చేయూత - అచ్చంగా తెలుగు
చేయూత 
కౌండిన్య 

రాత్రి పది గంటలైనా ఆ రోడ్డు మీద ట్రాఫిక్ ఇంకా తగ్గనేలేదు. కొందరి జీవితాలు ఆ రోజుకు గట్టెక్కితే చాలు అనేలా ఉంటాయి. ఆ రోడ్డు మీద గుడ్డి దీపాల వెలుగులో ఓ బండి కనపడుతోంది. అటు వెడుతున్న కారు ఆ బండి దగ్గరలో ఆగింది. ఓ మప్పై ఏళ్ళ పైచిలుకు వ్యక్తి ఆ కారులోనుండి దిగి ఆ బండి వైపుకు నడిచాడు.
ఆ బండి మీద బొగ్గుల కుంపటి మీద పెనం వేసి ఉంది. దాని పక్కనే ఓ పళ్ళెంలో పిండి తడిపేలా ఉండి, పక్కన వొత్తుకోవడానికి వీలుగా అమర్చి ఉన్నాయి. 
శ్రీని బండి దగ్గరకు వస్తూనే ఆమె అడిగింది “ఎన్ని చేయమంటారు ?” ”ఓ ఐదు కావాలి” అన్నాడు. “చేసినవి మూడు ఉన్నాయి, కొంచెం సేపు పడుతుంది” అంది “ఫర్వాలేదు, అన్నీ వేడిగా చేయండి. ఉంటాను” అంటూ అక్కడే నించొని గమనిస్తున్నాడు. 
అతని దృష్ఠి ఆ బండి దగ్గరలోనే నేల మీద పడుకున్న ముగ్గురు పిల్లల మీద పడింది. పల్చటి దుప్పటి నేల మీద పరిచి ఉంది. దాని మీద ఆ పిల్లలు పడుకొని ఉన్నారు, అందరూ ఏడేళ్ళ వయసు లోపల ఉంటారనుకుంటున్నాడు. వాళ్ళు పడుకున్న ఓ పదడుగుల దూరంలో ఓ కుక్క కూడా నేల మీద పడుకొని ఉంది. 
ఇంతలో తన మొబైల్ మ్రోగడంలో ఆలోచనలోంచి బయటకు వచ్చి ఫోన్ తీసాడు “ఓ పది నిమిషాలు పడుతుంది” అన్నాడు కైవల్యతో. “తయారవ్వగానే వస్తాను ..కారులో ఏసి వేసే ఉంది గదా..” అంటూ పెట్టేసాడు. 
మళ్ళీ ఆ పిల్లల వైపుకు చూసాడు. “మా పిల్లలే బాబు.. నిద్రొచ్చి పడుకున్నారు” అంది అతడు గమనిస్తున్నట్లు తెలిసి. “ఇంట్లో..” అనేలోగా “ఈ పట్నంలో మాకు ఇల్లెక్కడ దొరుకుతుంది బాబు, పడుకున్న చోటే ఇల్లు” అంది. “అయితే, రాత్రంతా ఇక్కడే పడుకుంటారా?” అని అడిగాడు ఆశ్చర్యంగా. కష్టాలను, బాధలను లెక్కజేయని చిరునవ్వు ఆమె మొహంలో ఉండటం చూసాడు.
ఇంతలో ఒకతను వచ్చాడు, అతన్ని చూస్తే అలసి పోయిన వాడిలా ఉన్నాడు, తన చొక్కా విప్పి ఆ పిల్లల పక్కనే కూర్చున్నాడు. “ఏదైనా తిని పడుకోయ్యా” అంది. “నీ పని కానీయ్ లే “ అంటూ పిల్లల పక్కనే నడుం వాల్చాడు. అది చూసి హృదయం ద్రవించింది, విద్ద్యుద్దీపాల కాంతిలో శ్రీని కళ్ళు చెమ్మగిల్లాయి.
”పోనీ మీరు చేసినవి ఆయనకు ఇవ్వండి. నాకు కొంచెం ఆలస్యం అయినా ఫర్వాలేదు” అన్నాడు. “పొద్దుననగా వెళ్తాడు ఓ రెండు రొట్టెలు తీసుకెళ్లమంటే వినడు. అక్కడ ఏం తింటాడో ఏమో” అంది. ఇంతలో ఆ పక్కనే ఉన్న కుక్క తోక ఊపుకుంటూ ఆ బండి వైపుకు నడిచింది. దాన్ని చూస్తూ ఆవిడ “నీకు ఇస్తానులే వెళ్ళు పిలుస్తాను” అంది. అయినా ఆ పక్కనే తోకాడిస్తూ కూర్చుంది. 
ఇంతలో వేరే అతను బైక్ మీద వచ్చి “ఓ ఐదు జొన్న రొట్టెలు ఇవ్వు” అన్నాడు. “కొంచెంసేపు పడుతుంది” అంది. “అవి ఉన్నాయిగా” అన్నాడు. “ఆయన ఇందాకటి నుండి నించొని ఉన్నారు” “ఓ రెండు నిమిషాలు ఉంటే అయిపోతుంది” అంది . అతను అసహనంతో విసుక్కుంటూ బయలుదేరాడు. ఆ కుక్క ఆ పాత చోటే వెళ్ళి కూర్చుంది. కొందరి మనుషుల కంటే వీటికే సహనం ఎక్కువ అనుకున్నాడు. మళ్ళీ ఫోన్ మ్రోగింది. “సగం అయ్యాయి. వచ్చేస్తున్నాను.. పోనీ కారులో పాటలు ఏమైనా పెట్టుకో” అంటూ పెట్టేసాడు.
“మీ పిల్లలు చదువులు?” అని అడిగాడు కుతూహలంతో. “చదువులెక్కడ బాబు, వాళ్ళ తిండి కోసం ఆయన పొద్దున్న పోయి రాత్రి వస్తాడు అలసిపోయి” అంది భర్త వైపుకు చూస్తూ. “నువ్వు మాత్రం ఊరికే కూర్చుంటవా? పొద్దున్న పొలం పనికి పోయి చీకటి పడే కాడికి రొట్టెల కాల్చట్లా?” అన్నాడు కునుకు పట్టక లేచి పిల్లల పక్కన కూర్చొని చొక్కాతో విసురుకుంటూ. 
“మీరు పొలం పనికి వెడితే పిల్లలూ?” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. అదిగో ఆ కొబ్బరి బోండాల కొట్టు అతను చూసుకుంటాడు” అంది 
ఇంతలో మళ్ళీ ఫోను మోగింది. “లేటు అవుతుంటే వద్దులేండి. ఏ రెస్టారెంటుకో వెడదాము” అంది “అయిపోయింది. వచ్చేస్తున్నాను” అంటూ ఫోన్ పెట్టేసాడు. 
ఆవిడ చేసిన ప్యాక్ చేసి ఇచ్చి “యాభై రూపాయలు” అంది.  భర్తకు చేయటానికి పిండి కోసం అటు వెళ్ళింది. తన పై జేబులో ఉన్న రెండు వేలు తీసి ఆమె చూడకుండా ఆమె డబ్బుల డబ్బా కింద పెట్టాడు. ఆమె వచ్చిన తరువాత తన పర్సు తీసి అడిగిన యాభై రూపాయలు ఆ జొన్నరొట్టెల కు ఇచ్చి కారు వైపుకు నడిచాడు. 
నడుస్తూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. తను చేసిన పని సరైనదో ? కాదో? అని అనుకుంటూ మళ్ళీ అంత డబ్బులు ఎలా వచ్చాయని ఆమె మీద భర్త అనుమాన పడతాడోమో అనుకొని తను కారు వరకూ వళ్ళి ఆ రొట్టెలు ఇచ్చి “ఇప్పుడే వస్తాను” అంటూ పిలుస్తున్నా మళ్ళీ ఆ బండి వైపుకు వెళ్ళాడు.
అతను తిరిగి రావడం గమనించిన ఆమెతో “ఇందాక డబ్బులు జేబులోంచి జారి పడ్డాయి, బహుసా ఇక్కడే పడ్డాయేమో?” అంటూ వెతకడం మొదలు పెట్టాడు.
ఆమె కూడా అటు వెతకడం మొదలుపెట్టింది, ఆమె గమనించే లోగా ఆ  రెండు వేలు తిరిగి తీసేసుకున్నాడు. 
ఈ అలజడికి ఆమె భర్త కూడా లేచి వెతకడం మొదలు పెట్టాడు. ఆ కుక్క కూడా వెనుక కారాడుతూ తిరుగుతోంది. ఇంతలో అతను దొరికినట్లుగా వాటిని చూపించి, ఆ రెండు వేలు తీసి ఇచ్చి “చీకటిలో ఇక దొరకవు అనుకున్నాను, దొరికాయి. వీటిని మీరు ఉంచుకోండి, పిల్లలకు పనికివస్తాయి” అన్నాడు. 
ముందు తిరస్కరించినా తరువాత తీసుకున్నారు. అతను సంతృప్తితో కారు వైపుకు నడిచి కారు ఎక్కాడు. 
