||పిలుపు||
 శ్రీపతి వాసుదేవమూర్తి


అహాన్ని బూడిద చేస్తే మనశ్శాంతి
ఆయుధాలని బూడిద చేస్తే విశ్వశాంతి
రా..!

మన రక్తంతో తడిసి అరుణ వర్ణంలోకి మారిన
 మంచు కొండలలో ఆకాశాన్నంటే మంటలని సృష్టిద్దాం
ఆ మంటలలో మన ఆయుధాలని సమాధి చేద్దాం
మిగిలిన బూడిదని చెరిసగం పంచుకుందాం

నేను శివుడి పేరున ఆ విభూతి ధరిస్తాను
నువ్వు అల్లా పేరున ధరించు
మిగిలినది మంచు పైనుండి
ప్రవహిస్తున్న చల్లని గాలిలోకి ఎగరేద్దాం
చుశావా..!

మన మధ్యన పగ ఎంత తేలిక పడిపోయిందో
గాలిలో కలిసి అదృశ్యమైపోయింది
అనవసరంగా దాన్ని తుపాకులుగా
మార్చి మన భుజాలపై మోశాం

రా...!
కలిసి రక్తపు వాసన లేని
స్వఛమైన తెమ్మెరలని ఆస్వాదిద్దాం
శాంతిని మన సరిహద్దుకి బహిమతిగా ఇద్దాం.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top