డా.మాడుగుల బృహత్ శతావధానం - అచ్చంగా తెలుగు

డా.మాడుగుల బృహత్ శతావధానం

Share This

డా.మాడుగుల బృహత్ శతావధానం
మల్లాది వేంకట గోపాలకృష్ణమూర్తి 



అవధానం. జ్ఞాపక శక్తికి ప్రతీకయైన బృహద్ ప్రక్రియ. ఆ అవధానాన్ని ఆశగా, శ్వాశగా ధారణ చేసిన మహా తపస్వి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ. అకుంటిత దీక్షాదక్షతలతో కేవలం అవధానిగానేగాక తానే పరిపూర్ణమైన అవధానంగా అవతరించిన సాక్షాత్ సరస్వతీ పుత్రులు ఆయన. అల్జీమర్స్ లాంటి మతిమరుపుకు సంబంధించిన విషయాలపై అధ్యయనం చేయదలచిన విశ్వ విఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలను ధారణ శక్తికి, జ్ఞాపక శక్తికి ప్రతీకయైన అవధాన ప్రక్రియపై అధ్యయనం చేయడానికి పురిగొల్పిన మేథాశక్తి ఆయనది. దేశ విదేశాల్లో జ్ఞాపక శక్తికి ప్రతీకయైన అవధాన ప్రక్రియకు పర్యాయపదంగా నిలచిన ఆ మహనీయ మూర్తి బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ. మరో వినూత్నమైన, దివ్యమైన, అవధాన పరంపరలో భాగమైన శతావధానానికి ఆ మహనీయమూర్తి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ హైటెక్స్ లోని అవధాన సరస్వతీ పీఠంలో జరగబోతున్న, ప్రపంచవ్యాప్తంగా భాషాభిమానులు, అవధానాన్ని అభిమానించేవారు, పాండితీ ప్రకర్షకు దాసోహమనేవారు అత్యంత భక్తది శ్రద్ధలతో, ఆసక్తితో తిలకించే మహోత్తరమైన ఈ సువర్ణం అంకానికి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదిక కాబోతోంది. అనితర సాధ్యమైన పాండితీ ప్రకర్షతో మరొక్కమారు భాగ్యనగరం పునీతం కాబోతోంది. బృహత్ ద్విసహస్ర అవధాని, అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ డా.మాడుగుల నాగఫణిశర్మ ఆధ్వర్యంలో ఈనెల ఎనిమిదవ తేదీనుంచి పదమూడవ తేదీవరకు హైదరాబాద్ హైటెక్స్ లోని అవధాన సరస్వతీ పీఠంలో విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షిస్తూ ఆథర్వశీర్ష గణపతి, మహావిద్యా, చండీ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. ఈ సందర్భంగా "అవధాన పరంపర"లో భాగంగా ఈనెల తొమ్మిదవ తేదీనుండి పదవ తేదీవరకూ రెండు రోజులపాటు బ్రహ్మశ్రీ డా.మాడుగుల నాగఫణి శర్మచే ఇదే వేదికమీద సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానం జరగబోతోంది. 126మంది సంస్కతాంధ్ర విద్వన్మణులతో ఈ శతావధానాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 9వ తేదీన ఉ.9గం.ల నుంచి మధ్యాహ్నం 1గం.వరకు ప్రారంభ సభ జరుగుతుంది. సా. 3గం.ల నుంచి 8 గం.ల వరకు సభా సమయం. ఈ విశిష్ట కార్యక్రమంలో అవధాన సభలో ధార్మిక వరేణ్యులైన కొంతమంది ముఖ్యులకు "సరస్వతీ పురస్కారం" అందజేస్తారు. ఈనెల 10వ తేదీన ఆదివారంనాడు ఉ. 9 గం.ల నుండి మ. 1 గం.వరకు ప్రారంభ సభ, సా. 3గం.నుండి పూరణ ధారణ, సా. 6 గం.లకు విజయోత్సవ సభ జరుగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అవధాన సరస్వతీ పీఠంలో శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠా మహోత్సవం జరగబోతోంది. ఈ తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గం.  నుండి మధ్యాహ్నం 1 గం. వరకు, సాయంత్రం 5 గం. నుండి 8 గం. వరకూ, రాత్రి 7గం. 30ని.ల నుండి  8 గం. 30 ని.ల వరకూ స్వస్తి వాచన మహా మంగళ నీరాజన మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వినియోగము జరుగుతాయి. 

ఈనెల 13వ తేదీన ఉదయం 9గం.లకు మహాపూర్ణాహుతి జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, విశ్రాంత సిబిఐ డైరెక్టర్ జె.డి.లక్ష్మీనారాయణ, విశ్రాంత డిజిపి ఎస్.కె.జయచంద్ర, టిటిడి ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఇ.పెద్దిరెడ్డి, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొ.టి.పాపిరెడ్డి, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొ.నాగేశ్వర్ రావ్, డాక్టర్ బీఆర్ అంబేత్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొ.కె.సీతారామారావు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ చైర్మన్ విద్యాల సంజయ్, డి.బాలశేఖర శర్మ, తెలంగాణ సంస్కృత భారతి ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవ కుమార్, దర్శనం పత్రిక అధినేత మరుమాముల దత్తాత్రేయ శర్మ, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ శర్మ, వార్త సీఎండి గిరిష్ కుమార్ సంఘి, టీవీ5 అధినేత బి.ఆర్.నాయుడు, కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్ ఛాన్స్ లర్ వి.మురళీధర్ శర్మ, వెంకట్ రామ్ రెడ్డి, ఐ.ఎ.ఎస్., హస్తినలో ఖ్యాతిగాంచిన న్యాయవాది రాజీవ్ భృగు కుమార్, జి.పుల్లారెడ్డి, జి.నారాయణమ్మ విద్యా సంస్థల చైర్మన్ పి.సుబ్బారెడ్డి, బిజెపి అధికార ప్రతినిధి రఘరామ్ పురిగల్ల , తెలంగాణ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధినేత ఒంటేరు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం అధినేత ప్రొ.దేవదత్త సరోడే, సి.ఎస్.ఐ.ఆర్ చీఫ్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ కె.వి.ఆర్.ఎస్.మూర్తి ఈ కార్యక్రమానికి సలహామండలి కమిటీ సభ్యులుగా ఉన్నారు. టీవీ5 ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. విశ్వవిఖ్యాతిగాంచిన ఇతర మీడియా ఎన్నో సంస్థలు భారతీయతకు, భారతీయ ప్రజ్ఞకు, ధారణకు, జ్ఞాపకశక్తికి, దీక్షాదక్షతలకు ప్రతీకయైన ఈ బృహత్ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తమవంతు బాధ్యతగా సహకారాన్ని అందిస్తున్నాయి. భాషాభిమానులు, విద్యావేత్తలు, విద్వద్వరేణ్యులు ఈ బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని దీనిని జయప్రదం చేయాలని ప్రత్యేత ఆహ్వానం. 

No comments:

Post a Comment

Pages