసుకుంది.అలాగే 116 మంది కవులచే రచింపబడిన "ఆదినుండి అనంతం దాక' అనే భారతదేశం చరిత్ర వచనకవితా సంపుటిలో "సిపాయిల తిరుగుబాటు'అనే అంశంపై వ్రాసిన కవితకు స్థానం లభించింది.ఇంకా చాలా పుస్తకాలలో నా కవితలు,పద్యాలు చోటు చేసుకొన్నాయి.

14.  శ్రీలక్ష్మీ : మీకు డాక్టరేట్ వచ్చిన సందర్భం ఏమిటి ?మీరు ఎలా ఫీలయ్యారు.? 
బి ఉమాదేవి: నా 51 వ ఏట నేను రచించిన "తెలుగు కన్నడ సంప్రదాయపు స్త్రీలపాటలు-తులనాత్మక పరిశీలన"అనే సిద్ధాంతం వ్యాసమునకు శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా లభించింది.నాటి గవర్నర్ శ్రీ రామేశ్వర్ ఠాకూర్ చేతులమీదుగా అందుకోవడం జరిగింది.
సాధారణంగా అందరూ  తమ పిల్లల కాన్వొ కేషన్ కు వెళతారు. కానీ నేను పి హెచ్ డి పట్టా తీసుకునే ముందు నా కుమారులు కోడలు మనవరాలు రావడం  మరిచిపోలేని సంఘటనలు.

15. శ్రీలక్ష్మీ: తెలుగు కవులలో మీకు బాగా ఇష్టమైన కవి ఎవరు ? వారి గురించి... వీలైతే పద్యం లేదంటే మినీ కవిత
బి ఉమాదేవి: ప్రాచీన కవులలో నచ్చినవి సహజ పాండిత్యం బిరుదాంకితుడైన బమ్మెర పోతన.భాగవతం ,భాగవతం అని పదిసార్లు అంటే చాలు మనం బాగవుతాం అనేది ఆర్యోక్తి.అట్టి భాగవతాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో వ్రాసిన కవి పోతన అన్నా,వారి భాగవతమన్నా చాలా యిష్టం.
పోతనమహాకవిని గురించి వ్రాసిన పద్యములు.
పోతన:
*1కం:ఇరవొంది రెండు భాషల*

 *గరిమ గలిగి నట్టి గొప్ప ఘనుడీ కవియున్*
  *హరినారాయణు చరితము*
  *సరళముగా వ్రాసె తాను సకలురు మెచ్చన్.*


*2కం:బమ్మెర పోతన వ్రాసెను*

  *నిమ్ముగ శ్రీభాగవతము నిలలో* నెపుడో
  *కమ్మని యా కృతి కడుభ*
         *వ్యమ్ముగ సతతమలరారు భరతావనిలో*


*3ఆ.వె:రామభద్రుకితడు రహితోడ నంకిత*

  *మొసగె తాను కృతిని యుర్వి యందు*
  *మోక్ష మార్గ మంద ముదమున దీనిని*
 *చదువుచుందు రెపుడు సజ్జనాళి*


*4ఆ.వె:హాలికుండు తాను హలముతో బాటుగా*

  *కలము చేత బట్టి కావ్య మల్లె*
  *నరులకొసగనంచు నారాయణున కంకి*
  *తమ్ము చేసి తాను ధన్యుడయ్యె.*


*5ఆ.వె:పలుకు వాడు హరియు పలికించె హరికథ

  *లనుచు వ్రాసె తాను నవనియందు*
  *భాగవతము నదియు పారాయణముచేయు*
  *తెలుగు వారికెల్ల దివ్వె యయ్యె.*


*6కం:వెన్నుని కథలను పోతన*

 *విన్నాణముతోడ వ్రాసి వెలుగులు పంచన్*
 *మన్నన తోడను చదివిన*
  *బన్నంబులుబాయు ననుచు పఠియింతు రిలన్.*


*7ఆ.వె:భాగవతపు మహిమ బ్రహ్మయు నెరుగడు*

 *శివము లొసగు నట్టి శివుడు నెరుగ      
 *డనుచు తెలుసు కొనిన యంత తేటపరతు*

  *ననుచు వ్రాసె కావ్య మాంధ్రమందు.*

*8 ఆ.వె:శ్రవణ మాదియైన చక్కని భక్తుల*
  *నుర్వి యందు తాను నుదహరించ*
 *జనుల యందు భక్తి సహజముగాకల్గె*
  *మార్గదర్శి యగుచు మాన్యుడయ్యె.*
.ఇంత చక్కని అవకాశమిచ్చి నన్ను పరిచయం చేసినందుకు నిర్వాహకులు *శ్రీ అమరకుల దృశ్యకవి అధ్యక్షుడు కోలాచల మల్లినాథసూరి కళాపీఠం-ఏడుపాయల* గారికి,చక్కని ప్రశ్నలతో పరిపృచ్ఛ చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

అభిప్రాయాలు:
మల్లినాథసూరి: డాక్టర్ బల్లూరి ఉమాదేవిగారికి ,లక్ష్మిగారికి ,అమరకులగారికి ముందుగా నమస్కారాలు. మనకు ఆటవెలదులు అంటూనే వేమన గుర్తుకు వస్తాడు.అలాగే మన సమూహంలో ఆటవెలదులంటే పఠితులకు ఉమాదేవి గారు గుర్తుకు రాక మానరు.
అలతి అలతి పదాలతో అందరికి అర్థమయ్యేరీతిలో పద్యరచన రాయడంలో ఆమె దిట్ట.అమ్మను గురించి చక్కగా వివరించారు.పండితవంశం కనుక వీరు గొప్ప పండితులు కాగలిగారు.10000 ఆటవెలదులు పద్యం రాయడం చూస్తుంటే వీరి పాండిత్యం ఏ పాటిదో అందరికి అర్థమోతుంది. ఆసరా అనే పద్యకావ్యం రాశారని చెప్పారు.అభినందనీయులు.అయితే కథా వస్తువు ఏమిటని చెప్పిఉంటే బాగుండేది. పోతన అంటే అభిమానం లేనివారుండరు.వారి మందార మకరందాలు చదివి ఆనందించని వారుండరు.అలాంటి పోతన కవీశ్వరులు అభిమానకవి కావడం వారి అదృష్టం.
వీరికి కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని వేడుకుంటున్నా.

రామశర్మ, బెంగుళూరు: అద్భుతమైన ముఖాముఖి..వారి ప్రతిభ తెలిసినా, వారి గూర్చి ఎన్నో వివరాలు, పరిచయాలు కొత్తగా తెలిసాయి. ఔత్సాహికులకు మార్గదర్శకంగా ఉన్నారు. శ్రీ లక్ష్మి గారు చక్కగా ప్రశ్నలడిగారు. అమరకులవారి సారధ్యంలో , గీతాశైలజ గారి కూర్పులోని ఈ పరచయం అభినందనీయం..

డా. కోవెల శ్రీ నివాసాచార్య భైంసా:    డా. బి.రమాదేవి గారితో శ్రీమతి మంచాల శ్రీలక్ష్మీ  జరిపిన ముఖాముఖీ చదివి ఆనందించాను. శ్రీ మద్రామాయణాన్ని తెలుగు లోకి అనువదించారని తెల్పారు సంతోషం. బమ్మెర పోతన అభిమాన కవి అని ఆయన దారిని పుణికి పుచ్చుకొని అలవోకగా పద్యాలు రాశారు.రాస్తున్నారు. భాషాభిమానం అభినందనీయం.
తెలుగు ప్రాచీన కవయిత్రులలో ఒకరి పైన చక్కని కావ్యాన్ని  రచించి తెలుగు వాఙ్మయమునకు సేవ చేయాలని ఆశిస్తున్నాను.  

[23/02, 7:11 PM] +91 98858 71464
ప్రముఖ సాహితీవేత్త., డా.బల్లూరి.ఉమాదేవిగారితో ముఖాముఖి ఎన్నో మంచి విషయాలనందించింది. నిర్వహించిన ,అమరకులవారికి, లక్ష్మిగారికి., ఉమాదేవిగారికి , నమస్సులు.

[23/02, 7:18 PM] +91 98483 28503: బల్లూరి ఉమాదేవిగారికి, వారిని పరిచయం చేసినమాంచాల శ్రీలక్ష్మి గారికి, గురువులు అమరకుల వారికి నమస్కారాలు. ఉమాదేవి గారి వృత్తి, ప్రవృత్తులు, అభిరుచులు, రచనలు గురించి   తెల్సుకొని ఆనందించాము. పరిపృచ్చకురాలికి, కవయిత్రికి శుభాభినందనలు.

