సౌందర్య బరి - అచ్చంగా తెలుగు
సౌందర్య బరి. 
ఆదూరి.హైమావతి.

'ఎందుకు నన్నందరూ ఎగతాళిచేస్తారు? నా చర్మం పచ్చగా లేకపోడం నా తప్పా? నేను అందంగా లేకపోడం నా నేరమా? నేను పొడగరిని కాకపోడం నా పొరబాటా? నాకళ్ళూ , ముక్కూ పెద్దవిగా , వికారంగా ఉండటం లో నా ప్రమే య ముందా? ఎందుకు నిద్రలేచింది మొదలు పడుకునే వరకూ ప్రతి ఒక్క రూ నన్ను ఏదో మారుపేరుతో పిలుస్తూ హేళనచేసి ఆనందిస్తూ నన్ను బాధి స్తుంటారు  ?     హేభగవాన్ ఎందుకు నాకింత వికారపు రూపునిచ్చావ్ ? నీకూ నాపై జాలిలేదా ప్రభూ! 'అనుకుంటూ ఎత్తుగా ఉన్న కొండమీద వంటరిగా కూర్చుని క్రింద లోతుగా వేగంగాపారుతున్న నదికేసి చూస్తూ,   వెక్కి వెక్కి ఏడుస్తు న్నది నందిని. 
    ' నల్లపిల్లి అనీ, కాకి రూపు అనీ, కోతిముఖమనీ,ఇంకాఏదేదో   పేర్లతో పిలు స్తూ తనను వెక్కిరించే హక్కు ఎవరిచ్చారు వీరికంతా ! ‘ అని ఇప్పటికి ఎన్ని వందలమార్లు అను కుందో లెక్కేలేదు. ఉన్న ట్లుండి పైకి లేచింది. కొండ చివరికేసి నడిచింది , ఒక్క రెండడుగుల్లో ఆ ఆవేశం లో దూకేసేదే. ఇంతలో ఎవరో  పమిట కొంగు పట్టిలాగినట్లైంది. వెనక్కు చూసింది. ఒక కుక్కపిల్ల తన పమిట కొంగుపట్టి లాగుతూ ఉంది. వెనక్కు నడిచి దాని వద్దకెళ్ళింది. అది పమిటకొంగు లాగుతూనే ఉంది వదలకుండా. ఏమై ఉంటుందాని దానివెంట నడవసాగింది ఆమె. 
       కొండక్రింద నదీప్రవాహపు వాలులో ఒక గుహ ఉంది. కుక్కపిల్ల ఆగుహకేసి నడిచింది.లోపల ఒకయతి ధ్యానముద్రలో ఉన్నాడు.అతడికి ఎదురుగా  ఒక స్త్రీమూర్తి కూర్చునుంది .నందిని నిశ్శబ్దంగా లోనికెళ్ళ గానే కుక్కపిల్ల పమిట కొంగు వదిలేసింది. అక్కడే ఒక చీకటిమూల నందిని కూర్చుంది.
యతి మెల్లిగా కళ్ళుతెరచి ఆస్త్రీమూర్తిని చూశాడు. ఆతర్వాత మెల్లిగా నందిని కేసిచూసి చిరునవ్వునవ్వాడు. తన వెనుక ఎవరో ఉన్నట్లు స్త్రీమూర్తి గుర్తించ నే లేదు. 
ఆమె యతినే ఏకాగ్రంగా చూస్తున్నది. " బిడ్డా! నీ మనస్సు అర్ధమైంది. భగ వంతుడు మానవునికిఅన్నీ ఇచ్చాడు. శరీరం, మనస్సు, మెదడు ఈమూడూ మానవునికి ఉన్నట్లు మరే జంతుజాలాలకూ లేవు. తాను చేయదలచుకు న్నది ఆలోచించి ,విచక్షణతో, నేర్పుగా ,ఓర్పుగా మంచి చేయగలవాడు మానవు డొక్కడే. ఇతర పక్షులు జంతువులతో పోల్చుకుంటే  మానవుడు తానెంత ఘనుడో తెలుస్తుంది.కేవలం ఏదో కొన్ని కారణాలవల్ల, చిన్న ఇబ్బందుల వలనా తానేదో గొప్పకష్టంలో ఉన్నట్లు ఊహించుకుని విరక్తి పొంది, మనస్సును స్వాధీన పరచుకో లేక,చివరకు ప్రాణం తీసుకోను సైతం వెనుకాడ్డం లేదు  మనిషి . ప్రాణంపోయాక చేసేదేముందీ? . భగవంతుడు జీవితాన్నిచ్చింది మధ్యలో చావనా? బలవన్మరణంపొంది దయ్యంగా తిరగనా? అకాలమరణం చెందినవారంతా జీవితకాలం పూర్తయ్యేవరకూ , ఎటూ పోలేక  వారి ఆత్మ అలా తిరూగుతూనే ఉంటుంది.అది మరీ ఘోర నరకం .చివరిశ్వాస వరకూ తన లక్ష్య సాధన కోసం పోరాడి  జీవితాన్ని  ఫలవంతం చేసుకోవాలి, కానీ పిరికివానిలా ప్రాణంతీసుకోడం గొప్ప కాదు. నీకోకధ చెప్తాను .
      ఒకమారు ఒక కాకి మిగతా పిట్టలు తన రంగు గురించీ ఏదో అన్నాయని అది నదిలో దూకి చావా లను కుంది.ఇంతలో అక్కడికి ఒక కోకిల వచ్చింది. ఎంతో ప్రేమగా కాకినిచూసి"కాకమ్మా!  దాహం తీర్చు కోను వచ్చావా? నీకేం అక్కా! చక్కగా నీగుడ్లు నీవు పొదుగుకో గలవు. మానవులు నిన్ను ‘సంస్కృతం లో ’ వాయసం అంటారు.పురాణాలప్రకారం నీవు శనిదేవుని వాహనానివని నీకుపూజలు చేస్తారు మానవులు.  రావణుడికి భయపడి యముడు నీరూపం ధరించినందుకు మీకు ఆయన చాలా వరాలిచ్చాడుటకదా!. మీకే  వ్యాధులూ రాకుండా, చిరాయువులవుతారనీ, మరణించిన వారికి సమర్పించే పిండాల ను మీరు తింటేనే కానీ  నరకలోకంలోని వారికి తృప్తి కలుగదనీ,యముడు ఇచ్చిన వరాలుట కదా! ఒకే కన్నున్నా రెండు వైపుల కూడా చూడగలరు కదా.అందుకే ‘గడుసుపక్షి ‘అనేపేరూ పొందారు. మీరు మానవులకు చేసే మేలు అంతా ఇంతాకాదుగదా! మీకున్న ఐకమత్యం ఎవ్వరికీ లేదు. ఇంత తిండికన పడగానే కావు కావని మీవారినంతాపిల్చి కలసి తినడం మీవద్దే అంతానేర్చుకోవాలిమరి.  మేము బాగాపాడతామని మమ్మల్ని పంజరాల్లో బంధించను చూస్తారు. మాజీవితం చాలా కష్టంగా ఉంటుంది." అంది బాధగా.                      
  ఇంతలో అక్కడికి ఒక పంచవన్నెల రామచిలుకవచ్చింది. నదిలో నీరు త్రాగను .  దాన్నిచూసి కోయిల " చిలుకమ్మా! బావున్నావా? నీకేం పంచవర్ణా లు, అందమైన దానివి.నిన్నందరూ ఇష్టపడతారు. ఎర్రగాఉన్నవాటిని ‘చిలు క ముక్కు’ అంటూ పోల్చుతారు.  మేము పాడినా మాది నలుపు రంగు కదా! మాపాట వింటారుతప్ప మమ్మల్ని నీలా ఎవ్వరూ చూడను ఇష్టపడ రు.”అంది.
దానికి చిలుక" మాకష్టాలు నీకేం తెల్సు?మేం కనిపిస్తేచాలు వలలు విసిరి పట్టుకుని పంజరాల్లో ఉంచి వారికిష్టమైనప్పుడు ఇంత తిండిపడేస్తారు. మేము మానవుల మాటలను అనుసరించి మాట్లాడ్డం వల్ల మమ్మల్ని పెంపు డు  జంతువుగా  పెంచుకోవాలనుకుంటారు.అదేమా స్వేఛ్ఛను  హరిస్తున్నది . పైగా మాకు కాయితాలు ముక్కుతో తీయడం నేర్పి 'చిలుక జ్యోస్యం' అంటూ మానవులు సొమ్ము చేసు కుంటున్నారు   . మాకష్టాలు ఎవ్వరికీ రాకూడదు తల్లీ ! . “ అంది బాధగా  రామచిలుక. 
ఒక నెమలి వచ్చి ఆత్రంగా నీరుత్రాగి "ఈరోజు బతుకుతాననుకో లేదు . నా మీద కన్నేసి పట్టుకోవాలని ఒక వేటగాడు తరిమాడు. మారంగుల ఈకలే మాశత్రువులయ్యాయి. మా అందమే మా కు శత్రువు.  ఈ కాకమ్మలా నల్లగా ఉండి ఉంటే హాయిగా బతికేవాళ్ళం." అంది రొప్పుతూ.   
