శ్రీకృష్ణతత్వ శతకము - పుచ్చా వేంకటకృష్ణశాస్త్రి - అచ్చంగా తెలుగు

శ్రీకృష్ణతత్వ శతకము - పుచ్చా వేంకటకృష్ణశాస్త్రి

Share This
శ్రీకృష్ణతత్వ శతకము - పుచ్చా వేంకటకృష్ణశాస్త్రి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 



కవి పరిచయం: ఈ శతక కర్త పుచ్చా వేంకటకృష్ణశాస్త్రి గుంటూరు జిల్లా వాసి. వృత్తి రీత్యా వీరు ఫష్టుగ్రేడు వకీలు. ఈ కవి శతకాంతమున తనగురించి ఈ విధంగా చెప్పికొనినాడు. 
క. భారతభూమిని గృష్ణా
తీరమునను నాంధ్రదేశతిలకంబగు గుం
టూరను నుత్తమమండల
మారయ నా జన్మభూమి యందురు కృష్ణా!

క. కుచ్చళ్ళపాడు గ్రామము
పుచ్చా వంశమును గౌతమునిగోత్రమునన్
మెచ్చగ విదుధులు పుట్టితి
నిచ్చి సుఖంబులను నన్ను నేలుము కృష్ణా!

క. అస్వార్థులు శుభగుణ యో
గ స్వాంతులు నై వెలుంగు కనకాంబా రా
మస్వామిశాస్త్రులకుఁ దే
జస్వుల కాత్మజుఁడ నన్ను సాకుము కృష్ణా!

క. కవివరులు మెచ్చ నేనీ
భువి వేంకటకృష్ణశాస్త్రి భూసురుఁడను నా
యవినయముల బాఁటింపక
కవితాప్రియ! నన్ను వేగఁ గావుముకృష్ణా

క. జ్యోతిష సంస్కృతముల సం
గీతమున పరిచయము గలించితివిగదా
భూతలమున బీ.యే నై
ఖ్యాతిని నీ దయను నేనుగాంచితిఁ గృష్ణా!

క. యెద మర్మముఁ దెలియుటకై
పదపడి బీ.యీడి నైతి ఫస్టుగ్రేడున్
చదివితి విసవితి సమ్య
గ్విందునింగా నన్ను జేయ వేడితిఁ గృష్ణా!

పైన పద్యాలనుండి తల్లి కనకాంబ, తండ్రి రామస్వామి శాస్త్రులు అని అంతేకాక ఈ కవి సంస్కృతాంధ్ర భాషలందు మరియు సంగీతమునందును ప్రవేశముగలవానిగా తోచుచున్నది. 
ఈకవి ఇతర రచనలను గురించి  ఏమియు సమాచారము లభింపలేదు. వీరు ఈశతకమును 1957 వ సంవత్సరమున ప్రకటించియుండుటచే వీరు ఆధునిక శతక కర్తలుగా భావించవచ్చును.
శతక పరిచయం: 
కృష్ణతత్వశతకము వేదాంత మరియు తత్వ విషయములను భక్తులకు సులభరీతిన అర్థమగునట్లు "కృష్ణా" అనే మకుటంతో రచించిన శతకము. ఈశతకంలో 172 కందపద్యాలలో సగుణనిర్గుణ బ్రహ్మతత్వములను భక్తులు భావన చేసుకునేందుకు, తత్త్వదృష్టి కవారు చక్కగా విచారణ చేసికొనటానికి అనువయ్యే రీతిలో అనేక వివేకచూడామణి వంటి వేదాంత గ్రంధములలోని భావనలను ఏర్చి కూర్చినారు.
ఈశతకం ప్రణవోచ్చారణము,  శ్రీకృష్ణమానసపూజ,  ఆవాహనము,  ఆసనము, పాద్యము, ఆర్ఘ్యము, ఆచమనీయము, మధుపర్కము, మొదలగా అపరాధస్తవము వరకు గల నిత్యపూజా విధానము కందపద్యములలో చక్కగా నిర్వహించారు. 
కొన్ని పద్యాలను చూద్దాం. 