డా. కోవెల శ్రీ నివాసాచార్య భైంసా:   
"మల్లినాథుని పీఠమ్ము కల్లసాని 
కవి వరార్యుల పాలిటి కామధేను
కవన మనునిత్య మొనరించు కార్యశాల
కమర కులవీవె సాహితీ యజ్వవీవె"
అటువంటి అమరకుల గారి నాయకత్వం లో సాహిత్య గోష్టి చురుకుగా కొనసాగుతోంది.డా.బి.ఉమాదేవి తో జరిగిన ముఖాముఖీ చదివి ఆనందించాను.

అంజన్న:  ఉమక్కయ్యకు అభినందనలు.
ఆమె మహాకవయిత్రి... ఆమె నిరంతర కవితాసేద్యకురాలు...
ఆణిముత్యాలను వెలికితీస్తున్న అమరకుల గారికి..గీతాశైలజ గారికి.. మంచాల శ్రీ లక్ష్మీ గారికి అభినందనలు.

శేషకుమార్: శ్రీమతి డా.ఉమాదేవి గారితో ముఖాముఖీ చాలా ఆత్మీయంగా నడిచింది. వీరు అలతి అలతి పదాలతో చక్కగా పద్యాలు వ్రాస్తుంటారు. వేమన గారి సొత్తైన ఆటవెలదిని, ఉమాదేవి గారు కూడా గ్రహించి స్వాదిష్టంగా రచించుట ముదావహము!!
ఉమాదేవి గారు ఎంతో సౌమ్యులు,సహృదయులు.వారి పద్యాలకు సవరణలు/మెరుగుదల ఎవరు సూచించినా పాటించుట వారి విశాల దృక్పథము.
గంగా సమాన నైర్మల్యము,గంభీరాంశాలను కూడ అలవోకగా సులభశైలి పద్యాలలో నిబద్ధించుట డా.  ఉమాదేవి గారి ప్రత్యేకత. వీరిని ఆదర్శంగా తీసుకుని,ఎందరో సోదరీమణులు పద్యాలు వ్రాస్తున్నారు. సంతోషం. వినయ సంపన్నురాలైన ఉమాదేవిగారు మరిన్ని చక్కని పద్యాలతో అలరించునట్లు,శ్రీ వాణీ మాత అనుగ్రహించాలనీ ప్రార్థిస్తూ,శ్రీమతి ఉమాదేవి గారికి సాష్టాంగ ప్రణామములు అర్పిస్తున్నాను. పృచ్ఛకురాలు శ్రీ లక్ష్మి గారి ప్రాశ్నిక పద్ధతిలో ఆప్యాయనము మెచ్చదగినది. శ్రీ అమరకుల వారికీ,మల్లినాథసూరి కళాపీఠము పెద్దలందరికీ అనేక నమస్సులు!!

పిన్నక నాగేశ్వరరావు: డా. బల్లూరి ఉమాదేవి గారితో పరిచయంచాలా బాగుంది.ఎన్నో క్రొత్త విషయాలు వారినుంచి తెలుసుకున్నాము. వివాహం జరిగిన తరువాత డిగ్రీ చదివి, పీ.హెచ్.డీ. అందుకున్నారంటే వారి పట్టుదల ఎటువంటిదో  తెలుస్తోంది.
       శ్రీ మేక రవీంద్ర గారు అయుత కవితా యజ్ఞం ‌సందర్భమున మొట్టమొదటిసారిగా కవిసమ్మేళనం ఏర్పాటు చేసినప్పుడు వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ తరువాత బాసర లో కలవటం జరిగింది.
ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విజయవాడలో కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించి క్షేమ సమాచారాలు అడగడం ఆనందాన్ని కలిగించింది.
        వాట్సప్ లోని దాదాపు అన్ని గ్రూపుల కు పద్యాలు వ్రాస్తున్నారు. ఎక్కువగా వారు ఆటవెలదులలోనే వ్రాస్తారు.అలతి అలతి పదాలతో చిన్న పద్యంలో భావస్ఫోరకంగా ఉండేట్లు వ్రాయడంలో వారు దిట్ట అనిపించుకున్నారు.
         పద్యాల సవ్వడి లో నేను అందరి పద్యాలలోని తప్పొప్పులను ( నాకున్న కొద్ది అనుభవంతో, శ్రీ కంది శంకరయ్య గారి మార్గదర్శకత్వంలో) తెలియజేస్తూ...ఉమా దేవి గారి పద్యాలలోని పొరపాట్లను చూపినపుడు, వారు దానిని సహృదయంతో స్వీకరించి,ఏ మాత్రమూ చిన్నతనంగా భావించక పొరపాటు దిద్ది ధన్యవాదాలు తెలియజేయటం వారి మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. 
     వారికివే నా హృదయపూర్వక నమస్సుమాంజలులు, ధన్యవాదములు!!!
     వారి పరిచయ భాగ్యాన్ని కలిగించిన శ్రీ అమరకుల గారికి, శ్రీలక్ష్మి గారికి మరియు గీతాశైలజ గారికి ధన్యవాదములు తెలియ జేస్తున్నాను.
           

