నెత్తుటి పువ్వు - 15 - అచ్చంగా తెలుగు
 నెత్తుటి పువ్వు - 15
మహీధర శేషారత్నం 


(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తుంటాడు రాజు.)

 “లేచావా! కాస్త తగ్గిందా!” ఒళ్ళు విరుచుకుంటూ అడిగాడు.

          “ఊఁ!” అంది తిన్నగా
          క్రింద పడుక్కోవడం నాకు అలవాటులేదు. ఒళ్ళు పట్టేసింది” అన్నాడు. కాళ్ళు చేతులు సవరదీసుకుంటూ.
          “ఊహూ!” అంది.
          “ఏదీ జ్వరం తగ్గిందా! నుదుటిమీద చెయ్యేస్తూ అడిగాడు. కొద్దిగా వేడిగానే ఉంది.
          మెల్లిగా ఆ చెయ్యి పట్టుకుని చెంపకానించుకుంది. నాగరాజు ఇబ్బందిగా చెయ్యి లాక్కోపోయాడు.      “నాకెవరూ లేరు?” అంటుంటే సరోజ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
          నాగరాజుకి అర్ధమయింది. అనారోగ్యంతో బాధలో విపరీతమైన ఒంటరితనం ఫీలవుతోంది అనుకున్నాడు.
          “ఛ! అలా అనుకోకూడదు. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది. మేమంతా లేమా!” అన్నాడు ఓదార్పుగా.
          “అవును, రాములమ్మక్క ఊరెళ్ళిందటగా, నీకు చెప్పిందా!”
          “చెప్పింది.”
          “జ్వరం ఎప్పణుంచి?”
          “వారం నుంచి మందుల కోట్లో అడిగితే ఏవో బిళ్ళలిచ్చాడు. తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చింది. ఎవరూ లేరు!” చిన్న పిల్లలా అంది.
          “నాకు కబురుపెట్టక పోయావా?” “ఎవరితో!
          అసలు నువ్వెక్కడుంటావో నాకేం తెలుసు.”
          నిజమే అనుకున్నాడు.
          “ముఖం కడుక్కున్నావా?”
          “ఊఁ!”
          “రెండిట్లీ తెస్తాను. తిని టీ తాగి మాత్రలేసుకో!”
          “ఊఁ !”
          వెళ్ళి వేడిగా రెండిడ్లీలు తెచ్చాడు. బ్రెడ్ కూడా తెచ్చాడు.
          “మరి నీకో” అంది మొదటిసారిగా
          “ఇంటికెళ్ళి తింటా!”
          “మీ ఆవిడ తిడుతుందా!”
          “ఎందుకు” ఆశ్చర్యంగా అన్నాడు.
          “మరి రాత్రంతా ఇక్కడున్నావుగా..” అందుకు అన్నట్టు చూసింది.
          “చెప్పేవచ్చా! ఒక ఫ్రెండుకి బాగుండలేదు. తోడుండి పొద్దున్నే వస్తానని చెప్పా”
          “ఆడో! మగో! చెప్పావా?”
          నాగరాజుకి అర్థం కాలేదు.
          “ఏమిటీ!” అన్నాడు.
          “ఆ ఫ్రెండ్ ఆడో, మగో! చెప్పావా!” అన్నాను అంది. ఆ గొంతు నీరసంగా ఉన్నా కాస్త కొంటెతనం తొంగిచూసింది.
          నవ్వి నెత్తిమీద చిన్నగా తట్టాడు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages