చివురంత ఆశ - అచ్చంగా తెలుగు
చివురంత ఆశ..
జి.సుబ్బలక్ష్మి 
(జంధ్యాల పికెల్స్, అచ్చంగా తెలుగు సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కధల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కధ )

“నీలకంఠంసార్‍కి డిపార్ట్‍మెంట్‍లో మాసివ్ హార్టెటాక్ వచ్చిందిట. యశోదా హాస్పిటల్ కి తీసికెళ్ళార్ట. కండిషన్ సీరియస్ అంటున్నార్ట..” యూనివర్సిటీ ఆర్ట్‍స్ కాలేజ్ అంతా దావానలంలా వ్యాపించిపోయిందా వార్త. ప్రొఫెసర్  నీలకంఠం గురించి తెలిసున్నవాళ్ళు “అయ్యో పాపం..” అనుకున్నారు. 

అంతా తమకే తెలుసుననుకునేవాళ్ళు “ఊరందరిదీ ఓ దారీ ఉలిపికట్టెదోదారీ అన్నట్టు మహా స్టూడేంట్‍స్ కి తనొక్కడే పాఠాలు చెప్పేసేటట్టు పోజొకటీ.. ఈ రోజుల్లో పాఠాలెవడిక్కావాలి! మార్కులుకావాలి కాని. ఆ మాత్రం తెల్సుకోలేకపోయేడు.. హూ, ఏమైపోతాడో పాపం.” అనుకున్నారు. 

విషయం విన్న నీలకంఠం భార్య మాలతి మూడేళ్ళ బాబుని తీసుకుని ఆఘమేఘాలమీద హాస్పిటల్ కి వచ్చి, అక్కడే వరండాలో గుడ్లనీరు పెట్టుకుని కూర్చుంది. నీలకంఠం కొలీగ్స్ ఇద్దరు ధైర్యం చెప్పడానికా అన్నట్టు ఆవిడ పక్కనున్నారు

కొంతమంది స్టూడెంట్‍స్ కూడా సార్ పరిస్థితికి ఆందోళన పడుతున్నట్టు ఆ వరండాల్లో అక్కడక్కడా పచార్లు చేస్తూ కనిపిస్తున్నారు. 

సరిగ్గా గంటక్రితం నీలకంఠం పాఠం చెప్పడానికి అప్పుడే రూమ్ లోంచి బయటకొస్తున్నాడు. అంతకుముందే ఎమ్.ఎ. పరీక్షాఫలితాలు వచ్చాయి. సగం మందికి పైగా ఫస్ట్ క్లాస్, మిగిలినవాళ్లకి  హై సెకండ్ క్లాస్ వచ్చాయి. స్టూడెంట్‍సు మహా సంతోషపడిపోతూ  స్వీట్సు పట్టుకుని నీలకంఠం దగ్గరి కొచ్చేరు. “తీసుకొండి సార్..” అంటూ నవ్వుతూ స్వీట్స్ డబ్బా అతని ముందుంచారు. మామూలుగా స్వీట్ తీసుకుని నోట్లో పెట్టుకుంటూ, “ఎందుకూ? ఏవైనా విశేషమా?” అనడిగేడతను. 

 “పెద్ద విశేషమే సార్, మాకందరికీ ఫస్ట్ క్లాసులొచ్చేయి. ఇదిగో ఈ రాజుకేమో గోల్డ్ మెడల్ కూడానూ..” అంటూ, నీలకంఠాన్ని వెక్కిరిస్తున్నటు చూస్తూ, పగలబడి నవ్వుతూ వెళ్ళిపోయేరు వాళ్ళు. నిర్ఘాంతపోయేడు నీలకంఠం.

 స్థాణువైపోయిన నీలకంఠానికి అంతకుముందు స్టూడెంట్‍స్ కీ, అతనికీ మధ్య జరిగిన సంఘటనలన్నీ వరసగా గుర్తొచ్చాయి. ఈ స్టూడెంట్‍స్ లో ఒక్కరికి కూడా పరీక్షకి కూర్చోడానికి సరిపడ అటెండెన్స్ లేదు. అందుకనే యూనివర్సిటీ నియమం ప్రకారం అసలు వాళ్లని పరీక్షలకే కూర్చోనియ్యకూడదని అడ్మినిస్ట్రేషన్ కి లెటర్ రాసాడు  నీలకంఠం. అలా రాసినందుకు వీళ్ళందరూ మీదపడి అతన్ని కొట్టినంత పనిచేసారు. బెదరకుండా రాయిలా కూర్చున్న నీలకంఠాన్ని చూసి, “నువ్వు కాదంటే మానేస్తామనుకుంటున్నావేమో. పరీక్ష ఎలా రాయాలో మాకూ తెల్సు..” అంటూ పైనుంచి బాగా ఒత్తిడి పెట్టారు. పర్యవసానం ఏమిటంటే ఇంక ఆ సంవత్సరంలో మిగిలిన రెండువారాలూ వాళ్ళందరూ క్లాసుల కొస్తారనీ, అటెండెన్స్ తీసుకోమనీ పైనుంచి నోటీస్ వచ్చింది. అది చూసి నీలకంఠం ఆఫీసులోవాళ్లని గట్టిగా అడిగాడు. “ఏడాదిపాటు చెప్పవలసిన పాఠాలు ఈ రెండువారాల్లో ఎలా చెప్తామండీ!” అంటూ. వాళ్ళు గట్టిగా నవ్వేసారు.

“మీ పాఠాలు అక్కర్లేదండీ వాళ్లకీ, అటెండెన్స్ మాత్రమే కావాలి. అది వేసి వాళ్లని పంపెయ్యండి చాలు.” అన్నారు అక్కడి అధికారులు. ఆ మర్నాటినుంచీ రెండువారాలపాటు ఆ స్టూడెంట్‍స్ రోజూ ఏదో ఓ టైమ్ లో వచ్చి, నీలకంఠానికి కనిపించి వెళ్ళిపోయేవారు. వాళ్లని చూస్తుంటే నీలకంఠానికి దొంగలు కొంతమంది రోజూ పోలీస్ స్టేషన్ కి వచ్చి సంతకం పెట్టిపోవడం గుర్తొచ్చింది. 

 అలాగ పరీక్షలకి కూర్చున్న ఆ స్టూడెంట్‍స్  పరీక్షలయ్యాక కూడ నీలకంఠాన్ని వదలలేదు. ఆరోజు మూడేళ్ళ బాబుకి జ్వరంగా ఉందని మాలతి అంటే డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళడానికి క్లాస్ అవగానే బయటకొచ్చిన నీలకంఠాన్ని చుట్టుముట్టారు వాళ్ళు. ఆర్ట్‍స్ కాలేజీ ముందు ఓ చెట్టుకింద ఘెరావ్ చేసారు. నాలుగు గంటలసేపు నిలబెట్టేసారు తప్పితే అతన్ని కదలనివ్వలేదు. వాళ్ళు పాపం ఎక్కువేమీ అడగలేదు. చాలా చిన్నకోరికే. ఈ రోజుల్లో ఏ పోస్ట్ కి అప్లై చెసుకోవాలన్నా 55% మార్కులకన్న తక్కువ వస్తే అప్లై చేసుకుందుకు అర్హత ఉండదు కనక వాళ్లందరికీ కూడా 55% పైన కానీ, లేదా ఫస్ట్ క్లాస్ కానీ ఇచ్చెయ్యమని అడిగారు. అది తనవల్ల కాదనీ, వాళ్ళు రాసినదాన్నిబట్టి మార్కులేస్తాననీ నీలకంఠం  చెప్పడంతో అతన్ని ఆ రాత్రి ఎనిమిదిగంటలవరకూ అక్కడే చెట్టుకింద ఘెరావ్ చేసారు. 

న్యాయంగా స్టూడెంట్‍స్ రాసినదాన్నిబట్టి మార్కులేసి, పేపర్లు ఆఫీస్ లో ఇచ్చేసాడు నీలకంఠం. దాన్నిబట్టి చూస్తే క్లాసులో సగంమంది కూడా పాస్ కాలేదు. అలాంటిది ఇప్పుడు వీళ్ళందరికీ ఫస్ట్ క్లాసూ, ఆ రాజుకి గోల్డ్ మెడలూకూడా వచ్చిందన్న మాట విన్న నీలకంఠం నిర్ఘాంతపోయాడు.