పాలకుర్తి నాగజ్యోతి: గ్రేట్ మా వివాహానంతరం మీ కృషి అభిలషణీయం, అభినందనీయం. మీ పద్యప్రతిభ అమోఘం మా పదివేల పద్యాలంటే మాటల నిండుకుండెపుడు తొణకదనే సామెత మీకు అచ్చుపోసినట్టు సరిపోద్ది.. మీ నిరాడంబరత మరో ఆభరణం.

[23/02, 10:23 PM] +91 79899 16640: ఈ వేదిక పైన శ్రీమతి బల్లురి ఉమాదేవి గారి పరిచయం ఎంతో స్ఫూర్తి కలిగించింది..శ్రీలక్ష్మి గారు చక్కని ప్రశ్నలతో వారి గూర్చి మనకు తెలిసేలా చేశారు...అన్నింటా విజయ సాధించిన నారి ఉమాదేవి గారూ...వారి చక్కని గళం పరిచయమే సహస్ర వాణీ లో...బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు...వారు 10000 పై చిలుకు పద్యాలు వ్రాశారు..చాలా గొప్ప విషయం...మహిళా లోకానికి ఆదర్శం ..మీరు మరెన్నో రచనలు చేయాలని కోరుతూ..అభినందనలు తెలుపుతున్నాను.
శ్రీ లక్ష్మి గారికి అభినందనలు.
ప్రతిభ ఎంత ఉన్నా అది తెలుపుటకు ఒక వేదిక అవసరం...అలాంటి ఒక అద్భుతమైన వేదిక మల్లి నాథ సూరి కళా పీఠం ద్వారా గౌరవనీయులు Amarakula sir కల్పిస్తున్నారు...అందుకు ఈ సమూహం లో స్థానం కల్పించినందుకు sir ki కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

[23/02, 10:31 PM] +91 91006 34635: బల్లూరి ఉమాదేవి గారికి, శ్రీలక్ష్మీ గారికి అమర కలవారికి విజయ కుమారినమస్కారాలు. మీ పరిచయం మాకెంతో ముదావహం.
[23/02, 10:33 PM] +91 98496 14898: బి ఉమాదేవి గారి ముఖాముఖి అద్భుతంగా ఉంది. చదువు కొనసాగించటానికి భర్తగారు అందించిన ప్రోత్సాహం గొప్పది మేడమ్. పట్టుదలతో అధ్యాపక వృత్తిని చేపట్టి,భాషా సేవచేయగలగటం నిజంగా వాణీ దయకు పాత్రులవటం. మీ --మా అదృష్టం అనుకోవాలి ఆటవెలదులతో ఆట ఆడినంతగా 10000 పూర్తిచేయ గలగటం చాలా గొప్ప విషయం. అమరకులవారి సమూహంలో మీరుండటం మా అదృష్టం గా భావిస్తున్నాను. చాలా మందిని ప్రోత్సాహిస్తున్న మేక రవీంద్ర గారికీ నమస్సులు. లక్ష్మి గారి ప్రశ్నావళి బాగుంది. 

 రామబ్రహ్మం.
 పండిత కుటుంబంలో జన్మించి, పెళ్లైయ్యాక ఉన్నత విద్యలు అభ్యసించి, ఆటవెలదుల  పద్యాల రచనలు గావిస్తూ, మంచి సందేశాలను అందించిన మేధావి, కవి శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారికి, మెరుగైన సమాధానాలు రాబట్టిన, శ్రీమతి మంచాల లక్ష్మి కవి గారికి శుభాభినందనలు.... 
నమస్సులు...  

