జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 15 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 15
చెన్నూరి సుదర్శన్ 


(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.) 

             రంగనాథపురం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పేరు రామనాథం. ‘మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుతుంది’ అన్నట్లు రామనాథం ఆకోవకు చెందినవాడే.. బుద్ధిగా తమ పని తాము సిన్సియర్‍గా చేసుకునే వాళ్ళపై పెత్తనం చెలాయించడం.. ఫణీంద్ర, హిమజ లాంటి గడుసుపిండాల  జోలికి వెళ్ళక పోవడం అతడి నైజం.

            నేను మునిపల్లి జూనియర్ కాలేజీలో పరీక్షల విభాగం నిర్వహించానని తెలుసుకున్నాడనుకుంటాను.. ఒక రోజు అత్యవసర మీటింగ్ పెట్టి నాకు పరీక్షల విభాగం అంటగట్టాడు రామనాథం. నేనూ అభ్యంతరం చెప్పలేదు.కాలేజీ విద్యార్థులతో సాన్నిహిత్యం.. స్టాఫ్ అభిమానం అనుసంధానమే పరీక్షల విభాగం. కాని చాలా మంది లెక్చర్లు ఈ విభాగపు అదనపు  బాధ్యతలు తీసుకోవాలంటే ముందుకురారు. కారణం అదనంగా రాబడి లేకపోవడమే..  బోర్డు నుండి ఎలాంటి  పారితోషికమూ లభించదు. సరికదా పని మాత్రం నిక్కచ్చిగా చేయించు కుంటుంది.
పరీక్షఫీజు కలెక్ట్ చేసి లిస్టు తయారు చేయడం దాని ప్రకారం విద్యార్థులు హాజరయ్యే పరీక్షల వివరాలను నామినల్ రోల్స్ పట్టికలో వ్రాసి బోర్డుకు పంపించడమనే పనులు చాలా ముఖ్యమైనవి. దాని ప్రకారమే హాల్ టిక్కట్స్ పంపిస్తుంది బోర్డు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. తప్పు దొర్లితే ఇంచార్జ్ పై వేటు తప్పదు. అందుకే ఎవరూ ఆసక్తి చూపే వారుకారు.
            కాని కాలేజీని చక్కదిద్దాలంటే ఈ విభాగం ఉపయుక్తంగా ఉంటుందనే మక్కువతో నేను తిరస్కరించలేను.   
కాలేజీకి పరీక్షల విభాగం ఆయువుపట్టని నాకు తెలుసు.. చార్జి తీసుకున్నాను.
            పరీక్షల విభాగంలో అడుగు పెట్టగానే ముందు కాలేజీ గత సంవత్సరం తాలూకు ఫలితాల ఫైల్  తీసి క్షుణ్ణంగా పరిశీలించాను. నా అభిప్రాయాలను పేపరుమీద పెట్టి రామనాథం ముందు పెట్టాను. కాసేపు ఆలోచించాడు.. చివరికి సరే అన్నాడు.
అంత సులువుగా నా అభిప్రాయంతో ఏకీభవిస్తాడని నేననుకోలేదు.
నా విజ్ఞప్తి మేరకు అత్యవసర మీటింగ్ పెట్టాడు.  
            “మై డియర్ స్టాఫ్ మెంబర్స్.. మన కాలేజీ ఫలితాలను మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన సోపానాలను చర్చించు కుందామని ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసాను. ముందుగా మన పరీక్షల విభాగపు ఇంచార్జ్  సూర్యప్రకాష్ తన సూచనలిస్తాడు” అంటూ రామనాథం నా వెన్నుతట్టారు.
            నాకు ఉత్సాహమొచ్చింది.
            “డియర్ ఫ్రెండ్స్.. గుడ్ ఈవినింగ్..” అంటూ ఒక సారి స్టాఫ్‍ను కలియ జూశాను. ఫణీంద్ర, హిమజ గుస,గుస లాడుతున్నారు. ఇంద్రాణి ఆసక్తిగా చూస్తోంది. మిగతా స్టాఫ్ తమకేమీ పట్టనంటూ కూర్చున్నట్లనిపించింది. లోలోన నవ్వుకున్నాను.
            “నా మీద నమ్మకంతో కాలేజీ విభాగపు ఇంచార్జ్ అప్పగించిన  ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. నా నుండి  కొంత మార్పు రావాలనే వారి కాంక్ష. పూర్తి చేయడం నా కర్తవ్యం.. ఆ కోణంలో ఆలోచించి ఒక ముఖ్యమైన సూచన ఇవ్వదలిచాను..   
మన కాలేజీ ఫలితాలను స్టడీ చేసాను. పాఠాలు చెప్పడంలో.. సకాలంలో సిలబస్ పూర్తి చేయడంలో స్టాఫ్ లోపమేమీ లేకున్నా పిలలు పరీక్షల అవగాహన లేక విఫలమౌతున్నట్లు తోస్తోంది...
ఆటలకైనా..పాటలకైనా.. ప్రాక్టీసు అవసరం. ప్రాక్టీసు లేకుండా పాల్గొంటే అనుభవ రాహిత్యం వల్ల పరాభవం తప్పదు.  
మన కాలేజీలో ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రికార్డ్స్ లేవు. మనకు ఫండ్స్ ఉన్నాయి. ప్రిఫైనల్ పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకు కొంత అనుభవం వస్తుంది. వారు చేసిన లోపాలను వివరించి బోర్డు ఫైనల్ పరీక్షలకు సన్నద్ధం చేయాలి.దాంతో మంచి ఫలితాలు వస్తాయని నా అభిప్రాయం” అంటూ కూర్చున్నాను.
            ఫణీంద్ర ఉన్నఫళంగా లేచి “ఇదంతా జరగని పని సార్.. ఎవరు పెట్టుకుంటారు.. ఈ పెంటంత.. అనవసరంగా మన పని పెరుగుతుందే తప్ప ఫలితం శూన్యం. అయినా ఫలితాలు పెరిగాయని మన జీతాలు పెరుగుతయా.. “ పెదవి విరిచి  మాట్లాడాడు.
            “జీతాల కోసం మనం చర్చించడం లేదు సార్.. పిల్లలకు  న్యాయం చేయాలి” ఆవేశంగా అన్నాను.
            “అబ్బో..! పురుషోత్తముడు వచ్చాడండీ.. కాలేజీని ఉద్ధరించడానికి” అంటూ  కోపంగా తన ముందున్న పుస్తకాన్ని బల్లపై విసిరాడు.
            “అంత కోపమైతే ఎలా సార్.. సూర్యప్రకాష్ అభిప్రాయం సరియైందే. మనం ఎలాగూ పాఠాలు చెబ్తున్నాం.. పిల్లలు మన పాఠాలను ఎంత వరకు ఫాలో అవుతున్నారో పరీక్షించడంలో తప్పేముంది” అంటూ ఇంద్రాణి నాకు మద్దతు పలికింది. నాక్కాస్తా ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది.
            మిగతా స్టాఫంతా హర్షం వెలిబుచ్చారు. హిమజ నిశ్శబ్దంగా వింటోంది. ఫణీంద్ర ఏకాకి అయ్యాడు. రామనాథానికి మాట్లాడాలంటే ధైర్యం చాలడం లేదు. గుహలో చిక్కిన నక్కలా బిక్కు, బిక్కు మంటూ చూడసాగాడు.. గుహ ముఖద్వారంలో పులి ఉన్నట్లు.
టేబులుపై ఉన్న రిజిస్టర్లనెత్తి దభాల్న కొట్టి   చిర్రు బుర్రు లాడుతూ వెళ్లి పోయాడు ఫణీంద్ర.
            అతనొక్కని మద్దతు లేకుంటే వచ్చేనష్టమేమీ లేదని.. మెజారిటీ లెక్చరర్లు ఆమోదంతో  ప్రిఫైనల్ పరిక్షలు నిర్వహించాలనే తీర్మానం ఆమోదమైంది. రామనాథం సంతకం పెట్టక తప్పలేదు.
(సశేషం )
***

No comments:

Post a Comment

Pages