వెంటనే యూనివర్సిటీ ఆఫీస్‍కి  ఫోన్ చేసి, ఆ పేపర్ కోడ్ నంబర్ చెప్పి, మార్కుల గురించి అడిగేడు. “అవును సార్, వాళ్లందరూ ఫస్ట్ క్లాస్ లోనే పాసయ్యేరు సార్..” అంటూ వచ్చింది అట్నుంచి జవాబు.. “అదెలాగయ్యా..” అన్న ప్రశ్నకి “మరండీ, పైవాళ్ళ ఒత్తిడివల్ల ముఫ్ఫయ్యేసి మార్కులు  కలుపుతూ మోడరేషన్ చేసేం కదండీ.. అందుకనండి..” అంటూ మరోమాటకి అవకాశ మివ్వకుండా ఫోన్ పెట్టేసేడతను. నోటమాటలేదు నీలకంఠానికి. ఇటు స్టూడెంట్సూ అలాగే ఉన్నారు, అటు అడ్మినిస్ట్రేషనూ అలాగే ఉంది. వాళ్ళిద్దరూ ఒకటైపోయేరు. మధ్యలో పోకచెక్కల్లా నలుగుతున్నది టీచర్లేనా.

    జరుగుతున్న విషయాలు ఒక్కొక్కటీ తల్చుకుంటున్నకొద్దీ నీలకంఠం గుండె నలిగిపోసాగింది. ఇంత బాధ్యత గల పోస్ట్ లో వున్న తనని ఒక గడ్డిపరక కింద తీసి పడేసి, నువ్వు వెయ్యకపోయినా మాక్కాలసిన మార్కులు మేం వేయించుకున్నాం, నీ లెక్కెంత అంటూ దర్పంగా చూసిన స్టూడెంట్స్ చూపులు అతనికి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి.  శరీరం మీద పడ్డ దెబ్బకన్నా ఎక్కువగా మనసుకి తగిలిన ఈ దెబ్బని అతను తట్టుకోలేకపోయేడు. ముఖ్యంగా స్వీట్సు ఇస్తున్నప్పుడు ఆ స్టూడెంట్స్ చూసిన చూపూ, వెళ్ళిపోతూ తనని చూసి వెక్కిరింపుగా నవ్విన నవ్వూ నీలకంఠాన్ని కత్తులతో పొడుస్తున్నట్లనిస్తోంది.   ఆ పోటుకి గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది.

 చిన్నప్పట్నించీ చదువుని ఒక తపస్సులా ఆచరించి, అరాధించిన అతనికి  ఆ దేవత సరస్వతీదేవి మోము చిన్నబోయి నట్టనిపించింది.  నిస్సహాయురాలై శొకభారంతో కుంగిపోతున్న శారదాదేవి కళ్ళముందుకు వచ్చి నిలబడినట్టనిపించి అతని నవనాడులూ కుంగిపోయాయి. 

 ఒళ్ళంతా చెమట్లు పట్టేసేయి. భుజం బాగా లాగేస్తోంది. ఆసరాకోసం టేబిల్ అంచుని పట్టుకున్న నీలకంఠం చెయ్యి పట్టు తప్పుతోంది. రూమ్ లో మంచినీళ్ళు పెట్టడానికి వచ్చిన అటెండర్ గబుక్కున ముందుకి వచ్చి అతన్ని పడిపోకుండా పట్టుకుని, గట్టిగా కారిడార్ లో వెళ్తున్నవారిని కేకేసేడు. వాళ్ళు వచ్చి, పరిస్థితి చూసి, ఆంబులెన్స్ కి ఫోన్ చేసి, హాస్పిటల్ కి తీసికెళ్ళేరు. సుభద్రా మేడమ్ నీలకంఠం భార్య మాలతికి ఫోన్ చేసి విషయం చెప్పగానే పిల్లాణ్ణెత్తుకుని పరిగెత్తుకుని హస్పిటల్ కి వచ్చేసింది మాలతి.

 పొంగుకొస్తున్న దుఃఖాన్ని కొంగు నోట కుక్కుకుని ఆపుకుంటూ క్రితం రాత్రి తనకీ, భర్తకీ జరిగిన సంభాషణ గుర్తు చేసుకుంది మాలతి. ఈ దేశంలో విద్య, వైద్య వ్యవస్థలు పూర్తిగా నాశనమైపోయాననీ, నీలకంఠంలాంటి నిజాయితీగల ప్రొఫెసర్లని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చనీ, వాళ్ళవల్ల వేళ్ళవరకూ చెదలు పట్టేసిన ఈ వ్యవస్థలు బాగుపడే అవకాశం లేదనీ, నీలకంఠంలాంటి ఏ ఒక్కరో ప్రయత్నించినా ఫలితం శూన్యమనీ, ఇలా స్టూడెంట్‍స్ దెబ్బలు కొడుతుంటే ఎప్పుడేమవుతుందోననే భయంతో తనూ, బాబూ బతకలేరనీ ఖచ్చితంగా చెప్పేసింది మాలతి. అప్పటిదాకా ఈ స్టూడెంట్‍స్ ఎప్పటికైనా చదువు విలువ తెలుసుకుంటారని ఆశిస్తున్న నీలకంఠం అంతకు ముందే పక్క డిపార్ట్‍మెంట్ లో మార్కులకోసం ప్రొఫెసర్ ని కొట్టిన స్టూడెంట్‍స్ ని చూసేక అతనిలోని ఆశ చచ్చిపోయింది. 

చాలాసేపు వాదోపవాదాలయ్యాక ఇంక చివరికి మాలతి మాట కాదనలేక నీలకంఠం అమెరికాలో తను చదువుకున్న యూనివర్సిటీ లోనే  తనకి ఆఫర్ చేసిన ఉద్యోగంలో చేరటానికి ఒప్పుకున్నాడు. ఇంతలో ఇలా జరిగింది. భర్తకు ఏమీ కాకూడదని మాలతి వేయిదేవుళ్ళకు మొక్కుకుంది. డాక్టర్లు వెంటనే అటెండ్ అయి, అవసరమైన ట్రీట్మెంట్ ఆఘమేఘాలమీద అందించడం వల్ల  ఒక రెండుగంటలు గడిచేక గండం గడిచిందంటూ చెప్పిన డాక్టర్ల మాటలకి అందరూ హమ్మయ్య అనుకున్నారు.

 ఆ మర్నాడు నీలకంఠాన్ని చూడడానికి యూనివర్సిటీ నుంచి చాలామంది స్టాఫ్, స్టూడెంట్సూ హాస్పిటల్ కి వచ్చేరు. అందులో ఇద్దరు అబ్బాయిలను గుర్తుపట్టాడు నీలకంఠం. వాళ్ళిద్దరూ మార్కుల కోసం తనతో దెబ్బలాడిన అబ్బాయిల గుంపులో  ఉన్న అబ్బాయిలని గమనించి ఆశ్చర్యపోయేడతను. వాళ్ళు వెడుతూ వెడుతూ తమను క్షమించమన్నట్టు తనవైపు చూసిన చూపుని నీలకంఠం గమనించేడు. అది గమనించగానే అతనికి వెయ్యేనుగుల బలం వచ్చినట్లైంది. అందరూ వెళ్ళేక నెమ్మదిగా మాలతితో అన్నాడతను, “నాకెక్కడో చిన్న వెలుగురేఖ కనిపిస్తోంది మాలతీ. ఇవాళ ఒకరిద్దరు తమ తప్పు తెలుసుకున్నారు. నేను రిటైరయ్యే టైముకి కనీసం పదిమంది స్టూడెంట్స్ అయినా వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుంటారు. అది చాలు మాలతీ ఏ టీచర్ జీవితానికైనా. నేను ఇంక ఏ దేశానికీ వెళ్ళను. ఇక్కడే ఉండి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను..” 

నీలకంఠం మాటలు విని, అతనిలోని అశావహ దృక్పథానికి స్థాణువైపొయింది మాలతి.  
                           ********

No comments:

Post a Comment

Pages