వేమూరి కమలాకర్ సుజాత
 డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారితో మంచాల శ్రీలక్ష్మి గారు జరిపిన ముఖాముఖి కార్యక్రమం పాఠక,సాహితి ప్రియులను ఆశాంతం కట్టి పడేసింది. వారి బాల్యము, విద్య, వివాహం, వృత్తి, ప్రవృత్తుల, సాహిత్యాభిరుచి ప్రోత్సాహం తదితర అంశాలను చాల నేర్పుతో కూడిన ప్రశ్నల పరంపరలతో అభినవ మొల్లగ వికసించిన ఉమాదేవిగారి నుంచి జవాబులు రాబట్టిన తీరు ప్రశంసనీయం.పండిత వంశం వారికుటుంబ నేపథ్యం  కర్నూలు వాసిగఅని విద్యభ్యాసం అనంతపురం జిల్లాలో తదుపరి భీమసేను గారితో వివాహం ,వారి ప్రోత్సహ,సహకారాలతో పై చదువులు పొందడం,వారి శ్రీవారి మరణాంతరం 52వ ఏట తెలుగు కన్నడ సంప్రదాయాపు స్త్రీలు పాటలు-తులనాత్మక పరిశీలన అనే అంశం పై పరిశోధన చేసి పి.హెచ్.డి.పట్ట పుచ్చుకోవడంలో వారి పట్టుదల ,కృషి భర్త గారి సహాయ సహకారాలు దాగున్నాయని నిసందేహాంగ చెప్పవచ్చని అవగతం అవుతుంది. సాహిత్యం పయనింపచేసిన  బాల్యంనుండే అలవడి ఇంతింతై వటుడింతైనట్లు నేటి పద్యరచయితిగ వన్నెకెక్కిన్నారడంలో అతిశయొక్తి ఏమియు లేదు.స్నేహితుల పుట్టన రోజులకు పంపిన చిరుకవితలు రివాజు నేటి పద్య కవిత శిరోమణిగ రుబాబుగ మలిచినది శ్రీవారి విద్య,సాహితి రంగానికి,వృత్తి లో ఇచ్చిన ప్రోత్సహం ప్రశంసనీయం  సుమతి,వేమన పద్యాల ప్రభావంతో పథ్యరచనాశక్తిని,శ్రీకారం చుట్టిందని అందు చేత నే పద్యరచనలు ముఖ్యంగా ఆటవెలది పద్యాల ఆకట్టుకొని ఆటవెలది అల్లికలు పది వేల పద్యాలు పైగా రచించి ప్రబంధం పద్యాలు,సమస్య పూరణలు,పద పరిచయ సుగంధాలు చరిత్ర వచన కవిత  శంకరాభరణం తెలుగు కవిత్వం,ఆటవెలది ఆరాధ్య ప్రియులని వారి రచనా పరంపరతతో అవగతం చేసారు నేటితరం అలనాటి పద్యం రచనలు ఆశక్తిని భావ స్పష్టతకు స్పస్టతను పెంపొందిఃచుకొని సాహిత్యాన్నివికసింప చేయాలని సూచించారు.అటు వృత్తి పరంగా కూడా కర్నూలు జిల్లా లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలిగ కడు సమర్థనీయం నిర్వహించి విజయాని  చవిచూసారు.  వృత్తి, ప్రవృత్తి పరంగా,కుటుంబ  పరంగాను విజయ దుందుభిని మ్రోగించారు.
అలాగే మల్లినాథ కళాపీఠం వారు అమరకులం గారు జరుపుతున సాహితి సేవను కొనియాడారు క్రతువుగ నిర్వహిస్తూ అనేక సాహితి పరిమళభరిత కుసుమాలు వికసింప చేస్తన్నారని మేకరవీంద్ర  సహస్ర కవిచే అమరకల కవి పరిచయం ముఖాముకి నిర్వహణ బషీర్ బాగ్ లోని ప్లేస్ క్లబులో వారి జాతీయ పురస్కారం అందుకొన్నట్లు తెలిపారు. మహిళా విజయాని వెనుక పురుషులు ప్రోత్సాహం ఉంటే శిఖరం పరంపరను అవళీలలుగ అధిరోహించవచ్చని నిరుపించారు ఇంతటి స్ఫూర్తిదాయకమైన అరుదైన ఆణిముత్యం లాంటి కవయిత్రి విశేషాలను అందచేసిన మల్లినాధ కళాపీఠం అమరకులం గారికి పృచ్ఛకులు లక్ష్మీ గారికి,టెక్నికల్ సహాయ సహకారాలు అందచేసిన  గీతాశ్రీ గారికి ధన్యవాదాలును ఉమాదేవి గారికి అభినందనల మందార మాలను ‌సమర్పించుకొంటున్నాను.



