ముందస్తు..! మస్తు... మస్తు...!! - అచ్చంగా తెలుగు

ముందస్తు..! మస్తు... మస్తు...!!

Share This
ముందస్తు..! మస్తు... మస్తు...!!
జైదాస్ 

యావండీ... సినిమాకెళ్దామండి...!" గోముగా అడిగింది పీకే రాణి. 'అడల్ట్స్ ఓన్లీ'  సినిమా చూస్తూ ఆదమర్చిన అబ్బాయిలా పెళ్ళాం సంగతి పట్టించుకోకుండా ఫైళ్లతో పడరాని పాట్లు పడుతున్న 'శనీశ్వరరావు' అలియాస్ "సినీశ్వరరావు" భార్య వంక చిరాగ్గా చూసేడు. అప్పటికే థౌజండ్ టైమ్స్ పూర్తి చేసి మళ్లీ "యా..వం..." అనబోతుండగానే సినిమా పిచ్చితో తన పేరును 'సినీశ్వరరావు' గా మార్చుకున్న శనీశ్వరరావు "అబ్బబ్బా..! ఆపవే నీపీకుడు. ఇంకాసేపైతే నా ప్రాణాలుకూడా పీకి  పాతరేసే లాగున్నావ్.. పొద్దుట్నుంచి  ఈ ఫైళ్ల తో  పనిగాక పడిచస్తుంటే క్షణ క్షణానికి మధ్యలో  నీపీకుడేంటే..? ముందస్తు ఎన్నికల్లోగా ఈ పని పూర్తి కాకుంటే నా ఉద్యోగం ఊడటం ఖాయం. ఈ "రైతుబంధు"  అంతు తేలేదాకా సినిమా, గినిమా జాన్తానై.  నువ్వు నన్ను పీకినా,ఏకి గోకినా  లాభం లేదు"  అన్నాడు. కానీ 'పీకే రాణి' అనే ముద్దుపేరుగల "పిసికేటి కమలా రాణి"  యధాశక్తి పీకుడు లంకించుకుంది. "నిన్ననే కొత్త సినిమా రిలీజ్ అయిందండీ. ఏ సినిమా ఐనా 'ముందస్తు' గా చూస్తే కానీ మనకు నిద్ర పట్టేది కాదు కదా! మీరు అవన్నీ మర్చిపోయి 'ముందుస్తు ఎన్నికలు', 'ముందస్తు పథకాలు' అంటూ నా గురించి పట్టించుకోవడం మానేశారాయే.." అంది నిష్టూరంగా. పాత రోజులు గుర్తు చేయడంతో అవుటయిపోయాడు. మొగుడు మనసును కొల్లగొట్టడంలో నేకాదు అవసరమైనప్పుడు తన మాట వినేలా "కూల్" గొట్టడం'లో కూడా మంచి దిట్ట పీకే రాణి. నిజమే మూఢనమ్మకాల ముఖ్యమంత్రి గారు ముహూర్తం చూసుకుని ముందుస్తు శంఖారావం పూరించడం తో శనీశ్వర రావుకు ముందస్తు గానే కష్టాలు  ముంచుకొచ్చేయి. ముందస్తు పుణ్యమాని ఓట్లు రాల్చే పథకాలన్నీ ముందస్తుగా ముందుకొచ్చాయి. ఓట్లురాల్చే 'రైతుబంధువుల' గురించి సర్వే చేసి  అసలు సిసలైన లిస్టు తయారు చేయడం, అదీ ముందుస్తు ముహూర్తానికల్లా  ముగించడం శనీశ్వర రావు మీద పడింది. అందుకే ఆఫీసులోఏనాడూ 'రెగ్యులర్' గా ఫైళ్లు చూసిన పాపాన పోని శనీశ్వర రావు ఇప్పుడు   'ఇర్రెగ్యులర్' గా ఇంట్లోకూడాఫైళ్ళు చూస్తున్నాడు. ఇక తప్పదన్నట్టు ఫైళ్ళన్నీ పక్కకు తోసి పైకి లేచాడు ." ఇంతకు సినిమా పేరేమిటన్నావ్?" అడిగేడు. తన పీకుడు  ఫలించినందుకు పొంగిపోయిన పీకే రాణి  "వాడే..." నండి' అంది ఆనందంగా. "వాడేవడే మధ్యలో..ఎవడువాడు?" భార్యవంక ఆనుమానంగా చూస్తూ అడిగేడు."అయ్యో..వాడేనండి...." సినీశ్వర్రావుకి ఫుల్లుగా పిచ్చెక్కిపోయింది నేను సినిమా పేరు అడుగుతుంటే మెలికలు తిరిగిపోతూ వాడేనంటావేమే వాడెవడసలు..వాడికినీకు ఏమిటి సంబంధం..?అంటూ వీధంతా పరికించి ఎవరూలేకపోవడంతో ఉగ్రుడై "చెప్పు వాడెక్కడున్నాడో చెప్పు చెప్పకపోయావో ఈరోజుతోనీకీభూమ్మీద సినిమాలు చెల్లిపోతాయ్" అంటూ గాండ్రించేడు. సడెన్ గా సినీశ్వర్రావులో వచ్చిన మార్పుకి పీకేరాణి గొల్లుమంది. "ఓరినాయనో.. నేనిప్పుడేమిచేతున్ రో దేవుడోయ్.. ఇదేమినడమంత్రం .ఇందుకే పొద్దస్థమానం ఆ ముందస్తు ఫైళ్లు చూడొద్దంది. నేను నిప్పండీ. మీరీమధ్య కనీసం తెలుగు సినిమా పేర్లను కూడా ఐడేంటిఫై చేయలేకపోతున్నారు.మీమీదొట్టండి నేను చెప్పింది సినిమా పేరండి."సినీశ్వర్రావు తన తొందరపాటు కు నాలుక్కరచుకున్నాడు.మరి "అసలు విషయం చెప్పకుండా నా ప్రాణం పీకేసావుగదే..!అయినాఅదేంసినిమాపేరోయ్..అడిగేడు సర్దుకుంటూ." పూర్తిటైటిల్ 'వాడే..!నాబేట.. నాతీట..!ఇందులో 'వాడే..!'అనేది సినిమాపేరు.""మరి నాబేట నాతీట ఏంటి గజ్జి తామరలాగా.."అడిగేడు క్యూరియాసిటీతో..ఇన్నేసి సినిమాలు సీరియళ్లు చూస్తున్నారు ఆమాత్రం తెలీదుటండి.మనం 'పిపియ్యార్' అని ముద్దుగాపిలుచుకునే మన'ఫేవరేట్ పిచ్చిపుల్లారావ్' గారబ్బాయే అందులో హీరోనండి.బహుశా తన వారసత్వాన్ని గుర్తు చేయడానికే కాబోలు టైటిల్ 'వాడే...' అనిపెట్టి వాడెవడోకాదు. నాకొడుకే వేషాల్లేకపోయినా నటించాలనే నా 'తీట'ను నా 'బేటా' ద్వారా తిర్చుకుంటున్నాననే అర్ధమొచ్చేలా అలా కింద 'వెరైటీ క్యాప్షన్' పెట్టారు."ఆహాహా...! ఓహోహో..!! ఏం పీకుడు..!ఏం దూకుడు..! నీ విశ్లేషణ అమోఘం.అద్భుతం.నాకు తెలీకుండా 'సినీ సారస్వతసొరంగాల్లో'కి ఇంతింతలోతులకెప్పుడెళ్లి 'పీకి పాకం పిసికి' వంట బట్టించుకున్నావోయ్..! తెలుగు సినిమా టైటిల్స్ మీద క్రిటిక్స్ రాయకూడదటోయ్. నీవల్లనన్నా  ఆంధ్రులకు అర్ధంగాక జుట్టుపీక్కునే బాధ తప్పుతుంది". అన్నాడు ఆలిని 'అడ్మిరింగ్' గా చూస్తూ.
*             *            *
'సినీపిచ్చేశ్వర్రావు అండ్ ఫ్యామిలీ' వెళ్ళేసరికి హాలువద్ద జనం కిటకిట లాడుతున్నారు.తన ఫేవరేట్ హీరో అభిమానజనాన్ని చూసి వీరాభిమానంతో ఛాతిపొంగిన సినీశ్వర్రావు 'వీరాభిమాన్యుడి'లా  టికెట్ల క్యూలో దూరేడు. అభిమానుల తాకిడి ఎక్కువై పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాటకు దారి తీసింది. 'అసలే బక్కప్రాణం ఆపై ఒ ళ్లేరుగనిఅభిమానం' తో ఉన్నాడేమో బ్యాలెన్స్ తప్పి హాల్లో వుండాల్సినవాడల్లా హాస్పిటల్లో తేలేడు.
*      *         *
మూడు రోజుల తర్వాత ముక్కతూ మూలుగుతూ కాస్త స్పృహలోకి వచ్చాడోలేదో 'మూలిగే తెలుగు నిర్మాత మీద డబ్బింగ్ సినిమాడబ్బాలొచ్చి పడ్డట్టు' "యావండి..పొద్దుట్నుండి మనమ్మాయి కన్పించట్లేదండి."అంటూ ఏడుపు లంకించుకుంది పీకే రాణి.సినీశ్వ ర్రావు భార్యను సముదాయించబోయే లోపే పాలిపోయినముఖం, ఏడ్చి ఉబ్బినకళ్ళతో పిచ్చి దానిలా ఎంటరైన  కూతుర్ని చూసి స్టన్నయి పోయేరు.సినీ బుర్రలు రెండూ పాదరసంలా పనిచేయడం ప్రారంభించేయి.  'కాపాడయ్యో సామి..! పడ్డాడయ్యో డాడీ...!' అంటూ  హై 'పిచ్' లో ఆడిపాడి ఏ గుడిలోనో మొక్కుకొచ్చిందని, అందువల్లే సినీశ్వర్రావుఇంత తొందరగా కొలుకున్నాడని కూడా నిర్ణయించేశారు.కానీ తీరా ఆమె చెప్పిన సంగతి విన్నాక ఇద్దరికి దిమ్మతిరిగిపోయి బావురుమన్నారు.ఆరోజు ప్రేమికుల రోజట. ప్రేమికులుతమకు ఫోన్ చేస్తే ప్రఖ్యాత హీరో 'నరనారాయణ' ద్వారా రాయబారం నడిపి ఆజంట ప్రేమనుఫలింప చేసేందుకు ఉడతా భక్తిగా తమవంతు సహాయం చేస్తామని అదేదో టివి ఛానెల్ వాళ్ళు ప్రకటనిచ్చారట. తానెప్పటినుంచో పిపియ్యార్ గారబ్బాయి 'జూనియర్ పిపియ్యార్' ను గాఢఅతిగాఢంగా ప్రేమిస్తున్నదట. తన ప్రేమసఫలత కోసమే ఇంటికెళ్లి ప్రోగ్రామ్ ప్రసారమైనతసేపూ ఫోన్లు చేసినా 'జూనియర్ పిపియ్యార్'  ఒప్పుకోలేదట.తనప్రేమ ఫలించేవరకు 'ఒక్కసినిమాకూడా చూడన'ని ఒట్టుపెట్టుకొందట.సినీశ్వర్రావు తన సంసారానికేదో 'సినీ శని' దాపురించిందనుకున్నాడు."ఎంతపని చేశావయ్యా శనీశ్వరస్వామి. ఏ 'డబ్బింగ్ డైలీ సీరియల్ డైరెక్టర్' కూడా తన హీరోయిన్ కి ఇన్ని కష్టాలు కల్పించలేదుకదయ్యా. నీపేరుపెట్టుకున్నభక్తుడికే ఇన్నికష్టాలా..! లేకపోతే పట్టుమని పదేళ్ళుకూడా లేని  నా కూతురు మరీ ఇంత 'ముందస్తు'గా ప్రేమించడమేమిటి? అదీ ఏకంగా సిన్మాహీరోనే ప్రేమించడమేమిటి?ఈ సినిమాల శని నుండి ఈ టీవీ 'టెక్కుల రియాలిటీ' కష్టాలనుండి నా కుటుంబాన్ని కాపాడు స్వామి. మరో జన్మంటూ ఉంటే ఏ డైరెక్టరుగానో,ప్రొడ్యూసర్ గానో పుట్టి  'డబ్బింగు చేయకుండా కక్షలు కార్పణ్యాలు  లేకుండా డైరక్ట్ డైనమిక్ డైలీ సీరియల్ కోటి ఎపిసోడ్లు' తీసి నీ రుణం తీర్చుకుంటాను స్వామి. "అంటూ ఆక్రోశించేడు.ఇంతలో అపరశనీశ్వరుడిలా అక్కడ ప్రత్యక్షమయ్యేడు సినీశ్వర్రావు పనిచేసే ఆఫీసు అటెండరు. వాడ్ని చూడగానే సిన్మాలో సీన్ మారినట్టు సినీశ్వర్రావు ఫేసులో రంగులు మారాయి.