సుబ్బుమామయ్య కబుర్లు - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు
ప్రతాప వెంకట సుబ్బారాయుడు 



చిన్నప్పట్నుంచి నేను అవసరం లేవూ అనుకున్న వాటి నుంచి అవసరమైనవి తయారు చేసుకునేవాడినర్రా!
పెద్ద పరీక్షలయ్యాక మనం చదువుతున్న తరగతి నుంచి ఉత్తీర్ణతనొంది కొత్త తరగతి లోకి వెళ్లినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం? పాత పుస్తకాలని అమ్మేస్తాం. లేదా చించేస్తాం. కదూ!
నేనేం చేసేవాడినో తెలుసా? అచ్చు పుస్తకాలు ముఖ్యంగా లెక్కలు, సైన్స్ భద్రంగా దాచుకునేవాడిని. ఎందుకంటే కొత్త తరగతిలో పాఠాలు చదువుతున్నప్పుడు, ఎప్పుడో అప్పుడు వాటిలో కొన్ని విషయాలు వెనక్కెళ్లి చూసుకోవాల్సిన అవసరం కలుగుతుంది. మిగతావి కింది తరగతులవాళ్లకు ఉచితంగా ఇచ్చేసేవాడిని. నేను పుస్తకాలకి అట్టలు వేసి నలగకుండా, శ్రద్ధగా చూసుకోడం చేత అవి దాదాపు కొత్త పుస్తకాల్లానే ఉండేవి. ఎంతో ఆసక్తిగా వాటిని తీసుకోడానికి పోటీలు పడేవాళ్లు పిల్లలు. అలాగే నోట్ పుస్తకాల్లో ఖాలీ పేజీలు మిగిలితే వాటితో రఫ్ బుక్స్ కుట్టుకునేవాడిని. వాటిని లెక్కలు అభ్యాసం చేయడానికి, ముఖ్యమైనవి రాయడానికి ఉపయోగించేవాడిని. వాటిని చూసి మా నాన్నగారు ఎంత మెచ్చుకునేవారో!
నేను ఆరో తరగతిలో కొన్న ఇంక్ పెన్ను పదో తరగతి వరకు వాడానర్రా! అలాగే చదువు పూర్తయ్యే వరకు ఒకే కంపాస్. 
నేను పైన చెప్పిన వాటివల్ల డబ్బు వృధా అవదు. పైగా మన పుస్తకాలు ఆ తరగతిలో చదువు పూర్తయ్యే వరకూ అందంగా ఉంటాయి.
పాత శుభలేఖల నుంచి పూలు, దేవుళ్ల బొమ్మలు వేరు చేసి అట్టపై అతికించి ఆకర్షణీయమైన వస్తువులు తయారు చేసి టీచర్స్ టేబుల్స్ మీద అలంకరించేవాడిని.
ఆగస్టు 15, నవంబరు 14 వచ్చినప్పుడు రంగు రంగుల కాగితాలతో, బొమ్మలతో తరగతి గదిని అలంకరిస్తాం కదా! ఆ ప్రత్యేక రోజులైపోయాక వాటిని తీసి భద్రంగా దాచి తర్వాత వచ్చే పిల్లలకి ఇచ్చేవాణ్ని.
డెస్క్ ల మీద పెన్నుతో పిచ్చి పిచ్చివి రాయడం, బ్లేడుతో చెక్కల్ని చెక్కడం చేసేవాణ్ని కాదు. అంచేత నేను కూర్చున్న చోట అవి నీట్ గా ఉండేవి. 
స్కూలు నుంచి రాగానే నా యూనిఫాం విప్పాక మడత పెట్టి ఒక మూల పెట్టేవాణ్ని. నా పుస్తకాలు ఎప్పుడూ పోగొట్టుకోలేదర్రా!
ఇలా అన్నీ ఉపయోగపడే పనులు చేయడం వల్ల మా అమ్మానాన్నలతో సహా టీచర్లందరూ నన్ను ఇష్టపడేవారర్రా!
మనందరం రాముడు మంచి బాలుడు అన్నంత గొప్పగా ఉండాలి. అందరి మన్ననలూ పొందాలి.
మీరూ అలాగే ఉంటారు కదూ!
ఉంటానర్రా!
మీ సుబ్బుమామయ్య!

No comments:

Post a Comment

Pages