బ్రహ్మోత్సవాలు - అన్నమయ్య కీర్తనలు - 08 - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు - అన్నమయ్య కీర్తనలు - 08

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-08 (ముత్యపు పందిరివాహనము)
డా.తాడేపల్లి పతంజలి 
  బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-08 (ముత్యపు పందిరి వాహనము)
మలయప్పస్వామి మూడవ రోజు రాత్రి  " ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడవీధులలో విహరిస్తాడు. చల్లని ముత్యాలతో చల్లని చూపుల స్వామి దర్శనం మధురానుభూతిని కలిగిస్తుంది.

అన్నమయ్య కీర్తనల్లో అక్షర “ముత్యాలు” ఇవి. జాగ్రత్తగా మనస్సుతో గ్రహించి  పరవశిద్దాం. ఆ స్వామికి మనం కూడా అక్షరాల ముత్యాల పందిరి వేసి సేవించుకొందాం.

1. ముంగిట బులుకడిగిన ముత్యము3-125
(పులు కడిగిన ముత్యము=మాలిన్యాన్ని కడిగివేసిన శుభ్రమైనముత్యం )

2. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము3-577

3. చేరి ముత్యపుజిప్పల చినుకులునినిచితే
మేరతేటముత్యములై మించకుండీనా
ధారుణి శ్రీవేంకటేశుదాసులసంగతి నుంటే
పోరచి నే జీవులైన బుణ్యులుగాకుందురా 4-66

4.ముడిగి ముత్తెపుజిప్పముత్యము విధంబున
జడిసీ నాలోని సాత్వికము 4-348

5. పోకలంతేసి ముత్యముల కంటసరులవి
వేకపు గుబ్బలమీద వేగుగాక మానునా 5-238
(కంటసరి  = మెడలో ధరించే బంగారు ఆభరణం. ‘కంటెసరి’)

6. చెంతల ముత్యపుం జిప్పల తోయము
లంతలోనె ముత్యములాయె
సంతత కరుణా జలనిధి లక్ష్మీ
కాంతుడవట వేంకట విభుడా 6-3

7. చేరి నీ గుబ్బలమీది చెమట ముత్యము లోలి
తోరపు ముత్యాల సందుల నుండంగా
కూరిమి నీ పతి రతిఁగూడిన నిబ్బరమున
హారములు చెదరి యే మాయ నొసవితిమి 6-142

8. ముదితకురుల నెల్లా ముత్యములు మాణికాలు
గుదిగుచ్చి కీలుగంటు గొన్నది 9-79
(కీలుగంటు =జుట్టుముడి , జారుముడి)

9. చెమరించితి నింతె సేసముత్యములు రాలీ
తమి శ్రీవెంకటపతి దగ్గరఁ బోలు 9-98
(సాసముత్యాలు, సేసముత్యాలు=ముత్యాలవంటి అక్షతలు).

10. మూసినముత్యమువలె ముంగిటికి వచ్చితివి11-75
మూసినముత్తెము(=1. అణగిమణగి యుండునది.2. తెలిసియు తెలియనట్లు నటించువాడు.3. ఎక్కువగా మాట్లాడనివాడు.)

11. మూసిన ముత్యమువలె మూల లే లోయి
మోస మెల్లాదేరె నిక మొరగే లోయి11-112

12. వేరించి యేమైనా వెంగెములాడుటకంటే
మూసిన ముత్యమువంటి మోనమె మేలు 12-204

13. మూసినముత్యమువలె ముదిత కాగిట నిల్చి
ఆసకొల్పీ శ్రీవేంకటాధిప నిన్ను 13-66

14. సంకుబూస దెచ్చి యెంతసానబట్టి తోమినాను
సుంకించి ముత్యముతోడి సూటికి రాదు 15-380
(సంకుపూస= శంఖపు పూస; సుంకించి= పీడించి)

15. కప్పురకాపామీదగడు బూసుకొన్నవాడు
ముప్పిరిబులుకడిగేముత్యమువలె 17-498
(కప్పురకాపు  =  కర్పూరంతో అలదడం. )

16. ఆసలు విడువలేక అలమేలుమంగ నిన్ను
సేసవెట్టి కూడీని శ్రీ వేంకటేశ
తాసువలె బెనగీని తరితీపు సేసీని
మూసినముత్యమువలె మొక్కు మొక్కీనీకును 19-255
(సేసవెట్టు =అక్షతలు మొ. చల్లు, తలంబ్రాలు పోయు, పెండ్లియాడు. - దీవించు.తరితీపుసేయు = సంతోషపెట్టు, వలపించు . బాధపెట్టు,  గర్వించు.)

17. మూసినముత్యమువలె మోనముతో నవ్వీని
సేసవెట్టి రతివిందు సేయగరాదా 19-330

18. చెలువపు వలపుల చెమట ముత్యములె
చెలి నీచెక్కుల కివి సింగారమే 20-314

19. చుక్కలు గాయగా నేజూడదలెత్తితి నింతె
ఇక్కడ నేముండుతా నే నెఱగజుమ్మీ
చిక్కువడ్డముత్యములు చేతులబట్టితి నింతే
అక్కర నివేటివని యడుగజుమ్మీ 21-494

20. మూసినముత్యమువలె ముద్దరాలుమొక్కిమొక్కి
లాసీ నీపొందులకు లాలించరాదా
ఆసపడివచ్చినాపె నాదరించితే నేము
వాసుల కెవ్వరిమైనా వద్దనేమా నిన్నును 22-323

21. జాణతనాలాడగాను సరసుడందుకుమెచ్చి
ఆణిముత్యముల కంఠహార మిచ్చెను 23-462
(ఆణిముత్యము =ప్రశస్తమైన/ గుండ్రని ముత్యం.)

22. చూచినవెల్లా సొంపుముత్యములు
పూచినపువ్వులె పున్నమలు
లాచినవెల్లా లాగవేగములు
యీచెలిసొబగుల కెదురా నీవు 24-47
(లాచు= వ్యాపించు; లాగవేగాలు – సులువు,వేగము.)

శ్రీకృష్ణుడు' నాసాగ్రేనవమౌక్తి”క ధారుడు.వేంకటేశ్వరుడు “మౌక్తికసగ్వి" (ముత్యాలహారాన్ని ధరించినవాడు). శ్రీమన్నారాయణుడు “ముక్తాతపత్రితానంత సహస్ర ఫణమండలుడు'' (ముత్యాల గొడుగు వలె నున్న ఆదిశేషునివేయి పడగల క్రిందనున్న వాడు) అని పెద్దలు చేసిన వర్ణనలకు  అన్నమయ్య ముత్యాల వర్ణనలు ఏ మాత్రం తీసిపోవు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో వేంకటేశ్వరుడు ముత్యపుపందిరి వాహనం లో సాధారణంగా  శ్రీ కృష్ణుని రూపంలో కనబడతారు. (అప్పుడప్పుడు అలంకారం మార్పుకు అవకాశం ఉంది)

శ్రీ కృష్ణుడు అంటే ఆకర్షించేవాడు.

ముత్యపుపందిరి వాహనం లోని    శ్రీ కృష్ణుడు అకర్షణతోపాటు మైమరుపు కలిగిస్తాడు. స్వస్తి.

***No comments:

Post a Comment

Pages