పుష్యమిత్ర - 39 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 39
- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: పుష్యమిత్రుడు తన కాలంలో దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు.  ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు.  ఇండియన్ గ్లోబల్ ఐ విషయం పాకిస్తాన్ వాళ్ళకు తెలిసిపోయిందన్న విషయం ప్రభుత్వం గమనిస్తుంది.  పాకిస్తాన్‌లోని ఉప్పుగనులకు టెండర్ వేసిన సుకేశ్ సుభానికి టెండర్ వచ్చిందని ఫోన్‌లొ మన ప్రధానికి పాక్ ప్రెసిడెంట్ శుభవార్త చెప్తాడు. పంచాపకేశన్‌ను అనుచరుడు వెంకటేశన్ ప్రభుత్వానికి లొంగిపోయి సాక్ష్యాధారాల్తో సహా పట్టించగా ఆర్ధికమంత్రి జైలుపాలవుతాడు. ఇండియన్ గ్లోబల్ఐ రహస్య విషయం అక్కడపనిచేసే అసాఫాలి ద్వారా ఎక్కువ విషయాలు రాబట్టాలని అతణ్ణి పాకిస్తాన్ కు తీసుకెళ్ళే పధకంలో ఇండియన్ అర్మీకి దొరికిపోతాడు.  బాబాజీ ప్రత్యక్షమై త్వరలో పుష్యమిత్రుని అవతారం పరిసమాప్తి కాబోతున్నదని చెప్తాడు. నాగబంధం విప్పే విధానం సవిస్తరంగా తెలియజేస్తాడు. కార్తీకశుద్ధ ఏకాదశి నాడు పుష్యమిత్రుడు మౌనముద్రలో ధ్యానం లో ఉండిపోతాడు. (ఇక చదవండి)
మిలిటరీ ఇంజినీర్లు ప్రభుత్వాదేశానుసారం మైనింగ్ ప్రాంతం ఉన్న గుహపైన ఒక చిన్న రంధ్రం చేసి నీటిమోటారు ఏర్పాటు చేసి గుహలోకి చిన్న ధారతో నీళ్ళు వదలసాగారు. ఆప్రాంతం ఎవరికీ కనిపించకుండా అడవి మధ్యభాగంలో ఉంది. గనుల్లోకి నీళ్ళువస్తున్నందున ప్రమాదం కనుక గని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించి అందరినీ పంపివేసి గేట్లు మూసేసారు. సరిగ్గా గేట్లు మూసే సమయంలో పుష్యమిత్రుడు తన వెంట నాగర్‌కోయిల్ నుండి వచ్చిన పూజారిని మాత్రమే తీసుకుని కార్తీకశుద్ధ చతుర్థి  నాడు లోనకు ప్రవేశించి, ఇద్దరు ఇంజినీర్లతో నాగబంధం ఉన్న ద్వారం వరకూ శుభ్రం చేయించి, వారిని పంపివేసి, పూజలో హోమగుండం ముందు కూర్చున్నాడు.  అగస్త్య మహాముని చెప్పిన స్కంధ-స్తుతితో ప్రారంభించి, మంత్ర హీనం క్రియాహీనం లేకుండా ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం అనే  రెండు ప్రధానమైన సర్ప పూజలు కూడా సంపూర్తిగా చేశాక నాగబంధం విప్పడం ప్రారంభించాడు.  సర్పావాహన సమయం ఆసన్నమైంది.  సర్పాల పేర్లు చదివీ చదవక మునుపే భయంకర కాల నాగులు  పడగవిప్పి నాలుకలు చాచి నిలబడ్డాయి.  మామూలు మానవులైతే అక్కడికక్కడే రక్తం క్రక్కుకుని చచ్చేవారు.  నాగర్‌కోవిల్ పూజారిని గరుడోపనిషత్ ను చదవమని తాళపత్ర గ్రంధం ఇచ్చి సైగచేశాడు. గరుడోపనిషత్ చదివాక "ఓం తత్పురుషాయ విద్మహే స్వర్ణ పక్షాయ ధీమహి, తన్నో గరుడః ప్రచోదయాత్" అన్న గరుడ గాయత్రిని ఆ గుహ దద్దరిల్లేలా బిగ్గరగా పఠిస్తున్నాడు.

క్రమంగా ఒక నీలిరంగు పొరలా ఉన్న సర్ప వ్యతిరేక శక్తి గదిలో ప్రవేశించి ఆ సర్పాల శక్తిని క్రమేణా క్షీణింపజేసింది. అవి మెల్లి మెల్లిగా శక్తి నశించి  తోక ముడుచుకుని ఒక్కొక్కటీ అదృశ్యమయ్యాయి. కానీ అక్కడ నిండిన విషపూరిత వాయువు పూర్తిగా గాలిలో కలిసి అదృశ్యం అయేవరకూ గరుడ మంత్రం ఇద్దరూ కలిసి పఠించసాగారు. రెండు గంటల అనంతరం పరిశుభ్ర వాతావరణం ఏర్పడ్డాక పుణ్య:వాచనం చేసి గది శుద్ధి పరచారు. మంత్ర జలం ప్రోక్షణ చేసి తలుపు నెట్టమని పూజారికి చెప్పాడు. పూజారి భయపడుతూ అడుగులేశాడు.  తలుపు నెట్టగానే పూజారి లోపల వింత ఆకారాన్ని చూసి కెవ్వుమని కేకపెట్టాడు.
వెంటనే గమనించిన పుష్యమిత్రుడు పూజారి భుజంపై చేయివేసి తట్టాడు. యిద్దరూ లోపల ప్రత్యక్షమైన బాబాజీ కి సాష్టాంగ నమస్కారం చేశారు. బాబాజీ ఆశీర్వదించి ఇక్కడినుండి మూడో గదిలో కి వెళ్తే అక్కడ నుండి ఆరు గదుల్లో ఈ సంపద ఉంది అని చెప్పాడు. పుష్యమిత్రునికి తను గతంలో దాచిన సంపద విషయం పూర్తిగా జ్ఞప్తి వచ్చే విధంగా బాబాజీ పుష్యమిత్రుని తలపై చెయ్యి వేసి బొటనవేలితో నొక్కాడు. సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులు మనకు ఇప్పుడే అందాయి. ఆ నిధిని ఎవరు ముట్టుకున్నా రక్తం క్రక్కుకుని మరణించే విధంగా ఆ నాగేంద్రుని అశీస్సులతో రక్షా బంధన దిగ్బంధం చేయగలిగాను. ఆ బంగారం దర్శించాలంటే ఈ విబూధి తప్పక ధరించాలి. విబూధి ధరించని మిగతా వారికి మనదేశం చేరే వరకూ సంపద మట్టిలా కనిపిస్తుంది. ప్రభుత్వ ఖజానా చేరిన తర్వాత జరగవలసిన తంతును పుష్యమిత్రుని బోధించి, జాగ్రత్త!  ప్రమాదం అంటూ గుప్పెడు విబూధి ఉన్న సంచీ పుష్యమిత్రుని చేతిలో ఉంచి, ఈ విషయం ముఖ్య వ్యక్తులకు తప్ప మిగతా వారికి తెలియరాదు అని చెపుతూ అంతర్ధానమయ్యాడు బాబాజీ.
*    *    *
అది మద్యాహ్నం ఒంటిగంట సమయం. సైనికులందరూ భోజన శాలలో ఉన్నారు గ్లోబల్-ఐ దిగువన ఉన్న గ్రవుండ్ కంట్రోల్ గది దిశగా ఒక ఈక్వలైజర్ గాలిలో దూసుకు వచ్చింది. అదృష్టశావత్తూ అది వరండా ప్రాంతంలో పడి ఆ ప్రాంతమంతా ధ్వంసం అయింది. ఆ శబ్దం విన్న్న సైనికులు వెంటనే అప్రమత్తం అయ్యారు. బయటికి వచ్చి చూడగా ఒక హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొడుతూ భూమికి నాలుగు ఐదువందల మీటర్ల ఎత్తులో వెళ్ళిపోతూ కనిపించింది. వెంటనే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ క్షణం ఆలశ్యం చేయకుండా ఐదువందల మీటర్ల ఎత్తుకు దూసుకుని వెళ్ళే అతిశక్తివంతమైన ఆయుధం ఆర్.పీ.జీ-7 ను అందుకున్నాడు. సెకనుకు 400 మీటర్ల వేగంతో వెళ్ళే ఆ ఆయుధం నుండి దూసుకొచ్చిన గ్రెనేడ్ లాంటి పరికరం మరో మూడు సెకన్లలో హెలికాప్టర్‌ను తుత్తునియలు చేసింది.  కూలిన హెలికాప్టర్ ను గమనిస్తే చైనా భాషలో జె.ఎఫ్.10 అన్న అక్షరాలు స్పష్టంగా కనిపించాయి. పాకిస్థాన్ వారు వారి ఒప్పందంలో భాగంగా వారి నేషనల్ డే రోజు సైనో-పాక్ సంయుక్త సైనిక విన్యాసాలు చీఫ్ ఆఫీసర్‌కు గుర్తుకు వచ్చాయి. వెంటనే నిముషాల్లో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.
*    *    *
అనుకున్న సమయానికి రిజర్వు బ్యాంక్ గవర్నర్‌తో ప్రధాని గనిలోకి వచ్చాడు. పూజారిని బయటకు పంపించి పుష్యమిత్రుడు విషయం చెప్పసాగాడు.
"ఒక ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. కానీ ఇంత శుభప్రదంగా జరుగుతుందని అనుకోలేదు. ఏదైనా కీడు జరుగుతుందని భయం ఉండేది"
"శుభం. అప్పుడు నాగబంధం వేసినప్పుడూ మీరే ఉన్నారు కదా! మీ ఆస్థి మీరే తీసుకున్నారు. అంతే. ప్రస్తుతం కర్తవ్యం సెలవియ్యండి."
"ముఖ్యంగా వినండి. ఈ సంచీ లో వున్న విబూధి ధరించకుండా లోనకు వెళ్ళరాదు. వెళ్తే వెంటనే మృత్యు వాత పడతారు అంటూ విబూధి  ప్రధానికి ఇచ్చాడు.
"హమ్మో భయంగా ఉంది పుష్యమిత్రా!" ముగ్గురూ విబూధి ధరించి లోనకు ప్రవేశించారు.
రెండో గదిలోనికి ప్రవేశించగానే ప్రధాని చేతిలో ఉన్న మొబైల్ మ్రోగింది.
“పీ.ఎం హియర్. ఆన్ వెరీ ఇంపార్టంట్ జ్యాబ్. ఎనీ థింగ్ సీరియస్? అవతలి వారు చెప్పిన విషయం వినగానే పీ.ఎం. ముహం ఎర్రగా మారింది. వెంటనే సర్దుకుని నేను మరో గంటలో అక్కడకు చేరుకుంటాను. “ప్లీజ్ ఇన్‌ఫాం ఆర్మీ అండ్ ఎయిర్ చీఫ్. ఆస్క్ దెం టు సెండ్ సఫిషియెంట్ ప్యూపుల్” అంటూ స్వేదం నిండిన నుదురు తుడుచుకుని మూడో గదిలో ముగ్గురూ అడుగు పెట్టారు. 
*    *    *
    లోనకు వెళ్ళిన రిజర్వు బ్యాంక్ గవర్నర్, పుష్యమిత్రుడు అక్కడి బంగారం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. "పీ.ఎం.గారు ఇక మనదేశం ఏ మాత్రం బీద దేశం కాదు. ఈ భూమి మీదనే అతి ధనవంతమైన దేశంగా మారుతుంది" అనగా పీ.ఎం. "బంగారం ఎక్కడ? నాకు ఈ గదిలో అంతా మట్టి ముద్దలు కనిపిస్తున్నాయి" అన్నాడు.
పుష్యమిత్రుడు పీ.ఎం. నుదిటి విబూధి చెరిగిపోయి ఉండడం గమనించి సంచీలోని విబూధి తీసి నుదుట పెట్టగానే మెరుపు మెరిసినట్లైంది. మొత్తం బంగారం రత్న రాసులు ఒక్కసారిగా కనిపించాయి. ఈ విబూధి సాక్షాత్తు సుబ్రహ్మణ్యస్వామి నాకు ప్రసాదించినది. ఈ విబూధి ధరించినవారికి పునర్జన్మ ఉండదు. మనం దిల్లీ రిజర్వు బ్యాంకుకు చేరాక మళ్ళీ అక్కడ, సుబ్రహ్మణ్య యాగం, హోమం చేసి ఆయన్ను ఆవాహన చేసిన మంత్రజల ప్రోక్షణ జరగాలి. అప్పుడే అందరికీ బంగారం దర్శనమౌతుంది. అప్పటిదాకా మట్టిముద్దల్లాగే కనిపిస్తుంది.