 ప్రతి స్పందన:
నవదుర్గ క్షేత్రం ఏడుపాయలు కోలాచల మల్లినాథ సూరి కళా పీఠం నిర్వాహకులు శ్రీ అమరకుల గారికి ,పరిపృచ్ఛ చేసిన మంచాల లక్ష్మి గారికి సమన్వయకర్త గీత శైలజ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
       కనిపించే దైవమైన అమ్మను గురించి చెప్పమంటూ చక్కని ప్రశ్న తో మొదలుపెట్టి  సమాధానాలు రాబట్టుకున్న లక్ష్మి గారిని అభినందిస్తున్నాను. నా పరిపృచ్ఛ చదివి తమ హృదయ స్పందనను అభిమానాన్ని తెలిపిన  కవి మిత్రులు  శ్రీ పొన్నూరు మాధవ రెడ్డి గారు,  రామ శర్మ గారు , డాక్టర్ కోవెల శ్రీనివాసాచార్యులు గారు ,డి. గాయత్రి గారు, అంజన్న గారు శేషు కుమార్ గారు ,పిన్నికి నాగేశ్వర రావు గారు, లక్ష్మీ గారు, విజయ కుమారి గారు, పద్మావతి గారు ,ఆర్ఆర్ బి చారి గారు ,వేమూరి కమలాకర్ సుజాత గారు, రంగరాజు పద్మజ గారు మొదలైన కవి మిత్రులందరికీ, నాకు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపిన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదములు.
      తిథి ప్రకారం నా జన్మదినం శివరాత్రి మరుసటి రోజు.ఆ రోజుననే నా పరిచయ కార్యక్రమం రావడం చాలా సంతోషం కలిగించింది. మరొక సంగతి మీతో పంచుకోవాలనుకుంటున్నాను .నా పేరు మీ అందరికీ పరిచయం .ఆ పేరుకు మన పీఠానికి గల సంబంధం కాకతాళీయంగా కుదిరింది ..శివరాత్రి రోజున మా నాన్నగారు శ్రీ గోపాల రావు గారు  కోలాచలం మల్లినాథ సూరి గారి వ్యాఖ్యానంతో కుమార సంభవం కావ్యాన్ని ప్రవచనంగా చెప్పారట ఆ సమయంలో "ఉమ"అనే పేరు పలుమార్లు ఆ కావ్యంలో రావడంతో నాకు ఆ పేరు పెట్టారట ఇది అప్రస్తుతం అయినా మీతో పంచుకోవాలనిపించింది మన్నించండి.
       మేక రవీంద్ర గారు నిర్వాహకులు గా 'అయుత  కవితాయజ్ఞం' అనే గ్రూపును ప్రారంభించి వాట్సప్ కవిసమ్మేళనం మొదలుపెట్టారు. వారి గ్రూపులలో రెండు వేలకు పైగా పద్యాలు రాసి సహస్ర కవి భూషణ సహస్ర కవిచక్రవర్తి బిరుదులు అందుకున్నాను.ఆగ్రూపు లోనే పదివేలకు పైగా పద్యాలు చదివి ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ గారి చేతులమీదుగా 'సహస్ర పద్యశ్రీ 'బిరుదు అందుకోవడం మరిచిపోలేని అనుభూతి. ఆ గ్రూపులో ఉన్నప్పుడే దృశ్యకవీ శ్రీ అమరకల గారితో వాట్సప్ మాధ్యమం ద్వారా పరిచయం మొదలయ్యింది.
చి. చంటి అనిల్ కుమార్ నేతృత్వంలో
గురజాడ వారి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పురస్కారాలను అందుకోవడం జరిగింది. ఆ సందర్భంలో హైదరాబాదులో బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శ్రీ అమరకుల గారితో ముఖాముఖి పరిచయం జరిగింది.చి.అనిల్ నిర్వహిస్తున్న పద్యాల సవ్వడిలో 4500 పైగా పద్యాలు రచించాను.చి.భావరాజు పద్మిని నిర్వహిస్తున్న అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రికలో ప్రచురింపబడిన రచనలకు పురస్కారాలు బహుమతులు కూడా లభించాయి. ఆన్నీ రవీంద్ర భారతిలో అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 'అక్షరవనం' అనే పుస్తకాన్ని అచ్చు వేయించిన ఘనత కూడా పద్మిని గారిదే.
     అపారమైన సాహితీ సముద్రంలో నేను ఒక బిందువును. నిత్య విద్యార్థినిని.నేను రాసే పద్యాలలో దొర్లిన  తప్పులను పొరపాట్లను సవరిస్తూ సూచనలు ఇస్తూ ప్రోత్సహించే కవి మిత్రులు దొరకడం నా అదృష్టం. ముఖ్యంగా శంకరాభరణం గ్రూపులో శ్రీ కంది శంకరయ్య గారు, శ్రీ కే యల్ ఎన్ మూర్తి గారు, శ్రీ పిన్నికి నాగేశ్వర రావు గారు, శేషు కుమార్ గారు, చక్రవర్తి గారు, విరించి గారు, అంజన్న గారు ,ఇంకా ఎందరో మహానుభావులు నాకు సహకరిస్తూ సూచనలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను ఇంకా కొందరు మిత్రులు నేను రచించిన పద్యాలు పాడుతున్నారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత సంవత్సరం 'ప్రజ_ పద్యం గ్రూప్' వారు సామాజిక పద్య ప్రబంధాల పోటీలు నిర్వహించారు అందులో ఒక రైతు జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఆసరా అని ఐదు ఆశ్వాసాల ప్రబంధము రచించాను. కవిమిత్రుల మీ కోరిక మేరకు ఆకథాసారాంశం
ఇతివృత్తము.
రాఘవయ్య అనేరైతు రాఘవాపురమనే గ్రామంలో నివసిస్తూవుంటాడు.తండ్రి చిన్నతనంలో మరణించగా తల్లి రత్నమాంబ పెంచి పెద్దచేస్తుంది.పదవతరగతి వరకు చదివి ఆపై ఆర్థికకారణాలవల్ల చదువు ఆపి తండ్రి సంపాదించిన రెండెకరాలపొలాన్ని సాగు చేసుకొంటూ వుంటాడు.పొరుగూరులోనున్న సీతను వివాహం చేసుకొంటాడు.ఇద్దరుపిల్లలు కలుగుతారు.తల్లి మరణం, పంటలుపండక అప్పలెక్కువకావడంతో భార్య సలహాపై పొరుగుదేశ మేగి కష్టపడి ధనం సంపాదిస్తాడు.భార్య అప్పులుతీరుస్తూ పొలాన్ని అభివృద్ధిచేస్తూ పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేస్తుంది.ఏడాదికోసారి వచ్చి పోతుంటాడు.పిల్లలు మంచి ఉద్యోగాల్లో చేరుతారు.వారికి వివాహాలౌతాయి.పిల్లలు పుడతారు.కంపెనీలతరపున విదేశాలకేగి అక్కడే స్థిరపడిపోతారు.వయసు పైబడడటంతో ఇంకసంపాదించాల్సిన అవసరంలేదని కుటుంబంతో మనవలతో కాలం గడపాలని స్వదేశానికి శాశ్వతంగా వచ్చేస్తాడు.కాని అశ నిరాశగా మిగులిపోతుంది.పరదేశంలోని పిల్లలు రామనడంతో భార్యతో 'మనకెవరి ఆసరాలేదు.నాకు నీవు నీకు నేను' “ఆసరా”.ఇదిగో ఈపొలం మనకు “ఆసరా”
అనడంతో కావ్యం ముగుస్తుంది.
         ఐదు ఆశ్వాసాలతో (240 పద్యములలో)కూడిన సామాజిక పద్యప్రబంధం “ఆసరా”.
      శ్రీమతి లక్ష్మి గారన్నట్టు ప్రతిభ ఉన్న దాన్ని పదుగురికి తెలిసేలా చేయడానికి ఒక వేదిక కావాలి ఆ చక్కని వేదికను కల్పించిన శ్రీ అమరకుల గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.(ఇంతకు మునుపు సహస్ర కవిత యజ్ఞంలో మేక రవీంద్ర గారి నేతృత్వంలో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు ఇటువంటి పరిచయం చేశారు)
        మీ అందరి ప్రోత్సాహం ఇలాగే కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 
                        మీ ఆత్మీయరాలు 
                     డా. బల్లూరి ఉమాదేవి
                         డల్లాస్, అమెరికా

***

No comments:

Post a Comment

Pages