అటక మీది మర్మం-21 - అచ్చంగా తెలుగు
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 21
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)



(కనిపించకుండా పోయిన తన కుమారుడి సాహిత్యాన్ని వెతికి పెట్టమని నాన్సీ తండ్రిని సాయమడుగుతాడు ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్. తండ్రి కోరికపై ఆ పరిశోధనను చేపట్టిన నాన్సీ తన స్నేహితురాళ్ళతో కలిసి ఆ పాతభవనం అటక మొత్తం గాలిస్తుంది. మార్చ్ కి ఆర్ధిక సాయానికి ఉపయోగపడే ఎన్నో వస్తువులను ఒక షాపులో అమ్మి ఆ డబ్బుని మార్చ్ కుటుంబనిర్వహణకు ఉపయోగించే ఏర్పాట్లు చేస్తూంటుంది యువ గూఢచారి. ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని అక్కడ పని చేసే ఎఫీ ద్వారా తెలుసుకొంటుంది. ఒకసారి తన స్నేహితురాళ్ళతో కలిసి అతన్ని పటుుఇకొనే ప్రయత్నం చేసి విఫలమవుతుంది. ఆ ఆగంతకుడు ఆ యింటిలోకి ప్రవేశిస్తున్న రహస్యద్వారం కనుగొనాలని కూడా ప్రయత్నించి విఫలమవుతుంది. అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకేదో సైగ చేస్తోందని బెస్ అంటుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి అస్తిపంజరం దిగువన ఒక నాబ్ కనిపిస్తుంది. దాన్ని తెరిచిన వాళ్ళకు పాత ఉత్తరాలతో పాటు కొన్ని పాటలు దొరుకుతాయి. తన తండ్రి క్లయింట్ కు అమ్మించి పెడతానని వాటిని నాన్సీ యింటికి తీసుకొస్తుంది. అంతకు మునుపు నాన్సీ తండ్రి అప్పగించిన మరొక కేసులో సీసాలను అమ్మే వంకతో డైట్ కంపెనీ లాబ్ లో దూరి అక్కడ ఉన్న రసాయనికాలను తెచ్చి తండ్రికి యిస్తుంది. మాటల మధ్యలో ఆమె తండ్రి లాబ్ లో ఆమె లైట్ వేసి వదిలేసిన దానిపై డైట్ కంపెనీలో విచారణ జరుగుతోందని చూచాయగా తెలియపరుస్తాడు. అందువల్ల డైట్ కంపెనీకి తిరిగి వెళ్ళి ఆ పరిసరాల్లో తెలిసిన వ్యక్తి కనపడటం వల్ల తాను అకస్మాత్తుగా వెళ్ళిపోయానని, తిరిగి అక్కడ వదిలి వెళ్ళిన సీసాల అమ్మకం మాట్లాడటానికి వచ్చానని నమ్మబలుకుతుంది. ఆమె మాటలను విశ్వసించిన డైట్ సీసాల బేరాన్ని సాగిస్తాడు. తరువాత కథ ఏమిటంటే. . . . )
@@@@@@@@@@@@@@@
"ముప్ఫై అయిదేనా? నేను ఆ ధరకు అమ్మలేను" నాన్సీ చెప్పింది.
"మరో మాటగా ఏభై చేస్తున్నాను" అతను చెప్పాడు. "మా అమ్మాయి డయానె స్నేహితురాలివి గనుక అదనంగా మరో పదిహేను పడేస్తున్నాను."
నాన్సీ లేచి దయాపూర్వకంగా మన్నించమన్నట్లు చూసింది.
"ఈ వ్యవహారంలో స్నేహాన్ని అడ్డుపెట్టుకోవటం నాకిష్టం లేదు. ఎందుకంటే మరొకరి తరఫున నేను ఈ సీసాలను అమ్ముతున్నాను. మిస్టర్ డైట్! ముప్ఫై అయిదు డాలర్లకే నేను వీటిని అమ్మటం అతనికి యిష్టం లేకపోవచ్చు."