చిలుకమ్మ అందుకుని"  నీకేమమ్మా!భారత దేశ జాతీయ పక్షివి!. నీ శరీరా కృతీ, నీ నృత్యం ఎంత    అందంగా ఉంటాయి . పరమేశ్వరుని కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి వాహనానివి .శ్రీకృష్ణుడు నీ ఈకనే తల మీద అలంకారంగా ధరిస్తాడు.నీకెంత గౌరవం!?”  అంది. 
"గౌరవం మాటేమోకానీ మాప్రాణాలకెప్పుడూ ముప్పే , నిర్భయంగా నిద్రపో యే భాగ్యంకూడా మాకు లేదు.  కాకమ్మా , కోకిలమ్మల్లా నల్లగా ఉండి ఉంటే బాగుండేది."అంది అలసటగా.         
    ఇంతలో ఒక కోడిపుంజు వచ్చి, గుటగుటా నీరుత్రాగి రోజుతూ " ఎంతన్యా యం! మాకాళ్ళకు కత్తులు కట్టి పందాలు పెట్టి మాచేత మాజాతినే మానవులు చంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఛీ ఎందుకీ రూపాన్నిచ్చావు దేవా? ఈ కాకమ్మ లా పుట్టిస్తే ఎంత బావుండేది!" అంది.  
రెక్కలు రెపరెపలాడిస్తూ పిచ్చుక వచ్చింది. కడుపునిండా నీరుత్రాగి  " మాన వులు వాడుకునే మొబైల్ ఫోన్లకోసం విచక్షణారహితంగా కట్టే  సెల్యూలర్ టవర్ల నుంచి వచ్చే అయస్కాంత తరంగాలు మా జాతికి ముప్పయ్యాయి. పూర్వం పూరిళ్ళు ఉంటే ఎక్కడో పందిరి కప్పుల్లో గూళ్ళు కట్టుకుని బ్రతికే వారం . ఇప్పుడన్నీ స్లాబులే , పోనీ చెట్లమీదన్నా గూళ్ళు కట్టుకుందామంటే చెట్లే కరువై పోతున్నాయ్.పూర్వం రైతులు మాకు ఆహారం కోసం వరికంకు లను కట్టగాకట్టి ఇంటి చూరుకు వేలాడ దీసేవారు. అవితింటూ వారిఇళ్ళలో హాయిగా బతికేవారం. మాజాతి అంతరించిపోతున్నది."అంటూ కన్నీరు కార్చసాగింది.  
    "నిజమే సుమా! 'పిచ్చుకపై బ్రహ్మాస్త్రం' అనేసామెత నిజం.విచారించకు , మనందరి కష్టాలకూ కారణం మనలోని అందం లేక మనలోని ఏదో ఒక ప్రత్యే కత.అదిలేకపోతే మనం హాయిగా జీవించే వాళ్ళం.  ఏంచేస్తాం" అంటూ ఓదార్చింది కోడిపుంజు.
ఇలా ఆరంగు రంగుల పక్షులన్నీ మాట్లాడుకోడం విన్న కాకమ్మ తనఅంద వికారమే తనప్రాణాలను కాపాడుతున్నదని అర్ధమైంది.అంతేకాక, ‘అన్ని పక్షులనూ చంపి తింటారుకానీ తమజాతి మాంసం మాత్రం జనం సాధార ణం గా తినరు. దానివల్ల మేం నిర్భయంగా మనుషులమధ్య బ్రతగ్గలుగు తున్నాం.’  అనుకుని , భగవంతునికి కృతఙ్ఞతలు చెప్పుకుని వెళ్ళిపోయింది.
