శ్రీమద్భగవద్గీత -27 - అచ్చంగా తెలుగు
 ఓం శ్రీ సాయిరాం
శ్రీమద్భగవద్గీత -27
                                                                            రెడ్లం రాజగోపాలరావు 

12 వ అధ్యాయము
భక్తి యోగము

భగవంతుని ప్రేమించుటయే భక్తి, దృశ్యపదార్థములను, బాహ్యబంధాలతో కూడుకున్న విషయాలను గుర్తుచేసుకోవటం బంధన. బాహ్యమైన విషయాలకతీతంగా భగవంతుని ప్రేమించుట అనన్య భక్తి

భగవంతుడు ఐశ్వర్యసంపన్నుడు. తన ఐశ్వర్యాన్నే కాకుండా భగవంతుణ్ణే ప్రేమించువాడు నిజమైన భక్తుడు. తనకు ప్రియమైన వస్తువు కంటే అతీతంగా దైవాన్ని ప్రేమించాలి అప్పుడు ఆ భక్తి నిజమైన యోగంగా మారిపోతుంది. అదియే భక్తియోగము.

శ్రీ కృష్ణపరమాత్మ కుంతీదేవిని వరంకోరుకోమంటే – అరణ్యవాస కాలంలో పడిన కష్టాలు, బాధలు మరలా కలిగించు కృష్ణా అని కోరుకుంది. కారణమేమంటే బాధలు, కష్టాలు కలిగినప్పుడే భగవంతునిపై అనన్య భక్తి కలుగుతుందని ఆమె భావన.

ఈ భక్తియోగం గురించి యెంత చేప్పినా తక్కువే.

అర్జున ఉవాచ –

ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే
యే చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః -      1 వ శ్లోకం

సుగుణోపాసన , నిర్గుణోపాసన చేయువారిలో ఎవరు శ్రేష్ఠులు ?

భగవానుని విశ్వరూపమునుగాని, వేరొకమూర్తినిగాని ఉపాసించువారు లేదా అక్షర పరమాత్మను ధ్యానించువారు, వీరిలో యెవరిసాధన గొప్పది అనే విషయములో శ్రీకృష్ణ పరమాత్మ అనేక పర్యాయములు విసదీకరించియుండెను. ఇపుడు విశ్వరూపమునుజూపి సగుణోపాసనను బలపరిచెను. ఇందు ఏది శ్రేష్టమను సంశయము అర్జునునికి కలిగెను.

శ్రీ భగవానువాచ –

మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్తాముపాసతే
శ్రద్ధయా పరమోపేతాస్తేమేయుక్త తమామతాః -      2 వ శ్లోకం

నాయందు మనస్సును నిలిపి, నిరంతర దైవ చింతనాపరులై, శ్రద్ధతో ఎవరునన్నుపాసించుచున్నారో వరే ఉత్తమ యోగులని నా అభిప్రాయము. సర్వకాల సర్వావస్తలయందు మనస్సును పరమాత్మయందే నిలుపుట, నిరంతరము భగవంతుని చింతనచేయుట, అన్ని కార్యములకంటెను భగవంతునిపై మిక్కిలి శ్రద్ధ, ప్రీతి కలిగియుండుట అను లక్షణములు కలిగియున్నమనుజుడు అతడు సుగుణోపాసకుడా ? నిరిగుణోపాసకుడా ? సన్యాసియా ?, గృహస్థుడా ?,అగ్రకులజుడా ?, అంత్యకులజుడా ?, అనే బేధములేదు. అదియే గీతాచార్యుని విశాలభావము. భక్తి, శ్రద్ధ మరియు ఏకాగ్రత ప్రధానముగాని మార్గము సంప్రదాయముకాదు.

యేత్వక్షరమనిర్దేశ్యమవ్యక్తంపర్యుపాసతే
సర్వత్రగమచిన్త్యంచ కూటస్థమచలంధ్రువమ్ -      3 వ శ్లోకం

సంనియమ్యే నిద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితేరతాః -      4 వ శ్లోకం

ఎవరు ఇంద్రియములను స్వాధీన పరచుకొని, అన్నింటా సమభావము కలిగినవారై, సమస్త ప్రాణికోట్లకు మంచి చేయుటయందు ఆశక్తి గలవారై చలించనిది, ఇంద్రియములకు, గోచరముకానిది, నిత్యమైనది మరియు విశ్వమంతయూ వ్యాపించియున్నదినగు అక్షరబ్రహ్మమును ధ్యానించుచున్నారో వారు నన్ను పొందుచున్నారు.

ఓకే పరమాత్మ సాకారముగాను, నిరాకారముగానుయుండుట వలన సగుణోపాసనగాని, నిర్గుణోపాసనగాని లక్ష్యము ఒకటియే అయి ఉన్నది. సాధకుడు సాధ్యవస్తువగు పరమాత్మను ధ్యానించుచున్నప్పటికినీ, హృదయశుద్ధి లేనిచో, ప్రాణికోట్లయందు దయ, ప్రేమ లేనిచో ఆ ధ్యానము నిరర్థకము. ధ్యానము తన ధ్యేయవస్తువగు పరమాత్మవైపు ప్రయాణం చేస్తున్నప్పుడు పరమాత్మ యొక్క దయవలన ఆయన యొక్క గొప్పసంపద ధ్యానికి వశమగును. అవియే ఇంద్రియ నిగ్రహము, హృదయశుద్ధి మరియు భూతదయ. ఇట్టి సుగుణములు లేని వ్యక్తి ధ్యానముచేయుచున్నప్పటికీ నిరుపయోగము. అట్టివానికి బ్రహ్మానుభూతి దుర్లభము.

యేతు సర్వాణికర్మాణిమయి సన్న్యస్యమత్పరాః
అనన్యేనైవ యోగేనమాం ధ్యాయన్త ఉపాసతే -      6వ శ్లోకం  

తేషామహంసముద్థర్తా మృత్యు సంసారసాగరాత్
భవామినచిరాత్పార్థ మయ్యావేశిత చేతసామ్ -      7 వ శ్లోకం

మొదటి శ్లోకము సాధకుడు అనుసరించవలసిన పద్దతియు , రెండవ శ్రోకమున దానియొక్క అఖండ ఫలితమును భగవానుడు తెలియజేసెను.

అనాదికాలము నుండీ సంసారరూపమగు ఈ ఘోర విపత్తునందు తగుల్కొని “ పునరపిజననం, పునరపిమరణం “అనునట్లు కాలచక్రమున పరిభ్రమించుచు అల్లాడిపోతున్న జీవునకు భగవంతుడు నొక్కి వక్కాణించిన ఈ వాక్యములు సంజీవినివంటివి. ఎంత గొప్ప సముద్రమైనను చిన్న నావచే ఎట్లు దాటబడునో, భక్తియను తెప్పచేత సంసారమను సముద్రమును దాటవచ్చును. జీవుడు తానుచేయవలసిన దానిని చేసినచో, భగవంతుడు తాను గావించవలసిన సముద్థరణమును తాను గావించును. తాను చేస్తున్న సమస్తకర్మలను ఈశ్వరార్పణము గావించవలెను.

“అనన్యేనైవయోగేన” అనన్య యోగము. గీతాచార్యుడు ఒక క్రొత్త యోగాన్ని ఇక్కడ ప్రస్థావించారు. వంట రుచికి ఉప్పు ఎంత అవసరమో, భగవంతుని ఆశీస్సులు పొందుటకు అనన్య భక్తి, అనన్య జ్ఞానము విశేషము. ఏ యోగమైననూ అనన్య చిత్తముతో ఆచరించిన మాత్రమే ఫలవంతమగును. మంత్రజపము చేయునపుడు ఉఛ్ఛారణతో బాటుగా మంత్రార్థమును కూడా నెట్లు భావించవలెనో అట్లే భగవంతుని ఉపాసించునపుడు అతని స్వరూప స్వభావములను బాగుగా చింతనచేయవలెను.

సంసారమును సముద్రముతో పోల్చిచెప్పిరి. సముద్రమువలె భయంకరమై, కామాది దుష్టజంతువులతో కూడియుండుట వలన సాగరముతో పోల్చబడినది. చాలామంది సంసార సుఖములు మహా ఆనందకరములని, అఖిలషనీయములని తెలుపుచుందురు. ఇది అజ్ఞానము. సంసారము యొక్క వాస్తవ స్థితి వారికింకను తెలియలేదని అర్థము. అనగా మరణరూపమైనదని, పుట్టుక, చావులతో కూడినదని భావము. జీవుడు అమరత్వ సిద్ధికై అమృత స్వరూపుడగు పరమాత్మను, సచ్చిదానంద ప్రభువును తప్పక ఆశ్రయించవలసియుండును. మొదటగా మనస్సును భగవంతునియందు లయమొనరించవలయునని శ్రీకృష్ణ పరమాత్మ బోధించుచున్నాడు.

ఇట్లు
సర్వజన శ్రేయోభిలాషి

రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు
***

No comments:

Post a Comment

Pages