“మళ్ళీ ఎందుకు వెళ్ళావు” అని చిరు కోపంతో అడిగింది. “ఓ రెండు వేలు ఇవ్వటానికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తరువాత అన్నీ సంగతులు వివరంగా చెబుతాను” అన్నాడు. కారులో ఇంటికి బయలుదేరారు. 
ఆలస్యం అయ్యింది పైగా ఆకలితో చిరాకు పడుతూ “అనవసరంగా ఈ జొన్న రొట్టెలు అడిగాను. ఆ రెండు వేలకు ఓ మంచి రెస్టారెంట్ లో భోజనం తినేవాళ్ళం” అంది కైవల్య. మనసులో నీ మనస్తత్వానికి అక్కడ పరిస్తితి చూసి ఉంటే గనుక నేను ఇచ్చిన దానికంటే రెండు రెట్లు ఇచ్చేదానివి అనుకున్నాడు శ్రీని.
ఇంటికి చేరేదాకా శ్రీని ఆలోచనలు అక్కడ నేల మీద పడుకున్న పిల్లల గురించే తిరుగాయి. ఇంటికి చేరుకున్నారు, ఏదో ధ్యాస లో ఉన్న అతన్ని చూసి భోజనానికి పిలిచినా నాకు ఆకలిగా లేదు అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
తరువాత రోజు సాయంత్రం పార్కులో “నిన్నటి నుండి గమనిస్తున్నాను. ఏదో ఆలోచనలలో ఉంటున్నావు అని అడిగింది కౌవల్య. “నిన్న రాత్రి చెబుదామనుకున్నాను” అంటూ నిన్న శ్రీని అక్కడ చూసినదంతా చెప్పాడు. కొంత సేపటి వరకూ నిశ్శబ్ద వాతావరణం ఆవహించిన తరువాత “పదా అక్కడికి వెడదాం” అంది కైవల్య. మనసులో కైవల్య స్వభావం తెలుసు కాబట్టి లేచి వెంటనే బయలు దేరాడు. కారులో ఇద్దరూ ఏం చేయాలో ఆలోచించుకొని అక్కడకు చేరారు.
“మీరా బాబు రండి.” అంటూ పలకరించింది శ్రీని ని చూసి. కౌవల్య ను పరిచయం చేసాడు. ఆమె భర్త కూడా పిల్లల పక్కన కూర్చొని భోజనం తినబోతున్నవాడల్లా లేచి నిన్న చేసిన సహాయం వల్ల కృతజ్ఞతతో బండి దగ్గరకు వచ్చాడు. 
మళ్ళీ జొన్నరొట్టెల కోసం వచ్చారని “ఎన్ని కావాలి?” అని అడిగింది. “రెండు చాలు” అన్నాడు. హడావుడి గా చేయటం మొదలు పెట్టింది. క్షణంలో చేసి ఇచ్చింది. వాటిని తీసుకొని కైవల్యకు అందజేసాడు.
ఆ జొన్న రొట్టెలకు డబ్బులు ఇచ్చి, “మీ పిల్లలను ఒకసారి చూడవచ్చా?” అని అడిగాడు. భార్యా, భర్తా అటు పిల్లల వైపుకు నడిచాడు. వాళ్ళ వెనుక ఇద్దరూ నడుస్తూ కైవల్య తన బ్యాగు లోనుండి డబ్బులు తీసి శ్రీనికి చేతికి అందజేసింది. 
ఇద్దరూ ఆ పిల్లలను దగ్గరగా చూసి నుదుటి మీద రాసి, శ్రీని తన చేతిలో ఉన్న డబ్బులు ఆ పిల్లల చేతిలో పెట్టాడు. ఇంకా వాళ్ళు తేరుకోకుండానే వీడ్కోలు చెప్పి ఇద్దరూ కారు వైపుకు నడిచారు, ఇంటికి బయలు దేరారు.
ఆశ్చర్యంతో తేరుకున్న ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూస్తూ,ఆమె పిల్లల వైపుకు చూసి కన్నీళ్ళు పెట్టుకుంది. “అదృష్టవంతులం ఆళ్ళ కళ్ళల్లో పడ్డాం.” అన్నాడు అతను.
ఇంటికి చేరగానే కారులోంచి దిగిన కైవల్యను హత్తుకొన్నాడు “చెప్పానా, నీదే నాకంటే జాలి గుండె అని. నాకు రెండు వేలే ఇవ్వాలని బుద్ది పుట్టింది, నువ్వైతే నీ ఒక నెల జీతం మొత్తం ఇచ్చేసావు.” అన్నాడు.
“ఓ నెల జీతం వాళ్ళకి ఓ రెండు సంవత్సరాల కష్టార్జితంతో సమానం. పాపం” అంటూ లోపలికి నడిచింది.
 ***

No comments:

Post a Comment

Pages