క. మల్లెలు తులసీదళములు
మొల్లలు జాజులు గులాబి ములుగోరంటల్
ఎల్లను గొని పూజించెద 
నుల్లములో నిలిపి నిన్ను నొప్పుగఁ గృష్ణా! (పుష్పపూజ)

క. సురవర మునినుత మురహర
సురుచిరపించాచచూడ శుభకర ధరణీ
ధర నీకు నార్ఘ్యమిచ్చెదఁ
బురుషార్థసుఖములొసఁగి ప్రోవుము కృష్ణా!(అర్ఘ్యము)

క. తెలియకచేసిన పాపము
తెలిసియుఁ దెలియకయు చేయుదీరని యఘముల్
తెలిసియుఁ జేసిన పాపము
విలయముగావించి ప్రోవవె నను గృష్ణా!(అపరాధస్తవము)

ఈశతకంలోని శ్రీకృష్ణ మహిమ్నస్తోత్రము విభాగంలోని 74 వ పద్యము నుండి 83 వ పద్యం వరకు దశావతార వర్ణనము చేసినారు. అందులో కొన్ని మచ్చుకి:
క. జలధిం దాగిన సోమకు
విలయముఁగావించి యఖిలవేదసమూహం
బుల వాగీశున కిచ్చితి
వలయక మత్స్యావతారమందునఁ గృష్ణా!

క. భూనభముల నడలించిన
దానవుని హిరణ్యకశిపు దమియించి సుతున్
బూనికఁబాలించిటకై
యానరసింహావతారమైతివి కృష్ణా

క. అడిగిన భూదానము మూ
డడుగుల బలి యీయ బుడము యాకాశము రెం
డడుగులుగాఁ బెరిఁగి బలిపై
నడుగిడి వామనుఁడవైతివయ్య కృష్ణా!

క. రాముడు రఘువంశాంబుధి
సోముడూ సీతాహృదబ్జసూర్యుఁడు మేఘ
శ్యాముడు లంకాధీశవి
రాముఁడ వైనావు కావరమ్మిఁకఁ గృష్ణా

పోతనపద్యానుకరణలు ఈశతకంలో అనేకము కానవస్తాయి
క. ఎవ్వనిచేఁ బుట్టును జగ
మెవ్వనిచే జగము వృద్ధి నింపుగ నొందున్
ఎవ్వఁడు లయకారణమగు
నవ్విభుఁడవు నీవేకావె అభవా కృష్ణా!

అనే పద్యం చదవగానే "ఎవ్వనిచేజనించు" పద్యం గుర్తుకురాక మానదు.
తరువాతి విభాగము "కృష్ణతత్త్వము" 
క. సత్యము జ్ఞాన మనంతము
నిత్యము బ్రహ్మంబు వాక్కు నేరదు దెలుపన్
అత్యంతశక్తిమంతము
సత్యము వేదంబు దెలిపె సమముగఁ గృష్ణా!

గోవిందాష్టకములోని "సత్యం జ్ఞానమనంతం నిత్యం" అనే స్లోకం దీనికి ఆధారం కావచ్చును.
తరువాతి విభాగము "సాధనాచతుష్టయము-శమాదిషట్క సంపత్తి"
క. క్రమత వివేకము వైరా
గ్యము శమషట్కంబు మోక్షకాంక్షలు చూడన్
గ్రమముగ మోక్షప్రాప్తికి
నమరిన సాధనచతుష్టయమ్మగుఁ గృష్ణా!

ఇది శంకరాచార్య వివేకచూడామణి శ్లోకానికి అనువాదము
అధౌ నిత్యానిత్య వస్తువివేకః పరిగణ్యతే
ఇహాముత్ర ఫలభోగవిరాగ స్తదనన్తరం
శమాదిషట్కసంపత్తిర్ముముక్షుత్వమితి స్ఫుటం


ఈవిభాగములోని పద్యములన్నియూ వివేకచూడామణి యందలి పద్యములకు అనువాదములు. తదుపరి విభాగములు "అవ్యక్తస్వరూపము", "దేహవిభాగము", "గుణవిభాగము", "పంచకోశవివరణము" అన్నియు వేదాంత తాత్త్విక విషయములను గురించినవే. వీనిలో చాలావరకు వివేకచూడామణి నుండి గ్రహించినవే అని తోస్తున్నది. 
చక్కని సరళమైన భాషలో వేదాంత తాత్విక విషయాలు అందరికి భోదపడే విధంగా రచించిన ఈశతకం ఎంతో విజ్ఞానదాయకమైనది. 
మీరూ చదవండి మీ మిత్రులచే చదివించండి.

 ***

No comments:

Post a Comment

Pages