తాను చావు బతుకుల్లోఉన్నా తన కొలీగ్స్ ఒక్కరూ వచ్చి పరామర్శించలేదు.కనీసం అటెండర్  కన్నా కాస్తో కూస్తో అభిమానమున్నందుకు సంతోషపడ్డాడు.కానీ వాడు వచ్చిరాగానే  "పెద్దయ్యగారు మీకు ముందస్తుగా ఈ మెమో ఇవ్వమని పంపారండి."అంటూ ఓ బాంబు పేల్చాడు.   'రైతుబంధు' ను   అక్రమంగా భార్య పేరుతో భూమి లేకపోయినా యాభై ఎకరాలున్నట్లు తప్పుడు సమాచారమిచ్చి రాబందువులా అక్రమంగా దోచుకోజూచినట్లు మాదృష్టికొచ్చింది.  పైగా 'ముందస్తు ఎన్నికలు ముంచు కొచ్చే సమయం'లో ముందస్తు ఫైళ్లు పూర్తిచేయకుండా సిన్మాకెళ్లి మక్కెలిరగ్గొట్టుకుని ఆఫీసుకు ఎగనామం పెట్టినందుకుగాను తమరిని ఎందుకు సస్పెండ్ చేయరాదో ముందస్తుగా తెలపాలంటూ' జారీ చేసిన మెమో అది."నిన్న సి.యం గారు ముందస్తు సమీక్షలు చేస్తూ మీరు సగం రాసిన లిస్టు చూసి మీరు సిన్మాకెళ్ళిన వైనం తెలిసి స్పాట్లోనే 'సస్పెన్షన్' అర్ధరిచ్ఛారండి".అని చెప్పి "ఇకవస్తానండి. ముందస్తుగా ఇంటికెళ్లకపోతే మాఅవిడ ముసుగుతన్ని పడుకుంటుంది.అసలే చలికాలంకదా!"అంటూ ఇక తన డ్యూటీ అయిపోయిందన్నట్టుగా 'డింగున' మాయమయ్యేడు.  ఫ్లాష్ బ్యాక్ లో కెళ్లిన సినీశ్వర్రావు కి జరిగిందంతా 'సినిమా స్కోప్' లో 'సెవెంటి ఎమ్మెమ్ స్క్రీన్' మీద కనబడింది.ఆరోజు ఫైళ్లు చూస్తుండగా భార్య బాగా డిస్టర్బ్ చేయడంతో లిస్టులో ఉన్న 'సి.కె.రాణి' అనే పేరును సినిమాకోసం పీడిస్తున్న భార్య ధ్యాసలోపడి పొరపాటున 'పి.కె.రాణి' అని రాసేశాడు. ఇప్పుడదే తన పీకకు చుట్టుకుందని గ్రహించిన సినీశ్వర్రావు "నా కొంపముంచావుగదే సి.కే.రాణీ. నాకున్నఈ పీకుడు చాలదన్నట్టు నువ్వూ దాపురించావా నా ప్రాణానికి"అంటూ గొణుక్కుంటూ జుట్టు పీక్కోసాగేడు. పీకే రాణికి ఏమీ అర్ధంగాక"ఏమైందండీ మీలో మీరే గొణుక్కుంటున్నారు 'చీకే రాణి' ఎవరు? అది నీ కొంప ముంచడమేమిటి? అసలా కాగితం లో ఏం రాసుంది?కొంప దీసి మీరుకూడా చీకేరాణి తో 'లవ్' లో పడలేదుకదా?ఈ రోజు 'లవర్సడే' కదా! నాకు 'డైవోర్సి'చ్చి ఎటన్నా లేచిపోదాం రమ్మని రాసిపంపిందా  ఏంటి?"అంది అనుమానంగా ఆరా తీస్తూ. "ఛీకే రాణి'లేదు,'గోకే రాణి' లేదు నువ్వు నోరుముయ్యవే 'పీకేరాణి', నీ పీకుళ్ళే నా కొంపముంచుతున్నాయి. దీన్లోవుండేది లేచిపోదాం రమ్మనికాదు.పనిలోంచి  పీకేశాం పొమ్మని"అంటూ అసలు విషయం చెప్పాడు.
*           *          *
      'యురేకా..'అంటూ పీకేరాణి పెట్టిన గావుకేకకు మళ్ళీ ఏం కొంపమీదకోచ్చిందోననిఅదిరిపడి నిద్రలేచాడు సినీశ్వర్రావు."ఏవండేవండీ! ఈ వార్త చూడండి.సిన్మాటికెట్లకోసం జరిగిన తొక్కిసలాటలో మీరు గాయపడిన సంగతి తెలిసి మీ అభిమానానికి చలించిపోయి మీకు ఐదు లక్షలు కాలో కన్నో పోగొట్టుకున్నవారికి పదిలక్షలు విరాళంగా ప్రకటించారండి పిపియ్యార్ గారబ్బాయి.ఎంతగొప్పమనసో.."అంటూ పేపర్ చూపింది.సినీశ్వర్రావు తన కళ్ల ను తానే నమ్మలేకపోయాడు.బోడి ఉద్యోగం పొతే పోయింది లెండి. మీరెన్ని ఉద్యోగాలు చేసినా ఒక్కరోజులో ఐదులక్షలు సంపాయించగలరా?అసలు నన్నడిగితే ఆ మాయదారి కాలో కన్నో పోయున్నా బాగుండేదంటాను. ఏదోఒకటి పోతేనేం ఏకంగా పదిలక్షలు వచ్చుండేవి  . ఇంటిల్లపాది జీవితాంతం ఎంచక్కా సినిమాలు చూస్తూ హాయిగా బ్రతికేయవచ్చు."అంది. పదిలక్షలు రాలేదనే బాధతో.ఆ మర్నాడే పత్రికలు టివి చానల్స్ కవర్ చేస్తుండగా  'వాడే..' సినిమాహీరో చేతులమీదుగా సినీశ్వర్రావు కు ఐదులక్షల చెక్కు పంపిణీ జరిగిపోయింది.హాస్పిటల్ నుండి డిశ్చార్జి కాగానే ఆ సన్నివేశం తాలూకు ఫోటో ను వాల్ పోస్టర్ సైజు లో చేయించి వరండాలో పెట్టించాడు.ఆనక లంచ మిచ్చి సస్పెన్షన్ రద్దు చేయించుకున్నాడు. ఓ మాంచి రోజు చూసుకుని రాహుకాలం యమగండాలన్నీ దాటాక ఆఫీసుకు బయలుదేరాడు.అతడలా వాకిట్లోకెళ్లాడాలేదో "సినీశ్వర్రావు గారిల్లు ఇదే నాండి?" అంటూ  ఎదురొచ్చారో ముగ్గురు పార్టీ కార్యకర్తలు. "అవును..ఏం..." అనేలోపే "కంగ్రాట్స్ సర్. ఈసారి మీ అమ్మాయికి కూడా ఓటుహక్కు వచ్చింది.  తప్పకుండా మాకే వేయాలి.మా గుర్తు తెలుసుగా 'గోడమీదగండుపిల్లి'"అన్నారు చీటీలు చేతిలో పెడుతూ.అది విని  పీకే రాణి  నిట్టూరుస్తూ,"మీకీమధ్య నామీద బొత్తిగా ప్రేమనేది లేకుండాపోతోందిసుమండి. ఓటేసే వయసు పదేళ్లకు తగ్గించారని నాకు చెప్పనేలేదేం"అంది నిష్ఠూరంగా.సినీశ్వర్రావుమాత్రం  వులుకుపలుకూ లేకుండా కట్టెలా బిగదీసుకుని ఉండిపోయాడు."అ బ్బే.. అదేమిలేదండి.ముందస్తు ఎన్నికలు కదాని మేమే  బాలబాలికల రాజకీయ భవితవ్యాన్ని గురించి 'ముందస్తు దృష్టి'తో ఆలోచించి 'ముందస్తు'గానే ఓటర్ల లిస్ట్ లో చేర్పించాం.మీరేం కంగారు పడకండి సర్. పోలింగ్ రోజు కాస్త ముందస్తుగా మీ అమ్మాయిని తీసుకొస్తేచాలు.మిగతావన్నీ మేం చూసుకుంటాం. అని పక్కింటివైపు కదిలేరు."ఇప్పటికే వళ్ళు గుల్లయి,కొంప కొల్లేరయింది.మళ్ళీ ఈ ముందస్తు ఓటుహక్కొకటా 'బోగస్ ఓటు' పేరుతో సస్పెండ్ చేయడానికి"అని హదలిపోయిన సినీశ్వర్రావు బిపి డౌనై కళ్ళుతిరిగి 'ఢాం.. మ్మ'నిక్రింద పడిపోయాడు. 
*               *            *
   "యావండి... సిన్మాకెల్దామండిగారంగా అడిగింది భార్య.'.ఏం సిన్మానోయ్..!" అడిగాడు 'సిని శ్వర్రావు జూనియర్'. "చీ.. పోరా...!". "రారా..మొగుడా..!" అనేది క్యాప్షన్. చెప్పింది."వావ్..!టైటిలే ఆదరగొట్టేస్తోంది.పద ఈరోజే వెళదాం.." లోపల్నుంచి అంతావింటున్న సినీశ్వర్రావు తన 'సినిమాకి "సీక్వెల్"ప్రారంభం కాబోతోంద'ని అదిరిపడ్డాడు."హే భగవాన్ ఈ ముందస్తు దుష్ప్రభావాలనుండి నా కుటుంబాన్ని,నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని కాపాడే బాధ్యతనీదే." అనుకున్నాడు.ఇంకా పూర్తిగా స్వాధీనంలోకి రాని చేతిని తముడుకుంటూ.

***
          

No comments:

Post a Comment

Pages