పీ.ఎం అందుకుంటూ “అయితే మనం యదేఛ్చగా నేడే లారీల్లో తరలించవచ్చు. పైపెచ్చు బార్డర్లో పరిస్థీతి అంత సుముఖంగా లేదు" అన్నాడు. ఏర్పాట్లు వెంటనే జరిగిపోయాయి. వంద ట్రక్కుల్లో మట్టిల కనిపిస్తున్న పదార్ధాన్ని బార్డర్ దాటించి దిల్లీ కి చేర్చారు. 
పుష్యమిత్రుడు యధావిధి మంత్ర తంత్రాలతో ఆ బంగారం అందరికీ కనబడేట్టు చేశాడు. రిజర్వు బ్యాంకు చుట్టూ కొన్ని వందలమంది సైనిక బలం కాపలా పెట్టారు. బంగారం మదింపు జరగ్గా హీనపక్షం పది లక్షల టన్నుల బంగారం మిగతా నవరత్నాలు ఉన్నట్టు తేలింది. ఆ దమాషాలో రిజర్వు బ్యాంకు నోట్లు ముద్రిస్తే ప్రపంచంలోనే ధనవంతమైన దేశంగా అవుతుంది. ఈ విషయం ముఖ్యమైన ఆఫీసర్లకు తప్ప బయటకు పొక్కకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.  (సశేషం)

No comments:

Post a Comment

Pages