"నేను ఏభై యిస్తాను. అంతకు మించి దమ్మిడీ కూడా ఎక్కువ యివ్వను."
"అతన్ని కనుక్కొని చెప్పాలి" అంటూ ఆమె తన నిర్ణయంపై దృఢంగా నిలబడింది. అప్పటికే పురాతన వస్తువులను తీసుకొనే ఫేబర్ తో మాట్లాడాలని ఆమె నిర్ణయించుకొంది. "ఆ సీసాలను నేను పట్టుకెళ్ళవచ్చా?"
అందమైన ఆ సీసాలను వదులుకోవటానికి అతనికి మనస్కరించటంలేదు. అందుకే డైట్ మరొక పది డాలర్లు యిస్తానని చెప్పాడు. ఆమె అమ్మలేనని చెప్పటంతో, అయిష్టంగానే పాతసీసాలు ఉన్న పెట్టెను నాన్సీకి తిరిగి యిచ్చేసాడు.
కారెక్కిన నాన్సీ దీర్ఘంగా నిట్టూర్చింది. డైట్ తనపై కేసు పెట్టకుండా తప్పించుకోగలిగింది. లారెన్స్ డైట్ కి జన్మలో మళ్ళీ ఎదురుపడకూడదని దేవుణ్ణి ప్రార్ధించింది.
అక్కడనుంచి తిన్నగా ఫేబర్ దుకాణానికి ఆమె తన కారుని పోనిచ్చింది. తన కారునుంచి గాజువస్తువులను ఆకర్షణీయమైన ఆ చిన్న దుకాణంలోకి మోసుకొనిపోయింది. దుకాణం యజమాని అక్కడే ఉన్నాడు.
"రండి రండి. ఈసారి నాకోసం ఏమి తెచ్చారు?" అడిగాడతను.
"కొన్ని పాత సీసాలు. మీరు వాటి విలువ ఎంత ఉంటుందో చెప్పాలి."
నాన్సీ ఒక్కొక్కటిగా పెట్టెలోని సీసాలను బల్లపై వరుసలో పెడుతుంటే, ఫేబర్ నీలికళ్ళు మెరిశాయి. 
"ఈ సీసాలు పాతవే గాక అందంగా ఉన్నాయి" అంటూ వాటిని మెచ్చుకొన్నాడతను. "వీటికి చాలా మంచి ధర చెల్లిస్తాను."
"మన స్నేహం దీని మధ్యలో రాకూడదు" హెచ్చరిస్తున్నట్లు అందామె. "స్పష్టంగా చెప్పండి. వీటి విలువ ఏభై డాలర్ల కన్నా ఎక్కువ ఉంటుందా?"
"ఆనందంగా దానికి రెట్టింపు చెల్లిస్తాను. మీకు ప్రస్తుతం డబ్బు అవసరం లేకపోతే చెప్పండి. ఇలాంటివాటిని సేకరించే వ్యక్తికి అమ్మి, దానికన్నా ఎక్కువ మొత్తాన్ని యిప్పిస్తాను."
"ఈ సీసాలు మీవి. మీ యిష్టం వచ్చినట్లు చేసుకోండి" వెంటనే ఆమె తన నిర్ణయాన్ని వెలిబుచ్చింది.
"ప్రస్తుతానికి ఫిలిప్ మార్చ్ పేర వంద డాలర్లకు చెక్కు వ్రాసి యివ్వండి. వీటిని అంతకన్నా ఎక్కువకు అమ్మిన రోజున నాకు తెలియజేయండి."
"మీరెప్పుడూ ఇతరులకు సాయం చేయటంలో ముందుంటారు" చిరునవ్వుతో అంటూ ఆమె చేతికి చెక్కు యిచ్చాడు.
నాన్సీ యిల్లు చేరేసరికి ఒక టెలిగ్రాం ఎదురుచూస్తోంది. అది సంగీత ప్రచురణకర్త జెన్నర్ నుంచి వచ్చింది. దానిలోని సందేశం ఆమెను నిరాశకు, ఆగ్రహానికి గురిచేసింది. తాను ముద్రించిన పాటలు దొంగిలించబడినవనే ఊహతో ఆమె చాలా పెద్ద తప్పు చేసిందని అతను సంగ్రహంగా తెలిపాడు.