  చూశావా!  పూర్వం నీఅందానికి నీవు గర్వించే దానివి.అంతా నీకేసి చూస్తు న్నారనీ,అందాల పోటీలో జాతీయస్థాయి బహుమతులు వచ్చాయనీ విర్రవీ గావు. ఎంతోమంది నీ అందానికి ఆకర్షితులై నీ వెంట పడి ,నీవు వివాహానికి అంగీకరించనందున నిన్నిలా యాసిడ్ పోసి వికారస్వరూపాన్నిచ్చారు . నీవు అప్పుడు తెల్సుకున్నావు జీవితమంటే ఏంటో! ఇక నీవు స్కూళ్ళకూ , కళాశా ల లకూ వెళ్లి మానవతా విలువలను గూర్చీ , ఇతరులపట్ల ప్రవర్తించాల్సిన విధానాన్నీ చెప్పి, యువతలో మార్పు తేవాలని నీ వనుకున్న నీ జీవిత లక్ష్యా న్ని సాధించు , అంతేకానీ ఎవరికో భయపడుతూ ఇలా ముసుగేసుకుని తిర గక్కర్లేదు .వారెవరో చేసిన ఘోరానికి ఫలితం ఎలా ఉందో అందరినీ చూడ నీ.అంతేకానీ నిన్నుచూసి ఎవరో ఏదో అనుకుంటారనీ,  పిరికితనంతో ఆత్మ హత్య చేసుకోవాలనుకోడం తెలివితక్కువ తనం.ధైర్యగా ఎవ్వరి మాటలూ లెక్క చేయక ముందుకుసాగి పది మందికీ ఉపయోగించే ఏదైనా పనిచేసి  ఆదర్శంగా జీవించడాన్నే భగవంతుడు మెచ్చుకుంటాడు. ఎవరు ఏమన్నా అది మనస్సుకు పట్టించు కోకపోడం నేర్చుకుంటే శాంతిగా జీవించగలవు. నీవు అనేది నీ శరీరం కాదు.నాశరీరం ,నాచొక్క,నాఇల్లు,నా జీవితం అంటాం , అంటే నీవు వేరు,అవన్నీ వేరేకదా,!ఎవరైనా అనేది శరీరాన్ని కానీ 'నిన్ను' కాదు. కనుక నిదానంగా ఆ ‘నీవు’ అనేదాన్ని గురించీ తెల్సుకో, శరీరాన్ని గురించీ వదిలేయ్. అందమే శతృవు – అనా కారితనమే మిత్రుడు  అని తెల్సుకో !పోయిరా బిడ్దా ! నేనూ హిమాలయాలకు బయల్దేరు తున్నాను." అంటూ ఆ యతి ఆమెను చేయెత్తి దీవించాడు.  
ఆమె బయటికివచ్చింది. నందిని గబుక్కున పక్కకు తప్పుకుంది. మూల నుంచీ ఆమె కొంగుతో ముఖం కప్పుకుంటుండగా ఆమె ముఖం కేసి చూసిం ది. సగం కనిపించే ఒకేకన్ను, అదీ గాజుగోలిలా ఉంది. ముఖమంతా మాడి పోయిన అప్పడంలా ఉంది. పళ్ళు బయ టికి కనిపిస్తూ ,మూతి వికారంగా ఉంది. ఆమెనుచూసి నందిని ఒళ్ళు జలదరించింది. తన శరీరకృతి ఎంతో బావున్నట్లు అనిపించింది . భగవాన్ నాకు అందన్నివ్వకపోయినా ఇలాంటి వికార స్వరూపాని ఇవ్వనందుకు నీకు ధన్యవాదాలు ప్రభూ! " అని మనస్సు లోనే నమస్కరించుకుంది.
ఆకుక్కను పరీక్షగా చూ సింది , ఒక వారం క్రితం తాను భుజించేప్పుడు తన కేసి చూస్తున్న ఒకకుక్కకు కాసిని మెతుకులు  కాయితమ్మీద పెట్టగా ,అది తిని తోక ఆడించుకుంటూ వెళ్ళింది. కుక్కనల్ల గాఉంది, దాని తోక మాత్రం తెల్లగా ఉంది.అదే ఈ కుక్క .కేవలం ఒక ముద్ద అన్నం పెట్టినందుకే అది ఈరోజు తన ప్రాణంకాచింది. మరి ఈజీవితాన్నిచ్చిన భగవంతునికి నేనేం చేసి ఋణంతీర్చుకోగలను " అనుకుంది నందిని, ఆ కుక్క ఆ స్త్రీమూర్తి వెనకాలే వెళ్ళింది.    
   హాస్టల్ కెళ్ళేసరికి "ఏయ్ ! నందినీ ఎక్కడికెళ్ళావ్? నీకు ఇంటర్లో స్టేట్ ఫస్టొచ్చింది, నీకోసం పత్రికల వారూ ,టీ.వీ ఛానెల్ వారూ వచ్చారు.నీ వైద్య విద్యకు స్కాలర్ షిప్ స్పాన్సర్ చేయను ఒక సంస్థవారు వచ్చారు. రాగానే చెప్పమని వార్డెన్ మేడంకు నెంబరిచ్చిపోయారు. త్వరగారా!" అంటూ స్నేహితులు పిలవడం నందినిని ఆనందంలో ముంచెత్తాయి.' భగవాన్ ! నన్ను నా తెలివితక్కువ పనినుండీ కాపాడి , నేను కోరుకున్న వైద్య విద్య చదివి,  ఆస్త్రీ మూర్తి లాంటి వారికి తిరిగి శరీరాకృతి చక్కగా వచ్చేలా చేయ గల విధానాలను తెల్సుకుని ,మానవసేవ చేస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను."  అని నమస్కరించుకుని ముందుకు కదిలింది నందిని .    
 ****** 

2 comments:

  1. మంచి సామాజిక స్పృహ కలిగించే చక్కటి కథను అందించారు హైమావతి గారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. శర్వాణిMarch 24, 2019 at 4:13 PM

    చాలా బావుంది

    ReplyDelete

Pages