"ఇకపై యిలాంటి నిందలేస్తే పరువునష్టం దావాని ఎదుర్కొవలసి ఉంటుంది" అంటూ హెచ్చరించాడు. 
"ఈ విషయంలో మరి ముందుకు వెళ్ళవద్దని సలహా యిస్తున్నాను. వినకపోతే మీకు వ్యతిరేకంగా తక్షణచర్యలను తీసుకోవలసి ఉంటుంది."
నాన్సీ ఈ బెదిరింపులకు భయపడే అవివేకి కాదు.
"అతను భయపడి నన్ను బెదిరించాలని చూస్తున్నాడు. జెన్నర్, బెస్ బాంక్స్, హెన్రీహాల్ ముగ్గురూ తోడుదొంగలు. ఆ పాటలను ఫిప్ వ్రాసినట్లుగా సాక్ష్యాన్ని సంపాదించాలి-అతి త్వరగా!" అంటూ ఆమె తలపోసింది.
"ఎలాగైనా సరే! తన ప్రణాళిక ప్రకారం ఈ రాత్రి ఆ దొంగను మాటువేసి పట్టుకోవాలి" అనుకొంటూ నాన్సీ లేచింది.
బెస్, జార్జ్ కూడా ఆ రాత్రి పధకానికి అంగీకరించారు. ముగ్గురమ్మాయిలు సాయంత్రం త్వరగా భోజనాలు ముగించి ప్లెజెంట్ హెడ్జెస్ కు చేరుకొన్నారు. వాళ్ళు వెళ్ళే సమయానికి ఎప్పట్లానే మార్చ్ తన మనుమరాలికి కధలు చెబుతున్నాడు.
సుశాన్ భోజనం చేయటానికి లోనికెళ్ళగానే, నాన్సీ తన ఎత్తును పెద్దాయనకు వివరించింది. రహస్యంగా ఆ యింటిలోకి చొరబడే దొంగను ముగ్గురు యువతులు చీకట్లో యింటిబయట విడివిడిగా నక్కి గమనిస్తారు.
"నిన్నిలా చేయమని నేను చెప్పలేను. అది చాలా ప్రమాదకరమైనది" మార్చ్ ఆందోళన వ్యక్తపరిచాడు.
"ఏమైనా సరే, ముగ్గురమ్మాయిలం ఒక మగవాడిని సంబాళించగలం!" జార్జ్ గప్పాలు కొట్టింది.
తాము అనవసరమైన అవకాశాలు తీసుకోబోమని నాన్సీ అతనికి మాట యిచ్చింది.
నాన్సీ పధకం ప్రకారం ముగ్గురమ్మాయిలు నల్లదుస్తులు ధరించి, తలమీద జుట్టును నల్లగుడ్డతో కప్పేశారు. వాళ్ళు ఆ యింటినుంచి బయటకొచ్చి నాన్సీ సూచించిన ప్రాంతాల్లో స్థంభాల మాటున రహస్యంగా నక్కి చూస్తున్నారు. గమనించిన వారికి వారు దయ్యపు నీడల్లా కనిపిస్తారు.
ఇంట్లోవాళ్ళు ఎప్పటిలాగే తమ పనుల్లో ములిగిపోయారు. ఎఫీ రాత్రి భోజనం చేసిన గిన్నెలు, కంచాలు కడిగేసి మేడమీద తన గదిలోకి వెళ్ళిపోయింది. మార్చ్ హాల్లో ఒంటరిగా కూర్చుని, దొంగిలించిన తన కొడుకు పాటలకు సంబంధించిన వైనం ఏమన్నా దొరుకుతుందేమోనని రేడియో వింటున్నాడు. చివరికి రేడియో కట్టేసి, హాల్లో లైట్ ఆర్పేసి రెండవ అంతస్తు మెట్లెక్కాడు.
(తరువాయిభాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages